Tuesday, May 3, 2011

నల్లవారి నెత్తురూ, భారతీయుల చెమటా.. మారిషస్

పూర్వం రాజాధిరాజులు దండయాత్రలకు వెళ్లినప్పుడూ దౌత్యయాత్రలకు వెళ్లినప్పుడూ వెంట పరివారంలో చరిత్రలేఖకులు (క్రానికలర్స్) కూడా ఉండేవారు. మొన్నకు మొన్న అమెరికా కూడా ఇరాక్ దురాక్రమణలో ఒక్కో పటాలంలో ఒక్కో పాత్రికేయుడిని కలిపి పంపించింది. ఎవరివెంట వెడతామో వారికి అప్రియమైన రీతిలో సత్యాలు రాయగలమా అన్నది కత్తిగొప్పదా కలం గొప్పదా అన్న ప్రశ్నంత జటిలమైనది. కానీ, కొన్ని అనుభవాలను సందర్భాలను ప్రత్యక్షంగా సమీపంగా పరిశీలించాలంటే మాత్రం రాజమార్గంలో వెళ్లవలసిందే. అత్యంత ముఖ్యమైన వ్యక్తితో కలసి విదేశపర్యటనకు వెళ్లడంలో ఆకర్షణ లేకపోతే సరే, కానీ ఆసక్తి కూడా లేకపోతే పాత్రికేయ ప్రవృత్తికి అన్యాయం జరిగిపోతుంది. చూసినదీ విన్నదీ ప్రపంచానికి తెలియజెప్పాలనే కోరికతో పాటు, నాలుగుదేశాలు తిరిగాలనే కుతూహలం ఉన్న పాత్రికేయులకు వివిఐపి పర్యటన ఒక సదవకాశం కూడా. ఆ అవకాశం జాతీయ మీడియాగా చెప్పే ఇంగ్లీషు, హిందీ పత్రికలకు, టీవీలకు దొరికనంతగా భాషాపత్రికలకు దొరకదు.

విదేశాంగశాఖకు చెందిన కొందరు మధ్యస్థాయి అధికారులకైతే, తెలుగుపత్రికలు ఏ నగరం నుంచి వెలువడతాయో కూడా తెలియదని తెలిసి ఆశ్చర్యం కలిగినప్పుడు, ఇక జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆ పత్రికలను సైతం భాగస్వాములను చేయడంలేదని బాధపడే ఆస్కారం ఎక్కడిది? రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌తో కలిసి మారిషస్‌లో ఐదురోజుల పాటు జరిపిన పర్యటన, దౌత్యవ్యవహారాలు ఎట్లా ఉంటాయో పరిచయం చేయడంతో పాటు, ఆ దేశం గురించి లీలామాత్రంగా ఒక అవగాహనను కూడా కలిగించింది.

సాధారణంగా ప్రధానమంత్రి పర్యటనలు తక్కువరోజుల్లో ఎక్కువ కార్యక్రమాలతో విరామం లేకుండా జరుగుతాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనలు సుదీర్ఘంగాను, కాసింత తీరుబడిగా సాగుతాయి. ప్రతిభాపాటిల్ పర్యటన మాత్రం ఐదురోజులూ వరుసకార్యక్రమాలతో ఒత్తిడిగానే సాగింది. నిర్ణయించిన చోట, నిర్ణయించిన కార్యక్రమాలలో పాల్గొనడం తప్ప, మారిషస్ ను పరిచయం చేసుకోవడానికి కావలసిన విరామం గానీ, వెసులుబాటు గానీ పాత్రికేయులకు దొరకలేదు.

చిన్న ద్వీపదేశం. చుట్టూ హిందూమహాసముద్రం. అయినా ఆఫ్రికా ఖండం. హైదరాబాద్ మహానగర జనాభాలో పదోవంతు అంత తక్కువ జనాభా. సన్నటి రోడ్లు. ఎక్కడ ఏ మాత్రం ఖాళీజాగా దొరికినా చరిత్రను గుర్తుచేసే చెరకుతోటలు. ఆకాశంవైపు దూసుకుపోయే భవనాలు కాక, రెండుమూడు అంతస్థులతో
విశాలమైన ఆవరణలతో కనిపించే కార్యాలయాలు. రాజధాని పోర్ట్ లూయీస్‌లో ఒకటిరెండు కూడళ్లలో తప్ప బహుళ అంతస్థుల భవనాలే లేవు. ఆ పట్టణంలోని రోడ్ల మీద ఘనత వహించిన భారత రాష్ట్రపతి వాహనాల బిడారు సాగుతుంటే విచిత్రంగా అనిపించింది. అసలు భయానకమైన భద్రతావాతావరణమే లేని దేశం. టౌన్‌హాలంత లేని మారిషన్ జాతీయ అసెంబ్లీ భవనంలోకి ప్రవేశించడానికి నఖశిఖస్కానర్లు లేవు.

1968లో స్వాతంత్య్రం పొందిన మారిషస్‌కు తొలిప్రధాని, ఆ దేశ జాతిపిత సర్ శివసాగర్ రామ్‌గులామ్. దేశంలో అడుగుపెట్టిన తరువాత ప్రతిభాపాటిల్ మొదట పాల్గొన్న అధికారిక కార్యక్రమం రామ్‌గూలామ్‌కి శ్రద్ధాంజలి ఘటించడం. ఆ ఆనవాయితీ తప్పదు. భారత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి నివాళి అర్పించడం, ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం కూడా రాష్ట్రపతి చేశారు. శివసాగర్ రామ్‌గులామ్ గాంధీ నుంచి ప్రేరణ పొందినవారు కావడం వల్ల, గాంధీ మారిషస్‌ను సందర్శించి రెండువారాల పాటు అక్కడ గడిపినందున మహాత్ముడు ఆ దేశానికి చిరస్మరణీయుడే. ఇందిరాగాంధీ కాలం నుంచి మారిషస్‌తో భారతదేశపు మైత్రి పరంపరగా సాగుతూనే ఉన్నది. భారతదేశపు అడుగుజాడలలో నడుస్తున్న మారిషస్‌లో కూడా వంశపారంపర్యపాలన కొనసాగుతున్నది. శివసాగర్ కుమారుడు నవీనచంద్ర రామ్‌గులామ్ ఇప్పుడు ప్రధానమంత్రి. శివసాగర్ 1983లో పదవీవిరమణ చేసిన తరువాత, ప్రధాని అయిన అనిరూద్ జగన్నాథ్ ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షులు. అనిరూద్ తనయుడు ప్రవింద్ జగన్నాథ్ ఉపప్రధానిగా ఉన్నారు.

మారిషస్‌ను మినీభారత్ అని ఇందిర ప్రశంసించడం సహేతుకమే! భారతదేశానికి చెందిన సుదూరద్వీపమే మారిషస్ అని భావించడానికి మరో కారణం- ఆ దేశ జనాభాలో సుమారు 70 శాతం మంది భారత సంతతివారు కావడమే. వారిలో అత్యధికులు బీహార్ నుంచి వలసవెళ్లినవారు. తక్కినవారిలో తమిళులు, తెలుగువారు ఉన్నారు. అక్కడి రూపాయి మీద తమిళ అక్షరాలు కనిపిస్తాయి. తెలుగు ఉగాది అక్కడ జాతీయపర్వదినం. ఆఫ్రికన్ సంతతివారు, చైనీయులు, కొందరు శ్వేతజాతీయులు కూడా మారిషస్ జనాభాలో ఉన్నారు. మెజారిటీ భారతసంతతివారు కావడం అక్కడి రాజకీయాలలో స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తుంది. భోజ్‌పురీ మాట్లాడే బిహారీలే, అందులోనూ శాకాహారులైన హిందువులే మారిషస్ రాజకీయాలలో పైచేయిగా ఉన్నారు. మొదట డచ్‌వారి చేతిలోను, ఆ తరువాత బానిసవ్యాపారం చేసిన ఫ్రెంచివారిచేతిలోను ఉన్న మారిషస్ 19 శతాబ్దారంభంలో బ్రిటన్ కైవసమైంది. బానిసత్వాన్ని నిషేధించిన బ్రిటిష్‌వారు చెరుకుపండించడానికి కూలీలు అవసరమై భారతీయులను, ఇతరులను 'ఇండెంచర్ లేబర్'గా మారిషస్‌కు తీసుకువచ్చారు. 1834లో చెరకు కూలీల మొదటి నౌక 'అట్లాస్' మారిషస్ తీరం చేరిన చోటును ' అప్రవాసీ ఘాట్' అని పిలుస్తారు. ఆ స్థలాన్ని యునెస్కో హెరిటేజ్ స్థలంగా గుర్తించింది. ఒక రాతిమీద పాదముద్ర ఉన్న శిల్పం ఆ స్థలంలో ప్రతీకాత్మకంగా నెలకొల్పారు. తీరం చేరిన కూలీలకు తొలిబసగా ఉన్న గదులను ఇప్పటికీ పరిరక్షించారు. ఆ స్థలంలో తొలిప్రవాసీల స్మ­ృతికి శ్రద్ధాంజలి ప్రకటించిన ప్రతిభాపాటిల్, ఆ మరునాడు బానిసత్వానికి చారిత్రక చిహ్నంగా ఉన్న 'లే మోర్నె' ను కూడా సందర్శించారు. అది పర్యటనలో సమతూకం కోసం చేసిన సందర్శన అని ఒక దౌత్యప్రతినిధి వ్యాఖ్యానించారు. అప్రవాసీఘాట్ భారతీయులకు సంబంధించింది కాగా, లే మోర్నె ఆఫ్రికన్ నల్లజాతి వారికి సంబంధించింది. ఆ రెండు స్థలాలూ వలసవాద కాలంలోని ఆసియా, ఆఫ్రికా ప్రజల జీవితాలకు సంకేతాలే.

ప్రపంచపటం మీద అతి ప్రయత్నం మీద మాత్రమే కనిపించే ఒక ద్వీపం మారిషస్. స్వర్గలోకాన్నీ, మారిషస్‌నూ పటాలలో చూడలేరు- అని ఆ దేశ అభిమానులు సగర్వంగా వ్యాఖ్యానిస్తారు. నిజమే. ఇప్పుడు బానిసత్వం లేదు. కట్టుకూలీలూ లేరు. నూటికి ఎనభైఏడు మందికి సొంత ఇళ్లు ఉన్న ఆ దేశాన్ని చూసి అమెరికన్లు కూడా అసూయపడవలసిందే. విద్య, వైద్యం రెండూ ఉచితంగా అందించే ఆ ప్రభుత్వాన్ని చూసి మహా సంక్షేమరాజ్యాలు తలదించుకోవలసిందే. కానీ, కాలం మారిపోతున్నది.

ప్రజాస్వామ్యం సంక్షేమాన్ని వదిలి ఆర్థిక సంస్కరణలను వరిస్తున్న ధోరణి అక్కడ కూడా వ్యాపించింది. బహుళజాతి అక్కడ కూడా పాగా వేసింది. పురోగతి కోసం ఇస్తున్న ప్రోత్సాహకాలు కంపెనీలను మాఫియాలుగా మారుస్తున్నాయి. పన్నుల విధానంలో అక్కడ ఉన్న రాయితీలు అనేక దేశాల పెట్టుబడులకు ఆ దేశాన్ని మజిలీగా మార్చాయి. భారతదేశంలోని రాజకీయనాయకులకు, అక్రమవ్యాపారులకు మారిషస్ ఒక నల్లధనపు కూడలిగా మారింది. వైఎస్‌జగన్ పెట్టుబడులు కావచ్చు, రాజా జేబులోకి చేరిన 2 జి స్పెక్ట్రమ్ అవినీతి ధనం కావచ్చు మారిషస్ మార్గంలోనే ప్రవహించాయి.

కానీ, రాష్ట్రపతిని అటువంటి విషయాలపై ప్రశ్నలు వేయడం న్యాయం కాదు. రాష్ట్రపతి, ప్రధాని- విదేశాంగ విధానంలో దిశానిర్దేశం మాత్రమే చేస్తారు, వివరాల్లోకి వెళ్లి వారిని ఇబ్బంది పెట్టకూడదు- అన్నది అధికారుల అవగాహన. పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతేనేమి- ద్వంద్వ పన్నులు లేని విధానాన్ని- అవినీతి రాహిత్యం ఆదర్శానికి అనుగుణంగా కట్టుదిట్టం చేయనున్నారని తిరుగు ప్రయాణంలో రాష్ట్రపతి పాత్రికేయులకు చెప్పారు.

సైన్యమే అక్కరలేదనుకున్న ఆ దేశం భద్రతకు తాము పూచీ పడతామని, ఆఫ్రికా తీరంలో సముద్రపు దొంగల బెడద లేకుండా ఉభయదేశాలూ కలసి గస్తీ చేస్తాయని- రాష్ట్రపతి చెప్పడం ఏమంత ఆహ్లాదకరంగా అనిపించలేదు. డీగోగార్షియాలో సైనికస్థావరం ఉన్నప్పుడు భారతదేశం ఎంతగా గగ్గోలు పెట్టిందో ఇప్పుడు గుర్తుచేసుకోవడం ఎవరికీ ఇష్టంలేదు కానీ, మారిషస్ మనవారి దేశం కదా అని ఆఫ్రికా తీరందాకా హిందూమహాసముద్రంలో గస్తీ తిరగాలని ప్రయత్నించడంలో కొంత పెద్దన్నతనం ఉందనిపించింది. మా పాలకుల భారతభక్తిని ఆసరాగా చేసుకుని ఎకరాలకు ఎకరాలు భారతీయవ్యాపారులు చవగ్గా కొట్టేస్తున్నారని, పర్యావరణానికి విఘాతం కల్పించే పరిశ్రమలను స్థాపించే ప్రయత్నం చేస్తున్నారని మారిషన్ ప్రతిపక్షనేతలు విమర్శిస్తున్నారు. మారిషస్‌లో ఆర్థికంగా పాగా వేయడానికి చైనా కూడా చేస్తున్న తీవ్రమైన ప్రయత్నాలను ఎదుర్కొనడానికి భారతసంతతి నాయకత్వాన్ని ఉపయోగించుకోవడంలో తప్పులేదు కానీ, స్నేహంలో భౌగోళిక రాజకీయ ఉద్దేశాలు, దురాశాపూరిత వాణిజ్యస్వార్థాలు ఉండడం దీర్ఘకాలికంగా హానిచేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment