Monday, February 28, 2011

దూరపు ఉద్యమాలు ఎరుపు

అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? చెలాయించే వ్యవస్థకు ఉన్న క్రూరమైన అణచివేత శక్తి నుంచి వస్తుందా? అంగబలం నుంచీ సైనికబలం నుంచీ వస్తుందా? కాదు కాదు, అధికారాన్ని ఆమోదించి తలదాల్చే ప్రజలనుంచే వస్తుందంటారు జీన్ షార్ప్. టునీషియా, ఈజిప్టు నుంచి మొదలై దావానలంలా వ్యాపిస్తున్న ప్రజాస్వామిక ఉద్యమాల నేపథ్యంలో ఈయన పేరు ఇప్పుడు తరచు ప్రస్తావనకు వస్తోంది. నియంతృత్వ ప్రభుత్వాలపై 'అహింసాయుత ప్రతిఘటన' ఎట్లా చేయవచ్చో ఒక సమగ్ర సిద్ధాంతాన్నీ, మార్గదర్శక సూత్రాలను రూపొందించిన అమెరికన్ మేధావి షార్ప్. గాంధీ మీద ఈయన పెద్ద పరిశోధనే చేశారు. మరీ క్రూరమైన నియంతృత్వాల విషయంలో గాంధీమార్గం చాలదని షార్ప్ అంటారు. సమాజంలో అట్టడుగునుంచి పై దాకా ఉన్న వివిధ శ్రేణుల మధ్య జరిగే సహకారం మీదనే వ్యవస్థ నడుస్తుందని, ఆ సహకారానికి గండిపడితే పాలకులు బలహీనపడతారని ఈయన సిద్ధాంతం. అహింసాయుత సహాయ నిరాకరణ అంటే మరేమీ లేదు, అది క్రియాశీల ప్రతిఘటనే, కాకపోతే కాస్త జాగ్రత్తగా, తెలివిగా పన్నే వ్యూహం అంటారాయన.

అరబ్ దేశాలలో ప్రభుత్వాలపై నిరసన శాంతియుతంగా, సృజనాత్మకమైన రీతుల్లో సాగిన మాట వాస్తవమే. ప్రభుత్వాలపై నైతికమయిన ఒత్తిడిని పెంచడంతో పాటు, మొక్కబోని దృఢసంకల్పాన్ని ప్రదర్శించడం ద్వారా లక్షలాది మంది ప్రజలు రాజకీయ పోరాటం చేశారు, చేస్తున్నారు. అరబ్ దేశాలపై మీడియాలో, అంతర్జాతీయ సమాజంలో ఉన్న స్థిరాభిప్రాయం రీత్యా- అటువంటి ప్రతిఘటనలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ ఆశ్చర్యం కారణంగానూ, మరి కొన్ని రాజకీయ కారణాల వల్లనూ వాటికి ప్రచారం కూడా అధికంగానే లభించింది. చివరకు మన దేశంలో కూడా వివిధ ఉద్యమాల నేతలు, రాజకీయనేతలు ఈజిప్ట్ తరహా ప్రజావెల్లువ వస్తుందనో, తీసుకు వస్తామనో హెచ్చరించడం వింటున్నాము. కానీ, ఈజిప్ట్ తరహా ఉద్యమాన్ని నిర్మించడం అంత తేలిక కాదు. ఆ ఉద్యమంలో కొంత యాదృచ్ఛికత, కొంత తక్షణ స్పందన, కొంత నెట్‌వర్కింగ్ కలసి పనిచేయడమే కాదు, సాంప్రదాయికమైన నాయకత్వం లేకపోవడం అనే సౌలభ్యం కూడా ఉన్నది.

అయితే, మన దేశంలో అటువంటి ఉద్యమాలే జరగనట్టు, అసలు పెద్ద ఎత్తున ప్రజావెల్లువ రావడం మన దేశానికి అసలు తెలియనే తెలియనట్టు ఈజిప్టు జపంచేయడం కూడా తగదు. తరువాత కాలంలో కొంత మిలిటెంట్ స్వభావాన్ని కూడా అలవరచుకున్నప్పటికీ, ఛాత్ర సంఘర్ష పరిషత్ ఆధ్వర్యంలో 1970ల మధ్యలో ఉత్తరాదిలో నడిచిన ఉద్యమం స్వతంత్ర భారతదేశానికి కొత్తదే. అది సుదీర్ఘకాలం నడవడమే కాదు, కేంద్రప్రభుత్వాన్నే కుదిపివేయగలిగిన రాజకీయ ఉద్యమంగా పరిణమించినది. ఎమర్జెన్సీ అనంతరం దేశంలో ప్రజాస్వామిక ఆందోళనలు, ఉద్యమాలు సరికొత్త పోరాట రూపాలను అన్వేషించసాగాయి. 1980లో ఆరంభం లో అస్సాం విద్యార్థులు నిర్వహించిన ఉద్యమం సృజనాత్మకమైన ఆందోళనారూపాలను ఎంచుకున్నది. అస్సాం ఉద్యమానికి నేపథ్యంగా ఉన్న పరిస్థితుల వల్ల నెల్లీ మారణకాండ వంటి అవాంఛనీయ సంఘటన జరిగి ఉండవచ్చును కానీ, విద్యార్థులు నిర్వహించిన ఉద్యమం మేరకు శాంతియుతంగానే కాదు, నిరంతరాయంగా,
సంకల్పం చెదరకుండా సాగింది. నివురు కప్పిన నిప్పులాఉండి రాడికల్స్ సింగరేణిలో మెరుపు సమ్మె ప్రారంభించడం, పోలీసులు కాల్పులు జరిపి పదులసంఖ్యలో మరణాలకు కారణమైనప్పటికీ- ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో జరిగిన గిరిజనుల భారీ సమావేశం- సమాజాన్ని ఆశ్చర్యానికీ కుదుపునకు లోనుచేసిన సంఘటనలే. ఇంకాపూర్తిస్థాయి అణచివేత మొదలుకాకముందు రాడికల్ విద్యార్థులు 1983-84 సంవత్సరాలలో ఆసక్తికరమైన పోరాట రూపాలను అనుసరించి,మద్దతుకూడగట్టుకున్నారు. రేషన్ షాప్‌లలో అక్రమ నిల్వలను వెలికితీయడం, లంచగొండి అధికారులను నిలదీయడం వంటి జనాకర్షక ఆందోళనలను చేపట్టారు. ఆనందపూర్‌సాహెబ్ తీర్మానాన్ని అమలు కోరుతూ అకాలీదళ్ నిర్వహించిన 1980లలో నిర్వహించిన ఆందోళన కనీవినీ ఎరుగని తీవ్ర స్థాయిలో జరిగింది. పంజాబ్ దిగ్బంధం ఆందోళనను అకాలీదళ్ ఆరంభించే రోజునే కేంద్రప్రభుత్వం అణచివేత చర్యలు ప్రారంభించి, అదే వరుసలో ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించింది.

ఇక ఈశాన్య రాష్ట్రాల సంగతి చెప్పనక్కరలేదు, సైన్యం నిర్బంధచర్యలను నిరసిస్తూ స్త్రీలు అర్థనగ్న సత్యాగ్రహాలు చేశారు. మణిపూర్‌లో ఐరోమ్‌షర్మిలా చాను అనే మహిళ ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలని 2000 సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీనుంచి నిరాహారదీక్షలోనే ఉన్నది. అధికారులు దీక్షను భగ్నంచేయడం, నిర్బంధంనుంచి బయటకు రాగానే పునఃప్రారంభించడం చేస్తున్నది. అయినా మనం ఆంగ్ సాన్ సూకీ వంటి విదేశీపేర్లనే గుర్తు పెట్టుకుంటాం.

మహేంద్రసింగ్ తికాయత్ 1988లో మీరట్‌లో రైతుల ర్యాలీ పట్టణ ముట్టడిగా పరిణమించి సంచలనం సృష్టించింది. 2006లో డబ్ల్యుటివోలో భారత్ భాగస్వామి కాగూడదని డిమాండ్ చేస్తూ భోరున కురిసే వర్షంలో లక్షమంది రైతులతో ధర్నా నిర్వహించారు. స్వామీ అగ్నివేశ్ ఒక సందర్భంలో ఢిల్లీలోని స్టార్ హోటళ్లలోకి వందలాది మంది పేదలను తరలించారు. కర్ణాటకలో రైతునేత నంజుండ స్వామి బహుళజాతి విత్తన సంస్థలపై మెరుపు దాడులు చేశారు.
మన రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రభుత్వంపై ఒత్తిడినిపెంచే కొత్త ప్రజాస్వామిక పోరాట రూపాలను అనేకం ఆవిష్కరించింది. 'చలో సీఎం ఇల్లు ముట్టడి', బహిరంగ సభలను అప్పటికప్పుడు నిరవధిక ధర్నాగా మార్చడం, ప్రతిచోటా ప్రజాప్రతినిధులను నిలదీయడం-ఎమ్ ఆర్‌పి ఎస్ ప్రారంభించిన పోరాటరూపాలే. పర్యావరణ పరిరక్షణకు, వనరుల విధ్వంసానికీ వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన ఉద్యమాలన్నిటిలోకీ నర్మదా బచావ్ ఆందోళన తలమానికమైనది. అభివృద్ధి పేరిట సాగించే విధ్వంసంపై ఒకప్పుడు ప్రజల స్పందన అంతంత మాత్రంగా ఉండేది. నాగార్జున సాగర్‌లో అణుకర్మాగారం ప్రతిపాదనను ప్రజాందోళన కారణంగా విరమించుకోవలసి వచ్చింది. థర్మల్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఆందోళనలు రాష్ట్రంలో అభివృద్ధిప్రాజెక్టులను సవాల్ చేస్తున్నాయి.

ఉద్యమాల లక్ష్యాలతో ఆకాంక్షలతో ఏకీభావం లేనప్పటికీ, ఆయా పోరాటరూపాలను, ఆందోళనకారుల సంకల్పబలాన్ని అభినందించవచ్చును. కనీసం వాటి శక్తిసామర్థ్యాలను ప్రశంసించవచ్చును. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న సహాయనిరాకరణ ఉద్యమం ప్రభావశీలతను సమైక్యవాదులు కూడా గుర్తించగలుగుతున్నది అందువల్లనే. ఈ సహాయనిరాకరణ స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే విశిష్టమైనది. లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు సాగిస్తున్న ఈ ఉద్యమం తెలంగాణప్రాంతంలో పరిపాలనను స్తంభింపజేసింది. మార్చి నెలలో ఉద్యమనేతలు సంకల్పించిన 'పల్లెపల్లె పట్టాలపైకి' అన్న పోరాట రూపం కానీ, పదిలక్షల మందితో చేయతలపెట్టిన 'మిలియన్ మార్చ్'కానీ ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రస్థాయిలో తీసుకువెళ్లగలిగే సామర్థ్యం ఉన్నవి. మన సమాజం మధ్యలో జరుగుతున్నందు వల్ల, ఆందోళనల కారణంగా తలెత్తే సాధకబాధకాల కారణంగా ఆ పోరాటరూపాలను ఈజిప్టు ఉద్యమాన్ని చూసినంత నిష్పక్షపాతంగా చూడలేకపోవచ్చు. కానీ, అవి ఏ అరబ్‌దేశంలో జరుగుతున్న ప్రజాస్వామిక ఆందోళనకీ తీసిపోయేవి కావు.

ఒకప్పుడు కళ్లెదుట సాగే ఉద్యమాల గురించి మౌనం వహిస్తూ- నమీబియా విముక్తి పోరాటానికీ, అంగోలా దురాక్రమణకీ, నెల్సన్ మండేలా నిర్బంధానికీ వ్యతిరేకంగా గోడలమీద రాసే రాతలు కనిపించేవి. భారత ప్రభుత్వం కూడాదేశంలో ఉద్యమాలనుఅణచివేస్తూ పాలస్తీనా విముక్తిపోరాటానికీ, ఆఫ్రికాలో వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమానికీ మద్దతులు చెప్పేది. ఇప్పుడు- అన్ని ఉద్యమాలూ భారతదేశంలోనే సాగుతున్నాయి. మన కళ్లెదుటే సాగుతున్నా యి. ఈజిప్టుకు పాఠాలు చెప్పగలిగిన ఉద్యమాల చరిత్ర భారత ప్రజలది. జాస్మిన్ విప్లవాల కంటె పరిమళభరితమైన మల్లెల మాలలు మన పోరాట రూపాలు.

1 comment: