Tuesday, May 31, 2011

ఆరంభం అద్భుతం, ఆపై అంతంతమాత్రం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్నీ, కాంగ్రెస్ అప్రతిహత అధికారాన్ని కూలదోసి ఆ పార్టీ అధికారంలోకి రావడాన్నీ చూసినవారికి- అదంతా జరిగి మూడుదశాబ్దాలు కావస్తోందన్న స్ఫురణ ఆశ్చర్యం కలిగిస్తుంది. కాలం ఎంత త్వరత్వరగా గడచిందన్నదే కాదు, ఈ ముప్పయ్యేళ్లకాలంలో చకచకా జరిగిపోయిన అనేక పరిణామాలు, తెలుగువా రి సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవనంలో వచ్చిన మార్పులు విస్మయం కలిగిస్తాయి. ఆవిర్భావ, వైభవదశల నాటిపార్టీని నేటి పార్టీతో పోల్చుకుని బాధపడడానికి అనేక సహేతుక కారణాలే ఉన్నాయి.  పార్టీ పూర్వవైభవం సాధించితీరుతుందని గట్టిగా విశ్వసించే అభిమానులు సైతం, అనేక అంశాల్లో జరిగిన పతనాన్ని అంగీకరించితీరతారు. నాయక త్వ స్థాయిలోనూ సంస్థాగత వ్యవహారాల్లోనూ వచ్చిన మార్పులు సరే, తెలుగువారి చరిత్రలో ఆ పార్టీ కలిగించిన సంచలనం అలాగే కొనసాగిందా, అసంఖ్యాకుల్లో ఆశలు కలిగించిన ఆ పార్టీ గమనం ఏ దిశలో సాగింది- చర్చించుకోవడానికి కూడా ఇది సబబైన సందర్భమే.

రాష్ట్ర అవతరణ తరువాత కూడా రెండున్నరదశాబ్దాలకు పైగా కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగిందన్నమాటే కానీ, ఆంధ్రప్రదేశ్ సుస్థిరంగా, శాంతిగా ఉన్నదని చెప్పడానికి లేదు. పదేళ్లు దాటిన వెంటనే రెండు ఉద్యమాలు. ఒకటి శ్రీకాకుళ పోరాటం, రెండు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ఆ తరువాత విశాఖ ఉక్కు ఉద్యమం, జై ఆంధ్ర . ఆపైన ఎమర్జెన్సీ తెలిసిందే. అల్పాయుష్షు ముఖ్యమంత్రిత్వాలు పీవీతో మొదలయి, మధ్యలో జలగం హయాం తరువాత, ఆనవాయితీగా మారిపోయాయి. చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంక్రటామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి.. తెలుగుదేశం అధికారానికి వచ్చేనాటికి ఇదీ వరస! ఎమర్జెన్సీ అనంతరం రమేజాబీపై అత్యాచారం సంఘటన పెద్ద ఉద్యమానికి దారితీసింది. కరీంనగర్‌జిల్లాలో నక్సల్బరీ రెండోతరం పోరాటాలు మొదలై, 1981 నాటికి ఇంద్రవెల్లి కాల్పులు, ఆ తరువాత సింగరేణి సమ్మె. కాంగ్రెస్ అధిష్ఠానం పదే పదే ముఖ్యమంత్రులను మార్చడం వల్లనే కాదు, రాష్ట్రంలో నాటి పరిస్థితులు కూడా మార్పునకు పరిపక్వమవుతూ వస్తున్నాయి. ప్రజలదేముంది కానీ, సాంప్రదాయిక భూస్వామ్యశక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌పార్టీపై, తీరాంధ్రప్రాంతానికి చెందిన
నవసంపన్న రైతాంగం, వ్యవసాయాదాయపు మిగులుతో ఆర్థికకార్యకలాపాల్లో ఉన్న సెక్షన్లు అసంతృప్తిగా ఉన్నాయి. అదునుకోసం ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో ఎన్‌టి రామారావు పార్టీ ప్రకటన వెలువడింది. ప్రాంతీయపార్టీల పరంపర తెలుగుదేశంతో మొదలయింది కాదు. అప్పటికి పదిహేనేళ్ల కిందటనే డిఎంకె తమిళనాడులో అధికారంలోకి వచ్చి దేశరాజకీయాలలో కొత్త ఒరవడిని సృష్టించింది. డిఎంకె కేవలం ప్రాంతీయపార్టీ మాత్రమే కాదు. అది బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమం నుంచి, హిందీ వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ. తమిళనాడులో సుదీర్ఘకాలం నివసించిన ఎన్‌టిరామారావుకు ద్రావిడ ఉద్యమమూ తెలుసును, దాని ఆరంభకాలంలో సమకాలికంగా తెలుగుదేశంలో వచ్చిన జస్టిస్‌పార్టీ/ బ్రాహ్మణవ్యతిరేక ఉద్యమమూ తెలుసును.

సమస్త సామాజిక రంగాలలో అస్తవ్యస్తతకీ, అవినీతికి కాంగ్రెస్ కుక్కమూతిపిందెలే కారణమని చెప్పిన ఎన్‌టిరామారావుకు నిర్దిష్టమైన విధానచట్రం కూడా ఉన్నది. ఆ చట్రాన్ని పకడ్బందీగా రూపొందించడానికి లోహియావాద మేధావుల సహకారమూ ఉన్నది. పార్లమెంటరీ వామపక్షీయులూ, విప్లవ కమ్యూనిస్టులూ కల్పించిన ఒక ప్రగతిశీల భావ వాతావరణమూ నాటికి రాష్ట్రంలో బలంగా ఉన్నది. అయితే, డిఎంకె మార్గాన్ని యథాతథంగా అనుసరించడం ఆంధ్రప్రదేశ్‌లో సాధ్యం కాదు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం ఉన్నంత బలంగా రాష్ట్రంలో బ్రాహ్మణవ్యతిరేక, బడుగుకులాల ఉద్యమం లేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణే బ్రిటిష్, నిజాం పాలిత ప్రాంతాల విలీనంతో జరిగింది. రెండు ప్రాంతాల మధ్య సమైక్యత సాధ్యపడకపోగా, వేరుపడాలన్న ఉద్దేశ్యంతో రెండు ప్రాంతాల్లోనూ ఉద్యమాలు జరిగాయి. అంతబలమైన వేర్పాటు ఉద్యమాలు జరిగినప్పటికీ, నాడు సమైక్యవాదిగా ఉన్న ఎన్టీయార్‌నుఅన్ని ప్రాంతాలవారు ఆమోదించడం, తెలుగుజాతి భావనను స్వీకరించడం ఆశ్చర్యకరమే.

అయితే, ఆ సమైక్యవాతావరణాన్ని ఒక బలమైన సామాజిక, రాజకీయ వాదంగా మలచడంలో ఎన్టీయార్‌కు కూడా సాధ్యం కాలేదని చెప్పాలి. లేదా పరిస్థితులు ఆయనకు అనుకూలించలేదనాలి. ముఖ్యమంత్రులను మార్చడం, రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం వంటి అంశాలు కూడా ఉన్నప్పటికీ-- తెలంగాణ ప్రాంతానికి చెందిన అంజయ్యతో రాజీవ్‌గాంధీ అవమానకరంగా వ్యవహరించడాన్ని ఆధారం చేసుకుని, తెలుగువారి ఆత్మగౌరవం అన్న నినాదం రూపొందింది. అయినా, అంజయ్య సంకేతంగా నిలిచిన తెలంగాణ వ్యక్తిత్వానికి కానీ, సంస్క­ృతికి కానీ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక పరిగణన ఏమీ ఇవ్వలేదు. ఎన్టీయార్ మొదటి రెండు విడతలు అధికారంలో ఉన్న కాలంలో తప్ప, తెలుగుదేశం పార్టీ తెలుగువారి సంస్క­ృతికి, భాషాసాహిత్యాలకు పట్టించుకున్నది లేదు. రాష్ట్రప్రజల్లో నెలకొని ఉన్న అసమానతలను, అనైక్యతను పరిష్కరించడానికి తెలుగుదేశంపార్టీకి మంచి అవకాశమే దొరికింది. కానీ, దాన్ని సమర్థంగా, దూరదృష్టితో వినియోగించుకోలేదు. సామా జిక న్యాయశక్తిగా తెలుగుదేశం ప్రతిష్ఠను పదిరికుప్పం, కారంచేడుసంఘటనలు భగ్నపరచాయి.

తెలంగాణ ప్రాంతానికి తెలుగుదేశం గమనంలో ఉన్న స్థానం చిన్నదేమీ కాదు. ఎన్టీయార్ సామాజిక దృక్పథంలో భాగంగా, ఆయన పార్టీ రాజకీయవ్యూహంలో భాగంగా- తెలంగాణలో నూతన రాజకీయతరం ఆవిష్క­ృతమైంది. రావడం రావడమే తెలంగాణలో అవకాశం కోసం నిరీక్షిస్తున్న యువతరాన్ని రాజకీయాలలోకి తీసుకువచ్చిన ఎన్టీయార్ మండలాల ఏర్పాటు ద్వారా, ఒక సామాజిక సంచలనాన్నే సృష్టించారు. సాంప్రదాయిక భూస్వామ్యవర్గాన్ని పునాదుల దగ్గర నక్సలైట్లు దెబ్బతీస్తుండగా, రాజకీయస్థాయిలో ఎన్టీయార్ తీవ్రంగా నష్టపరచారు. అయితే, ఆ భూస్వామ్యశక్తులను చావుదెబ్బతీసేదాకా ఆయన పోదలచుకోలేదు కాబట్టి, అతిత్వరలోనే నక్సలైట్లపై అతితీవ్రమైన నిర్బంధానికి పాల్పడ్డారు. రెండోవిడత అధికారంలోకి వచ్చినప్పుడు కొంతకాలం నక్సలైట్ల విషయంలో ఆయన ఉదారంగా, సంయమనంతో ఉన్నారు తప్ప, తక్కిన కాలమంతా అణచివేతనే ఆశ్రయించారు. ప్రధాన స్రవంతి రాజకీయాలలోకి తమను తీసుకువచ్చిన ఎన్టీయార్ అంటే తెలంగాణ బిసిలకు, ఎస్‌సిలలో మాదిగలకు, అగ్రవర్ణాలలోని మధ్యతరగతి శ్రేణులకు కృతజ్ఞత స్థిరపడిపోయింది. అదే తెలుగుదేశంపార్టీకి తెలంగాణలో బలంగా పరిణమించింది. మలివిడత తెలంగాణ ఉద్యమం సందర్భంగా మాత్రమే ఆ శ్రేణులకు విషమపరీక్ష ఎదురయింది.

