Monday, March 14, 2011

విగ్రహ విధ్వంసంపై నిగ్రహంతో విచారిద్దాం

ఎండాకాలం ఇంకా పూర్తిగా దిగబడకపోయినా, రోహిణీకార్తె రోజు వంటి ఆ మధ్యాహ్నాన్ని దాటి ఆ నాటికి ఉద్యమమూ ఉద్రిక్తతా ఉపశమించిన తరువాత, నగరం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు అర్థరాత్రి వేళ అందరిలాగానే నేనూ టాంక్‌బండ్‌మీదుగా మార్చ్‌పాస్ట్ చేశాను.

కూలిన కొలువుకూటం, శిథిల పేరోలగం, క్షతగాత్ర సరస్తీరం.
గురితెలియని ఆగ్రహాలు, వాలిన, కూలిన, తెగిపోయిన విగ్రహాలు.

ఏ కాలపు వీరులు వీరు, ఏ యుగాల కవులు వీరు, ఎప్పటి వైతాళికులు వీరు? ఇప్ప టి యుద్ధంలో ఎందుకు గాయపడ్డారు?
సన్నటి దుఃఖం. ఏదో అసౌకర్యం. ఒక చేదు. ఈ దృశ్యం అదృశ్యమైతే బాగుండును. ఈ సన్నివేశం ఒక భ్రమ అయితే బాగుండును. ఇదంతా జరగకుండా ఉండి ఉంటే బాగుండును.

విగ్రహాలలో నిక్షిప్తమైపోయినవి పురాస్మృతులు మాత్రమే కావు. వర్తమానంలో కూడా అవి అప్పుడప్పుడు వెలుగుతూ వచ్చినవే. ప్రతి ప్రతిమా ఎవరికో ఒకరికి సంకేత స్థలమే. ఎవరో ఒకరు పూలమాల వేసి పులకించిపోయినదే. ఆ బొమ్మకొలువు లో అన్నీ కాకున్నా కొన్ని ఊరేగింపులకు ఆరంభ కేంద్రమైనవే. ఉపన్యాసాలకు వేదికలయినవే.

నడుస్తున్న చరిత్ర సృష్టిస్తున్న అనేకానేక సందిగ్ధ సందర్భాలలో ఇదీ ఒకటి. ఒకే వాస్తవంలో ఇమడలేని అనేక సత్యాల, ఒకే వ్యక్తిత్వంలో ఒదగలేని అనేక అస్తిత్వాల ఘర్షణ ఇది. నా ఉద్వేగం నా వ్యక్తిగతమైనదిగా కనిపించవచ్చు, కానీ, నేననుభవించిన సంశ య ఉద్వేగాన్నే అనుభవిస్తున్నవారు అనేకులు ఉంటారని నాకు తెలుసు. దీర్ఘకాలంగా ఉద్యమాల వేదికగా ఉన్న తెలంగాణలో ప్రగతివాదాన్ని, సామాజిక న్యాయాన్ని బోధించిన రచయితలను ప్రాంతాలకు అతీతంగా ఆదరించారు,అనుసరించారు. అటువంటి అనుయాయులు, అభిమానులు ఒక్క తెలంగాణలోనే కాదు, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్రలో-అన్నిచోట్లా ఉంటారు. మన వివేకాని కీ, చైతన్యానికీ,
విచక్షణకీ దోహదాన్ని అందించిన అనేక పోషకాల్లో ఆ ప్రతిమా వ్యక్తుల రాతలూ చేతలూ ఉన్నాయని అన్ని ప్రాంతాలలో ఉన్న 'మాకు' తెలుసు. కానీ, సమాజంలో మా లాంటి వారే కాదు, ఇతరులూ ఉంటారు, ఉన్నారు. వారికి ఈ సందర్భం రాజకీయ ప్రయోజనాలకు అనువైన సందర్భం. జాషువా, గురజాడ, శ్రీశ్రీ, త్రిపురనేని రామస్వామి చౌద రి, వీరేశలింగం ఇంకా ఇంకా కూలిన విగ్రహ పురుషులందరూ ఏమి చెప్పారో ఏ విలువలకు నిలబడ్డారో వారికి అక్కరలేదు. ఆ విగ్రహాలకు హాని జరిగేదాకా వారెప్పుడైనా టాంక్‌బండ్‌మీద విగ్రహాలను దర్శించారో లేదో కూడా నమ్మకం లేదు. చారిత్రక వ్యక్తులకు అసందర్భంగా జరిగిన అమర్యాద గురించి వారి దగ్గర కన్నీటిచుక్కలేమీ లేవు. అవకాశం దొరికింది కాబట్టి అస్త్రాన్ని ఉపయోగించుకోవడం మాత్రమే వారికి తెలిసింది. వారి గగ్గోలుకన్నా, మా వంటి వారి వేదన ఎక్కువ విలువైనదీ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కానివ్వకుండా నిరోధించగలిగిందీ కూడా.

నాలాంటి వారికి టాంక్‌బండ్‌మీద జరిగినదానికి బాధ కలుగుతోంది కానీ, చేసినవారి మీద ఆగ్రహం రావడంలేదు. ఒక పరంపరలో జరుగుతున్న అంశాలను విడదీసి తీర్పు లు నిర్ధారణలు చేయలేము కదా? ఈ ఒక్క అపశ్రుతిని అడ్డం పెట్టుకుని ఒక ప్రజా ఉద్యమాన్ని నిరాకరించడ మో, ఒక ప్రజాసమూహాన్ని నిందించడమో చేయలేము కదా? కోపం రావలసింది పరిస్థితులను ఇంతగా దిగజార్చిన పాలకులపైనా ప్రభుత్వాలపైనా. ఏ స్పందనా లేక చేష్టలులేని విగ్రహనాయకుల వలె మారిపోయిన ఏలికలను కదిలించలేక, తమను తాము దగ్ధం చేసుకున్నా, మంచి కే ప్రతీకలుగా ఉన్నవారి చిహ్నాలను అవగాహనా రాహిత్యంతో ధ్వంసంచేసినా-ప్రజలే మరింతగా బాధితులవుతున్నారు తప్ప, పరిస్థితి మరింత జటిలం అవుతున్నది తప్ప ఫలితం ఉండడం లేదు.

ఆత్మాహుతులకు స్పందించని నేతలు విగ్రహాల ధ్వంసానికి గగ్గోలు పెట్టడమేమిటని తెలంగాణనేతలు ప్రశ్నిస్తున్నారు. ఉత్పన్నమయిన పరిస్థితి నుంచి అటువంటి వాదనలు పుట్టుకురావడం సహజమే. స్పందనల్లోని వివక్షనీ, వ్యత్యాసాన్నీ ప్రశ్నించవలసిందే. అస్తిత్వ ఉద్యమాలు తప్పనిసరిగా ఆ పనిచేస్తాయి, చేస్తున్నా యి. చాలా కాలంగా ప్రాతినిధ్య వివక్ష గురించి ప్రశ్నలు వస్తున్నప్పుడు, టాంక్‌బండ్ విగ్రహాల్లో తెలంగాణకు చెందిన వికాసమూర్తులకు లభించవలసిన స్థానం లభించలేదని ఆవేదన వ్యక్తం అవుతున్నప్పుడు-ఆ అన్యాయాన్ని, అసమానతను సరిదిద్దాలని కోరనివారు, అందుకోసం ప్రయత్నించనివారు ఇప్పుడు ఎలుగెత్తి విలపించడంలోని నిజాయితీని ఎవరైనా శంకించవలసిందే. అయితే, శ్రీకాంతాచారి, యాదయ్య వంటి వారి బలిదానాలకు భోరున విలపించిన వారు సైతం విగ్రహాల ధ్వంసానికి బాధపడవచ్చునని తెలంగాణవాదులు గుర్తించాలి. సీమాంధ్రులకే కాదు, తెలంగాణవారికీ ఇటువంటి సంఘటనలు రుచించకపోవచ్చును. బాహాటంగా పొరపాటును అంగీకరించడమా లేదా అన్నది రాజకీయమైన అంచనాలకు లోబడి నిర్ణయించుకునేది కావచ్చు ను కానీ, ఆత్మవిమర్శ చేసుకోవడం ఉద్యమానికే మంచిది. ఏ ఉద్యమాలు తప్పులు చేయలేదని? విప్లవోద్యమం, అస్తిత్వ ఉద్యమాలు అన్నీ ఏదో ఒక దశలో చేతులు కాల్చుకున్నవే. అయినా, వాటి ప్రాసంగికత, ప్రజాదరణ తగ్గలేదే?

విగ్రహ విధ్వంసాన్ని ఒక విధానంగా చేపట్టి 1970లలో నక్సలైట్లు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, గాంధీ, నెహ్రూ, బోస్‌వంటి వారి విగ్రహాలను పనిగట్టుకుని ధ్వంసం చేశారు. ఇక ఈ వర్ణాధిక్య దేశంలో ఏదో ఒక మూలన అంబేద్కర్ విగ్రహాలకు అపచారం జరగని రోజంటూ ఉండదు. విగ్రహాలను రక్షించలేక ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాల చుట్టూ ఇనుపకంచెలు కట్టి తాళాలు వేసిన దృశ్యాన్ని నేను ఔరంగాబాద్‌లో ప్రత్యక్షంగా చూశాను. కర్ణాట క- మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో ఇప్పటికీ అప్పుడప్పుడు శివాజీ విగ్రహాలను పాడుచేయడం జరుగుతూనే ఉన్నది. రష్యాలో లెనిన్ విగ్రహాన్ని 1990లో కూల్చివేస్తున్నప్పుడు-సామ్యవాద అభిమానులందరూ కన్నీరు మున్నీరయ్యారు కానీ, అక్క డి ప్రజలు తాము కూలదోస్తున్న అన్యాయ వ్యవస్థకు ప్రతినిధిగానే లెనిన్‌ను చూశా రు. ఇక పాత వైతాళికుల 'విగ్రహాలను' భౌతికంగా కాకపోయినా భావ రంగంలో దళిత, స్త్రీవాదాలు ఏనాడో కూల్చివేశాయి. ఎక్కడా జరగనిది ఒక్క హైదరాబాద్‌లో నే జరిగిందని బాధపడేవారు కూడా పై వాస్తవాలు గుర్తించాలి. అలాగే, విగ్రహాలు కేవలం ప్రాణంలేని బొమ్మలయితే ఇవన్నీ జరగవని తెలంగాణవాదులు గమనించా లి. విగ్రహాలకు ఏ ప్రాధాన్యం లేకపోతే, కొమరం భీమ్ విగ్రహం స్థాపించాలని కోర డం ఎందుకు? విగ్రహాల వెనుక జన మనోభావాలు ఉంటాయి. కూల్చివేసేవారి మనస్సులో అవి ప్రతికూల ప్రతీకలయితే, ప్రతిష్ఠించాలనుకునేవారి దృష్టిలో అవే సానుకూల చిహ్నాలు.

