Monday, April 18, 2011

అన్నా హజారే, బినాయక్‌సేన్, మన పౌరసమాజమూ

ఈవ్యవస్థ విచిత్రమైనది. అన్నిరకాలుగా విఫలమైందనీ, చికిత్స సాధ్యం కానంతగా శిథిలమైందనీ, ప్రజల్లో విశ్వసనీయత అట్టడుగుస్థాయికి చేరుకున్నదనీ అనుకునే సమయంలో ఏదో ఒక పార్శ్వం నుంచి ఒక ఆశ చిగురిస్తుంది. ఫరవాలేదు, కొనప్రాణం మిగిలేఉన్నది, దానికి కొంత జీవశక్తిని జోడిస్తే ధర్మం తిరిగి నాలుగుపాదా లా చరిస్తుంది-అనిపిస్తుంది. కలవరపడి, కుంగిపోయి, న్యూనత చెందీ, నిస్పృహలోకి వెడుతున్న సమయంలో, అంతాబాగానే ఉన్నది, ప్రయాణం ముందుకే సాగుతున్న ది- అన్న నమ్మకపు తునక మెరిసిపోతూ కనిపిస్తుంది. ప్రస్తుతానికి గండం గడిచింది లెమ్మని, వ్యవస్థ తిరిగి తన పాతదారుల్లోనే పరుగులు తీస్తుంది, మరో సంక్షోభపు మజిలీ దాకా!

అవినీతితో లుకలుకలాడుతున్న వ్యవస్థతో సమాజంలోని ప్రాబల్య శ్రేణులన్నీ ఏదో ఒక రకంగా సమాధానపడిపోయి లేదా, ఆ వ్యవస్థలోనే ఏదో రకంగా ప్రయోజనాల ను వెదుక్కుని నిమ్మకు నీరెత్తిన వేళ, అన్నా హజారే ఉద్యమం దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. నిరాహారదీక్ష ప్రారంభించిన వెంటనే ఊహించని రీతిలో మూలమూలలనుంచి హజారేకు మద్దతు రావడం మొదలయింది. అవినీతి సమస్యపైనే, 2జిస్కామ్ పై సంయుక్త పార్లమెంటరీ సంఘం నియమించాలన్న డిమాండ్ మీదనే పార్లమెంట్ సమావేశాలు ఒక విడత పూర్తిగా స్తంభించినప్పుడు, ప్రతిపక్షాలకు అనుకూలంగా గొంతువిప్పని ప్రజాస్వామ్యశక్తులు ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా సమీకృతమయ్యాయి? అధికారపక్షం, ప్రతిపక్షం అని లేకుండా రాజకీయపార్టీలన్నీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడమే కారణమని చెప్పుకోవాలి.
అన్నాహజారే మీద మాత్రం విశ్వాసం ఎందుకు? దశాబ్దాలుగా రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని శుభ్రంగా, సమృద్ధిగా అభివృద్ధి చేసిన ఒక క్షేత్రస్థాయి సంస్కర్తగా కీర్తిప్రతిష్ఠలను కూడగట్టుకున్న అన్నా, ఇప్పుడు ఆ ఖ్యాతిని
ఒక జాతీయ సమస్య పరిష్కారానికి ఆయుధంగా ఉపయోగించారు. దీన్నే మరో రకంగా చెప్పాలంటే, అన్ని అంగాలూ అప్రదిష్ఠ పాలయినప్పుడు, వ్యవస్థ ఆఖరి ప్రాణరక్షక ఔషధంగా ఒక రాజకీయేతర వ్యక్తి ప్రమేయాన్ని తానే అనుమతించింది.
అన్నాహజారే, స్వామి అగ్నివేశ్, మేధాపాట్కర్- వీరంతా నిజమైన దేశాభివృద్ధికి కీలకమయిన రంగాలలో స్వచ్ఛంద కార్యాచరణలో ఉన్నవారు. వారు చేపట్టిన సమస్య లు అభివృద్ధి పంథాకు సంబంధించినవో, రాజకీయ వ్యవస్థ పట్టించుకోని అభాగ్యుల మనుగడ సమస్యలో అయి ఉండవచ్చు, సారాంశంలో అవి కూడా రాజకీయమైనవే. కాకపోతే, ఈ నాయకులు రాజకీయవృత్తిలో, స్వీయ అభివృద్ధి పథంలో ఉన్నవారు కాదు. అవినీతి మన రాజకీయవ్యవస్థలో, పాలనారంగంలో జీర్ణించుకుపోయిందని, దాన్ని ఒంట బట్టించుకునేవారే తప్ప, పట్టించుకునేవారు లేరని అనుకుంటున్న సమయాన, ఒక ఘనచరిత్ర ఉన్న నిస్వార్థజీవి రంగం మీదకు వచ్చేసరికి, మధ్యతరగతిజీవులకు, విద్యార్థి యువజనులకు ప్రజాస్వామ్యం మీద కొత్త ఆశలు చిగురించాయి. తాము గొంతు కలపడానికి ఒక నినాదం దొరికిందని సంబరపడ్డారు. పనిలోపనిగా- అవినీతి వ్యవస్థ లబ్ధిదారులు, ఆరితేరిన అవినీతిపరులు సైతం గుంపులో కలవడానికి ఉత్సాహపడ్డారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా తప్ప తోటి సామాజికులతో సంభాషించలేని ఏకాకి నవతరం కీబోర్డు మీదనే ఉద్యమాలు నడిపింది. బ్లాగులన్నీ కిక్కిరిసిపోయాయి. టునీషియా, ఈజిప్టు మనదేశానికి కూడా వచ్చేశాయనీ, మనదీ వెన్నెముక ఉన్న దేశమేనని ఆశావాదులు సంతృప్తిపడ్డారు.

