Monday, March 7, 2011

విత్తు ఏది నాటితే చెట్టు అదే మొలుస్తుంది

తన విగ్రహాన్ని తానే కూలదోసుకుంటున్న ఒక విధ్వంసకుడిని మనం మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లో చూడవచ్చు. సీవీసీ పదవిలో థామస్ నియామకం పాపం పూర్తిగా తనదే అని ఒప్పుకుంటున్న ప్రధానమంత్రి, అంతకుముందు టెలికంస్కామ్‌లో కూడా బోనులో నిలబడడానికి స్వచ్ఛందంగా ముందుకువచ్చారు. తనను ప్రధానిపదవి మీద కూర్చోబెట్టిన సోనియాపై, కాంగ్రెస్‌పార్టీపై ఆయనకున్న వల్లమాలిన కృతజ్ఞతాభావంతో ఆయన ఈ ప్రతిష్ఠాత్యాగానికి పాల్పడుతున్నారని అనిపించవచ్చును. అదీ నిజమే. అంతకంటె మించి, తానొక చిహ్నం గా, తనకు పర్యాయపదంగా ఉన్న సంస్కరణల రాజ్యం కుప్పకూలిపోకుండా, తనమీద తాను కొరడాదెబ్బలు ఝళిపించుకుంటున్నారని కూడా అనిపించవచ్చు. అది కూడా నిజమే. తనను తాను బతికించుకోవడానికి మన్మోహన్ వ్యక్తిగత ప్రతిష్ఠను కొంచెం కొంచెంగా కొరుక్కుతిన్న వ్యవస్థ, ఇక అతన్ని పూర్తిగా పిప్పిచేసి విసర్జించదలచుకున్నదనీ అనిపించవచ్చు. అది కొంచెం ఎక్కువ నిజం.

అవినీతి అన్నది పెద్దగా చర్చనీయాంశం కాకుండా పోయి చాలా కాలమే అయింది. కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన అవినీతి విషయంలో తక్షణ స్పందన చూపించని కేంద్రప్రభుత్వం, టుజీ స్కామ్ విషయంలో మేలుకొనవలసి వచ్చింది. ఆ కుంభకోణంలో భారతప్రభుత్వ ఖజానా కోల్పోయిన ఆదాయం లక్షా 70 కోట్ల భారీ మొత్తం కావడం వల్ల యుపిఎ ప్రభుత్వం ఆలస్యంగా అయినా స్పందించక తప్పలేదు. మరింత భారీనష్టం తేగల ఇస్రో ఒప్పందం వెనక్కి వెళ్లింది. టెలికం స్కామ్ పై జేపీసీ ఏర్పడింది. ఇంత హడావుడి జరుగుతున్న సమయంలోనే బోఫోర్స్ నిందితుడు ఖత్రోచీ కేసును విజయవంతంగా మూసివే శారు. అత్యంత ఆధునికమైన మెగా కుంభకోణాల కాలంలో, కాలంచెల్లిన పాత కాలం నాటి అవినీతి కేసులకేమి సందర్భం ఉంటుంది? ప్రశ్నలు వేసుకునే తీరును బట్టి సమాధానాలు తారసపడతాయి. మన్మోహన్‌సింగ్ అంతటి నిజాయితీ పరుడు కదా, అంతటి సౌమ్యుడు కదా, అంతటి ఆర్థికవేత్త కదా- ఇట్లా జరిగిందేమిటి అని బాధపడేవారు ఈ దేశంలో కోకొల్లలు. ఆయన సొంతంగా నీతిమంతుడే ఉత్తముడే పండితుడేకానీ, ఆయన సారథ్యం వహిస్తున్నది లాభాలను, ప్రయోజనాలను పిండడమే న్యాయంగా భావించే ఒక వ్యవస్థకు. అది ఆయనకు తెలియదని అనుకోలేము. అభివృద్ధి ఫలితాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో సంస్కరణలు తీసుకువచ్చాము, వాటిని కొందరే తన్నుకుపోవడం బాధ కలిగిస్తున్నది- అని 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ దిశను మార్చడంలో నిమిత్తమాత్రుడైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు- పదవినుంచి దిగిపోయిన తరువాత వ్యాఖ్యానించారు. నిమిత్తమాత్రుడు అని ఎందుకు అనాలంటే, రాజకీయంగా ఏకధ్రువ ప్రపంచం అవతరించి, ఎల్లలు లేని ఆర్థిక అంతర్జాతీయ సామ్రాజ్యం పాదుకొనడానికి దారితీసిన పరిస్థితులు పీవీ నరసింహారావు చేతిలో ఉన్నవి కావు. ప్రపంచ ప్రభువులకు కావలసిన కార్యం గంధర్వుని వలె ఆయన తీర్చాడు. ఆయనకు చేదోడు ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌సింగ్ నాటి నుంచి దేశంలోని మార్పులకు కారకుడూ, చోదకుడూ, పర్యవేక్షకుడూ అయ్యారు.
లైసెన్స్‌రాజ్యంలో అవినీతి, మందకొడితనం, అభివృద్ధిని అడ్డుకునే తత్వమూ ఉంటాయని,
ఆర్థికరంగపు పగ్గాలు వదిలేస్తే దేశం వృద్ధిరేటు పరుగులు తీస్తుందని, దేశమంతా పరిశ్రమలతో ఉద్యోగాలతో కళకళలాడుతుందనీ, పారదర్శకత నెలకొని నీతి నాలుగుపాదాలపై నడుస్తుందనీ ఏవేవో ప్రగల్భాలు పలికారు. పగ్గాలు వదిలేశారు కానీ, అవినీతి, అక్రమార్జన గుర్రాలు మాత్రమే రేసులో గెలిచాయి.