ఈ సందర్భంలో మిత్రుడు, కథకుడు, ప్రశంసార్హమైన భాషా సేవ చేస్తున్నవాడు అయిన సా.వెం. రమేశ్ చెప్పిన ఒక ఉదంతం ప్రస్తావిస్తాను. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూరు ప్రాంతంలో తెలుగువారు అధికంగా నివసిస్తారు. అక్కడ తెలుగువారి విద్యా, సాంస్కృతిక హక్కుల కోసం పోరాటం జరుగుతోంది. హోసూరు ధర్మపురి జిల్లాలో ఉన్న కాలంలో 1969లో తమ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఉద్యమ సందర్భంలో పెద్ద ఊరేగింపు తీసినప్పుడు కొంద రు ఆందోళనకారులు అన్నాదొరై విగ్రహాన్ని కూల్చివేశారు. అన్నాదొరై తెలుగువాడు. ఇప్పటి తమిళనాడు నేతల్లా కాకుండా బాహాటంగా తన మాతృభాష తెలుగు అని ప్రకటించినవాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు అడగకముందే, తెలుగును జాతీయభాష చేయాలని పార్లమెంటులో డిమాండ్ చేసినవాడు. ఇక ద్రావిడ, శూద్ర ఉద్యమాలలో ఆయన పాత్ర తెలియనిదెవరికి? కానీ, ఆ రోజున ఆయన విగ్రహాన్ని కూల్చివేసినప్పుడు హోసూరు తెలుగువారి దృష్టిలో ఆయన అక్కడి ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే. హోసూరు ఉదంతం నుంచి తెలంగాణ ఉద్యమం నేర్చుకోవాలని రమేశ్ అంటారు. ఆనాడు అన్నాదొరై విగ్రహ విధ్వంసాన్ని సాకుగా తీసుకుని తమిళనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను దించి, అక్కడి తెలుగు ఉద్యమాన్ని అణచివేసింది. అక్కడి ఉద్యమంతో పోలిస్తే, తెలంగాణ ఉద్యమం బలమైనదీ, విశాలమైన ప్రాంతంలో విస్తరించినదీ అయినప్పటికీ- పొరపాట్లు ఒక్కోసారి నష్టం కలిగిస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు. ఆ హెచ్చరిక పట్టించుకోవలసిందే!

2 comments:

  1. విగ్రహాల సంఘటన జరిగిన తరువాత నిజాయితీగా రాసిన మొట్టమొదటి వ్యాసం .కొంతమంది కుహన మేధావుల్లాగ బాబ్రీ విద్వంసం తో పోలిక తెచ్చే దుర్మార్గానికి "తెర" తీయనందుకు ధన్యవాదాలు .కొంతమంది armchair బ్లాగ్గిస్ట్ ల లాగ మార్చ్ లో పాల్గొన్నవారిని తెలబాన్ లు అననందుకు కృతజ్ఞతలు .కొంతమంది "ఘోలా జలే మాచ్ దొరా" బ్లాగ్గిస్ట్ ల లాగా NTR మాత్రమే ఒక్క మగాడు లాంటి శవాల ఫై పేలాలు ఏరుకొనే వ్యాఖ్యలు చేయనందుకు అభిననందనలు .
    "చేతులు కాల్చుకోవడం "జరిగిందంటారా ?ఎవరైనా అలా భావిస్తున్నారా?
    అన్ని విగ్రహాల వెనుక జన మనోభావాలు ఉంటాయా?ప్రజలు స్వచ్చందంగా పెట్టుకొన్న విగ్రహాలు ,ప్రభుత్వం పనికట్టుకొని ప్రతిష్టించిన విగ్రహాల relevance ఒకటేనంటారా ?

    ReplyDelete
  2. A very mature response. You did a wonderful job voicing the discomfort - instead of trying to pretend as if that was nothing - on the destruction.

    ReplyDelete