Wednesday, October 27, 2010

మావోయిస్టులకు...అవసరమా?

సుమారు నెలరోజుల కిందట (సెప్టెంబర్28, 2010) టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే ఫలితాన్ని ప్రకటించింది. ప్రసిద్ధ మార్కెటింగ్ రీసెర్చ్ సంస్థ ఐఎమ్ఆర్‌బి ద్వారా చేయించిన ఆ సర్వే రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం గురించిన ఆసక్తికరమైన అంశాలను వెలికి తీసింది. గతంలో నక్సలైట్ల ప్రభావంలో ఉండి ఇప్పుడు సద్దుమణిగి న ఐదు జిల్లాల్లో అభిప్రాయ సేకరణ జరిగింది.  మొత్తం మీద నక్సలిజం మంచిదే అని 58 శాతం మంది అభిప్రాయపడ్డారు. అభివృద్ధి కల్పనలో ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యమే నక్సలిజానికి మూలమని మూడింట రెండువంతుల మంది భావిస్తుండగా, నక్సల్స్‌ను అణచివేసిన తరువాత దోపిడీ పీడనలు పెరిగాయని 48 శాతం మంది దాకా అనుకుంటున్నారట. నక్సలైట్లను రాష్ట్రంలో భౌతికంగా లేకుండా చేసినప్పటికీ, వారి ప్రభావం, వారిపై సానుకూల దృష్టీ ప్రబలంగా ఉన్నాయని ఆ సర్వే నిరూపించింది.

అదే పత్రిక శనివారం (అక్టోబర్23, 2010) నాడు మావోయిస్టుల గురించి మరో ఆసక్తికరమైన వార్తా కథనాన్ని ప్రచురించింది. మావోయిస్టులు రాష్ట్రంలో పునరుజ్జీవం పొందుతున్నారా? అన్న ప్రశ్నా శీర్షికతో సాగిన ఆ కథనంలో పెద్దగా కొత్త విషయాలు ఏమీ లేవు కానీ, ప్రజాగాయకుడు గద్దర్ మావోయిస్టుల ప్రోద్బలం, ఒత్తిడి మేరకే తెలంగాణ ప్రజాఫ్రంట్‌ను స్థాపించారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నట్టు ఆ కథనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఫ్రంట్ స్థాపన ద్వారా మావోయిస్టుల ప్రాబల్యాన్ని తిరిగి సాధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సూచించడానికి ఆ కథనం ప్రయత్నించింది. గద్దర్ రాజకీయ అభిప్రాయాలు, ఆయన అనుబంధాలు కొత్త విషయాలేమీ కావు. మావోయిస్టు అనుకూల రాజకీయాలను వదులుకోకుండానే, చాలా కాలంగా ఆయన తన కార్యాచరణ వేదికను విస్తృతం చేసుకుంటూ వస్తున్నారు.

సాయుధ పోరాట రాజకీయాలతో ఏకీభావమూ సంబంధమూ లేని అనేక సామాజిక ఉద్యమ సంస్థలు, బృం దాలు, వ్యక్తులు గద్దర్‌ను ఒక తరహా రాజకీయాలకే పరిమితమైన వ్యక్తిగాకాక, 'అంద రి' మనిషిగా పరిగణిస్తూ వస్తున్నారు. ఆయన ప్రజాజీవిత వ్యక్తిత్వంలో మార్పు ఉన్నందునే, ఏ రాజకీయ పక్షమూ కూడా ప్రజాఫ్రంట్ స్థాపన వెనుక ఎవరి హస్తమో ఉన్నట్టు బాహాటంగా ఆరోపణలు చేయలేదు. కాకపోతే, ఎన్నికలపై అనుసరించవలసిన
వైఖరి గురించి అంతర్గతంగా జరిగిన చర్చలు, విభేదాలు, చీలిక వేదిక ఏర్పాటు-ఫ్రంట్ భవిష్యత్తు గురించి, అది వేయగల ప్రభావం గురించి సందేహాలకు ఆస్కారం ఇచ్చాయి.

ఇంటెలిజిన్స్ వర్గాలు భావిస్తున్నది నిజమై మావోయిస్టుల ఆదేశం మేరకే గద్దర్ తెలంగాణ రాజకీయాలలోకి దిగి ఉంటే అది ప్రభుత్వానికి, భద్రతా యంత్రాంగానికి వారి వారి కారణాల రీత్యా ఆందోళనకరం అయి ఉండవచ్చు. కానీ, ప్రజాస్వామికంగా ఆలోచిస్తే, ప్రజా సమస్యల మీద ఉద్యమాలు నిర్వహించడానికి ఎవరు ఉపక్రమించినా తప్పు పట్టవలసిన పనిలేదు. సాయుధపోరాట రాజకీయాలలో ఉన్నవారు ప్రజాస్వామిక పోరాటాలలోకి ప్రవేశించి బహిరంగంగా జనం మధ్య పనిచేస్తే వారిని ప్రోత్సహించడమే విజ్ఞత అవుతుంది.

ప్రతి రాజకీయపార్టీ ఏదో రకంగా ప్రజా ఉద్యమాలతో నేరుగానో, ప్రజాసంఘాల ద్వారానో సంబంధం పెట్టుకుంటూనే ఉన్నది. కాబట్టి, మావోయిస్టులు ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో ప్రవేశిస్తే, అందులో జనానికి సాంకేతికమైన అభ్యంతరమేమీ ఉండదు. ఐఎమ్ఆర్‌బి-టైమ్స్ సర్వేలో తేలినట్టు- జనం దృష్టి లో నక్సలైట్లు ప్రజల కోసం పోరాడేవారే తప్ప, వసూలు రాయుళ్లో దొంగలో కాదు.

అయితే, గద్దర్ వెనుకో ముందో ఆయన మనసులోనో మావోయిస్టుల మాటో ప్రభావ మో ఉంటే కనుక- ప్రజలకు రాజకీయ అభ్యంతరం లేకుండా పోలేదు. ఆ అభ్యంతరం చిన్నది కూడా కాదు. తెలంగాణ ఉద్యమం విషయంలో అది ఉద్యమ మనుగడకే సంబంధించింది. తెలంగాణ ఉద్యమంలో మావోయిస్టుల ప్రమేయం ఎంత వరకు ఉండాలి అన్న ప్రశ్నతో అవే సంస్థలో, మరే సంస్థనో ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తే వచ్చే ఫలితాలు బహుశా ఆశ్చర్యకరంగా ఉంటాయి.

ఎందుకంటే, బహిరంగ ప్రజా ఉద్యమాల విషయంలో మావోయిస్టుల గత ఆచరణ ఘనంగా ఏమీ లేదు. తాము అంతిమ ఆదర్శమని విశ్వసించిన లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన కార్యకర్తలను సమీకరించుకోవడానికి వివిధ బహిరంగ ఉద్యమాలను ఉపయోగించుకోవడం తప్ప, ఆయా ఉద్యమాల ఆశయాలను నెరవేర్చడం కానీ, వాటిని విశ్వసించడం కానీ సాయుధపోరాట పార్టీల కార్యక్రమంగా లేదు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి జరిపే ఆచరణే పరమ రాజకీయమని, తక్కినదంతా అల్పమనీ తాత్కాలికమనీ ఎత్తుగడ అనీ ఆ పార్టీలు విశ్వసిస్తాయి. ప్రజాస్వామిక అవకాశాలు వారి దృష్టిలో వెసులుబాట్లే తప్ప, ఆ అవకాశాలను మరింత విస్తరింపజేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచడం వారి మార్గం కాదు. ఏవో సంస్థల ద్వారా ప్రచ్ఛన్నంగా ప్రజాసమీకరణ చేస్తూ వాటిని తమ పత్రికల లో డాక్యుమెంట్లలో ఘనంగా చెప్పుకుంటా రు. రహస్య పార్టీకి బహిరంగ వేదికలకు మధ్య సరిహద్దులను వారే తరచు చెరిపేస్తూ ఉంటా రు. వేదికల మీద మాట్లాడే వక్తలు ప్రజా సమస్యకు సంబంధించిన తక్షణ కార్యాచరణ గురించి కాక, సాయుధ రాజకీయాల గురించి మాట్లాడతారు. ఇవన్నీ గతంలో అనుభవంలోకి వచ్చిన విషయాలే. ఇప్పుడు అవతరించిన ప్రజాఫ్రంట్ అనేక సంఘాల ఉమ్మడి వేదిక అని ఒక పక్కన గద్దర్ చెబుతూనే ఉన్నారు, మరోపక్క ఆ ఫ్రంట్ కార్యక్రమం గురించి ఒక మావోయిస్టు ఖైదీ కోర్టు ఆవరణలో ప్రకటన చేస్తారు, మరోచోట ఒక విప్లవ రచయిత ఫ్రంట్ ఆశయాల గురించి మాట్లాడతారు. అనుమానాలు, ఆరోపణలు వస్తాయంటే రావా, మరి?

ప్రత్యేక తెలంగాణ డిమాండ్ రెండవ సారి పుంజుకోవడానికి మొదట నాటి పీపుల్స్‌వార్ పార్టీ సానుభూతిపరులో ప్రజాసంఘాలో కారణం అయినప్పటికీ, దానిని వారు ఒక విస్తృత ప్రజా ఉద్యమంగా మలచడంలో విఫలమయ్యారు, ఇతర శక్తులకు వేదికను అప్పగించారు. రాష్ట్రంలో ఎన్నో న్యాయమైన సమస్యలమీద, అవసరమైన ఉద్యమాలను నిర్వహిస్తూ ఉండిన అనేక విప్లవ ప్రజాసంఘాలు ప్రభుత్వం అనుసరించిన విచక్షణారహిత దమననీతి వల్ల కొన్ని, స్వయంకృతాపరాధాల వల్ల కొన్ని అణగారిపోయాయి.

రహస్య నిర్మాణంతో సాయుధవిప్లవ పోరాటాన్ని నిర్వహించే శక్తిగా ప్రజలు ఇప్పటికీ ఆ తరహా రాజకీయాలను అభిమానిస్తూ ఉండవచ్చును, అణచివేత నిర్బంధం దోపి డీ బలంగా ఉన్నచోట అజ్ఞాత శక్తులుగా సమతూకాన్ని తెచ్చి రక్షణ కల్పించాలని ఆశి స్తూ ఉండవచ్చును కానీ- ప్రజల దైనందిన జీవన పోరాటాలలో విప్లవశక్తుల ప్రాసంగికత 15-20 సంవత్సరాలుగా తగ్గిపోతూ వస్తున్నది. తెలంగాణ వంటి ఉద్యమాలలో వారి ప్రవేశం కానీ, ప్రమేయం కానీ-అదనంగా చేకూర్చగలిగే మేలు ఏదీ కనిపించదు. ఐదు సంవత్సరాల కిందట రాష్ట్రంలో మావోయిస్టుల నిర్మూలనో, తరిమివేతో ప్రారంభమైనప్పుడు, వారిని అంతగా అభిమానించిన జనమే నిస్సహాయ ప్రేక్షక ప్రాయంగా మిగిలిపోయారు. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి మావోయిస్టుల రాజకీయ మద్దతు, అండ ఉంటే బాగుండునని కోరుకుంటారు కానీ, ప్రధాన స్రవంతి రాజకీయవాదులు హద్దు మీరకుండా ఒక అంకుశంగా పనిచేయాలని ఆశిస్తారు కానీ- వారే నేరు గా ఉద్యమాన్ని నిర్వహించాలని అనుకోరు.

ప్రజాకళాకారుడిగా సుదీర్ఘమైన ఆచరణ, నిబద్ధత కలిగిన గద్దర్- తెలంగాణలోని సామాజిక ఉద్యమశక్తుల ఆకాంక్షలకు, తన రాజకీయ ప్రాధాన్యాలకు నడుమ నలిగిపోతున్నట్టు తెలుస్తూనే ఉన్నది. గద్దర్ వెంట సమీకృతులైన ఉద్యమ సంఘాలు ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం నుంచి కాక, ఇతర సామాజిక ఉద్యమాల నుంచి పుట్టినవి. ప్రభుత్వయంత్రాంగాన్నీ, పాలనను, రాజకీయపక్షాల వైఖరులను ప్రజాస్వామ్యీకరించే కార్యక్రమాలను ఆచరిస్తున్నవి. ప్రజాస్వామ్యం మీద అపారమైన విశ్వాసంతో మాత్రమే ఆ ఉద్యమాలు తమ కార్యాచరణను సాగించగలవు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఉన్న ప్రధాన నాయకత్వం అనుసరిస్తున్న విధానాలలోని లోపాల వల్ల, వివిధ సామాజిక వర్గాలకు ఉద్యమంలోనూ ఉద్యమానంతర పర్యవసానాలలోనూ భాగస్వా మ్యం కావాలన్న బలమైన ఆకాంక్ష వల్ల ఈ శక్తులు ప్రత్యామ్నాయ, సమాంతర ఉద్యమానికి నడుంకట్టాయి. గద్దర్‌వంటి వ్యక్తి దానికి సమర్థమైన నాయకత్వం ఇస్తారని ఆశిస్తున్నాయి. ఎన్నికల రాజకీయాలను అనుసరించాలా లేదా అన్న వివాదం వెనుక- ఈ అంతస్సంఘర్షణ ఉన్నది.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అన్నది చట్టబద్ధమైన ఆకాంక్ష కావడంతో పాటు, దాని సాధ న, దాని ఫలితాలు అన్నీ ప్రజాస్వామ్యీకరణను, అధికార వికేంద్రీకరణను, అవకాశాల సమతూకాన్ని సాధించడం కోసం ఉద్దేశించినవి. అందులో ఎన్నికల బహిష్కరణ రాజకీయాలకు కానీ, మిలిటెంట్ రహస్య విధానాలకు కానీ తావు లేదు. ఆరు దశాబ్దాలుగా నెత్తురోడుతూ ఉన్న తెలంగాణకు కొంత కాలమైనా తనను తాను ముందుకు నడిపించుకునే విరామం కావాలి. సుదూర సువిశాల లక్ష్యసాధన కోసం తనను తాను రణరంగం చేసుకునే ఓపిక ఇప్పుడు తెలంగాణకు లేదు. మావోయిస్టులు అయినా, మరే విప్లవ పార్టీ అయినా కానీ, నైతిక సమర్ధన మాత్రమే ఇచ్చి ప్రేక్షకప్రాయంగా మిగిలితే, తెలంగాణ ఉద్యమానికి మంచిది.

No comments:

Post a Comment