Wednesday, December 21, 2011

వాణిజ్య తారలే భారతరత్నాలా?

 
జస్టిస్ మార్కండేయ కట్జు అంటే ముక్కుసూటితనానికి, కటువైన విమర్శలకు మాత్రమే కాక, ఎన్నో ప్రగతిశీలమైన, సాహసోపేతమైన తీర్పులకు కూడా పేరుపొందిన వారు. భారతీయ సమాజం పరివర్తనాదశ గురించి, అందులోని సమస్యల గురించి ఆయనకున్న అవగాహన విశేషమైనది. ప్రెస్‌కౌన్సిల్ చైర్మన్‌గా ఆయన మీడియా లోపాల గురించి, స్వయంనియంత్రణ ఆవశ్యకత గురించి మాట్లాడినప్పుడు, ఆ మాటలతో విభేదించేవారు సైతం ఆ అభిప్రాయాలను గౌరవిస్తూ మాట్లాడారు. మీడియా ప్రాధాన్యాల గురించి ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలపై మాత్రం జరగవలసినంత చర్చ జరగలేదు. సీనియర్ సినీనటుడు దేవానంద్ మరణవార్తకు జాతీయ పత్రికలు అవసరానికి మించి ప్రాధాన్యం ఇచ్చాయని, దేశంలో రైతుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరుగుతుంటే, ప్రజాప్రాధాన్యం ఉన్న అనేక సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా, సెలబ్రిటీలవార్తల వైపు మొగ్గు చూపుతున్నాయని కట్జు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మరీ కొత్తవి కాకపోవడం కూడా చర్చ జరగకపోవడానికి కారణం కావచ్చు.

ప్రెస్‌కౌన్సిల్ చైర్మన్ స్వయంగా అట్లా మాట్లాడడం మాత్రం కొత్త విషయమే. అభివృద్ధి, గ్రామీణ వ్యవహారాల పాత్రికేయులు పి.సాయినాథ్ కూడా అటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశరాజధానిలో జరిగిన ఒక ఫ్యాషన్ ఈవెంట్‌కు హాజరైన పాత్రికేయుల సంఖ్యను, ఒరిస్సాలోని కలహండి దుర్భిక్షప్రాంత స్థితిని రిపోర్టు చేయడానికి వెళ్లిన పాత్రికేయుల సంఖ్యను ఆయన పోల్చి మీడియా ప్రాధాన్యాల గురించి నిశితమైన విమర్శ చేశారు. మీడియా ఫలానా అంశం మీద తీసుకునే వైఖరి, ఫలానా రాజకీయపక్షం విషయంలో అనుసరించే విధానం వివాదాస్పదం కావడం ఇటీవలి కాలంలో పెరిగింది. కానీ, మొత్తంగా మీడియా సంఘటనలను, పరిణామాలను

Wednesday, December 14, 2011

కీర్తి వారసత్వం: కిస్సా కుర్సీ కా

కడుపున పుడితేనే వారసులవుతారని మన ధర్మశాస్త్రాలు కూడా చెప్పలేదు. మానసపుత్రులూ దత్తపుత్రులూ అంటూ రకరకాల వారసులుంటారని అవి చెప్పాయి. ఆస్తులూ భూములూ ఒక్కోసారి రాజ్యాలూ తండ్రులనుంచి కొడుకులకు, చాలా అరుదుగా కూతుళ్లకు సంక్రమించడం ఆనవాయితీయే. పెద్దకొడుకు అంత ప్రయోజకుడు కాకపోతే, వారసత్వం కోసం కొడుకుల మధ్య పోరాటం జరిగితే, అందులో సమర్థుడైనవాడినే ప్రజలు సమర్థించడం అరుదేమీ కాదు. కానీ, ప్రజాస్వామ్యయుగంలో నేతల ప్రతిష్ఠ, జనాకర్షణల వారసత్వం కోసం జరిగే పోరాటం అంత సూటిగా కత్తియుద్ధాలతో సాగదు. పార్టీలు, సంస్థలు చీలిపోయినప్పుడు కూడా ఉమ్మడివారసత్వంలో ఎవరి వాటా ఎంత అన్న వివాదంలో, ఆఫీసు భవనాల కోసం ఎన్నికల గుర్తుల కోసం జెండాల కోసం కోర్టుల్లో వ్యాజ్యాలు నడిచినప్పటికీ, నిర్ధారణ మాత్రం ప్రజాక్షేత్రంలో జరిగిపోతుంది. పెద్దల నీడలో పెరిగి, వారి మార్గాన్నే కొనసాగించేవారికి వారసత్వంలో సమస్యలేమీ రాకపోవచ్చును కానీ, తిరుగుబాటు చేసి వారసత్వాన్ని గ్రహించాలనుకునేవారు మాత్రం సమాజం ఆమోదం కోసం చాలా ప్రయాస పడవలసి వస్తుంది. ఎన్ని యుద్ధాలు చేసి గద్దెనెక్కినవారు సైతం ఏదో ఒక పరంపరతో తమను తామే అనుసంధానించుకోకుండా పరిపాలనాహక్కును పొందడం కష్టం.

స్టాలిన్ అనంతరం సోషలిస్టు రష్యాలో అధికారాన్ని చేపట్టిన నికితా కృశ్చెవ్, తనకు ప్రజామోదం కోసం తెలివైన మార్గం అనుసరించాడు. స్టాలిన్‌ను దోషిగా, సొంత ప్రజల మీదనే అణచివేతను, నిర్బంధాన్ని సాగించిన నియంతగా నిలబెట్టదలచుకున్న కృశ్చెవ్, లెనిన్‌ను మాత్రం ప్రశంసలతో ముంచెత్తాడు. లెనిన్‌ను కీర్తించి,

Tuesday, November 22, 2011

ఉద్యమం వైకుంఠపాళిలో మళ్లీ మొదటి గడికి!

సమైక్యవాదాన్ని తెలంగాణలో వినిపించే హక్కు లేదా - అని ప్రశ్నిస్తున్నారు పరకాల ప్రభాకర్. ఉభయప్రాంతాల్లోనూ సమైక్యవాదులు, విభజన వాదులు ఉన్నారని, ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చెప్పుకోగలిగిన స్వేచ్ఛ ఉండాలని ఆయన అంటున్నారు. సూత్రరీత్యా ఆయన వాదనను కాదనడానికి ఏముంది? కానీ, విభజనవాదులు ప్రభాకర్ సభలను అడ్డుకుంటున్నారు. వారు సరే, పోలీసులు కూడా హైదరాబాద్ సహా తెలంగాణలో ఎక్కడా సమైక్యవాద సభలు జరగడాన్ని ఇష్టపడడం లేదు. తెలంగాణ వాదులు సీమాంధ్ర ప్రాంతంలోకి వెళ్లి ఏవైనా నిరసనలు చేపట్టడాన్ని కూడా పోలీసులు అనుమతించకుండా- ఇంకా ఏర్పడని సరిహద్దులకు ముందే పహారా కాస్తున్నారు. సీమాంధ్రలో విభజనకు అనుకూలంగా ఉన్నవారికి సమైక్యవాదులు అవరోధాలు కల్పిస్తూనే ఉన్నారు. ఉద్వేగాలు ఉధృతంగా ఉన్నప్పుడు- హక్కులలోని న్యాయాన్యాయాలను గుర్తించే సహనం ఎవరికీ ఉండదు.

ఇంతకాలం మౌనంగా ఉండి తను ఎందుకు ఈ చివరిఘట్టంలో రంగప్రవేశం చేశారో, దీర్ఘకాలంగా సాగుతున్న ఉద్యమం చేసిన వాదనల రామాయణం విని కూడా రాముడికి సీత ఏమవుతుందని కొత్తగా ఎందుకు ప్రశ్నిస్తున్నారో పరకాల ప్రభాకర్ వివరణ ఇవ్వాలని తెలంగాణవాదులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయన నుంచి సంతృప్తికరమైన వివరణ వచ్చినప్పటికీ, ఆయన విశాలాంధ్రవాద ప్రచారాన్ని అనుమతిస్తారని ఏమీ లేదు. ప్రభాకర్ ఉద్దేశ్యాలేమైనప్పటికీ, ఆయన వంటి వారిని అడ్డుకోవడం ఆహ్వానించదగినదేమీ కాదు. అసలు, ఫలానా అభిప్రాయం ఉన్నవారు తమ ప్రాంతంలో తిరగకూడదని నిషేధాజ్ఞలు విధించడం ప్రజాస్వామికమేమీ కాదు. కానీ, ఉద్యమాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఆశించే పరిస్థితి కూడా లేదు. ప్రజాప్రతినిధులుగా ప్రజలలో మెలగేవారిని, తమ తమ డిమాండ్లపై నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుంది. చెప్పినమాట నిలబెట్టుకోలేని నేతలను ప్రజలు తరచు ప్రశ్నించడం చురుకైన ప్రజాస్వామ్యమే. ప్రజలను ఎదుర్కొనడానికి భయపడి నేతలు మొహం చాటేయాలి తప్ప, కాలు బయటపెట్టకుండా నిషేధించడం మంచి సంప్రదాయమేమీ కాదు.

మంచో చెడో - గత రెండేళ్ల కాలంలో ఉభయప్రాంతాల మధ్య ఉద్యమసరిహద్దు రేఖ ఒకటి వెలసింది. ఇతర అభిప్రాయాన్ని సహించే తత్వం ఉభయప్రాంతాల్లోనూ కొరవడింది. సామాజికాంధ్ర ఉద్యమం

Monday, November 14, 2011

విస్తరిస్తున్నది డాలర్ మతమే!

గాంధీగారిని హింసలు పెడుతున్నదీ, ఇక్కడ పేదలకు సేవ చేస్తున్నదీ ఒకరేనా?- అని నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలోని మిషనరీ ఆస్పత్రిని ప్రస్తావిస్తూ, వట్టికోట ఆళ్వారుస్వామి నవల 'ప్రజల మనిషి'లోని ప్రధాన పాత్ర ఆశ్చర్యపడుతుంది. ఆ ఇద్దరూ ఒకరేనా, వేరువేరా అన్నది రాదగ్గ ప్రశ్నే. ఒకరే అని తెలిసిరావడం విస్మయపరిచే సమాధానమే. ఒకచేత్తో బైబిల్‌ను మరో చేత్తో తుపాకిని పట్టుకుని యూరోపియన్ సామ్రాజ్యవాదులు మనదేశంలోకి ప్రవేశించారని చరిత్రకారులు వ్యాఖ్యానిస్తుంటారు. కానీ, సామ్రాజ్యవిస్తరణ చేసిన వర్తకులూ, సైన్యాలూ, ఆ విస్తరణకు బాధితులయ్యే ప్రజల దగ్గరికే వెళ్లి మతబోధలు చేసిన ప్రచారకులూ వారి కర్తవ్యపరిధుల దృష్ట్యా వేరువేరుగానే ఉన్నారు. ఒక్కోసారి, ఇద్దరి ప్రయోజనాలు, పనిపద్ధతులు పరస్పరం విరుద్ధంగా ఉండడం వల్ల ఇబ్బందులూ ఏర్పడ్డాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలసలు ఏర్పరుచుకునే క్రమంలో- మత ప్రచారకుల ప్రజాసంబంధాలు, బోధనలూ- ఆక్రమణదారులకు ఆమోదాన్ని సాధించిపెట్టాయనుకోవడంలో అసత్యమేమీ లేదు. అయినంత మాత్రాన, ఆయా వలసల్లోని వివిధ ప్రజావర్గాలలో, సామాజిక పరిణామాల్లో వలసవాదుల పాలనాపరమైన చర్యలు కానీ, వలసమతప్రచారకుల సంస్కరణలు కానీ కలిగించిన సానుకూల ప్రభావాన్ని, ప్రగతిశీలమైన మార్పులను తోసిపారేయలేము.

బౌద్ధం కానీ, క్రైస్తవం కానీ, ఇస్లాం కానీ- అవి అవతరించినప్పుడు నిర్వహించిన చారిత్రకపాత్ర- అనంతర కాలంలో నిర్వహించగలిగాయని చెప్పలేము. బౌద్ధం భారతదేశ నిర్దిష్ట పరిస్థితులలో సంకల్పించిన మౌలిక మార్పులను సాధించకుండానే పరాజితమై, ఇతర దేశాలకు వలస వెళ్లి, అనేక మార్పులకు లోనయింది. తిరిగి భారతదేశంలోని దళితులు గుండెలకు హత్తుకునేదాకా, ఇతర దేశాల్లో అధికారిక మతంగా మాత్రమే, యథాతథస్థితిని సమర్థించే మతంగా మాత్రమే మిగిలింది.   నాటి మతపెద్దల దౌష్ట్యాన్ని, అమానవీయతను ధైర్యంగా ఎదిరించి, కొత్త నైతికతను, ప్రబోధాలను మానవాళికి అందించిన ప్రవక్త జీసస్. ఆయన బోధనల ప్రాతిపదికపై విస్తరించిన మతం- ఆ మతానుయాయులు విస్తరణవాదులుగా, వలసవాదులుగా, పెట్టుబడిదారులుగా పరిణమించిన తరువాత అదే తీరులో ఉండలేకపోయింది. క్రీస్తు మతానికి ప్రతినిధులుగా వెలిగిన పెద్దలు, రాజ్యాల అవసరాలతో రాజీపడ్డారు. అనేక అమానుష యుద్ధాలను సమర్థించారు. బానిస వర్తకాన్ని వ్యతిరేకించలేకపోయారు. మధ్య ఆసియాలో అనైక్యతతో పరస్పరం సంఘర్షిస్తూ ఉండిన వివిధ తెగలను, మితిమీరిన విగ్రహారాధనతో,

Tuesday, November 8, 2011

తొంభై ఏడేళ్ల నవయువకుడు

పెద్ద పెద్ద ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లల్ని అడగండి, అన్నా హజారే ఒక స్వాతంత్య్ర సమరయోధుడు అని చెబుతారు. గాంధీగారు గాంధీగారు అని వినడమూ చదవడమూ తప్పితే, అటువంటి వాళ్లను ప్రత్యక్షంగా చూసింది లేదు, అదృష్టవశాత్తూ ఇప్పుడు హజారేను చూడగలుగుతున్నాం- అని మురిసిపోతారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి హజారేకు పట్టుమని పదేళ్లే అని చెబితే ఆశ్చర్యపోతారు.

హజారేను భావిభారత పౌరులు అట్లా చూడగలగడం సంతోషం కలిగించేదే. ఆయనను బాగా గౌరవించేదే. తాము గౌరవించదగ్గ, ఆరాధించదగ్గ, నిస్వార్థమని చెప్పదగ్గ ఒక ప్రతీకా, ఒక్క మనిషీ కనపడని ఎడారికాలమిది అని బాధపడిపోయే కొన్ని శ్రేణుల ప్రజల ఊహాచిత్రమే హజారే. వారందరి ఆదర్శాలకూ ఆలంబనగా దొరికిన నాయకుడాయన. ఆ ఊహాచిత్రపు రచన చేసింది మాత్రం ఉద్యమాలో, విశాల ప్రజానీకమో కాదు.

ఆంగ్లవిద్యలో ఆరితేరిన సంస్కారవంతుల జాతీయ శిష్టవర్గమూ వారి గుండెచప్పుడును అందంగా ఆర్తితో ప్రతిధ్వనించే ప్రచారశిబిరమూ కలసి చిత్రించిన బొమ్మ అది. హజారే వ్యక్తిగత స్థాయిని అంచనా వేయడం కాదిది. ప్రజాజీవితంలో ఆయనది ఒక విశిష్ట మార్గం. ఆ మార్గాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన సంకల్పమూ కార్యనిష్ఠా నిస్వార్థ తత్పరతా వేలెత్తి చూపలేనివి. అయినప్పటికీ, ఆయన మార్గంపై ఉండే సందేహాలు, ఆయన అనుయాయివర్గంపై ఉండే అనుమానాలు తోసిపారేయదగ్గవి కావు. ఎన్ని అదనపు మార్కులు వేసినా, ఒక స్వాతంత్య్ర సమరయోధుడి స్థాయిని హజారేకు ఇవ్వలేము.

ప్రభుత్వాన్ని తన దగ్గరకు రప్పించుకున్న తన ఆమరణ దీక్షకు, తాజాగా మౌనదీక్షకు వేదికగా ఎంచుకున్న దేశరాజధాని నగరంలోనే ఒక స్వాతంత్య్రసమరయోధుడు, నిండునూరేళ్లు జీవించబోతున్న పండుముదుసలి కొండా లక్ష్మణ్ బాపూజీ సత్యాగ్రహం చేస్తున్నారు. ఆయన పక్కనే మరో వృద్ధయోధుడు బోయినపల్లి వెంకటరామారావు, మరికొందరు స్వాతంత్య్ర సమరయోధులు దీక్షలో ఉన్నారు. అన్నాహజారేకోసం ఉప్పొంగినట్టుగా ఢిల్లీ గుండెలు, జాతీయ మీడియా కెమెరాలు వారి కోసం ఉప్పొంగడం లేదు. అశేష జనసందోహం జాతీయ జెండాలు పట్టుకుని, ఒంటిమీదా బట్టల మీదా నినాదాలు రాసుకుని ఆ శిబిరం చుట్టూ గుమిగూడడం లేదు. అవినీతిపై యుద్ధమంటే అందరూ ఒప్పుకునే పోరాటంకాబట్టి అన్నా హజారేకు అందరూ బ్రహ్మరథం పట్టారు, ప్రత్యేక తెలంగాణ కోసం సత్యాగ్రహం చేస్తున్న బాపూజీకి అందరూ మద్దతు ఎట్లా ఇస్తారు?- అన్న ప్రశ్న సహేతుకమయినదే. తెలంగాణా డిమాండ్ గురించి సంబంధిత ప్రాంతాల ప్రజలలో, నాయకులలో భిన్నాభిప్రాయాలున్నాయి, కాంగ్రెస్ అధినాయకత్వం అయోమయంలో ఉన్నది-ఇవన్నీ వాస్తవాలే. అన్నా హజారే ఉపవాసదీక్ష చేశారు- బాపూజీ కేవలం సత్యాగ్రహం మాత్రమే చేస్తున్నారు, ఇదీ వాస్తవమే.

కానీ, గాంధీ మహాత్ముడు సైతం తన రాజకీయజీవితంలో అనేక వివాదాస్పదకారణాలకు సత్యాగ్రహాలు చేశారు, ఒక్కొక్కసారి ప్రజావ్యతిరేకమని భావించే అంశాలపై కూడా పట్టుదలగా ఆందోళనకు దిగారు. అయినా, ఆయన దీక్షలను ఆ అంశాల కారణంగా ఎవరూ తక్కువ చేసి చూడలేదు. అందుకే ఇప్పుడు,

Thursday, November 3, 2011

బ్రహ్మరథమా, సవారీయా?

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి మొదట నిప్పు రాజేసిన యోధులు పాపం అంతకు ముందు దశాబ్దం కాలం నుంచి దేశంలోని రాజ్యాలకీ, సంస్థానాలకీ కాలికి బలపం కట్టుకుని తిరిగారు, కలసి రమ్మని అడిగారు. నాయకత్వం వహించమనీ కొందరిని కోరారు. కొందరు విని ఊరుకున్నారు, కొందరు సహకరిస్తామన్నారు, కొందరు ఆ ప్రయత్నాల గురించి బ్రిటిష్‌వారి చెవిన వేశారు. ఆ ప్రయత్నాలు నిరర్థకమయ్యాయని చెప్పలేము. పోరాటం ఉత్తర, మధ్య భారతాల్లో ఉవ్వెత్తున ఎగియడానికి ఆ సన్నాహక చర్యలు చాలా ఉపకరించాయి. అయితే, చాలా కాలం దాకా దేశవ్యాప్త ఆమోదం కలిగిన ఒక నాయకుడంటూ దొరకలేదు. చివరకు ఏనభైఏండ్లు దాటిన వృద్ధుడిని, ఎర్రకోటకే పరిమితమైపోయిన చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ని స్వతంత్ర భారత పోరాట సర్వసైన్యాధ్యక్షుడిగా, తిరుగుబాటు నాయకునిగా ఎన్నుకున్నారు. ఆయన గొప్ప నాయకత్వం అందించిందీ లేదు, చివరి నిమిషంలో కరవాలం ఝళిపించిందీ లేదు కానీ, విప్లవ సేనానిగా శిక్ష మాత్రం అనుభవించాడు. పరిపాలన ఏమి చేశాడో, ప్రజల గురించి ఏమి చేశాడో తెలియదు కానీ, చరమాంకంలో ఆయన జననేతగా మిగిలాడు.

నాయకత్వానికి ఉన్న మహత్యం అదే. నాయకుడో నాయకురాలో ముందుండి అనుచరులను సేనలను ముందుకు నడిపిస్తారని సాధారణంగా అనుకుంటాం, చాలా సందర్భాలలో జనమూ సేనలూ వెనకుండి నేతలను ముందుకు తోస్తూ కూడా ఉంటారు. ముక్కలు ముక్కలుగా, సంబంధం లేకుండా జరిగే కార్యాచరణకు నాయకత్వం ఒక కేంద్రాన్ని ఇస్తుంది. అనేకత్వంలో విజృంభిస్తున్న పోరాటాలు, తమకు తామే ఒక చిహ్నాన్నో

Monday, October 24, 2011

పొరుగింటికి పాకిన అనకొండ

అలీనోద్యమ దేశంగా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు, భారతదేశం అనేక అంతర్జాతీయ అంశాలపై తనదంటూ ఒక వైఖరిని స్పష్టంగానే చెబుతూ ఉండేది. ఒకే ఒక పక్షంతో లీనమవడం తప్ప అలీనతకు ఆస్కారం లేని రోజులు వచ్చాక, మౌనంగా ఉండడాన్ని, డొంకతిరుగుడుగా వ్యక్తీకరించడాన్ని ఒక తప్పనిసరిగా అభ్యసించవలసి వచ్చింది. ప్రచ్ఛన్నయుద్ధకాలపు అవశేషం ఏదన్నా భారత విదేశాంగ విధానంలో మిగిలిఉన్నదా అంటే అది పాలస్తీనాకు గుర్తింపును కొనసాగించడంలోను, ఆ దేశానికి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వాన్ని కోరడంలోనూ మిగిలిఉన్నదని చెప్పవచ్చు.

అమెరికాపై టెర్రరిస్టు దాడి తరువాత, ఆప్ఘనిస్థాన్‌పై అమెరికా ఆక్రమణయుద్ధం ప్రారంభించినప్పుడు, ఇరాక్‌పై దండెత్తినప్పుడు, ఇరాన్‌పై ఆంక్షల కోసం ప్రయత్నించినప్పుడు, తాజాగా గడాఫీని హతమార్చినప్పుడు - భారత్ అధికారిక ప్రతిస్పందనలు ఒకే రకంగా ఉన్నాయి. గడాఫీ హత్యను కానీ, ఆయన హయాంలో భారత్‌తో ఉన్న సంబంధాల గురించి కానీ ప్రస్తావన ఏమీ లేకుండా- లిబియా పునర్నిర్మాణానికి అవసరమైన సహాయం చేస్తామని మాత్రం ఇండియా ప్రకటన చేసింది. గడాఫీ అధికార భ్రష్ఠుడైన వెంటనే భారత్, జాతీయ పరివర్తనా మండలి (టిఎన్‌సి)తోనే దేశరాజకీయ, ఆర్థిక పునర్నిర్మాణానికి సహాయపడతామని హామీ ఇచ్చింది. చమురు, గ్యాస్ ఉత్పత్తులు కాకుండా, లిబియాకూ భారత్‌కూ సాలీనా వంద కోట్ల డాలర్ల మేరకు వాణిజ్యం సాగుతోంది. అక్కడ అంతర్యుద్ధం ప్రారంభం కాకముందు సుమారు 20 వేల మంది భారతీయులు నివాసం ఉండేవారు. వారందరినీ మార్చినెలలోనే స్వదేశానికిి సురక్షితంగా తరలించారు. రెండుదేశాల మధ్య ప్రగాఢమైన స్నేహం ఉన్నదని చెప్పలేము కానీ, ఒక సదవగాహన ఉండేది. 1984లో ఇందిరాగాంధీ లిబియాను సందర్శించడమే ఆ దేశానికి మన నేతల ఆఖరి పర్యటన. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో పశ్చిమాసియా విషయంలోను, వివిధ జాతీయ విముక్తి ఉద్యమాల విషయంలోను భారత్ వైఖరితో ఏకీభావం ఉన్నందున లిబియాతో నాడు స్నేహానికి ఆస్కారం ఉండింది. భారత్ ఇంధన అవసరాల రీత్యా ఉభయదేశాల మధ్య వాణిజ్యసంబంధం పటిష్టమయింది. అయితే, ఇటీవలి కాలంలో గడాఫీ, భారత్‌ను ఇబ్బందిపెట్టే వైఖరులు కొన్ని తీసుకున్నారు. కాశ్మీర్ స్వతంత్రదేశం అయితే బాగుంటుందని ఐక్యరాజ్యసమితిలో వాదించారు. ఈ ఏడాది తనపై తిరుగుబాటు చేసిన ప్రజలపై అణచివేత

Wednesday, October 19, 2011

'సకలం' సశేషం, పాఠాలు అనేకం

సకల జనుల సమ్మె చరమాంకానికి వచ్చింది. విరమణ కాదు వాయిదా అని సమ్మెసంఘాలు చెబుతున్నాయి కానీ, అవి ఆత్మసంతృప్తికి చెపుకుంటున్న మాటలే. నెలరోజులకు పైగా సాగిన ఒక చరిత్రాత్మక ఘట్టం ముగింపునకు వచ్చిందన్నదే వాస్తవం. సమ్మెలు సడలుతున్న సమయంలో కూడా ఒక రోజు తెలంగాణ బంద్‌ను విజయవంతంగా నిర్వహించడం, విరమణ వల్ల కలుగుతున్న ఆశాభంగాన్ని సమర్థంగా తెలంగాణ ప్రాంత మంత్రుల మీదకు మళ్లించడం- ఉద్యమస్ఫూర్తికి నష్టం కలగకుండా నాయకత్వం అనుసరించిన ఎత్తుగడలే.

అయితే, ఈ సకలజనుల సమ్మె పోరాటంలో గెలిచిందెవరు? ఓడిందెవరు? - ఈ ప్రశ్నలు తప్పనిసరిగా ముందుకు వస్తాయి, వస్తున్నాయి. ఒక సుదీర్ఘ ఉద్యమంలో ఒక ఘట్టం ఫలితాన్ని బట్టి, ఓటమిగెలుపులను నిర్ణయించవచ్చునా? అన్నది మరో ముఖ్యమైన ప్రశ్న. అంతిమదశలో మాత్రమే చేపట్టవలసిన బ్రహ్మాండమైన ఉద్యమరూపాన్ని సమయం కాని సమయంలో రాజకీయ జెఎసి ప్రయోగించడం సరిఅయినదేనా? ఈ దశలో ఈ ఉద్యమరూపం ఫలితం ఇట్లాగే ఉండబోతుందని నాయకత్వానికి తెలియదా? విశాల ప్రజానీకం స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్న ఉద్యమం విషయంలో రాష్ట్ర పాలనాయంత్రాంగం, అధికార పక్షం వ్యవహరించిన తీరు సరిఅయినదేనా? సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం, పాలకపెద్దలు అనుసరించిన సందేహాస్పదమైన ఎత్తుగడలు, భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలపై ఎటువంటి ప్రభావం వేయనున్నాయి?

ప్రశ్నలూ సందేహాలూ ఎలాగూ వస్తాయి కానీ, ఒక ఉద్యమం నుంచి మొత్తం సమాజం నేర్చుకోదగినవి ఎన్నో ఉంటాయని కూడా గుర్తించాలి. ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి ఏఏ పద్ధతులను అనుసరించారు, ఆ వ్యక్తీకరణను భగ్నం చేయడానికో, బలహీనపరచడానికో ప్రభుత్వాలు, వ్యతిరేకులు ఏ వ్యూహాలను పాటించారు- అన్న అంశాలు- భవిష్యత్తులో జరిగే (తెలంగాణకు అనుకూల నిర్ణయం వస్తే, సీమాంధ్ర ప్రాంత ప్రజలు చేయాలనుకుంటున్న ఉద్యమాలతో సహా) అన్ని ఉద్యమాలకూ

Tuesday, October 11, 2011

నేరం చరిత్రదే కాదు, కాంగ్రెస్‌దీ!

ప్రణబ్ ముఖర్జీ గారికి కోపం వచ్చింది. తాను అనని మాటలను అన్నట్టు మీడియా రాస్తోందని ఆయన మొహం మాడ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వస్తాయని ఆయన అన్నట్టుగా పత్రికల్లో టీవీల్లో వచ్చింది. పాపం నిజంగానే ఆయన అట్లా అనలేదు. ఆయన మాటల్ని దారితప్పించింది తెలుగు మీడియా కాదు, ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్న ఎన్డీటీవీయే అట్లా వార్తలు విడుదల చేసింది. ఇంతకూ ప్రణబ్ ఏమన్నారు? 'విస్త­ృత దృష్టితో చూస్తే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి, ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటులో ఒక పద్ధతిని అనుసరించలేదు.

గత నాలుగైదువందల ఏళ్ల చరిత్రలోనూ వర్తమానంలోనూ కూడా ఒక పద్ధతంటూ లేదు..' ఇట్లా చెప్పుకుపోయారు. ఈ మాటలకు ముందు తెలంగాణ సమస్య పూర్వాపరాలను ఆయన పేర్కొన్నారు. అందువల్ల, ఆ సమస్యలేవో తెలంగాణ వల్ల వస్తాయన్నట్టుగా అర్థమయ్యి ఉండవచ్చు. కానీ, ప్రణబ్ ఆ ఇంటర్వ్యూలో ఏవో విధాన నిర్ణయాలు వె ల్లడించే ధోరణిలోనో, అలవోక వ్యాఖ్యలు చేసే ధోరణిలోనో మాట్లాడలేదు. ఒక చర్చా ధోరణిలో, సైద్ధాంతిక దృష్టితో, బెంగాలీ బాబు లాగా మాట్లాడారు. సంచలనాత్మకతలో కొట్టుకుపోయి ఉండకపోతే, ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన చర్చనీయమైన అంశాలు మీడియాకు కనిపించి ఉండేవి.

తెలంగాణ సమస్యకు చరిత్రలోను, సమీపగతంలోను, వర్తమానంలోను మూలాలు ఉన్నాయని ప్రణబ్ ఆ ఇంటర్వ్యూలో సూచించారు. అసలు భారతదేశంలో అంతర్గత పరిపాలనా యూనిట్లు ఏర్పడిన క్రమమే క్రమపద్ధతిలో లేదని ఆయన చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, సమైక్యంగా కొనసాగడం- అనే రెండు మార్గాల మధ్య పోరుగా పరిణమించిన ప్రస్తుతసమస్య ఉధృతిలో మూలకారణాల పరామర్శ, చర్చ ఈ మధ్య అణగారిపోయాయి. తెలంగాణ ఉద్యమమంటే, స్వార్థపర రాజకీయశక్తుల సృష్టి అని, దానికి భౌతిక పునాది ఏమీ లేదని, విద్వేషపూరితమైనదని వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. ప్రాంతీయ అసమానతలనేవే లేవని, అంతా సజావుగానే ఉన్నదని,

Monday, October 3, 2011

పంపకాల అంకంలోకి ప్రవేశిస్తున్నామా?

ఉన్నదున్నట్టు ఉండడం సాధ్యంకాదు, ఏదో ఒకటి చేయవలసిందే. శ్రీకృష్ణకమిటీ నివేదిక సిఫార్సుల మతలబు ఎట్లా ఉన్నా, దానిలోని సారాంశం మాత్రం అదే. కాకపోతే, ఆ చేయదగిన వాటిలో మొట్టమొదటిదిగా సమైక్యరాష్ట్రంలో ప్రాంతీయ కమిటీ ఏర్పాటును సూచించింది. ఇప్పుడున్న రాష్ట్రాన్ని ఏ చికిత్సలూ లేకుండా కొనసాగించడం సాధ్యంకాదన్నదే ఆ కమిటీ నిర్ధారణ. ఇప్పుడు ఆజాద్ కూడా అదే మాట చెబుతున్నట్టున్నారు. ఎంతో రహస్యంగా రూపొందించి, రహస్యంగా చర్చిస్తున్న నివేదిక 'లోగుట్టు' ఏమిటో తెలియదు కానీ, రాష్ట్రంలోని రెండు ప్రాంతాలూ కలసి ఉండడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని బలంగా చెప్పినట్టు తెలుస్తోంది.

విభజన ఖాయమే అనిపిస్తోంది. కాకపోతే, అటువంటి సూచన ఏదో అధికార స్వరాలలో పలకకపోతే, రాష్ట్రంలో ఇప్పుడు సాగుతున్న సకలజనుల సమ్మె ఉపశమించేటట్టు లేదు. సమస్యను సాగదీసినవారే ఈ పరిస్థితిని చక్కదిద్దాలి కానీ, ఇప్పటికీ అలక్ష్యం ధ్వనించే వాయిదా మాటలే మాట్లాడుతున్న ఢిల్లీ పెద్దలకు ఆ విజ్ఞత కలుగుతుందో లేదో తెలియదు. దసరా తరువాత ఆశకు ఆస్కారం కలిగే ఏదో ఒక మాట వినిపిస్తే, సమ్మె ముగుస్తుంది కానీ, సమస్య అక్కడితో ముగిసిపోదు. ఎందుకంటే, విభజన తప్పదన్న తెలివిడికి ఎంత ప్రయాస అవసరమయిందో, విభజన ప్రాతిపదికలపై అంగీకారానికి రావడానికి అంతటి యాతనా తప్పదు. మొదట బయటపడేది కాంగ్రెస్ అభిమతం, ఆ తరువాత తక్కిన పక్షాలలో కసరత్తు, అందరిమధ్యా సంప్రదింపులు, చర్చలు, వాదోపవాదాలు, అంగీకారం లేని అంశాలపై

Monday, September 26, 2011

'సకలం' మిథ్య అంటే సరిపోతుందా?

ఏదైనా ఒక ఉద్యమం మంచిదా చెడ్డదా అన్న ప్రశ్న వేసుకుని వారి వారి ఇష్టాన్ని బట్టి ఏ సమాధానమైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అభిప్రాయం మాత్రమే. కానీ ఏదైనా ఉద్యమం ఉధృతంగా సాగుతోందా, చప్పగా జరుగుతోందా అన్న ప్రశ్న వేసుకుని ఇష్టమొచ్చిన అభిప్రాయం చెప్పుకోవడానికి కుదరదు. ఎందుకంటే, అక్కడ వాస్తవం చెప్పాలి.

మూడున్నర లక్షల మంది రాష్ట్రప్రభుత్వోద్యోగులు, లక్షన్నర మంది ఉపాధ్యాయులు, అరవైఏడు వేల మంది సింగరేణికార్మికులు, యాభై ఎనిమిదివేల మంది ఆర్టీసీ కార్మికులు, ఇంకా ప్రభుత్వాసుపత్రుల వైద్యులు సమ్మెలో ఉన్నారు. ఇంకా ఆటోడ్రైవర్లు, పూజారులు, రజకులు, భవన నిర్మాణ కార్మికులు, పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ డ్రైవర్లు సంఘీభావ సమ్మెలు చేస్తున్నారు. రోజుకో సమూహం కొత్తగా వచ్చి ఆందోళనలో చేరుతున్నది.ఏకకాలంలో సమ్మెచేసి జనజీవనాన్ని స్తంభింపజేసిన ఇటువంటి ఉద్యమం గతంలో ఎప్పుడైనా ఏ సమస్యల పరిష్కారం కోసమైనా జరిగిందా? ఇన్ని రోజులు నిలకడగా సాగిందా? ఉద్యమం తీరు మీద, నాయకత్వం మీద ఎన్ని విమర్శలు, విభేదాలు ఉన్నప్పటికీ-సమాజంలోని ఇన్ని వర్గాలు, శ్రేణులు ఒక్కుమ్మడిగా ఒక ఆకాంక్ష సాధన కోసం ఉద్యమించడం మునుపు ఎన్నడైనా విన్నామా? తెలంగాణ ఉద్యమం గురించి ఎటువంటి అభిప్రాయం ఉన్నవారైనా, ఇప్పటి సకలజనుల సమ్మె తీవ్రతను, ఉధృతిని అంగీకరించడానికి అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే, హైదరాబాద్ వీధుల దగ్గర నుంచి, ఆదిలాబాద్ అడవుల దాకా వాస్తవమేమిటో కళ్ల ఎదుట కనిపిస్తున్నది. మరి రేణుకాచౌదరికీ, అభిషేక్ సింఘ్వికి సమ్మె ప్రభావం ఏమీ లేదని ఎందుకు అనిపించింది? ఇదంతా చల్లారిపోయే వేడి అని ముఖ్యమంత్రిగారికి ఎందుకు అనిపిస్తోంది?

చల్లారిపోవచ్చు. ఏ విజయమూ లేకుండానే అణగారిపోవచ్చు. కానీ, ముగిసిపోయిందనుకున్నది మళ్లీ మళ్లీ మొలుచుకు వస్తున్నప్పుడు, ఇది ఇంతటితో ఆగేదికాదన్న కనీస అవగాహన ఉండాలి. అణచివేతతోనో, అసహాయతలోనో ఆందోళనలు విరమించుకున్నప్పటికీ, ఆకాంక్షలు నెరవేరని ఆశాభంగం, కనీస స్పందన కూడా దొరకని అరణ్యరోదనం- ఆయా జనవర్గాల మనసులో ఎటువంటి ఉద్వేగాలకు, ఆవేశాలకు

Monday, September 12, 2011

ఆనాడు మూడు వేలు, ఆ తరువాత 20 లక్షలు!

జంట భవనాలు కూలిన మరుసటి రోజే సద్దామ్ హుస్సేన్ ఒక మాట అన్నాడు. "సెప్టెంబర్11, 2001 కంటె ముందు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికా ఖండానికి ఆయుధాలతో వెళ్లినవారు పాశ్చాత్యులే. వాళ్లే అమెరికాను స్థాపించారు. ఆ తరువాత అమెరికాయే విధ్వంస ఆయుధాలను, మృత్యువును మోసుకుని అట్లాంటిక్‌ను దాటి ప్రపంచంపై దాడులు చేసింది''

జంటభవనాలు కూల్చిన ఏడాది తరువాత ఒసామా బిన్‌లాడెన్ అమెరికన్ ప్రజలకు రాసిన లేఖలో తాము దాడి ఎందుకు చేసిందీ సుదీర్ఘంగా వివరిస్తూ ఒక వ్యాఖ్య చేశాడు. 'మానవజాతి చరిత్రలోనే మీది అధ్వాన్నపు నాగరికత అని చెప్పడానికి చాలా విచారంగా ఉంది'. తాను చేస్తున్నది నాగరికతల యుద్ధమని లాడెన్‌కు తెలుసునా? అమెరికా ఆధ్వర్యంలో సాగుతున్న అభివృద్ధి, ప్రకృతివిధ్వంసాలను, ఆ దేశంలోని నైతికపతనాన్ని సామ్రాజ్యవాదమనే మాట కూడా వాడకుండా అతనెలా వర్ణించగలిగాడు?

