Tuesday, November 23, 2010

'రాజా'ల కూటమిలో మీడియా కూడానా?

ఆశ్చర్యం, అవినీతి మళ్లీ జాతీయ చర్చాంశం అయి కూర్చుంది. అప్పుడెప్పుడో బోఫోర్స్ కుంభకోణం సందర్భంగా రాజకీయాల్లో అవినీతి గురించి, కంపెనీలకు వారి దళారులకు రాజకీయవేత్తలకు ఉండే సంబంధం గురించి కలకలం రేగింది. అది రాజీవ్ ప్రభుత్వ పతనానికి, కుడిఎడమల మద్దతుతో ఒక భిన్నమయిన ప్రభుత్వం అవతరించడానికి దారితీసింది. ఇప్పుడు ప్రభుత్వాలేమీ కూలిపోయే పరిస్థితి లేదు కానీ, మహా మహా శిఖరాలు కూలిపోతున్నాయి.

అవినీతి ఒక శాశ్వత సత్యమని, దానితో సహజీవనం చేయవలసిందేనని మనసు రాయి చేసుకున్న జనం కూడా గుండెలు బాదుకునేంత హీనమయిన, దారుణమయిన అవినీతి అనుభవంలోకి వస్తున్నది. ఈ పాపాలకు బాధ్యత వహిస్తూ ఏవైనా తలకాయలు దొర్లవలసిందేనని ప్రజలు ఏమీ పట్టుపట్టడంలేదు కానీ, విశ్వసనీయత కోల్పోయిన స్థితిని భరించలేక వ్యవస్థే ఏదో ఒకటి చేసి తనను తాను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నది. పరిస్థితి చేయి దాటిపోలేదని, ఆశ చంపుకోవలసిన పనిలేదని నమ్మకం కలిగించాలని చూస్తున్నది.

మన్మోహన్‌సింగ్ వ్యక్తిగత నిజాయితీ గురించి ఇప్పటికి వాడిన విశేషణాలను, రాసిన వాక్యాలను పోగేస్తే అవి బస్తాల కొద్దీ ఉద్గ్రంథాలవుతాయి. విషాదమేమిటంటే, వ్యవస్థాగతంగా అతి పెద్ద అవినీతి యంత్రాంగాన్ని నిర్వహించే పవిత్ర బాధ్యతలో ఆయన తలమునకలు కావలసి వచ్చింది. గత ఇరవయ్యేళ్లలో ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటీకరించడం తో మొదలుపెట్టి, ప్రస్తుతం సహజ వనరులను (స్పెక్ట్రమ్ కూడా సహజ వనరేనని అంటున్నారు) వ్యాపారులకు దోచిపెట్టడం దాకా సాగుతున్న నూతన ఆర్థికవిధానాల గమనం లో, చేతులు తడుపుకునే అవకాశాన్ని ఏ ద్వారపాలకుడూ వదిలిపెట్టడం లేదు. ఆ దళారీ వాటాల కోసమే రాజకీయాలలోకి ఉన్న, కొత్తగా వస్తున్న శ్రేణులు ఎగబడుతున్నాయి.  సంస్కరణలతో పాటుగా వెలసిన అనేక అడ్డదారుల్లో అకస్మాత్ సంపన్నులవుతున్న వారందరూ సంపదను రక్షించుకోవడానికి, దాన్ని ఇబ్బడిముబ్బడి చేసుకోవడానికో రాజకీయాలలోకి వస్తున్నారు. 1990 కంటె ముందున్న అవినీతి పద్ధతులు, పరిధి, పరిమాణంవేరు. ఇప్పుడు జరుగుతున్నది వేరు. ప్రపంచీకరణ పేరుకు తగ్గట్టే, ఇప్పుడు అవినీతి ప్రపంచస్థాయిలో, భారీగా సాగుతున్నది.

కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా పనిచేసిన ఎన్.విఠల్ భారతదేశంలోని రాజకీయ-సామాజిక వ్యవస్థను 'నేతా-బాబూ-లాలా-రెnూలా-దాదా' కూటమిగా అభివర్ణించా రు. అంటే రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, మాఫి యా-వీరంతా కలిసి ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడానా అని సందేహం రావచ్చు, అన్నీ కాకపోవచ్చు, అందరూ కాకపోవచ్చు, కానీ సూక్ష్మరుణ సంక్షో భం ఆ వ్యవస్థలోని అమానుషత్వాన్ని కూడా తాజాగా వెల్లడి చేసింది.

విషాదమేమిటం టే, విఠల్ కూర్చిన జాబితా అక్కడితో ఆగిపోవడం లేదు. అందులో కొత్తశక్తుల కూడా వచ్చి చేరుతున్నాయి. న్యాయవ్యవస్థ మంచి చెడ్డల గురించి అందులోని పెద్దలే మాట్లాడుతున్నారు. సగం మంది న్యాయమూర్తులు అవినీతిపరులేనని ఒక పెద్దమనిషి అంటే, వారి ఆస్తిపాస్తుల వివరాలు అటువంటి వ్యాఖ్యలను సమర్థించేటట్టే ఉంటున్నాయి.

ఆదర్శ్ వంటి కుంభకోణాలు సైనిక వ్యవస్థలో సైతం ఈ జాడ్యం విపరీతమవుతున్నదా అన్న అనుమానాన్ని కలిగిస్తున్నాయి. న్యాయవ్యవస్థా, రక్షణ వ్యవస్థా-మరీ చెడిపోవడానికి ఇంకా కొంత కాలం పట్టవచ్చును కానీ, విఠల్ గారి జాబితాలో అర్జెంటుగా చేర్చవలసిన ది మాత్రం 'మీడియా'. స్పెక్ట్రమ్‌స్కామ్ బయటకు తెస్తున్న వాస్తవాల పరంపరలో మీడి యా శిఖరాలని కూలుస్తున్న తాజా వెల్లడి నీరా రాడియా టేపుల వ్యవహారం.

పత్రికల్లో, ప్రసార సాధనాల్లో పనిచేసే విలేఖరులు కానీ, వాటి సంపాదకులు కానీ వృత్తి అవసరాల రీత్యా సమాజంలోని సకల శ్రేణులతో సన్నిహిత సంచారం చేస్తుంటారు. మీడియాకు ఉన్న గౌరవంవల్ల కానీ, దానిశక్తి వల్ల కానీ, ఎంతటి వారైనా మీడియా వ్యక్తులతో భయభక్తులతో కూడా ఉంటారు.

వృత్తిరీత్యా సంక్రమించే ఈ హోదాను, పరిగణన ను దుర్వినియోగం చేసినప్పుడు- మొత్తంగా పాత్రికేయ రంగం మీదనే ప్రజలకు నమ్మకం సడలిపోతుంది. వ్యవస్థలోని అధికారిక అంగాలు మూడిటిమీదా నిరాశ చెందిన వారికి సైతం ఒక ఆశను, ప్రజాస్వామ్యం మీద విశ్వాసాన్ని కలిగించేది మీడి యా. ఆ విశ్వాసానికి భంగం వాటిల్లడం వ్యవస్థకే ప్రమాదం.

వీర్ సాంఘ్వి చాలా పెద్ద పాత్రికేయుడు. జాతీయస్థాయి ఆంగ్ల సంపాదకుడు. బర్ఖాదత్ సాహసి అయిన నూతన తరం టీవీ మీడియా పర్సన్, తొలితరం వార్తాచానెల్ అయిన ఎన్‌డీటీవీతో ముడిపడిన పేరు, ప్రణయ్‌రాయ్ బృందం మీద ఆంగ్ల వార్తాచానెళ్ల వీక్షకులకున్న గౌరవంలో, అభిమానంలో ఈమె వాటా పెద్దది. నీరా రాడియా అనే కార్పొరేట్ ప్రజా సంబంధాల లాబీయిస్టు 2009 ఎన్నికల తరువాత యుపిఎ-2 మంత్రిమండలి నిర్మాణం సమయంలో జరిపిన ఫోన్ సంభాషణలను ఆదాయపుపన్ను శాఖ వారు విడుదల చేశారు.

