Tuesday, January 25, 2011

భోగ రాజకీయాలలో 'త్యాగం' ఒక అచ్చుతప్పు

ఎన్నికలప్పుడు తప్ప ప్రజాసమస్యలను అతిగా పట్టించుకోవలసిన అగత్యం రాకపోవడం మన ప్రజాస్వామ్యంలో ఒక ప్రత్యేకత. మొదటిసారి గెలుపొందడానికి ముందు ప్రజాజీవితాన్ని నిర్మించుకునే క్రమంలో ఏవైనా ఉద్యమాలు ఆందోళనలు చేస్తారేమో, కాసిన్ని లాఠీదెబ్బలు, కొన్ని అరెస్టులు రుచిచూస్తారేమో కానీ, ఒకసారి చట్టసభలోకి ప్రవేశించారా, ఒకసారి అధికారపీఠాల మీద కూర్చున్నారా ఇక జీవితం ఒడ్డున పడ్డ ట్టే. ఆ పై రాజకీయ జీవితంలో ఎదురయ్యేవన్నీ ఆర్జనలూ అక్రమాల ఆరోపణలే.

ఏవో కొన్ని పార్టీల వారు, ఎవరో కొందరు సద్బుద్ధి కలిగిన వ్యక్తులు ఇందుకు మినహాయింపు గా కనిపించవచ్చును కానీ, మొత్తం మీద రాజకీయ చిత్రపటం సారాంశం ఇదే. పెత్తనం చేయాలనే కోరిక, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పేరిట ప్రజాధనాన్ని అపహరించే అవకాశాన్ని సొంతం చేసుకోవడం, సంపదను స్థిరపరచుకోవడానికి పదవులను, ప్రభుత్వ యంత్రాంగాన్నీ వినియోగించుకోగలగడం-ఇవే రాజకీయాల్లోకి ఆకర్షించే గుణాలైనప్పు డు, ఎన్నికల రాజకీయాలన్నీ స్వార్థం లోభం ప్రాతిపదికగా మాత్రమే వర్థిల్లుతున్నట్టు లెక్క. అటువంటి గంజాయివనంలో త్యాగశీలత, నిరాడంబరత వంటి తులసిమొక్కగుణాలకు ఆస్కారం ఉంటుందా? ఏమైనా త్యాగం చేసి ఎన్నాళ్లైంది- అని అడగండి రాజకీయవాదిని.

పెద్దలాభం కోసం చిన్నలాభాన్ని, పెద్దపదవి కోసం చిన్నపదవిని వదులుకోవడం కాదు, ఒక విలువ కోసం, ఒక ప్రజా లక్ష్యాన్ని సాధించడం కోసం- దేన్నైనా ఎప్పుడైనా వదులుకున్నావా? అని అడిగితే, అడిగినవాళ్లను ఆశ్చర్యంగా చూస్తాడు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో లంచం అలవాటు లేని ఉద్యోగిని తక్కిన వాళ్లు కూడా అట్లాగే చూస్తారు. ఆదాయాల నిచ్చెనలో త్వరత్వరగా ఎగబాకలేని అర్భకుడిని బంధువులూ పొరుగువారూ అట్లాగే చూస్తారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన రెండు దశాబ్దాలలో జాతీయస్థాయిలోనూ
అట్టడుగు స్థాయిలోనూ సర్వవ్యాపితంగా ఏదన్నా జరిగిందంటే, అది సార్వత్రక విలువగా స్వార్థం స్థిరపడిపోవడం. అందుకే అరవై కోట్ల బోఫోర్స్ కుంభకోణానికి గగ్గోలు పెట్టిన జాతి లక్షా 73వేల స్కామ్‌కు కూడా పెద్దగా చలించకపోవడం. బోఫోర్స్‌కు ఒక ప్రభుత్వమే కుప్పకూలిపోగా, 2-జి స్కామ్‌కు ఒక మంత్రి తల దొర్లడం కూడా కష్టసాధ్యమైపోయింది. రాజకీయాలు పెట్టుబడి అవసరమైన వ్యాపారమని, దాన్ని వడ్డీతో సహా తిరిగి రాబట్టుకోవడం సహజమనీ నమ్మే స్థితికి వచ్చాము. పెద్ద ఎత్తున జరిగే లూటీలో ఎంతో కొంత దక్కించుకోవడం తప్ప గత్యంతరం లేదని, అదే మనుగడకు కీలకమని అంతా గోల్డ్‌రష్‌లో పడిపోయాము.  అడుగుబొడుగూ కూడా దక్కించుకోలేనివారు సైతం భ్రమల్లో ఓలలాడుతుంటే, ఖజానాకు నిజంగా చేరువగా ఉన్న రాజకీయనేతలు ఎట్లా ఉంటా రు? విలువలన్నిటినీ రూపాయి నోటు మీద ఖననం చేసిన తరువాత నడిచే రాజకీయాలు ఎట్లా ఉంటాయి? అయితే, త్యాగానికి విలువ లేకుండాపోలేదు. దాన్ని కూడా అమ్ముకుని ప్రతిష్ఠనో, ప్రయోజనాన్నో పొందవచ్చుననుకుంటే, త్యాగానికి కూడా గిరాకీ బాగానే ఉంటుంది. గిరాకీ ఉంటుంది కాబట్టి, పెద్దగా త్యాగం కాని దాన్ని కూడా మహా త్యాగంగా చెలామణీ చేయడమూ చూస్తాము. మార్కెటింగ్ నైపుణ్యం ఉండాలే కానీ, భోగరాజులను కూడా ప్రజలు త్యాగరాజులుగా చూడడం నేర్చుకుంటారు.

భగత్‌సింగ్‌లూ ఆజాద్‌లూ ఉద్దమ్‌సింగ్‌లూ ఆనాడు ప్రాణత్యాగాలు చేశారు. నమ్మిన దాన్ని ఆచరించే క్రమంలో వారు అత్యంత విలువైన జీవితాలనే వదులుకున్నారు. గాంధీజీ సైతం తాను కొన్ని విలువలను విశ్వసించినందు వల్లనే మతోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు ఇవ్వడం ఒక్కటే కొలమానం కానక్కరలేదు. ఎంతో సుఖమైన జీవితం అందుబాటులో ఉన్నప్పటికీ తమ సమయాన్ని, ప్రతిభను, జ్ఞానాన్ని సమాజం కోసం అర్పించినవారు, జీవనస్థాయిని ఎంతో కొంత మేరకు తగ్గించుకున్నవారు, ఆశయాల కోసం చెరసాలలకు వెళ్లినవారు కూడా త్యాగమూర్తులే. నాడే కోటీశ్వరుడైన మోతీలాల్ నెహ్రూ, అతని కుమారుడు, భారతప్రధాని నెహ్రూ కూడా తమ జీవితాలను ప్రజాజీవితంలోనే నిమగ్నం చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ సైతం తాము నమ్మిన రాజకీయాల కోసం హతులయ్యా రు. కానీ వారి త్యాగం వృథాపోలేదు. దేశానికి జరిగిన నష్టం అటుంచి, పార్టీ కానీ, కుటుంబం కానీ త్యాగ ఫలితాలను అందుకున్నారు. స్వాతంత్య్రానంతరం త్యాగాలకు వడ్డీ, చక్రవడ్డీ సైతం లభించడం మొదలయింది. త్యాగం ఒక నిరంతర ప్రయోజనాన్ని సాధించిపెట్టే వారసత్వం అయింది.

గాంధీ-నెహ్రూ వంశంలో ప్రాణత్యాగం కారణంగా త్యాగమూర్తులైనవారు అటుం చి, సజీవ త్యాగశీలిగా నిలచినవారు సోనియాగాంధీ. ప్రధానిగా ఆమె అభ్యర్థిత్వం ఒక వివాదంగా మారిన సందర్భంలో ఆమె పదవిని నిరాకరించారు. యుపిఎ కూటమిలో తక్కిన భాగస్వామ్యపక్షాలు దాన్ని పెద్దగా ఔదార్యంగా గుర్తించకపోయినప్పటికీ, కాంగ్రెస్ శ్రేణులు సోనియా త్యాగాన్ని కీర్తించడం ప్రారంభించారు. అధిష్ఠానంతో సాన్నిహిత్యానికి ఆ కీర్తన ఒక సాధనం కావడమే కాక, ఎన్నికలలో ఒక సానుకూల అంశంగానూ వారికి అది ఉపయోగపడింది. స్వాతంత్య్రానంతరం అధికారపీఠాలకు దూరంగా ఉండిపోయిన గాంధీజీకి కానీ, సంపూర్ణ విప్లవం తరువాత విజయాన్ని ప్రతిపక్ష నేతలకు అప్పగించిన జయప్రకాశ్ నారాయణ్‌కి కానీ దక్కనంత త్యాగశీలతాముద్ర సోనియాగాంధీకి లభించింది. కాలంతో పాటు త్యాగాలకు కొలమానాలు మారుతూ వస్తున్నాయన్న మాట. ఎన్‌టి రామారావు అధికాదాయం లభించే సినిమా వృత్తిజీవితాన్ని వదిలి రాజకీయాలలోకి వచ్చినప్పుడు, ఆనాడు దాన్ని త్యాగంగానే పరిగణించారు. చిరంజీవి అదే పని చేసినప్పుడు, అతని చర్యలో త్యాగాన్ని ప్రధానంగా చేసి చూడడానికి జనం ఇష్టపడలేదు.

ఇక, ఇప్పుడు జనంకోసం,లేదా ఫలానా లక్ష్య సాధన కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేస్తానని చెప్పే నాయకుల సంఖ్య పెరిగిపోతున్నది. నిజానికి ప్రాణాలను అర్పించగలిగే నాయకుల తరం ఎన్నికల రాజకీయాలలో ఎప్పుడో అంతరించిపోయింది. అయినా, సరే, భీషణ ప్రతిజ్ఞలు చేసే సందర్భాలలో ప్రాణత్యాగమే ఊతపదంగా మారిపోయింది. ప్రాణాలు కాదు కదా, చిన్నపాటి పదవి ని కూడా వదులుకోవడానికి నాయకులు సిద్ధంగా ఉండరు. తెలంగాణ కోసం కానీ, పోనీ, సమైక్యాంధ్ర కోసం కానీ నిజంగా తమ శాసన సభ్యత్వాలను వదులుకునే ప్రజాప్రతినిధులు రెండు ప్రధాన పార్టీలలో ఉన్నారా? సమైక్యాంధ్ర కోసం నాడు ఇచ్చిన రాజీనామాల్లో ఒకటో రెండో తప్ప తక్కినవన్నీ ఉత్తుత్తి కాయితాలేనని తేలిపోయింది. నిజంగా డిసెంబర్23 ప్రకటన రాకపోతే, ఎందరు సీమాంధ్ర నేతలు తమ రాజీనామాలకు కట్టుబడి ఉండేవారో? జగన్ కోసం ఎమ్మెల్యే స్థానాలను వదులుకోగలిగేంత మంది కూడా సీమాంధ్రలో సమైక్యాంధ్ర కోసం వదులుకుంటారా అన్నది అనుమానమే. ఇప్పుడు ఏడాది తరువాత, శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా వచ్చిన తరువాత తెలంగాణలో మాత్రం పరిస్థితి ఏమిటి? నివేదిక రాకముందు రాజీనామాలు చేస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసినవారు ఇప్పుడు మొహాలు చాటేస్తున్నారు. పదవులు తీసుకుని కూడా తెలంగాణ కోసం పోరాడవచ్చునని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. శాసన సభ్యత్వానికి కూడా రాజీనామాలు చేస్తామన్న ప్రకటనలకీ, పదవులు తీసుకుంటే తప్పేమిటి అన్న ప్రశ్నలకు ఎంత దూరం ఉన్నదో-నిస్వార్థ రాజకీయాలుండాలన్న ఆదర్శానికీ, నేటి వాస్తవికతకీ అంతే దూరం ఉన్నది.

కాబట్టి, రాజకీయవాదులు దేన్నైనా వదులుకుంటారన్నది ఒక భ్రమ. ఉద్యోగార్థులు అర్హత పరీక్షలు మానేయవచ్చు, న్యాయవాదులు తమ వృత్తికేంద్రాలను స్తంభింపజేయవచ్చు, విద్యార్థులు తమ భవిష్యత్తుకు కీలకమైన పరీక్షలు బహిష్కరించవచ్చును. నిషేధాజ్ఞలకు ఉద్రిక్తతలకు సాధారణ జీవనం భయభ్రాంతం కావచ్చు. కానీ, మన నాయకు లు మాత్రం కేంద్ర మంత్రివర్గంలో దక్కని స్థానాల కోసం, జగన్ పక్షం వైపు వెళితే వెళ్లకపోతే జరిగే లాభనష్టాల కోసం బుర్రబద్దలు కొట్టుకుంటారు. చేతులకు గులాబీలు ఇచ్చినా, జనం తమ కాళ్లు పట్టుకుని కన్నీరు పెట్టుకున్నా చలించని నేతలు- అధిష్ఠానం అందించే కేరట్లకో, ఝళిపించే బెత్తాలకో కరిగి నీరవుతారు.

No comments:

Post a Comment