Tuesday, December 14, 2010

ఏలినవారికి ఏకాంత భంగం!

ప్రపంచీకరణ తొలిరోజుల్లోని పారవశ్యం గుర్తుందా? ఎల్లలన్నీ కల్లలైపోతాయి. లోకపు పిడికిలి ముడుచుకుపోతుంది. చెక్‌పోస్టులులేని అంతర్జాతీయ ర హ దారులు విస్తరిస్తాయి. చరిత్ర ముగిసిపోతుంది. నాగరికతల మధ్య అంతిమ యుద్ధం మొదలవుతుంది. స్థల కాలాలకు అర్థాలు మారిపోతాయి. వేళ్లు తెగిన సమూహాలు కొత్తకొత్త స్నేహాలతో వర్చువల్ కమ్యూనిటీలు అవతరిస్తాయి. ఫ్లైబైనైట్ వైమానికులు మార్కెట్లను బ్రీఫ్‌కేసుల్లో మోసుకు తిరుగుతారు. అమెరికా అయినా ఆఫ్రికా అయినా, హూస్టన్ అయినా హైదరాబాద్ అన్ని భాషల్లోనూ అ అంటే అభివృద్ధే. గ్రోత్‌రేట్ రేసుల్లో అందరికీ రెండంకెల పతకమే. అన్ని భవనాలమీదా డాలర్ పతాకమే. హద్దులులేని సంపదలో ప్రపంచం ఓలలాడుతుంది. లాభం అట్టడుగులకు ఇంకిపోయి బడుగులు సైతం బాగుపడతారు.

మరి అదంతా జరిగిందా? కొంత జరిగింది, కొంత జరగలేదు. ప్రక్రియ జరుగుతూనే ఉంది, ఫలితం భిన్నంగా ఉంది. అనుకున్నవి కాక అనుకోనివి కూడా జరిగా యి. సంక్షేమం స్థానంలో లాభం వెలిసింది. పేదలకు సబ్సిడీలుపోయి పెద్దలకు రాయితీలు వచ్చాయి. హత్యలు తగ్గి ఆత్మహత్యలు పెరిగాయి. స్వతంత్ర దేశాల గుండెల మీద పరమ స్వతంత్ర సంస్థానాలు వెలిశాయి. భూగర్భంలో దాక్కున్న వనరులకు కూడా రెక్కలు వచ్చాయి. తీర ప్రాంతాలపై పెట్టుబడుల సునామీ విరుచుకుపడుతున్నది. ఎల్లలులేని సామ్రాజ్యవాదీ, హద్దులు లేని ఉగ్రవాదీ చెరో ధ్రువం మీదా నిలబడ్డారు.

స్టాక్‌మార్కెట్‌కు ఏ దేశంలో పడిశెం పట్టినా మన దేశంలోనూ తుమ్ముతున్నారు. మనుషులందరూ ఒకే పొడవుండడానికి కొందరు కాళ్లు నరుక్కుంటున్నారు, మరికొందరు మెడలు సాచి ఎత్తు పెంచుకుంటున్నారు. న్యాయదేవత కూడా ప్రపంచభాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. వ్యాపారం గురించి వ్యవహారం గురించి బోధించే ప్రపంచ ప్రభువులే హక్కుల గురించి సామాజిక భద్రత గురించి సమ్మిశ్రిత అభివృద్ధి గురించి సూక్తిముక్తావళి రచిస్తున్నారు. ఏవి సాధించాలో, ఏవి అనుభవించాలో, దేన్ని ప్రతిఘటించాలో అంతా వారే డిక్టేట్ చేస్తున్నారు. లైసెన్స్ రాజ్యంలో కొంత అవినీతి న్యూసెన్స్ ఉన్నమాట నిజమే. మిశ్రమార్థిక విధానమూ, విచక్షణారహిత లాభార్జనపై ఉన్న బ్యూరోక్రటిక్ ఆంక్షలూ-మనదేశాన్ని గ్లోబల్ పరిభాషలో వెనుకంజలో ఉంచాయోమే కానీ, కొంత వరకు సురక్షితంగా కూడా ఉంచాయి.

మత మౌఢ్యంలో ఉన్న దేశాలు కనీసం ఆర్థిక దోపిడీకి సాపేక్షంగా దూరంగా ఉండగలిగినట్టు, దీవులు దాటి వెళ్లని ఆదిమజాతులు తమదైన నిర్వచనంలో సుఖంగా ఉంటున్నట్టు- భారతదేశం కూడా ఎంతో కొంత భద్రంగా ఉండింది. భౌగోళిక సరిహద్దులే కాదు, ఆర్థిక సాంస్కృతిక సరిహద్దుల దగ్గర ఏదో ఒక సైనికపటాలం కాపలా ఉంటూ వచ్చింది. మన లాంటి అనేక ఇతర దేశాలను చేసినట్టే, ప్రపంచీకరణ భారత్‌ను కూడా నిరాయుధంగా నిలబెట్టింది. రక్షణలన్నీ చేతులారా కూల్చుకునేట్టు చేసింది. సగం చచ్చి ఉన్న పాకిస్థాన్ నుంచి కాపాడుకోవడానికి పశ్చిమ సరిహద్దులో సైన్యం ఉందేమో కానీ, అక్కడా ఇక్కడా హక్కులనో వేర్పాటునో కోరుతున్న సాయుధ తిరుగుబాటుదారులను అణచివేయడానికి భద్రతా దళాలున్నాయేమో కానీ- ఆర్థిక సాంస్కృతిక హద్దులకు కాపలాదారులే లేరు. తలుపులు బార్లా తెరచే ఉన్నాయి.

అట్లా తలుపులు బార్లా తెరిపించడానికి ఉద్దేశించిన అనేక సంస్కరణల్లో ఒకటి సమాచారహక్కు సంస్కరణ. మన దేశంలో సమాచారహక్కు కోసం స్థానికంగా జరిగిన పోరాటాల గురించి తక్కువ చేయనక్కరలేదు. అరుణారాయ్ వంటి వారు చేసిన, సాధించిన పోరాటం, విజయం వేరు. ఇప్పుడు దేశమంతటా ఏర్పాటైన సమాచారహక్కు వ్యవస్థ వేరు.

ప్రపంచంలోని అనేక దేశాల్లో ఏకకాలంలో విధించిన సంస్కరణల్లో సమాచారహక్కు సంస్కరణ ఒకటి. పారదర్శకత సత్పరిపాలనకు కీలకమని, ప్రాణమని మనకు బుద్ధులు చెప్పి, అందులో భాగంగా ప్రభుత్వ వ్యవస్థల దగ్గర ఉన్న సమాచారాన్ని అరక్షితం చేసిన సంస్కరణ అది. ఆ సంస్కరణ వచ్చిన తరువాత దాన్ని ప్రజోపయోగం కోసం వినియోగించుకోవడం వేరు.

అమెరికాలో ఎప్పుడో జరిగిన రాజ్యాంగపు ఫస్ట్ ఎమెండ్‌మెంట్‌కు ఉన్నట్టుండి విపరీత ప్రచారం కల్పించి, ప్రపంచ వ్యాప్తంగా సమాచార స్వేచ్ఛ గురించిన చర్చ ను లేవదీశారు. భౌగోళిక, రాజ్య సరిహద్దులు లేని ఇంటర్నెట్ సమాచార విప్లవ యుగంలో సమాచారం కూడా నిర్నిబంధం కావలసిందే. మూడో ప్రపంచ దేశాలలోని సమాచారం ఆ దేశ ప్రజలకు, వ్యాపారులకు మాత్రమే కాదు, గ్లోబల్ వ్యాపారులకు కూడా సులువుగా అందుబాటులో ఉంచడం అవసరమయింది. ప్రపంచ ప్రభువులు నిర్వర్తించే గ్లోబల్ గూఢచర్యానికి కూడా ఈ సమాచార విప్లవం అవసరం. అన్ని దేశాలూ స్వచ్ఛందంగా సమాచారాన్ని బయటపెట్టాలి, బయటపెట్టని రహస్యాలుంటే ఆయా దేశాల మీడియా, ప్రతిపక్షాలూ బయటపెట్టాలి, అట్లా వెల్లడయిన సమాచారం ఆ దేశాల విషయంలో అనుసరించే అంతర్జాతీయ వ్యూహానికి సహాయపడాలి. కానీ, అదే తిరగబడితే? ఇదే సమాచారహైవే, ఇదే హద్దులు లేని అంతర్జాలం, ఇదే సమాచార స్వేచ్ఛా కార్యకర్త- తిరగబడి అగ్రరాజ్య పు సమాచారాన్నే లాగి బయటపెడితే? వ్యవస్థకు శత్రువు కూడా ఆ వ్యవస్థలోనే పుడుతుందట. 'వికీలీక్స్' చేసింది అదే. అది ప్రపంచ ప్రభువునే నగ్నం గా నిలబెట్టింది.

గుట్టుగా తమ దేశాన్ని తమకు తోచిన పద్ధతిలో నడుపుకుంటున్న దేశాల ఏకాంతాన్ని స్వతంత్రతనీ దెబ్బతీసినప్పుడు కనిపించని ప్రైవసీ హక్కు ఇప్పు డు అమెరికాకు గుర్తు వస్తున్నది. అది ఒక అగ్రరాజ్యం కాబట్టి హక్కుల గురించి మాట్లాడకపోవచ్చు కానీ, వికీలీక్స్ సారథిని టెర్రరిస్టు అనగలదు, దౌత్య రహస్యాలను వెల్లడించడం దేశ ద్రోహమనీ అనగలదు.

అట్లాగే, దేశంలో స్వతంత్ర మనుగడలో ఉన్న రైతాంగాన్ని, ఆదివాసీలను వారి వారి స్థావరాలనుంచి తరిమివేసినప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థను తమ స్వీయ ప్రయోజనాల కోసం పణం పెడుతున్నప్పుడు గుర్తుకు రాని హక్కులు ఈ దేశ ప్రభువులైన టాటాలకూ అంబానీలకూ కూడా గుర్తుకు వస్తున్నాయి. దేశాన్ని ఎట్లా నష్టపరుద్దామా, ఎట్లా ప్రజల వనరులను తమ ఖాతాలో వేసుకుందామా అన్న విషయాలే వ్యక్తిగత విషయాలుగా మారి పైరవీకార్లతో, మంత్రులతో, ప్రభు త్వ పెద్దలతో మాట్లాడుతున్న పారిశ్రామికవేత్తలు, తమ సంభాషణలకు రక్షణ కావాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

స్వేచ్ఛను కోరేవారి ఇళ్లలోకి, జీవితాల్లోకి, వారి కంప్యూటర్లలోకి, అక్షరాల్లోకీ చొరబడి, దేశద్రోహాల గురించి అన్వేషించే నిఘావర్గాలు ఉల్లంఘిస్తున్న హక్కుల గురిం చి ఎవరికీ అవసరం లేదు. ఊళ్లు పంచుకునే పవిత్ర కార్యక్రమాన్ని మాత్రం పరులెవరూ వినకూడదని, విన్నా బయటకు పొక్కకూడదని పెద్దలు ఆశిస్తున్నారు.

1 comment: