Tuesday, March 29, 2011

ఆ అధ్యాయం అందరికీ అవమానం!

దక్షిణ, పశ్చిమ భాగాలు మాత్రమే భారతదేశం అయి ఉంటే, వృద్ధిరేటు బ్రహ్మాండంగా ఉండి ఉండేదని కేంద్ర హోంమంత్రి చిదంబరం అమెరికన్ రాయబారి తో అన్నట్టు వికీలీక్స్ బయట పెట్టడంతో తీవ్రమైన ఖండనలు, విమర్శలు వస్తున్నా యి. చిదంబరం మాటలు ఉత్తర భారతదేశాన్ని అవమానించేవిగా ఉన్నాయని సమాజవాదీ పార్టీ పార్లమెంటు ఉభయసభల్లో అభ్యంతరం తెలియజేసింది. నిజానికి చిదంబరం అధిక ప్రసంగాన్ని ఉత్తరాది వారే కాదు, వివేకం విచక్షణ ఉన్నవారెవరైనా ఖండిస్తారు. దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలు బీదరికంలో ఉన్నాయి కాబట్టి, దక్షిణ, పశ్చిమభాగాలు సాధిస్తున్న వృద్ధిని అవి హరిస్తున్నాయన్నది చిదంబరం అభిప్రా యం. సోషల్ డార్వినిజం తలకెక్కితే వచ్చే ఆలోచనలు ఇవి. ద్వంద్వ యుద్ధపు గోదా లో ఎవరో ఒకరే సజీవంగా మిగలాలనుకునే ప్రాచీన రోమన్ ప్రభువులలాగానే, నూతన ప్రపంచపు నియో లిబరల్ ప్రతినిధులు కూడా పరాజితులను వారి ఖర్మానికి వారిని వదిలివేయాలనే ఆటవిక న్యాయాన్ని నమ్మేవారే.

చిదంబరం మాటలు వింటే కొన్ని సంవత్సరాల కిందట చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు గుర్తుకు వస్తాయి. కేంద్ర నిధుల కేటాయింపుల విషయంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నదని, వెనుకబాటుతనం, అవసరాలు వంటి ప్రాతిపదికల కారణంగా బీహార్ వంటి రాష్ట్రాలకు
అధిక నిధులు వెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తన సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆగమేఘాల మీద అభివృద్ధి చెందుతోందన్న అభిప్రాయంలో ఆయన తలమునకలై ఉన్నారు కాబట్టి, ఆవేశంలో ఆ మాట అనేశా రు.

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పరుగులో ఉన్న రాష్ట్రంగా కీర్తించే వ్యాఖ్య అయినప్పటికీ, రాష్ట్రంలోని పత్రికలు, ప్రజాస్వామిక సంస్థలు దాన్ని తప్పుపట్టాయి. సంతానం అంతటిలోకీ బలహీనంగా ఉన్న బిడ్డకు తల్లి అదనపు పోషణ ఇవ్వాలని, వెనుకబడిపోయిన వారికి దగాపడిన వారికి మెరుగుగా ఉన్నవారు సాయపడాలని కోరుకోవడం మానవీయ విలువల్లో భాగం. ఆ విలువలను నమ్మేవారు, విరుద్ధమైన మాటలు వినిపించినప్పుడు అభ్యంతరం చెప్పితీరతారు.
తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదని ఒక వాడుక. తనకు మాలిన ధర్మం లేదన్నది మరో సామెత. రెండోది ఆపద్ధర్మం కింద చెప్పారేమో కానీ, అసలైన ధర్మం, ఆదర్శం మొదటిదే. మంచి చెడ్డల విచక్షణలో, విలువల మదింపులో, ఆచరణలో స్వ-పర భేదాలు ఉండకూడదు. భిన్నాభిప్రాయాలకు చెందినంత మాత్రాన భిన్నమైన విలువలు ఉండనక్కరలేదు. ఉభయులూ అంగీకరించే నియమాలు లేనప్పుడు ధర్మయుద్ధానికి ఆస్కారమే ఉండదు. దురదృష్టవశాత్తూ- సమాజంలో ఉన్న విభజనలు తరచు మంచిచెడుల విచక్షణను కప్పివేస్తున్నవి. తమకు అనుకూలమైనదంతా మంచిదేనని, తక్షణ ప్రయోజనానికి పనికి వస్తే శాశ్వత విలువలు నాశనమయినా పరవాలేద ని నమ్మే పరిస్థితి వచ్చింది.

శ్రీకృష్ణకమిటీ రహస్య అధ్యాయంలోని అంశాలను కొందరు నాయకులు వెనకేసుకు రావడం చూస్తే బాధ కలుగుతున్నది. కమిటీ సమైక్యాంధ్ర వాదానికి అనుకూలం గా ఉన్నది కాబట్టి, అది చేసిన ప్రతి పనీ, చేసిన ప్రతి వ్యాఖ్యా సమర్థనీయమే అనుకోవడం వల్ల వ్యక్తమవుతున్న వైఖరి అది. శ్రీకృష్ణకమిటీ అధ్యయనమూ, సమర్పించిన బహిరంగ నివేదికా, చేసిన సిఫార్సులూ వేరు. వాటిపై ప్రాంతాల వారీగా స్పందనలు రావడంలో ఆశ్చర్యమేమీ లేదు.
శ్రీకృష్ణ చేసిన సిఫార్సులు నికార్సయినవనీ, వాటిని అమలు చేయడమొక్కటే రాష్ట్రవిభజన సమస్యకు పరిష్కారమనీ తెలంగాణేతర ప్రాంత నాయకులు భావిస్తే, అందులో తప్పుపట్టవలసిందేమీ లేదు. కానీ, రహస్య అధ్యాయం సంగతి వేరు. ఒక అధ్యాయాన్ని రహస్యంగా ఉంచాలనుకోవడమే అప్రజాస్వామికం. ప్రజాప్రయోజనాలు ముడిపడిన ఏ సమస్య మీద, ఏ డిమాండ్ మీద జరిగే ఏ అధ్యయనమైనా పారదర్శకంగా ఉండవలసిందే. దాపరికం పనికిరాదు. అది వ్యవస్థలపై అవిశ్వాసాన్ని, అనుమానాన్ని కలిగిస్తుంది.

శ్రీకృష్ణకమిటీ రాష్ట్రవిభజనే ఉత్తమ పరిష్కారమని సూచించినప్పటికీ, ఆ అధ్యయన నివేదికలో కొన్ని భాగాలు రహస్యంగా ఉంచితే తెలంగాణవాదులు సైతం అభ్యంతరం చెప్పి ఉండవలసిందే. తెలంగాణకు అనుకూలం గా శ్రీకృష్ణ నివేదిక ఉన్న పక్షంలో కూడా- ఆ సిఫార్సుకు ప్రతికూలంగా ఉండే సమైక్యాంధ్ర ఉద్యమకారులను ఎట్లా అణచివేయాలో రహస్యంగా సూచనలు చేస్తే కనుక దాన్ని అందరూ అభ్యంతరపెట్టవలసిందే. శ్రీకృష్ణ సిఫార్సులతో నిమిత్తంలేని సమస్య ఇది. తెలంగాణ- ఆంధ్రలకు అతీతమైన విలువలకు సంబంధించిన అంశం ఇది.

రహస్య అధ్యాయంపై సార్వజనీనమైన అభ్యంతరాలు ఉండవలసిన అంశాలు మూడు. ఒక ఉద్యమాన్ని రాజకీయంగా, మీడియా పరంగా, శాంతిభద్రతల కోణం లో ఎట్లా 'మేనేజ్' చేయాలో ఆ అధ్యాయం చెప్పింది. కొన్ని పదవులను ఎరవేసి ప్రజాప్రతినిధులను ఎట్లా దారికి తేవాలో, ప్రకటనల ఆయుధాన్ని ఝళిపించి మీడియాను ఎట్లా మచ్చిక చేసుకోవాలో, మెత్తటి ఆయుధాలతోనే ఉద్యమకారులను ఎట్లా అణచివేయాలో వివరంగా చెప్పింది. ఆ వాక్యాలు చదివితే- పార్టీలకూ ప్రాంతాలకూ పరిమితం కాకుండా ప్రజాప్రతినిధులందరూ, పత్రికారంగం అంతా, సకలరకాల ఉద్యమకారులూ నొచ్చుకుని ఉండాలి. పాత్రికేయుల ప్రాంతీయత గురించి ప్రస్తావించిన వాక్యాలు నిజానికి తెలంగాణేతర ప్రాంతాల జర్నలిస్టులనే ఎక్కువగా కించపరచాయి. ప్రాంతాలతో వ్యక్తిగత రాజకీయాభిప్రాయాలతో నిమిత్తం లేకుండా నిష్పక్షపాతంగా వృత్తి ప్రమాణాలతో సమాచారాన్ని అందిస్తున్న పాత్రికేయుల్లో అన్ని ప్రాంతాల వారూ ఉన్నారు. తెలంగాణేతరప్రాంతానికి చెందిన జర్నలిస్టులను ఉద్యమం అణచివేతకు ఉపయోగించుకోవాలన్నట్టుగా శ్రీకృష్ణకమిటీ చెప్పడం ఎంత అవమానకరం?
మీడియాసంస్థల యాజమాన్యాల ప్రాంతీయతను వేలెత్తిచూపడం, దాన్ని ప్రభుత్వవ్యూహాలకు అనుకూల అంశంగా పరిగణించడం-ఒక సీనియర్ న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కమిటీ చేయవలసిన పనేనా? రహస్య అధ్యాయం తమను అవమానించింది కాబట్టి- హక్కుల తీర్మానం పెట్టాల ని తెలంగాణ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఉద్యమకార్యాచరణలో భాగంగా వారా పనిచేయాలనుకోవచ్చును కానీ, చట్టసభల సభ్యులకు లభించవలసిన ప్రతిష్ఠను విశ్వసించేవారందరూ ఆ పనిచేయవచ్చు. అధికారపార్టీకి చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులను బుజ్జగించి దారికి తేవాలని, ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధులను కూడా వారి మార్గంలోకే రప్పించాలని రహస్య అధ్యాయం సూచించింది. ఇవి కాంగ్రెస్, తెలుగుదేశం శాసనసభ్యులందరూ హర్షించలేని వ్యాఖ్యలే. రాజకీయంగా పచ్చి ప్రత్యర్థులైనా సరే, సభ్యుడి హక్కులకు భంగం కలిగితే సభ అంతా ఒకటిగా నిలిచిన సందర్భాలు అనేకం. ఈ సందర్భంలో మాత్రం హక్కులను ప్రాంతాల వారీగా చూడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక మజ్లిస్‌పై చేసిన వ్యాఖ్యలైతే దారుణమైనవి. ఆ పార్టీ ఎందుకు ఇంకా స్పందించలేదో అర్థం కాదు. ఇక భారతీయ జనతాపార్టీ బలపడడం గురించిన చింత కమిటీకి ఎందుకో తెలియదు. అలాగే, తెలంగాణ ఏర్పడితే మావోయిస్టులు బలపడతారన్న నిర్ధారణకు సహేతుకమైన సమర్థన ఏదీ కనిపించదు.

ఏ ఉద్యమాన్నైనా సరే, దాన్ని ప్రజాస్వామిక ప్రభుత్వాలు పరిగణించి, పరిష్కరించడానికి కొన్ని విలువలు, పద్ధతులు ఉంటాయి. కొన్ని డిమాండ్లు కొంత ఒత్తిడితో అంగీకరించగలిగేవి ఉండవచ్చు. కొన్ని డిమాండ్లూ వెంటనే కానీ, యథాతథంగా కానీ నెరవేర్చగలిగేవి కాకపోవచ్చు. ఆమోదాన్ని అయినా, తిరస్కారాన్ని అయినా అమలు చేయడానికి కూడా ప్రజాస్వామిక ప్రక్రియ ఉండాలి. ఒక ఉద్యమాన్ని అప్రజాస్వామికంగా అణచివేయడానికి అనుమతిస్తే, అది అంతటితో ఆగుతుందని చెప్పలేము. అన్ని ఉద్యమాల విషయంలో అదే పద్ధతిని ప్రభుత్వాలు యథేచ్ఛగా అనుసరించే ప్రమాదం ఉన్న ది. అందువల్లనే, ఏకీభవించని భావ ప్రకటనకు కూడా పోరాడడమే ఉన్నత ప్రజాస్వామిక విలువ అని పెద్దలు అన్నారు. తెలంగాణ ఉద్యమం విషయంలో రహస్య అధ్యాయంలో సూచించిన అణచివేత పద్ధతులు అక్కడితో ఆగుతాయా? రాష్ట్రంలో అయినా, దేశంలో అయినా తెలంగాణ ఉద్యమమే ఆఖరి ఉద్యమమా? ఒక అప్రజాస్వామిక ధోరణికి హ్రస్వదృష్టితో జేజేలు పలికితే, అది రేపు అందరినీ చుట్టుకోదా?

రాష్ట్రవిభజన విషయంలో ఎవరి వైఖరులు వారు ఉంచుకోండి, తప్పులేదు. కానీ ఆ పాక్షిక దృష్టి మొత్తంగా విచక్షణను కబళించి, శాశ్వతంగా ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే ధోరణులను అనుమతించకండి. రహస్య అధ్యాయాన్ని, అందులో వ్యక్తమైన అప్రజాస్వామికతను అందరూ సమైక్యంగా ప్రతిఘటించి, తెలుగుప్రజల పరిపక్వతను చాటండి

2 comments:

  1. కామెంట్ ఈ ఆర్టికల్ మీద కాకపోయినా, మీ ఆలోచల విధానం చాల బాగుంది.

    ReplyDelete