Monday, April 11, 2011

గుండెలు బాదుకుంటే తెలుగు వెలుగుతుందా?

"మౌలిక ఆలోచనలను తెలుగులో చెప్పే ప్రయత్నం ఒకప్పుడు కమ్యూనిస్టులు చేశా రు కానీ, 1950 ల తరువాత ఆ కృషి ముందుకు సాగినట్టు లేదు. కవిత్వ భాష గా, కాల్పనిక సాహిత్య భాషగా ఉన్నంతగా తెలుగు బౌద్ధిక భాష కాలేకపోయింది''- ఈ మాటలు అన్నది పి.వి. నరసింహారావు. 2000 సంవత్సరంలో ఆయనను విశాఖపట్నం లో కలుసుకుని ఒక ముప్పావుగంట మాట్లాడే అవకాశం దొరికింది. అప్పటికి ఆయన మాజీ ప్రధాని. బాబ్రీమసీదు విధ్వంసంలో తన పాత్ర నిమిత్త మాత్రమని చెప్పడానికి ఆయన ఇంగ్లీషులో ఒక రచన చేస్తున్నారు. తన భావాలను తెలుగులో చెప్పడంలో ఉండే కష్టం గురించి ప్రస్తావన వచ్చి, తెలుగు స్థితిగతుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. తెలుగును సకల అవసరాలకు పనికి వచ్చే భాషగా తీర్చిదిద్దడానికి తెలుగు అకాడమీ వంటి సంస్థలు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని ఆయన బాధపడ్డారు. సామాజిక శాస్త్రాలకు, శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన మౌలిక రచనలను చేయగలిగినప్పుడే, భాష పరిపుష్టం అయినట్టు లెక్క అని, అప్పుడే ఆ భాషా సమాజం కూడా అన్ని రంగాలలో పురోగతి సాధిస్తుందని ఆ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

జాతీయస్థాయిలో చక్రం తిప్పి అభినవ చాణక్యుడిగా పేరు పొందిన బహుభాషావేత్త, మేధావి అయిన మాజీ ప్రధానికి తన తల్లిభాష స్థితిగతుల గురించి అంతటి లోతైన అవగాహన ఉన్నందుకు సంతోషించవచ్చు. ఆ స్థాయికి వెళ్లి కూడా తెలుగు కష్టాలను పరిష్కరించడానికి ఏమీ చేయలేదేమని బాధా కలగవచ్చు. ఏమైతేనేం, సమకాలీన అవసరాలకు తగినట్టుగా తెలుగు ఎదగలేకపోయింది. ఆధునికీకరణ సంగతి పక్కనబెడితే, అస లు భాష ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్న భయం వ్యాపించిపోయింది.

తెలుగుభాష గురించి ఆందోళన చెందుతున్న శ్రేణులు అనేకం. ఇంగ్లీషు మీడియం విద్య కారణంగా భాష నాశనమైపోతుందనేవారు, నిత్య వ్యవహారంలో ఇంగ్లీషు వాడకం పెరిగిపోయిందని బాధపడేవారు, పత్రికల్లో, టీవీఛానెళ్లలో భాష సంకరమైపోతున్నదని చింతించేవాళ్లు, తెలుగు పుస్తకాలకు సాహిత్యానికి ఆదరణ తరిగిపోతున్నదని ఆవేదన పడేవారు పెరిగిపోతున్నారు. తెలుగువాళ్లు ఒకరి ఎదుగుదలను ఒకరు ఓర్వరు అని చెప్పుకోవడం- స్వీయ విమర్శగా కనిపించే వెగటు ఛలోక్తి. ఇప్పుడు భాషను ప్రేమించ ని వారిగా తమను తాము విమర్శనాత్మకంగా అభివర్ణించుకోవడం తెలుగువారి తాజా చమత్కారం. ఈ సందోహంలో, తెలుగుని ఆధునిక అవసరాలకు పనికివచ్చేట్టుగా చేయలేకపోతున్నామని మథనపడేవారు కొద్దిమంది మాత్రమే. పదులసంఖ్యలోనో, వందల సంఖ్యలోనో వ్యవహర్తలు మిగిలిన పురాయుగపు ఆదివాసీభాషల మాదిరిగా
తెలుగుకూడా అంతరించిపోతుందని భయపడడం నిర్హేతుకం. ఎనిమిదిన్నర కోట్ల మంది రాష్ట్రంలోనూ, దాదాపు అంతమందీ ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ వ్యవహర్తలున్న తెలుగుభాష ఉనికికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. తెలుగు మాట్లాడేవారిలో నూటికినూరుశాతం అక్షరాస్యతనే ఇంకా సాధించలేదు. ప్రైవేటు పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకోగలిగిన వర్గాలవారు, తరతరాలుగా విద్యావంతులుగా ఉన్నవారు తెలుగు చదువుల నుంచి పూర్తిగా విరమించుకున్నారు తప్ప, కొత్తగా అక్షరాస్య శ్రేణిలో చేరినవారు, దళిత బహుజన వర్గాలవారు అధికులు ఇంకా తెలుగుమాధ్యమంలోనే చదువుకుంటున్నారు. దిగువమధ్యతరగతికి చెందినవారు, అట్టడుగువర్గాల వారు కూడా కొందరు నాసిరకం ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చేరి తామూ నిచ్చెన పై మెట్టుకి ఎగబాకామని సంతృప్తి చెందుతున్నారు కానీ, అక్కడ లభించే చదువులు మాతృభాషను పెద్దగా దెబ్బతీసే శక్తి కలిగినవి కాదు. తెలుగు పత్రికాపాఠకుల సంఖ్య, సాహిత్యపాఠకుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప, తరగడం లేదు. తెలుగు సాహిత్యరంగంలోకి కొత్తగాప్రవేశించిన అస్తిత్వ ఉద్యమశ్రేణులు కవిత్వంలోకి, కాల్పనిక సాహిత్యంలోకి అనేక ప్రాంత, వృత్తి, కుల మాండలికాలను తీసుకువచ్చా రు. భాషను సుసంపన్నం చేశారు. ఇంగ్లీషో, సంస్కృతమో దిగుమతి చేసుకోకుండా తెలుగు మాటలతోనే పదజాలాన్ని వృద్ధి చేశారు. తామే ప్రపంచంగా భావించుకునే కొందరు శిష్టవర్గాల వారు, తమ కుటుంబాలలో జరుగుతున్నదే మొత్తంగా తెలుగుసమాజంలో జరుగుతున్నదనే పొరపాటు భావనలో ఉన్నారు. ఇంగ్లీషు విద్య, ఇంగ్లీషు వ్యవహారానికి ఉన్న సామాజిక విలువ, విద్యా విధానంలో వస్తున్న మార్పులు, ప్రపంచీకరణ- ఇవన్నీ కలిసి తెలుగు ప్రతిపత్తిని తగ్గించి ఉండవచ్చు, ఇంగ్లీషుతో సామీప్యాన్ని గణనీయంగా పెంచి ఉండవచ్చు. కానీ, ఆ మార్పును భూతద్దంలో పెట్టి చూడనక్కరలేదు.

భాషాభివృద్ధి అనేది బ్రహ్మపదార్థం కాదు, రాజులు తీరికవేళల్లో చేసే కళాపోషణా కాదు. భాషాభివృద్ధి ఆ భాషను మాట్లాడే ప్రజల అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశం. భాషా వ్యవహర్తల వ్యక్తిగత సామాజిక జీవితాలకు ఉన్న వ్యాప్తీ, పరిమితులే భాషకూ ఉంటాయి. భాషాసమాజంలోలేని అవసరాలకు, ప్రయత్నాలకు సంబంధంలేని పదజాలం ఆ భాషలో ఉండదు. రోజుకు వందల కొద్దీ కొత్త పదాలను చేర్చుకుని ఇంగ్లీషు భాష విస్తరిస్తుంటే, ఇతర భాషాపదాలు చేరినందువల్ల తెలుగు నాశనమవుతున్నదని బాధపడడంలో వైరుధ్యమున్నప్పటికీ, సహేతుకత కూడా ఉన్నది.
ఇంగ్లీషు భాష వృద్ధి సహజమైనది, ఆ భాషకు ప్రపంచంలో ఉన్న పలుకుబడికి, విస్తృతికి తగిన నిష్పత్తిలోనే దాని వృద్ధి జరుగుతున్నది. తెలుగుభాషలోకి జరుగుతున్న ఆదానాలు అవసరాలు నెరవేర్చుకోవడానికి కృత్రిమంగా జరుగుతున్నవి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే తెలుగుభాషా సమాజం ప్రగతి మార్గంలో నడవాలి. అందులో భాగంగా, భాషను ఆధునికీకరిం చే ప్రయత్నం జరగాలి. ఆధునికీకరణలో భాగంగా భాష ప్రమాణీకరణా జరగాలి. ఆధునికీకరణ, ప్రమాణీకరణ సాధ్యపడాలంటే భాష ప్రజాస్వామ్యీకరణ కూడా జరగాలి.

ఆధునిక అవసరాల కోసం తెలుగులో తగినంత పదజాలం లేదంటున్నవారు, అసలు తెలుగులో అందుబాటులో ఉన్న పదజాలాన్నంతా వాడుకలోకి తేగలిగామా అని ప్రశ్నించుకోవాలి. రెండున్నర జిల్లాల శిష్టభాషను అందరి ప్రమాణభాషగా ప్రతిపాదించిన గురజాడ, గిడుగు-ఆ జిల్లాలకు చెందినవారు కాదు. అన్ని ప్రాంతాల, వర్గాల మాండలికాలను కలుపుకుని సుసంపన్న మూ సమగ్రమూ అయినప్పుడే సర్వసంపూర్ణమైన ప్రమాణభాష అవతరిస్తుందని ఆ సంస్కర్తలు స్పష్టంగానే చెప్పారు. కానీ, భాష కొత్త, పాత అవసరాలకోసం ఇంకా శిష్ట ప్రమాణభాష పరిధిలోనే అన్వేషణలు సాగిస్తున్నాము. రాష్ట్ర సాహిత్య అకాడమీ మాండలిక వృత్తిపదకోశాల పేరిట ఒక ప్రతిష్ఠాత్మకమైన బృహత్ కార్యక్రమాన్ని యాభై ఏండ్ల కిందట చేపట్టింది. వ్యవసాయం, చేనేత, కుంభకార తదితర వృత్తులకు సంబంధించిన పదజాలాన్ని ప్రాంతాలవారీగా క్రోడీకరిం చి నిఘంటువులను ప్రచురించింది. అభినవ ఆంధ్ర భోజుడన్న ఖ్యాతిపొందాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడే అకాడమీలను రద్దుచేశాడు, నిఘంటు ప్రాజెక్టులు మూతపడ్డాయి. తెలుగులోని మొత్తం పదజాలం నిఘంటుస్థం చేసే కృషి ఏదీ జరగడం లేదు. భాషతో వ్యవహరించేవారికి కావలసిన కీలక సాధనమే తెలుగువారికి అందుబాటులో లేదు. ఇక ప్రమాణీకరణ ఎట్లా సాధ్యం? శాస్త్రగ్రంథకారులకు, పత్రికా రచయితల కు అవసరమైన పరిభాషానిర్మాణం జరగాలంటే, ఆ పనిచేసే నిపుణులకు తెలుగుభాష లో అందుబాటులో ఉన్న పదజాలమేమిటో తెలియాలి. తెలియకపోవడం వల్లనే, తెలుగుపదాలు లభించే సందర్భాలలో కూడా కృత్రిమ సంస్కృత పదబంధాల నిర్మాణమో, యథాతథంగా ఇంగ్లీషు మాటల వాడకమో జరుగుతున్నది.

ఇంగ్లీషు- తెలుగు భాషాప్రతిపత్తుల మధ్య అంతరం ఉన్నట్టే, తెలుగులోని భిన్న మాండలికాల మధ్య కూడా అంతరం ఉన్నది. భాషావ్యవహర్తల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంతరాలే మాండలికాల అంతరంగా వ్యక్తం అవుతుంది. తెలుగుభాషను రక్షించుకోవాలని ఉద్యమించేవారిని, ప్రాంతీయ అస్తిత్వవాదులు ప్రశ్నిస్తున్నది ఈ అంత రం గురించే. భాషలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఒక విలువగా గుర్తిస్తే తప్ప, తెలుగుభాష కోసం జరిగే ఉద్యమానికి అందరి ఆమోదం, భాగస్వామ్యం లభించదు. ఏమి ప్రయోజనం సిద్ధిస్తుందో తెలియని ప్రాచీనభాష హోదా కోసం ఉద్యమించడమో, అర్జీలు బోర్డులు తెలుగులో ఉండాలని కోరడమో కాకుండా-భాష దీర్ఘకాలిక వికాసానికి చేయవలసిందేమిటో భాషావాదులు గుర్తించాలి. తెలుగుభాషకు సంబంధించి స్వయంప్రతిపత్తి కలిగిన ఒక అత్యున్నత వ్యవస్థను ప్రభుత్వం ఏర్పరచాలి. అందులో భాషావ్యవహారాలను పరిశీలించడానికి, కొత్త పరిభాషను సూచించడానికి, మాండలికాలతో సహా తెలుగు పదజాలాన్ని నిఘంటుస్థం చేయడానికి, ఇతర భాషాపదాల ఆదానాన్ని సమీక్షించడానికి ఒక శాశ్వత పీఠం ఉండాలి. నిర్ణీత కాలవ్యవధిలో ఒక సమగ్ర తెలుగు నిఘంటువును నిర్మించాలి, ఆ పైన ప్రతి ఏడాదికో రెండేళ్లకో దాన్ని మార్పుచేర్పులతో సవరించి పునర్ముద్రిస్తూ ఉండాలి. తెలుగు పాఠ్యపుస్తకాల రూపకల్పనచేసే సంస్థలు, పత్రికారచనలో శిక్షణ ఇచ్చే సంస్థలు, విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాలు, అధికార భాష అమ లు యంత్రాంగం, భాషకు సంబంధించిన సమస్త వ్యవస్థలు ఈ పీఠంతో అనుసంధాన మై ఉండాలి.

భాషాశాస్త్రవేత్తలు, సాహిత్యవేత్తలు, వివిధ శాస్త్రరంగాల నిపుణులు, మాండలిక రచయితలు, సామాజిక వర్గాల ప్రతినిధులు-అందరూ ఈ పీఠంలో సభ్యులుగా ఉండాలి. భాష ప్రజాస్వామ్యీకరణను, ఆధునికీకరణను ఏకకాలంలో నిర్వహిస్తూ నిఘంటు నిర్మాణం చేయగలిగితే- తెలుగుభాష ముందడుగుకు ఉన్న ప్రధాన అవరోధా లు అంతరించిపోతాయి.

No comments:

Post a Comment