Thursday, February 3, 2011

గాంధీకి పాఠాలు నేర్పిన దక్షిణాఫ్రికా!

దర్బన్ దగ్గరలోని భారతీయులు అధికంగా ఉండే ఫీనిక్స్ సెటిల్‌మెంట్‌కు వెళ్లి గాంధీ జీ ఇల్లు చూడబోయినప్పుడు-అది నిజంగా ఆయన నివసించిన నాటి ఇల్లు కాద ని, 1985లో జరిగిన హింసాకాండలో అది తగలబడితే నల్ల ప్రభుత్వం వచ్చాక పునర్నిర్మించారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఎమ్‌బెకీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా ప్రారంభించిన ఆ ఇంట్లో కేవలం అరుగులూ నేలా మాత్రమే ఆనాటివి, తక్కిన నిర్మాణమంతా కొత్తగా చేసినది. 'వర్ణవివక్షా హింసలో' ఆ ఇల్లు ధ్వంసమైందని అక్కడి శిలాఫలకంలో రాశారు కానీ, నిజానికి నల్లవారు భారత సంతతి వారిపై చేసిన దాడిలో నే అది తగలబడింది. నల్లవారికీ, భారత సంతతివారికీ ఘర్షణలు 1985లోనే మొదలు కాదు, 1949లో అదే సెటిల్మెంట్‌లో జరిగిన భారీ హింసాకాండలో రెండువందల మంది దాకా మరణించారు, మృతుల్లో అత్యధికులు భారత సంతతి వారే.

నేటి దక్షిణాఫ్రికా నల్ల వారికి గాంధీ అంటే బాగానే తెలుసు. ఆయన దేశం ఇండియా అని కూడా తెలుసు. దక్షిణాఫ్రికాలో ప్రారంభించి, ఇండియాలో ఉద్యమాలు కొనసాగించాడనీ తెలుసు. ఆయనపై గౌరవం ఉండవచ్చును కానీ, పెద్దగా ఆరాధన కనిపించదు. గాంధీ విగ్రహం దగ్గర భారతీయులు తప్ప వేరెవరూ ఫోటోలు దిగరు. పీటర్ మారిస్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో ఆయనను ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్ నుంచి తోసేసిన చోట ఒక స్మార క ఫలకం ఉన్నది. అక్కడ ఎప్పటిదో వాడిన బొకే కనిపించింది తప్ప తాజా పుష్ఫగుచ్ఛాలేమీ లేవు.

ఎఎన్‌సిలో భారత సంతతి వారు గణనీయంగానే ఉన్నారు కనుక, ఉద్యమకారుల్లో అమరవీరుల్లో భారత సంతతి వారు కూడా ఉన్నారు కనుక, భారతదేశం వర్ణవివక్షకు వ్యతిరేకంగా సూత్రబద్ధ వైఖరితో నిలబడింది కనుక- 1994 విజయం తరువాత గాంధీజీతో సహా భారతదేశాన్ని, భారతీయ సంతతివారిని ప్రత్యేకంగా పరిగణించాలని
అధికార ఎఎన్‌సి భావించింది. నెల్సన్ మండేలా విడుదలయిన కొద్దికాలానికే భారతదేశాన్ని సందర్శించడం- ఒక కృతజ్ఞతను వ్యక్తం చేయడానికే. గాంధేయ మార్గాన్ని ఉద్యమకాలంలో ఎఎన్‌సి పెద్దగా గౌరవించిందేమీ లేదు కానీ, చివరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అధికార మార్పిడి జరిగినందున అందుకు సమర్థనగా పనికివస్తుందన్న దృష్టితో కూడా గాంధీవాదాన్ని ఆకాశానికెత్తడం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చాక, భారత సంతతివారు కూడా అధికారప్రజాకూటమి (నల్లవారు, భారతీయులు, నల్ల-తెల్లవారి సంతతి అయిన గోధుమ వర్ణం వారు)లో భాగమయ్యారు కానీ, బాధిత ప్రజా సమూహాల మధ్య అక్కడ గొప్ప సోదరభావం ఏమీ లేదు. భారత సంతతివారి మీద రకరకాల ఫిర్యాదులున్నాయి. వారిమీద కూడా తెల్ల ప్రభువులు వివక్ష చూపినప్పటికీ, బ్రిటిష్ వలస దేశం నుంచి వచ్చిన వారిగా ఒకింత మెరుగైన పరిగణనే ఉండేది. చెరకు తోటల్లోకి కట్టుకార్మికులుగా వెళ్లినందుకు 'కూలీలు'గా హీనదృష్టే ఉండినప్పటికీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారినీ, చిన్న చిన్న వృత్తుల్లో ఉండిన వారినీ శ్వేతజాతిపాలకులు అనుమతించారు.