ప్రత్యేక రాష్ట్రంకోసం సాంప్రదాయిక భూస్వామ్యశక్తుల వైపు తిరిగిచేరడానికి వారు సంసిద్ధం కాలేకపోతున్నారు. తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకు పూర్తి మద్దతు ఇస్తూ, బడుగుబలహీనవర్గాల ద్వారా ఉద్యమం నిర్వహించడానికి పార్టీ ముందుకు రాలేకపోయింది. రెండు ప్రాంతాల్లో ఉనికిని కాపాడుకోవడానికి ప్రస్తుత నాయకత్వం క్రియాశీలమైన చొరవ చూపకుండా, తటస్థత పేరుతో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం పార్టీకి మొత్తం మీద నష్టమే కలిగించింది.

తెలుగుదేశం పార్టీ తొలికాలంలో గ్రామాధికారుల వ్యవస్థ రద్దు, మిరాశీవ్యవస్థ రద్దు, మండలాల స్థాపన వంటి తీవ్రమైన విధాననిర్ణయాలు అవలీలగా తీసుకోగలిగింది. రాష్ట్రప్రాజెక్టుల కోసం ఢిల్లీ వీధుల్లో పోరాడింది. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎన్టీయార్‌ను ఒకసారి అన్యాయంగా పదవినుంచి తప్పిస్తే, దేశమంతా ఆయనకు అండగా నిలబడింది. ప్రజాస్వామ్యపునరుద్ధరణ కోసం అన్నిరకాల రాజకీయవాదులూ గొంతుకలిపారు. ఆ పోరాటంఫలితంగా 1985లో మరింత ఘనవిజయం సిద్ధించగా, ఎన్టీయార్ వ్యక్తిగత ప్రతిష్ఠ జాతీయస్థాయిలో వెలిగిపోయింది. జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం నడుం కట్టారు.

1989లో నేషనల్ ఫ్రంట్‌కు అధ్యక్షులయ్యారు. అయితే ఆ తరువాత పరిస్థితులు మారిపోయాయి. దేశరాజకీయాల్లో మార్పులు వచ్చాయి. ఫెడరల్ వ్యవస్థ కోసం పోరాటం కానీ, జాతీయస్థాయిలో ఫ్రంట్‌ల నిర్మాణం కానీ కాలం చెల్లిన కార్యక్రమాలయ్యాయి. జనాకర్షకమైన చవుక విద్యుత్, రెండురూపాయల బియ్యం,మద్యనిషేధం వాగ్దానాలతో రెండో విడత ఎన్టీయార్ అధికారంలోకి వచ్చారు కానీ, ఆయన అధికారమూ నిలవలేదు, ఆ వాగ్దానాలూ నిలబడలేదు. జనాకర్షణ అవసరం లేకుండా బ్యూరోక్రటిక్ పనితీరుతో చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు నెట్టుకురాగలిగారు. అయితే, తన విధానాలకు మధ్యతరగతి, ఆపై వర్గాలు చూపిన ఆదరణ చూసి ఆయన భ్రమలో పడిపోయారు.

సంపన్నరైతాంగ ప్రతినిధిగా రైతాంగ ప్రయోజనాలను,గ్రామీణ స్థితిగతులను పట్టించుకోవలసిన తెలుగుదేశంపార్టీ ఎన్టీయార్ అనంతరం పట్టణీకరణకు, ప్రైవేటీకరణకు అనుకూలమైన హైటెక్‌విధానాలను ఆశ్రయించింది. ఆర్థికసంస్కరణల దుష్ఫలితాలు, వరుస దుర్బిక్షంకలసి 2004లో తెలుగుదేశం పార్టీని అధికారంనుంచి తప్పించాయి.
ఆరంభంనాటి సైద్ధాంతిక బలమూ, జనాకర్షణా లేక, నడమంత్రపు విధానాల ఫలితాల నుంచి తప్పించుకోలేక , పునర్వికాసం కల్పించే మంత్రదండమేదో తెలియక తెలుగుదేశంపార్టీ ఇప్పుడు గందరగోళంలో ఉన్నది. 1983లో తానుపోరాడి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగానే ఉన్నది. దానికి తోడు, కాంగ్రెస్ రాజకీయాలనుంచి పుట్టిన ఒక పాయ- జగన్‌పార్టీని మొగ్గలోనే నిలువరించడానికి శతవిధాల ప్రయత్నించవలసి వస్తున్నది.

No comments:

Post a Comment