Tuesday, November 16, 2010

ప్రజాస్వామ్యం, వెన్నుపోట్లు, కుటుంబపాలన

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ సర్‌సంఘ్‌చాలక్ కె.ఎస్. సుదర్శన్ సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని, నిరసననీ సృష్టించాయో చూస్తున్నాము. ఇందిర, రాజీవ్ హత్యల్లో సోనియా ప్రమేయం ఉన్నదన్న ఆరోపణను పరిగణనలోనికి తీసుకోవడం కూడా అనవసరం. మధ్యయుగాలలోని పామర పౌరులెవరో రాచరిక రాజకీయాల గురించి చెప్పుకునే కథలను పోలిన మాటలవి. ఆ వ్యాఖ్యల కు తమ ఆమోదం లేదని చెప్పిన తరువాత ఆర్ఎస్ఎస్‌ను నిందించడం కూడా అనవసరం. సోనియాగాంధీ విదేశీ సంతతికి చెందిన వ్యక్తి కావడాన్ని దృష్టిలో పెట్టుకుని, అంతఃపుర కుట్ర లాంటిదేదో జరిగి జాతీయ నేతల హత్యలు జరిగాయని సుదర్శన్ ఆరోపించి ఉండవచ్చు.కానీ, ప్రజాస్వామ్యంలో అంతఃపుర కుట్రలు జరుగుతాయా? నేపాల్‌లో బీరేంద్ర కుటుంబాన్ని జ్ఞాతి జ్ఞానేంద్రే హత్య చేసినట్టు (అందులో ఇండియా ప్రోత్సాహమూ ఉన్నట్టు..) విశ్వసించేవారు ఉన్నారు. ఆ దేశమంటే రాజరికంలో ఉండింది కాబట్టి, కుట్రలు జరగవచ్చును కానీ, భారత్ వంటి ప్రజాస్వామ్యంలో అటువంటివి సాధ్యమా?

వెన్నుపోట్లు రాచరికాల్లో ఉంటాయి కానీ ప్రజాస్వామ్యంలో ఉండవు అని ఒక టీవీచర్చలో ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. 1995లో ఎన్టీయార్ విషయంలో జరిగింది రాజకీయమైన చీలికే తప్ప, వెన్నుపోటు కాదని ఆ విశ్లేషకుడి వాదన. కావ చ్చు. రాజకీయమైన అభ్యంతరాలే నాటి పరిణామాలకు దారితీసి ఉండవచ్చు. కానీ, ఇన్నేళ్లు గడచినా సాధారణ ప్రజల జ్ఞాపకంలో చంద్రబాబునాయుడు తన మామగారికి అన్యాయం చేశారన్న ముద్రే కొనసాగుతున్నది. నాటి పరిణామాల తరువాత, చంద్రబాబును ప్రజలు ఆమోదించి ఉండవచ్చు, ఎన్నికల్లో తమ ఘనమైన సమ్మతినీ తెలిపి ఉండవచ్చు. అయినా, ఎన్టీయార్ దయనీయంగా పదవీచ్యుతులు కావడం, తరువాత కొద్ది కాలానికే కన్నుమూయడం వల్ల- ఆయనపై సానుభూతి నాటి పరిస్థితులకు అతీతంగా స్థిరపడిపోయింది. ఆంతరంగిక కుట్రకు అన్యాయమైపోయిన చక్రవర్తిని తలచుకున్నట్టే ఆయనను తలచుకుంటున్నారు. జనంలో ఉన్న తలపును ఆసరా చేసుకుని చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు తరచు ఆయనను నిందించడానికి 'వెన్నుపోటు' ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అధికార సోపానాన్ని అధిరోహించడానికి ముఖ్యమంత్రులపై అసమ్మతి అస్త్రాన్ని ప్రయోగించారని, ఒకానొక సందర్భంలో రాజధానిలో మతకలహాలను కల్పించి ముఖ్యమంత్రిని పదవీచ్యుతుడిని చేశారని దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి మీద వచ్చిన ఆరోపణ కూడా ఏ ఆధారమూ లేకపోయినా
జనస్మృతిలో సజీవంగా మిగిలిపోయింది. వైఎస్ అసమ్మతి కార్యక్రమాలను వెన్నుపోట్లూ అనలేము చీలికలూ అనలేము. రాచరిక భాషలో చెప్పాలంటే, ప్రతి నేతకూ ఆయన ఒక పక్కలో బల్లెంలాగా వ్యవహరించారు. అటువంటి కార్యక్రమాలు సైతం ఉత్తమ ప్రజాస్వామ్యం పరిధిలోకి వచ్చేవేమీ కావు.

సమస్య ఏమిటంటే, వ్యవస్థలో కొన్ని ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నాయేమో కానీ- ఈ వ్యవస్థను నడుపుతున్న ఏలికలు ఆ స్థానాలకు ఎగబాకడానికి, వాటిని నిలుపుకోవడానికి అనుసరిస్తున్న పద్ధతులు, ఆశ్రయిస్తున్న సంప్రదాయాలూ రాచరికానికి సంబంధించినవిగానే కనిపిస్తున్నాయి. వెన్నుపోటు మాత్రమే కాదు, కుటుంబపాలన కూడా ప్రజాస్వామ్యానికి సహజమైనది కాదు. కానీ, ఈ దేశంలో స్వాతంత్య్రం వచ్చిన అరవయ్యేళ్లలో నలభయ్యేళ్లు కుటుంబపాలనే సాగింది. భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెహ్రూ కుటుంబం ఒక్కటే కాదు, ఆయన సమకాలికులుగా సహచరులుగా ఉన్నవారి సంతానం కూడా తమ తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రాజవంశం ప్రతిష్ఠ వారసులకు సంక్రమించి, ఎట్లా అయితే ఆమోదయోగ్యతను అందిస్తుందో, ప్రజాస్వామికమైన పదవులలో ఉన్న నేతల ప్రతిష్ఠ కూడా వారి కుటుంబాలలోనే చిక్కుకుపోయింది. జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన గాంధీజీ కానీ, స్వాతంత్య్రానంతర ప్రజాస్వామిక స్ఫూర్తి అయిన జయప్రకాశ్ నారాయణ్ కానీ తమ తమ ప్రతిష్ఠల ను కుటుంబాలకు అప్పగించిపోకపోవడం వారి ఔన్నత్యం, మన అదృష్టం.

జాతీయ పార్ట్టీలే కాదు, ప్రాంతీయ పార్టీలు, ఏవో ఉద్యమాల ద్వారా పార్టీల రూపం తీసుకున్న సంస్థలు కూడా కుటుంబ వ్యవస్థలుగానే మారిపోయాయి. ద్రవిడ ఉద్యమం నుంచి పుట్టిన డిఎంకె ఇప్పుడు ఒక మహా కుటుంబపార్టీ. ఆ కుటుంబంలోనూ లుకలుకలు వచ్చినప్పుడు పెద్ద సంక్షోభమే వచ్చింది. ఇప్పుడు అంతా కలసిపోయి అధికారఫలాలను ఉమ్మడిగా అనుభవిస్తున్నారు. కుటుంబపెద్ద గతించిన తరువాత పరిస్థితి ఏమిటనే ఆత్రుతతో అక్కడా రాజకుమారుల మధ్య స్పర్థ కొనసాగుతున్నది. ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న అన్నాడిఎంకె-అవివాహిత నేతృత్వంలో ఉన్నప్పటికీ- ఇష్టసఖులూ పెంపుడుకొడుకులతో అక్కడా ఒక కుటుంబం ఏర్పడిం ది. ఇక అరివీరభయంకర శివసేనలో కూడా వారసుల మధ్య పోటీ వచ్చి పార్టీ చీలిపోయిం ది. ఓంప్రకాశ్‌చౌతాలా, ఒమర్ అబ్దుల్లా, నవీన్‌పట్నాయక్ వంటి రెండోతరం నేతలు ఈ పాటికే అధికార పీఠాలకు చే చేరిపోయారు. మాధవరావు సింధియా, రాజేష్‌పైలట్, శరద్‌పవార్ వంటి నేతల సంతానం ఆ క్యూలో ఉన్నారు.

మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ కుటుంబపార్టీగానే పరిగణన ఉన్నది. అల్లుళ్లు, కొడుకులతో బహుకుటుంబీకుడైన ఎన్టీయార్ తన వారసత్వం ఎవరికి అందించాలనే విషయంలో అనేక పర్యాయాలు తబ్బిబ్బు పడ్డారు. ఉన్న వారసులతో నిమిత్తం లేకుండా కొత్త కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకునే సరికి అసమ్మతి భగ్గుమంది. చంద్రబాబు నాయుడికి స్వయంగా ఉన్న రాజకీయ శక్తిసామర్థ్యాలు ఎంతటివైనా, ఎన్టీయార్ అల్లుడు కావడం ఆయనకు ఆమోదాన్ని అందిస్తున్న అంశం. మొన్నటి ఎన్నికల్లో ఎన్టీయార్ తనయులను, మనవడిని ఎన్నికల ప్రచారానికి రప్పించడం తిరిగి గత స్మృతిని ఉద్దీపింపజేయడానికేనని అందరూ అనుకున్నదే. చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనుకునేవారు పార్టీ నాయకత్వాన్ని బాలకృష్ణ చేపట్టాలని ప్రకటనలు చేయడం-ఆ పార్టీలోని కుటుంబస్వభావాన్ని తెలియజేస్తుంది.

ఇంకా ఉద్యమనిర్వహణలోనే ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చాలా తొందరలోనే కుటుంబపార్టీ ముద్రను సంపాదించుకుంది. మేనల్లుడు, కుమారుడు, కుమార్తె- అంతా తెలంగాణ రాజకీయాలలోనే ఉండడం, స్థానాల కేటాయింపులో, పదవులు ఇప్పించడంలో కుటుంబ పక్షపాతం కనిపించడం- టిఆర్ఎస్‌పై ఆ ముద్రను బలపరచిన అంశాలు.

ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సంస్థానంగా తయారయినప్పుడు, అభిప్రాయాల ఆధారం గా జనసమీకరణ జరిగి ప్రజాస్వామికంగా గెలుపోటములు నిర్ణయం కావడం కష్టసాధ్యమైన విషయం. ఉద్వేగాలు, వంశ ప్రతిష్ఠలు, గతచరిత్రలు, వ్యక్తిగత ఆకర్షణలు పైచేయిగా మారి, ప్రజలు సాంప్రదాయికమైన రాజభక్తితోనే నేతలను ఎన్నుకుంటున్నారు. రాచరికంలో ఒకే రాచకుటుంబం ఉండేది. ఇప్పుడు అధికార, ప్రతిపక్షాలు రెండూ రెండు రాచకుటుంబాలుగా జనానికి ఎంపిక అవకాశం ఇస్తున్నాయి. ఈ రాచగుంపుల మధ్యకానీ, ఒకే గుంపులో ఆంతరంగికంగా కానీ జరిగే పోరాటాలు- వెన్నుపోట్లు, కుట్రలు, విద్రోహాలతోనే జరుగుతూ ఉంటాయి. మన రాజకీయాల్లో సైతం ఇదే పరిభాష ఉంటుంది కాబట్టే, విధేయత ఒక విలువగా కొనసాగుతుంది. పార్టీ హైకమాండ్ కు అయినా, అధినేతకు అయినా విధేయత ఒక ఆదర్శం. భిన్నంగా వెడితే విద్రోహం.

ఇంకా మన సమాజం అధిక భాగం పాతకాలంలోనే మగ్గిపోతున్నదని చెప్పడానికి ఈ కుటుంబ పాలన ఒక ఉదాహరణ. రాజకీయాల్లోనే కాదు, సమస్త రంగాలలోనూ ఆనువంశికత్వం రాజ్యమేలుతున్నది. ఆస్తిహక్కు పారంపరికం కాబట్టి, దానితోపాటు సమకూరే సమస్త హంగులూ వారసులకే చెందుతాయి. ఒక గ్రామంలో భూస్వామి కుమారుడికే తండ్రి ఆస్తీ, అధికారం, పలుకుబడీ ఎలా సంక్రమిస్తాయో, రాజకీయాల్లో, సినిమారంగంలో, వివిధ వృత్తి రంగాల్లో వంశం నుంచి సంక్రమించే సమస్తమూ సంక్రమిస్తున్నాయి. అదికాక, సుపరిచితత్వం మన సమాజంలో ముఖ్యమైన సమీకరణాంశం.

ఎక్కడో ఒక చోట మన జ్ఞాపకానికో, వర్తమానానికో లంకె కలిగిన మనుషులు మన కు ఆమోదకరంగా అనిపిస్తారు. రాహుల్ గాంధీని చూస్తున్నప్పుడు- రేపటి ప్రధాని ఇతను అని ఎందుకు అనిపిస్తుందంటే, అటువంటి ఆమోదాన్ని అతను మూటగట్టుకుని తిరుగుతున్నాడు. అయితే, అన్ని సందర్భాలలో సంబంధమూ సుపరిచితత్వమూ ఫలితాన్నిస్తాయని చెప్పలేము. జనం విచక్షణ ఒక్కోసారి భిన్నంగా కూడా ఉంటుంది. ఎన్టీయార్‌కు అన్యాయం జరిగిందని బాధపడ్డప్పటికీ జనం ఆయన వారసత్వాన్ని లక్ష్మీపార్వతికి ఇవ్వలేకపోయారు. ఎంజీఆర్ భార్యను కాదని జయలలితకు తమిళులు ఆయన వారసత్వం ఇచ్చారు. ఎంతో సుపరిచితుడైనా చిరంజీవిని అధికారానికి ఇంకా దూరంగానే నిలిపారు. బాగా తెలిసి ఉండడంతో పాటు, తమ విలువల చట్రానికి పూర్తి ఆమోదనీయంగా ఉండడం కూడా ప్రజలకు అవసరం కాబోలు.

7 comments:

 1. "సమస్య ఏమిటంటే, వ్యవస్థలో కొన్ని ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నాయేమో కానీ- ఈ వ్యవస్థను నడుపుతున్న ఏలికలు ఆ స్థానాలకు ఎగబాకడానికి, వాటిని నిలుపుకోవడానికి అనుసరిస్తున్న పద్ధతులు, ఆశ్రయిస్తున్న సంప్రదాయాలూ రాచరికానికి సంబంధించినవిగానే కనిపిస్తున్నాయి."

  బాగా చెప్పారు.
  దీనికి సంబంధించిన మన భాషే అలా రాచరికపు వాసనల్తో నిండి ఉన్నప్పుడు, ఆలోచనలు, ఆచరణలు అలాగే కొనసాగడంలో ఆశ్చర్యం లేదని నాకనిపిస్తుంది.
  గమనించండి: "రాజ"కీయం, ప్రజా"స్వామ్యం", "ప్రభు"త్వం ..

  ReplyDelete
 2. రాజకీయాల్నీ, రాజకీయ పార్టీలనీ వ్యక్తుల సంస్థలుగా కాకుండా వాటి వాటి విధానాల వెదికలుగా చూసే పరిణతి మనలో వచ్చేదాకా ఇటువంటి పోకడలు ఉంటూనే ఉంటాయి.

  మొత్తం మీద మనకి ప్రస్తుతానికి సంస్థల మీదా, విధానాల మీదా కంటే నాయకుల మీదే విశ్వాసం ఎక్కువ. అదే ప్రతిబింబిస్తున్నాయి మీరు చెప్పిన విషయాలన్నీ. అదే ప్రతిబింబిస్తున్నాయి మీరు చెప్పిన విషయాలన్నీ.

  చాలా చక్కగా ఒక ఆలోచింపజేసే విషయాన్ని చెప్పారు. అభినందనలు.

  ReplyDelete
 3. స్వతంత్రం వచ్చిన తొలి దినాలలోనే ఈ అధికార రాజకీయాలకు జవహర్ లాల్ నెహ్రూ గారి ద్వారా పునాదులు పడ్డాయని నా అభిప్రాయం.వారసత్వం నుంచి వచ్చిన ఇందిర తన కుటుంబానికే వారసత్వంగా అధికారం దక్కటానికి చేయవలసినదంతా చేసింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని రాజీవ్ గాంధీ ని మనం ప్రధానిగా ఆమోదించిన నాడే ఈ వారసత్వ రాజకీయాలకు అంగీకరించి నట్లయింది.ఎంత ప్రజాస్వామ్యమని మనం చెప్పుకున్నా మన జాతికి సహజమయిన వారసత్వ సిద్ధాంతం ఆస్తిపాస్తులకు లాగానే అధికారానికి, వ్యాపారానికే కాక ఇప్పుడు సినిమా లకు కూడా ఆపాదించ బడటం మన దురదృష్టం .మేధావి వర్గం ఎంత బాధపడినా మనకూ మరో వారసత్వ ప్రధాని రావటానికి రంగం సిద్ధమవుతుంది...రాహుల్ని యువరాజు అని మన మీడియా ప్రచారం చేయటం లోనే మన బలహీనతేమీతో తెలుస్తూనే వుంది.దీనికి అంతం ఎప్పుడో ఎవరికీ తెలియదు .మీరు మంచి విషయం మీద మంచి వ్యాసం రాసారు.

  ReplyDelete
 4. *వెన్నుపోట్లు రాచరికాల్లో ఉంటాయి కానీ ప్రజాస్వామ్యంలో ఉండవు అని ఒక టీవీచర్చలో ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.*
  *ఎన్టీయార్ దయనీయంగా పదవీచ్యుతులు కావడం, తరువాత కొద్ది కాలానికే కన్నుమూయడం వల్ల- ఆయనపై సానుభూతి నాటి పరిస్థితులకు అతీతంగా స్థిరపడిపోయింది. ఆంతరంగిక కుట్రకు అన్యాయమైపోయిన చక్రవర్తిని తలచుకున్నట్టే ఆయనను తలచుకుంటున్నారు.*
  *రాజవంశం ప్రతిష్ఠ వారసులకు సంక్రమించి, ఎట్లా అయితే ఆమోదయోగ్యతను అందిస్తుందో, ప్రజాస్వామికమైన పదవులలో ఉన్న నేతల ప్రతిష్ఠ కూడా వారి కుటుంబాలలోనే చిక్కుకుపోయింది.*
  *మధ్యయుగాలలోని పామర పౌరులెవరో రాచరిక రాజకీయాల గురించి చెప్పుకునే కథలను పోలిన మాటలవి.*
  -------------------------
  మీరు రాసిన వ్యాసం అంతా ప్రజాస్వామ్య లో ఉన్న రాచరికం ను తెలియ జెప్పెవిధం గా ఉన్నాది. దానికి పైన మీరు రాసిన వ్యాఖ్యలే నిదర్శనం. జయలలితకు ఉన్న కేపబిలిటి తమిళ ప్రజలకు బాగా తెలుసు. ఆదే యంజియార్ మొదటి భార్య గురించి ఎంత మందికి తెలుసు? మన దేశం ప్రజాస్వమ్యం పేరు చెప్పి ఉంట్టున్న ఒక రాజరిక వ్యవస్థ. మరి సుదర్శన్ గారి వ్యాఖ్యలను మీరు మధ్యయుగాలలోని పామర పౌరులతో పోల్చటం అనాగరికం. ఇంతకీ మీరు చెప్పదలుచుకొన్నది ఎమీటి? సుదర్సన్ గారు పామరుడు ఐతే ఆయన మాటలకి అంత ప్రతిస్పందన ఎందుకు? చూడబోతే మీలాంటి వారు ఈ దేశ పౌరులందరిని పామరులుగా అనుకొట్టున్నట్లురు. 1,70,000 కోట్లు తిని 16 నెలలు మంత్రిగా కొనసాగించిన ప్రధాని ఈ దేశం లో ఉన్న నిజమైనా పండితుడు. ఎందుకంటె వారికి లండన్ యునివర్సిటిలు డాక్టరేట్ ఇచ్చాయి, అమేరికా అధ్యక్షుడు వారిని పొగిడారు కనుక.

  ReplyDelete
 5. సామాన్యులు రాజకీయాలలో రాణించే అవకాశం మన ప్రస్తుత ఎన్నికల విధానంలో లేదు.
  ఎన్నికల విధానం సంస్కరించనంతవరకు కుటుంబ పాలన తప్పదు

  ReplyDelete
 6. రాశేరె చనిపోగానే శవానికి అంత్యక్రియలు కూడా జరగకుండానే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న అందరు మంత్రులు ,ఇప్పుడున్న ముఖ్యమంత్రి తో సహా జగన్ కు సాగిలపడిన వ్యవహారం ,ఆయన పధకాలు కొనసాగించాలంటే జగనే దిక్కని,రాష్ట్రం అనాధ అయిపోతుందని గగ్గొలు పెట్టడం మీరు విస్మరించారెందుకో?

  ReplyDelete
 7. This comment has been removed by a blog administrator.

  ReplyDelete