Tuesday, June 14, 2011

ప్రజలు ఏకం, నేతలు అనేకం

తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి, సీనియర్ రాజకీయనాయకుడు ఎస్.జైపాల్‌రెడ్డి శనివారం నాడు జాతీయ, ప్రాంతీయ, ఉపప్రాంతీయ వాదాల గురించి చేసిన వ్యాఖ్యలు వెనువెంటనే తీవ్రప్రతిస్పందనలను ఆహ్వానించాయి. గంటారెండుగంటల్లోనే ఆయన తన మాటలు తెలంగాణ ఉద్యమాన్ని ఉద్దేశించినవి కావని వివరణ ఇవ్వవలసి వచ్చింది. ఆయన ఏ అర్థంలో అన్నారు, అర్థంచేసుకున్న వారెట్లా చేసుకున్నారు అన్నవి ఇక్కడ అప్రస్తుతం కానీ, తెలంగాణలో రాజకీయ వాతావరణం ఎంత సున్నితంగా ఉన్నదో ఈ సంఘటన సూచిస్తుంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు భిన్నంగా మాట్లాడడం ఏ తెలంగాణా ప్రాంత రాజకీయవాదికీ సాధ్యం కాని పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉన్నది. రాష్ట్ర విభజనపై అభ్యంతరాలున్న మార్క్సిస్టుపార్టీ, ఎంఐఎం పార్టీల ప్రతినిధులు కూడా సాధ్యమైనంత వరకు ఆ ప్రస్తావనే రాకుండా దాటవేయడమో లేదా అనాసక్తంగా ప్రతికూలత వ్యక్తం చేయడమో చేయగలుగుతున్నారు. ఇటువంటి వాతావరణం నెలకొనడానికి తెలంగాణ ప్రజానీకంలో అంతర్లీనంగా దృఢపడిన ఏకత, వ్యాపించిన ఉద్యమచైతన్యం కారణాలు. వీటినే తేలికమాటతో 'సెంటిమెంట్' అని అంటున్నారు. ప్రజల్లో ఉన్న ఏకత రాజకీయనేతల్లో కనిపించకపోవడం ఒక విచిత్రం అయితే, రాజకీయమనుగడ భయం తప్ప వారిలో ఉద్యమచైతన్యం జీర్ణం కాకపోవడం మరో వింత.

తెలంగాణ ఉద్యమం రెండు తెలుగు ప్రాంతాల మధ్య విభజనను తీవ్రం చేసిందని అనేవారున్నారు. కానీ, అది బయటివారితో పెంచిన దూరం కంటె, లోపలివారిలో కలిగించిన దగ్గరితనమే ఎక్కువ. తెలంగాణ సమాజంలో ఇటీవలి కాలం దాకా ఉన్న రకరకాల అంతర్గత వైరుధ్యాలు, విభేదాలు ప్రత్యేక ఉద్యమం కారణంగా మసకబారిపోయాయి. ప్రాంతమంతా ఒకటి, ప్రాంతీయులంతా ఒకటి అన్న దృశ్యం వ్యతిరేకులను కూడా ఆశ్చర్యపరుస్తున్న వాస్తవం. ఈ స్థితి ఒక్కరోజులో ఏర్పడింది కాదు. దశాబ్దంన్నరగా చిలికి చిలికిన ఉద్యమం 2009 నాటికి గాలివానగా మారింది. క్రమంగా విస్తరిస్తూ వచ్చిన ప్రత్యేక ఆకాంక్ష, ఏడాదిన్నర కిందట పెద్ద ముందంజ వేసి, తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన ఐక్యవాతావరణాన్ని సృష్టించింది. చిదంబరం ప్రకటనకు సీమాంధ్రప్రాంతాలలో, ముఖ్యంగా ఆ ప్రాంత రాజకీయనేతలలో వచ్చిన ప్రతిస్పందన కూడా తెలంగాణలో ఏకతకు ప్రేరణ అయింది.

చిదంబరం మరో ప్రకటన చేసిన తరువాత, ఉద్యమంలో చేరడం తెలంగాణ ప్రాంతంలో ప్రతి రాజకీయవాదికి మనుగడ మంత్రం అయింది. పార్టీల ప్రమేయంలేకుండా అందరు రాజకీయనేతలు ఒకే మాట మాట్లాడడం ఆ కాలంలోనే చూస్తాము. ఈ పదిహేడు నెలల కాలంలో ప్రజలలో 'సెంటిమెంట్' మరింత గట్టిపడింది. కానీ, ఆనాటి ఏకత రాజకీయవాదుల్లో లేకపోగా, నేడు భిన్నస్వరాలు పెరిగిపోయాయి. అందరినోటా తెలంగాణ జపమే, కానీ, ఆచరణ విషయం వచ్చేసరికి తలోదారి. జాతి, కులం, మతం, జెండర్, ప్రాంతం ప్రాతిపదికలమీద పోరాడే
ఉద్యమాలన్నీ తమవారెవరో, కానివారెవరో నిర్వచించుకుంటాయి. కానివారిమీద విముఖత, వ్యతిరేకత. తమ తనం మీద ఉద్వేగపూరిత మమకారం, ఆత్మాభిమానం ప్రతి అస్తిత్వ సమూహంలో అంతర్గత ఏకతకు కారణమవుతాయి. తక్కిన అస్తిత్వాల కంటె భౌగోళిక ప్రాంతం ఆధారంగా ఏర్పడే జాతీయత, ప్రాంతీయతలకు ఏకతాగుణం ఒక పాలు ఎక్కువ ఉంటుంది. తక్కిన అస్తిత్వాలను అప్రధానం చేసి విశాలమైన ఏకీభావాన్ని, సోదరతత్వాన్ని జాతీయ, ప్రాంతీయ అస్తిత్వాలు నిర్మిస్తాయి. అయితే, తొలిరోజులలో జాతీయతావాదం ప్రాంతీయవాదాలను అనుమానంగానే చూసింది.
ప్రాంతీయత మతంతోనో, భాషతోనో ముడిపడినప్పుడు వాటిని జాతీయతకు వ్యతిరేకధోరణులుగా చూసింది. అయితే, జాతీయభావనకు లోబడే ప్రాంతీయ అస్తిత్వాలు తమ ఆకాంక్షలను వ్యక్తం చేయడం అలవరచుకున్నాయి. కాలంగడుస్తున్న కొద్దీ పరిస్థితులు మారుతున్న కొద్దీ- జాతీయతకు, ప్రాంతీయతకు కొత్త నిర్వచనాలు వచ్చాయి. ఒకనాడు జాతీయవాదుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కొన్న ప్రాంతీయవాదులు, ఉపప్రాంతీయత ఆవిర్భవించేసరికి అవే ఆక్షేపణలు వినిపిస్తూ వచ్చారు.

జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన సీనియర్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణవాదులకు ఎప్పుడూ వేదికగానే ఉంటూ వచ్చింది. తెలుగువారి ఆత్మాభిమానం పేరుతో అధికారానికి వచ్చిన తెలుగుదేశం తెలంగాణకు మద్దతు పలకవలసివచ్చింది. కమ్యూనిస్టుపార్టీ ఒక నాడు విశాలాంధ్రోద్యమాన్ని నిర్వహించగా, మార్క్సి స్టు పార్టీ తప్ప దాని కుదుళ్లనుంచి ఉద్భవించిన పార్టీలన్నీ తెలంగాణ డిమాండ్‌ను సమర్థిస్తున్నాయి. రాష్ట్రంలో బలం లేకపోయినా, జాతీయస్థాయిలో ప్రధానపక్షమైన బిజెపి చిన్నరాష్ట్రాల ఏర్పాటును కోరుకుంటోంది. ఇక తెలంగాణ కోసమే ఆవిర్భవించిన టిఆర్ఎస్ సంగతి చెప్పనక్కరలేదు. ఒక వైపు ప్రాంత ప్రజానీకంలోనూ, పార్టీ ల విధానాలలోనూ తెలంగాణకు మద్దతు పుష్కలంగా కనిపిస్తోంది. కాకపోతే, ప్రజల ఆశలకు, పార్టీల వ్యూహాలకు ఉన్న వైరుధ్యం పరిస్థితిని జటిలమూ ఉద్రిక్తమూ చేస్తున్నది. మెరుగైన జీవనం కోసం తమకున్న కలలన్నిటినీ తెలంగాణ ఆకాంక్షలో చూసుకుంటున్న జనం, అరమరికలు మాయమర్మాలు వ్యూహప్రతివ్యూహాలు లేని ఉద్యమగమనాన్ని కోరుకుంటుంటే, ప్రత్యేక రాష్ట్ర అవతరణానంతరం లేదా వచ్చే ఎన్నికల సమయంలో తమ తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయపార్టీలు వ్యవహరిస్తున్నాయి.

