Tuesday, February 22, 2011

చలన చిత్రం: సంచలన ఉద్యమం

ముప్పై ఏండ్ల కిందటి మాట. మాభూమి సినిమా విడుద లైంది. సినిమా చివరలో తెలంగాణ ప్రజాగాయకుడు యాదగిరి పాత్రలో గద్దర్ పాట. ఆ తరువాత సాయుధ పోరాట దృశ్యాలు. సినిమా హాల్ అంతటా హోరెత్తిన నినాదాలు. నిశ్శబ్దంగా వ్యక్తులుగా సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఉన్నట్టుండి సమూహంగా మారిపోయారు. బొమ్మలు కదిలే తెర కాస్తా రంగస్థలం అయింది, రంగస్థలం తెరను చీల్చుకుని ప్రదర్శనశాలలోకి ప్రవహించింది.

ఇరవై ఏండ్ల కిందట ఒమార్ ముఖ్తార్ ఇంగ్లీషు సినిమా. అప్పుడే కాశ్మీర్‌లో ఆందోళనలు మొదలయ్యాయనుకుంటాను. సినిమా చివరలో పతాక పోరాట సన్నివేశం మొదలయినప్పుడు జాతి విముక్తి పోరాటాలు వర్థిల్లాలంటూ నినాదాలు దద్దరిల్లాయి. ఇంగ్లీ షు సినిమా తెలుగు బహిరంగ సభగా రూపుమార్చుకుంది.

చాలా కాలం తరువాత, మరోసారి సినిమా థియేటర్‌ను జనరంగంగా మార్చింది 'జై బోలో తెలంగాణా'. కళాత్మక విలువల రీత్యా పైన చెప్పిన రెండు సినిమాలతో దీనికి పోలిక తేనక్కరలేదు కానీ, ప్రేక్షకులను ప్రేక్షకులుగా మిగలనివ్వని ఉద్వేగం ఎట్లా ఉంటుందో ఈ చలనచిత్రం ఆవిష్కరించింది. ఒకే నటుడిని అభిమానించే ప్రేక్షకులలో కూడా సామూహిక ఉత్సాహం, కేరింతలు కనిపిస్తాయి. కానీ, ఇది అటువంటిది కాదు. ఆ సినిమాతో తాదాత్మ్యం చెందించే ఉద్వేగమేదో ప్రతి ప్రేక్షకుడి మనసులోనూ ముందే బలపడి ఉంది.

'జై బోలో తెలంగాణ' ప్రధాన స్రవంతి సినిమా సూత్రాలకు అనుగుణంగానే నిర్మించిన సాధారణమైన సినిమాయే. ఆకాశం బద్దలయ్యే ఉత్సాహాన్నీ స్ఫూర్తినీ ఆశించి ఆ సినిమాకు వెళ్లే ప్రేక్షకుడికి నిరాశ కూడా కలగవచ్చు. ఉద్యమం మాత్రమే కాక, దానిచుట్టూ ప్రేమలూ అనుబంధాలూ నింపిన ఇతివృత్తం మీద చిరాకు కూడా కలగవచ్చు. కొన్ని సందర్భాలలో అతుకులు అతుకులుగా కూడా కనిపించవచ్చు. పాటలు, అందులో నూ ఉర్రూతలూగించే పాటలు కనిపించినప్పుడు మాత్రమే మనోభావాలకు సంతృప్తి కలగవచ్చు. అయినా సరే, ఆ సినిమా సూచిస్తున్నదీ, చెబుతున్నదీ, చాటుతున్నదీ చాలా నే ఉన్నది.

మాభూమిలాగా, ఒమర్ ముఖ్తార్ లాగా ఇది చారిత్రక సినిమా కాదు. నడుస్తున్న చరిత్రే దీని కథాంశం. చారిత్రక సినిమాలకు ఉండే వెసులుబాట్లు దీనికి లేవు. తెలుగు సమాజంలో తీవ్రమైన విభజన ఉన్నది. ఆ వర్తమాన తెలుగు సమాజమే సినిమాను చూసి ఆనందించాలి. రాష్ట్ర విభజన కోరుతున్న ఉద్యమం సమర్థకులకు, వ్యతిరేకులకు మధ్య ప్రయోజనాల ఘర్షణ ఉన్నది. రగిలిన ఆవేశాలున్నాయి. అణచిపెట్టుకున్న అసహ నం ఉన్నది. భయాందోళనలున్నాయి.

ఈ సంక్లిష్ట సందర్భాన్ని తెరకెక్కించడానికి ఎన్. శంకర్ ఎంచుకున్న మాధ్యమం సినిమా. ఆ సినిమా రంగానికి దాని లక్షణాలు దానికున్నాయి. తెలంగాణ ప్రాతినిధ్యం, పెట్టుబడి అన్నీ అక్కడ తక్కువే. ఈ దర్శకుడు ప్రధానస్రవంతి దర్శకుడు, వ్యాపారాత్మక, వినోదాత్మక సినిమాలు ప్రతిభావంతంగా నిర్మించగలిగిన నిపుణుడు. ఈ సినిమాకు ముందు ఆయనకు సినీ జీవితం ఉన్నట్టే, సినిమా అనంతరం కూడా ఆ రంగం ఆయనను ఆదరించాలి. అంటే, వస్తువుకీ, మాధ్యమానికీ సంబంధించిన అనేక పరిమితుల మధ్య ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు.

కళారూపానికి ఉండే గొప్పగుణం ఏమిటంటే- అది తాననుకునే వాస్తవికతను హృదయానికి హత్తుకునేట్టు చూపగలదు. భావోద్వేగాలను నేరుగా నాడీమండలానికి చేరవేయగలదు. వైరుధ్యాలను నాటకీయంగా పరిష్కరించగలదు. ప్రేక్షకుడు లేదా పాఠకుడి లో ఉండే వేరువేరు వ్యక్తిత్వాలను విడివిడి అస్తిత్వాలను ఆ సినిమా నిడివిలోనో కాల్పనిక రచన నిడివిలోనో ఘర్షణకు పెట్టి, చివరకు ఉపశమింపజేయగలదు. అందువల్లనే కళ గొప్ప బలవత్ ఝరవత్ మాధ్యమం. అదే సమయంలో గొప్ప ఉపశమనసాధనం. మనుషుల్ని జల్లెడ పట్టి, తనవైపు రాగలిగినవారందరినీ రప్పించుకోగలదు. 'జై బోలో తెలంగాణ' దర్శకుడు తనకున్న పరిమితుల్లో ఆ విద్య ను పూర్తిగా ప్రదర్శించలేకపోయి ఉండవచ్చు. ఎంతో ఆశించిన తెలంగాణవాదికి ఈ సినిమా పూర్తి సంతృప్తిని ఇవ్వకపోయినట్టే, సమైక్యవాదికి పెద్దగా ఆగ్రహం కూడా కలిగించలేకపోయింది. కథ, కథనం తీవ్రంగా లేకపోబట్టే వారికి సంతృ ప్తీ, వీరికి కోపమూ కలగలేదని వాదించవచ్చును, కానీ అది న్యాయం కాదు.

తెలంగాణ వాదానికి సంబంధించి దర్శకుడు ఎక్కడా రాజీపడలేదు. రాష్ట్ర విభజనను తప్ప మరే మధ్యేమార్గాన్నీ ప్రతిపాదించలేదు. 'విడిపోయి కలిసుందాం'-ఉద్యమం నుంచే పుట్టిన ఈ నినాదాన్ని కల్పితకథాచట్రంలో చిత్రించాడు. కథ కల్పితమే అయినా, ప్రతీకాత్మకంగా కల్పించిన కథ. స్మృతీ ఇరానీ వేసిన పాత్ర తల్లి పాత్ర మాత్రమే కాదు, తెలంగాణకు ప్రతీక. కథానాయకుడిని ప్రేమించిన యువతి కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్‌లో చదువుకుంటున్న విద్యార్థిని మాత్రమే కాదు, రాష్ట్ర రాజధానికి తరలివచ్చిన సీమాంధ్రులకు ప్రతీక. తెలంగాణవాదిగా మారిన హీరోకూ, తెలంగాణలో స్థిరపడిన హీరోయిన్‌కూ మధ్య ప్రేమ అనే కథాంశంచుట్టూ దర్శకుడు ఇతివృత్తాన్ని నిర్వహించాడు. మానసికంగా సీమాంధ్ర వైపు నుంచి తెలంగాణ వైపు కథానాయిక మళ్లడం, అందుకు ఎదురై న ఇబ్బందులు-సినిమాలో అనేక సన్నివేశాలను సృష్టిస్తాయి. సినిమా మొదట్లో తెలంగాణవాదానికి వ్యతిరేకులుగా కనిపించిన వారిలో-అతికొద్ది మంది తప్ప-అందరూ మనసు మార్చుకుంటారు.

తెలంగాణ వ్యతిరేకులలో సీమాంధ్రకు చెందినవారే కాకుండా, తెలంగాణ స్థానికులు (వారి రూపురేఖలను బట్టి ప్రేక్షకులు సులువుగానే పోల్చుకుంటారు) కూడా ఉంటారు. సీమాంధ్రులలో తెలంగాణ సానుభూతిపరులూ ఉంటారు. పోలీసులలో దౌర్జన్యకారులూ ఉంటా రు, విద్యార్థులను హింసించడం చూసి కన్నీరుపెట్టుకునే వారూ ఉంటారు. సినిమావంటి మాధ్యమానికి ఉన్న సమస్య లు, అవసరాలు కలసి అటువంటి కథానిర్మాణానికి దారితీసి ఉండవచ్చును కానీ, అది వాస్తవికతకు భిన్నమైనది కూడా కానక్కరలేదు. సీమాంధ్రకు చెందిన కొందరు స్వార్థ రాజకీయనాయకులను, వారికి తోడుగా ఉండే తెలంగాణ నేతలను, ఒక కార్పొరేట్‌ను విలన్‌గా చిత్రించిన సినిమా-మధ్యతరగతి, కింది తరగతికి చెందిన సీమాంధ్రులను క్రమంగా పరివర్తన చెందిన వారిగా చిత్రించింది. అది నాటకీయంగా కనిపించినప్పటికీ- తెలంగాణ ఉద్యమ గమనం అట్లా సాగి ఉంటే బాగుండే ది.

సినిమా అంతటా వివాదానికి రెండువైపులా ఉన్న వ్యక్తుల మధ్య, వర్గాల మధ్య కొంత ఘర్షణ, కొంత సంభాషణ కనిపిస్తాయి. ఆ ప్రక్రియ ఫలించి, క్రమంగా తెలంగాణవాదులు బలపడతారు. కానీ, వాస్తవంలో సంభాషణ లేనేలేదు. పదేళ్ల ఉద్యమకాలంలో తెలంగాణలో స్థిరపడిన ప్రాంతేతరులు అనేకులు విభజనకు అనుకూలంగా మారిన మాట నిజమే కానీ, గణనీయంగా ఉన్న ప్రాంతేతరులకు తగిన నమ్మకాన్నిచ్చి, తమవైపు మళ్లించుకునే ప్రయత్నం ఉద్యమనాయకత్వం తానుగా చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఆర్థిక, స్వార్థ ప్రయోజనాల రీత్యా వ్యతిరేకిస్తున్న వారినీ, భయంతో అపోహలతో వ్యతిరేకిస్తున్నవారిని వేరుచేసి చూడవలసిన అవసరాన్ని, ఉద్యమానికి బయటి మిత్రులను పెంచుకుంటూ పోవలసిన అగత్యాన్ని తెలంగాణ ఉద్యమ నాయకత్వం గుర్తించలేదు. తెలంగాణ సాధనకు ముఖ్యమైన అవరోధంగా ఉండగల హైదరాబాద్ ముస్లిములతో ఒక సంభాషణను ప్రారంభించలేదు.

సీమాంధ్ర ప్రాంతాలలో తెలంగాణ కు అనుకూలంగా ఉన్న దళిత, బహుజన వర్గాలతో ఒక వ్యూహాత్మక అనుబంధాన్ని నిర్మించుకోలేకపోవడం అటుంచి, తరచు తెలంగాణకు చెందిన బడుగువర్గాలకు అసంతృప్తిని, విముఖతను కలిగిస్తూ వస్తోంది. అసలు తెలంగాణ నినాదానికి ప్రతినిధిగా ఉన్న రాజకీయపక్షం-అట్టడుగు నుంచి ఒక క్రమబద్ధమైన నిర్మాణాన్ని కానీ, సైద్ధాంతిక చట్రాన్ని కానీ నిర్మించనేలేదు. పోరాటాన్నీ, త్యాగాలనీ విద్యార్థి యువజనులకు అప్పగిం చి, భావపోరాటాన్ని కవులూకళాకారుల భుజాన పెట్టి, సంచలనాత్మకమైన ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడం ఆ పక్షం అనుసరిస్తూ వస్తున్న వ్యూహం. రాజకీయవాదులు చేసే పోరాటాల కంటె, విద్యార్థులు,యువకులు జరిపే పోరాటా లు నాటకీయతకు, ఉద్విగ్న సన్నివేశాల కల్పనకు అనువైనవి. నిజానికి తెలంగాణ పోరాటంలో రాజకీయవాదులు చేసిన దానికంటె విద్యార్థియువజనులు చేసిందీ, చేస్తున్నదీ ఎక్కువ.
త్యాగశీలతలోను, సమరశీలతలోను వారిదే పైచేయి. ఇక్కడ సినిమా అవసరా లు, వాస్తవమూ ఒకటే అయింది. సినిమా అంతా విద్యార్థియువజనుల ఉద్యమోత్సాహ మే కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమరంగంలో ఉన్న సమస్త శక్తులనీ ఒకే సినిమాలో ఇమిడ్చే ప్రయత్నం కూడా దర్శకుడు చేసిన గొప్ప విన్యాసం. తెలంగాణ ఉద్యమంలోని మరో వాస్తవాన్ని కూడా సినిమా ప్రస్ఫుటం చేసింది. వ్యతిరేకులను నిందించే సందర్భాల కంటె, ఆత్మగౌరవాన్ని ఔన్నత్యాన్ని కీర్తించే సందర్భాలే తెలంగాణ ప్రజలను అధికంగా అలరిస్తాయి. సమైక్యవాదులను విమర్శించే పాట కంటె, గద్దర్ ఆడిపాడిన 'పొడుస్తున్న' పొద్దు పాట ప్రేక్షకులను ఊర్రూతలూగించడం అందువల్లనే.

No comments:

Post a Comment