Monday, April 4, 2011

పొరుగుబూచిని దాటి మన జాతీయత ఎదగదా?

ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో జరిగిన పెద్ద యుద్ధం రష్యా-జపాన్ యుద్ధం. రెండు దేశాలూ అప్పుడు రాచరికంలోనే ఉన్నాయి. రెండు దేశాలకూ విస్తరణవాద దృష్టి ఉన్నది. యుద్ధంతో రెండుదేశాల ప్రజాప్రయోజనాలేమీ ముడిపడిలేవు. మంచూరియా, కొరియాల మీద ఆధిపత్యం కోసమే రెండు దేశాలూ పోరాటానికి దిగా యి. 1904లో మొదలై 1905లో ముగిసిన ఈ యుద్ధంలో జపాన్ గెలిచింది. ఒక దేశం మీద మరో దేశం గెలుపును ప్రపంచం మరో రకంగా అర్థం చేసుకుంది. అది ఒక ఐరోపా దేశం మీద ఒక ఆసియా దేశం గెలుపు. బ్రిటిష్‌పాలనలో ఉన్న భారతదేశ ప్రజలకు ఆ విజయం శుభసూచకంగా కనిపించింది. మునగాల రాజా రాజా నాయని వేంకట రంగారావు జపాన్ సైనాధిపతుల పేర్లు అడ్మిరల్ టోగో, జనరల్ నోగి తన పిల్లలకు ముద్దుపేర్లుగా పెట్టుకున్నారు. అంతే కాదు, ఆదిపూడి సోమనాథరావు అనే కవిపండితుని చేత 'జపాను దేశచరిత్రము' అనే కావ్యాన్ని రాయించారు.ఐరోపా ఖండంలో రష్యా ప్రాబల్యా న్ని నిరోధిస్తుంది కనుక జపాన్‌కు లోపాయికారీ సహాయం అందించిన బ్రిటిష్‌వారికి కూడా జపాన్ కీర్తన అభ్యంతరకరం కాకపోయింది. స్ఫూర్తి కోసం ప్రేరణల కోసం కను లు విప్పార్చి, మనసు తెరచుకుని వెదుక్కుంటున్న భారత నవ జాతీయవాదులకు జపాన్ గెలుపు చిన్న ఆలంబన అయింది.

అదే మునగాల రాజా, నైజాము రాజ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ప్రేరణగా శ్రీకృష్ణదేవరాయలను స్వీకరించారు. అంతకు కొన్ని సంవత్సరాల ముందు, రాబర్ట్ సోవెల్ కూర్చిన 'విస్మృతసామ్రాజ్యం' (ఫర్‌గాటెన్ ఎంపైర్) పుస్తకం విజయనగర రాజ్య వైభవాన్ని ఆవిష్కరించింది. న్యూనతలో పడిపోయిన దేశీయులకు గత వైభవ ప్రతీకను అందించింది. తెలుగు భాషాసాహిత్యాలకు పోషకుడైన చక్రవర్తి, తెలుగుకు ఆదరణ కరువైన నైజామురాజ్యంలో ప్రజలకు ప్రేరకుడు కాగలడని భావించి, 1901లో హైదరాబాద్‌లో స్థాపించి న గ్రంథాలయానికి కృష్ణదేవరాయల పేరు పెట్టాలని రంగారావు అనుకున్నారు.అదే శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం. తెలంగాణలో ప్రజాహితరంగం ఆవిర్భావానికి బీజం వేసిన తొలితెలుగు గ్రంథాలయం. తెలంగాణ ప్రాంతాన్ని ఎప్పుడూ పాలించకపోయినా, కృష్ణదేవరాయలు ఆ ప్రాంతానికి ఒక కాలంలో ఆత్మీయమైన చిహ్నం కాగలిగా రు. ఆ విషయం తెలిసి ఉంటే విగ్రహాలపై దాడి చేసినవారు ఆయన ప్రతిమపై సహనం చూపించి ఉండేవారు. 