గ్లోబలైజేషన్ అంటే మార్కెట్ల అనుసంధానం అని మర్యాదగా చెప్పుకోవచ్చును కానీ, ప్రపంచంలో ఏ మూలనున్న వనరులనైనా తమ లాభానికి వాడుకోవడానికి, ఏ సమాజాన్నైనా తమ మార్కెట్‌గా మలచుకోవడానికి బలిష్ఠదేశాలకు లభించిన లైసెన్స్ అది. పెట్టుబడులు సరిహద్దులు దాటి ప్రవహిస్తాయి, లాభాలు ఎల్లలు లేకుండా తరలిపోతాయి. స్వప్రయోజనమే ఆ మహాయంత్రానికి చోదకశక్తి. అంతో ఇంతో సంక్షేమమూ, వ్యాపారాల మీద సమాజనియంత్రణ కలిగిన పాత సమాజం నుంచి స్వార్థపూరితమైన సమాజానికి, సోషల్ డార్వినిస్టు క్రూరత్వానికి జరిగే పరివర్తన అంత ఉచితంగా జరగదు. ఉమ్మడి ఆస్తులను వ్యక్తులకు, సామాజిక సేవలను వ్యాపారాలకు తరలించే ప్రక్రియలో, తోడుదొంగలు లేకపోతే పనే జరగదు. అందుకని నిర్దాక్షిణ్యమైన, దురాశాపూరితులైన పాలకుల అధికారుల శ్రేణి, శీఘ్ర లాభార్జన కోసం నిర్విచక్షణగా వ్యవహరించగలిగిన మార్కెట్‌శక్తులూ పరివర్తన దశలో అత్యవసరం. పాతవ్యవస్థలో గుమస్తాలు బల్లల కింద చేయిపెట్టి, అధికారులు సంతకాలకు రుసుము వసూలు చేసి, రాజకీయనాయకులు ఎన్నికల ఫండ్లు రాబట్టీ- అవినీతికి పాల్పడి ఉండవచ్చు. కానీ, కొత్త వ్యవస్థలో అధికార యంత్రాంగం, రాజకీయశక్తులూ జమిలిగా అవినీతిగుర్రం పై స్వారీ చేస్తారు. గతంలో లంచాలివ్వవలసివచ్చిన బాధితులుగా తమను తాము చెప్పుకున్న వ్యాపారవర్గాలు, ఆ అవినీతిని ప్రోత్సహిస్తాయి, అందులో భాగస్వాములవు తాయి, కొద్దిపాటి వాటా ఇచ్చి కోట్లకు కోట్లు దండుకుంటాయి. గతంలో జరిగినదాన్ని చీకటివ్యవహారంగా పరిగణించి ఛీకొట్టేవాళ్లం, ఇప్పుడు జరుగుతున్నదాన్ని ఉదారవాద సంస్కరణల యుగంగా జైకొడుతున్నాము.

నిబంధనలకు విరుద్ధంగా లాభం చేకూర్చారనో, టెండర్లు, దరఖాస్తులు దాఖలు చేసినవారిలో కొందరిపై పక్షపాతం చూపించారనో- అవినీతికి ఉదాహరణలు చెబుతున్నాము. నిబంధనల ప్రకారం వ్యవహరించకపోవడం, ఆశ్రితులకు మేలు చేయడం అవినీతిలో ఒక పార్శ్వం మాత్రమే. ఆశ్రిత పెట్టుబడిదారీవిధానం అన్న మాట అర్థసత్యమే. అసలు అప్పనంగా కట్టబెట్టడం ఒక విధానం అయిన తరువాత, ఆ ప్రక్రియ నీతిమంతంగా జరిగిందా లేదా అని చర్చించడం విడ్డూరం. మొత్తం జరుగుతున్న తతంగమే అనైతికమయినది. జలయజ్ఞం ప్రజల ఆకాంక్షల పేరు చెప్పి ప్రారంభమైనదే. కాంట్రాక్టులు నిబంధనల ప్రకారం అప్పగించినవే. ప్రాజెక్టు వ్యయాలను అడ్డగోలుగా పెంచేయడం ప్రభుత్వ విచక్షణాధికారానికి లోబడి జరిగిందే. కానీ, రాష్ట్రమంతా, నీటిచుక్క లేని సిమెంటు కాలువలు అవతరించి, రైతాంగాన్ని వెక్కిరించడం మాత్రం నికార్సయిన అవినీతి. అందుకే ప్రజలకు ఏమి కావాలో కాక, కాంట్రాక్టర్లకు, పారిశ్రామికులకు ఏవి లాభాలు తెస్తాయో ఆ ప్రాజెక్టులే వెలుస్తున్నాయి. ప్రాధాన్యాలన్నీ పర్సెంటేజీలమీదనే నిర్ణయం అవుతున్నాయి. పారిశ్రామిక దేశాల దగ్గర ఏ వస్తువులు గిరాకీ లేక మూలుగుతున్నాయో వాటికోసమే మన తలుపులు తెరుచుకుంటున్నాయి. దేశమంతటా పన్నులులేని, చట్టాలు వర్తించని స్వతంత్రరాజ్యాలు సెజ్‌ల పేరుతో అవతరిస్తున్నాయి. అవినీతి పదుల కోట్ల నుంచి లక్షల కోట్లకు విస్తరించింది.

అవినీతినిరోధకశాఖ అడపాదడపా అధికారుల నివాసాలపై దాడులు చేసి, కోట్లాది రూపాయల ఆస్తులను పట్టుకుంటుంటే ఆశ్చర్యపోతున్నాము. ఇప్పటికీ, అవినీతి అనే మాట అధికారులకూ రాజకీయ నాయకులకూ మాత్రమే వర్తిస్తుందని మనం నమ్ముతున్నాము. రాత్రికి రాత్రి కోటీశ్వరులైన శీఘ్రసంపన్నులను. రెండు దశాబ్దాల కింద ఓ మోస్తరు వ్యాపారాలుండి ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద శ్రీమంతులైనవారిని- మనం అవినీతిపరులు అని సంబోధించలేకపోతున్నాము. పైగా, వారి విజయగాధలను యువతకు ఆదర్శంగా బోధిస్తున్నాము. సంస్కరణల యుగానికి వారిని సంకేతాలుగా చూపిస్తున్నాము. రాజా ఒక్కడే కాదు అవినీతిపరుడు, అతని నిర్ణయాల వల్ల లబ్ధిపొందినవారు, అందుకోసం అతన్ని ప్రభావితం చేసినవారు- అందరూ దోషులే.

లోపం విధానచట్రంలో ఉన్నది. అక్కడ నాటిన స్వార్థపు విత్తనంలో ఉన్నది. అభివృద్ధి రథచక్రాల కింద కొందరు అభాగ్యులు నలిగిపోవడం అనివార్యమని బ్యాంకింగ్ సంస్కరణల మీద సూచనలు చేసిన నరసింహన్ కమిటీ వ్యాఖ్యానించింది. రెండు దశాబ్దాలలో ఐదులక్షల మందికి పైగా అటువంటి అభాగ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భద్రత కంటె వేగమే ప్రధానమైన గమనంలో బలహీనులు మాత్రమే కాదు, నీతీనిజాయతీ కూడా రథచక్రాల కింద నలిగిపోతాయి. కానీ మనం వాటిని ప్రమాదాలు గానో, మినహాయింపులుగానో పరిగణించి, తిరిగి అదే దారిలో పరుగులు తీస్తున్నాము.

1 comment: