Wednesday, March 23, 2011

వేదికలన్నీ కిక్కిరిసిపోతున్న అనేకత్వపు కాలం!

ధ్వంసం అయిపోయిన విగ్రహాలను యథాస్థానంలో పునరుద్ధరించాలన్న డిమాండ్ రావడం, ప్రభుత్వం దానికి వెంటనే అంగీకరించడమూ వెంటవెంటనే జరిగిపోయాయి. ధ్వంసానికి కారకులయినవారు సైతం, కావాలంటే విగ్రహాలు మళ్లీ ప్రతిష్ఠించుకోవచ్చునని సంఘటన జరిగిన వెంటనే అనేశారు. అయితే, కూలిన విగ్రహాలతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాలను కూడా కలిపి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దారుణం జరిగిందని ఆవేదన చెందిన వాళ్లు కూడా మొదట యథాతథ స్థితిని పునరుద్ధరించి, తరువాత తెలంగాణ ప్రసిద్ధుల ప్రతిమలను ప్రతిష్ఠించుకోవచ్చునని అంటున్నారు. దానితో టాంక్‌బండ్‌మీద పెట్టవలసిన విగ్రహాల వరుస లో ఎవరెవరిని కొత్తగా చేర్చాలో సూచనలు రావడం మొదలయింది. ప్రాంతీయమైన పరిగణనతోనే కాకుండా, రకరకాల ప్రాతిపదికలపై డిమాండ్లు, సలహాలు వస్తున్నాయి. వాటన్నిటికీ గనుక ఆచరణ రూపం ఇస్తే, టాంక్‌బండ్ మాత్రమే కాదు, హుస్సేన్‌సాగర్ వలయాకారపు తీరమంతా విగ్రహాలతో కిటకిటలాడిపోతుంది. ఊహా మాత్రానికే అదొక అసాధ్యంగా, హాస్యాస్పదంగా, అధివాస్తవిక దృశ్యంగా కనిపించవచ్చును కానీ, ఇంతకాలం జరిగిన విస్మరణలకీ, సాధికార రాజకీయాలు ముందుకు తెస్తున్న సంకేతాత్మక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికీ ఆ బొమ్మల సమ్మర్దం ఒక ప్రతీక కూడా.

మా ప్రాంతం వాళ్లవి, మా వర్గం వాళ్లవి, మా ఉద్యమాల ప్రతినిధులవి విగ్రహాలో, చిహ్నాలో, నామకరణాలో ఉండాలని డిమాండ్ చేసే వారికి, అది ఒక రాజకీయ వ్యక్తీకరణే తప్ప, చారిత్రకమయిన, విద్యావిషయికమైన అవగాహనతో చేసే వ్యక్తీకరణ కాదు. బాబా సాహెబ్ అంబేద్కర్ కన్నుమూసిన ముప్పై అయిదేళ్ల తరువాత కానీ, ఆయన చిత్రపటం పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో ఆవిష్కృతం కాలేదు, ఆయనకు భారతరత్న గౌరవం దక్కలేదు. మరి స్వతంత్ర భారతదేశం అంతకాలం ఎందుకు ఆయనను విస్మరించింది? దళిత శ్రేణులైనా ఆ డిమాండ్‌ను
అంతకాలం ఎందుకు బలంగా వినిపించలేదు? కాలం కలసివస్తే కానీ, తగిన చైతన్యం సందర్భం వస్తే కానీ ఏ అసమానతకైనా దిద్దుబా టు లభించదు. టాంక్‌బండ్ మీద విగ్రహాలలో కాళోజీ, దాశరథి, రావినారాయణరెడ్డి లేరని అనేవారి ఆవేదన వర్తమానానిదే కానీ, చరిత్రకు సంబంధించింది కాదు.

ఆ విగ్రహాల స్థాపన జరిగే నాటికి వారంతా సజీవులు. నిజానికి, ఉన్నంతలో ఎన్‌టిరామారావు చేసిన విగ్రహాల ఎంపిక మరీ తప్పుపట్టదగినది కాదు. ముప్పైమూడుమందిలో ఏడు విగ్రహాలు తక్కువే అయినప్పటికీ, అప్పటికి విస్మృతమైన తెలంగాణ చరిత్రను దృష్టిలో పెట్టుకుంటే పరవాలేదనిపించే ప్రాతినిధ్యమే. కొమరం భీమ్ వంటి వారి పేర్లు అప్పటికింకా చరిత్రవేదిక మీద పూర్తి చర్చకు రానేలేదు. అస్తిత్వ ఉద్యమాల విజృంభణ తరువా త సంకేతాత్మక ప్రాతినిధ్యం కావాలన్న ఒత్తిడి పెరిగింది. నిజానికి విస్మరణకు ఎన్టీయార్‌వంటి వారు కూడా గురయ్యారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. చెన్నై విమానాశ్రయాన్ని చూసినప్పుడు, ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. భారత ప్రధాని స్థాయి కి వెళ్లినప్పటికీ, పీవీ నరసింహారావుకు ఢిల్లీ సమాధుల వరుసలో చోటు దక్కలేదు. రాష్ట్రంలో సైతం ఎన్టీయార్ ఘాట్‌కు ఉన్న వైభవం దానికి లేదు. గొప్పవ్యక్తులను, గత చరిత్రను చిరస్మరణీయంగా చేసుకోవడానికి మానవ సమాజా లు అనేక రూపాలలో ప్రయత్నాలు చేస్తా యి. విగ్రహాలు స్థాపించడం, నామకరణా లు చేయడం అటువంటి రూపాలే.

విగ్రహా లు కానీ, నామకరణాలు కానీ ఆయా చరిత్రాంశాలపైనో, చారిత్రక వ్యక్తులపైనో ప్రత్యే క, వ్యక్తిగత గౌరవంతో జరిగేవి కావు. వర్తమాన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలతో ఆయా చరిత్రలకు, వ్యక్తులకు ఉన్న ప్రాసంగికత ఆధారంగానే స్మారకచర్య లు తీసుకుంటారు. ప్రతి స్మృతి వెనుకా కొన్ని ప్రజాశ్రేణులు, వారి సంస్కృతి నిక్షిప్తమై ఉంటాయి. ప్రాబల్య వర్గాలవారు తమ స్మృతి, తమ సంస్కృతి అందరిదిగా చాటాలని, స్థిరపరచాలని చూస్తాయి. దానిపై పోరాడే ప్రజలు తమ సంకేతాలను, తమచరిత్రను, సంస్కృతిని ముందుకు తెస్తారు. వివిధస్థాయిల్లో సమాజంలో జరిగే ఘర్షణ- చిహ్నాలు, సంకేతాల రంగంలో కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈమధ్యనే కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టడం వివాదాస్ప దం అయింది. కడప అన్న పేరును కూడా తీసేసి పూర్తిగా వైఎస్ఆర్ అన్న పేరు పెట్టాలని జరిగిన రాజకీయ నిర్ణయాన్ని, చివరకు మార్చుకుని కడప పేరును కూడా కొనసాగించాలని నిర్ణయించారు. పెడితే గిడితే వేమన పేరు పెట్టాలి లేదా కడప కోటిరెడ్డి పేరు పెట్టాలని వాదించినవారున్నారు. అసలు కడప అన్న పేరుకే ఎంతో చరి త్ర ఉన్నది, దాన్ని మారిస్తే జిల్లాకు చారిత్రక అస్తిత్వమే లోపిస్తుంది అని కొందరు వాదించారు. ఈమధ్యనే ఎవరో మెదక్‌జిల్లాకు ఇందిర పేరు పెట్టాలని తీర్మానం చేశారు.

