Monday, January 10, 2011

ఈ నేతల చేతిలో ఏదీ తెగదు, ముడిపడదు

ఏదో ఒకటి చేయాలి, యథాతథస్థితి మాత్రం కొనసాగకూడదు-అన్నది శ్రీకృష్ణ కమిటీ నివేదిక గట్టిగా చెప్పిన ఒక అభిప్రాయం. కానీ, ఆశ్చర్యకరంగా శ్రీకృష్ణ నివేదిక మాత్రం రాష్ట్రంలో నెలకొని ఉన్న స్థితిని ఏ మాత్రం ప్రభావితం చేయకుండా యథాతథ సంక్షోభ స్థితినే కొనసాగిస్తున్నది. ప్రభావశీలతనే సాఫల్య వైఫల్యాలకు ప్రమాణంగా పరిగణిస్తే కనుక, శ్రీకృష్ణ కమిటీ విఫలమైనట్టే. చిదంబరం తెలంగాణ ప్రకటన చేసిన వెంటనే దిగ్భ్రాంతిని, ఆగ్రహావేశాలను ప్రకటించిన సమైక్యవాదులు శ్రీకృష్ణనివేదిక ప్రథమతాంబూలం ఇచ్చిన సూచనను చూసి సంతోషించి ఉండాలి, సంబరాలు చేసుకు ని ఉండాలి. ఏవో ఒకటి రెండు చోట్ల తప్ప అటువంటి హర్ష ప్రకటనలు కనిపించలేదు. అంటే, ప్రత్యేకవాదానికి పెద్ద దెబ్బ తగిలిందని, సమస్య ముగింపునకు వస్తున్నదని సమైక్యవాదులు కూడా అనుకోవడం లేదన్న మాట. లేదా, వారికి చిదంబరం ప్రకటన నాడు కలిగినంత తీవ్ర విముఖత ఇప్పుడు లేదన్న మాట. శ్రీకృష్ణ సూచనలు చూసి తెలంగాణవాదులు ఆగ్రహించినమాట, అందోళన చెందుతున్న మాట నిజమే, విద్యార్థులు తీవ్రం గా ప్రతిస్పందిస్తున్న మాటా నిజమే. ప్రజా ప్రతినిధుల్లో గుబులు, భవిష్యత్తు గురించిన భయం నెలకొన్న మాటా నిజమే. కానీ, ఇక ఆశ లేదు, అంతా అయిపోయిందన్న నిస్పృ హ కానీ, ఉద్యమానికి ఏదో కోలుకోలేని దెబ్బతగిలిందన్న దృష్టి కానీ తెలంగాణలో కనిపించడం లేదు. అంటే- శ్రీకృష్ణకమిటీ నివేదిక మంచిచెడ్డలతో నిమిత్తం లేకుండా, దానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఎవరూ ఇవ్వడం లేదు. అందువల్లనే, నివేదిక వెల్లడి తరువాత పరిస్థితి మరింత జటిలం అయిందే తప్ప, సరళం కాలేదు. అంతిమ నిర్ణయం కేంద్రం తీసుకోవలసింది కాబట్టి, కమిటీ నివేదికకు ప్రాధాన్యం లభించడం లేదన్నది కూడా వాస్తవం కాదు. ఇదే శ్రీకృష్ణ విభజనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి ఉంటే, ఇదే నివేదిక ప్రభావశాలిగా ఉండగలిగేది. అధ్యయనాలకు అందనంత గూఢంగానో, గాఢంగానో వాస్తవికత ఉన్నదా? లేక, అధ్యయనంతో సహా పరిస్థితి అంతా రాజకీయ వ్యూహాలకు, పరిగణనలకు లోబడి ఉన్నదా?

