Wednesday, May 25, 2011

సంత్‌లెవరు? హంతకులెవరు?

ఇందిరాగాంధీ ప్రభుత్వం 1980 దశకం మొదట్లో సంజయ్‌గాంధీ స్మ­ృతిలో తపాలా బిళ్ల విడుదల చేసింది. పింగళి దశరథరామ్ సంపాదకత్వంలో విజయవాడ నుంచి వస్తున్న వివాదాస్పదమైన 'ఎన్‌కౌంటర్' మాసపత్రిక ఆ స్టాంపు విడుదల మీద తీవ్రమైన అభ్యంతరం చెబుతూ ఒక దిగ్భ్రాంతి కలిగించే పనిచేసింది. రేప్, హత్య కేసుల్లో ఉరిశిక్ష పడిన బిల్లా రంగాల ఫోటోలతో స్టాంపులను పత్రిక వెనుక అట్టమీద ప్రచురించింది. సంజయ్ పోస్టల్ స్టాంపుకు అర్హుడైతే ఈ ఇద్దరు నేరస్థులు మాత్రం ఎందుకు అర్హులు కారు? అని ప్రశ్నించింది. ఆ పత్రికకు ఎల్లోజర్నల్ అన్న పేరు ఉండింది. ఆ పత్రిక వ్యవహారశైలితో ఏకీభవించడం కష్టమే కానీ, సంజయ్ పేరుతో స్టాంపు విడుదలను ప్రశ్నించలేని ప్రధానస్రవంతి మీడియా బలహీనత ఏమిటో ఆ సంఘటన ఎత్తిచూపింది.

చట్టమో న్యాయమో ప్రధానస్రవంతి ఆలోచనాసరళో నేరస్థులుగా నిర్ధారించే వ్యక్తుల విషయంలో మీడియా చూపించే అమర్యాద, పేరుప్రతిష్ఠల మాటున, అధికారం మాటున అకృత్యాలకు పాల్పడినవారి మీద చూపించలేదు. బందిపోటును ఏకవచనంలో సంబోధించే పత్రికావార్త, రాజకీయాల్లో ఉన్న ఫ్యాక్షనిస్టును సంబోధించలేదు. ఎవరు గౌరవార్హులో ఎవరు కాదో నిర్ధారించే పని పత్రికలు తీసుకోకుండా, అందరికీ వ్యక్తిగత గౌరవాన్ని ఇవ్వడం ఒక న్యాయమైన పద్ధతి. మరి జేబుదొంగను, చెయిన్ స్నాచర్‌ని, రేపిస్టును శ్రీ, గారు తో సంబోధించడం కానీ, కనీసం క్రియావాచకంలో బహువచనం చేర్చడం కానీ సాధ్యమా? మన సామాజిక ఆలోచనావిధానం అందుకు అంగీకరించదు. తటస్థ సంబోధనకు ఇంగ్లీషులో ఉన్నంత వెసులుబాటు తెలుగుభాషలో లేదు కూడా. గౌరవవాచకాలైన శ్రీ, శ్రీమతి, గారు వంటివి పాతికేళ్లుగా పత్రికలు మానుకున్నాయి కాబట్టి సరిపోయింది కానీ, ఎందరెందరు అక్రమార్కులకు, అవినీతిపరులకు వాటిని తగిలించవలసివచ్చేదో?

జర్నయిల్ సింగ్ భింద్రన్‌వాలేకు 'సంత్' తగిలించాలా లేదా అన్నది అప్పట్లో ఒక చర్చ. భారతప్రభుత్వం సైనికచర్య ద్వారా ఆయనను హతమార్చకముందే, అతను హతం కావడానికి అర్హుడన్న నిర్ధారణకు సమాచార సాధనాలు వచ్చేశాయి. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి రెండున్నర దశాబ్దాలు దాటిపోయిన ప్రస్తుత తరుణంలో, భింద్రన్‌వాలేను 'సంత్'గానే సిక్కుమతస్థులు పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఆ సంబోధన ఇవ్వడానికి మీడియాకు పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు. కాలం గడచిపోయింది, కాలంతో పాటు, ఆయన ప్రాతినిధ్యం వ హించిన పోరాటమూ సమసిపోయింది.

