Monday, October 11, 2010

ఎన్నికలంటే ఎందుకు అంత బెదురు?

సమాజంలో మౌలికమయిన సామాజిక, ఆర్థిక మార్పులు ఎన్నికల ద్వారా వస్తా యా, పోరాటాల ద్వారా వస్తాయా అనే చర్చలో అర్థముంది. ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రాన్ని విడదీసి రెండు రాష్ట్రాలు చేయడం ఎన్నికల ద్వారా జరుగుతుందా ఉద్యమాల ద్వారానా అన్న ప్రశ్నకు అర్థమే లేదు. ఎందుకంటే, రాజ్యంగ పరిధిలోనే నెరవేరవలసి ఉన్న ఆకాంక్షలు ప్రజా ఉద్యమాల ద్వారానే పరిపూర్తి అవుతాయని చరిత్ర నిరూపిస్తూనే ఉన్నది. ఉద్యమ ప్రస్థానంలో ఎన్నికలు కూడా భాగమయి ఉండవచ్చును కానీ, ఎన్నికలే ఉద్యమంగా ఎన్నడూ ఏ ప్రత్యేక ఉద్యమమూ సాగలేదు.

ఉమ్మడి మద్రా సు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కానీ, సంయుక్త మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయినప్పుడుగానీ, మొత్తంగా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ అంతా కానీ ఉద్యమాల ద్వారానే జరిగింది. తొలి విడత రాష్ట్రాల ఏర్పాటు తరువాత తలెత్తిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. తొలివిడత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రజాఉద్యమంగా మొదలై, రాజకీయ సంస్థ రూపం తీసుకున్నది.

ఉద్యమం జరుగుతూ ఉండగానే ఎన్నికలు వచ్చినందున పోటీచేసి, తెలంగాణ ప్రజాసమితి ఘనవిజయం సాధించింది. ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ- నాయకత్వం ఉద్యమ విరమణ చేసింది. ఎన్నికల వల్ల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరదని చెప్పడానికి 1971 ఉదంతాన్ని పదే పదే ప్రస్తావించడం చూస్తుంటాము. అలాగే,
జార్ఖం డ్ రాష్ట్రం విషయంలో దశాబ్దాల తరబడి ఉద్యమం సాగవలసి వచ్చింది కనుక, ఉద్యమసంస్థ రాజకీయ పార్టీరూపు తీసుకుని అనేక పర్యాయాలు ఎన్నికలలో పాల్గొంటూ వచ్చింది. జాతీయ రాజకీయాలలో వచ్చిన మార్పు, ప్రధాన రాజకీయ పక్షాల భిన్న అవసరాలు తోడయి, చివరకు రాష్ట్రం అవతరించింది. ఎన్నికల రాజకీయాలు, ముఖ్యం గా సంకీర్ణ రాజకీయాలు కొత్త రాష్ట్ర అవతరణకు దోహదం చేశాయి
.
ప్రస్తుత తెలంగాణ ఉద్యమం విషయంలో మాత్రం ఈ ప్రశ్న ఎందుకు వస్తున్నది? ఉద్యమం చేస్తాం, ఎన్నికల వేళ ఎన్నికలలోనూ పాల్గొంటాం అని కొత్తగా అవతరించిన తెలంగాణ ప్రజాఫ్రంట్ ఎందుకు చెప్పలేకపోతున్నది? ఉద్యమమా, ఎన్నికలా అన్న అనవసరమైన, అచారిత్రకమైన ద్వంద్వంలో ఆ ఫ్రంట్ ఎందుకు ఇరుక్కున్నది? అందు కు తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవహార సరళి ఒక ప్రధాన కారణం.

జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అవతరణ జరిగిన తీరును చూసి ఉత్తేజితుడైన కెసిఆర్ సంకీర్ణ రాజకీయాల యుగంలో చిన్న పార్టీలకు ఉండే 'నిర్ణాయక' శక్తి మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్రం సాధించవచ్చునని భావించారు. తీవ్ర ఉద్యమాలకు విముఖత ప్రదర్శిస్తూ, లాబీయింగ్‌ను ఒక ప్రధాన అస్త్రంగా ప్రతిపాదిస్తూ వచ్చారు. క్షేత్రస్థాయిలో ఉద్యమవాతావరణాన్ని కల్పించడానికి వాగాడంబరాన్ని ప్రదర్శించడం మరొక ఎత్తుగడగా ఉండేది. తరచు తమ ప్రాబల్య స్థానాలలో ఎన్నికలు వచ్చే పరిస్థితిని కల్పించడం మరొక చిట్కా. 2009లో ఘోరంగా ఓడిపోయేదాకా టిఆర్ఎస్ ఇటువంటి కార్యక్రమాలతోనే కాలం గడుపుతూ వచ్చింది. వై.ఎస్. ప్రభుత్వంలోనూ, కేంద్రంలో యుపిఎ ప్రభుత్వంలోనూ 2004లో చేరినప్పుడు టిఆర్ఎస్ చెప్పిన కారణం అందరికీ గుర్తుండే ఉంటుం ది. రాష్ట్ర విభజన అనివార్యం, విభజన ప్రక్రియ సందర్భంగా పంపకాలలో తెలంగాణ కు న్యాయం జరగడానికి అధికారంలో భాగస్వామ్యం తీసుకోవడం అవసరం- అన్నది నాటి వాదన.

నక్సలైట్లపై నిర్బంధం మొదలయిందన్న కారణంతో ఏడాదికే రాష్ట్రప్రభుత్వం నుంచి టిఆర్ఎస్ వైదొలగిందనుకోండి. అది వేరే సంగతి. రాజశేఖరరెడ్డి మర ణం తరువాత పరిస్థితుల వల్ల, తన ఉనికిని కాపాడుకోవలసిన అగ త్యం వల్ల 2009 నవంబర్‌లో కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం, తదనంతర పరిణామాలు తెలిసినవే. కెసిఆర్ దీక్ష కు సమాంతరంగా విశ్వవిద్యాలయాల్లో, న్యాయస్థానాల్లో, ఇతర వృత్తి, ఉద్యోగ వర్గాల్లో చెలరేగిన ఉద్యమాలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమా న్ని దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయికి తీసుకువెళ్లా యి. ఉద్యమంలో అధిక భాగం స్వచ్ఛందంగా వివిధ శ్రేణుల వారు చేసినప్పటికీ, టిఆర్ఎస్ ప్రతిష్ఠ, బలం కూడా పెరిగిపోయాయి.

తెలంగాణ ఉద్యమంలో సామాజిక కోణం గురించిన చర్చ ఈ నాటిది కాదు. ప్రత్యేక ఉద్యమం భూస్వాముల కల్పన అని, రాజకీయ నిరుద్యోగుల పని అనీ వ్యతిరేకుల నుంచి విమర్శలు వస్తూ ఉండేవి. ప్రత్యేకవాదాన్ని వ్యతిరేకించే పార్టీలు తమ పార్టీలోని తెలంగాణ బడుగువర్గాల ప్రతినిధుల ద్వారా తెలంగాణవాద నాయకత్వం మీద విమర్శలు చేయించేవారు. అదంతా ఒకప్పటి కథ. ఆ తరువాత, కెసిఆర్ నాయకత్వంలో పార్టీ ఏర్పడి పనిచేయడం మొదలుపెట్టిన తరువాత కూడా- ఆయన తో రకరకాల కారణాలతో విభేదించిన వారు స్వతంత్రంగా పనిచేస్తూనే ఉన్నారు.   కెసిఆర్ వ్యవహారసరళిని, ఆయన సామాజిక నేపథ్యంతో అన్వయించి విమర్శించే సామాజిక వాదులు చాలా మందే ఉన్నారు. తన మీద ఉండే విమర్శలు తెలుసు కాబట్టే, తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమవుతున్న ఒక బలమయిన ఆకాంక్షను గుర్తించారు కాబట్టే- తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడేనని కెసిఆర్ ప్రకటించారు. అది కూడా ఆయన మీద విశ్వాసం కలిగించలేకపోయింది. విమర్శలకు తగ్గ ట్టే, కెసిఆర్‌లో తరచు కనిపించే ఒంటెత్తు పోకడ, పార్టీని అన్ని అంచెలతో నిర్మించకుండా తానే కేంద్రంగా వ్యవహరించడం, పార్టీ టెకెట్ల కేటాయింపులో సైతం ఏకపక్ష నిర్ణయా లు తీసుకోవడం, పార్టీలో కుటుంబసభ్యుల ప్రాబల్యం పెరిగిపోవడం- తెలంగాణ వాద శ్రేణుల్లో అసంతృప్తికి దారితీశాయి. 2010 సంవత్సరం ప్రథమార్థభాగంలో ఉద్యమ తీవ్రత వల్ల ఈ విమర్శల వేడి తగ్గినట్టు అనిపించినా, ఆ తరువాత మళ్లీ పుంజుకున్నాయి. ఇటీవలి కాలం లో గద్దర్‌మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, టీవీ సంభాషణలో లగడపాటితో మాట్లాడిన మాటలు, స్థానికత మీద చేసిన ప్రకటన- మళ్లీ కెసిఆర్‌మీద తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ క్రమం చివరకు గద్దర్ ఆధ్వర్యంలో ఫ్రంట్ ఏర్పాటుకు దారితీసింది.