సద్దామ్ హుస్సేన్ తన స్వగ్రామం తిక్రితిలో సమాధిలో శాశ్వత నిద్రలో ఉన్నాడు. ఒసామా బిన్‌లాడెన్ భౌతిక శరీరం అరేబియా సముద్రగర్భంలో గుర్తుతెలియని చోట జలసమాధి అయింది. మానవాళిపై జరిగిన అత్యంత ఘోరమైన అపచారంగా చెప్పుకుంటున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి జరిగి పదేళ్లు గడచిన నేటి రోజున

Tuesday, September 6, 2011

శ్రద్ధాంజలి

కొద్దికాలంగా అస్వస్థులుగా ఉండి, శుక్రవారం రాత్రి కన్నుమూసిన నండూరి రామమోహనరావు తెలుగు పాత్రికేయ, సాహిత్య, బౌద్ధిక రంగాలలో తనదైన గాఢముద్ర వేసిన బహుముఖప్రజ్ఞాశాలి. మృదుస్వభావిగా, ఆలోచనాపరుడిగా, సరళశైలిలో ఉన్నతమైన రచనలు చేసిన రచయితగా ఆయనను తెలుగుసమాజం చిరకాలం గుర్తుంచుకుంటుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికకు సుమారు రెండు దశాబ్దాల పాటు సంపాదకుడిగా పనిచేసిన నండూరి, పత్రికకు సాహిత్య పరిమళాన్ని అద్దడమే కాకుండా, తన ప్రతిష్ఠతో వ్యక్తిత్వంతో గౌరవాన్ని సమకూర్చిపెట్టినవారు.

కొడవటిగంటి కుటుంబరావు సహాయకుడిగా ఆంధ్రపత్రిక వారపత్రికలో పనిచేయడం నండూరిలోని రచయితను మెరుగుపెట్టగా, నార్లవెంకటేశ్వరరావు సారథ్యంలో ఆంధ్రజ్యోతిలో ప్రారంభం నుంచి పనిచేయడం ఆయనలోని ఉత్తమ పాత్రికేయుడిని, సంపాదకుడిని తీర్చిదిద్దింది. చెన్నైలో ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నప్పుడు ముళ్లపూడి వెంకటరమణ ఆయన సహోద్యోగి. మద్రాసులోని తెలుగు సాహితీదిగ్గజాలు శ్రీశ్రీ, ఆరుద్రలతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. మార్క్‌ట్వేన్ రచనలు రాజుపేద (ప్రిన్స్ అండ్ పాపర్), టామ్‌సాయర్ (టామ్‌సాయర్), టామ్‌సాయర్ ప్రపంచయాత్ర (టామ్‌సాయర్ అబ్రాడ్), హకల్‌బెరీ ఫిన్ (అడ్వెంచర్స్ ఆఫ్ హకల్ బెరీఫిన్), విచిత్రవ్యక్తి (మిష్టీరియస్ స్ట్రేంజర్) ఆ కాలంలోనే ఆయన తెలుగుచేసి ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. మార్క్‌ట్వేన్ రచనలే కాక, రాబర్ట్ లూయీ స్టీవెన్‌సన్ సుప్రసిద్ధ రచన 'ట్రెజర్ ఐలాండ్'ను 'కాంచన ద్వీపం'గా, ఏసోప్స్ ఫేబుల్స్‌ని 'కథాగేయ సుధానిధి' గా అనువదించారు. తెలుగు బాలసాహిత్యానికి నండూరి అందించిన అపురూపమైన

Wednesday, August 31, 2011

ప్రభుత్వాలకు ప్రతీకారాలు ఉండవచ్చునా?

ఆ ముగ్గురిని ఉరితీస్తే తమిళనాడు దేశం నుంచి విడిపోతుందని ఎండీఎంకె నేత 'వైగో' గోపాలస్వామి అల్టిమేటమ్ జారీచేశారు. దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్‌ను ఉరితీసి, పంజాబ్ పాత గాయాలను రేపవద్దని అకాలీదళ్ ప్రకాశ్‌సింగ్ బాదల్ దగ్గరనుంచి కాంగ్రెస్ అమరీందర్‌సింగ్ దాకా కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అఫ్జల్ గురును ఉరితీస్తే కాశ్మీర్ మళ్లీ అగ్నిగుండమవుతుందని పాక్ అనుకూల గిలానీ దగ్గరనుం చి మితవాది ఉమర్ ఫరూఖ్ దాకా హెచ్చరిస్తున్నారు. జార్ఖండ్ సాంస్క­ృతిక కార్యకర్త జితేన్ మరండీ, మరో ముగ్గురికి విధించిన మరణశిక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. రాజీవ్ హత్యకేసులో మరణశిక్ష విధించిన ముగ్గురి క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి నిరాకరించారు, వారి ఉరి అమలు తేదీ కూడా ఖరారు అయింది. భుల్లార్ దయాభిక్ష పిటిషన్‌ను గత మేలోనే రాష్ట్రపతి తిరస్కరించారు. ఇంకా శిక్షతేదీ ఖాయం కాలేదు. అఫ్జల్‌గురును పిటిషన్‌ను తిరస్కరించాలని కేంద్రహోంశాఖ రాష్ట్రపతికి సిఫారసు చేసింది కానీ, రాష్ట్రపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జార్ఖండ్ శిక్షలు కిందికోర్టులో విధించినవి. వారికి సంబంధించిన న్యాయప్రక్రియ ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతుంది.

పైన పేర్కొన్న కేసులన్నీ రాజకీయాలతో ముడిపడి ఉన్నవేనని గుర్తించడానికి పెద్ద శ్రమ అవసరం లేదు. ఇంకా ఉనికిలో ఉన్నవో, అణగారిపోయినవో అయిన సాయుధ సంస్థలకు చెందిన నిందితులే ఇప్పుడు ఉరికంబం ముందు నిలుచున్న వారు. ఒక హత్యకేసులో నిందితుడిగా ఉండి, బెయిల్‌మీద బయటకు వెళ్లిన సమయంలో మరో హత్య చేసిన అస్సాం కు చెందిన ఎమ్.ఎన్.దాస్ అనే నిందితుడు ఒక్కడు మాత్రమే క్షమాభిక్ష దక్కక, శిక్షకు సమీపంగా ఉన్న సామాన్య నేరస్థుడు. తక్కిన వారంతా తీవ్రవాదులో, ఉగ్రవాదులో అని పేర్కొనేవారే. 'ఉగ్రవాదులకు ఉరి, తక్కినవారికి క్షమ' అన్నది కేంద్ర హోంమంత్రి చిదంబరం ఫార్ములా అని, దాని ప్రకారమే క్షమాభిక్ష సిఫార్సులపై రాష్ట్రపతికి సిఫార్సులు వెడుతున్నాయని పత్రికలు రాస్తున్నాయి. చిదంబరం హోంమంత్రి అయినప్పుడు మరణశిక్షలు ఖరారు అయిన వారు 53 మంది ఉండగా, అందులో 27 మందిపై అంతిమ నిర్ణయాలు

Tuesday, August 23, 2011

అవినీతి సారాంశం అర్థమయిందా అన్నా !

రామ్‌లీలా మైదానంలోని గద్దెపై పలచటి పరుపు మీద తెల్లటి వస్త్రాలు, టోపీ ధరించి బాలీసులను ఆనుకుని బాసింపట్టు వేసి కూర్చున్న అన్నా హజారే ఒక వర్తమాన వాస్తవంగా మాత్రమే కాదు, చారిత్రక స్మ­ృతిగా కూడా కనిపిస్తున్నారు. ఆయనకు సమీపంలో కూర్చుని భజనలు చేస్తున్నట్టు నినాదాలు చేస్తున్నవారు, పాటలు పాడుతున్నవారు, మైదానం అంతా నిండి కోలాహలంగా కదలాడుతున్న వారు- ఏం జరుగుతున్నదక్కడ? మల్టీకలర్ హైడెఫినిషన్ డిజిటల్ యుగంలో, తెగిపోయిన, గీతలు పడి మాసిపోయిన బ్లాక్అండ్ వైట్ ఫిల్మ్ లాగా ఏమిటా దృశ్యం? ఇదంతా మన జ్ఞాపకంలో ఉన్నదే, ఎప్పుడో మనం వదిలివేసినదే, మనకు తెలియకుండానే మనం బెంగపడుతున్నదే, కాలనాళికలో కుంగిపోయి బలహీనంగా లీలగా వినిపించే సంగీతమే.

అన్నా చేస్తున్న ఉద్యమం ఎందుకు జరుగుతున్నదన్నది పక్కనబెడితే, అది సృష్టిస్తున్న చిహ్నాలు ఆసక్తికరమైనవి. సంపద వృద్ధినీ, నిట్టనిలువు అభివృద్ధినీ, నలువరసల మహారహదారులనీ, సర్వవ్యాప్తమై పోయిన శ్వేతవస్తు సంచయాన్ని ఆరాధిస్తూ వస్తున్న సమాజానికి, స్ఫురద్రూపి కాని డాంబికాలు లేని, బక్కపలచని, వయసు మళ్లిన వ్యక్తి ఏ జ్ఞాపకాలను రగిలించి నేత కాగలుగుతున్నాడు? సకల రాజకీయ వేదికలపై సమస్త విలువలూ లుప్తమైపోయి, ఆధారపడడానికి ఏ ఆశా లేక ఆరాధించడానికి ఏ వ్యక్తీ దొరక్క నిరాశలో ఉన్న వారికి బహుశా అతను ఆలంబనగా కనిపించి ఉంటారు.

పుస్తకాలలో చదువుకుని, పెద్దల జ్ఞాపకాలలో తడుముకుని, సినిమాలలో ఉద్వేగపూరితంగా పునఃసృష్టించుకుని పులకించిపోయిన జాతీయోద్యమ దృశ్యాలను అక్కడ గుమిగూడినవారు అభినయిస్తున్నారా? లేక, అరబ్,

Monday, August 15, 2011

వలపోతలు కాదు, తెలుగు తలపోతలు కావాలి

ఈ మధ్యే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా పదవీవిరమణ చేసిన అరవిందరావులో పెద్దగా ప్రచారం కాని కోణం సంస్కృతాభిమానం. ఈ మధ్యే ఆయన సంస్కృతంలో పీహెచ్‌డీ తీసుకున్నారు కూడా. కొద్దిరోజుల కిందట ఒక చిన్న సమావే శంలో మాట్లాడుతూ ఆయన, మన రాష్ట్రంలో వేదపండితులు చాలా మంది ఉన్నారని అనుకుంటాము కానీ, వేదానికి అర్థం చెప్పగలిగినవారు కానీ, వ్యాఖ్యానించగలిగిన వారు కానీ వేళ్లమీద లెక్కించేంత మందే ఉన్నారని, కొన్ని రోజుల్లో వారు కూడా లేకుండా పోతారని బాధపడ్డారు. ఆ పరిస్థితిని నివారించడానికి ఆయన, మరికొందరు కలసి ఏవో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, ఫలితం పెద్దగా ఆశావహంగా ఉన్నట్టు కనిపించడం లేదు.

సంస్కృతం సరే, మన రాష్ట్రంలో కాకపోతే, మరో రాష్ట్రంలో, మరో దేశంలో దాన్ని నిశితంగా అధ్యయనం చేసినవారు, చేస్తున్నవారు ఉన్నారు. వైదిక వాఙ్మయానికి ధార్మికమైన పార్శ్వం ఉన్నందున, దాని పరిరక్షణకు నడుం కట్టగలిగినవారు తగినంతమంది ఉంటారు. కానీ, తెలుగు భాషాసాహిత్యాల సంగతి ఏమిటి? దాని భవిష్యత్తు ఏమిటి? కావ్యాలను ప్రబంధాలను ప్రతిపదార్థం తెలిసి బోధించగలిగినవారు, వ్యాఖ్యానించగలిగినవారు విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా లేనట్టేనని విశ్రాంతదశలో ఉండి తెలుగు సాహిత్యబోధన గురించి పట్టింపు ఉన్న పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అందుబాటులో ఉన్న తెలుగు పౌరాణిక, కావ్య, ప్రబంధ వాఙ్మయానికి సజీవులుగా ఉన్న పండితుల ద్వారా సాధికారమైన వ్యాఖ్యలు, ప్రతిపదార్థాలు రాయించకపోతే, భవిష్యత్తు తరాలు నష్టపోతాయని వారు హెచ్చరిస్తున్నారు.

బోధించే గురువులు లేకపోవడమే కాదు, నేర్చుకునే శిష్యులు కూడా కరవవుతున్నారు. భాషాస్వరూపాన్ని నిర్ధారించుకోవడానికి పరామర్శ పండితులే కాదు, పరామర్శ గ్రంథాలు కూడా అందుబాటులో లేవు. ప్రామాణికమైన ఒక్క మహానిఘంటువు తెలుగుకు లేదు. తెలుగు మాధ్యమమే పాఠశాలలనుంచి నిష్క్రమిస్తున్న వేళ, అనేక శాస్త్ర సాంకేతిక అంశాలపై పదజాలం, పరిభాష తెలుగులో కొత్తగా రూపొందడమే ఆగిపోయింది. గతంలో రూపొందిన పరిభాష కూడా చెలామణీలో లేకుండా పోయింది. పౌరవ్యవహారాలకు సంబంధించి కూడా తెలుగును

Saturday, August 13, 2011

జనసంకటం, రాజకీయ చెలగాటం!

రాష్ట్రంలో నెలకొని ఉన్న అనిశ్చితి తొలగాలని కోరుకునేవారికి చిదంబరం లోక్‌సభ ప్రకటనలో ఏదన్నా ఒక సానుకూల అంశం కనిపించి ఉంటే, అది ఒకే ఒక్కటి. ఏకాభిప్రాయ సాధనకు 'రెండువారాలు పట్టవచ్చు, రెండునెలలు పట్టవచ్చు' అన్న తరువాత రెండేళ్లయినా పట్టవచ్చు అంటాడేమో అని భయపడ్డవారికి 'మూడు నెలలు పట్టవచ్చు' అని చిదంబరం అనడం ఎంతో కొంత ఊరటే కదా? ఆయన మటుకు ఆయన గరిష్ఠంగా మూడునెలల వ్యవధి కోరుతున్నారు. 

ఆ వ్యవధి సమస్య పూర్తి పరిష్కారానికి అనుకుంటే పొరపాటే. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియ ఒక కొలిక్కి రావడానికి అంత సమయం అవసరం పడవచ్చని ఆయన అంచనా. ఆ తరువాత, రాష్ట్ర విభజన బంతిని రాష్ట్రంలోకే విసిరిన చిదంబర విన్యాసాన్ని దృష్టిలో పెట్టుకుంటే, తక్కిన పార్టీలలో అటువంటి ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యేను, ఎప్పటికి పూర్తయ్యేను? కాంగ్రెస్ ముందుగా చెబితేనే తాము చెబుతామని

Monday, August 1, 2011

గాలి ధనం ముందు సాగిలపడుతున్న రాజకీయం!


యడ్యూరప్పను చూస్తే ముచ్చటేస్తుంది. సౌమ్యుడిగా కనిపించే ఆయనకు ముడిఇనుము బాగా వంటబట్టినట్టుంది, కొత్త తరం కొత్త రకం ఉక్కుమనిషిగా తయారయ్యారు. లోకాయుక్త నివేదిక తరువాత, వాల్‌స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ దగ్గరనుంచి ప్రపంచంలోని పెద్ద పెద్ద పత్రికలన్నీ అవినీతి చక్రవర్తిగా ఆయన పేరును మారుమోగిస్తున్నాయి. ఇక దేశంలో అయితే చెప్పనక్కరలేదు, గాలి బ్రదర్స్ వ్యాపారాలకు ఆయన చేసిన సేవను చూసి జనం గుండెలు బాదుకుంటున్నారు. అయినా సరే, యడ్యూరప్ప ముఖం కించిత్తు కూడా చిన్నపోలేదు. సిగ్గుశరము మానం అభిమానం వంటి పదాలేవీ ఆయన నిఘంటువులో ఉన్నట్టు లేవు.

కిందపడ్డా పై చేయిగా ఉండాలని, ఎంత అప్రదిష్ట అయినా రూపాయి ముందు దిగదుడుపేనని ఆయనకు అధికారపీఠం పాఠం చెప్పినట్టుంది. దిగిపోను, పొమ్ముని బిజెపి పెద్దలను మొదట గద్దించారు, తరువాత దిగుతాను కానీ నా మనిషినే కూర్చోబెట్టాలి అని మారాము మొదలుపెట్టారు. ఎవరెవరిని ముఖ్యమంత్రులు చేయొచ్చో, ఎవరిని ఉపముఖ్యమంత్రి చేయాలో, మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం ఇవ్వాలో గడ్కారీకి డిక్టేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. శనివారం రాత్రి పొద్దుపోయింది, అయినా ఆయన అలకపాన్పు దిగలేదు. త ప్పు చేసింది ఎవరో, ఎవరు ఎవరిని శాసిస్తున్నారో పార్టీ పెద్దలకు అంతుచిక్కడం లేదు.

భారతీయ జనతాపార్టీ మీద జాలి కలుగుతోంది కానీ, ఆ పార్టీ చెప్పే పెద్ద పెద్ద మాటలు గుర్తుచేసుకుంటే నిజానికి కోపమే రావాలి. నైతిక విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం, క్రమశిక్షణ వంటి సూక్తులు చాలా చెప్పే అలవాటున్న ఆ పార్టీ పెద్దలు ఇప్పుడు యడ్యూరప్ప ముందు, గాలి జనార్దనరెడ్డి గ్రూపు ముందు ఎందుకు సాగిలపడుతున్నది? ప్లీజ్, మా పరువు కాపాడండి, పదవినుంచి తప్పుకోండి అని ఎందుకు ప్రాధేయపడుతున్నది? ఒక్క కలం

Monday, July 25, 2011

ఇంకిన క్రొన్నెత్తురు.. తెగిపోయిన విపంచికలు..

అనగనగా ఒక రాజ్యంలో వరుస కరువులు వచ్చాయట. గ్రీష్మం తప్ప మరో రుతువు లేకుండా పోయిందట. బీటలు పడ్డ నేలలు, మోడులయిన చెట్లు, ఎండిపోయిన చెలిమలు - జీవితం దుర్భరంగా మారిపోయిందట.

అప్పుడొక సాధువు వచ్చి రాజుగారికి చెప్పాడట, 'మీ రాజ్యంలోనే ఉన్న వరుణ పర్వతంపై కొండకొమ్ము మీద ఒక వర్షదేవత ప్రతిమ ఉన్నది. ఆ దేవతకు పూజలు చేస్తే కరువులు పోతాయి. కాకపోతే, ఆ కొండ చాలా పెద్దది, వేలకొద్దీ మెట్లు ఎక్కి పోవాలి. కాళ్లూచేతులూ బాగున్నవాళ్లంతా వచ్చే పున్నమి రోజున వెళ్లి పూజలు చేయండి, ఫలితం ఉంటుంది' అని.

రాజుగారు చాటింపు వేశారు. ఆ పర్వతం చుట్టుపక్కల ఊళ్లవాళ్లంతా ఉత్సాహపడిపోయారు. పున్నమి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. తీరా ఆ రోజు రాగానే, వేల కొద్దీ జనం బారులుతీరి కొండదిశగా నడవసాగారు. అందరిలోనూ పట్టుదల కనిపిస్తోంది, నిష్ఠ కనిపిస్తోంది. వడివడిగా నడుస్తున్నారు.

ఆ జనంలో కలవకుండా, ఒక పిల్లవాడు మాత్రం విడిగా పరుగుతీస్తున్నాడు. అతని చేతిలో ఒక గొడుగున్నది.

ఒక పెద్దాయన అడిగాడూ - ఓరి పిల్లవాడా, ఎండ దంచికొడుతున్నది కదా, పైన చూస్తే ఒక మబ్బుతునకే లేదు కదా, చినుకుచుక్క రాలి ఏళ్లు గడిచాయి కదా, గొడుగెందుకురా తీసుకువస్తున్నావు? ఎవరిచేతిలోనన్నా చూశావా గొడుగుండడం?

అప్పుడు పిల్లవాడన్నాడూ - పెద్దాయనా, మనం ఇప్పుడు ఎందుకు వెడుతున్నాము? వర్షదేవతకు పూజచేస్తాము కదా, కన్నీటితో ఆ దేవతకు అభిషేకం చేస్తాము కదా, ఇంతమంది ప్రార్థనలను ఆమె ఆలకిస్తుంది కదా, మరి కొండ దిగేటప్పుడు వాన రాదా, అప్పుడు నేను తడిసిపోనా? అందుకే తెచ్చాను గొడుగు.

ఆ పెద్దాయన నవ్వాడు. వెంటనే ఆలోచనలో పడ్డాడు. పనిచేయడానికి పట్టుదలా నిష్ఠా

Thursday, July 14, 2011

అడుగే పడలేదు, అప్పుడే అధికార వాగ్దానాలు!!

సాధారణంగా జరిగే సంగతి చూద్దాము. కొత్త రాజకీయపార్టీ అవసరమున్నదని, ఆ అవసరాన్ని తాము తీర్చగలుగుతామని భావించిన కొందరు వ్యక్తులో, కొన్ని బృం దాలో కలసి పార్టీ అవతరణకు కావలసిన సన్నాహాలను ప్రారంభిస్తారు. రాజకీయ రంగంలో అప్పటికే ఉన్నవారిలోను, కొత్తగా రాజకీయాల్లోకి రాదలచుకున్న రాగలిగిన వారిలోను తమ సన్నాహాల గురించి, ఆశయాల గురించి ప్రచారం చేస్తూ బలాన్ని కూడగట్టుకుంటారు. పార్టీ స్థాయిని, పరిధిని బట్టి, తగిన సంఖ్య వచ్చిన తరువాత అందరూ కలసి ఒక విధానచట్రాన్ని రూపొందించుకుంటారు. ఒక అవతరణసభనో, మహాసభనో, ప్లీనరీయో పెట్టుకుని ఆ పార్టీ రూపురేఖలను, విధివిధానాలను, వైఖరులను ఆవిష్కరిస్తారు. వాటి ఆధారంగా రాజకీయపార్టీ వివిధ సందర్భాలలో తన స్పందనలను ప్రకటిస్తుంది. ఎన్నికలు సమీపించినప్పుడు, ఆ విధివిధానాల ఆధారంగా రూపొందించుకునే లక్ష్యాలను, చేసే వాగ్దానాలను, ఇచ్చే హామీలను ఓటర్ల ముందుకు తీసుకువెడతారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం చూస్తే, ఎన్నికలు రేపో ఎల్లుండో వస్తున్నాయేమోనని భ్రమపడే అవకాశం ఉన్నది. పార్టీ విధానాలు ఏమిటో చెబుతారని ఆసక్తిగా చూసినవారికి ఆయన ఎన్నికల మేనిఫెస్టోను అందించారు. తెలంగాణ గురించి తన పార్టీ వైఖరిని స్పష్టతతో చెప్పలేకపోయారు కానీ, తను అధికారంలోకి వస్తే ఎన్ని కిలోల సబ్సిడీ బియ్యం ఇస్తారో, 108, 104లకు తోడు కొత్తగా ప్రారంభించే సంచార సేవావాహనాల నెంబర్లేమిటో, వృద్ధాప్యపింఛన్లు ఎంత పెంచుతారో,

Monday, July 4, 2011

అవే మాటలు, అవే చేతలు, అవే ప్రతిజ్ఞలు...

డెజా వూ అన్న ఫ్రెంచి మాటకు అర్థం - ఇంతకు ముందే చూసినది - అని. ఒక దృశ్యం కానీ, సన్నివేశం కానీ, పరిస్థితుల సంపుటి కానీ ఎదురయినప్పుడు - అది ఇంతకు మునుపే అనుభవంలోకి వచ్చినట్టు అనిపించడమే డెజా వూ. మనోవైజ్ఞానిక శాస్త్ర పరిభాషగా వాడుకలోకి వచ్చిన ఈ మాట, ఇప్పుడు ఇతర శాస్త్ర, కళారంగాల రచనల్లోనూ, సాధారణ వ్యక్తీకరణల్లో కూడా భాగమైంది. రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన జరిగిన 80ల చివర్లో వరవరరావు డెజావూ శీర్షికతో ఒక గొప్ప దీర్ఘ కవిత రాశారు.

చరిత్ర పునరావృత్తం అవుతుందంటారు. నిజమే, కానీ యథాతథంగా కాదంటారు మార్క్స్. మొదటిసారి విషాదంగా జరిగినది రెండోసారి ఆభాసగా జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి మనిషికి సొంత జ్ఞాపకశక్తి ఉంటుంది, అంతేకాదు, సామూహిక జ్ఞాపకాలను చరిత్రగా, పురాణాలుగా భద్రపరచుకోవడం మనిషికి తెలుసు. విజయమో అపజయమో, సంబరమో సంక్షోభమో తారసపడినప్పుడు, గతంలోని అటువంటి సందర్భాలు గుర్తుకురావడం సహజం. అటువంటి అనేక పునరావృత్తాల నుంచి మనిషి అనుభవమూ జ్ఞానమూ పదునెక్కుతూ వచ్చింది.

తరచు ఎదురుపడే ఒకేరకమైన సందర్భాలను చూసి విసిగిపోయో, అర్థం చేసుకునే శక్తిలేకో మనిషి వేదాంతంలో పడిపోయి, జీవితం రంగులరాట్నం అనీ, చరిత్ర అంటే చర్విత చర్వణం అనీ, నిరంతరం ఒకే సంఘటనల క్రమం వలయాకారంలో జరుగుతుంటుందని నిర్ధారణకు వచ్చాడు. కానీ, అది నైరాశ్యంతోనో చమత్కారంగానో చెప్పుకునేదే తప్ప హేతువుకు నిలిచేది కాదని భౌతికవాదులు ఖండిస్తూనే వస్తున్నారు. 'చరిత్ర పునరావృత్తమయ్యేదే నిజమైతే, మనిషి ఊహించని సంఘటనలు ఇన్ని ఎట్లా జరుగుతాయి? జరిగేది ప్రతీదీ మునుపెప్పుడో జరిగినదే

Sunday, July 3, 2011

మావో తప్పులు

ఆర్థిక విధానాల విషయంలో మావో జెడాంగ్ చేసినవన్నీ తప్పులేనని చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) తాజాగా నిర్ధారణకు వచ్చింది. మావో విధానాలలో 70 శాతం ఒప్పులని, 30 శాతం తప్పులని మూడు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్న సిపిసి ఇప్పుడు ఆర్థిక రంగంలో మాత్రం నూటికి నూరుశాతం తప్పులేనని లెక్క మార్చింది. శుక్రవారం నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ తాజా అవగాహనను పార్టీ చరిత్ర విభాగం బాధ్యులొకరు వెల్లడించారు. డెంగ్ సియావో పెంగ్ సంస్కరణల వల్లనే చైనాలో నేటి ప్రగతి సాధ్యపడిందని ఆయన ప్రకటించారు.

సిపిసి 90వ వార్షికోత్సవాల సందర్భంగా చైనా అంతటా వెలసిన బ్యానర్లలో, పోస్టర్లలో ఎక్కడో కానీ మావో చిత్రం కనిపించదు. ఎర్రజెండా, సుత్తీకొడవలి ఉంటాయి కానీ, ఇంతకాలం చైనాకు సంకేతంగా ఉన్న తియనాన్మెన్ స్వ్కేర్ కానీ, మావో సమాధిమందిరం కానీ ఏ ప్రచారసామగ్రిలోనూ లేవు. ఆకాశాన్నంటే భవనాలు, ఒలెంపిక్స్ సందర్భంగా నిర్మించిన సముదాయాలు చైనా ప్రగతికి సంకేతాలుగా చూపిస్తున్నారు. గంటకు రెండువందల మైళ్ల వేగంతో బీజింగ్-షాంఘై నగరాల మధ్య నడిచే బులెట్ ట్రెయిన్ జూన్ 30 నాడు ప్రారంభమైంది. ఈ రైలు గురించి ప్రపంచ మీడియా అంతా ముచ్చటగా రిపోర్టు చేసింది. ఈ మధ్యే చైనా సముద్ర జలాల మధ్య ప్రపంచంలోనే అతి పొడవైన వంతెనను నిర్మించి అమెరికా రికార్డును తిరగరాసింది. త్రీగోర్జెస్ ఆనకట్ట కానీ, ఒలంపిక్స్ నిర్వహించిన తీరు కానీ చైనా బృహత్ నిర్మాణశక్తిని, నిర్వహణాశక్తిని ప్రపంచానికి చాటే చిహ్నాలే. మావోను నమ్ముకుని ఉంటే ఈ అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని చైనా ప్రస్తుత నాయకత్వం గట్టిగా నమ్ముతోంది.

మావో 'భూతాన్ని' వదిలించుకోగలిగితే డెంగ్ ఎప్పుడో వదలించుకునేవారు. మావో నామరూపాలు లేకుండా చేసేవారు. సాంస్క­ృతిక విప్లవం కాలంలో పెట్టుబడిదారీ మార్గీయుడిగా ఆరోపితుడై శ్రమశిబిరాలలో కాలం

పావలా మరణం

ద్రవ్యోల్బణాన్ని, నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం వెయ్యిరూపాయల నోట్ల రద్దు వంటి దిగ్భ్రాంతికరమైన కఠినచర్య ఏదోతీసుకుంటుందన్న వదంతులను అమాయకులు నమ్ముతున్న సమయంలో, రిజర్వు బ్యాంకు మాత్రం ఒక 'చిల్లర' నిర్ణయం తీసుకున్నది. ఫలితంగా- పావలా అలియాస్ చారానా నాణెం మరణించింది. నిజానికి పావలా కాసు చాలాకాలంగా నల్లపూసైపోయింది. ఈ రోజు నుంచి అది అధికారికంగా కూడా చెల్లని కాసుగా మారిపోయింది. రూపాయి పావలా, రూపాయి ముప్పావలా అన్న లెక్కలు ఇక ఉండవు. రూపాయిన్నర, ఆ పైన రెండు రూపాయలు. లెక్కల్లో నామమాత్రంగా పైసలు ఇంకా ఉనికిలోనే ఉంటాయి కానీ, చిల్లర లావాదేవీల్లో మాత్రం దగ్గరి 'రౌండ్ ఫిగర్'లోకి సర్దుకుపోతాయి. పైస, రెండు పైసలు, మూడు పైసలు, ఐదుపైసలు, పదిపైసలు, ఇరవైపైసలు, పావలా - ఇప్పటిదాకా ఈ ఆధునిక భారతీయ నాణేలు కాలగర్భంలో కలసిపోయాయి. ఇక అర్థరూపాయిది తరువాతి వంతు. రూపాయి అస్తమయం కూడా ఎంతో దూరంలో లేకపోవచ్చు.

పెన్నీలు, సెంట్లు ఇంకా సంపన్నదేశాల్లో గలగలలాడుతుండగా, మన పైసలు ఎందుకింత నీరసించిపోయాయో తెలుసుకోవడానికి ఆర్థికశాస్త్ర పరిచయమేమీ అక్కరలేదు. నోటు స్థాయి నుంచి చిల్లరనాణేల స్థాయికి రూపాయి, రెండు రూపాయలు, ఐదురూపాయలు పడిపోయి చాలా కాలమైంది. ఒక దేశపు ధనం దిగజారనిదేమరో దేశపు ధనం ధగధగలాడదు. డాలర్ స్థిరకక్ష్యలో వెలిగిపోతుంటే, రూపాయి ఆరిపోయిన నక్షత్రంలాగా తరిగిపోతూ వస్తున్నది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి మన దేశీయ మార్కెట్ దాకా జరిగిన అనేక మార్పుల వల్ల డబ్బుకు చాలా జబ్బు చేసింది.   ఆర్థిక అంతరాలు పెరిగిపోయి, వినిమయ సంస్క­ృతి విజృంభించి, దరిద్రరేఖకు దిగువన సైతం సంక్షేమ కవచాలు తొలగిపోయి, కనీసావసరాలు సైతం గుత్తవ్యాపారాల చేతికి పోయిన తరువాత

Monday, June 27, 2011

తీరనిలోటే కానీ, తీర్చవలసిన లోటు కూడా

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఎవరు, ఆయన ఏ వాదాన్ని ప్రచారం చేశారు, ఏ రాజకీయ లక్ష్యం కోసం పనిచేశారు- అన్న ప్రశ్నలను కాసేపు పక్కన పెడదాం. ఆయన ఉర్రూతలూగించే ఉపన్యాసాలు చేసినవారు కాదు, కుండబద్దలు కొట్టే మాటలతో మైకులు విరగ్గొట్టినవారు కాదు, జనావేశాల సోపానాల మీద ప్రతిష్ఠను ప్రాబల్యాన్ని పెంచుకున్నవారు కాదు. ఆయన కేవలం ఒక అధ్యాపకుడు. ఒక పరిశోధకుడు. ఒక రచయిత. ప్రచార కార్యకర్త. సలహాదారు. నిర్వహించిన వైస్‌చాన్సలర్ వంటి ఉన్నతపదవులతో సహా ఆయన వృత్తిప్రవృత్తులన్నీ విద్యావిషయికమైనవే. బౌద్ధికమైనవే. అటువంటి ఒక మేధావి, పాఠాలు చెప్పే పంతులు, సాధుజీవి, స్వాదుసంభాషి అనారోగ్యంతో కన్నుమూస్తే తెలంగాణ ప్రజానీకం గుండె ఎందుకు పగిలింది? ఎందుకు దిక్కులదిరేట్లు రోదించింది? ఆయన పార్థివ కాయానికి జనసాంస్కృతికలాంఛనాలతో ఎందుకంత ఘనంగా వీడ్కోలు పలికింది? ఒక ఉపాధ్యాయుడికి అంతటి నివాళి లభించిన సందర్భం ఇటీవలికాలంలో ఎప్పుడన్నా చూశామా?

డెబ్భయ్యారేళ్లు బతికిన మనిషి అనారోగ్యమరణం దిగ్భ్రాంతి కలిగించేదేమీ కాకపోవచ్చు. కానీ, జయశంకర్ విషయంలో అది అకాల మరణమూ ఆకస్మిక మరణమూ అయింది. అరవయ్యేళ్లుగా తెలంగాణ నిప్పును కాపాడుకుంటూ వస్తున్న జయశంకర్ ప్రస్తుత ఉద్యమం పతాకఘట్టంలో అస్తమించడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎదిగిన సంతానం ప్రయోజకులైతేనో, పెళ్లి చేసుకుంటేనో చూడాలనుకుని ప్రాణం ఉగ్గపట్టుకున్న వృద్ధుడు, కోరిక తీరకుండానే కన్నుమూస్తే దుఃఖం అంతా ఆ తీరనికోరిక చుట్టూనే సుడితిరిగినట్టు, జయశంకర్ నిష్క్రమణ వేదన తెలంగాణ శేష ఆకాంక్ష నే ప్రతిధ్వనించింది. సాపేక్షమైన స్తబ్దతలో పడి, తరువాతి అడుగు ఏమిటో తెలియని అయోమయంలో ఉన్న తెలంగాణ ఉద్యమంలో అంతర్లీనంగా వినిపిస్తున్న అసహనపు ఆవేదన ఏదో జయశంకర్ సంతాప వాతావరణంగా రూపుదిద్దుకున్నది. తెలంగాణ ఉద్యమానికి,

Monday, June 20, 2011

కింగ్‌శుక్‌నాగ్ : రెండు పరిష్కారాలు

హైదరాబాద్ లో పనిచేస్తున్న ఇద్దరు ఉత్తరాదివాళ్లు ఈ మధ్య ఒక మీటింగ్‌లో కలిశారు. ఎవరు ఎవరిని కాస్త తీరిగ్గా కలసినా తెలంగాణ ప్రస్తావనకు రాకతప్పని రోజులు కదా? ఆ ఇద్దరిలో అతను పంజాబీ, ఆమె బెంగాలీ. ఇదంతా చివరకు ఏమవుతుంది? అని ఆయన అడిగాడు. ఏదో ఒకరీతిలో విభజన తప్పదేమో? అని సమాధానం చెప్పాను. అవునా, అట్లా జరుగుతుందా, కేంద్రం అందుకు ఒప్పుకుంటుందా? అని ఆయ న ఆశ్చర్యపోయాడు. పంచనదులకు తోడు నెత్తురే ఆరోనదిగా ప్రవహించిన పంజాబ్ ను ంచి వచ్చాడు ఆయన. వేలకొద్దీ హతులయినా, చండీగఢ్‌ను పంజాబ్‌కు ఇచ్చేయడం వం టి చిన్న డిమాండ్ కూడా నెరవేర్చని ప్రభుత్వం మనది. ప్రత్యేక రాష్ట్రం అడిగితే ఇచ్చేస్తా రా? అన్నది ఆయన విస్మయానికి కారణం కావచ్చు. బెంగాలీ ఆమె అయితే, హైదరాబాద్‌కు వచ్చి ఏడాదికూడా కాలేదు, కానీ రాష్ట్రవిభజన అన్న ఊహకే కలవరపడినట్టు కనిపించారు. ఈ హైదరాబాద్, ఈ డెవలప్‌మెంటూ అంతా తెలంగాణ ఖాతాలో చేరిపోతుందా అని ప్రశ్నించారు. ఎందుకు విడిపోవడం, ఇంతకాలం కలసి ఉన్నారు కదా, సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చును కదా? అని వరుస సందేహాలను గుప్పించారు. రాష్ట్ర సమైక్యతలో ఈ ఇద్దరు పరరాష్ట్రీయులకు అంత ఆసక్తి ఉండడం ఆశ్చర్యమే అనిపించింది.