రాష్ట్రంలో పరిస్థితిని మదింపు వేసిన తరువాత శ్రీకృష్ణ కమిటీ ఆరు పరిష్కార అవకాశాలను సమర్పించింది. ఒక్కొక్క పరిష్కార ప్రతిపాదన మంచి చెడ్డలను చర్చించి, సాధ్యాసాధ్యాలను కూడా చెప్పింది. రెండో ఉత్తమ ప్రతిపాదనగా చెప్పిన
రాష్ట్ర విభజన తో పాటు, తాను మొగ్గుచూపిన తెలంగాణకు రాజ్యాంగరక్షణలతో సమైక్యాంధ్ర- అన్న ప్రతిపాదనను కూడా వివరంగానే చర్చించింది. అత్యుత్తమ ప్రతిపాదనకు నూటికి నూరుమార్కులిచ్చినట్టు అనుకుంటున్నాము కానీ, దానికి ఎదురయ్యే ప్రతిబంధకాలను కూడా ఊహించి, చర్చించింది. ఏమిటా ప్రతిబంధకాలు? తెలంగాణవారు నిరాశ చెందవచ్చు, విద్యార్థులు, లాయర్లు మొదలైన ఉద్యమ శ్రేణులు తీవ్ర నిరసనకు పాల్పడవచ్చు, రాజ్యాంగ సంక్షోభం సృష్టించడానికి ప్రజాప్రతినిధుల రాజీనామాల కోసం ఒత్తిడి పెరగవచ్చు. హింసాత్మక పరిస్థితులు కూడా నెలకొనవచ్చు. అయినప్పటికీ, ప్రభుత్వం చాకచక్యంగా దృఢంగా వ్యవహరిస్తే ఈ పరిష్కారాన్ని సుసాధ్యం చేయవచ్చు- ఇదీ శ్రీకృష్ణ భావించింది. చాలా వరకు ఈ అంచనాలు వాస్తవికంగానే ఉన్నాయి. కానీ, నివేదికలో ఎక్కడా భావోద్వేగాలకు, వాటి వల్ల మానసికంగా జరిగిన విభజనకు ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వలేదనిపిస్తుంది.

అంతేకాదు, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, రాష్ట్రవిభజనకు సంబంధంలేని వివిధ పరిణామాలను, అవకాశం కోసం చూస్తున్న శక్తులను పరిగణనలోనికి తీసుకోలేదు. నిజానికి, చిదంబరం ప్రకటన వెలువడిన నేపథ్యంలో కెసిఆర్ దీక్ష, దాని చుట్టూ రగిలిన ఆందోళన ఎంతటి పాత్ర పోషించాయో, రాజశేఖరరెడ్డి నిష్క్రమించిన రాష్ట్ర రాజకీయపటంపై అధిష్ఠానం వేయదలచుకున్న ప్రభావం కూడా అంతటి పాత్ర పోషించింది. ఈరోజు కేంద్రం తెలంగాణపై వెనక్కి తగ్గడానికి 2009 డిసెంబర్9 తరువాత సీమాంధ్ర ప్రాంతాలలో వచ్చిన వ్యతిరేకతకు ఎటువంటి పాత్ర ఉన్నదో, రాష్ట్ర రాజకీయాల లో ఒక గణనీయమైన శక్తిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అవతరణ ప్రభావం కూడా అంత ఉన్నది. ప్రజల భావోద్వేగాలు, ఆత్మహత్య లు, హింస వంటివాటి కంటె, జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో పార్టీప్రయోజనాలే ముఖ్యంగా కాంగ్రెస్ పరిగణి స్తుంది, తన కార్యాచరణను తక్షణ,దీర్ఘకాలిక స్వీయ ప్రయోజనాల లెక్కలోనే తీర్చిదిద్దుకుంటుంది. జగన్ పెడుతున్న చిరాకు కారణంగా, తెలంగాణను వాయిదావేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం అనుకోవచ్చును, కానీ, జగన్‌వర్గం కానీ, తెలంగాణను కోరుకునే రాజకీయశక్తులు కానీ పైఎత్తులు కూడా వేయవచ్చును కదా, కాంగ్రెస్ వ్యూహమే నెగ్గాల ని లేదు కదా? శ్రీకృష్ణ నివేదిక సాధారణ తెలంగాణ ప్రజానీకంపై పెద్దగా ప్రతికూల ప్రభావం వేయలేదు కానీ, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులూ ఒకానొక అగమ్యగోచర స్థితిలోకి వెళ్లిపోతున్నారు.

ఇన్ని వీరాలాపాలు పలికిన కాంగ్రెస్ నేతలు రేపు రాజ్యాంగ రక్షణలకు తలూపి, పదవులు స్వీకరించి ప్రజలను ఎదుర్కొనగలరా? తెలంగాణలో ఉనికిని కాపాడుకుని బలపడాలనుకుంటున్న తెలుగుదేశంపార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రె స్ కంటె అధిక తెలంగాణవాదులుగా కనిపించాలన్న తాపత్రయం ఇప్పటికే ప్రదర్శిస్తున్నారు. ఈ పోటీ పెరిగేదే కానీ తరిగేది కాదు. తెలంగాణ రంగస్థలాన్ని పూర్తిగా వదిలిపెట్టి, సీమాంధ్రకే పరిమితం కావాలని చిరంజీవి అనుకోవచ్చును కానీ, జగన్ అట్లా అనుకునే అవకాశం లేదు. ఏమైనా ప్రయోజనం పొందగలుగుతారా లేదా అనేది వేరే విషయం కానీ, చేతనైనంత వరకు తెలంగాణ కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టడానికి ఆయన వర్గం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. వీటన్నిటి మధ్య, చాకచక్యంగా, దృఢంగా వ్యవహరించే శక్తి ప్రభుత్వానికి ఉంటుందా? విద్యార్థులపై అణచివేతకు పాల్పడుతున్న ప్రభుత్వంగా పేరుతెచ్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలకు మరింతగా దూరమైతే, ఎన్నికల రాజకీయాలపై దాని ప్రభావం ఉండదా?

నిజానికి, శ్రీకృష్ణ కమిటీ మృగతృష్ణలో కూడా నీరు తాగవచ్చు. ఆ నివేదికలోని గణాంకాలు, వివరణలు, వ్యాఖ్యలు అవ న్నీ పక్కనబెడితే, ఆరు పరిష్కారావకాశాల సూచనలోని అసంబద్ధతను మరచిపోతే, అంతిమ పరిశీలనలో రెండే రెండు సిఫార్సు లు మిగులుతాయి. రెండు సిఫార్సుల సారాంశం ఒకటే- సమైక్యాంధ్రను కొనసాగిస్తే తెలంగాణకు రక్షణలు కల్పించడం, విభజ న చేస్తే తెలంగాణలోని సీమాంధ్రుల ప్రయోజనాలకు రక్షణలు కల్పించడం. రెండిటినీ ఒక గాటన కట్టడం, అందులో ఒకదానికి మొగ్గుచూపడం ఎంతవరకు సమంజసమనేది కూడా పక్కనబెడ దాం. అయినప్పటికీ, ఆ రెండు ప్రతిపాదనలను అర్థం చేసుకోవచ్చు, ఆలోచించవచ్చు, విస్తృత చర్చ కోసం ఆహ్వానించవచ్చు. తెలంగాణకు రక్షణలు కల్పించిన గతానుభవాలన్నీ సానుకూలం కాలేదు కాబట్టి, దానికి వ్యతిరేకత వచ్చే మాట నిజం. ఆ వ్యతిరేకతను పూర్వపక్షం చేసేంతటి గొప్ప రక్షణలు ఏమి కల్పిస్తారో, వాటిని ఎందువల్ల నమ్మవలసి ఉంటుందో నమ్మకం కలిగేలా చెప్పాలి. లేదంటే, సీమాంధ్రుల ప్రయోజనాలను రక్షిస్తూ తెలంగాణను ఏర్పాటు చేయడం- మరో ప్రతిపాదన. అందులో న్యాయమైన ప్రయోజనాలేమిటో, అన్యాయమైనవేమిటో చర్చించవలసి ఉంటుంది. ఇటువంటి చర్చను కృష్ణ నివేదిక తరువాత అన్ని రాజకీయపక్షాలు, ముఖ్యంగా రెండు ప్రాంతాలలోనూ బలంగా ఉన్న రాజకీయపక్షాలు ముందుకు తీసుకువెళ్లాలి. కానీ, పిల్లిమెడలో గంట కట్టే ప్రధాన రాజకీయపక్షం ఏది? గాలివాటంగా జనం నుంచి ఓట్లు కొల్లగొట్టడమే కానీ, జనాభిప్రాయాన్ని ఆలకించి లేదా జనాభిప్రాయాన్ని మలచి ఓటును గెలుచుకునే పక్షమేది?

ఎవరూ ఆ పనిచేయరు కాబట్టి, ఎక్కడ వేసిన కుంపటి అక్కడే ఉంటుంది. ఏలినవారి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన అత్యవసర సందర్భమేదో వస్తుంది, అప్పుడు నిద్రలో నుంచి మేలుకుని ఏదో ఒకటి చేస్తారు. ఏ నిర్ణయాన్ని విధిస్తే, దాన్ని తలవంచి ఆమోదించే స్థితిలో జనం లేకపోవడం ఒక కొత్త సమస్య.

1 comment:

  1. గాలివాటంగా జనం నుంచి ఓట్లు కొల్లగొట్టడమే కానీ, జనాభిప్రాయాన్ని ఆలకించి లేదా జనాభిప్రాయాన్ని మలచి ఓటును గెలుచుకునే పక్షమేది?
    baagaa cheppaaru sir..

    ReplyDelete