సామాజిక న్యాయశక్తులు తెలంగాణ ఉద్యమంలో, ఉద్యమపార్టీలో తమ న్యాయమైన భాగస్వామ్యాన్ని కోరుతున్నాయి. ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తామనడం సరిపోదని, పార్టీ యంత్రాంగంలో పాత్ర ఉండాలని, అందరినీ సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని, కేంద్రంతోనో,మరెవరితో నో రహస్య ఒడంబడికలతో వ్యవహరించకూడదని, విభజన జరిగేలోగా వనరులను కాపాడుకోవాలని కోరుతున్నాయి. ఇంకో రెండున్నర నెలల్లో శ్రీకృష్ణకమిటీ గడువు ముగిసిపోతుండగా, అనంతర పరిణామాలకు తెలంగాణ తనను తాను సన్నద్ధం చేసుకునే క్రమంలో భాగంగానే గద్దర్ ఫ్రంట్ ఏర్పడిందనుకోవచ్చు. 

ఉద్యమాలు రాజకీయ రూపం తీసుకోవడం, ప్రధానస్రవంతి రాజకీయాల్లో ఒకప్ప టి ఉద్యమనాయకులు కీలకపాత్ర వహించడం సహజ పరిణామాలే. తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాలలో పనిచేసిన వారు ఇప్పటి రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. ఛాత్రసంఘర్షపరిషత్ ఉద్యమం హిందీరాష్ట్రాలలో ముఖ్యమంత్రులతో సహా ఒక కొత్త రాజకీయతరాన్నే అవతరింపజేసింది.

'ఆసు' రాజకీయపార్టీగా మారి అస్సాంలో అధికారంలోకి వచ్చింది. ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడానికి ఉద్యమించినవారే రాజకీయనేతలు అయినప్పుడు, అవి నెరవేరడం సులువు అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజానాయక త్వం రూపొందే పద్ధతి కూడా అదే. అందువల్లనే దళిత, బహుజన వర్గాలు తెలంగాణ ఉద్యమంలో తాము రాజకీయభాగస్వాములు కావాలని కోరుతున్నాయి. వారు సామాజిక శక్తులుగా, ప్రజాసంఘాలుగా ఉద్యమానికి 'దోహదం' చేయాలని కోరుకోవడం లేదు.  తామే నిర్ణేతలుగా మారే ప్రక్రియలోకి వెళ్లాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ రాజకీయశక్తేనని, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుందని చెప్పిన గద్దర్, ఎన్నికల విష యం వచ్చేసరికి వాయిదా పద్ధతి అనుసరించారు. ఇప్పట్లో ఎన్నికలు లేనందున-అవి అప్రస్తుతం అనుకోవడంలో తప్పులేదు కానీ, ఈఫ్రంట్ ఒక సమైక్య రాజకీయశక్తిగా రూపొందుతుందన్న నమ్మకం ఇవ్వకపోతే, తెలంగాణను సాధించడమే కాదు, సాధించి న తరువాత అధికారంలోకి వచ్చి సామాజిక తెలంగాణను సాధిస్తామన్న భరోసా ఇవ్వకపోతే ఫ్రంట్ చుట్టూ యువనాయకత్వ శ్రేణులు సమీకృతులు కావడం కష్టం.

ప్రజాఫ్రంట్‌లో భాగస్వామ్యశక్తులు మున్ముందు ఈ విషయంలో నాయకత్వంపై మరింత ఒత్తిడి తేవచ్చు. ఒక సందర్భంలో కీలకనిర్ణయం తీసుకోవలసి రావచ్చు. అది తప్పదు. శనివారం ప్రకటించిన ఫ్రంట్ కార్యాచరణ ప్రణాళికను చూస్తే- తెలంగాణ ఉద్యమంలో కొత్తశక్తి అవతరించిందని చెప్పకతప్పదు. అది ఇప్పటిదాకా ఉన్న సాంప్రదాయిక రాజకీయ నాయకత్వానికి అనుబంధంగానే కాదు, దాని ఏకఛత్రాధిపత్యానికి అవరోధంగా మారుతుంది. తెలంగాణ ఉద్యమంలోపలి వారికి, బయటివారికి, ఇతర ప్రాంతాల వారికి కనిపిస్తున్న లోపాలను, బలహీనతలను, కొన్ని అవలక్షణాలను అధిగమించడానికి కూడా ఈ ఫ్రంట్ తోడ్పడుతుంది. ఆ మేరకు ఇది మంచి పరిణామం.

1 comment:

  1. ippude ennikala kosam ante seatla vishayamlo vosthayemo nani anukuntanu

    ReplyDelete