Saturday, January 8, 2011

బాధ్యతారాహిత్యమే ఉద్రిక్తతకు మూలం

గడువుకంటె ఒకరోజు ముందే శ్రీకృష్ణ కమిటీ నివేదిక కేంద్ర హోంమంత్రిత్వశాఖకు చేరిపోయింది. డిసెంబర్‌ 31 గడచిపోయింది. ఉద్రిక్తభరితమైన ఉత్కంఠ ఇంకో వారం రోజులు వాయిదా పడింది. నివేదిక వెల్లడీ, అఖిలపక్ష సమావేశమూ జరిగే జనవరి ఆరో తేదీ నాడు ఏదో రాజకీయ టైమ్‌బాంబు బద్దలవుతుందన్నట్టు, రాష్ట్రమంతటా, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కేంద్రబలగాలు మోహరిస్తున్నాయి. కమిటీ నివేదికా, దానికి పార్టీల స్పందనా, కేంద్రం వైఖరీ ఎట్లా ఉండబోతాయోనన్న కేవల కుతూహలం కాక, పర్యవసానాలు ఎట్లాఉంటాయో, ఉద్రేకాలు ఆవేశాలు నిస్ప­ృహలు ఏ రూపం తీసుకుంటాయోనన్న భయాందోళనలు రాష్ట్ర వాతావరణంలో స్పష్టంగా కనిపిస్తున్నది. మళ్లీ ఆత్మహత్యలు మొదలవుతాయా? బలిదానం ఆత్మహింసో సత్యాగ్రహమో అయితే కావచ్చును కానీ, దానికి జన స్పందన అహింసాయుతంగా ఉంటుందన్న హామీ ఉంటుందా? ప్రజలలోని మనస్థితిని మరింత రాజేసే దృష్టి తప్ప, దూరదృష్టీ వివేకమూ రాజకీయవేత్తలలో కనిపించనప్పుడు- ఇక పరిస్థితిని అదుపుచేయగలిగినదెవరు? జరగబోయేదాన్ని నిస్సహాయంగా అనుమతించడం తప్ప, దానిని సానుకూలంగా ప్రభావితం చేయగలిగే శక్తి ఏదీ ఉన్నట్టు కనిపించడం లేదు. న్యాయాన్యాయాలు కాక, మనోభావాలు ప్రధానమైపోయిన పరిస్థితిలో, సామాజిక శాంతిభద్రతల కంటె రాజకీయచదరంగపు ఎత్తుగడలే ముఖ్యమైన దుస్థితిలో తెలుగుప్రజల భవితవ్యం నాలుగురోడ్ల కూడలిలో నిలబడింది.

రాష్ట్రవిభజన కోరుకోవడంలో రాజ్యాంగ వ్యతిరేకమైనదేమీ లేదు. విడిపోవడంలో తమకు కలిగే కష్టనష్టాల గురించి చెప్పి కలసిఉండాలని కోరుకోవడంలోనూ దోషమేమీ లేదు. కానీ, ఆ రెండు ఆకాంక్షలూ కేవలం మనోభావాలకు సంబంధించినవి కావు. అభివృద్ధికీ, మెరుగైన జీవనానికి, అవకాశాల పంపకానికీ సంబంధించినవి. అందరినీ కలుపుకుని పోయే సమ్మిశ్రిత అభివృద్ధి గురించి సాక్షాత్తూ దేశప్రధాని పదే పదే మాట్లాడే దేశంలో, అభివృద్ధిరాహిత్యానికి లోనయ్యే బాధితులు ఉద్యమించడం మహాపరాధమేమీ కాదు. కాబట్టి, రాష్ట్రంలో జరుగుతున్నది ఎప్పుడూ కనీవినీ ఎరుగనిదీ కాదు, కొంపలు మునిగిపోయే ఉపద్రవమూ కానక్కరలేదు. కానీ, రాజకీయవాదులు, ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం కారణంగా ప్రస్తుతం రాష్ట్రవిభజన వివాదం ఒక పెను ఉపద్రవంగా తయారయింది.

సుమారు పదిహేనేళ్ల కింద అంకురించి, క్రమక్రమంగా బలపడి, పదేళ్ల కింద రాజకీయసంస్థారూపం తీసుకున్న తెలంగాణ ప్రత్యేక ఉద్యమాన్ని రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రధానంగా ఉన్న రాజకీయపక్షాలు ఎట్లా చూశాయి? చంద్రబాబు నాయుడును ఓడించడానికి, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తానే నాయకుడిగా స్థిరపడడానికి దివంగత రాజశేఖరరెడ్డి తెలంగాణవాదాన్ని చాకచక్యంగా వినియోగించుకున్నారు. ఢిల్లీకి ప్రతినిధిబృందాలను పంపించారు. 2004లో తెలంగాణ రాష్ట్రసమితితో  ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. పొత్తు కోసం కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో, ప్రభుత్వంలో టిఆర్‌ఎస్‌ను చేర్చుకోవడం కోసం యుపిఎ తన కనీస కార్యక్రమంలో అస్పష్టమైన ప్రస్తావనలు చేశాయి. ఎన్నికల ప్రచారంలో సోనియాగాంధీ నర్మగర్భంగా తెలంగాణను ప్రస్తావించగా, తరువాత  ప్రధాని ప్రసంగంలో తెలంగాణకు తమ ప్రభుత్వ కట్టుబాటును ప్రకటించారు.  విస్త­ృతాభిప్రాయమో ఏకాభిప్రాయమో తెలియని అభిప్రాయాన్ని కూడగట్టడం కోసం ప్రణబ్‌ ముఖర్జీ ఆధ్వర్యంలో త్రిసభ్యకమిటీని ఏర్పాటు చేశారు. అదెప్పుడూ అడుగుముందుకువేయలేదు, అది వేరే విషయం. మొదటివిడత పాలనలో టిఆర్‌ఎస్‌ను చీల్చి బలహీనపరచడానికి రాజకీయప్రయత్నాలు చేసిన వైఎస్‌,  రెండో సారి ఎన్నికలకు వెళ్లేసరికి తెలంగాణ అంశాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించారు. రెండోవిడత ఎన్నికలలో తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలుచేసి ప్రాంతాల మధ్య వైమనస్యానికి పాదులు తీశారు.

రాజశేఖరరెడ్డి దుర్మరణం తరువాత పరిణామాలు తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి దోహదం చేశాయి. కెసిఆర్‌ దీక్ష విషమంగా పరిణమిస్తుండడంతో ఏదో తక్షణ నిర్ణయం తీసుకోవలసిన అగత్యం వల్లనో, మరేదో రాజకీయ వ్యూహం కారణంగానో కేంద్రంలోని కాంగ్రెస్‌ హడావుడిగా రంగంలోకి దిగింది. 2009 ఎన్నికలకు  ఏడాది ముందే తెలంగాణకు అనుకూల వైఖరి తీసుకున్న తెలుగుదేశం పార్టీ, అవతరించిన వెంటనే సామాజిక తెలంగాణ నినాదాన్ని ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ హైదరాబాద్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక
రాష్ట్రానికిసానుకూలత ప్రకటించాయి. సిపిఎం మినహా హాజరయిన అన్ని పక్షాలు చూపిన సమ్మతి ఆసరా చేసుకుని డిసెంబర్‌9 నాడు చిదంబరం తెలంగాణ ప్రకటనచేశారు. రాత్రికి రాత్రి అనేక పరిణామాలుజరిగాయి. డిసెంబర్‌10 నాడు  సీమాంధ్ర ప్రాంతాల్లో కలవరం, కల్లోలం. వరుస రాజీనామాలు. సమైక్యాంధ్ర ఉద్యమం అవతరించింది.  అఖిలపక్ష సమావేశంలో తలలూపిన ప్రధాన పార్టీలు రెండుగా చీలిపోయాయి. పదేళ్లుగా జరగుతున్న ఉద్యమం గానీ, అంతకుముందు పదిరోజులుగా జరుగుతున్న ఉధృత ఆందోళన కానీ తెలియనట్టు, స్పందనలు వినిపించసాగాయి.  రాష్ట్రంలో బలపడుతున్న ఒక డిమాండ్‌ గురించి, బలపడుతున్న ఉద్యమం గురించి చర్చించాలనికానీ,  ఏర్పడే పర్యవసానాలకు సంసిద్ధం చేయాలని కాని, ఒక ఉమ్మడి వైఖరిని రూపొందించుకోవాలని కాని కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు ఎన్నడూ అనుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సీమాంధ్ర ప్రాంతాలలో రాష్ట్రవిభజనపై ఉన్న అభిప్రాయాల గురించి తెలియకుండానే ఆ పార్టీలు పనిచేస్తున్నాయంటే ఎంత విషాదం?  2004నుంచి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఉద్యమానికి అందిస్తున్న పరోక్ష దోహదాన్ని చూస్తూ కూడా ఆ పార్టీకిచెందిన సీమాంధ్ర కార్యకర్తలు, నేతలు ఎట్లా నాయకత్వాన్ని ప్రశ్నించకుండా ఉన్నారో తెలియదు. తెలంగాణపై కాంగ్రెస్‌,టిడిపి, ప్రజారాజ్యం పార్టీల ప్రకటిత వైఖరులు తెలిసి కూడా ఇతర ప్రాంతాల ప్రజలు ఆ పార్టీలకు ఎట్లా ఓట్లువేశారో కూడా అర్థం కాదు.

