Monday, June 20, 2011

కింగ్‌శుక్‌నాగ్ : రెండు పరిష్కారాలు

హైదరాబాద్ లో పనిచేస్తున్న ఇద్దరు ఉత్తరాదివాళ్లు ఈ మధ్య ఒక మీటింగ్‌లో కలిశారు. ఎవరు ఎవరిని కాస్త తీరిగ్గా కలసినా తెలంగాణ ప్రస్తావనకు రాకతప్పని రోజులు కదా? ఆ ఇద్దరిలో అతను పంజాబీ, ఆమె బెంగాలీ. ఇదంతా చివరకు ఏమవుతుంది? అని ఆయన అడిగాడు. ఏదో ఒకరీతిలో విభజన తప్పదేమో? అని సమాధానం చెప్పాను. అవునా, అట్లా జరుగుతుందా, కేంద్రం అందుకు ఒప్పుకుంటుందా? అని ఆయ న ఆశ్చర్యపోయాడు. పంచనదులకు తోడు నెత్తురే ఆరోనదిగా ప్రవహించిన పంజాబ్ ను ంచి వచ్చాడు ఆయన. వేలకొద్దీ హతులయినా, చండీగఢ్‌ను పంజాబ్‌కు ఇచ్చేయడం వం టి చిన్న డిమాండ్ కూడా నెరవేర్చని ప్రభుత్వం మనది. ప్రత్యేక రాష్ట్రం అడిగితే ఇచ్చేస్తా రా? అన్నది ఆయన విస్మయానికి కారణం కావచ్చు. బెంగాలీ ఆమె అయితే, హైదరాబాద్‌కు వచ్చి ఏడాదికూడా కాలేదు, కానీ రాష్ట్రవిభజన అన్న ఊహకే కలవరపడినట్టు కనిపించారు. ఈ హైదరాబాద్, ఈ డెవలప్‌మెంటూ అంతా తెలంగాణ ఖాతాలో చేరిపోతుందా అని ప్రశ్నించారు. ఎందుకు విడిపోవడం, ఇంతకాలం కలసి ఉన్నారు కదా, సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చును కదా? అని వరుస సందేహాలను గుప్పించారు. రాష్ట్ర సమైక్యతలో ఈ ఇద్దరు పరరాష్ట్రీయులకు అంత ఆసక్తి ఉండడం ఆశ్చర్యమే అనిపించింది.