వైఎస్ జిల్లా ఏర్పడినంత వేగం గా ఇందిర జిల్లా కూడా వస్తుందేమోనని భయం వేసింది. మెతుకుసీమ అన్న పేరు ఎప్పటిది? ఎంతటి చరిత్ర ఆ పేరులో నిక్షిప్తమై ఉన్నది? అదృష్టవశాత్తూ, మెదక్‌జిల్లా పేరుకు ఇప్పట్లో ప్రమాదం ఏమీ ఉన్నట్టు లేదు. అందరి విషయంలోనూ పేర్ల మార్పులు వేగం గా జరగవు. విజయనగరం జిల్లాకు గురజాడ జిల్లా అని పేరుపెట్టాలని డిమాండ్ దశాబ్దాల తరబడి వినిపిస్తున్నా, రాజకీయవర్గాలు అణువంత కూడా స్పందించకపోవ డం మనకు తెలుసు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పేర్లు పెట్టడం వేరు. మూడు జిల్లాలనుంచి ముక్కలు తీసి ఏర్పరచిన ఒంగోలు జిల్లాకు కొత్తలోనే ప్రకాశం పేరు పెట్టేశారు. హైదరాబాద్ జిల్లా నుంచి పాత అత్రాఫుబల్దా ప్రాంతాన్ని వేరుచేసి కొత్త జిల్లా చేసి రంగారెడ్డి పేరు పెట్టారు. వాటిమీద వివాదాలేమీ రాలేదు. ప్రయోజనాల ఘర్షణ లేనప్పుడు వివా దం అయ్యే అవకాశమే ఉండదు.

అలాగే, పేర్ల మార్పిడి మీద ఆందోళన చే సే స్పృహ లేనప్పుడు కూడా ప్రజలు కొత్త అధికారిక నామాలను వాడకుండా, పాత పేర్లనే వాడుకలో కొనసాగించడం ద్వారా తమ అభీష్ఠాన్ని తెలియజేసేవారు. నిజాముల కాలంలో పేర్లు మారిన మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లను ఇప్పటికీ ప్రజలు పాలమూరు, ఇందూరుగానే పిలుచుకుంటున్నారు. భాగ్యనగరమని పిలవకుండా హైదరాబాద్‌నే కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ పేరును చదువుకున్న వారికి వదిలివేసి, లష్కర్ అన్న పేరునే మొన్నమొన్నటిదాకా ఉపయోగించారు. వాడుకలో ఉన్న పేర్లను మార్చడంలో కూడా ప్రజల ఆకాంక్షలు కూడా ఉండే అవకాశం ఉంది. కలకత్తా, మద్రాస్, బొంబాయి, బెంగుళూరు పేర్లు మారిపోయాయంటే, ఆయా ప్రాంతాల స్థానికచరిత్రకు అనుగుణంగా సవరించడం వల్లనే. వలసపాలనలో పెట్టిన అనేక వీధుల పేర్లను, భవనాల పేర్లను స్వాతంత్య్రానంతరం మార్చ డం జాతీయవాద ప్రభావంతోనే. ఇక స్వతంత్ర భారతంలోని ప్రముఖుల, ప్రసిద్ధుల పేర్లను వివిధ వ్యవస్థలకు నామకరణం చేస్తున్నప్పు డు-ప్రజలలోని భిన్న ఆకాంక్షలు ఘర్షణపడే సందర్భాలు ఉంటా యి.

మరఠ్వాడా విశ్వవిద్యాలయానికి అంబేద్కర్ పేరుపెట్టడంపై ఎంత పెద్ద హింసాత్మక వివాదం జరిగిందో తెలిసిందే. హైదరాబాద్‌లో లాల్‌బహదూర్ స్టేడియం, రవీంద్రభారతి నామకరణాలపై శ్రీశ్రీ పదేపదే అభ్యంతరం చెప్పేవారు. లాల్‌బహదూర్‌శాస్త్రి వంటి శారీరక బలహీనుడి పేరు ఆటస్థలానికి ఎట్లా పెడతారు అని ఆయన ప్రశ్న. కోడిరామమూర్తి పేరు పెట్టవచ్చు కదా అని ఆయన సూచన. అట్లాగే, రవీంద్రభారతికి గురజాడ పేరుపెట్టాలని ఆయన ప్రతిపాదన. తెలంగాణ ప్రాంతానికి చెందిన మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణరావు వంటి వారిపేర్లు రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు, సంస్థలకు పెట్టకపోవడంపై అభ్యంతరం ఎప్పటినుంచో వినిపిస్తున్నది.

బూర్గుల విగ్రహం పెట్టాలని ఆయన కుటుంబీకులు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి విన్నపాలు పంపగా పంపగా కొన్నేళ్ల కిందట ఎక్కడో ఆయన విగ్రహం వెలిసింది. తమ ప్రాంతపు నాయకుల స్మ­ృతిచిహ్నాల స్థాపనలో ప్రాంతీయులకే శ్రద్ధ లేదని వస్తున్న వాదనలో కూడా వాస్తవం ఉన్నది. ప్రతాపరెడ్డి దగ్గరనుంచి కొమరం భీమ్ దాకా వారి వారి జిల్లాల్లోనే స్మారకచిహ్నాల కోసం కనీస ప్రయత్నం జరగలేదు. రాజధానిలో ప్రాతినిధ్యం కోసం పోరాడవలసిందే కానీ, చరిత్రను స్మరించుకోవడం అట్టడుగుస్థాయినుంచి జరగాలికదా? స్మారకచర్యల విషయంలో ప్రభుత్వాలు మాత్రమే వివక్షను పాటించడం లేదు. తెలంగాణ సాయుధపోరాటం ప్రతిష్ఠతోనే ఇంకా మనుగడ సాగిస్తున్న వామపక్షాలు సైతం, తమ తమ భవనాలు, సంస్థల నామకరణాల్లో స్థానికంగా ఎదిగిన నేతలకు న్యాయం చేసినట్టు కనిపించదు. ఇక చరిత్ర గ్రంథా ల్లో, సంకలనాల్లో సమాచారం, గుర్తింపు పాక్షికంగా ఉండడం చూస్తూనే ఉన్నాము.

నాయకత్వం, ప్రసిద్ధి, జనాకర్షకత్వం, స్టార్‌డమ్- ఇవి స్వతహాగా ప్రజాస్వామికమైన వి కావు. అవన్నీ సమకూరడానికి అనేక సానుకూల లక్షణాలతో పాటు, వ్యవస్థాగత సదుపాయాలు కూడా సమకూరి ఉండాలి. ఏటికి ఎదురీది తమ వ్యక్తిత్వాన్ని పతాకంగా ఎగురవేసేవారు చాలా కొద్దిమంది. సమాజానికి కానీ, అందులోని ఏదైనా ఒక పాయకు గానీ ఏకనాయకత్వాన్ని అంగీకరించలేని స్థితి ఇవాళ ప్రజల్లో ఉన్నది. అందువల్ల, తారతమ్య పరీక్ష, వ్యత్యాసాల ఖండన జరుగుతున్నది. విశాల జనబాహుళ్యం చరిత్రకు చోదకశక్తి కాగా, అందులో నుంచి కొందరు వ్యక్తులను మహానుభావులుగా ఎంచుకోవడమే ఒక వైరుధ్యం. వ్యక్తుల చొరవా, ప్రతిభాపాటవాలు ప్రాధ్యాన్యం లేనివని కాదు, అవి మసకబరచే అమూర్త ప్రజానీకం పరిగణన ఏమిటన్నది ప్రశ్న. అందుకే, నేడు ప్రేక్షకులుగా నిలిచి, వేదిక ల మీది పెద్దలకు జేజేలు పలికే ప్రజలు తగ్గిపోతున్నారు, వేదికలను ఆక్రమించుకోవడానికి తొక్కిసలాట జరుగుతున్నది. చరిత్ర గర్భం నుంచీ, వర్తమానపు మూలమూలల నుంచీ గుర్తింపు కోసం అనేకానేక విగ్రహాలు పైకి చొచ్చుకువస్తున్నాయి. ఇది యుగ స్వభావం. ఇతరులతో కలసి వేదికను పంచుకోవడానికి వైతాళికులకు ఏ అభ్యంతరమూ ఉండదు. సమ్మిళితమైన చరిత్ర రచన పుస్తకాలలోనే కాదు, వర్తమాన సమాజంలోనూ జరగాలి. అనేక పేర్లను, స్మృతులను గర్భీకరించుకుని వ్యక్తం చేసే ఉమ్మ డి స్మారకాల కోసం సృజనాత్మక అన్వేషణ జరగాలి. అప్పటిదాకా, ప్రతిపాత, కొత్త వైతాళికుడినీ నామవాచకంగా కాక, సర్వనామంగా పరిగణించడం నేర్చుకోవాలి. కాలం కడుపుతో ఉండి కన్నవారే కదా ఏ యుగ వ్యక్తులైనా?

1 comment:

  1. very nice. you have touched the problem to it's roots. very nice anyalysis

    ReplyDelete