Tuesday, June 7, 2011

కొత్త సామాజిక వ్యూహం కాంగ్రెస్‌కు సాధ్యమా?

సామాజిక, ఆర్థిక రంగాలలో పెద్ద మార్పులకు పాలకరాజకీయాలలో ఉన్న పార్టీలు ఇష్టపడవని, ఏదో రకంగా యథాతథస్థితిని కొనసాగించడానికే ప్రయత్నిస్తాయని వ్యవస్థాగత మార్పులు కోరేవారు విమర్శిస్తుంటారు. అందులో వాస్తవం చాలానే ఉన్నది. వర్తమానంలోని వ్యవస్థ వల్ల లబ్ధిపొందే వర్గాలకు ఎటువంటి ఇబ్బంది కలగనిరీతిలో, వీలుంటే వాటికి మరింత లబ్ధి అందించే విధంగా ప్రధాన రాజకీయపక్షాలు ప్రవర్తిస్తుంటాయి. వేగవంతమైన మార్పులు, ప్రయోజనాల ఘర్షణను తీవ్రం చేసే మార్పులు, సమాజంలోని అంతస్థులను తలకిందులు చేసే మార్పులు ఆ పక్షాలకు రుచించవు. ఆ దిశగా ప్రయత్నించే శక్తులను అణచివేయడానికి కూడా అవి ప్రయత్నిస్తూ ఉంటాయి.

అలాగని, సమాజగమనం నిలవనీరులాగా ఉండిపోదు. మార్పులు జరుగుతూనే ఉంటాయి. అన్ని రకాల మార్పులను నియంత్రించేశక్తి రాజకీయపక్షాలకూ ప్రభుత్వాలకూ ఉండదు. తాము తీసుకువచ్చే ప్రమాదరహితమైన, పైపై మెరుగుల సంస్కరణల వల్ల సంభవించే పరోక్ష ప్రభావాలను కనీసం కనిపెట్టగలిగే సామర్థ్యంకూడా ఒక్కోసారి పాలకవర్గాలకు ఉండదు. అలాగే, అట్టడుగు ప్రజలనుంచే కాక, సమాజంలోని అనేక ఇతర సెక్షన్ల నుంచి కూడా మార్పులను త్వరితం చేసే ఒత్తిళ్లు వస్తుంటాయి. సమాజంలోని అంతరాలను కాపాడాలని కంకణం కట్టుకున్న పార్టీలు సైతం ఆ అంతరాలను తగ్గించే, లేదా అంతరాలను తగ్గించే ప్రయాణాన్ని వేగవంతం చేసే మౌలికమార్పులను స్వయంగా తీసుకువస్తాయి. జాతీయ కాంగ్రెస్ కానీ, రాష్ట్రచరిత్రలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ కానీ అనేక సామాజికార్థిక మార్పులకు స్వయంగా సారథ్యం వహించాయి.