ఆసియా అస్తిత్వం నుంచి జపాన్ విజయం, నైజాము అస్తిత్వం నుంచి కృష్ణదేవరాయ ల చరిత్రావిష్కరణ ప్రజాకాంక్షలకు దోహదకారి అయ్యాయి. జాతీయత కానీ, ప్రాంతీయత కానీ తమ తమ ప్రేరణలను బలీయమైన చిహ్నాల నుంచే వెదుక్కుంటాయి. భరతఖండం అనాదిగా ఉన్నదే అయినప్పటికీ,
భారతజాతి మాత్రం ఈ మధ్యనే రూపుదిద్దుకుందని చరిత్రకారులు అంటారు. సుమారు ఐదువందలు చిన్నాచితకా సంస్థానాలు, అవి పోగా బ్రిటిష్‌వారు పాలించిన విశాల భూభాగం ఒక దేశంగా, జాతిగా రూపుదిద్దుకోవడానికి జాతీయతాభావన కారణం. దాన్ని రగిలించింది బ్రిటిష్ వ్యతిరేకత. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజాన్ని ఎదిరించడానికి భారతజాతి స్వీకరించిన ఘనమైన చిహ్నాలు- ప్రపంచచరిత్రలోనే తొలి నాగరికతల్లో ఒకటి కావడం, వైభవోజ్వలమైన ప్రాచీన చరిత్ర.

మధ్యయుగాల అంధకారం- సామ్రాజ్యవాద చరిత్రకారుల అతిశయోక్తి, బ్రిటిషర్లు సాగించిన విధ్వంసాన్ని కప్పిపుచ్చే వక్రీకరణ, భారతీయుల్లో న్యూనతాభావాన్ని పెంపొందించే చాణక్యం. దాని వలలో భారతీయులు పడిపోయినప్పటికీ, ప్రాచ్య పురాఘనతను ఆసరా చేసుకుని జాతినిర్మాణం చేసుకున్నారు. బ్రిటిషర్లు నిర్మించిన రైలుమార్గాలూ రహదారులే భారతీయుల మధ్య సమష్టి అస్తిత్వ భావనను రంగరించిపోశా యి. జాతీయోద్యమ నాయకత్వం రాట్నాన్ని, సత్యాగ్రహాన్ని, అస్పృశ్యతా నివారణను, భారతమాతను ప్రతీకలుగా తీర్చిదిద్దింది. విదేశీవస్తు బహిష్కారం, సహాయనిరాకరణం వంటి ఆందోళనారూపాలను చేపట్టింది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో సైతం క్విట్ ఇండియా ఉద్యమరూపంలో ప్రతిఘటనను తీవ్రస్థాయిలో అమలుచేసింది. శత్రువులెవరో, తమవారెవరో స్పష్టంగా నిర్వచించుకుని భారతజాతి స్థిరపడింది. వలసవాద వ్యతిరేకత ను, స్వావలంబనను, సంఘసంస్కారాన్ని జాతీయత మూల సూత్రాలుగా స్వీకరించింది. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజు ల్లో పారిశ్రామిక, వ్యవసాయాభివృద్ధికి వేసిన తొలిఅడుగులే జాతీయత చిహ్నాలయ్యాయి. భారీ కర్మాగారాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు జనంలో దేశభక్తిని ఉద్దీపింపజేశాయి. అంతర్జాతీయంగా అలీన విధానం పేరుతో అగ్రరాజ్యాల సరసన సమానహోదాలో వ్యవహరించడానికి చేసిన ప్రయత్నాలు సైతం జనం నుంచి అభినందనలు పొందాయి. అమెరికాను ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరికలు చేసిన ఇందిరాగాంధీని దేశం ఆరాధనగా చూసింది.

దురదృష్టవశాత్తూ, ఇప్పుడు మన జాతీయతా భారాన్నంతా క్రికెట్ క్రీడ ఒక్కటే మోస్తున్నట్టు కనిపిస్తోంది. మన జాతీయతాభావనకు కావలసిన శత్రుపాత్రను పాకిస్థాన్ ఒక్కటే భరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకనాడు మహామహా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన జాతి, పాలస్తీనాను నెత్తికెత్తుకుని అమెరికాను, దక్షిణాఫ్రికా వర్ణవివక్షను వ్యతిరేకించి తెల్లప్రపంచాన్ని హుంకరించిన జాతి- ఇప్పుడు కానీకి ఠికానా లేని పాకిస్థాన్ మీద తొడగొట్టి మురిసిపోతున్నది.

ఆర్థిక వృద్ధి రేటులో మనలో సగమున్న దేశం, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో ఒక్కశాతం కూడా లేని దేశం, ఇంటిపోరులోనూ అమెరికా పెద్దన్న తీరుతో నూ సతమతమవుతున్న దేశం, ఆకాశం నుంచి విరుచుకుపడే బాంబులో, జనసమ్మర్దం లో మానవబాంబులో పేలి అడగడుగునా శ్మశానాలు వెలుస్తున్న దేశం-మనం పోటీపడవలసిన దేశంగా, పతనం కావాలని కోరుకునే దేశంగా కనిపించడమే ఆశ్చర్యం.

పాకిస్థాన్ మనకు దాయాది దేశమే. దాని పుట్టుక దగ్గరనుంచి ప్రయాణం అంతా భారత వ్యతిరేకతను ఒక విధానం గా అమలు చేస్తున్నదే. మన దేశంలో అంతర్గత కల్లోలాన్ని సృష్టించడానికి దాని ప్రభుత్వమూ సైన్యమూ గూఢచారి వ్యవస్థలూ నిరంతరం పని చేసిన మాటా నిజమే. బొంబాయి దాడులకు పాల్పడిన టెర్రరిస్టులు ఆ దేశం నుంచే దిగుమతి అయిందీ వాస్తవమే. కానీ, భారతదేశ ప్రస్థానం పాక్ పన్నాగాలనూ, కుట్రలనూ అధిగమించింది. అనేకరంగాలలో మున్ముందుకు సాగుతున్నది. మంచోచెడో ఏదో ఒక అభివృద్ధి విధానంలో పరుగులు తీస్తున్నది. కనీసం తన భూభాగాన్ని అమెరికాకో, నాటోకో యుద్ధక్రీడా మైదానంగా మార్చలేదు. సైనికపాలకుల దశాబ్దాల అవినీతిలో అణచివేతలో, ఇప్పుడు మత తీవ్రవాదంలో, తన భూభాగంపై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికాను అనుమతిస్తున్న బలహీనతలో పాకిస్థాన్ కుంగిపోతున్నది. నిత్యసంక్షోభంలో ఆర్థిక రంగంలో కనీసస్థాయిలోనే ఉండిపోవడం, ప్రజల చైతన్యస్థాయి ఇంకా గతకాలంలోనే మిగిలిపోవడం- పాకిస్థాన్‌ను ఇప్పుడు అనాథగా, బికారిగా మిగిల్చాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారత్ ఇప్పుడు ఒక ప్రాంతీయ శక్తి. భద్రతా సంఘంలో శాశ్వత సభ్యత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆ వాస్తవాన్ని ధ్రువీకరింపజేసుకునే ప్రయత్నాలే. మరి, భారత్ తన ప్రత్యర్థులను పునర్‌నిర్వచించుకోవలసిన తరుణం రాలేదా?

అలీనవాదం పోయింది. విముక్తిఉద్యమాలను సమర్థించడమూ పోయింది. గరీబీ హఠావో పోయింది. హరితవిప్లవం ఆకలి తీర్చలేదు. ప్రాజెక్టులను ప్రజలే వ్యతిరేకిస్తున్నా రు. దేశ సార్వభౌమాధికారాన్ని, సహజవనరులను అన్నిటినీ పళ్లెంలో పెట్టి ప్రపంచప్రభువులకు సమర్పించుకుంటున్నాము. అమెరికాను హుంకరించడంపోయి, జీ హుజూర్ అంటున్నాము. వ్యతిరేకత పర్యవసానాలను తప్పించుకోవడానికి కావలసిన ఓట్లను కొనుక్కుంటున్నాము. పాకిస్థాన్‌మీద స్పందనలను సైతం అమెరికాచేత డబ్బింగ్ చెప్పించుకుంటున్నాము. ఇక దేశానికి ఏముంది గర్వకారణం? జాతీయత, దేశభక్తి ఉప్పొంగడానికి అనువైన విజయాలేవీ? విజయాలు ఇంతగా కరువయ్యాయి కాబట్టే, క్రికెట్ విజ యం కొత్తగా స్వాతంత్య్రం వచ్చినంత ఘనంగా కనిపిస్తుంది. ఆ విజయం పాకిస్థాన్ మీద అయితే, భారతజాతి పుట్టుకే సార్థకం అయినంత సంతృప్తిగా అనిపిస్తుంది. ప్రపంచకప్పును గెలవడం కంటె పాకిస్థాన్‌ను సెమీస్‌లో ఓడించడమే మువ్వన్నెల జెండాను మరింత రెపరెపలాడిస్తుంది. సంతోషం కలుగుతుంది, కలగాలి, నిజమే కానీ, మన స్థాయి మరీ అంత తక్కువా అని? రవి అస్తమించని సరికొత్త సామ్రాజ్యాలపై విజయాల కోసం మన జాతి కలగనేది ఎప్పుడు?