ఇందిర హత్య తరువాత ఢిల్లీనగరంలో వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన ఆరోపణలున్న కాంగ్రెస్‌నేతలను ఉగ్రవాదులుగానో, హంతకులుగానో పరిగణించడానికి సమాచార సాధనాలు అప్పుడూ ఇప్పుడూ కూడా ఇష్టపడవు. శ్రీకాకుళం, నక్సల్బరీ పోరాటంలో మరణించిన తొలితరం నక్సల్ విప్లవకారుల విషయంలో ఇప్పుడు ప్రభుత్వమూ, పోలీసు యంత్రాంగమూ కూడా మర్యాదగా ప్రస్తావిస్తాయి. కానీ, వెంపటాపు సత్యం వంటి చిత్తశుద్దీ త్యాగనిరతీ ఉన్న విప్లవకారుడిని పోలీసులు కాల్చిచంపినరోజున 'నరకాసుర వధ' అని సంపాదకీయాలు రాసిన పత్రికలున్నాయి.

ఒసామా బిన్‌లాడెన్ విషయంలో కూడా అంతే. అమెరికా ఆయనను మట్టుపెట్టడానికి ముందే ప్రపంచమంతా, ముఖ్యంగా మీడియా ఒక భావ వాతావరణాన్ని తయారుచేసి పెట్టింది. ప్రపంచపత్రికలతో పాటు తెలుగు పత్రికలు కూడా లాడెన్ ను సఫాచేశాయి, లేదా ఖతం చేశాయి, లేదా హతమార్చాయి, నిర్మూలించాయి. ఒక భవనమూ అందులో కొన్ని మృతదేహాలు, ఒక కూలిన హెలికాప్టరూ, సిచ్యుయేషన్ రూమ్‌లో కూర్చుని ఉత్కంఠగా చూస్తున్న ఒబామా, హిల్లరీ బృందం- ఇంతకు మించి మరే సాక్ష్యాధారమూ లేకుండానే ప్రపంచమంతా లాడెన్ మృతిని విశ్వసించింది. మృతదేహాన్ని సముద్రంలో పడవేసినా, పాకిస్థాన్‌లోకి చొరబడి సైనికచర్య జరిపినా- తప్పేమీ లేదన్న అలక్ష్యాన్ని అంతర్జాతీయ సమాజం చూపింది. ప్రపంచానికి శత్రువు అని చెబుతున్న మనిషి దొరికితే, సజీవంగా పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించేవారెవరూ లేరు. అతని ప్రాణం కోసం కాదు, అతని హక్కుల కోసమూ కాదు. అతని సిద్ధాంతాలను, వాదనలను న్యాయరీత్యా పరాజితం చేయడానికి అతిగొప్ప ప్రజాస్వామ్యదేశం ప్రయత్నించాలి కదా? అతని ఖాతాలోకి అమెరికా తోసేసిన హత్యాకాండలో అతనిదెంతో, ఇతరులదెంతో తేలాలి కదా? ఇంత బేపర్వాగా అమెరికా ప్రవర్తించగలగడానికి యుద్ధరంగంలో తటస్థంగా ఉండలేని మీడియా బలహీనతే కారణం. శాంతికాలంలో మాత్రమే మీడియా నిష్పక్షపాతంగా ఉంటుందట, యుద్ధసమయంలో ఉన్మాదిగానే వ్యవహరిస్తుందట- అమెరికాపెద్దమనిషే చెప్పాడీ మాట. ఇంతకూ లాడెన్‌కు మర్యాద ఇవ్వాలా వద్దా? 'లాడెన్ జీ' అన్నారని దిగ్విజయ్‌సింగ్ మీద చిన్న దుమారం లేచింది.

జీ ఎందుకు అనకూడదు? ఒబామాను జీ అనడం లేదా? అన్న ప్రశ్న దిగ్విజయ్‌సింగ్‌నుంచి కూడా రాదు. పాశ్చాత్యపత్రికలైతే సరే, మే మొదటివారంలో వచ్చిన అన్ని పత్రికలూ లాడెన్‌ముఖచిత్రాలతో సంబరాలు చేసుకున్నాయి. ఎకానమిస్ట్ పత్రిక- ముఖచిత్రంమీద లాడెన్ బొమ్మ వేసి, దాని పైన 'నౌ, కిల్ హిజ్ డ్రీమ్' అని శీర్షిక పెట్టింది. మనిషిని చంపేశారు, ఇక అతని స్వప్నాన్ని చంపండి, అని ఆ పత్రిక సందేశమిస్తోంది. లోపల ఇంకెంత ఉన్మాదపు రాతలున్నాయోనని పరిశీలిస్తే,ఆశ్చర్యకరంగా ఆ పత్రిక సంపాదకీ యం- లాడెన్‌ను మిస్టర్ బిన్‌లాడెన్ అని మర్యాదగా సంబోధించింది. అమెరికా గురించి లాడెన్ ఒక మూసదృక్పథాన్ని పెంచిపోషిస్తే, ముస్లిముల గురించి అమెరికా మరో మూసదృక్పథాన్ని ప్రచారం చేసిందని, లాడెన్-అమెరికా ద్వంద్వం పరస్పరపోషకంగా ఉన్నదని ఆసక్తికరమైన సంపాదకీయం రాసింది, ఎకానమిస్ట్.

లాడెన్ హత్య అని రాయడానికి కూడా మీడియా మొహమాట పడుతోంది. ఇంగ్లీషులో 'లాడెన్ కిల్లింగ్' అంటూ తప్పించుకోవడానికి సాధ్యపడుతుంది కానీ, తెలుగులో కుదరదు. ఆజాద్ హత్య అని కూడా రాయడం కుదరదు. అదంటే ఎన్‌కౌంటర్అని ఊరుకోవచ్చు. లాడెన్ మరణాన్ని ఏమనాలి? హత్యలకు అమెరికా ఏమీ వ్యతిరేకంకాదే? రాజకీయ హత్యలకు తాము వ్యతిరేకమని 30 ఏళ్ల కిందట అమెరికా ప్రకటించిన మాటనిజమే. ఇప్పుడు పెంటగాన్‌లో కూర్చుని మానవరహిత విమానాల ద్వారా 'నిర్దిష్ట లక్ష్యాలను' ఛేదిస్తున్న నిపుణులు చేస్తున్నవి హత్యలే, నిరాయుధుడైన వ్యక్తిపై అర్థరాత్రి జరిపి చంపడాన్ని హత్య అనే అనాలి కదా?

బిన్‌లాడెన్ అమెరికాపై చేసిన దాడి రాజకీయమైనది. అతను ఎంచుకున్న లక్ష్యాలు రాజకీయమైనవి. కాకపోతే, ఆ రాజకీయాలు తీవ్రమైనవి, ఉగ్రమైనవి కావచ్చు. రాబర్ట్ మెక్‌నమారా 1965లో ఉత్తర వియత్నాంలో బాంబుల వర్షం ప్రారంభించి వేలాది మందిని ఒక్కరోజులో హతమార్చినప్పుడు- విలేఖరులు ప్రశ్నించారు. ' మేం దాడుల ద్వారా ఒక సందేశం పంపదలిచాము' అన్నారాయన. దాడుల ద్వారా సందేశాలు పంపే అమెరికా ఆనవాయితీనే టెర్రరిస్టులూ నేర్చుకున్నారు. మెక్‌నమారా, నిక్సన్, కిసింజర్, రీగన్, బుష్ సీనియర్, జూనియర్- వీరందరూ ఉగ్రవాదులని రాయగలమా? రాస్తే అవి ఉగ్రవాద రాతలు కాకుండా ఉంటాయా?

లాడెన్ సిద్ధాంతాలు, చర్యలు మంచివో చెడ్డవో ఇక్కడ అప్రస్తుతం. అలాగే, అమెరికా ప్రపంచనీతి ఏమిటో చర్చించనవ సరమూ లేదు. కానీ, ఇద్దరినీ అంచనావేయడానికి ఒకే ప్రమాణం ఉండాలి కదా అన్నది ప్రశ్న. లాడెన్ తన టెర్రరిస్టు చర్యలతో ఎన్ని హత్యలు చేశాడు, అమెరికా యుద్ధపిపాసతో ఎన్ని ప్రాణాలు తీసింది? ఈ లెక్కలు వేసుకున్నప్పుడు ఎవరిని ఎట్లా సంబోధించాలిఅన్న సందేహం పత్రికారచయితలకు రాకపోవడమే ఆశ్చర్యకరం.

No comments:

Post a Comment