Monday, November 8, 2010

ఒబామా సందర్శన: కొన్ని సంకేత స్థలాలు

18సెప్టెంబర్ 1857. ఎర్రకోటకు నాలుగు మైళ్ల దూరంలో...
మేజర్ విలియమ్ హడ్సన్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
దగ్గరలోని కట్టడం నుంచి కదిలిన పల్లకీ హడ్సన్ ముందు ఆగింది. భారతదేశపు చివరి చక్రవర్తి రెండో బహదూర్ షా జఫర్ అందులో కూర్చుని ఉన్నాడు.
'హడ్సన్ గారూ, మీ హామీని మరోసారి చెబుతారా?'- అని అడిగాడు వృద్ధచక్రవర్తి. అప్పటికి అతను మానసికంగా చచ్చిపోయి ఉన్నాడు. ఎర్రకోటనుంచి భార్య జన్నత్ మహల్‌తో , అతి కొద్దిమంది పరివారంతో బయటపడి అక్కడ తలదాచుకుంటున్నాడు.

భారత ప్రథమ స్వాతంత్య్రపోరాటం అప్పటికి అణగారిపోయింది, ఢిల్లీ తెల్లవాళ్ల చేతుల్లోకి పోయింది. ఇంకా మిగిలి ఉన్న తిరుగుబాటుదారులు తమ సంకేతాత్మక సేనాధిపతి బహదూర్‌షాను తమతో పాటు రమ్మంటున్నారు. వృద్ధాప్యం, మొగల్ రాజ్యం తనతో అంతరిస్తుందన్న వేదన, పోరాటంలో దేశం పరాధీనమైపోయిందన్న బాధ, గెలవలేమన్న నిరాశ- అతన్ని ఎటూ తేల్చుకోకుండా మథనపెడుతున్నాయి.

మీ పరివారం ప్రాణానికి నాది హామీ- అని చెప్పాడు హడ్సన్. నాదిర్షా, జహంగీర్‌ల పేర్లు లిఖించి ఉన్న రెండు ఖడ్గాలను జఫర్ సమర్పించాడు. ఆ క్షణంతో భారతదేశ సర్వంసహాధికారం లాంఛనంగా అన్యాక్రాంతమైంది. బలహీనుడైన ఆఖరి మొగలాయి పాలకుడు సిపాయిల తిరుగుబాటు కంటె చాలా ఏళ్ల ముందే నామమాత్రుడైపోయాడు, ఢిల్లీకోటను దాటి ఎరుగని స్వచ్ఛంద బందీగా బతికాడు. కానీ, ప్రథమస్వాతంత్య్రపోరాటం అతన్ని తిరిగి దేశప్రేమికునిగా, సర్వసైన్యాధిపతిగా అభిషిక్తంచేసింది. హుమాయూన్ సమాధి దగ్గర దొరికిన జఫర్ బందీగా మాత్రమే తిరిగి ఎర్రకోటకు నడిచాడు.

ఆదివారం నాడు అమెరికా అధ్యక్షుడు హుమాయూన్ సమాధిని ప్రత్యేకంగా సందర్శించబోతున్నారు. భారతదేశపు సార్వభౌమాధికారం పాశ్చాత్యవలసవాదుల అధీనమైపోయిన ఆ స్థలంతో బరాక్ ఒబామాకు ఏమి పని? ఆ స్థలానికి ఉన్న ఆ విశేషమే ఆయనను ఆకర్షించిందా? నాడు కత్తులతో చేయవలసి వచ్చిన ఆక్రమణలు నేడు ఒప్పందాలతోనే జరిగిపోతున్నాయని చెప్పడానికి ఈ సమకాలీన చారిత్రక సందర్భం ఈ సన్నివేశాన్ని కల్పించిందా? హడ్సన్ ప్రాతినిధ్యం వహించిన శక్తులతో పోల్చడానికి ఒబామా సరిపోతాడేమో కానీ, బహదూర్‌షా జఫర్ కు చరిత్ర ఇచ్చినంత గౌరవం నేటి మన పాలకులకు ఇవ్వగలమా? ఆ చివరి చక్రవర్తి అంతిమదినాలలో చూపించిన ఆత్మాభిమానమో, దేశాభిమానమో మన ఏలికలకు ఉన్నదా?

హుమాయూన్ మొగల్ చక్రవర్తులలో పెద్ద ప్రాభవమూ వైభవమూ వెలగబెట్టినవాడు కాదు. బాబర్ తనయుడూ, అక్బర్ తండ్రీ కావడం తప్ప ఆయన సాధించినదేమీ కనిపించదు. రాజ్యం స్థిరపడకముందే బాబర్ మరణించగా, 22 ఏళ్ల వయస్సులోనే రాజ్యానికి వచ్చిన హుమాయూన్ అంతఃకలహాలను, తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు. సుదీర్ఘకాలం ప్రవాసంలో గడిపాడు. యుద్ధంతో అట్టుడుకుతున్న రాజ్యాన్ని వారసత్వంగా పొంది, కుదురుకోవడానికే జీవితమంతా సరిపోయిన హుమాయూన్‌కు ఒబామాతో
ఏమైనా పోలికలున్నాయా? అని కొందరు రాజకీయ పరిశీలకులు కొంటె ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. ఇంతాచేసి, ఒబామా పర్యటనను నిర్ధారించినవారికి ఈ చరిత్రవిశేషాలేమీ తెలియకపోయి ఉండవచ్చును కూడా. అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముస్లిములతో చేతనైనంత మంచిగా ఉండాలని చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా ఎవరో ఒక ముస్లిమ్ చక్రవర్తి సమాధిని ఆయన పర్యటనలో చేర్చి ఉండవచ్చు. ఢిల్లీ తరువాత ఆయన చేయబోయే ఇండొనేషియా పర్యటనలో కూడా ఒక దర్గా సందర్శన ఉన్నది.

అగ్రరాజ్యాధినేతలు, మనబోటి చిరుదేశాలను సందర్శించేటప్పుడు వారి పర్యటనల్లోని స్థలాలకు, సందర్భాలకు వారి కారణాలు వారికి ఉంటాయి, మనం చెప్పుకునే అన్వయాలు మనకుంటాయి. చరిత్ర స్ఫురింపజేసే మూలకారణాలు ఉండనే ఉంటాయి. బిల్‌క్లింటన్ 2000 సంవత్సరంలో పర్యటించినప్పుడు ఆయన హైటెక్ సిటీని, మహావీర్ ఆస్పత్రిని సందర్శించారు.

ఒకటి వ్యాపారం, ఒకటి సామాజికం. ఆనాటి ఉధృతి అంతా ఐటీ పరిశ్రమ చుట్టూ ఉండింది. క్లింటన్ పక్కన సత్యం రామలింగరాజు ఆసీనులైన కాలం అది. (అశోక్ చవాన్ చేత ఒబామా స్వాగతం పొందిన కాలం ఇది.) 2006లో జార్జి బుష్ వచ్చినప్పుడు, ఆయన బిజినెస్‌స్కూల్‌ను, వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. క్లింటన్ కాలంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, కేవలం ఐటీ కే ప్రాధాన్యం లభించిందని, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బుష్ వచ్చారు కాబట్టి, వ్యవసాయ రంగానికి అమెరికా ప్రాధాన్యం ఇచ్చిందని వ్యాఖ్యానాలు రాసుకున్నాం. కానీ, క్లింటన్ కాలానికీ బుష్ కాలానికీ అమెరికాలో కూడా మార్పు వచ్చిందని, భారత్‌లో అమెరికా ప్రయోజనాలలో కూడా తేడా ఉన్నదని గుర్తించలేదు. వ్యవసాయరంగంలో, ముఖ్యంగా విత్తన రంగంలో అమెరికా ఆసక్తికి అనుగుణంగానే వ్యవసాయ విశ్వవిద్యాలయం పర్యటన రూపొందింది తప్ప, అందులో వైఎస్ ప్రమేయం ఏమీ లేదని తరువాత తెలిసివచ్చింది. కాకపోతే, హైదరాబాద్‌కు అమెరికా అధ్యక్షుడిని రప్పించడంలో చంద్రబాబునాయుడిది అయినా, వైఎస్ఆర్‌ది అయినా సొంత చొరవ కొంత వరకు పనిచేసిందని ఒప్పుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రనాయకత్వానికి అంతటి చొరవా లేదు, ఆసక్తీ లేకపోవచ్చు. పైగా, ఆర్థిక మాంద్యం, ఔట్‌సోర్సింగ్ వివాదాల నేపథ్యంలో ఐటీ కేంద్రాల మీద అమెరికా అధ్యక్షులకూ మక్కువ లేకపోవచ్చు.

అసలు ఒబామా పర్యటన క్రమమే కొంత ఆశ్చర్యజనకంగా ఉన్నది. విదేశీ రాజకీయ అతిథి ఎవరైనా ముందు దేశరాజధానికి వచ్చి ఆ తరువాత ఇతర ప్రాంతాలకు వెడతారు. అట్లా కాక, ఒబామా ముందు వాణిజ్య రాజధాని ముంబైకి వచ్చారు. ఆయన బలగంలో విదేశాంగ మంత్రి లేకపోవడం ఒక విశేషం. ఆర్థిక, వాణిజ్య, వ్యవసాయ మంత్రులు మాత్రమే ఉండడం మరో విశేషం. వివిధ కంపెనీల సీఈవోలు 200మందితో సహా మూడువేల మంది వ్యాపారులు కూడా ఆయన వెంట ఉన్నారు. ఆయన పటాలం చూస్తే చాలు ఆయన ఎందుకు వచ్చారో తెలిసిపోతున్నది. కానీ, 26/11 ముంబై కాల్పుల నేపథ్యంలో, క్షతగాత్ర నగరాన్ని పరామర్శించడానికి వస్తున్నట్టు ప్రచారం మాత్రం చేసుకున్నారు. ఉగ్రవాదులకు సవాల్ లాగా తాజ్‌హోటళ్లో తాము బసచేస్తున్నట్టు ప్రకటించుకున్నారు.

పాకిస్థాన్‌కు ఒక హెచ్చరిక ఇస్తేనో, తమ అధీనంలో ఉన్న హెడ్లీ గురించి ఏదన్నా వ్యాఖ్యానిస్తేనో- ఒబామా ఉద్దేశాలను నమ్మవచ్చు. కానీ, ఆయన బస చేసింది ఉగ్రవాదులు దాడిచేసిన హోటల్లో మాత్రమే కాదు, భారత- అమెరికా సీఈవోల సంఘం సహాధ్యక్షుడైన రతన్‌టాటా యాజమాన్యంలోని హోటల్లో అని అర్థమైనప్పుడు- రకరకాల ప్రయోజనాలు గుర్తుకు వస్తాయి. మరి ముంబై కాల్పుల వల్ల మాత్రమే భారతజాతి గాయపడిందా? తాజా తీర్పు వల్ల మళ్లీ పచ్చి గాయంగా ఉన్న భోపాల్ విషవాయు దుర్ఘటన వల్ల కూడా భారతీయులు గాయపడే ఉన్నారు. మరి ఒబామా భోపాల్‌ను ఎందుకు సందర్శించడం లేదు? - ఈ ప్రశ్న పచ్చి అమాయకమైనదని వేరే చెప్పనక్కరలేదు.

అమెరికన్లకు ఒక అరవైవేల ఉద్యోగాల కోసం తాను వస్తున్నట్టు బాహాటంగానే అమెరికా అధ్యక్షుడు చెప్పుకున్నాడు. భారత్ అడిగే భద్రతాసంఘం శాశ్వత సభ్యత్వం, ఔట్‌సోర్సింగ్ ఆంక్షల సడలింపు వంటి వాటి విషయంలో తన దగ్గర ఖాళీచేతులే ఉన్నాయనీ నిష్కర్షగా ఒప్పుకున్నారు. కానీ, కాస్త లోతుగా వెళ్లి చూస్తే, అమెరికా ఎప్పుడూ మనదగ్గర తీసుకోవడానికే వస్తుందని అర్థం అవుతుంది. అది తీసుకునేది చాలా నిశ్శబ్దంగా, చాటుగా తీసుకుంటుంది, భారతీయులకు విదిలించే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను మాత్రం అట్టహాసంగా చెప్పుకుంటుంది, మనమూ అంతే. మనం కోల్పోయేవాటి గురించి మౌనంగా ఉంటాము, దొరికేవాటి గురించి కృతజ్ఞతతో ఉంటాము. విద్య, రిటెయిలింగ్, వ్యవసాయం, రక్షణ రంగాలలో అమెరికా చేసుకుంటున్న ఒప్పందాలు, పొందే విధానపరమైన రాయితీలు భారతదేశంలో ఉపాధిని, స్థానిక పరిశ్రమల అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అంత గొప్ప చేయి కింద ఉండి, తన చేయి పైన ఉండడం ఎంత గర్వకారణం- అనుకుని బలిచక్రవర్తి వామనుడికి దానం ఇచ్చినట్టు, భారతదేశం కూడా అమెరికన్లకు కొంత ఉపాధి కల్పించడానికే సిద్ధపడుతుందని వేరే చెప్పనక్కరలేదు.

ఒబామా పర్యటనను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నవారి సంగతి పక్కన బెడదాం, కానీ అమెరికా అధ్యక్షుడి ముందు నంగిగా ఉండడానికి ఇష్ట పడని వ్యక్తి దేశంలో ఒక్క గాంధీజీ మాత్రమే కనపడుతున్నారు. జార్జి బుష్ వచ్చినప్పుడు- ఆయన కంటె ముందు వాసన కుక్కలు వచ్చి రాజఘాట్‌ను పరిశీలించి వెళ్లాయని పెద్ద వివాదమే రేగింది. ఈ సారి అటువంటిది కుదరదని రాజ్‌ఘాట్ సమాధి కమిటీ తేల్చి చెప్పింది. బాపూ దృష్టిలో మనుషుల మధ్య తేడాలేమీ ఉండవని, ఒబామా సామాన్యుడిగా సమాధిని సందర్శించవలసిందేనని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పష్టం చేశారు.

2 comments:

  1. Interesting analysis.
    Kudos to Rajghat committee and Sri Tushar Gandhi.

    ReplyDelete
  2. chaalaa lotaina visleshan .dhnyavaadamulu

    ReplyDelete