హజారే ఉద్యమం సాధించింది తొలివిజయమేనని, బిల్లును రూపకల్పన చేసి, ఆమోదింపజేసి, అమలు చేయించడమే అసలు విజయమని అందరికీ తెలుసు. డ్రాఫ్టింగ్ కమిటీలోనే ఆరితేరిన లిటిగెంట్లు ఉన్నారని కూడా తెలుసు. చిన్న విజయం కోసం మొహం వాచిఉన్న భారతీయ నాగరికులకు హజారే విజయమైనా ఒకటే, ప్రపంచకప్ విజయమైనా ఒకటే.  ప్రజలకు బాధ్యత వహించే పరిపాలన, పారదర్శకత, స్వచ్ఛత- రాజకీయ లక్ష్యాలని, రాజకీయాల ద్వారానే వాటిని సాధించుకోవాలని మరచిపోయి, రాజకీయేతర ఉద్యమాలను ఆకాశానికెత్తే చాపల్యమూ ఈ సందర్భంగా బయటపడిం ది. రాజకీయాలు తెలియని అజ్ఞానమో, రాజకీయేతర ఆచరణ పేరిట దొడ్డిదారిన ఏవైనా నిర్దిష్ట రాజకీయాలకు సహాయపడడమో తెలియదు కానీ, అన్నా హజారే నరేంద్రమోడీని ప్రశంసించడం పెద్ద వివాదం అయింది. అవినీతి రాహిత్యం కానీ, సమర్థపరిపాలన కానీ, అభివృద్ధికానీ, మతతత్వ రాజకీయాలు కానీ- వేరువేరుగా చూడవలసిన విషయాలు కావని, వాటన్నిటి మధ్య ఉన్న అంతస్సంబంధాన్ని చూడలేకపోతే, చిట్కా వైద్యమే చేయగలం తప్ప, మౌలికరుగ్మతకు చికిత్స చేయలేమని హజారే వంటి వారికి తెలియడానికి సమయం పట్టవచ్చు. వర్తమాన స్థితిగతులకు విరక్తో వైరాగ్యమో కలవరమో కలిగినప్పుడు హజారే ఉద్యమం మానసిక అశాంతికి ఉపశమనాన్ని ఇవ్వగలిగింది సరే కానీ, పరివర్తన తేవాలంటే మాత్రం ఈ ఉద్యమం దీర్ఘకాలిక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న ఆచరణ బృందాలు, స్వచ్ఛంద కార్యకర్తలు, సామాజికోద్యమ నేతలు, అభివృద్ధి విధ్వంసాన్ని ప్రశ్నిస్తున్న బృందాలు, సంఘాలు-సంఘటితం అయితే తప్ప, ఆసాంతం కుళ్లిపోయి న రాజకీయవ్యవస్థకు ఒక ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. అన్నా హజారే సాధించిన విజ యం ఏదైనా ఉంది అంటే, అది అట్లా సంఘటితం కావడం సాధ్యమేనన్న విశ్వాసాన్ని కలిగించడం. దేశవ్యాప్తమైన పౌరసమాజాన్ని, జాతీయస్థాయిలో స్పందన కనబరచిన పౌరసమాజాన్ని కొన్ని దశాబ్దాల తరువాత హజారే ఉద్యమం సందర్భంగా చూడగలిగాము. అయి తే, కొవ్వొత్తుల ప్రదర్శనతో, రెండువేళ్లతో విజయ సంకేతాన్ని ప్రదర్శిస్తూ సరదాగా జరిగే ఊరేగింపులతో అవినీతిని ఎదుర్కొనలేమని, హాబీ ఉద్యమాల స్థానంలో సీరియస్ కార్యాచర ణ అవసరమని కూడా హజారే ఉద్యమం సూచిస్తున్నది. హజారే, మేధాపాట్కర్, అగ్నివేశ్‌లతో పాటు, బినాయక్‌సేన్, షర్మిల మొదలైన వ్యవస్థ బాధితులందరూ ఒక తాటిపైకి రాగలిగితే, ఒక సమీకృత ఉద్యమాన్ని నిర్వహించగలిగితే-అది దేశంలో మౌలికమార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది.


శుక్రవారం నాడు సుప్రీంకోర్టు బినాయక్‌సేన్‌కు బెయిల్ మంజూరు చేసినప్పుడు, కేంద్రహోంమంత్రి చిదంబరానికి కూడా వ్యవస్థ మీద పునర్విశ్వాసం కలిగింది. చూశా రా, ప్రజాస్వామ్యంలోని చమత్కారం, ఎక్కడో ఒక చోట న్యాయం జరుగుతుం ది- అని ఆయన వ్యవస్థ భుజం తట్టారు. ఆజాద్ ఎన్‌కౌంటర్‌మీద సీబీఐ విచారణ జరిపేదిశగా సుప్రీంకోర్టులో న్యాయప్రక్రియ సాగడాన్ని కూడా చిదంబరం అంతే ప్రజాస్వామిక స్ఫూర్తితో అర్థం చేసుకుని ఉంటారని ఆశిద్దాం. చిదంబరం సంగతి పక్కనబెడితే, బినాయక్‌సేన్ నిర్బంధానికి సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పకపోయి ఉంటే, ఈ దేశ ప్రజాస్వామ్యం మీద తీవ్రమైన నిరాశే కలిగేది. దేశంలోని హక్కుల కార్యకర్తలకు, ఆలోచనాపరులకు, సాధారణ ప్రజాస్వామిక వాదులకే కాదు- డాక్టర్ సేన్ విడుదల కోరుతూ ప్రపంచవ్యాప్తంగా స్పందించిన నోబెల్‌గ్రహీతలకు, మేధావులకు, శాస్త్రజ్ఞులకు సైతం భారత వ్యవస్థ మీద నిస్సహాయమైన తృణీకారభావనే కలిగి ఉండేది. అత్యున్నత న్యాయస్థానం దేశప్రతిష్ఠ దిగజారిపోకుండా ఆదుకున్నది. కానీ, మావోయి స్టు సాహిత్యం ఉన్నంత మాత్రాన మావోయిస్టు కాదనీ, సానుభూతిపరుడని అనుకున్నప్పటికీ అది దేశద్రోహం కాదనీ తెలుసుకోవడానికి ఈ దేశంలో సుప్రీంకోర్టు దాకా వ్యాజ్యం వెళ్లవలసిరావడం ఒక విషాదం. ఆదివాసీ ప్రాంతాలలో నివసిస్తూ, వైద్యవృత్తిని వారి సేవకు వినియోగిస్తున్న ఒక అహింసావాదితో వ్యవస్థ ఎంత క్రూరం గా వ్యవహరించింది? అంచెలంచెల కోర్టుల్లో ఆయన అమాయకత్వం ఒక అరణ్యరోదనమైపోయి, ప్రజాస్వామికవాదులంతా న్యాయపు చివరి గడప సుప్రీంకోర్టువైపు ఆశ గా చూడవలసి రావడం ఎంతటి దయనీయం? ప్రపంచమంతా నోరున్న వర్గాలన్నీ గగ్గోలుపెట్టిన బినాయక్‌సేన్ పరిస్థితే ఇట్లా ఉంటే, జైళ్లలో మగ్గుతున్న ఛత్తీస్‌గఢ్, ఒడిసా ఖైదీలకూ, ఇళ్లూ ఊళ్లూ దగ్ధమైపోయి అనాథలుగా మిగిలిపోయిన ఆదివాసీలకు ఏది గతి? అన్నాహజారే ఉద్యమించగానే ఉవ్వెత్తున పొంగిన ధర్మావేశం- ఆదివాసీల విషయంలో ఎందుకు మౌనంగా ఉండిపోతుంది? దహించిపోయిన వారి ఆవాసాలకు, మనుగడకు మద్దతుగా ఒక్క కొవ్వొత్తి కూడా వెలగదేమి?

ప్రజల్లో ఆశ చావకుండా ఏదో ఒక చిరువిజయం దొరుకుతూనే ఉన్నది. ఒంటినిండా వెంటిలేటర్లతో వ్యవస్థ బతికేస్తూనే ఉన్నది. ఒక్క లేపనానికి మైమరచే జనం, మరో వేయి గాయాలకు సిద్ధపడుతూనే ఉన్నది.

3 comments:

 1. Excellent post. You have raised some of the basic questions for the civil society to think about.

  Having people with thoughts like these is a sign of hope for this country.

  ReplyDelete
 2. అవినీతి రాహిత్యం కానీ, సమర్థపరిపాలన కానీ, అభివృద్ధికానీ, మతతత్వ రాజకీయాలు కానీ- వేరువేరుగా చూడవలసిన విషయాలు కావని, వాటన్నిటి మధ్య ఉన్న అంతస్సంబంధాన్ని చూడలేకపోతే, చిట్కా వైద్యమే చేయగలం తప్ప, మౌలికరుగ్మతకు చికిత్స చేయలేమని హజారే వంటి వారికి తెలియడానికి సమయం పట్టవచ్చు.వర్తమాన స్థితిగతులకు విరక్తో వైరాగ్యమో కలవరమో కలిగినప్పుడు హజారే ఉద్యమం మానసిక అశాంతికి ఉపశమనాన్ని ఇవ్వగలిగింది సరే కానీ, పరివర్తన తేవాలంటే మాత్రం ఈ ఉద్యమం దీర్ఘకాలిక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది.


  hmm..

  ReplyDelete
 3. Excellent description of the situation. Very much provoking thoughts. Keep it up.
  gksraja.blogspot.com

  ReplyDelete