Thursday, October 28, 2010

పేరు మార్చవద్దు

కావలసినవారు కన్నుమూసినప్పుడు, వారి స్మృతిని చిరకాలం భద్రపరచుకోవాలని తాపత్రయపడడం మానవ సహజం. చనిపోయిన పెద్దల పేర్లను పిన్నలకు పెట్టి వారి జ్ఞాపకాన్ని కాపాడుకుంటారు. ప్రజలు తాము అభిమానించే నేతల పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటారు. ప్రజా రంగంలో సేవ చేసిన వారి పేర్లను ప్రజా వ్యవస్థలకు పెట్టుకుంటారు. ఇందులో అభ్యంతర పెట్టవలసింది ఏమీ లేదు. కానీ, అభిమానం విపరీతమైనప్పుడు, స్మరణ భజనగా మారినప్పుడు, వ్యక్తి పూజ తారస్థాయికి చేరినప్పుడు అది వెగటు పుట్టిస్తుంది. అటువంటి వేలంవెర్రి వెనుక అధికార రాజకీయాల ప్రభావం, ప్రమేయం ఉన్నప్పుడు- ఎంతటి మహా నాయకుడి స్మరణ కూడా విముఖతనే కలిగిస్తుంది.

హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న తెలుగు లలిత కళాతోరణానికి రాజీవ్‌గాంధీ పేరు జోడించబోతున్నారన్న వార్త వినగానే అటువంటి ప్రతికూల స్పందనే వ్యక్తమవుతోంది. ఆ నామకరణాన్ని వ్యతిరేకిస్తున్న వారు రాజీవ్‌గాంధీకి వ్యతిరేకులేమీ కాదు. ఆయన అంతటి గౌరవానికి అర్హుడు కారని కూడా ఎవరూ వాదించడం లేదు. తెలుగులలిత కళాతోరణం అవతరించిన నేపథ్యానికి, అది సంకేతంగా నిలిచిన సంస్కృతులకు రాజీవ్‌గాంధీకి ఏమి సంబంధమన్నదే వారి ప్రశ్న.

ఆ నామకరణానికి ఉన్న ఔచిత్యం గురించినదే వివాదమంతా! లలిత కళాతోరణాన్ని ఆధునీకరిస్తారట. ఆరుబయలు వేదికగా ఉన్న ఆ వ్యవస్థకు పై కప్పు సమకూరుస్తారట. ఇంకా ఏవేవో హంగులు ఏర్పాటు చేస్తారట. అందుకు ప్రభు త్వం వద్ద నిధులు లేవట. అందుకని దాతలు ముందుకు వస్తే, వారి పేరు జోడిస్తారట. ఒక మహాదాత అందుకు సిద్ధపడి, రాజీవ్‌గాంధీ పేరు పెట్టాలని కోరారట, ప్రభుత్వం అంగీకరించిందట. 'రాజీవ్ గాంధీ లలిత కళాతోరణం' అని పెట్టాలనుకున్నారట. నిరసనల వేడిచూసి 'తెలుగు' కూడా అందులో ఉంచడానికి ప్రభుత్వం ఒప్పుకుందట.