జాతీయోద్యమానికి నాయకత్వం వహించి, స్వాతంత్య్రానంతరం సుదీర్ఘకాలం ఏకఛత్రాధిపత్యంతో దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌పార్టీ స్వభావం గురించి అనేక ఆసక్తికరమైన పరిశీలనలు, సిద్ధాంతాలు వెలువడ్డాయి. బ్రిటిష్‌పాలనలో విద్యావంతులైన విద్యాధిక బృందాల నుంచి ఏర్పడిన కాంగ్రెస్‌పార్టీకి అప్పుడప్పుడే ఎదుగుతూవస్తున్న దేశీయపారిశ్రామిక వర్గం అండదండలందించింది. మొదట తిలక్-గోఖలే, తరువాత గాంధీ నాయకత్వాలలో దేశంలోని వివిధ శ్రేణులకు వేరువేరు ఉద్యమాచరణ రూపాలను అందించడం ద్వారా కాంగ్రెస్ జాతీయోద్యమానికి మహాఛత్ర సదృశమైన సంస్థరూపాన్ని అందించింది. విడిపోయిన ముస్లింలీగ్, కాంగ్రెస్ వర్ణాశ్రమదృక్పథాన్ని నిలదీసిన అంబేద్కర్, వర్గస్వభావాన్ని ప్రశ్నించిన కమ్యూనిస్టులు, అహింసాసత్యాగ్రహాలను దాటి ముందుకు వెళ్లిన విప్లవకారులు- జాతీయోద్యమంలో విలువైన పాత్ర నిర్వహించి ఉండవచ్చు. కానీ, నాయకత్వ
పాత్రను కాంగ్రెస్ మాత్రమే దక్కించుకోగలిగింది. దేశసమాజంలో ఉన్న అంతరంగ వైరుధ్యాలను ఉద్రిక్తపరచకుండా, జాతీయభావనతో ప్రజలను ఏకం చేసే ప్రయత్నం కాంగ్రెస్‌ది. ఆ పార్టీ సిద్ధాంతంలోని అహింస కానీ, సామరస్యంకానీ బ్రిటిష్‌వారిపై తీసుకున్న వైఖరి మాత్రమే కాదు. దేశంలోని అంతరంగిక సమస్యలపై అనుసరించడానికి తీసుకున్న వైఖరి కూడా. జాతీయోద్యమంలో రాట్నం వడకడం, విదేశీవస్తు బహిష్కరణం, సహాయనిరాకరణం వంటి ఆర్థిక, రాజకీయరూపాలతో పాటు, అస్ప­ృశ్యతానిర్మూలన వంటి సంస్కరణరూపాలు భాగంగా ఉండడం- నాడు వెల్లువెత్తిన అన్ని రకాల ఆకాంక్షలను ఒకే గొడుగు కిందికి తెచ్చే ప్రయత్నమే.

కాంగ్రెస్ సైద్ధాంతిక భూమిక అనేకమంది ధనికులను, పెద్దకులస్థులను త్యాగధనులను సంస్కారులను చేయడంతో పాటు, అనేకమంది స్వార్థపరులను, ఫ్యూడల్‌శక్తులను కూడా జాతీయోద్యమకారులుగా చెలామణి చేసింది. స్వాతంత్య్రానంతరం మొదటిరకం వారు క్రమంగా తెరవెనుకకు పోయి, రెండో రకంవారే పార్టీలో ప్రాబల్యాన్నీ, అధికారపదవులను పొందడం మొదలయింది. నవస్వాతంత్య్రపు ఆనందమూ భ్రమలూ పోయి, నల్లదొరతనాన్నీ కాంగ్రెస్‌ప్రభుత్వాలనూ విమర్శించే సంసిద్ధత జనానికి వచ్చేంతవరకూ కూడా ఆ పార్టీ జాతీయోద్యమ ప్రతిష్ఠను నిలుపుకుంటూ వచ్చింది, 'అందరి' పార్టీగా లేదా విశాల ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించే పార్టీగా కొనసాగుతూ వచ్చింది. ప్రత్యామ్నాయంగా ఎదిగే శక్తి ఏ పార్టీకీ లేని కాలంలో ప్రధానమైన ప్రాబల్యవర్గాలన్నీ కాంగ్రెస్‌లోనే ఉండేవి. రెండుపార్టీల మధ్యజరిగే పోటీలో పోరాటంలో రావలసిన మార్పులను కాంగ్రెస్ తానే స్వయంగా ఆంతరంగిక పోరాటం ద్వారా తీసుకురావలసి వచ్చింది. 1960 దశకం చివర్లో ఇందిరాగాంధీ పాత తరం కాంగ్రెస్‌వాదులపై పోరాడి ఒక కొత్తకాంగ్రెస్‌ను రూపొందించింది. సంప్రదాయవాదాన్ని పక్కకు జరిపి ఆధునికమైన 'సోషలిస్టు' కాంగ్రెస్‌ను అవతరింపజేసింది. తిరుగులేని జనాకర్షణశక్తి పునాదిపై నిర్మితమైన ఆమె నిరంకుశాధికారాన్ని ఎదిరించడానికి 1970లలో కుడి ఎడమలకు చెందిన సాధారణ, తీవ్ర శక్తులన్నీ ఏకం కావలసి వచ్చింది. 1977లో దేశవ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ శక్తి తాత్కాలికంగానైనా ఏర్పడినప్పుడు- కాంగ్రెస్‌లో విరుద్ధవర్గాలు కూడా పునస్సమీకరణకు గురి అయ్యాయి.

సంస్థానాధిపతులను, మహాభూస్వామ్యవర్గాన్ని వదిలించుకున్నప్పటికీ ఇందిరాకాంగ్రెస్ ఇతర ఫ్యూడల్‌శక్తులకు వేదికగానే ఉంటూ వచ్చింది. నెహ్రూ హయాంలో మొదలై ఇందిర హయాంలో కొనసాగిన హరితవిప్లవం కానీ, బ్యాంకుల జాతీయీకరణ కానీ గ్రామీణ ఆర్థిక సంబంధాలలో తీవ్ర పరోక్షమార్పులకు కారణమయ్యాయి. ఇరవైసూత్రాల ఆర్థిక కార్యక్రమం ఆచరణలో ఏమి చేసిందో కానీ ప్రచారపరంగా సంక్షేమవాదాన్ని, భూస్వామ్యసంబంధాలలో కొన్ని సంస్కరణలను ముందుకు తెచ్చింది.   జాతీయోద్యమం కాలం నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఉండిన బ్రాహ్మణ నాయకత్వం స్వాతంత్య్రానంతరం కూడా కొంతకాలం కొనసాగింది. ఆ తరువాత రెడ్డి కులస్థుల నాయకత్వం ప్రారంభమైంది. అగ్రవర్ణాలు- దళితులు అన్న సమీకరణతో సాగిన కాంగ్రెస్, బిసిలను దీర్ఘకాలం విస్మరించింది. అగ్రవర్ణాల మధ్య వైరుధ్యంలో మాత్రమే బిసిలను ప్రోత్సహించే ప్రయత్నాలు జరిగాయి.

పి.వి.నరసింహారావు హయాంలో భూసంస్కరణలను అమలు జరిపే ప్రయత్నం, బిసిలకు రాజకీయాలలో చేయూత ఇవ్వడం- ఒక ప్రత్యేక సామాజికవర్గానికి చెందిన భూస్వామ్యవర్గంపై ఆయనకున్న వ్యతిరేకతే కారణమంటారు. అలాగే, రాష్ట్ర రాజకీయ నాయకత్వంలోకి వ్యవసాయ అగ్రకులాలు ప్రవేశించిన తరువాత ముఖ్యమంత్రి అయినందునే బ్రాహ్మణుడైన నరసింహారావు అతి తక్కువ కాలంలోనే పదవి నుంచి తప్పుకోవలసి వచ్చిందనీ చెబుతారు. ఒకే సామాజిక సమీకరణతో సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాలు నెరపిన కాంగ్రెస్, క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పులను పట్టించుకోనందువల్ల, కొత్తగా అవతరించిన తెలుగుదేశం పార్టీ అడుగుపెట్టిన వెంటనే ఘనవిజయం సాధించింది. కృష్ణా డెల్టా ప్రాంతంలో వ్యవసాయంలో రాణించి, వ్యవసాయాధార పరిశ్రమలలో లాభాలు గడిస్తూ, సినీరంగంలో విస్తరించిన మరో వ్యవసాయ అగ్రకులం (కమ్మ) నాయకత్వంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, రాష్ట్రంలో కాంగ్రెస్ వల్ల విస్మరణకు గురిఅయిన అన్ని సామాజిక వర్గాలను తనవెంట తీసుకువెళ్లింది. అట్లా తెలుగుదేశంను సమర్థించిన కాపుకులస్థులు, స్వయంగా తాము రాజకీయనిచ్చెనలో పైకి ఎదగాలనుకున్నారు. రంగా హత్య తరువాత కాంగ్రెస్‌వైపు మళ్లిన ఆ కులస్థులు ఇరవైఏండ్లుగా తమ నాయకత్వంలో కొత్త సమీకరణ కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారు. చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ తాజా ఉదాహరణ. కాంగ్రెస్ నీడలోనే తమ ప్రాబల్యాన్ని కొనసాగిస్తూ వస్తున్న రెడ్డి కులస్థులు, రాజశేఖరరెడ్డి హయాంలో మరింత సమీకృతులైనప్పటికీ, స్వతంత్రం ప్రకటించుకోలేకపోయారు.

వై.ఎస్. దురదృష్టకర మరణం తరువాత పరిణామాలలో ఆయన కుమారుడు జగన్ ఆ ప్రయత్నం బలంగా చేయనారంభించారు. తెలుగుదేశం పార్టీ, కొత్తగా ఏర్పడిన జగన్ పార్టీ రాష్ట్రంలోని రెండు ప్రాబల్యసామాజిక వర్గాల నేతృత్వంలో నడుస్తున్నప్పుడు- కాంగ్రెస్‌కు నాయకత్వ సంక్షోభం సహజంగానే వస్తుంది. అందుకే కొత్త సామాజిక సమీకరణ కోసం ఆ పార్టీ ప్రయత్నిస్తున్నది. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ- ఈ వరుసలో రాజకీయంగా ప్రాబల్యాలు సంక్రమించినప్పుడు, ఆ క్రమంలో తరువాత ఉన్న సామాజిక వర్గాలు కూడా ఉన్నతిని ఆశిస్తాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వెలమ వర్గాన్ని నాయకత్వ స్థానంలోకి తీసుకురాగా, తెలంగాణను సమర్థించే దళితులు, బిసిల్లో గణనీయమైన సంఖ్య వేర్వేరు శిబిరాలలో ఉంటున్నారు. రాష్ట్రవిభజన జరిగితే ప్రాంతాల వారీగా సామాజిక ప్రాబల్యాల లెక్క మారుతుందని అనేకులు ఆశగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అండతో బలమైన రాజకీయశక్తిగా ఎదిగిన తెలంగాణ బిసిలు, మాదిగలు తమకు న్యాయమైన గుర్తింపు కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కనుక నిజంగానే సాంప్రదాయిక భూస్వామ్య నాయకత్వాన్ని వదులుకోగలిగితే, తమకు అనివార్యంగా ప్రాధాన్యం పెరుగుతుందని కోస్తాంధ్ర- రాయలసీమ కాపు-బలిజెలు ఆశిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నిజంగానే ఒక పెద్ద ముందంజ వేసే సాహసం చేస్తుందా అన్నది వేచి చూడాలి. స్వభావరీత్యా కాంగ్రెస్ తనంతట తాను ఎప్పుడూ అంత పెద్ద మార్పును తీసుకురాదు. వైఎస్ అనంతరం రాష్ట్రంలో ఆ పార్టీకి ఏర్పడిన నాయకత్వ శూన్యం నుంచి, ప్రాంతీయ ఉద్యమం తీసుకువచ్చిన అనివార్యత నుంచి అందుకు పూనుకోవాలి.
ప్రధానప్రతిపక్షంగా వచ్చే సారి అధికారం కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీ కానీ, పెద్ద ఆశలతో పార్టీ ప్రారంభించిన జగన్ కానీ- కొత్త సామాజికవర్గాలను తమ మిత్రులుగా చేసుకుని కాంగ్రెస్ వ్యూహానికి విరుగుడు రచించగలరా అన్నది మరో ప్రశ్న. ఏది ఏమయినా- పాలకపార్టీల ప్రయోజనాల ఈ ఘర్షణలో ప్రజలకు సంబంధించిన సామాజిక పరివర్తనాంశం కూడా ఉన్నదన్నదే ఇక్కడ గమనించదగ్గ విషయం.

No comments:

Post a Comment