ఇప్పుడు మళ్లీ జనవరి ఆరోతేదీ గండం ఉన్నది. ప్రతిపార్టీ ఇద్దరిద్దరు ప్రతినిధులు పంపాలని కేంద్రం కోరింది. గత ఏడాది జనవరి5  వ తేదీన జరిగిన సమావేశం కంటె భిన్నమైన వైఖరులు ఏముంటాయి? ఏమి మారిందని ఈ ఏడాది కాలంలో? ప్రధాన పార్టీలన్నీ ప్రాంతాలవారీ అభిప్రాయాలు చెబితే, ఏకాభిప్రాయం ఎక్కడ సాధ్యం? గొంగడి అక్కడే ఉన్నదని నిర్ధారించడానికేనా ఆరోతేదీ సమావేశం?  ఏడాది కాలంలో రెండు వైఖరులు రెండు రకాల భావోద్వేగాలుగా మారిన తరువాత, రాజకీయవాదులే అందుకు కృషిచేసిన తరువాత, ఇప్పుడు ఏకాభిప్రాయం ఎట్లా సాధ్యమవుతుంది? ఈ ఏడాదికాలంలో రాష్ట్రంలో ఒక ఏకాభిప్రాయాన్ని, సామరస్యపూర్వక సంప్రదింపులకు సానుకూల వాతావరణం ఏర్పరచడానికి ఎవరు కృషిచేశారని? శ్రీకృష్ణకమిటీ పరిస్థితుల మదింపునకే తప్ప, పరిస్థితుల సృష్టికి కాదు కదా? కాంగ్రెస్‌ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ రెండుగా చీలిపోయిన తమ శ్రేణులమధ్య అవగాహనకు, న్యాయాన్యాయాల చర్చకు ఏమీ ప్రయత్నించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి సైతం ఏడాదికాలంలో ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి, ఉధృతమైన ఆందోళనలు నిర్వహించడానికి, లేదా వివిధ వర్గాలు నిర్వహిస్తున్న ఆందోళనలను సమన్వయపరచడానికి ప్రయత్నించడం తప్ప, వివిధ ప్రతికూల వర్గాలను సుముఖం చేసుకోవడానికి ఏ ప్రయత్నాలూ చేయలేదు. సీమాంధ్రకు వెళ్లి అక్కడివారిని ఒప్పిస్తానన్న కెసిఆర్‌ 'సరిహద్దు' దాటనే లేదు. హైదరాబాద్‌ ముస్లిముల భయాందోళనలను తొలగించే ప్రయత్నమే చేయలేదు. 2010 సంవత్సరం ప్రథమార్థంలో వెల్లువెత్తిన ఉద్యమం వివిధశక్తులను ఏకం చేయగా, సంవత్సరం ముగిసేసరికి, మళ్లీ ఎవరి దారి వారిదేఅయిపోయింది. తెలంగాణ ఉద్యమాన్ని  తమ పార్టీ రాజకీయవ్యూహంతో మేళవించి ముందుకు వెళ్లాలనుకునే టిఆర్‌ఎస్‌ వైఖరి, అంతర్గత  ఐక్యతను అసాధ్యం చేస్తున్నది. జనవరి6 నాటి పరిణామాల తరువాత  ఎట్లా ప్రతిస్పందించాలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల తెలంగాణ శ్రేణులను టిఆర్‌ఎస్‌, దాని ప్రభావంలో ఉన్న జెఎసి ఆదేశించే ప్రయత్నం చేస్తున్నాయి. ఫలితంగా, కాంగ్రెస్‌శిబిరంనుంచి భిన్నస్వరం వినిపించడం మొదలయింది.  తెలుగుదేశం తెలంగాణ నేతలు సొంతదారి ఎంచుకుంటున్నారు. ఎవరెక్కువ ఉద్యమకారులో తేల్చుకునే పోటాపోటీ మరింత ఉద్రిక్తతకు దారితీసేప్రమాదముంది. విచక్షణాయుత ఆచరణను దూరంచేస్తుంది.

పరిస్థితుల మదింపు కోసం రంగంలోకి దిగిన శ్రీకృష్ణకమిటీసైతం చివరిరోజుల్లో సంయమనం కోల్పోవడం  ఆశ్చర్యం కలిగిస్తోంది. అత్యధిక సంఖ్యాకులకు అధిక సంతృప్తినిచ్చే నివేదికను ఇస్తున్నామని, రాష్ట్రప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని- రకరకాల వ్యాఖ్యానాలు కమిటీసభ్యులు చేస్తున్నారు. మీడియాతో మాట్లాడే అంశాలపై కూడా వారు జాగ్రత్తలుపాటించడం లేదు. 'తిలకాష్ఠమహిషబంధం' వంటి నివేదికలో ఏముందోనని నరాలు తెగే ఉత్కంఠతో నిరీక్షిస్తున్నవారి రక్తపోటును కమిటీసభ్యుల మాటలు మరింతగా పెంచుతున్నాయి.

కమిటీనివేదికలోని అంశాలు వెల్లడయిన తరువాత, కేంద్రం వైఖరి ఎట్లా ఉన్నదో చూచాయగా తెలిసిన తరువాత తీవ్రమైన ప్రతిస్పందనలు వ్యక్తంకాకుండా, నిస్ప­ృహనుంచి నిరాశనుంచి జనం అఘాయిత్యాలకు పాల్పడకుండా చూడవలసిన బాధ్యతను రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు కూడా తీసుకోవడం లేదు కాబట్టి, సమాజమే అందుకు పూనుకోవలసి ఉన్నది. కమిటీ నివేదిక కానీ, ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం కానీ - వాటంతట అవే శాశ్వతమయినవి కావు. ప్రజలను, సంబంధిత వర్గాలను విశ్వాసంలోకి తీసుకుని, అపోహలను అపార్థాలను రూపుమాపేందుకు రాజకీయసంకల్పంతో  కృషిజరిగితే తప్ప- ఏ నిర్ణయానికైనా పూర్తి ఆమోదం లభించదు. కాబట్టి, భవిష్యత్తుపై విశ్వాసం ఉంచడం, తాము నిర్వహిస్తున్న ఉద్యమలక్ష్యాలపై నమ్మకం నిలుపుకోవడం ముఖ్యం. అది మాత్రమే నిస్ప­ృహను దూరంచేయగలదు. అది మాత్రమే ఆత్మహత్యలను నివారించగలదు. అది మాత్రమే హింసను నివారించగలదు. అది మాత్రమే ప్రజల మధ్య సహనపూర్వకమైన ఒడంబడికను సాధించగలదు.
( ఇది శ్రీకృష్ణ కమిటి నివేదిక వెల్లడి కాక ముందు రాసింది.)

No comments:

Post a Comment