జన జీవితం క్రీడా మైదానం కాదు. ఒకరు గెలిచి ఒకరు ఓడే క్రీడ కాదు జీవితం. ప్రజలకు వాస్తవ విజయాలు కావాలి. శాశ్వత విజయాలూ కావాలి. పాకిస్థాన్ క్రికెట్‌జట్టు గట్టిదే కావచ్చు. సెమీస్‌లోదాన్ని ఓడించడమే ప్రపంచకప్పు సాధనకు కీలకం కావచ్చు. మరో చిట్టి దేశం శ్రీలంకపై విజయం సాధారణ విషయం కాకపోవచ్చు. కానీ, ఆ గెలుపు ల నుంచి లభిస్తున్నది క్రీడానందం మాత్రమే కాదు, మరేదో రాజకీయ పరవశత్వం ఉన్న ది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసి అట్లా పరవశపడవచ్చునా? ఆటల్లో గెలిచి ఆకాశాన్ని దింపామనుకోవచ్చునా? మన జాతీయత అంత అల్పసంతోషియా?

9 comments:

 1. చాల రోజులనుండి నన్నూ ఇదే అలోచోన పీడిస్తుంది . చాల చక్కగా వ్యక్తపరిచారు

  ReplyDelete
 2. నేను ప్రవాసం వచ్చి మూడు నెలలు అయింది. ఏ రోజూ తరగతిగదిలో భారత్, చైనాల జపం చేయనిదే ఏ ఆచార్యుడు తన ప్రసంగాన్ని ముగించటం నేను ఇవ్వాళవరకు గమనించలేదు. పాశ్చాత్య ప్రపంచం భారతదేశాన్ని ఎప్పుడో ఒక శక్తిగా గుర్తించేసింది తదనుగుణంగా తమ తమ వ్యూహాలను మార్చుకుంటున్నది. ఇంతగా ఎదగటానికి మన దగ్గర ఏమున్నది? కేవలం 'శ్రమ'. దాన్ని కూడా మన పాలకుల పుణ్యమా అని ఇతరులకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. కాదంటారా?

  ReplyDelete
 3. Excellent analysis ! On the other side it is not a complete nationalis
  also. It is all for partying, boozing, drinking alcohol. It is about TRP , about advertisement, it is for boosting business , Even USA wouldn't have celebrated this way when their men returned from moon, Where is the nationalism shown when Viswanathan Anand , Saina nehwal won world titles, our nationalism is to party, our nationalism is to show obscenity in TV , in cinema, in film advt, , in vulgar film posters and then cry for attacks , rapes on girls. You make NCC , Scout compulsory , pay properly for homeguards, ban drunk drivers for years, stop selling liquor on national highways ....that is nationalism

  ReplyDelete
 4. అయ్యా, అల్పమైన పాకిస్తాన్ మన ఆత్మగౌరవాన్ని సంఘటితం చేసే పొరుగుబూచిగా మారిందని ఆవేదన వ్యక్తం చేసే మీరు, అంతకంటే సంకుచితమైన, ఉన్మాదభరితమైన, అపోహాపూరితమైన తెలుగు ప్రజల 'ప్రాంతీయ బూచి' విషయంలో మాత్రం ఎంతో నిబద్ధత చూపిస్తారేం!! మరి ఆ దుష్ప్రచారాలు చూసి తమని తాము ప్రాంతీయతలకి అతీతమైన తెలుగువాళ్ళమని భావించుకునేవాళ్ళు ఎంత ఆవేదన చెందుతున్నారో తమ గ్రహింపుకు రాదు. ఉద్యమాల పేరు చెప్పి ఎంత అరాచకం సాగుతున్నదో, ఎంత మోసపూరితమైన ప్రచారం సాగుతున్నదో అయ్యవార్లకి అక్కరలేదు. పైగా పత్రికా పరమైన సమర్థనలు! అదే ఈ దేశానికి పట్టిన పెద్ద దౌర్భాగ్యం. నీతులు చెప్పడానికి వెనకాడనివాళ్ళు మొదట ఆత్మ విమర్శ కూడా చేసుకుంటే బాగుంటుంది.

  ReplyDelete
 5. పొరుగు బూచికి, రాష్త్రంలొని ప్రాంతీయ ఉద్యమానికి యేమి సంబంధమో అర్థం కావదం లేదు. జాతీయోద్యమం అయినా, మద్రాస్ రాష్త్రం లొ జరిగిన ఆంధ్రోద్యమం అయినా, ఒక శత్రువుకు వ్యతిరేకంగా జరిగిన భావోద్వేగాల సమీకరణ. అటువంటిదే తెలంగాణ ఉద్యమం విషయంలొ కూదా జరుగుతూ ఉండవచ్చు. ఇక్కడ వ్యాసంలొ చేసిన వ్యాఖ్యలు, శత్రు చిహ్నంగా ఒక అర్భక దేశాన్ని యెంచుకోవడం గురించి. బ్రిటిష్ వారికి వ్యతిరెకంగా అవతరించిన భారత జాతీయత, ఇప్పుడు పాక్ కు వ్యతిరేకంగా మారిపొవడం విచిత్రం.

  ReplyDelete
 6. # మన జాతీయతాభావనకు కావలసిన శత్రుపాత్రను పాకిస్థాన్ ఒక్కటే భరిస్తున్నట్టు కనిపిస్తోంది.

  బాగా చెప్పారు! "ఈ" జాతీయతాభావనని ఎవరి స్వార్థమ్ కోసం ఇ౦తగా కలుగ జేశారు??

  ReplyDelete
 7. ఓ శత్రువునెంచుకుని అతణ్ణోడించి, జాతీయభావనను పెంపొందించుకోవడం - ఇలాంటి రాతలు నాబోంట్లు రాసే బ్లాగుల్లో కనబడొచ్చేమోగానీ, ఒక పత్రిక సంపాదకీయ వ్యాసాల్లో ప్రవచించాల్సింది కాదనుకుంటాను. అసలు శత్రువొకణ్ణి ఎంచుకుని వాణ్ణి ఓడించి జాతీయ భావనను పెంపొందించుకోవడం గురించి చెప్పడమేంటి -పాజిటివ్ నేషనలిజమ్ గురించి కదా చెప్పాల్సింది! అప్పుడు నెప్ట్యూనియన్ గారు చెప్పినదాంట్లోని అర్థం ఛప్పున బోధపడి ఉండేదేమో!

  అయినా.., ఒకవేళ శత్రువుగా ఎవరో ఒకర్ని ఎంచుకోవాల్సే వస్తే అవినీతి, రాజకీయ అనైతికత వగైరా అంతర్గత శత్రువులను మించిన తీవ్రమైనవి మనకున్నాయా!?

  ReplyDelete
 8. చదువరిగారూ, నేనూ మీ బోంట్లలో ఒకడినే. నేను ప్రచురించింది సంపాదకీయ వ్యాసం కాదండి. సందర్భం శీర్షికతో నేను రాస్తున్న కాలమ్ అది. కాలమ్స్ వేరు, సంపాదకీయాలు వేరు. మీరన్నట్టు పాజిటివ్ నేషనలిజం ఉంటే మంచిదే, కానీ, జాతీయవాదం పుట్టుకను ఒక సారి చరిత్రలో తిరగేసి చూడండి. జాతీయవాదం దగ్గరనుంచి నాజీ వాదం దాకా, ఒక శత్రు ప్రతీక చుట్టూ నిర్మించుకున్న ఐక్యతలే.

  ReplyDelete
 9. quite reasonably written

  but something is missing.

  i am not able to find it out

  may be i am confused by the neptunian comment probably

  bollojubaba

  ReplyDelete