Tuesday, February 15, 2011

సహారా... పూవై పూచెనో...

హోస్ని ముబారక్ ఒక బంటు.
పశ్చిమాసియాలో ప్రపంచ ప్రభువుల పాళెగాడు.
అరబ్బుల ఆకాంక్షలను కాలదన్ని ఇజ్రాయిల్‌కు వంతపాడే జాతిద్రోహి.
దేశసంపదను విదేశాలకు దోచిపెట్టి, దళారీ కమిషన్‌లతో స్విస్ బ్యాంకులకు పడగె త్తిన విషసర్పం. ముప్పైఏండ్లుగా తూతూమంత్రం రిఫరెండంలతో, నామమాత్రపు ఎన్నికలతో, ఎమర్జెన్సీ చట్టాలతో సింహాసనానికి అంటిపెట్టుకున్న నియంత. అటువంటి కర్కోటక ప్రభువును పద్ధెనిమిది రోజుల మహా ప్రతిఘటనతో ఉక్కిరిబిక్కిరి చేసి రాజభవనం నుంచి తోకముడిపించినందుకు ఈజిప్టు ప్రజానీకాన్ని అభినందించాలి.

చరిత్రగర్భాన్ని తొలుచుకుని మరోసారి ఆవిర్భవించినందుకు నైలునది నాగరికతకు, పిరమడ్ల వలె దృఢమైన జన సంకల్పానికి కూడా కాలదోషం పట్టదని నిరూపించిన తహ్రీర్ స్క్వేర్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. అంతకంటె మించి- అన్ని రోజులూ తనవే అన్న అహంకారంతో విర్రవీగుతున్న అమెరికాకు రోజులు మారతాయని గుర్తు చేయించినందుకు ప్రజాస్వామ్యవాద అరబ్బులకు జేజేలు చెప్పాలి. అడియాసల లోకపుటెడారిలో పూలు పూయించిన సహారాదేశానికి సెహబాసు చెప్పాలి.

టునీషియా అనే చిన్న ఆఫ్రికన్ దేశంలో రగిలిన నిప్పుకణిక వెంటవెంటనే రగులుకు ని, ఆఫ్రికా, ఆసియా ఖండాలు రెంటిలోనూ ఉనికి కలిగిన ఈజిప్ట్‌లో దావానలమైంది. టునీషియాలో రాజుకున్న నిప్పురవ్వ సైతం చిన్నదేమీ కాదు. ఒక అల్పాదాయ యువకుడు, పండ్లవ్యాపారి దేశంలోని అవినీతిపాలనపై ఆగ్రహించి తనను తాను దహించుకు ని ఉద్యమాన్ని రగలించాడు. అగ్నిస్పర్శ కోసం నిరీక్షిస్తున్న ఎండుఅడవి వలె ఉన్న ఈజి ప్టు ప్రజానీకం నిప్పందుకున్నారు. ముబారక్ దిగేవరకు వీధులు వదలలేదు. అహింస ను, సహాయనిరాకరణాన్ని మార్గంగా ఎంచుకున్నారు, ఖడ్గసమానమైన సంకల్పాన్ని మాత్రం ఆయుధంగా ధరించారు.

అరబ్బులంటే అమెరికా దృష్టిలో అనాగరికులు లేదంటే అర్భకులు కాదంటే తీవ్రవాదులు. అమెరికా అని మాత్రమే కాదు, ఇంగ్లీషు విద్య తలకెక్కిన నాగరీకులకు, పశ్చిమదిక్కుకు తలలు తాకట్టుపెట్టిన
మేధావులకు కూడా అదే దృష్టి. ప్రజాస్వామ్యానికి వారింకా సిద్ధం కాలేదని, నియంతృత్వాన్ని మహదానందంగా స్వీకరిస్తారని వారి విశ్వా సం. ప్రజల విషయంలో కర్కశంగా ఉండకపోతే, తీవ్రవాదం పెచ్చరిల్లుతుంది కాబట్టి, అరబ్బులకు నియంతృత్వమే తగిన వ్యవస్థ. పశ్చిమాసియాలో నియంతృత్వ ప్రభుత్వాలను సమర్థించడానికి అమెరికాకు అనువుగా ఉండే సిద్ధాంతం అది.

ప్రజల విషయంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా, సంపన్న దేశాలతో స్నేహంగా ఉంటే, చమురు వనరులను చవుకగా క ట్టబెడుతుంటే ఆ నియంత ల విషయంలో అమెరికాకు అభ్యంతరమే ఉండదు. సౌదీ అరేబియా రాచరిక నియంతృత్వాన్ని కానీ, ఈజిప్ట్ సైనిక నియంతృత్వా న్ని కానీ అమెరికా నెత్తిన పెట్టుకున్నది అందుకే. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టే- సద్దాం హుసేన్, గడాఫీ వంటి ఏలికలంటే అమెరికాకు కంటగింపు. ఉరితీసి చంపేంత పగ. ఇరాక్‌మీద దుర్మార్గమైన ఆరోపణ చేసినా అరబ్ దేశాల నుంచి ప్రతిఘటన లేకపోవడానికి ఆయాదేశాల పాలకులు అమెరికాకు అనుంగు భృత్యులుగా మెలగడమే కారణం.

ఇరాక్‌మీద దాడి అరబ్బుల మనస్సులో ఒక లోతయిన గాయాన్నే చేసింది. చిన్న మూలుగు కూడా వినిపించలేని నిస్సహాయత వారిలో ఉన్నా, అది లోలోన వారిని తొలుస్తూనే ఉన్నది. ప్రజలను కటిక దరిద్రంలో ఉంచుతూ, సంపదనంతా సొంతానికి భుక్తం చేసుకుంటున్న పాలకులకు వెనుక ఉన్నది అగ్రరాజ్యమేనని వారికి తెలుసు. తాము గొంతు విప్పితే ఉగ్రవాదమని ముద్రవేస్తారని తెలుసు. అందుకే-ఈజిప్ట్ ప్రజానీకం సృజనాత్మకమైన రీతిలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామికవాదులంతా అభినందించే రీతిలో శాంతియుత ఉద్యమం నడిపారు. నైతికంగా ప్రభుత్వాన్ని నిలదీశా రు, బోనులో నిలబెట్టారు. టునీషియాలో బెన్ అలీ కానీ, ఈజిప్టు లో ముబారక్ కానీ పోతపోసిన ప్రజావ్యతిరేక వ్యవస్థల ప్రతినిధు లు మాత్రమే. ఆ దేశాల ప్రజలు కూలదోయాలనుకున్నది కేవలం వ్యక్తులను కాదు, వారు శీర్షంగా నడుస్తున్న వ్యవస్థలను. ఆ రెండు దేశాలలో జరిగినవి విప్లవాలనడం పూర్తిగా సరిఅయినదేనా అన్న ప్రశ్న రావడానికి కార ణం- అక్కడ వ్యక్తుల మార్పునకు మించి ఏదైనా జరగబోతున్నదా అన్న సంశయమే.

గత జనవరి 25 నాడు ఈజిప్టులో ప్రజల ఆందోళన ప్రారంభమైనప్పుడు ముబారక్ కంటె ముందు ఖంగుతిన్నది ఒబామా. ఈజిప్టు నివురుగప్పిన నిప్పులా ఉన్నదన్న సమాచారాన్ని సిఐఏ కూడా కనిపెట్టలేకపోయింది. కనిపెట్టి ఉంటే, ప్రజాస్వామ్య ఆందోళనకు తగిన నాయకత్వాన్ని కూడా తానే రూపొందించి ఉండేది. ఈగను తీసిపారేసినట్టు ముబారక్‌ను తీసేసి, తన ప్రయోజనాలను కాపాడే ప్రత్యామ్నాయాన్ని విప్లవం పేరిట స్థాపించి ఉండేది. ఈజిప్ట్‌లో నియంతృత్వం మీద పేరుకున్న కసిని, మార్పు కోసం ప్రజ ల్లో ఉన్న ఆకాంక్షను అమెరికా గుర్తించలేకపోయింది. ఎల్ బరాదీని ఉద్యమానికి ఏకైక నేతగా ముందుకు తోయడానికి ప్రయత్నించింది కానీ, అప్పటికే ఉద్యమానికి బహునాయకత్వం, స్వచ్ఛంద, యాదృచ్ఛిక నాయకత్వం ఏర్పడి ఉన్నాయి. నిజానికి అనేక మంది ఆందోళనకారులు ఏ నేతల ప్రమేయం లేకుండా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆందోళనను చల్లార్చడానికి ముబారక్ స్థానంలో ఇంటెలిజెన్స్‌చీఫ్, ఉపాధ్యక్షుడు సులేమాన్‌ను ప్రతిష్ఠించాలని చూసింది కానీ, ఎవరేమిటి అన్న స్పష్టత ప్రజల్లో ఉండడంలో ఆ ఆటలు కూడా సాగలేదు. పూర్తి విశ్వాసపాత్రులు దొరకకపోయినా, సైన్యంమీద భారం వేసి ముబారక్ నిష్క్రమణను అమెరికా అనుమతించినట్టు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి త్వరలో పాలన అప్పగిస్తామనిచెబుతూనే, అంతర్జాతీయ ఒప్పందాలను తాత్కాలిక ప్రభుత్వం గౌరవిస్తుందని సైన్యం చెప్పడంలో-అమెరికాకు నర్మగర్భంగా ఇస్తున్న హామీని గమనించవచ్చు.

ఈజిప్ట్ ఉద్యమాన్ని నడిపించింది మతం కాదు. ఇస్లామిక్ బ్రదర్‌హుడ్ అనే సంస్థ గ్రామీణ ఈజిప్షియన్లను సమీకరించిన మాట నిజమే కానీ, ఆ సంస్థ చాలా సాత్విక భావాలున్న సామాజిక రాజకీయ సంస్థ. తీవ్ర విమర్శకులు కూడా దాన్ని తీవ్రవాద సంస్థ అని అనలేరు. అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, పాలకుల దళారీతనం, నిర్బంధ చట్టాలు - ఈజిప్ట్ ఉద్యమానికి నేపథ్యాలు. ఉద్యమకారులు కోరింది- ముబారక్ పతనం, నిర్బంధచట్టాల ఉపసంహరణ, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాప్రయోజనాలను మనసులో పెట్టుకుని పాలించే పౌరప్రభుత్వం, ఈజిప్ట్ వనరులను నిర్మాణాత్మకంగా వినియోగించడం. ఇంతటి సెక్యులర్ డిమాండ్లను అరబ్బేతర దేశాలలో సైతం ఊహించలేము. ఈజిప్ట్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఈ ఉద్యమ డిమాండ్లను కొంతవరకైనా స్పృశించక తప్పదు. లేకపోతే, ఉద్యమం మళ్లీ కొత్తగా, తీవ్రంగా రగులుకుంటుంది.

ఇప్పటికే, ఈజిప్ట్ విజయం పొరుగుదేశాల్లో స్ఫూర్తిని, ప్రేరణను అందిస్తోంది. భౌతికంగా దూరం గా ఉన్న దేశాల్లో సైతం ప్రజాఉద్యమాలు ఈజిప్ట్‌ను ఆదర్శంగా ప్రకటిస్తున్నాయి. ఈజి ప్ట్ ప్రజల జీవన్మరణ సమస్యల మధ్య అమెరికా తన ప్రయోజనాల వేట కొనసాగిస్తున్న ది. పశ్చిమాసియాలో ఏకైక ప్రజాస్వామ్యం ఇజ్రాయిల్ అని, దాన్ని కాపాడడం తన బాధ్యత అని చెప్పుకునే అమెరికా మరో ప్రజాస్వామ్యదేశాన్ని కొనసాగనిస్తుందా? అన్న ది ప్రశ్న. ఇంతకాలం, పశ్చిమాసియా రాజకీయాల్లో తనను, ఇజ్రాయిల్‌ను సమర్థిస్తూ వస్తున్న ఈజిప్ట్ మున్ముందు కూడా అలాగే ఉంటుందా? ఆఫ్రికా ఖండంలోనూ, పశ్చిమాసియాలోనూ నియంతృత్వ, సైనిక ప్రభుత్వాల అండతో తన పబ్బం గడుపుకుంటున్న పాశ్చాత్య కార్పొరేట్ ప్రపంచం ఈ ప్రజాస్వామిక వెల్లువలో ఆర్థికనష్టాలకు సిద్ధపడతాయా?- ఇవన్నీ భవిష్యత్తు మీద భయం కలిగించే ప్రశ్నలు.

అయినా, ఇన్ని ప్రశ్నలకు ఆస్కారం ఇచ్చినందుకు ఈజిప్టుకు రుణ పడవలసిందే. అంతిమ విజయం సిద్ధించేదాకా అసంతృప్తిలో మగ్గడం మానవ నైజానికే విరుద్ధం. అగడ్తలు దాటినప్పుడల్లా, అవాంతరాన్ని అధిగమించినప్పుడల్లా, ఒక మజిలీకి చేరినప్పుడల్లా విజయోత్సవాలు జరగవలసిందే. ముబారక్‌ను ముక్కుపట్టి దించిన ప్రజలకు, మార్పును చేయిపట్టి నడిపించుకుని వెళ్లడం కూడా తెలిసి ఉంటుందని ఆశించాలి. తాము చేస్తున్నది జాతీయ సమరం మాత్రమే కాదని, గ్లోబల్ సంగ్రామం అని వారీపాటికే గుర్తించి ఉంటారు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలోని నియంతృత్వాలకు తోడుగా, ప్రపంచీకరణ పేరుతో క్రూర ఆర్థిక న్యాయం కూడా ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న కాలంలో- కొత్త సవాళ్లకు సరికొత్త మందును ఈజిప్టు కనిపెట్టింది.

ముబారక్ హో!

2 comments:

 1. Interesting
  you have summed up the events reasonably well.
  Three points:
  1. USA will never support EL Baradai. He was a big block to the American propaganda, and a big horn in the American admistration,.
  of WMDs in Iraq and Iranian nuclear programme.
  2. Muslim brotherhood is a terrorist organization ..they relenquished their arms but not ideology because of the unfavourable circumstances...you'll see in the future.
  3. There is no point in fighting with Israel. Mubarak knew it better than anybody.egyptians were spared because of that, otherwise they'd in the same boat like palestinians now.
  I was in Iran in the aftermath of Shaws deposel
  The country went to dogs..literally..dogs.. due to selfish,incompetent religious and pseudo religious leaders.
  I only wish that'd not happen to Egypt.
  Yes..Mubarak is corrupt..which leader is not show me ?
  when defeat is inevitable make peace..

  ReplyDelete
 2. నియంతృత్వం నశించడం,విప్లవం జయించడం ఎక్కడ జరిగినా ఎంత సంతోషం కలుగుతుందో కదా...
  అన్ని లక్షల మంది ప్రజల విజయధ్వానాలు మీ అక్షరాల్లో కదం తొక్కాయి.
  విప్లవగీతంలా లయబద్ధంగా మారిన వ్యాస శీర్షిక చాలా ఉత్తేజితం చేసింది.

  ReplyDelete