Monday, November 29, 2010

వంశ ప్రతిష్ఠ ఉండగా, వృథాప్రయాస ఎందుకు?

మందబుద్ధులయిన రాజపుత్రులకు కాస్త వివేకాన్ని లోకజ్ఞానాన్ని అందించాలని ఓ రాజుగారు విష్ణుశర్మ అనే పండితుడిని పురమాయిస్తే 'పంచతంత్రం' అనే గొప్ప కథాసాహిత్య గ్రంథం తయారయింది. యుక్తవయస్సు రాగానే పట్టాభిషేకం చేయబోతే, లోకానుభవం గడించి వచ్చాక రాజునవుతాను లెమ్మని రాకుమారులు ఒంటరిగానో ఓ విదూషక మిత్రునితోనో దేశాటనానికి బయలుదేరే వారని చందమామ కథల్లో చదువుకున్నాము. అంటే, రాజుగారి కడుపున పుట్టినంత మాత్రాన రాజ్యయోగ్యత వచ్చినట్టు కాద ని, అందుకు ఇతర అర్హతలు కూడా ఉండాలనీ మన సంప్రదాయం భావిస్తుందన్న మాట. రాహుల్‌గాంధీకి కూడా ఆ సంప్రదాయం మీద గౌరవం ఉన్నట్టుంది కాబట్టే, ప్రధానమం త్రి స్థానానికి ఎగబడిపోకుండా రాజకీయాలను అభ్యసిస్తూ ప్రొబేషన్‌లో నిరీక్షించాలని భావిస్తున్నారు. సరికొత్త రాజకీయ యువతరాన్ని నిర్మిస్తూ, చిన్న చిన్న విజయాలు సాధి స్తూ, రాజ వంశీకుడిగా తనకు లభించే ప్రత్యేక సదుపాయాలను, ప్రచారాన్నీ స్వీకరిస్తూనే ఒక విశ్వసనీయతను, ఆమోదనీయతను సాధించాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తున్నది. ఆ వ్యూహ సాధనకు సాధారణ ఎన్నికలు జరిగే 2014 సంవత్సరాన్ని గడువుగా భావిస్తున్నారు. కాకపోతే, ఆయన మనసులోను, ఆయన మాతృమూర్తి ఆకాంక్షల్లోనూ ఉన్న దీర్ఘకాలిక వ్యూహం అనుకున్న ఫలితాలను సాధిస్తున్నట్టు కనిపించడంలేదు.

నెహ్రూ వంశగౌరవం ఆధారంగా నేరుగా రాజకీయాల్లోకి, అగ్రస్థానానికీ వెళ్లకుండా, దీర్ఘకాలికమయిన ప్రస్థానాన్ని ఎంచుకోవడమే రాహుల్‌గాంధీ చేసిన పొరపాటేమో అనిపిస్తుంది. రాహుల్‌గాంధీ ప్రధాని కాకుండా అడ్డుకుంటున్నదెవరు? ఎందుకని 2014ను అందుకు లక్ష్యంగా నిర్ణయించాలి? 2004లో పరిస్థితి వేరు, ఎన్నికల నాటికి రాహుల్ రాజకీయ ప్రవేశం జరిగి కొన్ని నెలలు మాత్రమే గడిచాయి. 2009లో ఆయనను ప్రధానిచేస్తే ఎవరు అభ్యంతర పెట్టేవారు? 2007లోనే ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు, యువజన, విద్యార్థి విభాగాలను ఆయన ప్రక్షాళన చేయడం ఆరంభించారు. యుపి ఎన్నికలలో కాంగ్రెస్ పరిస్థితిని గణనీయంగా మెరుగుపరిచిన కీర్తి కూడా సంపాదించారు. వచ్చే 2014లో అయినా, కాంగ్రెస్ కూటమే అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన ఎన్నిక కావడానికి ఉన్న అవరోధమేమిటి? నిజానికి అభ్యంతరాలూ అవరోధాలూ ఏమీ లేవు. సోనియాగాంధీ ప్రధాని కావడానికి ఉన్న అభ్యంతరా లు రాహుల్‌కు ఉండవు. కాంగ్రెస్‌పార్టీలో ఆనువంశిక నాయకత్వం కొత్తదేమీ కాదు. కానీ, సోనియాగాంధీ కానీ, రాహుల్‌గాంధీ స్వయంగా కానీ, కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ ఉండే లోక్‌సభను లేదా ఒకటిరెండు పార్టీలతో తప్ప భాగస్వామ్యం అవసరం లేని భారీబలాన్ని
ఆశిస్తున్నారు.  అటువంటి పరిస్థితిలో మాత్రమే రాహుల్‌గాంధీ పగ్గాలు చేపడితే, తిరిగి తిరుగులేని కాంగ్రెస్ ఆధిపత్యం స్థిరపడుతుందని వారు భావిస్తున్నారు. 2014లో కాంగ్రె స్ నేతృత్వంలోని యుపిఎ వంటి కూటమిని తిరిగి అధికారంలోకి తేవడం అనే లక్ష్యం కాక, ప్రభుత్వ ఏర్పాటులో, విధాన నిర్ణయాలలో కాంగ్రెస్‌కు పూర్తి వెసులుబాటు ఉండే ప్రభుత్వాన్ని వారు స్వప్నిస్తున్నారు. దురదృష్టవశాత్తూ, అటువంటిది సాధ్యమయ్యే సూచన లు కనిపించడం లేదు. రాజశేఖరరెడ్డి చివరి కోర్కెను నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి 41 మంది ఎంపీలను గెలిపించగలిగినా సరే, అది సాధ్యం కాకపోవచ్చు. నలభయ్యొక్క మందిని గెలిపించడం సాధ్యమేనా అన్నది మరో ప్రశ్న.

భారతదేశంలో మళ్లీ ఒకే ఒక పార్టీ అధికారంలోకి వచ్చే రోజులు వస్తాయా? రావాలని ఆశించే పార్టీలు చాలానే ఉండవచ్చును కానీ, కాల స్వభావాన్ని గుర్తించినవారు అది అత్యాశేనని అంగీకరిస్తారు. 1991లో రెండువిడతల ఎన్నికల మధ్యలో రాజీవ్‌గాంధీ హత్య జరగడం వల్ల రెండు రకాల ఫలితాలు వచ్చాయి కానీ, ఆ దుస్సంఘటనే జరగకపోయి ఉంటే బహుశా బిజెపికి మెజారిటీ వచ్చి ఉండేదేమో, లేదా చిన్నపాటి బయటి మద్దతుతో అధికారంలోకి వచ్చేదేమో.  అలా జరగలేదు. రాజీవ్ సానుభూతి కాంగ్రెస్‌ను అధికారానికి చేరువ చేసింది. అయినా సరే మైనారిటీ ప్రభుత్వమే. 1991 తరువాత భారతదేశంలో ఏకపార్టీ మెజారిటీ లేనేలేదు. సంకీర్ణ రాజకీయాల యుగం ఇప్పుడు స్థిరపడిం ది. అది యాదృచ్ఛికం కాదు. యుగస్వభావం. మండల్ రాజకీయాలు హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ను నామమాత్రం చేశాయి. దేశమం తా ప్రాంతీయశక్తులు బలం పుంజుకున్నాయి. ప్రపంచీకరణకు సానుకూలమైన రాజకీయ స్థితి ఇది. అంతే కాదు, ప్రపంచీకరణకు ప్రతిస్పందనగా వెల్లువెత్తిన ఐడెండిటీ రాజకీయాల పర్యవసానమూ అది. కేంద్రంలోనే కాక, రాష్ట్రాల్లోనూ సంకీర్ణ ప్రభుత్వాలు అనివార్యం అయ్యే పరిస్థితి నెలకొనగా, ఇప్పుడు తిరిగి కాలాన్ని వెనక్కి తిప్పి ఏకపార్టీ మెజారిటీ యుగాన్ని అవతరింపజేయడం సాధ్యమా? హిందీరాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయడానికి రాహుల్‌గాంధీ రెండు ప్రయత్నాలు చేశారు. యుపిలో చేసిన ప్రయత్నం ఒక మేరకు విజయాన్ని అందించింది.

ఎనభై పార్లమెంటరీ స్థానాల్లో పది మాత్రమే కాంగ్రెస్ చేతిలో ఉన్న స్థితిని ఇరవై స్థానాల స్థాయికి రాహుల్ తీసుకురాగలిగారు. అది నూరుశాతం మెరుగుదలే అయినప్పటికీ, కాంగ్రెస్‌కు, నెహ్రూ-ఇందిర కుటుంబానికి కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లో పాతికశాతం స్థానాల్లో విజయం అన్నది గర్వించదగ్గదేమీ కాదు. దళిత-బహుజన రాజకీయా లు ప్రధాన స్రవంతికి వచ్చి, అధికార పీఠాన్ని కూడా అందుకున్న ఉత్తరప్రదేశ్‌లో ఎప్పటికయినా కాంగ్రెస్ పూర్వవైభవాన్ని అందుకోగల దా? 2012లో యుపిలో ఎన్నికల కోసం ప్రత్యేకమైన ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా?- అని అడిగినప్పుడు రాహుల్‌గాంధీ- అటువంటిదే మీ లేదన్నారు.  2012, 2020 వంటి సంవత్సరాలకేమీ ప్రాధాన్యం లేదు. కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ తెచ్చుకున్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, అంతే. అన్నారాయన. యుపిలో కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వానికి రావడమా? అదెప్పటికైనా సాధ్యమా? తాజాగా, బీహార్‌లో ఏమయింది? ఇక్కడా కాంగ్రెస్ సొంతంగా పోటీచేసింది. లాలూకు అంటిన మరకల నుంచి ఎడంగా ఉండడం ఒక ఉద్దేశ్యం కాగా, యుపిలో లాగానే, సొంత కాళ్లమీద నిలబడే ప్రయత్నం చేయడం ప్రధాన వ్యూహం. ఫలితం దారుణంగా ఉన్నది.   రాహుల్ మంత్రం ఏమయింది? ఒక్కొక్క రాష్ట్రాన్నీ జయించి, అంతిమంగా ఢిల్లీని పట్టుకోవాలనే వ్యూహంలోనే ఏదో అవాస్తవ దృష్టి ఉన్నది. తమిళనాడు, బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, అస్సాంలలో వచ్చే ఏడాది ఎన్నికలున్నాయి. పంజాబ్, యుపి, ఉత్తరాఖండ్‌లలో ఆ పై ఏడాది ఎన్నికలలు జరుగుతాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో 2013లో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్,ఒరిస్సా, రాజస్థాన్‌ల అసెంబ్లీలకు, లోక్‌సభకు 2014లో ఎన్నికలున్నాయి.  ఈ అన్ని ఎన్నికలలో ఏవేవో స్థానికమయిన వ్యూహాలను అమలుచేసి, కొన్నిటిలో విజయాలను, కొన్నిటిలో అర్థవిజయాలను, మరికొన్నిటిలో పరాజయాలను ఎదుర్కోవలసి వచ్చే రాహుల్ అంతిమంగా తిరుగులేని నేతగా అవతరించగలరా? తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి, దేశానికి ఆశాజ్యోతిగా నిలబడడానికి రాహుల్ ఏమిచేస్తున్నారు? దళితవాడల్లో బసచేయడం, గిరిజనులతో నృత్యాలు చేయడం, పొదుపు బృందాలను ప్రోత్సహించడం, మైక్రోఫైనాన్స్‌ను పెద్ద విముక్తి మార్గంగా బోధించడం వంటివి కాక ఆయన చేస్తున్నదేమిటి? తనకంటూ ఒక సొంత అనుచరశ్రేణిని జాతీయస్థాయిలో నిర్మించుకోవడానికి యువజన, విద్యార్థి కాంగ్రెస్‌లలో సభ్యత్వం నమోదును ఒక ఉద్యమంగా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చూస్తే, యువజన నేతలుగా ముందుకు వచ్చే వారిని గమనిస్తే- రాహుల్‌ముద్ర ఏమీ కనిపించదు. వ్యవస్థ ఎటువంటి వారిని నాయకులుగా ముందుకు తోస్తుందో అటువంటివారే కాంగ్రెస్ కొత్త తరంలోనూ కనిపిస్తున్నారు. త్వరితగతిన లాభాలను, తక్షణ ప్రయోజనాలను, శీఘ్ర ఫలితాలను ఆశించే తరం- నిరాడంబరంగా, స్వార్థచింతన లేకుండా సుదీర్ఘకాలం అధికారపీఠాల కోసం నిరీక్షించే స్థితిలో ఉంటారా? ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి పంటే పండుతుంది.

కాంగ్రెస్ కానీ, యుపిఎ కానీ ఎటువంటి ఆర్థిక, అభివృద్ధి విధానాలను అనుసరిస్తున్నదో, ఎవరి లబ్ధి కోసం విధానాలను అమలుచేస్తున్నదో తెలియనిది ఎవరికి? గిరిజన ప్రాంతాల్లో వనరుల ను కార్పొరేట్లకు అప్పగించడం ఆర్థికవిధానంగా, అందుకు అవరోధాలను తొలగించడం హోంమంత్రి విధానంగా కొనసాగుతున్నప్పుడు- గిరిజనులకు ఉద్ధారకుడుగా రాహుల్ ను ఎవరు చూడగలరు? ఒక్క నియాంగిరీలో ప్రచారం కోసమో, పేరు కోసమో నిర్ణయా న్ని మార్చుకున్నంత మాత్రాన దేశవ్యాప్తంగా ఉన్న నియాంగిరీల సంగతేమిటి? స్వచ్ఛం ద సంస్థల కార్యకర్త వలె, అవాస్తవికమైన ఆదర్శాలు మాట్లాడే అమాయక రాజకీయవాది వలె కనిపిస్తే- దేశాధినేత కాగలవ్యక్తిగా ఆయనను గుర్తించేదెవరు? సంఘ్‌పరివార్‌ను, సిమిని పోల్చి ఒక వివాదం సృష్టించాడు. కాంగ్రెస్ సెక్యులరిజం గురించి మాట్లాడుతుం ది కాబట్టి, అటువంటి వ్యాఖ్యను అర్థంచేసుకోవచ్చు. ఇప్పుడు నరేంద్రమోడిని, మావోను పోల్చి మరో వ్యాఖ్య చేశారు. తోచిన పేర్లను వల్లించడమేనా, చరిత్ర తెలుసుకుని మాట్లాడేదేమైనా ఉందా? అన్న సందేహం వస్తున్నది. కాబట్టి, బుద్ధిమంతుడైన పిల్లవాడిలా పరీక్ష ప్యాస్ అయి, అందరితో పాటు క్యూలో నిలబడి అవకాశాలను అందుకోవాలన్న ఆదర్శాన్ని వదిలిపెట్టి, ఎంతో కొంత బలంతో కాంగ్రెస్ పార్టీ నేతగా ఎన్నికయ్యే ప్రయత్నం చేయడం రాహుల్‌కు మంచిది. ఆయన మౌలికమయిన, అంతిమమయిన అర్హత ఆ కుటుంబానికి చెందడమే కదా?

No comments:

Post a Comment