తెలుగు అన్న మాటను తీసేయకున్నా, రాజీవ్‌గాంధీ పేరు పెట్టడంలోని ఔచిత్యం ప్రశ్నార్థకంగానే మిగిలింది. గాంధీ, నెహ్రూ వంటి మహా జాతీయ నేతలను ఎట్లాగూ రకరకాల వ్యవస్థల ద్వారా గౌరవిస్తూనే ఉన్నాము. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి దేశ నేతల పేర్లను కూడా అనేక జనావాసాలకు, సంస్థలకు పెట్టుకున్నాము. వారి వారి ప్రాణ త్యాగాలు జరిగిన వెనువెంటనే అటువంటి స్మారక నామకరణాలు జరిగిపోయా యి. కాకపోతే, ఆ ఇద్దరి స్మృతికి 2004 తరువాత రాష్ట్రంలో పునరుజ్జీవనం మొదలయింది. తొమ్మిది సంవత్సరాల తెలుగుదేశం పాలన
తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని అధికార పథంలోకి నడిపించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి-తనకు స్వతహాగా ఆ ఇద్దరు నేతలపై ఉన్న కృతజ్ఞత, అభిమానానికి తోడు- అధినాయకత్వానికి తన విధేయతను సూచించడానికి నామకరణాలను ఒక ఉద్యమంలాగా నిర్వహించారు.   హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ పేరుపెట్టడం పెద్ద వివాదానికి దారితీసింది. ఎన్‌టి రామారావు పేరు కేవలం ఒక టర్మినల్‌కు మాత్రమే పరిమితం కావడం తెలుగుదేశంపార్టీని, ఎన్టీయార్ అభిమానులను నొప్పించింది. రాష్ట్రంలో మరే నేతలూ లేనట్టు, అన్ని ప్రాజెక్టులకూ ఆ ఇద్దరి పేర్లేనా అని కాంగ్రెస్ కార్యకర్తలలో కూడా విసుగు కలిగింది. ఇప్పుడు తెలుగు లలిత కళాతోరణానికి పేరు పెట్టాలని కోరిన నాయకుడు కూడా అధిష్ఠానం మెప్పు కోసం చేశారో, తనకు ఉన్న అభిమానంతో చేశారో తెలియదు.

తెలుగు లలిత కళాతోరణానికి ఇది రజతోత్సవ సంవత్సరం. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ స్థలంలో తెలుగు విశ్వవిద్యాలయానికి స్థలం ఇవ్వడం కానీ, ఆ పక్కనే బహిరంగ కళావేదికగా లలిత కళాతోరణాన్ని నిర్మించడం కానీ ఎన్‌టి రామారావు హయాంలో జరిగినవి. వేదికకు ఆ పేరు పెట్టడంలో కూడా ఎన్టీయార్ వ్యక్తిగత అభిరుచి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. 1986లో హైదరాబాద్ ఆతిథ్యమిచ్చిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కోసం ప్రత్యేకంగా మూడునెలల కాలంలో నిర్మించిన ఓపెన్ ఎయిర్ ఆడిటోరియమ్ అది. నగర ప్రజలకు ఉచితంగా సినిమా ప్రదర్శనలు, రంగస్థల నాటకాలు, వివిధ కళాప్రదర్శనలు ఇవ్వడానికి అనంతర కాలంలో దానిని వినియోగించారు. అయితే, అనుకు న్న స్థాయిలో దానిని వినియోగించుకోలేకపోయిన మాట నిజం. కానీ, నగరంలోని ఒక ముఖ్య కళావేదికగా కళాతోరణానికి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది.  నగర సాంస్కృతికపటంలో అది ఒక ముఖ్య స్థలంగా మారిపోయింది. లలిత కళాతోరణానికి 'తెలుగు' అన్న మాట విశేషణం మాత్రమే కాదు, అది ఒక పేరుకూడా. 'తెలుగు' అన్నది ఆ స్థలం పేరు కాబట్టే, మరే నాయకుడిపేరు దానికి తగిలించలేదు. ఇప్పుడు దానికి ముందు 'రాజీవ్‌గాంధీ' అని జోడించడం 'తెలుగు' ప్రాధాన్యాన్ని తగ్గించడమే అవుతుంది. దాని నిర్మాణంలో ఏ ప్రమేయమూ సంబంధం లేని నాయకుడి పేరును, తోరణం ఏర్పడిన సమయంలో అధికారంలో లేని పార్టీ నాయకుడి పేరును ఆ స్థలానికి పెట్టడం రాజకీయంగా కూడా ఉచితం కాదు.

హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆడిటోరియంకు 'రవీంద్రభారతి' అని పేరుపెట్టడాన్ని, క్రీడా మైదానానికి 'లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియమ్' అని పేరు పెట్టడాన్ని మహాకవి శ్రీశ్రీ వ్యతిరేకించారు. ఆడిటోరియంకు గురజాడ పేరు పెట్టాలన్నది ఆయన ఆకాంక్ష. శారీరకంగా బలహీనంగా ఉండే శాస్త్రి పేరు క్రీడా స్థలానికి ఎట్లా సరిపోతుందన్నది ఆయన ప్రశ్న. కోడిరామమూర్తి పేరు పెట్టాలని ఆయన సూచన. శ్రీశ్రీ వాదనలో సహేతుకత లేకపోలేదు. కాకపోతే, రెండు స్థలాలకూ ఉత్తరాంధ్ర ప్రముఖుల పేర్లు పెట్టడాన్ని అన్ని ప్రాంతాల వారూ మెచ్చకపోవచ్చు. పేర్లు పెట్టడం స్మృతిని గౌరవించడం అయినప్పుడు, అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రముఖులకూ ఆ గౌరవం దక్కాలని ఆయా ప్రాంతాల వారు, వర్గాల వారూ ఆశిస్తారు. అది సహజం. నేడు కొమరం భీమ్ విగ్రహం ట్యాంక్‌బండ్ మీద ఉండాలని ఆదివాసీలో, తెలంగాణవారో కోరుతున్నారం టే, అర్థం వారి ప్రాతినిధ్యం తెలుగు విశిష్ట వ్యక్తుల జాబితాలో ఉండాలని. అదే స్ఫూర్తితోనే ఇవాళ లలిత కళాతోరణంకు తెలుగేతరుల పేరు జోడించకూడదన్న వాదన వస్తున్నది.

తెలుగువారి ముఖ్యపట్టణంలో తెలుగు నేతల పేర్లతోనో, తెలుగు సంస్కృతిని ప్రతిఫలించే పేర్లతోనో ప్రజాస్థలాలు ఉండాలన్నది న్యాయమైన భావన. జాతీయ మహానాయకుల పేర్లు కొన్నిటికి పెట్టవలసిందే, కానీ, స్థానికతను దెబ్బతీసి కాదు. తెలుగుభాషకు రకరకాలుగా అన్యాయం ఎదురవుతున్న ఈ సందర్భంలో మాత్రం లలిత కళాతోరణానికి ఈ నామకరణం మంచిది కాదు. అంతగా తప్పదనుకుంటే, ఆ దాత తెలుగువారే కాబట్టి, 'లలిత కళాతోరణం' పక్కన ఆయన పేరే పెడితే కొంతలో కొంత న్యాయంగా ఉంటుంది.

1 comment:

  1. అయ్యా దీనితొ పాటు రాజీవ్ వ్రతం,రాజీవ్ దీక్ష,రాజీవ్ కల్యాణంలాంటి (అ)పవిత్రమయిన కూడా ప్రారంభించాలాని మా ఆఖిలభారత చంకనాకుడు గాళ్ళ అధ్యక్షులైన నక్కవరపు(నత్తి) సుబ్బారెడ్డి గారు కొరుకుంటున్నారు వారు ఇప్పటికె రాజీవ్ భజన,రాజీవ్ నామ జపం తొ బొలెడు సిమెంట్ ఫ్యాక్టరిలు,చాల పవర్ ప్రాజెక్ట్ల్,లెక్కలెని అన్ని కాంట్రాక్టులు ఇలా లెక్కకు మిక్కిలి గా సంపాదించి ఈ మధ్యన త్రిలింగ దెశము లొ రాజెవ్ నామము తగిలింపు తాలింపు పేరుతొ మధ్యంతర ఎన్నికలు లా మధ్యంతర బారసాల కార్యక్రమము ప్రారంభించారు దీనికి ఆదేశము లొ వున్న సకలజనులు ఆభ్యంతరము వ్యక్తము చేసినా ఆదెశ రాజావారు అమాంబాపతు ఆశయ్య గారి చలువ వల్ల అలావున్నది.ఈ రాజీవ్ కార్యక్రమాలకు కావలిసిన ముఖ్య ఆర్హత సిగ్గు,శరం లాంటివి వొదిలెయ్యాలి.

    ReplyDelete