ఆమె మాట్లాడిన వారిలో ఈ ఇద్దరు పాత్రికేయులూ ఉన్నారు. ఇంకా వెలికిరాని టేపుల్లో ప్రభుచావ్లా, రాజ్‌దీప్ సర్దేశా యి వంటి మహామహులతో సంభాషణలు కూడా ఉన్నాయంటున్నారు. వీర్‌సాంఘ్వితో సంభాషణలో అంబానీసోదరుల చమురు వివాదం తరువాత కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎట్లా వ్యాఖ్యానించాలో నీరా రాడియా సూచిస్తున్న ది.  టెలికం శాఖకు మంత్రి నియామకం గురిం చి ఇతరుల నుంచి సేకరించిన సమాచారాన్ని బర్ఖాదత్ నీరా రాడియాకు చేరవేస్తున్నది. ఈ రెండు రకాల సంభాషణలూ వృత్తిపరమైన అవసరాలకోసం జరిపినవేనని ఇద్దరూ వాదిస్తున్నారు. టాటాలకూ అంబానీలకూ (ఇద్ద రూ టెలికం రంగంలో ప్రయోజనాలున్నవారే) అనధికార ప్రతినిధిగా, లాబీయిస్టుగా వ్యవహరించే నీరా రాడియాతో ఈ ఇద్దరు పాత్రికేయులూ జరిపిన సంభాషణ- లాబీయింగ్‌లో భాగంగానే కనిపిస్తుంది తప్ప, వృత్తిపరమైనదిగా నమ్మడం కష్టమే. వృత్తిపరమైనదే అయితే, కూడబలుక్కున్నట్టు ఎన్‌డీటీవీ, సిఎన్ఎన్-ఐబిఎన్, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే ఎందుకు నీరా రాడియా టేపుల ఉదంతాన్ని తొక్కిపెట్టినట్టు? సుప్రీంకోర్టు న్యాయవాది సోమవారం నాడు ఈ టేపులను న్యాయస్థానాని కి సమర్పిస్తే, పోటీపడి వాటిని చిక్కించుకుని ప్రసారం చేయవలసిన చానెళ్లు ఎందుకు వాటిని విస్మరించినట్టు?    ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్ న్యూస్‌పోస్ట్ ఇండియా ఈ టేపులను బయట పెట్టడమేమిటి? ట్వీట్టర్‌లోనూ, ఫేస్‌బుక్‌లోనూ మాత్రమే దీని గురించి చర్చ జరగడమేమిటి? మహా మహా జాతీయ పత్రికలూ, చానెళ్లూ ఏమయినట్టు? శనివారం నాడు 'ఓపెన్', 'అవుట్‌లుక్' వారపత్రికలు వచ్చేవరకు దినపత్రికలు ఏమి చేసినట్టు? పత్రికల మధ్య సర్క్యులేషన్ పోటీ, చానెళ్ల మధ్య టీఆర్‌పీ పోటీ ఎక్కడికిపోయినట్టు?

పత్రికలు కానీ,పాత్రికేయులు కానీ రాజకీయ పరిణామాలకు వెలి గా ఉండవలసిన అవసరమేమీ లేదు. పత్రికా రంగం భావ ప్రచారానికి, ప్రసారానికి సంబంధించినది. ఒక ఉద్యమాన్ని సమర్థించడం కానీ, రాజకీయపార్టీకి అనుకూలంగా వ్యవహరించడం కానీ జాతీయోద్యమ కాలం నుంచి ఉన్నవే. రాజకీయ సంక్షోభాలు వచ్చినప్పుడు, పరిపాలనాపరమైన సమస్యలు వచ్చినప్పుడు నేతలు, అధికారులు పాత్రికేయు ల సూచనలనూ సహకారాన్నీ తీసుకోవడం సహజమే. ఒక్కొక్కసారి సలహాలు కూడా తీసుకోవడం జరిగేదే.    అయితే, ఈ సంబంధానికి ఒక పరిమితి ఉన్నది. స్వీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, వృత్తిపరమైన సంబంధాన్ని అనుబంధంగా మలచుకోవడం అపచారం. కార్పొరేట్ వ్యవస్థ తనకు ప్రయోజనం కలిగించే మనుషులను మంత్రివర్గంలో పెట్టుకోవాలనుకోవడం ఒక దుర్మార్గం అయితే, అందుకు అనువుగా చక్రం తిప్పే ప్రయ త్నం పాత్రికేయులు చేయడం దారుణం.  దేశానికి లక్షా70వేల కోట్ల నష్టం కలిగించిన ఒక మంత్రిని ఎన్నికల అనంతరం తిరిగి అదే పదవిలో ప్రతిష్ఠింపజేయడానికి, ఆ కుంభకోణం లబ్ధిదారులే ప్రయత్నించగా, ఆ ప్రయత్నంలో పాత్రికేయులూ భాగం తీసుకున్నారు. ఇది ఒక లాబీయింగ్ అయితే, ఆ మంత్రికి తిరిగి ఆ శాఖ దక్కకుండా ప్రత్యర్థి కార్పొరేట్ సంస్థ (ఎయిర్‌టెల్-భారతీ మిట్టల్) ప్రయత్నించినట్టు ఈ సంభాషణలే సూచిస్తున్నాయి.

మరి, 2-జి స్కామ్‌ను బయటపెట్టి, రాజాను పదవీభ్రష్టుడిని చేసిన కథనాల వెనుక ఆ ప్రత్యర్థి తరఫున పనిచేసిన పాత్రికేయులున్నారా? ప్రజాప్రయోజనాలు కాకుండా, కార్పొరేట్ యుద్ధాలే సంచలన కథనాలను వెలికితెస్తున్నాయా? అదే నిజమయితే, పత్రికల్లో, చానెళ్ల లో వస్తున్న సాహసోపేతమైన కథనాలను, ఉదాత్త ప్రవచనాలను ఇకమీదట నమ్మగల మా? టీవీల్లో ఏచర్చ ఎందుకు జరుగుతోందో, ఏ కుంభకోణం ఎందువల్ల వెలుగుచూస్తోందో అర్థం కాక, అన్నిటినీ అనుమానిస్తూ ఉండవలసిందేనా?

మీడియాలో విలువల క్షీణత స్పష్టంగా కనిపిస్తున్నదే అయినప్పటికీ, దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో- పాత్రికేయుల వృత్తి బాహ్యమైన ప్రవర్తన వెలుగులోకి రావడం కలవరం కలిగిస్తున్నది. రాజకీయాలంటే, మరమ్మత్తు సాధ్యంకానంతగా కుళ్లిపోయాయి కానీ, మీడియా తనను తాను సరిదిద్దుకోవడం, పూర్వ ప్రతిష్ఠను పొందడానికి ప్రయత్నించడం సాధ్యమే. అది ప్రజాస్వామ్యానికి మాత్రమే కాదు, మీడియా భవిష్యత్తుకు కూడా అత్యవసరం.

2 comments:

 1. జయహొ said...

  శ్రీనివాస్ గారు, ఈ రోజు మీరు రాసిన వ్యాసం చదివాను. మీ మైల్ ఐ.డి. లేక పోవటం వలన నా వ్యాఖ్యను ఇక్కడ ప్రచూరిస్తున్నాను.
  https://www.andhrajyothy.com/editorial.asp?qry=dailyupdates/editpagemain
  వీర్ సాంఘ్వి చాలా పెద్ద పాత్రికేయుడు. జాతీయస్థాయి ఆంగ్ల సంపాదకుడు. బర్ఖాదత్ సాహసి అయిన నూతన తరం టీవీ మీడియా పర్సన్, తొలితరం వార్తాచానెల్ అయిన ఎన్‌డీటీవీతో ముడిపడిన పేరు, ప్రణయ్‌రాయ్ బృందం మీద ఆంగ్ల వార్తాచానెళ్ల వీక్షకులకున్న గౌరవంలో, అభిమానంలో ఈమె వాటా పెద్దది.
  ----------------------------------------------
  వీర్ సాంఘ్వి మీరు ఇతనిని హోదా చూసి ఆయనను పెద్ద పాత్రికేయుడను కోవచ్చు కాని ఇతను రాసిన వాటిని చూసి దేశ భక్తి ఉన్న ఏ మధ్య తరగతి భారతీయుడు ఆయన ని పెద్ద పాత్రికేయుడు అని అనుకోరు.
  హైక్లాస్ సోసైటి నచ్చేవిధం గా టి.వి. షోస్ నడిపే ఇతని జీవన శైలి మీకు తెలియదా! ఇతనొక పెద్ద పాత్రికేయుడా! అలా రాసి మన తెలుగు వారి ప్రతిభని అవమానించకండి. మన పేపర్లలో వచ్చే వ్యాసాలు ఏ జాతీయ పత్రికలకు తీసి పోవు. తెలుగు వారు జాతీయ స్థాయి మీడియాలో లేక పోవటం వలన చాలా అవమానాలకు గురి అవుతున్నారని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. వీరికి వచ్చినది చక్కని ఇంగ్లిష్,రాసేవి చెత్త వ్యాసాలు,చేసె పనులు ఇప్పుడందరికి బహిరంగం గా తెలిసాయి. ఇతనికి తెలుగు వారంటె ఎంత చిన్నచూపో పి.వి. నరసిం హా రావు చని పోయినపుడు ఇతను హిందు స్థాన్ టైంస్ లో రాసిన వ్యాసం చదవండి. పి.వి. గారు చని పోయినపుడు నాకు తెలిసి ఆయనను విమర్శించిన *ఏకైక జర్నలిస్ట్* ఇతనొక్కడే.పి.వి. గారి తో పాటుగా ఇతను పి.వి.ఆర్.కే. ప్రసాద్, విజయ రామారావు గార్లను ఎమ్మనాడొ చదవండి. ఇతని వెబ్ సైట్ ఎంతో మంది పి.వి. ని సపోర్ట్ చేస్తూ రాస్తున్నా ఆయనని తెగనాడటం ఇప్పటివరకు మానుకొనని వ్యక్తి. మంచి లూక్స్ మైంటైన్ చేస్తూ కొత్త కొత్త హీరోయిన్ లను, సెలబ్రిటిలను ఇంటర్వ్యులు చేసుకొంట్టూ, హెచ్. టి. ఆదివారం అనుబందం లో ఏ హోటల్ లో ఏ ఐటెం బాగుంట్టుంది లాంటివి రాసుకొంట్టూ ఉంట్టారు ఈ పెద్ద పాత్రికేయుడు.

  http://www.rediff.com/news/jan/04vir.htm
  His crooked sons held court at 5 Race Course Road where such PMO flunkies as P V R K Prasad turned up to genuflect. The CBI became an Andhra restaurant where a willing Vijaya Rama Rao served up whatever Narasimha Rao desired.
  Please read this also
  http://www.virsanghvi.com/CounterPoint-ArticleDetail.aspx?ID=414

  ReplyDelete
 2. Please see this video.

  http://www.youtube.com/watch?v=56viHV3bwyo

  http://www.facebook.com/indiamediawatch

  ReplyDelete