తెలంగాణ ప్రాంత రాజకీయనాయకులందరూ తమ పదవులకు రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభాన్నో, గట్టి ఒత్తిడినో సృష్టించి అంతిమ ఫలితాన్ని సాధించాలని ప్రజలు అమాయకంగా కోరుకుంటారు. అందరూ రాజీనామాలు చేసి, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉద్యమవీరులైపోతే, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులే మళ్లీ ఎన్నికవుతారు. రాజకీయపార్టీల మధ్య నిష్పత్తి ఇప్పుడున్న పద్ధతిలోనే కొనసాగుతుంది. అలా కాక, తమ పార్టీకే ఆధిక్యం ఉండాలని కోరుకునే పార్టీ, లేదా తామే ప్రభావం వేయగలగాలని ఆశించే పార్టీ అటువంటి సామూహిక రాజీనామాల సన్నివేశాన్ని మనస్ఫూర్తిగా ఆశించే అవకాశం లేదు. నిజానికి టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రాంతమంతా విస్తరించగలిగే శక్తీ అవకాశమూ ఒకప్పుడు ఉన్నాయి, కానీ చేజేతులా ఆ పార్టీ నాయకత్వం వాటిని వదులుకున్నది. 2001లో పుట్టిన పార్టీ 2009దాకా వేసిన అడుగులు చిన్నచిన్నవే. పార్టీకి అట్టడుగుదాకా పటిష్ఠమైన నిర్మాణాన్ని అందించడానికి కానీ, కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి కానీ చేసిన ప్రయత్నమే లేదు. తక్కువ సీట్లతో అయినా, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలలో భాగస్వామ్యం పొందడానికో, ప్రభుత్వనిర్మాణాన్ని ప్రభావితం చేయడానికో అవకాశం కోసం ప్రయత్నించింది తప్ప, తనంతట తాను పెద్దశక్తిగా ఎదగాలనుకోలేదు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిన స్థానాలే అందుకు సాక్ష్యం. ఉద్యమం ఊపందుకున్న తరువాత పెరిగిన బలం సంగతి వేరు. నిజానికి 2009 డిసెంబర్9 కు ముందు జరిగిన పరిణామాలలో టిఆర్ఎస్ ఇతరేతర శక్తులు ముందుకు తోస్తే పరిగెత్తిందే ఎక్కువ. ఇక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎంతో సదుపాయమైన క్రీడలో మునిగిపోయారు. ఎంపీలు ఆవేశంగా కదులుతుంటారు, ఎమ్మెల్యేలు నిశ్చింతగా వ్యవహరిస్తుంటారు. రాజీనామాల ప్రకటనలు చేస్తుంటారు, కొత్త పదవుల కోసం నిరీక్షిస్తుంటారు. సోనియాగాంధీ ఏదో నిర్ణయం తీసుకుంటే, నిర్ణయంతో పాటు ఎన్నికల విజయానికి కూడా ఆమె ఏదో ఉపాయం ఇస్తుందిలే అన్న ధీమా ఏదో వారిలో కనిపిస్తుంది. పగ్గాలు అధినాయకత్వం చేతికి ఇచ్చి, అనుమతించినమేరకు పరిగెత్తడం వారి ఉద్యమం. ఇక తెలుగుదేశం పార్టీది విచిత్రమైన పరిస్థితి. రెండు ఎన్నికలలో ఓడిపోయి, విశ్వసనీయతను తిరిగి కూడదీసుకోవడానికి ప్రయత్నించవలసిన సమయంలో తెలంగాణ సంక్షోభం వచ్చింది. తెలంగాణకు సమ్మతి ఇచ్చిన రెండురోజులకే మాట తడబడవలసి వచ్చింది. రెండు కళ్ల సిద్ధాంతం ఏ ప్రాంతాన్నీ మెప్పించలేకపోయింది. ఆధారపడదగ్గ స్థిరమైన ఓటుబ్యాంకు ఉన్న తెలంగాణను వదులుకోలేక, పార్టీ నుంచి తెలంగాణకు పెద్ద నాయకత్వాన్ని ఇవ్వగలిగే సాహసం లేక సతమతమవుతోంది. తమదంటూ ఒక ప్రత్యేక ఉద్యమం ఉండాలని తెలుగుదేశం తెలంగాణ నేతలు చంద్రబాబు బొమ్మతోనే - ప్రత్యర్థుల సవాళ్లను ఎదుర్కొంటూ- ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉనికి మిగుల్చుకుంటే, అది ప్రత్యేక రాష్ట్రంలో కూడా సీమాంధ్ర ప్రాంతం పరోక్ష ఆధిపత్యానికి కారణమవుతుందని కొందరు వాదించేవారు. టిఆర్ఎస్‌ది ఆ వాదన కూడా కాదు. తెలుగుదేశం పార్టీ వారు ఉద్యమంలో చేరితే అభ్యంతరం ఏమిటో చెప్పరు. 2009లో పొత్తుకు పనికివచ్చినవారు, ఆ తరువాత జెఏసిలో భాగస్వామ్యానికి పనికివచ్చినవారు ఇప్పుడెందుకు పనికిరారో స్పష్టంగా వివరించరు. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన నాగం వంటి వారిని కూడా ఎందుకు ఎడంగా ఉంచుతున్నారో తెలియదు. జెఎసిలో టిఆర్ఎస్ ప్రమేయం ఉండవలసిన దానికన్నా అధికంగా ఉంటున్నదన్న విమర్శలు భాగస్వాములనుంచే వస్తుంటే, సరిదిద్దుకోవడానికి అభ్యంతరం ఎందుకో తెలియదు. గద్దర్ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్- టిఆర్ఎస్ ఎడమొహం పెడమొహంగా ఎందుకుండాలో అర్థం కాదు. బహుశా- ఇవన్నీ ప్రజలకు తెలియనక్కరలేని రాజకీయ చతురంగంలో భాగం కావచ్చు. భవిష్యత్ కాంగ్రెస్ ప్రయోజనాలను కాపాడడం కూడా టిఆర్ఎ స్‌కు వ్యూహరీత్యా అవసరం కావచ్చు, రాష్ట్రావతరణ తరువాతనో ముందో ఆ రెండు పార్టీల విలీనం జరుగుతుందన్న ఊహాగానాలు నిజమయితే, తమ మనుగడ ఏమిటన్న ఆందోళన మాత్రమే తెలుగుదేశానికి ఉండవచ్చు.

కానీ, ప్రజలు ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలి? రాజీనామాలు, ఉప ఎన్నికలు, కొత్త గడువులు- ఇటువంటి కార్యక్రమాలలో కొంతకాలం జనం తమ అసహనాన్ని అశాంతిని ఉపశమింపజేసుకోవచ్చు. ఆ తరువాత, ఈ పార్టీల ఎన్నికల లెక్కలను పక్కన పడేసి, తమప్రయోజనాలను నెరవేర్చే వ్యూహం రచించుకోవాలని వారనుకుంటే?

1 comment:

  1. ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తున్నందుకు క్షమించాలి. తెలుగు బ్లాగర్లకి గమనిక. మా అగ్రెగేటర్ తెలుగు వెబ్ మీడియా - కెలుకుడు బ్లాగులు గానీ బూతు బ్లాగులు గానీ లేని ఏకైక సకుటుంబ సపరివార సమేత అగ్రెగేటర్ http://telugumedia.asia యొక్క సర్వర్ ఇండియన్ డేటా సెంటర్‌లోకి మార్చబడినది. ఈ సైట్ ఇతర దేశాల కంటే ఇండియాలో మూడు రెట్లు వేగంగా ఓపెన్ అవుతుంది. భారతీయుల కోసమే ఈ సౌలభ్యం. మీ సైట్‌ని మా అగ్గ్రెగేటర్‌లో కలపడానికి administrator@telugumedia.asia అనే చిరునామాకి మెయిల్ చెయ్యండి.
    ఇట్లు నిర్వాహకులు

    ReplyDelete