వర్తమానంలో భారత సంతతివారి ఆర్థిక, సామాజిక పరిస్థితి మొత్తం మీద తమ కంటె మెరుగుగా, కొన్ని సందర్భాలలో చాలా మెరుగుగా ఉండడం కూడా నల్లవారికి కంటగింపు కలిగించే దే. ఇక గతంలోకి వెడితే, బోయర్‌వార్‌లో స్థానిక జులూలకు వ్యతిరేకంగా, బ్రిటిష్ అనుకూల వైఖరి తీసుకున్నారన్న కోపం కూడా భారత సంతతివారిపై నల్లవారికి ఉన్నది. గాంధీని గొప్పగా ప్రశంసిస్తూ జనవరి2, 2000 'టైమ్' పత్రికలో తాను రాసిన చారిత్రాత్మకమైన వ్యాసంలో సైతం గాంధీ బంబాటా తిరుగుబాటు సందర్భంగా బ్రిటిష్ రాజ్యభక్తుడిగా భారతీయ సైనికులను నడిపించిన వైనాన్ని, అక్కడ బ్రిటిషర్ల చేతిలో జులూలు అనుభవించిన హింసను చూసి పరివర్తన చెందినట్టు రాశారు.

గాంధీలో హింస అంటే ఏవగింపు, అహింస, సహనం అంటే గురి ఏర్పడడానికి కారణమయిన సంఘటనలన్నీ దక్షిణాఫ్రికాలోనే జరిగినట్టున్నాయి. ఫీనిక్స్‌లోని ఇంట్లోనే కస్తూర్బా గాంధీ తాను చెప్పినట్టు వినలేదని ఒక రాత్రి ఆమెను కొట్టి గాంధీ ఇంటి నుంచి వెళ్లగొట్టారట. రాత్రంతా గడ్డకట్టే చలిలో ఆమె అట్లాగే ఇంటి బయట నిలబడి ఉన్నారట. తెల్లవారి తలుపుతీసి, ఆమెను చూసిన గాంధీజీ కస్తూర్బా శక్తికీ, సహనానికీ ఆశ్చర్యపోయారట, తాను చేసిన తప్పును తెలుసుకున్నారట. ఆమెలోని సహనమే తనలో మార్పు తెచ్చిందనీ, బాధను భరించడం కూడా ఒక ఆయుధమేనని గాంధీ అప్పుడు తెలుసుకున్నారట. గాంధీలో సాధారణ మగస్వభావం చాలానే ఉందని తెలియజెప్పే ఈ ఉదంత మే ఆయనలో సత్యాగ్రహ భావనకు ప్రేరణ ఇవ్వడం ఆశ్చర్యం! పీటర్ మారిస్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంటు నుంచి తోసివేసిన తరువాత, గాంధీకి మొదట చాలా అవమానంగా అనిపించిందట. అది కొంత అహంకారంతో కూడిన అవ మానం కూడా. లండన్‌లో బారిస్టర్ చేసి వచ్చిన తనను, టికెట్ కొని ఫస్ట్‌క్లాస్‌లో ఎక్కిన తనను పెట్టెలోనుంచి తోసివేస్తారా- అని ఆయనకు ఉక్రోశం కలిగింది. తిరిగి ఇండియాకు వెళ్లిపోదామనిపించింది. సామాన్లు స్టేషన్‌వాళ్లు స్వాధీనం చేసుకుంటే రాత్రంతా జూన్‌నెల చలిలో వెయిటింగ్‌రూమ్‌లో జాగారం చేసినప్పుడు, ఆ ఉక్రోశం స్థానంలో ఆలోచన పెరిగింది. తెల్లరాజ్యంలో నల్లవారి దుస్థితి మరింత దుర్భరం కదా అనిపించింది. లేదు, ఉండి పోరాడవలసిందే అన్న నిశ్చయం కలిగింది. ఇక, బంబాటా తిరుగుబాటులో పీడకుల పక్షానే వెళ్లి, పీడితుల కష్టాలను చూసి చలించిపోయాడు గాంధీ. జూలూ తెగ నల్లవారిని యమభటుల్లా పీడించిన తెల్ల వారిని చూసినప్పుడు బ్రిటన్‌కు సంబంధించిన అన్నిటిమీదా గాంధీకి ఏవగింపు కలిగిందని, భారతీయ చేతివృత్తులను ప్రోత్సహించాలని, బ్రిటన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని, విదేశీ వస్తువులను బహిష్కరించాలని గాంధీకి కలిగిన ఆలోచనలకు ఆ సంఘటనలోనే మూలం ఉన్నదని మండేలా అంటారు.