ఒకప్పుడు తెలుగువారు అన్నా, ఆంధ్రప్రదేశ్ అన్నా ఉత్తరాదివారికి తెలియనికాలం ఉండేది. వారి దృష్టిలో అందరూ మదరాసీలే. ఎన్టీయార్ ఏమి చేసినా చేయకపోయినా, తెలుగు వారంటూ కొందరున్నారని జాతీయస్థాయిలో చాటింపు వేశారు. 90 దశకం తరువాత హైదరాబాద్‌కు చంద్రబాబు తీసుకువచ్చిన 'వైభవం' కారణంగా, ఆంధ్రప్రదేశ్ అప్రధానమైపోయి హైదరాబాద్ ఒక్కటే అందరికీ తెలిసిన కాలం వచ్చింది. అందరూ అంటే సామాన్యులందరికీ అని కాదు. నూతన ఆర్థిక విధానాల అభివృద్ధి రథం మీద పరుగులు తీస్తున్నవారికీ, తీయాలనుకుంటున్నవారికీ హైదరాబాద్, బెంగుళూరు సుపరిచితాలై పోయాయి. రాష్ట్ర విభజన అనగానే హైదరాబాద్ సంగతి ఏమిటన్న ఆందోళన ఆ వర్గాలకే మొదట కలిగింది. విభజనను వ్యతిరేకిస్తున్న తెలంగాణేతర ప్రాంతాల వారికి హైదరాబాద్ ప్రతిపత్తి గురించిన ఆందోళన లేదని కాదు. వాదనలో భాగంగా హైదరాబాద్‌లో తాము తీసుకువచ్చిన
అభివృద్ధి గురించి మాట్లాడతారు కానీ బహిరంగంగా మాత్ర ం తెలుగువారందరూ కలసి ఉండాలనే అమూర్తమైన ఆకాంక్షనే ఆశ్రయిస్తారు. కానీ, తెలుగునేలతో ఏ సంబంధమూ లేనివారు మాత్రం, బ్రాండ్ హైదరాబాద్ భవితవ్యం మీద బెంగతో ప్రత్యేక ఉద్యమాన్ని ఒక న్యూసెన్స్‌గా భావిస్తారు. గత ఏడాదిన్నరగా తెలంగాణ ఉద్యమం ఎంత ఉద్ధృతంగా సాగుతున్నా, జాతీయ మీడియా పెద్ద ప్రాధాన్యం ఇవ్వక పోవడం, తరచు వ్యతిరేక కథనాలు ప్రకటించడం ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవలసినవే. లేకపోతే, రాష్ట్రంలో రెండు విభిన్న వాదాలు ఘర్షణ పడుతున్నప్పుడు బయటివారు నిష్పాక్షికమైన, వాస్తవమైన సమాచారం, వ్యాఖ్యానాలు అందించే అవకాశం ఉండేది. హైదరాబాద్ మెరుపులు బయటివారిని కూడా పాక్షికంగా మార్చివేశాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఎడిటర్ కింగ్‌శుక్ నాగ్ తాజాగా తెలంగాణ ఉద్యమం మీద రాసిన 'బ్యాటిల్‌గ్రౌండ్ తెలంగాణ' కూడా అటువంటి పాక్షికతనే ప్రదర్శించి ఉంటు ందని, పుస్తకం చూడకముందే ఒక అభిప్రాయం ఏర్పడింది. ఆయన ఈ రాష్ట్రం వారు కాదు. పైగా జాతీయ ఆంగ్ల మీడియాకు సంబంధించిన వారు. కానీ, ఆ ముందస్తు అభిప్రాయం పొరపాటని పుస్తకమే నిరూపించింది. పుస్తకం- ప్రత్యేక తెలంగాణ వాదాన్ని పూర్తిగా సమర్థించడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయలేదు. సమైక్యవాదుల, హైదరాబాద్ వాదుల వాదనలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు కానీ, వాటినే అంతిమంగా భావించలేదు. యథాతథస్థితిని కొనసాగించడం మాత్రం సాధ్యంకాదని, భావ్యం కాదని స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు ఆయన శ్రీకృష్ణ కమిటీ కంటె ఎంతో వాస్తవిక దృష్టిని, నిష్పాక్షికతను ప్రదర్శించారు. 'ఈ అనిశ్చితి తొలగిపోతే బాగుండునని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్‌లోని తక్కిన ప్రజలకు' కింగ్‌శుక్‌నాగ్ తన పుస్తకాన్ని అంకితం చేశారు. సమస్యను విస్మరించడం కానీ, నానబెట్టడం కానీ, మభ్యపెట్టడం కానీ చేయకుండా తక్షణం పరిష్కారానికి పూనుకొమ్మని ఆయన ప్రధానంగా సూచించారు.

తొలి విడత ఉద్యమంతో సహా తెలంగాణ ఆకాంక్ష పూర్వాపరాలను, రాష్ట్ర రాజకీయ చరిత్రను, ఎన్టీయార్, వైఎస్ఆర్ అభివృద్ధి పంథాల వివరాలను, ప్రస్తుత ఉద్యమంలోని ముఖ్య సంఘటనలను, వివిధ పక్షాల అభిప్రాయాలను నాగ్ పూసగుచ్చారు. వాస్తవాలే అధికంగా ఉన్నాయని, విశ్లేషణ తక్కువని వచ్చిన సమీక్షలకు కారణం అదే. పుస్తకం లక్ష్యంగా పెట్టుకున్న పాఠకులు రాష్ట్రం వెలుపలి ఆంగ్ల విద్యావంతులని గుర్తు ఉంచుకుంటే, సమాచారాన్ని విపులంగా ఇవ్వడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటో అవగతమవుతుంది. విశ్లేషణలో కూడా ఆయన ఆచితూచి వ్యవహరించారు తప్ప, అసలే విశ్లేషించకుండా లేరు. తెలంగాణ ప్రజలలో ఉన్న బలీయమైన ఆకాంక్షలపై, భావోద్వేగాలపై రచయితకు సానుభూతి ఉన్నది. ఉద్యమక్రమంలో జరిగిన కొన్ని హృదయవిదారకమైన బలిదానాలు, సమీకృతమైన జనసందోహాలు ఆయనపై ప్రభావం వేసి ఉంటాయి. కాకపోతే, హైదరాబాద్ అభివృద్ధి ప్రాతిపదికపై వచ్చే వ్యతిరేక వాదనలకు కూడా ఆయన అంతే ప్రాధాన్యం ఇవ్వడాన్ని తెలంగాణవాదులు సమ్మతించలేరు. సాంప్రదాయిక హైదరాబాద్ హైటెక్‌సిటీగా పరిణమించడంలోని అభివృద్ధివిధానంపైనే తెలంగాణవాదులకు అభ్యంతరాలున్నాయి.

హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన 'అభివృద్ధి' కేవలం అది రాజధాని కావడం వల్లనే జరిగిందనే వాదనను కూడా అందరూ అంగీకరించరు. రాజధాని కావడం వల్ల ఉద్యోగవర్గాలు, ఉపాధిని ఆశించే సాధారణ ప్రజలు, కొన్ని వ్యాపారశ్రేణులు హైదరాబాద్‌కు వచ్చి ఉండవచ్చును కానీ, తక్కిన అభివృద్ధి అంతా ఇక్కడి భూములను, ఇతర వనరులను ఆశ్రయించుకుని,ఆక్రమించుకుని జరిగినదేనని వారు వాదిస్తారు. ఉపాధి ఉద్యోగాల కోసం వచ్చినవారికి కానీ, వ్యాపారాల కోసం వచ్చినవారికి కానీ తెలంగాణ హైదరాబాద్‌లో వచ్చే నష్టమేమీ ఉండదని వారు గట్టిగా చెబుతున్నారు కూడా. అయినప్పటికీ, రాష్ట్రం విడిపోతే, ఉన్న ఒకే ఒక్క మహానగరం మరో రాష్ట్రానికి సంక్రమిస్తే, ఉపాధి అవకాశాల గతి ఏమిటని సీమాంధ్రప్రాంతాల ప్రజలు ఆందోళన చెందడంలో న్యాయం ఉన్నది. అయితే, ఉపాధికి, ఉద్యోగాలకు రాష్ట్రాల సరిహద్దులు ఎక్కడ అవరోధంగా ఉన్నాయి? - ఈ అంశంపై నాగ్ వాదన పూర్తి నిష్పాక్షికతతో ఉన్నట్టు కనిపించదు. గ్రామీణ జీవన సంక్షోభం పునాదిపైనుంచి ఆవిర్భవించిన మలివిడత ఉద్యమానికి, పట్టణాభివృద్ధిలో భాగస్వామ్యం వాదనతో ముడిపెట్టడం సబబేనా? తెలంగాణలోని వెనుకబాటుతనం ఊహాజనితమూ కావచ్చు, వాస్తవమూ కావచ్చు- అన్న అర్థంలో నాగ్ ఒకచోట వ్యాఖ్యానిస్తారు. ఊహాజనిత వెనుకబాటుతనం, వివక్ష అన్న మాటలను శ్రీకృష్ణ కమిటీనివేదికలో చూస్తాము. రాష్ట్రవిభజన వాదం మంచిచెడ్డలను పక్కనబెట్టి కూడా, తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను సీనియర్‌పాత్రికేయులు, సంపాదకులు మదింపు వేయలేరా అని సందేహం కలుగుతుంది.

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్య 600 సంవత్సరాల రాజకీయమైన ఎడబాటు ఉన్నదని, అది 60 సంవత్సరాల సమైక్యరాష్ట్రంలో పూడిపోలేదని నాగ్ వ్యాఖ్యానిస్తారు. అయితే, ఉభయప్రాంతాల ప్రజల మధ్యలో ఎంతో కొంత ఏకత ఏర్పడుతూ వస్తున్నదని, యథాతథ స్థితి కొనసాగిస్తే ఇంకో అర్థశతాబ్దిదాకా పరస్పర అవిశ్వాసం కొనసాగుతూనే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సాంస్క­ృతికమైన విభిన్నత కూడా ఉభయప్రాంతాల మధ్య గణనీయంగా ఉన్నదని ఆయన స్పష్టంగానే చెప్పారు. యథాతథస్థితిని కొనసాగించలేమని, కొనసాగించకూడదని చెప్పడంలో రచయిత ఏ మాత్రం సంకోచించలేదు. అయితే, పరిష్కారాన్ని సూచించే ఉత్సాహంలో రెండు వివాదాస్పదమైన సూచనలు ఆయన చేశారు. హాంకాంగ్ తరహా పరిష్కారం ఒకటి. హాంకాంగ్ ను బ్రిటన్‌నుంచి తిరిగి తీసుకునేటప్పుడు, చైనా ఒకదేశం, రెండు వ్యవస్థలు అన్న మార్గాన్ని అనుసరించింది. అట్లాగే, హైదరాబాద్‌ను తెలంగాణలో అంతర్భాగం చేస్తూనే, దానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ఆదాయం నుంచి కొంత భాగాన్ని తెలంగాణ బడ్జెట్‌కు కేటాయించాలని నాగ్ సూచించారు. ఈ ఏర్పాటు వల్ల హైదరాబాద్‌లో ఉండే ప్రాంతేతరులకు అభద్రత తగ్గుతుందని ఆయన అభిప్రాయం. మరో సూచన- తెలంగాణకు సమైక్యరాష్ట్రంలో ప్రత్యేక పాలనావ్యవస్థను ఏర్పాటు చేయడం. ఇది శ్రీకృష్ణ కమిటీ మొదటి సూచనకు దగ్గరగా కనిపించవచ్చును కానీ, కింగ్‌శుక్‌నాగ్ దీన్ని మేఘాలయ ప్రయోగంతో పోల్చారు. అస్సాం రాష్ట్రంలో భాగంగా ఉంచుతూనే మేఘాలయను ఒక ప్రత్యేక పాలనాప్రాంతంగా చేశారని, రెండేళ్ల తరువాత ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారని ఆయన గుర్తు చేస్తున్నారు. అంటే పరిమిత కాలం పాటు, తెలంగాణను రాష్ట్రంలో రాష్ట్రంగా కొనసాగించాలని ఆయన ప్రతిపాదన.

ఈ రెండు సూచనలను ఉభయప్రాంతాల వారు ఆహ్వానిస్తారని చెప్పలేము. కానీ, పరిష్కారాల ప్రతిపాదన జరగడం కూడా ముఖ్యమే. అనిశ్చితి కొనసాగడం అరిష్టం. యథాతథస్థితి సాధ్యమయ్యే పరిస్థితీ లేదు. పరిష్కారాలకు అవరోధంగా ఉన్న అనుమానాలను, అపోహలను, భయాలను- అవి వాస్తవమైనవైనా, ఊహాజనితమైనవైనా- తొలగించే ప్రక్రియ ప్రారంభం కావాలి. అందుకు నాగ్‌పుస్తకం దోహదం చేస్తుంది. నాగ్ బయటిరాష్ట్రం వారు కావడం వల్ల ఆయన పుస్తకం మీద అనుమానం కలిగిందని మొదట రాశాను. బయటిరాష్ట్రం వారు కావడం వల్లనే ఈ మాత్రమైనా సమతూకంతో రాయగలిగారని ఇప్పుడనిపిస్తున్నది

No comments:

Post a Comment