ఒకప్పుడు తెలుగువారు అన్నా, ఆంధ్రప్రదేశ్ అన్నా ఉత్తరాదివారికి తెలియనికాలం ఉండేది. వారి దృష్టిలో అందరూ మదరాసీలే. ఎన్టీయార్ ఏమి చేసినా చేయకపోయినా, తెలుగు వారంటూ కొందరున్నారని జాతీయస్థాయిలో చాటింపు వేశారు. 90 దశకం తరువాత హైదరాబాద్‌కు చంద్రబాబు తీసుకువచ్చిన 'వైభవం' కారణంగా, ఆంధ్రప్రదేశ్ అప్రధానమైపోయి హైదరాబాద్ ఒక్కటే అందరికీ తెలిసిన కాలం వచ్చింది. అందరూ అంటే సామాన్యులందరికీ అని కాదు. నూతన ఆర్థిక విధానాల అభివృద్ధి రథం మీద పరుగులు తీస్తున్నవారికీ, తీయాలనుకుంటున్నవారికీ హైదరాబాద్, బెంగుళూరు సుపరిచితాలై పోయాయి. రాష్ట్ర విభజన అనగానే హైదరాబాద్ సంగతి ఏమిటన్న ఆందోళన ఆ వర్గాలకే మొదట కలిగింది. విభజనను వ్యతిరేకిస్తున్న తెలంగాణేతర ప్రాంతాల వారికి హైదరాబాద్ ప్రతిపత్తి గురించిన ఆందోళన లేదని కాదు. వాదనలో భాగంగా హైదరాబాద్‌లో తాము తీసుకువచ్చిన

Tuesday, June 14, 2011

ప్రజలు ఏకం, నేతలు అనేకం

తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి, సీనియర్ రాజకీయనాయకుడు ఎస్.జైపాల్‌రెడ్డి శనివారం నాడు జాతీయ, ప్రాంతీయ, ఉపప్రాంతీయ వాదాల గురించి చేసిన వ్యాఖ్యలు వెనువెంటనే తీవ్రప్రతిస్పందనలను ఆహ్వానించాయి. గంటారెండుగంటల్లోనే ఆయన తన మాటలు తెలంగాణ ఉద్యమాన్ని ఉద్దేశించినవి కావని వివరణ ఇవ్వవలసి వచ్చింది. ఆయన ఏ అర్థంలో అన్నారు, అర్థంచేసుకున్న వారెట్లా చేసుకున్నారు అన్నవి ఇక్కడ అప్రస్తుతం కానీ, తెలంగాణలో రాజకీయ వాతావరణం ఎంత సున్నితంగా ఉన్నదో ఈ సంఘటన సూచిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు భిన్నంగా మాట్లాడడం ఏ తెలంగాణా ప్రాంత రాజకీయవాదికీ సాధ్యం కాని పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉన్నది. రాష్ట్ర విభజనపై అభ్యంతరాలున్న మార్క్సిస్టుపార్టీ, ఎంఐఎం పార్టీల ప్రతినిధులు కూడా సాధ్యమైనంత వరకు ఆ ప్రస్తావనే రాకుండా దాటవేయడమో లేదా అనాసక్తంగా ప్రతికూలత వ్యక్తం చేయడమో చేయగలుగుతున్నారు. ఇటువంటి వాతావరణం నెలకొనడానికి తెలంగాణ ప్రజానీకంలో అంతర్లీనంగా దృఢపడిన ఏకత, వ్యాపించిన ఉద్యమచైతన్యం కారణాలు. వీటినే తేలికమాటతో 'సెంటిమెంట్' అని అంటున్నారు. ప్రజల్లో ఉన్న ఏకత రాజకీయనేతల్లో కనిపించకపోవడం ఒక విచిత్రం అయితే, రాజకీయమనుగడ భయం తప్ప వారిలో ఉద్యమచైతన్యం జీర్ణం కాకపోవడం మరో వింత.

తెలంగాణ ఉద్యమం రెండు తెలుగు ప్రాంతాల మధ్య విభజనను తీవ్రం చేసిందని అనేవారున్నారు. కానీ, అది బయటివారితో పెంచిన దూరం కంటె, లోపలివారిలో కలిగించిన దగ్గరితనమే ఎక్కువ. తెలంగాణ సమాజంలో ఇటీవలి కాలం దాకా ఉన్న రకరకాల అంతర్గత వైరుధ్యాలు, విభేదాలు ప్రత్యేక ఉద్యమం కారణంగా మసకబారిపోయాయి. ప్రాంతమంతా ఒకటి, ప్రాంతీయులంతా ఒకటి అన్న దృశ్యం వ్యతిరేకులను కూడా ఆశ్చర్యపరుస్తున్న వాస్తవం. ఈ స్థితి ఒక్కరోజులో ఏర్పడింది కాదు. దశాబ్దంన్నరగా చిలికి చిలికిన ఉద్యమం 2009 నాటికి గాలివానగా మారింది. క్రమంగా విస్తరిస్తూ వచ్చిన ప్రత్యేక ఆకాంక్ష, ఏడాదిన్నర కిందట పెద్ద ముందంజ వేసి, తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన ఐక్యవాతావరణాన్ని సృష్టించింది. చిదంబరం ప్రకటనకు సీమాంధ్రప్రాంతాలలో, ముఖ్యంగా ఆ ప్రాంత రాజకీయనేతలలో వచ్చిన ప్రతిస్పందన కూడా తెలంగాణలో ఏకతకు ప్రేరణ అయింది.

చిదంబరం మరో ప్రకటన చేసిన తరువాత, ఉద్యమంలో చేరడం తెలంగాణ ప్రాంతంలో ప్రతి రాజకీయవాదికి మనుగడ మంత్రం అయింది. పార్టీల ప్రమేయంలేకుండా అందరు రాజకీయనేతలు ఒకే మాట మాట్లాడడం ఆ కాలంలోనే చూస్తాము. ఈ పదిహేడు నెలల కాలంలో ప్రజలలో 'సెంటిమెంట్' మరింత గట్టిపడింది. కానీ, ఆనాటి ఏకత రాజకీయవాదుల్లో లేకపోగా, నేడు భిన్నస్వరాలు పెరిగిపోయాయి. అందరినోటా తెలంగాణ జపమే, కానీ, ఆచరణ విషయం వచ్చేసరికి తలోదారి. జాతి, కులం, మతం, జెండర్, ప్రాంతం ప్రాతిపదికలమీద పోరాడే

Tuesday, June 7, 2011

కొత్త సామాజిక వ్యూహం కాంగ్రెస్‌కు సాధ్యమా?

సామాజిక, ఆర్థిక రంగాలలో పెద్ద మార్పులకు పాలకరాజకీయాలలో ఉన్న పార్టీలు ఇష్టపడవని, ఏదో రకంగా యథాతథస్థితిని కొనసాగించడానికే ప్రయత్నిస్తాయని వ్యవస్థాగత మార్పులు కోరేవారు విమర్శిస్తుంటారు. అందులో వాస్తవం చాలానే ఉన్నది. వర్తమానంలోని వ్యవస్థ వల్ల లబ్ధిపొందే వర్గాలకు ఎటువంటి ఇబ్బంది కలగనిరీతిలో, వీలుంటే వాటికి మరింత లబ్ధి అందించే విధంగా ప్రధాన రాజకీయపక్షాలు ప్రవర్తిస్తుంటాయి. వేగవంతమైన మార్పులు, ప్రయోజనాల ఘర్షణను తీవ్రం చేసే మార్పులు, సమాజంలోని అంతస్థులను తలకిందులు చేసే మార్పులు ఆ పక్షాలకు రుచించవు. ఆ దిశగా ప్రయత్నించే శక్తులను అణచివేయడానికి కూడా అవి ప్రయత్నిస్తూ ఉంటాయి.

అలాగని, సమాజగమనం నిలవనీరులాగా ఉండిపోదు. మార్పులు జరుగుతూనే ఉంటాయి. అన్ని రకాల మార్పులను నియంత్రించేశక్తి రాజకీయపక్షాలకూ ప్రభుత్వాలకూ ఉండదు. తాము తీసుకువచ్చే ప్రమాదరహితమైన, పైపై మెరుగుల సంస్కరణల వల్ల సంభవించే పరోక్ష ప్రభావాలను కనీసం కనిపెట్టగలిగే సామర్థ్యంకూడా ఒక్కోసారి పాలకవర్గాలకు ఉండదు. అలాగే, అట్టడుగు ప్రజలనుంచే కాక, సమాజంలోని అనేక ఇతర సెక్షన్ల నుంచి కూడా మార్పులను త్వరితం చేసే ఒత్తిళ్లు వస్తుంటాయి. సమాజంలోని అంతరాలను కాపాడాలని కంకణం కట్టుకున్న పార్టీలు సైతం ఆ అంతరాలను తగ్గించే, లేదా అంతరాలను తగ్గించే ప్రయాణాన్ని వేగవంతం చేసే మౌలికమార్పులను స్వయంగా తీసుకువస్తాయి. జాతీయ కాంగ్రెస్ కానీ, రాష్ట్రచరిత్రలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ కానీ అనేక సామాజికార్థిక మార్పులకు స్వయంగా సారథ్యం వహించాయి.

జాతీయోద్యమానికి నాయకత్వం వహించి, స్వాతంత్య్రానంతరం సుదీర్ఘకాలం ఏకఛత్రాధిపత్యంతో దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌పార్టీ స్వభావం గురించి అనేక ఆసక్తికరమైన పరిశీలనలు, సిద్ధాంతాలు వెలువడ్డాయి. బ్రిటిష్‌పాలనలో విద్యావంతులైన విద్యాధిక బృందాల నుంచి ఏర్పడిన కాంగ్రెస్‌పార్టీకి అప్పుడప్పుడే ఎదుగుతూవస్తున్న దేశీయపారిశ్రామిక వర్గం అండదండలందించింది. మొదట తిలక్-గోఖలే, తరువాత గాంధీ నాయకత్వాలలో దేశంలోని వివిధ శ్రేణులకు వేరువేరు ఉద్యమాచరణ రూపాలను అందించడం ద్వారా కాంగ్రెస్ జాతీయోద్యమానికి మహాఛత్ర సదృశమైన సంస్థరూపాన్ని అందించింది. విడిపోయిన ముస్లింలీగ్, కాంగ్రెస్ వర్ణాశ్రమదృక్పథాన్ని నిలదీసిన అంబేద్కర్, వర్గస్వభావాన్ని ప్రశ్నించిన కమ్యూనిస్టులు, అహింసాసత్యాగ్రహాలను దాటి ముందుకు వెళ్లిన విప్లవకారులు- జాతీయోద్యమంలో విలువైన పాత్ర నిర్వహించి ఉండవచ్చు. కానీ, నాయకత్వ

Tuesday, May 31, 2011

ఆరంభం అద్భుతం, ఆపై అంతంతమాత్రం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్నీ, కాంగ్రెస్ అప్రతిహత అధికారాన్ని కూలదోసి ఆ పార్టీ అధికారంలోకి రావడాన్నీ చూసినవారికి- అదంతా జరిగి మూడుదశాబ్దాలు కావస్తోందన్న స్ఫురణ ఆశ్చర్యం కలిగిస్తుంది. కాలం ఎంత త్వరత్వరగా గడచిందన్నదే కాదు, ఈ ముప్పయ్యేళ్లకాలంలో చకచకా జరిగిపోయిన అనేక పరిణామాలు, తెలుగువా రి సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవనంలో వచ్చిన మార్పులు విస్మయం కలిగిస్తాయి. ఆవిర్భావ, వైభవదశల నాటిపార్టీని నేటి పార్టీతో పోల్చుకుని బాధపడడానికి అనేక సహేతుక కారణాలే ఉన్నాయి.  పార్టీ పూర్వవైభవం సాధించితీరుతుందని గట్టిగా విశ్వసించే అభిమానులు సైతం, అనేక అంశాల్లో జరిగిన పతనాన్ని అంగీకరించితీరతారు. నాయక త్వ స్థాయిలోనూ సంస్థాగత వ్యవహారాల్లోనూ వచ్చిన మార్పులు సరే, తెలుగువారి చరిత్రలో ఆ పార్టీ కలిగించిన సంచలనం అలాగే కొనసాగిందా, అసంఖ్యాకుల్లో ఆశలు కలిగించిన ఆ పార్టీ గమనం ఏ దిశలో సాగింది- చర్చించుకోవడానికి కూడా ఇది సబబైన సందర్భమే.

రాష్ట్ర అవతరణ తరువాత కూడా రెండున్నరదశాబ్దాలకు పైగా కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగిందన్నమాటే కానీ, ఆంధ్రప్రదేశ్ సుస్థిరంగా, శాంతిగా ఉన్నదని చెప్పడానికి లేదు. పదేళ్లు దాటిన వెంటనే రెండు ఉద్యమాలు. ఒకటి శ్రీకాకుళ పోరాటం, రెండు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఆ తరువాత విశాఖ ఉక్కు ఉద్యమం, జై ఆంధ్ర . ఆపైన ఎమర్జెన్సీ తెలిసిందే. అల్పాయుష్షు ముఖ్యమంత్రిత్వాలు పీవీతో మొదలయి, మధ్యలో జలగం హయాం తరువాత, ఆనవాయితీగా మారిపోయాయి. చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంక్రటామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి.. తెలుగుదేశం అధికారానికి వచ్చేనాటికి ఇదీ వరస! ఎమర్జెన్సీ అనంతరం రమేజాబీపై అత్యాచారం సంఘటన పెద్ద ఉద్యమానికి దారితీసింది. కరీంనగర్‌జిల్లాలో నక్సల్బరీ రెండోతరం పోరాటాలు మొదలై, 1981 నాటికి ఇంద్రవెల్లి కాల్పులు, ఆ తరువాత సింగరేణి సమ్మె. కాంగ్రెస్ అధిష్ఠానం పదే పదే ముఖ్యమంత్రులను మార్చడం వల్లనే కాదు, రాష్ట్రంలో నాటి పరిస్థితులు కూడా మార్పునకు పరిపక్వమవుతూ వస్తున్నాయి. ప్రజలదేముంది కానీ, సాంప్రదాయిక భూస్వామ్యశక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌పార్టీపై, తీరాంధ్రప్రాంతానికి చెందిన

Wednesday, May 25, 2011

సంత్‌లెవరు? హంతకులెవరు?

ఇందిరాగాంధీ ప్రభుత్వం 1980 దశకం మొదట్లో సంజయ్‌గాంధీ స్మ­ృతిలో తపాలా బిళ్ల విడుదల చేసింది. పింగళి దశరథరామ్ సంపాదకత్వంలో విజయవాడ నుంచి వస్తున్న వివాదాస్పదమైన 'ఎన్‌కౌంటర్' మాసపత్రిక ఆ స్టాంపు విడుదల మీద తీవ్రమైన అభ్యంతరం చెబుతూ ఒక దిగ్భ్రాంతి కలిగించే పనిచేసింది. రేప్, హత్య కేసుల్లో ఉరిశిక్ష పడిన బిల్లా రంగాల ఫోటోలతో స్టాంపులను పత్రిక వెనుక అట్టమీద ప్రచురించింది. సంజయ్ పోస్టల్ స్టాంపుకు అర్హుడైతే ఈ ఇద్దరు నేరస్థులు మాత్రం ఎందుకు అర్హులు కారు? అని ప్రశ్నించింది. ఆ పత్రికకు ఎల్లోజర్నల్ అన్న పేరు ఉండింది. ఆ పత్రిక వ్యవహారశైలితో ఏకీభవించడం కష్టమే కానీ, సంజయ్ పేరుతో స్టాంపు విడుదలను ప్రశ్నించలేని ప్రధానస్రవంతి మీడియా బలహీనత ఏమిటో ఆ సంఘటన ఎత్తిచూపింది.

చట్టమో న్యాయమో ప్రధానస్రవంతి ఆలోచనాసరళో నేరస్థులుగా నిర్ధారించే వ్యక్తుల విషయంలో మీడియా చూపించే అమర్యాద, పేరుప్రతిష్ఠల మాటున, అధికారం మాటున అకృత్యాలకు పాల్పడినవారి మీద చూపించలేదు. బందిపోటును ఏకవచనంలో సంబోధించే పత్రికావార్త, రాజకీయాల్లో ఉన్న ఫ్యాక్షనిస్టును సంబోధించలేదు. ఎవరు గౌరవార్హులో ఎవరు కాదో నిర్ధారించే పని పత్రికలు తీసుకోకుండా, అందరికీ వ్యక్తిగత గౌరవాన్ని ఇవ్వడం ఒక న్యాయమైన పద్ధతి. మరి జేబుదొంగను, చెయిన్ స్నాచర్‌ని, రేపిస్టును శ్రీ, గారు తో సంబోధించడం కానీ, కనీసం క్రియావాచకంలో బహువచనం చేర్చడం కానీ సాధ్యమా? మన సామాజిక ఆలోచనావిధానం అందుకు అంగీకరించదు. తటస్థ సంబోధనకు ఇంగ్లీషులో ఉన్నంత వెసులుబాటు తెలుగుభాషలో లేదు కూడా. గౌరవవాచకాలైన శ్రీ, శ్రీమతి, గారు వంటివి పాతికేళ్లుగా పత్రికలు మానుకున్నాయి కాబట్టి సరిపోయింది కానీ, ఎందరెందరు అక్రమార్కులకు, అవినీతిపరులకు వాటిని తగిలించవలసివచ్చేదో?

జర్నయిల్ సింగ్ భింద్రన్‌వాలేకు 'సంత్' తగిలించాలా లేదా అన్నది అప్పట్లో ఒక చర్చ. భారతప్రభుత్వం సైనికచర్య ద్వారా ఆయనను హతమార్చకముందే, అతను హతం కావడానికి అర్హుడన్న నిర్ధారణకు

Tuesday, May 17, 2011

మెరుపు తగ్గినందుకే 'ఎరుపు' ఓటమి

బెంగాల్ అంటే భారతదేశపు తూర్పువాకిలి మాత్రమే కాదు మార్పువాకిలి కూడా. ఇంగ్లీషువాడు అడుగుపెట్టి తొలిరాజ్యం స్థాపించుకున్నది ఇక్కడే. సాంస్కృతిక పునరుజ్జీవనమని పిలిచే పడమటిగాడ్పు సుడులు తిరిగింది ఇక్కడే. రాజారామమోహన్‌రాయ్, ఈశ్వర్‌చంద్రవిద్యాసాగర్, బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీదేవి,హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, జగదీశ్‌చంద్రబోసు, సత్యజిత్‌రే, అమర్త్యసేన్.. చెప్పుకుంటూ పోతే జాతి గర్వించదగ్గ మేధావులు ప్రతిభావంతులు ధీరులు వీరులు వందల వేల సంఖ్యలో కనిపిస్తారు. బెంగాల్ నేడు ఏమి ఆలోచిస్తుందో దేశం రేపు అదే ఆలోచిస్తుందట. బెంగాల్ ఆకాశం ఎరుపెక్కినప్పుడు, ప్రపంచం దానివైపు ఆసక్తిగా చూసింది. జనం రైటర్స్ బిల్డింగ్ గర్భగుడిలో ఎర్రదేవుడిని ప్రతిష్ఠించినప్పుడు దేశమంతటా ఆ జైత్రయాత్ర కొనసాగుతుందనిపించింది.