గాంధీ దక్షిణాఫ్రికాలో ఏమి నేర్చుకున్నారో, దాన్ని ఇండియాలోఎట్లా అన్వయించుకున్నారో ఇంకా స్పష్టంగా లెక్కవేయవలసి ఉన్నది. వర్ణవివక్ష ను, భారతదేశంలోని దళితుల సమస్యను సరిపోల్చి ఆయన చూశారా లేదా అన్నది తెలియదు. పూనా ఒడంబడిక వంటి సందర్భాలలో గాంధీకి తన దర్బన్ అనుభవాలు గుర్తుకు వచ్చాయో లేదో తెలియదు. అయితే, ఆయన దక్షిణాఫ్రికా కంటె భిన్నమయిన సమాజాన్ని, భిన్నమయిన పాలనను ఇండియాలో ఎదుర్కొన్నారు. గాంధీవాదం అంటే హిందూవాదమేనని, ఆయన అహంకారపూరితులైన సవర్ణహిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించారని నిర్ధారిస్తే, తీవ్రవాద హిందూత్వ భావాలున్నవారు ఆయనను ఎందుకు హత్యచేసినట్టు? భారతదేశం వంటి బహుమత, వర్గ, సాంస్కృతిక సమాజాన్ని ఒకేతాటిపై నడపడంలో భాగంగానే గాంధేయవాదం కొంత యథాతథవాదం, కొంత సామరస్యవాదంగా, మరికొంత పరివర్తనవాదంగా పరిణమించిందా?- ఇవన్నీ చర్చనీయాంశాలే.

గాంధీ అహింసావాదాన్ని ప్రస్తుతిస్తూనే, సహనం నశించినప్పుడు తాము హింసామార్గాన్ని ఎంచుకోక తప్పలేదని మండేలా అంటారు. పిరికితనమా, హింసనా- ఎంచుకోవలసి వచ్చినప్పుడు హింసనే ఎంచుకుంటానని గాంధీ అన్న మాటను ఆయన ఉదాహరిస్తారు. 'ఏదో రకమైన హింసను ఉపయోగించకుండా ఏ దేశమూ విముక్తం కాలేద'ని తాను 1962లో అన్న మాటను కూడా మండేలా ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటం కూడా ఆయనకు ఆ సందర్భంలో గుర్తుకు వచ్చి ఉండాలి. అయితే, గాంధీ గురించిన ఆసక్తి, ఆయన సిద్ధాంతాలను సీరియస్‌గా తీసుకునే తత్వం మళ్లీ ప్రపంచంలో పెరుగుతున్న సందర్భం ఏమిటో మండేలా బాగానే గుర్తించారు. "ఆధునిక పారిశ్రామిక సమాజాన్ని మొత్తంగా విమర్శించేవారెవరైనా మిగిలారంటే వారు గాంధీ ఒక్కరే. ఆ సమాజంలోని పెత్తందారీ స్వభావాన్ని కాదన్నవారున్నారు తప్ప,దాని ఉత్పాదక సాధనాలను విమర్శించినవారు లేరు. భారీ యంత్రాలు సంపద కేంద్రీకరణను ప్రోత్సహిస్తాయని, మనిషికీ అతని పనిముట్లకీ మధ్య పరస్పర అనురాగం ఉండాలని గాంధీ భావించారు... వలసీకరణ సమాజాల్లో వ్యక్తులు సొంతంగా ఆలోచించడం మానేసిన సమయంలో గాంధీ సొంతంగా ఆలోచించసాగారు. వలసవాదం కింద దేశీయుల భావజాలాలు అంతరించిపోయిన సమయం లో, ఆయన వాటిని పునరుద్ధరించి శక్తిని సమకూర్చారు... ఉపాధి కల్పించలేని సమాజాలలో, అతి కొద్దిమంది అత్యధికంగా వనరులను వినియోగించుకుంటున్న సమయంలో, మనం ప్రస్తుత గ్లోబలైజేషన్ ప్రక్రియ హేతుబద్ధతను ప్రశ్నించవలసిన అగత్యం వచ్చింది, గాంధేయ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవలసిన అవసరమూ వచ్చింది.'' అంటారు మండేలా!

గాంధీజీ ఎట్లా భారతీయ సమాజంలో విస్తృత జనామోదం పొందారో నెల్సన్ మండే లా కూడా దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులతో సహా అందరి సమ్మతీ కలిగినవారు. భారతదేశంలో వలసవాదులు భౌతికంగా దేశాన్ని ఖాళీచేసి వెళ్లిపోయారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి దురహంకారులు ప్రభుత్వం నుంచి దిగిపోయినా సమాజంలో భాగమైపోయారు. మండేలాకు ఆయన తెగలో పిలిచే పేరు 'మడిబా'-అంటే సామరస్యకర్త. పెద్ద హింస లేకుండానే అధికారమార్పిడి దక్షిణాఫ్రికాలో కూడా జరిగింది కానీ, ప్రజలకు సాధికారతను కల్పించడంలో భారతదేశం కంటె దక్షిణాఫ్రికా అనేక రెట్లు ముందున్నది. అందుకు కారణం బహుశా, అక్కడ అధికారమార్పిడి, సామాజిక న్యాయం ద్వారా జరగడమే!

No comments:

Post a Comment