చిట్టగాంగ్ వీరుల దగ్గరనుంచి చారుమజుందార్ దాకా బెంగాల్ ప్రజావిప్లవాలకు వేదికగానే ఉండింది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన తెభాగా రైతాంగ ఉద్యమం కానీ, స్వాతంత్య్రానంతరం రెండుసార్లు చెలరేగిన ఆహారభద్రతా ఉద్యమాలు కానీ బెంగాలీ ప్రజానీకాన్ని సమరశీలంగా మలిచాయి. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమానికి, చీలిక తరువాత అతివాద పక్షంగా ఉండిన మార్క్సిస్టు పార్టీకి, మరో చీలిక అనంతరం నక్సలైట్ పార్టీలకు బెంగాల్ వేదిక అయింది. 1967 నుంచే అధికారంలో భాగస్వామ్యం సాధించుకోగలిగిన మార్క్సిస్టు పార్టీ, ఎమర్జెన్సీ చీకటిరోజుల అనంతరం, 1977లో సహవామపక్షాలతో కలసి రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పరచే స్థాయికి ఎదిగింది. అధికారంలోకి రాగానే భూసంస్కరణల అమలును చేపట్టింది. మిగులు భూములను పంచడం, కౌలుదారుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించడం లక్ష్యాలుగా తొలిదఫా జ్యోతిబసు ప్రభుత్వం పనిచేసింది. ఫలితంగా, రాష్ట్రంలో పార్టీకి గట్టిపునాదులు వేయగలిగింది. అన్ని స్థాయిలలో ప్రభుత్వ యంత్రాంగంపై పార్టీ పట్టును స్థాపించగలిగింది.

రాష్ట్రంలో సిపిఎం నాయకత్వంలో బలంగా ఉండిన ట్రేడ్‌యూనియన్ ఉద్యమం, కిసాన్ ఉద్యమం వామపక్ష ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగేందుకు బాటలు వేశాయి.వామపక్ష ప్రభుత్వం హయాంలో సంక్షేమపథకాలు, పేదలకు అనుకూలమైన విధాన నిర్ణయాలు కొన్ని సాధ్యపడ్డాయి కానీ, పారిశ్రామికాభివృద్ధి మాత్రం అంగుళం ముందుకు సాగలేదు. ప్రతిపక్ష ప్రభుత్వమని చెప్పి కేంద్రం ప్రభుత్వరంగ పరిశ్రమలకు అవకాశం ఇవ్వలేదు. కమ్యూనిస్టు ప్రభుత్వమని, అల్లరిపెట్టే ట్రేడ్‌యూనియన్ల రాష్ట్రమని ప్రైవేటు రంగమూ ప్రవేశించలేదు. కమ్యూనిస్టు

Tuesday, May 3, 2011

నల్లవారి నెత్తురూ, భారతీయుల చెమటా.. మారిషస్

పూర్వం రాజాధిరాజులు దండయాత్రలకు వెళ్లినప్పుడూ దౌత్యయాత్రలకు వెళ్లినప్పుడూ వెంట పరివారంలో చరిత్రలేఖకులు (క్రానికలర్స్) కూడా ఉండేవారు. మొన్నకు మొన్న అమెరికా కూడా ఇరాక్ దురాక్రమణలో ఒక్కో పటాలంలో ఒక్కో పాత్రికేయుడిని కలిపి పంపించింది. ఎవరివెంట వెడతామో వారికి అప్రియమైన రీతిలో సత్యాలు రాయగలమా అన్నది కత్తిగొప్పదా కలం గొప్పదా అన్న ప్రశ్నంత జటిలమైనది. కానీ, కొన్ని అనుభవాలను సందర్భాలను ప్రత్యక్షంగా సమీపంగా పరిశీలించాలంటే మాత్రం రాజమార్గంలో వెళ్లవలసిందే. అత్యంత ముఖ్యమైన వ్యక్తితో కలసి విదేశపర్యటనకు వెళ్లడంలో ఆకర్షణ లేకపోతే సరే, కానీ ఆసక్తి కూడా లేకపోతే పాత్రికేయ ప్రవృత్తికి అన్యాయం జరిగిపోతుంది. చూసినదీ విన్నదీ ప్రపంచానికి తెలియజెప్పాలనే కోరికతో పాటు, నాలుగుదేశాలు తిరిగాలనే కుతూహలం ఉన్న పాత్రికేయులకు వివిఐపి పర్యటన ఒక సదవకాశం కూడా. ఆ అవకాశం జాతీయ మీడియాగా చెప్పే ఇంగ్లీషు, హిందీ పత్రికలకు, టీవీలకు దొరికనంతగా భాషాపత్రికలకు దొరకదు.

విదేశాంగశాఖకు చెందిన కొందరు మధ్యస్థాయి అధికారులకైతే, తెలుగుపత్రికలు ఏ నగరం నుంచి వెలువడతాయో కూడా తెలియదని తెలిసి ఆశ్చర్యం కలిగినప్పుడు, ఇక జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆ పత్రికలను సైతం భాగస్వాములను చేయడంలేదని బాధపడే ఆస్కారం ఎక్కడిది? రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌తో కలిసి మారిషస్‌లో ఐదురోజుల పాటు జరిపిన పర్యటన, దౌత్యవ్యవహారాలు ఎట్లా ఉంటాయో పరిచయం చేయడంతో పాటు, ఆ దేశం గురించి లీలామాత్రంగా ఒక అవగాహనను కూడా కలిగించింది.

సాధారణంగా ప్రధానమంత్రి పర్యటనలు తక్కువరోజుల్లో ఎక్కువ కార్యక్రమాలతో విరామం లేకుండా జరుగుతాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనలు సుదీర్ఘంగాను, కాసింత తీరుబడిగా సాగుతాయి. ప్రతిభాపాటిల్ పర్యటన మాత్రం ఐదురోజులూ వరుసకార్యక్రమాలతో ఒత్తిడిగానే సాగింది. నిర్ణయించిన చోట, నిర్ణయించిన కార్యక్రమాలలో పాల్గొనడం తప్ప, మారిషస్ ను పరిచయం చేసుకోవడానికి కావలసిన విరామం గానీ, వెసులుబాటు గానీ పాత్రికేయులకు దొరకలేదు.

చిన్న ద్వీపదేశం. చుట్టూ హిందూమహాసముద్రం. అయినా ఆఫ్రికా ఖండం. హైదరాబాద్ మహానగర జనాభాలో పదోవంతు అంత తక్కువ జనాభా. సన్నటి రోడ్లు. ఎక్కడ ఏ మాత్రం ఖాళీజాగా దొరికినా చరిత్రను గుర్తుచేసే చెరకుతోటలు. ఆకాశంవైపు దూసుకుపోయే భవనాలు కాక, రెండుమూడు అంతస్థులతో

Monday, April 18, 2011

అన్నా హజారే, బినాయక్‌సేన్, మన పౌరసమాజమూ

ఈవ్యవస్థ విచిత్రమైనది. అన్నిరకాలుగా విఫలమైందనీ, చికిత్స సాధ్యం కానంతగా శిథిలమైందనీ, ప్రజల్లో విశ్వసనీయత అట్టడుగుస్థాయికి చేరుకున్నదనీ అనుకునే సమయంలో ఏదో ఒక పార్శ్వం నుంచి ఒక ఆశ చిగురిస్తుంది. ఫరవాలేదు, కొనప్రాణం మిగిలేఉన్నది, దానికి కొంత జీవశక్తిని జోడిస్తే ధర్మం తిరిగి నాలుగుపాదా లా చరిస్తుంది-అనిపిస్తుంది. కలవరపడి, కుంగిపోయి, న్యూనత చెందీ, నిస్పృహలోకి వెడుతున్న సమయంలో, అంతాబాగానే ఉన్నది, ప్రయాణం ముందుకే సాగుతున్న ది- అన్న నమ్మకపు తునక మెరిసిపోతూ కనిపిస్తుంది. ప్రస్తుతానికి గండం గడిచింది లెమ్మని, వ్యవస్థ తిరిగి తన పాతదారుల్లోనే పరుగులు తీస్తుంది, మరో సంక్షోభపు మజిలీ దాకా!

అవినీతితో లుకలుకలాడుతున్న వ్యవస్థతో సమాజంలోని ప్రాబల్య శ్రేణులన్నీ ఏదో ఒక రకంగా సమాధానపడిపోయి లేదా, ఆ వ్యవస్థలోనే ఏదో రకంగా ప్రయోజనాల ను వెదుక్కుని నిమ్మకు నీరెత్తిన వేళ, అన్నా హజారే ఉద్యమం దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. నిరాహారదీక్ష ప్రారంభించిన వెంటనే ఊహించని రీతిలో మూలమూలలనుంచి హజారేకు మద్దతు రావడం మొదలయింది. అవినీతి సమస్యపైనే, 2జిస్కామ్ పై సంయుక్త పార్లమెంటరీ సంఘం నియమించాలన్న డిమాండ్ మీదనే పార్లమెంట్ సమావేశాలు ఒక విడత పూర్తిగా స్తంభించినప్పుడు, ప్రతిపక్షాలకు అనుకూలంగా గొంతువిప్పని ప్రజాస్వామ్యశక్తులు ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా సమీకృతమయ్యాయి? అధికారపక్షం, ప్రతిపక్షం అని లేకుండా రాజకీయపార్టీలన్నీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడమే కారణమని చెప్పుకోవాలి.
అన్నాహజారే మీద మాత్రం విశ్వాసం ఎందుకు? దశాబ్దాలుగా రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని శుభ్రంగా, సమృద్ధిగా అభివృద్ధి చేసిన ఒక క్షేత్రస్థాయి సంస్కర్తగా కీర్తిప్రతిష్ఠలను కూడగట్టుకున్న అన్నా, ఇప్పుడు ఆ ఖ్యాతిని

Monday, April 11, 2011

గుండెలు బాదుకుంటే తెలుగు వెలుగుతుందా?

"మౌలిక ఆలోచనలను తెలుగులో చెప్పే ప్రయత్నం ఒకప్పుడు కమ్యూనిస్టులు చేశా రు కానీ, 1950 ల తరువాత ఆ కృషి ముందుకు సాగినట్టు లేదు. కవిత్వ భాష గా, కాల్పనిక సాహిత్య భాషగా ఉన్నంతగా తెలుగు బౌద్ధిక భాష కాలేకపోయింది''- ఈ మాటలు అన్నది పి.వి. నరసింహారావు. 2000 సంవత్సరంలో ఆయనను విశాఖపట్నం లో కలుసుకుని ఒక ముప్పావుగంట మాట్లాడే అవకాశం దొరికింది. అప్పటికి ఆయన మాజీ ప్రధాని. బాబ్రీమసీదు విధ్వంసంలో తన పాత్ర నిమిత్త మాత్రమని చెప్పడానికి ఆయన ఇంగ్లీషులో ఒక రచన చేస్తున్నారు. తన భావాలను తెలుగులో చెప్పడంలో ఉండే కష్టం గురించి ప్రస్తావన వచ్చి, తెలుగు స్థితిగతుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. తెలుగును సకల అవసరాలకు పనికి వచ్చే భాషగా తీర్చిదిద్దడానికి తెలుగు అకాడమీ వంటి సంస్థలు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని ఆయన బాధపడ్డారు. సామాజిక శాస్త్రాలకు, శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన మౌలిక రచనలను చేయగలిగినప్పుడే, భాష పరిపుష్టం అయినట్టు లెక్క అని, అప్పుడే ఆ భాషా సమాజం కూడా అన్ని రంగాలలో పురోగతి సాధిస్తుందని ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

జాతీయస్థాయిలో చక్రం తిప్పి అభినవ చాణక్యుడిగా పేరు పొందిన బహుభాషావేత్త, మేధావి అయిన మాజీ ప్రధానికి తన తల్లిభాష స్థితిగతుల గురించి అంతటి లోతైన అవగాహన ఉన్నందుకు సంతోషించవచ్చు. ఆ స్థాయికి వెళ్లి కూడా తెలుగు కష్టాలను పరిష్కరించడానికి ఏమీ చేయలేదేమని బాధా కలగవచ్చు. ఏమైతేనేం, సమకాలీన అవసరాలకు తగినట్టుగా తెలుగు ఎదగలేకపోయింది. ఆధునికీకరణ సంగతి పక్కనబెడితే, అస లు భాష ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్న భయం వ్యాపించిపోయింది.

తెలుగుభాష గురించి ఆందోళన చెందుతున్న శ్రేణులు అనేకం. ఇంగ్లీషు మీడియం విద్య కారణంగా భాష నాశనమైపోతుందనేవారు, నిత్య వ్యవహారంలో ఇంగ్లీషు వాడకం పెరిగిపోయిందని బాధపడేవారు, పత్రికల్లో, టీవీఛానెళ్లలో భాష సంకరమైపోతున్నదని చింతించేవాళ్లు, తెలుగు పుస్తకాలకు సాహిత్యానికి ఆదరణ తరిగిపోతున్నదని ఆవేదన పడేవారు పెరిగిపోతున్నారు. తెలుగువాళ్లు ఒకరి ఎదుగుదలను ఒకరు ఓర్వరు అని చెప్పుకోవడం- స్వీయ విమర్శగా కనిపించే వెగటు ఛలోక్తి. ఇప్పుడు భాషను ప్రేమించ ని వారిగా తమను తాము విమర్శనాత్మకంగా అభివర్ణించుకోవడం తెలుగువారి తాజా చమత్కారం. ఈ సందోహంలో, తెలుగుని ఆధునిక అవసరాలకు పనికివచ్చేట్టుగా చేయలేకపోతున్నామని మథనపడేవారు కొద్దిమంది మాత్రమే. పదులసంఖ్యలోనో, వందల సంఖ్యలోనో వ్యవహర్తలు మిగిలిన పురాయుగపు ఆదివాసీభాషల మాదిరిగా

Monday, April 4, 2011

పొరుగుబూచిని దాటి మన జాతీయత ఎదగదా?

ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో జరిగిన పెద్ద యుద్ధం రష్యా-జపాన్ యుద్ధం. రెండు దేశాలూ అప్పుడు రాచరికంలోనే ఉన్నాయి. రెండు దేశాలకూ విస్తరణవాద దృష్టి ఉన్నది. యుద్ధంతో రెండుదేశాల ప్రజాప్రయోజనాలేమీ ముడిపడిలేవు. మంచూరియా, కొరియాల మీద ఆధిపత్యం కోసమే రెండు దేశాలూ పోరాటానికి దిగా యి. 1904లో మొదలై 1905లో ముగిసిన ఈ యుద్ధంలో జపాన్ గెలిచింది. ఒక దేశం మీద మరో దేశం గెలుపును ప్రపంచం మరో రకంగా అర్థం చేసుకుంది. అది ఒక ఐరోపా దేశం మీద ఒక ఆసియా దేశం గెలుపు. బ్రిటిష్‌పాలనలో ఉన్న భారతదేశ ప్రజలకు ఆ విజయం శుభసూచకంగా కనిపించింది. మునగాల రాజా రాజా నాయని వేంకట రంగారావు జపాన్ సైనాధిపతుల పేర్లు అడ్మిరల్ టోగో, జనరల్ నోగి తన పిల్లలకు ముద్దుపేర్లుగా పెట్టుకున్నారు. అంతే కాదు, ఆదిపూడి సోమనాథరావు అనే కవిపండితుని చేత 'జపాను దేశచరిత్రము' అనే కావ్యాన్ని రాయించారు.ఐరోపా ఖండంలో రష్యా ప్రాబల్యా న్ని నిరోధిస్తుంది కనుక జపాన్‌కు లోపాయికారీ సహాయం అందించిన బ్రిటిష్‌వారికి కూడా జపాన్ కీర్తన అభ్యంతరకరం కాకపోయింది. స్ఫూర్తి కోసం ప్రేరణల కోసం కను లు విప్పార్చి, మనసు తెరచుకుని వెదుక్కుంటున్న భారత నవ జాతీయవాదులకు జపాన్ గెలుపు చిన్న ఆలంబన అయింది.

అదే మునగాల రాజా, నైజాము రాజ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ప్రేరణగా శ్రీకృష్ణదేవరాయలను స్వీకరించారు. అంతకు కొన్ని సంవత్సరాల ముందు, రాబర్ట్ సోవెల్ కూర్చిన 'విస్మృతసామ్రాజ్యం' (ఫర్‌గాటెన్ ఎంపైర్) పుస్తకం విజయనగర రాజ్య వైభవాన్ని ఆవిష్కరించింది. న్యూనతలో పడిపోయిన దేశీయులకు గత వైభవ ప్రతీకను అందించింది. తెలుగు భాషాసాహిత్యాలకు పోషకుడైన చక్రవర్తి, తెలుగుకు ఆదరణ కరువైన నైజామురాజ్యంలో ప్రజలకు ప్రేరకుడు కాగలడని భావించి, 1901లో హైదరాబాద్‌లో స్థాపించి న గ్రంథాలయానికి కృష్ణదేవరాయల పేరు పెట్టాలని రంగారావు అనుకున్నారు.అదే శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం. తెలంగాణలో ప్రజాహితరంగం ఆవిర్భావానికి బీజం వేసిన తొలితెలుగు గ్రంథాలయం. తెలంగాణ ప్రాంతాన్ని ఎప్పుడూ పాలించకపోయినా, కృష్ణదేవరాయలు ఆ ప్రాంతానికి ఒక కాలంలో ఆత్మీయమైన చిహ్నం కాగలిగా రు. ఆ విషయం తెలిసి ఉంటే విగ్రహాలపై దాడి చేసినవారు ఆయన ప్రతిమపై సహనం చూపించి ఉండేవారు. 

ఆసియా అస్తిత్వం నుంచి జపాన్ విజయం, నైజాము అస్తిత్వం నుంచి కృష్ణదేవరాయ ల చరిత్రావిష్కరణ ప్రజాకాంక్షలకు దోహదకారి అయ్యాయి. జాతీయత కానీ, ప్రాంతీయత కానీ తమ తమ ప్రేరణలను బలీయమైన చిహ్నాల నుంచే వెదుక్కుంటాయి. భరతఖండం అనాదిగా ఉన్నదే అయినప్పటికీ,

Tuesday, March 29, 2011

ఆ అధ్యాయం అందరికీ అవమానం!

దక్షిణ, పశ్చిమ భాగాలు మాత్రమే భారతదేశం అయి ఉంటే, వృద్ధిరేటు బ్రహ్మాండంగా ఉండి ఉండేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం అమెరికన్ రాయబారి తో అన్నట్టు వికీలీక్స్ బయట పెట్టడంతో తీవ్రమైన ఖండనలు, విమర్శలు వస్తున్నా యి. చిదంబరం మాటలు ఉత్తర భారతదేశాన్ని అవమానించేవిగా ఉన్నాయని సమాజవాదీ పార్టీ పార్లమెంటు ఉభయసభల్లో అభ్యంతరం తెలియజేసింది. నిజానికి చిదంబరం అధిక ప్రసంగాన్ని ఉత్తరాది వారే కాదు, వివేకం విచక్షణ ఉన్నవారెవరైనా ఖండిస్తారు. దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలు బీదరికంలో ఉన్నాయి కాబట్టి, దక్షిణ, పశ్చిమభాగాలు సాధిస్తున్న వృద్ధిని అవి హరిస్తున్నాయన్నది చిదంబరం అభిప్రా యం. సోషల్ డార్వినిజం తలకెక్కితే వచ్చే ఆలోచనలు ఇవి. ద్వంద్వ యుద్ధపు గోదా లో ఎవరో ఒకరే సజీవంగా మిగలాలనుకునే ప్రాచీన రోమన్ ప్రభువులలాగానే, నూతన ప్రపంచపు నియో లిబరల్ ప్రతినిధులు కూడా పరాజితులను వారి ఖర్మానికి వారిని వదిలివేయాలనే ఆటవిక న్యాయాన్ని నమ్మేవారే.

చిదంబరం మాటలు వింటే కొన్ని సంవత్సరాల కిందట చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తాయి. కేంద్ర నిధుల కేటాయింపుల విషయంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదని, వెనుకబాటుతనం, అవసరాలు వంటి ప్రాతిపదికల కారణంగా బీహార్ వంటి రాష్ట్రాలకు

Wednesday, March 23, 2011

వేదికలన్నీ కిక్కిరిసిపోతున్న అనేకత్వపు కాలం!

ధ్వంసం అయిపోయిన విగ్రహాలను యథాస్థానంలో పునరుద్ధరించాలన్న డిమాండ్ రావడం, ప్రభుత్వం దానికి వెంటనే అంగీకరించడమూ వెంటవెంటనే జరిగిపోయాయి. ధ్వంసానికి కారకులయినవారు సైతం, కావాలంటే విగ్రహాలు మళ్లీ ప్రతిష్ఠించుకోవచ్చునని సంఘటన జరిగిన వెంటనే అనేశారు. అయితే, కూలిన విగ్రహాలతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాలను కూడా కలిపి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దారుణం జరిగిందని ఆవేదన చెందిన వాళ్లు కూడా మొదట యథాతథ స్థితిని పునరుద్ధరించి, తరువాత తెలంగాణ ప్రసిద్ధుల ప్రతిమలను ప్రతిష్ఠించుకోవచ్చునని అంటున్నారు. దానితో టాంక్‌బండ్‌మీద పెట్టవలసిన విగ్రహాల వరుస లో ఎవరెవరిని కొత్తగా చేర్చాలో సూచనలు రావడం మొదలయింది. ప్రాంతీయమైన పరిగణనతోనే కాకుండా, రకరకాల ప్రాతిపదికలపై డిమాండ్లు, సలహాలు వస్తున్నాయి. వాటన్నిటికీ గనుక ఆచరణ రూపం ఇస్తే, టాంక్‌బండ్ మాత్రమే కాదు, హుస్సేన్‌సాగర్ వలయాకారపు తీరమంతా విగ్రహాలతో కిటకిటలాడిపోతుంది. ఊహా మాత్రానికే అదొక అసాధ్యంగా, హాస్యాస్పదంగా, అధివాస్తవిక దృశ్యంగా కనిపించవచ్చును కానీ, ఇంతకాలం జరిగిన విస్మరణలకీ, సాధికార రాజకీయాలు ముందుకు తెస్తున్న సంకేతాత్మక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికీ ఆ బొమ్మల సమ్మర్దం ఒక ప్రతీక కూడా.

మా ప్రాంతం వాళ్లవి, మా వర్గం వాళ్లవి, మా ఉద్యమాల ప్రతినిధులవి విగ్రహాలో, చిహ్నాలో, నామకరణాలో ఉండాలని డిమాండ్ చేసే వారికి, అది ఒక రాజకీయ వ్యక్తీకరణే తప్ప, చారిత్రకమయిన, విద్యావిషయికమైన అవగాహనతో చేసే వ్యక్తీకరణ కాదు. బాబా సాహెబ్ అంబేద్కర్ కన్నుమూసిన ముప్పై అయిదేళ్ల తరువాత కానీ, ఆయన చిత్రపటం పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో ఆవిష్కృతం కాలేదు, ఆయనకు భారతరత్న గౌరవం దక్కలేదు. మరి స్వతంత్ర భారతదేశం అంతకాలం ఎందుకు ఆయనను విస్మరించింది? దళిత శ్రేణులైనా ఆ డిమాండ్‌ను

Monday, March 14, 2011

విగ్రహ విధ్వంసంపై నిగ్రహంతో విచారిద్దాం

ఎండాకాలం ఇంకా పూర్తిగా దిగబడకపోయినా, రోహిణీకార్తె రోజు వంటి ఆ మధ్యాహ్నాన్ని దాటి ఆ నాటికి ఉద్యమమూ ఉద్రిక్తతా ఉపశమించిన తరువాత, నగరం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు అర్థరాత్రి వేళ అందరిలాగానే నేనూ టాంక్‌బండ్‌మీదుగా మార్చ్‌పాస్ట్ చేశాను.

కూలిన కొలువుకూటం, శిథిల పేరోలగం, క్షతగాత్ర సరస్తీరం.
గురితెలియని ఆగ్రహాలు, వాలిన, కూలిన, తెగిపోయిన విగ్రహాలు.

ఏ కాలపు వీరులు వీరు, ఏ యుగాల కవులు వీరు, ఎప్పటి వైతాళికులు వీరు? ఇప్ప టి యుద్ధంలో ఎందుకు గాయపడ్డారు?
సన్నటి దుఃఖం. ఏదో అసౌకర్యం. ఒక చేదు. ఈ దృశ్యం అదృశ్యమైతే బాగుండును. ఈ సన్నివేశం ఒక భ్రమ అయితే బాగుండును. ఇదంతా జరగకుండా ఉండి ఉంటే బాగుండును.

విగ్రహాలలో నిక్షిప్తమైపోయినవి పురాస్మృతులు మాత్రమే కావు. వర్తమానంలో కూడా అవి అప్పుడప్పుడు వెలుగుతూ వచ్చినవే. ప్రతి ప్రతిమా ఎవరికో ఒకరికి సంకేత స్థలమే. ఎవరో ఒకరు పూలమాల వేసి పులకించిపోయినదే. ఆ బొమ్మకొలువు లో అన్నీ కాకున్నా కొన్ని ఊరేగింపులకు ఆరంభ కేంద్రమైనవే. ఉపన్యాసాలకు వేదికలయినవే.

నడుస్తున్న చరిత్ర సృష్టిస్తున్న అనేకానేక సందిగ్ధ సందర్భాలలో ఇదీ ఒకటి. ఒకే వాస్తవంలో ఇమడలేని అనేక సత్యాల, ఒకే వ్యక్తిత్వంలో ఒదగలేని అనేక అస్తిత్వాల ఘర్షణ ఇది. నా ఉద్వేగం నా వ్యక్తిగతమైనదిగా కనిపించవచ్చు, కానీ, నేననుభవించిన సంశ య ఉద్వేగాన్నే అనుభవిస్తున్నవారు అనేకులు ఉంటారని నాకు తెలుసు. దీర్ఘకాలంగా ఉద్యమాల వేదికగా ఉన్న తెలంగాణలో ప్రగతివాదాన్ని, సామాజిక న్యాయాన్ని బోధించిన రచయితలను ప్రాంతాలకు అతీతంగా ఆదరించారు,అనుసరించారు. అటువంటి అనుయాయులు, అభిమానులు ఒక్క తెలంగాణలోనే కాదు, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్రలో-అన్నిచోట్లా ఉంటారు. మన వివేకాని కీ, చైతన్యానికీ,

Monday, March 7, 2011

విత్తు ఏది నాటితే చెట్టు అదే మొలుస్తుంది

తన విగ్రహాన్ని తానే కూలదోసుకుంటున్న ఒక విధ్వంసకుడిని మనం మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లో చూడవచ్చు. సీవీసీ పదవిలో థామస్ నియామకం పాపం పూర్తిగా తనదే అని ఒప్పుకుంటున్న ప్రధానమంత్రి, అంతకుముందు టెలికంస్కామ్‌లో కూడా బోనులో నిలబడడానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. తనను ప్రధానిపదవి మీద కూర్చోబెట్టిన సోనియాపై, కాంగ్రెస్‌పార్టీపై ఆయనకున్న వల్లమాలిన కృతజ్ఞతాభావంతో ఆయన ఈ ప్రతిష్ఠాత్యాగానికి పాల్పడుతున్నారని అనిపించవచ్చును. అదీ నిజమే. అంతకంటె మించి, తానొక చిహ్నం గా, తనకు పర్యాయపదంగా ఉన్న సంస్కరణల రాజ్యం కుప్పకూలిపోకుండా, తనమీద తాను కొరడాదెబ్బలు ఝళిపించుకుంటున్నారని కూడా అనిపించవచ్చు. అది కూడా నిజమే. తనను తాను బతికించుకోవడానికి మన్మోహన్ వ్యక్తిగత ప్రతిష్ఠను కొంచెం కొంచెంగా కొరుక్కుతిన్న వ్యవస్థ, ఇక అతన్ని పూర్తిగా పిప్పిచేసి విసర్జించదలచుకున్నదనీ అనిపించవచ్చు. అది కొంచెం ఎక్కువ నిజం.

అవినీతి అన్నది పెద్దగా చర్చనీయాంశం కాకుండా పోయి చాలా కాలమే అయింది. కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన అవినీతి విషయంలో తక్షణ స్పందన చూపించని కేంద్రప్రభుత్వం, టుజీ స్కామ్ విషయంలో మేలుకొనవలసి వచ్చింది. ఆ కుంభకోణంలో భారతప్రభుత్వ ఖజానా కోల్పోయిన ఆదాయం లక్షా 70 కోట్ల భారీ మొత్తం కావడం వల్ల యుపిఎ ప్రభుత్వం ఆలస్యంగా అయినా స్పందించక తప్పలేదు. మరింత భారీనష్టం తేగల ఇస్రో ఒప్పందం వెనక్కి వెళ్లింది. టెలికం స్కామ్ పై జేపీసీ ఏర్పడింది. ఇంత హడావుడి జరుగుతున్న సమయంలోనే బోఫోర్స్ నిందితుడు ఖత్రోచీ కేసును విజయవంతంగా మూసివే శారు. అత్యంత ఆధునికమైన మెగా కుంభకోణాల కాలంలో, కాలంచెల్లిన పాత కాలం నాటి అవినీతి కేసులకేమి సందర్భం ఉంటుంది? ప్రశ్నలు వేసుకునే తీరును బట్టి సమాధానాలు తారసపడతాయి. మన్మోహన్‌సింగ్ అంతటి నిజాయితీ పరుడు కదా, అంతటి సౌమ్యుడు కదా, అంతటి ఆర్థికవేత్త కదా- ఇట్లా జరిగిందేమిటి అని బాధపడేవారు ఈ దేశంలో కోకొల్లలు. ఆయన సొంతంగా నీతిమంతుడే ఉత్తముడే పండితుడేకానీ, ఆయన సారథ్యం వహిస్తున్నది లాభాలను, ప్రయోజనాలను పిండడమే న్యాయంగా భావించే ఒక వ్యవస్థకు. అది ఆయనకు తెలియదని అనుకోలేము. అభివృద్ధి ఫలితాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో సంస్కరణలు తీసుకువచ్చాము, వాటిని కొందరే తన్నుకుపోవడం బాధ కలిగిస్తున్నది- అని 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ దిశను మార్చడంలో నిమిత్తమాత్రుడైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు- పదవినుంచి దిగిపోయిన తరువాత వ్యాఖ్యానించారు. నిమిత్తమాత్రుడు అని ఎందుకు అనాలంటే, రాజకీయంగా ఏకధ్రువ ప్రపంచం అవతరించి, ఎల్లలు లేని ఆర్థిక అంతర్జాతీయ సామ్రాజ్యం పాదుకొనడానికి దారితీసిన పరిస్థితులు పీవీ నరసింహారావు చేతిలో ఉన్నవి కావు. ప్రపంచ ప్రభువులకు కావలసిన కార్యం గంధర్వుని వలె ఆయన తీర్చాడు. ఆయనకు చేదోడు ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్ నాటి నుంచి దేశంలోని మార్పులకు కారకుడూ, చోదకుడూ, పర్యవేక్షకుడూ అయ్యారు.
లైసెన్స్‌రాజ్యంలో అవినీతి, మందకొడితనం, అభివృద్ధిని అడ్డుకునే తత్వమూ ఉంటాయని,

Monday, February 28, 2011

దూరపు ఉద్యమాలు ఎరుపు

అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? చెలాయించే వ్యవస్థకు ఉన్న క్రూరమైన అణచివేత శక్తి నుంచి వస్తుందా? అంగబలం నుంచీ సైనికబలం నుంచీ వస్తుందా? కాదు కాదు, అధికారాన్ని ఆమోదించి తలదాల్చే ప్రజలనుంచే వస్తుందంటారు జీన్ షార్ప్. టునీషియా, ఈజిప్టు నుంచి మొదలై దావానలంలా వ్యాపిస్తున్న ప్రజాస్వామిక ఉద్యమాల నేపథ్యంలో ఈయన పేరు ఇప్పుడు తరచు ప్రస్తావనకు వస్తోంది. నియంతృత్వ ప్రభుత్వాలపై 'అహింసాయుత ప్రతిఘటన' ఎట్లా చేయవచ్చో ఒక సమగ్ర సిద్ధాంతాన్నీ, మార్గదర్శక సూత్రాలను రూపొందించిన అమెరికన్ మేధావి షార్ప్. గాంధీ మీద ఈయన పెద్ద పరిశోధనే చేశారు. మరీ క్రూరమైన నియంతృత్వాల విషయంలో గాంధీమార్గం చాలదని షార్ప్ అంటారు. సమాజంలో అట్టడుగునుంచి పై దాకా ఉన్న వివిధ శ్రేణుల మధ్య జరిగే సహకారం మీదనే వ్యవస్థ నడుస్తుందని, ఆ సహకారానికి గండిపడితే పాలకులు బలహీనపడతారని ఈయన సిద్ధాంతం. అహింసాయుత సహాయ నిరాకరణ అంటే మరేమీ లేదు, అది క్రియాశీల ప్రతిఘటనే, కాకపోతే కాస్త జాగ్రత్తగా, తెలివిగా పన్నే వ్యూహం అంటారాయన.

అరబ్ దేశాలలో ప్రభుత్వాలపై నిరసన శాంతియుతంగా, సృజనాత్మకమైన రీతుల్లో సాగిన మాట వాస్తవమే. ప్రభుత్వాలపై నైతికమయిన ఒత్తిడిని పెంచడంతో పాటు, మొక్కబోని దృఢసంకల్పాన్ని ప్రదర్శించడం ద్వారా లక్షలాది మంది ప్రజలు రాజకీయ పోరాటం చేశారు, చేస్తున్నారు. అరబ్ దేశాలపై మీడియాలో, అంతర్జాతీయ సమాజంలో ఉన్న స్థిరాభిప్రాయం రీత్యా- అటువంటి ప్రతిఘటనలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ ఆశ్చర్యం కారణంగానూ, మరి కొన్ని రాజకీయ కారణాల వల్లనూ వాటికి ప్రచారం కూడా అధికంగానే లభించింది. చివరకు మన దేశంలో కూడా వివిధ ఉద్యమాల నేతలు, రాజకీయనేతలు ఈజిప్ట్ తరహా ప్రజావెల్లువ వస్తుందనో, తీసుకు వస్తామనో హెచ్చరించడం వింటున్నాము. కానీ, ఈజిప్ట్ తరహా ఉద్యమాన్ని నిర్మించడం అంత తేలిక కాదు. ఆ ఉద్యమంలో కొంత యాదృచ్ఛికత, కొంత తక్షణ స్పందన, కొంత నెట్‌వర్కింగ్ కలసి పనిచేయడమే కాదు, సాంప్రదాయికమైన నాయకత్వం లేకపోవడం అనే సౌలభ్యం కూడా ఉన్నది.

అయితే, మన దేశంలో అటువంటి ఉద్యమాలే జరగనట్టు, అసలు పెద్ద ఎత్తున ప్రజావెల్లువ రావడం మన దేశానికి అసలు తెలియనే తెలియనట్టు ఈజిప్టు జపంచేయడం కూడా తగదు. తరువాత కాలంలో కొంత మిలిటెంట్ స్వభావాన్ని కూడా అలవరచుకున్నప్పటికీ, ఛాత్ర సంఘర్ష పరిషత్ ఆధ్వర్యంలో 1970ల మధ్యలో ఉత్తరాదిలో నడిచిన ఉద్యమం స్వతంత్ర భారతదేశానికి కొత్తదే. అది సుదీర్ఘకాలం నడవడమే కాదు, కేంద్రప్రభుత్వాన్నే కుదిపివేయగలిగిన రాజకీయ ఉద్యమంగా పరిణమించినది. ఎమర్జెన్సీ అనంతరం దేశంలో ప్రజాస్వామిక ఆందోళనలు, ఉద్యమాలు సరికొత్త పోరాట రూపాలను అన్వేషించసాగాయి. 1980లో ఆరంభం లో అస్సాం విద్యార్థులు నిర్వహించిన ఉద్యమం సృజనాత్మకమైన ఆందోళనారూపాలను ఎంచుకున్నది. అస్సాం ఉద్యమానికి నేపథ్యంగా ఉన్న పరిస్థితుల వల్ల నెల్లీ మారణకాండ వంటి అవాంఛనీయ సంఘటన జరిగి ఉండవచ్చును కానీ, విద్యార్థులు నిర్వహించిన ఉద్యమం మేరకు శాంతియుతంగానే కాదు, నిరంతరాయంగా,

Tuesday, February 22, 2011

చలన చిత్రం: సంచలన ఉద్యమం

ముప్పై ఏండ్ల కిందటి మాట. మాభూమి సినిమా విడుద లైంది. సినిమా చివరలో తెలంగాణ ప్రజాగాయకుడు యాదగిరి పాత్రలో గద్దర్ పాట. ఆ తరువాత సాయుధ పోరాట దృశ్యాలు. సినిమా హాల్ అంతటా హోరెత్తిన నినాదాలు. నిశ్శబ్దంగా వ్యక్తులుగా సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఉన్నట్టుండి సమూహంగా మారిపోయారు. బొమ్మలు కదిలే తెర కాస్తా రంగస్థలం అయింది, రంగస్థలం తెరను చీల్చుకుని ప్రదర్శనశాలలోకి ప్రవహించింది.

ఇరవై ఏండ్ల కిందట ఒమార్ ముఖ్తార్ ఇంగ్లీషు సినిమా. అప్పుడే కాశ్మీర్‌లో ఆందోళనలు మొదలయ్యాయనుకుంటాను. సినిమా చివరలో పతాక పోరాట సన్నివేశం మొదలయినప్పుడు జాతి విముక్తి పోరాటాలు వర్థిల్లాలంటూ నినాదాలు దద్దరిల్లాయి. ఇంగ్లీ షు సినిమా తెలుగు బహిరంగ సభగా రూపుమార్చుకుంది.

చాలా కాలం తరువాత, మరోసారి సినిమా థియేటర్‌ను జనరంగంగా మార్చింది 'జై బోలో తెలంగాణా'. కళాత్మక విలువల రీత్యా పైన చెప్పిన రెండు సినిమాలతో దీనికి పోలిక తేనక్కరలేదు కానీ, ప్రేక్షకులను ప్రేక్షకులుగా మిగలనివ్వని ఉద్వేగం ఎట్లా ఉంటుందో ఈ చలనచిత్రం ఆవిష్కరించింది. ఒకే నటుడిని అభిమానించే ప్రేక్షకులలో కూడా సామూహిక ఉత్సాహం, కేరింతలు కనిపిస్తాయి. కానీ, ఇది అటువంటిది కాదు. ఆ సినిమాతో తాదాత్మ్యం చెందించే ఉద్వేగమేదో ప్రతి ప్రేక్షకుడి మనసులోనూ ముందే బలపడి ఉంది.

'జై బోలో తెలంగాణ' ప్రధాన స్రవంతి సినిమా సూత్రాలకు అనుగుణంగానే

Tuesday, February 15, 2011

సహారా... పూవై పూచెనో...

హోస్ని ముబారక్ ఒక బంటు.
పశ్చిమాసియాలో ప్రపంచ ప్రభువుల పాళెగాడు.
అరబ్బుల ఆకాంక్షలను కాలదన్ని ఇజ్రాయిల్‌కు వంతపాడే జాతిద్రోహి.
దేశసంపదను విదేశాలకు దోచిపెట్టి, దళారీ కమిషన్‌లతో స్విస్ బ్యాంకులకు పడగె త్తిన విషసర్పం. ముప్పైఏండ్లుగా తూతూమంత్రం రిఫరెండంలతో, నామమాత్రపు ఎన్నికలతో, ఎమర్జెన్సీ చట్టాలతో సింహాసనానికి అంటిపెట్టుకున్న నియంత. అటువంటి కర్కోటక ప్రభువును పద్ధెనిమిది రోజుల మహా ప్రతిఘటనతో ఉక్కిరిబిక్కిరి చేసి రాజభవనం నుంచి తోకముడిపించినందుకు ఈజిప్టు ప్రజానీకాన్ని అభినందించాలి.

చరిత్రగర్భాన్ని తొలుచుకుని మరోసారి ఆవిర్భవించినందుకు నైలునది నాగరికతకు, పిరమడ్ల వలె దృఢమైన జన సంకల్పానికి కూడా కాలదోషం పట్టదని నిరూపించిన తహ్రీర్ స్క్వేర్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. అంతకంటె మించి- అన్ని రోజులూ తనవే అన్న అహంకారంతో విర్రవీగుతున్న అమెరికాకు రోజులు మారతాయని గుర్తు చేయించినందుకు ప్రజాస్వామ్యవాద అరబ్బులకు జేజేలు చెప్పాలి. అడియాసల లోకపుటెడారిలో పూలు పూయించిన సహారాదేశానికి సెహబాసు చెప్పాలి.

టునీషియా అనే చిన్న ఆఫ్రికన్ దేశంలో రగిలిన నిప్పుకణిక వెంటవెంటనే రగులుకు ని, ఆఫ్రికా, ఆసియా ఖండాలు రెంటిలోనూ ఉనికి కలిగిన ఈజిప్ట్‌లో దావానలమైంది. టునీషియాలో రాజుకున్న నిప్పురవ్వ సైతం చిన్నదేమీ కాదు. ఒక అల్పాదాయ యువకుడు, పండ్లవ్యాపారి దేశంలోని అవినీతిపాలనపై ఆగ్రహించి తనను తాను దహించుకు ని ఉద్యమాన్ని రగలించాడు. అగ్నిస్పర్శ కోసం నిరీక్షిస్తున్న ఎండుఅడవి వలె ఉన్న ఈజి ప్టు ప్రజానీకం నిప్పందుకున్నారు. ముబారక్ దిగేవరకు వీధులు వదలలేదు. అహింస ను, సహాయనిరాకరణాన్ని మార్గంగా ఎంచుకున్నారు, ఖడ్గసమానమైన సంకల్పాన్ని మాత్రం ఆయుధంగా ధరించారు.

అరబ్బులంటే అమెరికా దృష్టిలో అనాగరికులు లేదంటే అర్భకులు కాదంటే తీవ్రవాదులు. అమెరికా అని మాత్రమే కాదు, ఇంగ్లీషు విద్య తలకెక్కిన నాగరీకులకు, పశ్చిమదిక్కుకు తలలు తాకట్టుపెట్టిన

Thursday, February 3, 2011

గాంధీకి పాఠాలు నేర్పిన దక్షిణాఫ్రికా!

దర్బన్ దగ్గరలోని భారతీయులు అధికంగా ఉండే ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌కు వెళ్లి గాంధీ జీ ఇల్లు చూడబోయినప్పుడు-అది నిజంగా ఆయన నివసించిన నాటి ఇల్లు కాద ని, 1985లో జరిగిన హింసాకాండలో అది తగలబడితే నల్ల ప్రభుత్వం వచ్చాక పునర్నిర్మించారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఎమ్‌బెకీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన ఆ ఇంట్లో కేవలం అరుగులూ నేలా మాత్రమే ఆనాటివి, తక్కిన నిర్మాణమంతా కొత్తగా చేసినది. 'వర్ణవివక్షా హింసలో' ఆ ఇల్లు ధ్వంసమైందని అక్కడి శిలాఫలకంలో రాశారు కానీ, నిజానికి నల్లవారు భారత సంతతి వారిపై చేసిన దాడిలో నే అది తగలబడింది. నల్లవారికీ, భారత సంతతివారికీ ఘర్షణలు 1985లోనే మొదలు కాదు, 1949లో అదే సెటిల్మెంట్‌లో జరిగిన భారీ హింసాకాండలో రెండువందల మంది దాకా మరణించారు, మృతుల్లో అత్యధికులు భారత సంతతి వారే.

నేటి దక్షిణాఫ్రికా నల్ల వారికి గాంధీ అంటే బాగానే తెలుసు. ఆయన దేశం ఇండియా అని కూడా తెలుసు. దక్షిణాఫ్రికాలో ప్రారంభించి, ఇండియాలో ఉద్యమాలు కొనసాగించాడనీ తెలుసు. ఆయనపై గౌరవం ఉండవచ్చును కానీ, పెద్దగా ఆరాధన కనిపించదు. గాంధీ విగ్రహం దగ్గర భారతీయులు తప్ప వేరెవరూ ఫోటోలు దిగరు. పీటర్ మారిస్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో ఆయనను ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ నుంచి తోసేసిన చోట ఒక స్మార క ఫలకం ఉన్నది. అక్కడ ఎప్పటిదో వాడిన బొకే కనిపించింది తప్ప తాజా పుష్ఫగుచ్ఛాలేమీ లేవు.

ఎఎన్‌సిలో భారత సంతతి వారు గణనీయంగానే ఉన్నారు కనుక, ఉద్యమకారుల్లో అమరవీరుల్లో భారత సంతతి వారు కూడా ఉన్నారు కనుక, భారతదేశం వర్ణవివక్షకు వ్యతిరేకంగా సూత్రబద్ధ వైఖరితో నిలబడింది కనుక- 1994 విజయం తరువాత గాంధీజీతో సహా భారతదేశాన్ని, భారతీయ సంతతివారిని ప్రత్యేకంగా పరిగణించాలని

Tuesday, January 25, 2011

భోగ రాజకీయాలలో 'త్యాగం' ఒక అచ్చుతప్పు

ఎన్నికలప్పుడు తప్ప ప్రజాసమస్యలను అతిగా పట్టించుకోవలసిన అగత్యం రాకపోవడం మన ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేకత. మొదటిసారి గెలుపొందడానికి ముందు ప్రజాజీవితాన్ని నిర్మించుకునే క్రమంలో ఏవైనా ఉద్యమాలు ఆందోళనలు చేస్తారేమో, కాసిన్ని లాఠీదెబ్బలు, కొన్ని అరెస్టులు రుచిచూస్తారేమో కానీ, ఒకసారి చట్టసభలోకి ప్రవేశించారా, ఒకసారి అధికారపీఠాల మీద కూర్చున్నారా ఇక జీవితం ఒడ్డున పడ్డ ట్టే. ఆ పై రాజకీయ జీవితంలో ఎదురయ్యేవన్నీ ఆర్జనలూ అక్రమాల ఆరోపణలే.

ఏవో కొన్ని పార్టీల వారు, ఎవరో కొందరు సద్బుద్ధి కలిగిన వ్యక్తులు ఇందుకు మినహాయింపు గా కనిపించవచ్చును కానీ, మొత్తం మీద రాజకీయ చిత్రపటం సారాంశం ఇదే. పెత్తనం చేయాలనే కోరిక, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పేరిట ప్రజాధనాన్ని అపహరించే అవకాశాన్ని సొంతం చేసుకోవడం, సంపదను స్థిరపరచుకోవడానికి పదవులను, ప్రభుత్వ యంత్రాంగాన్నీ వినియోగించుకోగలగడం-ఇవే రాజకీయాల్లోకి ఆకర్షించే గుణాలైనప్పు డు, ఎన్నికల రాజకీయాలన్నీ స్వార్థం లోభం ప్రాతిపదికగా మాత్రమే వర్థిల్లుతున్నట్టు లెక్క. అటువంటి గంజాయివనంలో త్యాగశీలత, నిరాడంబరత వంటి తులసిమొక్కగుణాలకు ఆస్కారం ఉంటుందా? ఏమైనా త్యాగం చేసి ఎన్నాళ్లైంది- అని అడగండి రాజకీయవాదిని.

పెద్దలాభం కోసం చిన్నలాభాన్ని, పెద్దపదవి కోసం చిన్నపదవిని వదులుకోవడం కాదు, ఒక విలువ కోసం, ఒక ప్రజా లక్ష్యాన్ని సాధించడం కోసం- దేన్నైనా ఎప్పుడైనా వదులుకున్నావా? అని అడిగితే, అడిగినవాళ్లను ఆశ్చర్యంగా చూస్తాడు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో లంచం అలవాటు లేని ఉద్యోగిని తక్కిన వాళ్లు కూడా అట్లాగే చూస్తారు. ఆదాయాల నిచ్చెనలో త్వరత్వరగా ఎగబాకలేని అర్భకుడిని బంధువులూ పొరుగువారూ అట్లాగే చూస్తారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన రెండు దశాబ్దాలలో జాతీయస్థాయిలోనూ

Monday, January 10, 2011

ఈ నేతల చేతిలో ఏదీ తెగదు, ముడిపడదు

ఏదో ఒకటి చేయాలి, యథాతథస్థితి మాత్రం కొనసాగకూడదు-అన్నది శ్రీకృష్ణ కమిటీ నివేదిక గట్టిగా చెప్పిన ఒక అభిప్రాయం. కానీ, ఆశ్చర్యకరంగా శ్రీకృష్ణ నివేదిక మాత్రం రాష్ట్రంలో నెలకొని ఉన్న స్థితిని ఏ మాత్రం ప్రభావితం చేయకుండా యథాతథ సంక్షోభ స్థితినే కొనసాగిస్తున్నది. ప్రభావశీలతనే సాఫల్య వైఫల్యాలకు ప్రమాణంగా పరిగణిస్తే కనుక, శ్రీకృష్ణ కమిటీ విఫలమైనట్టే. చిదంబరం తెలంగాణ ప్రకటన చేసిన వెంటనే దిగ్భ్రాంతిని, ఆగ్రహావేశాలను ప్రకటించిన సమైక్యవాదులు శ్రీకృష్ణనివేదిక ప్రథమతాంబూలం ఇచ్చిన సూచనను చూసి సంతోషించి ఉండాలి, సంబరాలు చేసుకు ని ఉండాలి. ఏవో ఒకటి రెండు చోట్ల తప్ప అటువంటి హర్ష ప్రకటనలు కనిపించలేదు. అంటే, ప్రత్యేకవాదానికి పెద్ద దెబ్బ తగిలిందని, సమస్య ముగింపునకు వస్తున్నదని సమైక్యవాదులు కూడా అనుకోవడం లేదన్న మాట. లేదా, వారికి చిదంబరం ప్రకటన నాడు కలిగినంత తీవ్ర విముఖత ఇప్పుడు లేదన్న మాట. శ్రీకృష్ణ సూచనలు చూసి తెలంగాణవాదులు ఆగ్రహించినమాట, అందోళన చెందుతున్న మాట నిజమే, విద్యార్థులు తీవ్రం గా ప్రతిస్పందిస్తున్న మాటా నిజమే. ప్రజా ప్రతినిధుల్లో గుబులు, భవిష్యత్తు గురించిన భయం నెలకొన్న మాటా నిజమే. కానీ, ఇక ఆశ లేదు, అంతా అయిపోయిందన్న నిస్పృ హ కానీ, ఉద్యమానికి ఏదో కోలుకోలేని దెబ్బతగిలిందన్న దృష్టి కానీ తెలంగాణలో కనిపించడం లేదు. అంటే- శ్రీకృష్ణకమిటీ నివేదిక మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా, దానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఎవరూ ఇవ్వడం లేదు. అందువల్లనే, నివేదిక వెల్లడి తరువాత పరిస్థితి మరింత జటిలం అయిందే తప్ప, సరళం కాలేదు. అంతిమ నిర్ణయం కేంద్రం తీసుకోవలసింది కాబట్టి, కమిటీ నివేదికకు ప్రాధాన్యం లభించడం లేదన్నది కూడా వాస్తవం కాదు. ఇదే శ్రీకృష్ణ విభజనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి ఉంటే, ఇదే నివేదిక ప్రభావశాలిగా ఉండగలిగేది. అధ్యయనాలకు అందనంత గూఢంగానో, గాఢంగానో వాస్తవికత ఉన్నదా? లేక, అధ్యయనంతో సహా పరిస్థితి అంతా రాజకీయ వ్యూహాలకు, పరిగణనలకు లోబడి ఉన్నదా?

రాష్ట్రంలో పరిస్థితిని మదింపు వేసిన తరువాత శ్రీకృష్ణ కమిటీ ఆరు పరిష్కార అవకాశాలను సమర్పించింది. ఒక్కొక్క పరిష్కార ప్రతిపాదన మంచి చెడ్డలను చర్చించి, సాధ్యాసాధ్యాలను కూడా చెప్పింది. రెండో ఉత్తమ ప్రతిపాదనగా చెప్పిన

Saturday, January 8, 2011

బాధ్యతారాహిత్యమే ఉద్రిక్తతకు మూలం

గడువుకంటె ఒకరోజు ముందే శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్ర హోంమంత్రిత్వశాఖకు చేరిపోయింది. డిసెంబర్‌ 31 గడచిపోయింది. ఉద్రిక్తభరితమైన ఉత్కంఠ ఇంకో వారం రోజులు వాయిదా పడింది. నివేదిక వెల్లడీ, అఖిలపక్ష సమావేశమూ జరిగే జనవరి ఆరో తేదీ నాడు ఏదో రాజకీయ టైమ్‌బాంబు బద్దలవుతుందన్నట్టు, రాష్ట్రమంతటా, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కేంద్రబలగాలు మోహరిస్తున్నాయి. కమిటీ నివేదికా, దానికి పార్టీల స్పందనా, కేంద్రం వైఖరీ ఎట్లా ఉండబోతాయోనన్న కేవల కుతూహలం కాక, పర్యవసానాలు ఎట్లాఉంటాయో, ఉద్రేకాలు ఆవేశాలు నిస్ప­ృహలు ఏ రూపం తీసుకుంటాయోనన్న భయాందోళనలు రాష్ట్ర వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తున్నది. మళ్లీ ఆత్మహత్యలు మొదలవుతాయా? బలిదానం ఆత్మహింసో సత్యాగ్రహమో అయితే కావచ్చును కానీ, దానికి జన స్పందన అహింసాయుతంగా ఉంటుందన్న హామీ ఉంటుందా? ప్రజలలోని మనస్థితిని మరింత రాజేసే దృష్టి తప్ప, దూరదృష్టీ వివేకమూ రాజకీయవేత్తలలో కనిపించనప్పుడు- ఇక పరిస్థితిని అదుపుచేయగలిగినదెవరు? జరగబోయేదాన్ని నిస్సహాయంగా అనుమతించడం తప్ప, దానిని సానుకూలంగా ప్రభావితం చేయగలిగే శక్తి ఏదీ ఉన్నట్టు కనిపించడం లేదు. న్యాయాన్యాయాలు కాక, మనోభావాలు ప్రధానమైపోయిన పరిస్థితిలో, సామాజిక శాంతిభద్రతల కంటె రాజకీయచదరంగపు ఎత్తుగడలే ముఖ్యమైన దుస్థితిలో తెలుగుప్రజల భవితవ్యం నాలుగురోడ్ల కూడలిలో నిలబడింది.

రాష్ట్రవిభజన కోరుకోవడంలో రాజ్యాంగ వ్యతిరేకమైనదేమీ లేదు. విడిపోవడంలో తమకు కలిగే కష్టనష్టాల గురించి చెప్పి కలసిఉండాలని కోరుకోవడంలోనూ దోషమేమీ లేదు. కానీ, ఆ రెండు ఆకాంక్షలూ కేవలం మనోభావాలకు సంబంధించినవి కావు. అభివృద్ధికీ, మెరుగైన జీవనానికి, అవకాశాల పంపకానికీ సంబంధించినవి. అందరినీ కలుపుకుని పోయే సమ్మిశ్రిత అభివృద్ధి గురించి సాక్షాత్తూ దేశప్రధాని పదే పదే మాట్లాడే దేశంలో, అభివృద్ధిరాహిత్యానికి లోనయ్యే బాధితులు ఉద్యమించడం మహాపరాధమేమీ కాదు. కాబట్టి, రాష్ట్రంలో జరుగుతున్నది ఎప్పుడూ కనీవినీ ఎరుగనిదీ కాదు, కొంపలు మునిగిపోయే ఉపద్రవమూ కానక్కరలేదు. కానీ, రాజకీయవాదులు, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం కారణంగా ప్రస్తుతం రాష్ట్రవిభజన వివాదం ఒక పెను ఉపద్రవంగా తయారయింది.

సుమారు పదిహేనేళ్ల కింద అంకురించి, క్రమక్రమంగా బలపడి, పదేళ్ల కింద రాజకీయసంస్థారూపం తీసుకున్న తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రధానంగా ఉన్న రాజకీయపక్షాలు ఎట్లా చూశాయి? చంద్రబాబు నాయుడును ఓడించడానికి, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తానే నాయకుడిగా స్థిరపడడానికి దివంగత రాజశేఖరరెడ్డి తెలంగాణవాదాన్ని చాకచక్యంగా వినియోగించుకున్నారు. ఢిల్లీకి ప్రతినిధిబృందాలను పంపించారు. 2004లో తెలంగాణ రాష్ట్రసమితితో  ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. పొత్తు కోసం కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో, ప్రభుత్వంలో టిఆర్‌ఎస్‌ను చేర్చుకోవడం కోసం యుపిఎ తన కనీస కార్యక్రమంలో అస్పష్టమైన ప్రస్తావనలు చేశాయి. ఎన్నికల ప్రచారంలో సోనియాగాంధీ నర్మగర్భంగా తెలంగాణను ప్రస్తావించగా, తరువాత  ప్రధాని ప్రసంగంలో తెలంగాణకు తమ ప్రభుత్వ కట్టుబాటును ప్రకటించారు.  విస్త­ృతాభిప్రాయమో ఏకాభిప్రాయమో తెలియని అభిప్రాయాన్ని కూడగట్టడం కోసం ప్రణబ్‌ ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్యకమిటీని ఏర్పాటు చేశారు. అదెప్పుడూ అడుగుముందుకువేయలేదు, అది వేరే విషయం. మొదటివిడత పాలనలో టిఆర్‌ఎస్‌ను చీల్చి బలహీనపరచడానికి రాజకీయప్రయత్నాలు చేసిన వైఎస్‌,  రెండో సారి ఎన్నికలకు వెళ్లేసరికి తెలంగాణ అంశాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించారు. రెండోవిడత ఎన్నికలలో తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలుచేసి ప్రాంతాల మధ్య వైమనస్యానికి పాదులు తీశారు.

రాజశేఖరరెడ్డి దుర్మరణం తరువాత పరిణామాలు తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి దోహదం చేశాయి. కెసిఆర్‌ దీక్ష విషమంగా పరిణమిస్తుండడంతో ఏదో తక్షణ నిర్ణయం తీసుకోవలసిన అగత్యం వల్లనో, మరేదో రాజకీయ వ్యూహం కారణంగానో కేంద్రంలోని కాంగ్రెస్‌ హడావుడిగా రంగంలోకి దిగింది. 2009 ఎన్నికలకు  ఏడాది ముందే తెలంగాణకు అనుకూల వైఖరి తీసుకున్న తెలుగుదేశం పార్టీ, అవతరించిన వెంటనే సామాజిక తెలంగాణ నినాదాన్ని ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ హైదరాబాద్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక