Monday, June 27, 2011

తీరనిలోటే కానీ, తీర్చవలసిన లోటు కూడా

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఎవరు, ఆయన ఏ వాదాన్ని ప్రచారం చేశారు, ఏ రాజకీయ లక్ష్యం కోసం పనిచేశారు- అన్న ప్రశ్నలను కాసేపు పక్కన పెడదాం. ఆయన ఉర్రూతలూగించే ఉపన్యాసాలు చేసినవారు కాదు, కుండబద్దలు కొట్టే మాటలతో మైకులు విరగ్గొట్టినవారు కాదు, జనావేశాల సోపానాల మీద ప్రతిష్ఠను ప్రాబల్యాన్ని పెంచుకున్నవారు కాదు. ఆయన కేవలం ఒక అధ్యాపకుడు. ఒక పరిశోధకుడు. ఒక రచయిత. ప్రచార కార్యకర్త. సలహాదారు. నిర్వహించిన వైస్‌చాన్సలర్ వంటి ఉన్నతపదవులతో సహా ఆయన వృత్తిప్రవృత్తులన్నీ విద్యావిషయికమైనవే. బౌద్ధికమైనవే. అటువంటి ఒక మేధావి, పాఠాలు చెప్పే పంతులు, సాధుజీవి, స్వాదుసంభాషి అనారోగ్యంతో కన్నుమూస్తే తెలంగాణ ప్రజానీకం గుండె ఎందుకు పగిలింది? ఎందుకు దిక్కులదిరేట్లు రోదించింది? ఆయన పార్థివ కాయానికి జనసాంస్కృతికలాంఛనాలతో ఎందుకంత ఘనంగా వీడ్కోలు పలికింది? ఒక ఉపాధ్యాయుడికి అంతటి నివాళి లభించిన సందర్భం ఇటీవలికాలంలో ఎప్పుడన్నా చూశామా?

డెబ్భయ్యారేళ్లు బతికిన మనిషి అనారోగ్యమరణం దిగ్భ్రాంతి కలిగించేదేమీ కాకపోవచ్చు. కానీ, జయశంకర్ విషయంలో అది అకాల మరణమూ ఆకస్మిక మరణమూ అయింది. అరవయ్యేళ్లుగా తెలంగాణ నిప్పును కాపాడుకుంటూ వస్తున్న జయశంకర్ ప్రస్తుత ఉద్యమం పతాకఘట్టంలో అస్తమించడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎదిగిన సంతానం ప్రయోజకులైతేనో, పెళ్లి చేసుకుంటేనో చూడాలనుకుని ప్రాణం ఉగ్గపట్టుకున్న వృద్ధుడు, కోరిక తీరకుండానే కన్నుమూస్తే దుఃఖం అంతా ఆ తీరనికోరిక చుట్టూనే సుడితిరిగినట్టు, జయశంకర్ నిష్క్రమణ వేదన తెలంగాణ శేష ఆకాంక్ష నే ప్రతిధ్వనించింది. సాపేక్షమైన స్తబ్దతలో పడి, తరువాతి అడుగు ఏమిటో తెలియని అయోమయంలో ఉన్న తెలంగాణ ఉద్యమంలో అంతర్లీనంగా వినిపిస్తున్న అసహనపు ఆవేదన ఏదో జయశంకర్ సంతాప వాతావరణంగా రూపుదిద్దుకున్నది. తెలంగాణ ఉద్యమానికి,
ఇక్కడి మేధావులకు విద్యావంతులకు ఉన్న సజీవసంబంధాన్ని జయశంకర్ మరణసందర్భం మరోసారి చాటి చెప్పింది. ఆకాంక్ష కేవలం భావోద్వేగాలకు సంబంధించినదో, సెంటిమెంట్ మాత్రమే అయితేనో అక్షరాలతో ఆలోచనలతో సామాన్య ప్రజలకు సైతం ఇంతటి గాఢమైన అనుబంధం సాధ్యమయ్యేది కాదు. జయశంకర్ క్రియాశీల ప్రమేయంతో తిరిగి తిరిగి తెరపైకి వచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, అంతిమ ఫలితం ఇంకా అందనప్పటికీ, తన ప్రస్థానంలో తెలంగాణ సమాజానికి ఎంతో పరిపక్వతను కూడా అందించింది. త్యాగశీలత, నిబద్ధత ఈ రెంటినే అత్యున్నతమైనవిగా గుర్తిస్తామని చెప్పడం ద్వారా రాజకీయనేతలకు జయశంకర్ అంతిమయాత్ర ఒక హెచ్చరికను అందించింది.

మహావ్యక్తి మరణించిన వెంటనే తీరని లోటు అని పూడ్చలేని నష్టమనీ యథాలాపంగా అంటుంటాము. ప్రాసంగికత కోల్పోయిన వ్యక్తులు, కాలధర్మం చెందే వ్యక్తుల విషయంలో కూడా మర్యాదపూర్వకంగా అటువంటి నివాళిమాటలే మాట్లాడతాము. కానీ, బాలగోపాల్, జయశంకర్ వంటి వారి మరణం కలిగించే లోటు నిజమైన లోటు. వారు వర్తమానంలోనూ క్రియాశీలంగా సామాజికరంగంలో ఒక విశిష్టమైన కార్యసాధకులుగా ఉండడం ఒక కారణం కాగా, వారి వ్యక్తిత్వాలు చారిత్రకంగా నిర్వహించిన పాత్ర రీత్యా కూడా వారి ఉనికి విలువైనది కావడం మరో కారణం. దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ ఉద్యమంలో తరం నుంచి తరానికి ప్రవహించిన జీవచైతన్యం జయశంకర్. ఆయన మాట వెనుక, వాదన వెనుక చరిత్ర ఇచ్చిన సాధికారత, అనుభవం ఇచ్చిన గాంభీర్యం ఉంటూ వచ్చాయి. చారిత్రక వ్యక్తిగా ఆయన ప్రాసంగికత ఒకటయితే, వర్తమాన ఉద్యమంలో ఆయన పాత్రకు మరో ప్రాసంగికత ఉన్నది. ఆయన వ్యక్తిత్వం, అనుభవం వర్తమాన ఉద్యమంలో ఆయననొక మేరునగ సమానుడిని చేశాయి.

తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుంటున్న రాజకీయపక్షాలు, సంఘాలు, బృందాలు అనేకం ఉండవచ్చును. ఎవరి పద్ధతిలో వారు ఆచరణను కొనసాగిస్తూ ఉండవచ్చు. కానీ, జయశంకర్ ఆయా సంస్థల, సంఘాల కంటె ఉన్నతస్థానంలో, స్థాయిలో నిలబడిన వ్యక్తి. చీలికలు పీలికలుగా ఉన్న సమాజంలో అందరినీ సమ్మతమైన అందరూ గౌరవించే పెద్దమనిషి ఆయన. అటువంటి పెద్దమనిషి భౌతికంగా అదృశ్యం కావడం తెలంగాణ ఉద్యమానికి నిజంగానే పెద్ద లోటు. జాగ్రత్త పడకపోతే తీరని లోటు కూడా.

రాజకీయ పక్షాలు కానీ, ఉద్యమాలు కానీ వాస్తవంలో సమాజంలోని కొన్ని ప్రయోజనాలకు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆ పక్షాల నాయకత్వం తను ప్రాతినిధ్యం వహించే వర్గాన్ని తనవెంట ఐక్యంగా నిలుపుకోవడంతో పాటు, ఆ వర్గం ప్రయోజనాలను నెరవేరుస్తూ, తరువాతి పురోభివృద్ధి దశలోకి తీసుకువెళ్లాలి. ఆ ప్రయోజనాలకు భూస్వామ్య స్వభావమో, సాంప్రదాయ సమాజ స్వభావమో ఉన్నప్పటికీ, రాజకీయ పక్షాల అంతర్గత వ్యవహారసరళి ఆ వర్గ సమష్టి ప్రయోజనార్థం ప్రజాస్వామికంగానే ఉంటుంది.

అభివృద్ధి చెందిన ప్రాంతాలనుంచి ఏర్పడిన పార్టీలపై ఆ పార్టీల ప్రాతినిధ్య వర్గాలకు గట్టి పట్టు ఉంటుంది. పార్టీల విధానాలను, పనితీరును ఆ వర్గాలు రకరకాల శ్రేణుల ద్వారా నియంత్రించే ప్రయత్నం చేస్తాయి. ఆ వర్గాలకు సమాజంలో ఉన్న పలుకుబడి, విద్యాసాంస్క­ృతిక సమాచార రంగాలలో ఉండే పట్టు, వివిధ అధికారిక హోదాలలో ఉన్నందున సమకూరే సామాజిక పెట్టుబడి- అన్నీ కలిసి తమ ప్రతినిధి పార్టీతో సాధికారంగా వ్యవహరించే శక్తిని ఆ వర్గాలకు ఇస్తాయి. వెనుకబడిన ప్రాంతాలలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తమ ప్రాంత ప్రయోజనాలకు పరిమితమై పార్టీని నిర్మించుకునే శక్తే ప్రాంతీయవర్గాలకు అరుదుగా ఉంటుంది. ఒకవేళ అది సాధ్యమైనప్పటికీ, వెనుకబాటు తనం ఆ పార్టీ నిర్మాణంలో కూడా ప్రతిఫలిస్తుంది. పార్టీని అదుపు చేసే సామాజిక పెట్టుబడి ప్రాంతీయవర్గానికి ఉండదు. చారిత్రకంగా కానీ, ధనసంపన్నత వల్ల కానీ, విద్యాసాంస్కృతికాది రంగాలలో ప్రాబల్యం వల్ల కానీ సమకూరే స్వతంత్ర శక్తి ఆ వర్గానికి ఉండడం కష్టం. అందువల్ల, వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కోసం ఏర్పడే పార్టీలో అంతర్గత నిర్మాణం కూడా అప్రజాస్వామికంగా, అసమానతలతో ఉంటుంది. నాయకుడు భూస్వామిలాగానో, గుంపుపెద్దలాగానో వ్యవహరిస్తాడు. వివిధ స్థాయిలలో పార్టీ నిర్మాణం ఉండదు, ఉన్నా అది పైవారి ఆజ్ఞలకోసం ఎదురుచూస్తుంటుంది. పార్టీ అధినాయకుడిని ప్రశ్నించే వారు కానీ, సరిదిద్దేవారు కానీ ఎవరూ ఉండరు. అటువంటి సందర్భంలో జయశంకర్ వంటి వారి అవసరం ఏమిటో తెలుస్తుంది.

జయశంకర్ ఆ శక్తిని సంపూర్ణంగా వినియోగించుకున్నారని చెప్పలేము. గడ్డిపోచ ఆసరా దొరికినా చాలు గోదావరి ఈదవలసిన అగత్యం ఉన్నదని ఆయన నమ్మారు. గట్టి నాయకత్వం లభిస్తే, చాలు ఎన్ని లోపాలున్నా క్షమించవలసిందేనని కొన్ని సందర్భాలలో రాజీపడ్డారు. కెసిఆర్ జయశంకర్‌కు బహిరంగంగా పాదాభివందనం చేయడం కేవలం ఆయన మీద గౌరవంతోనే కాదు. ఆ చర్య కెసిఆర్‌కు అదనపు నైతికస్థాయిని, సాధికారతను సంక్రమింపజేస్తుంది. జయశంకర్‌కు ఆ విషయం తెలుసు. ఉద్యమ ప్రయోజనాలకు, రాజకీయపార్టీల వ్యూహాలకు వైరుధ్యం వచ్చే సందర్భాలుంటాయనీ ఆయనకు తెలుసు. అటువంటి సన్నివేశాలలో కల్పించుకుని, రాజకీయపక్షం నడకను సరిదిద్దగలిగే శక్తి ఉన్నప్పటికీ జయశంకర్ దానిని పెద్దగా ఉపయోగించుకోలేదు. కాకపోతే, తాను ఒక పార్టీ మీద అధిక విశ్వాసం ఉన్నట్టు కనిపించినప్పటికీ, తెలంగాణ ఉద్యమంలో అనేక సంస్థలు పనిచేయడం మంచిదని ఆయన విశ్వసించారు. దేవేందర్‌గౌడ్ పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆశీర్వదించారు. గద్దర్ వంటి వారితో అయితే, జయశంకర్‌కు సుదీర్ఘమైన ప్రజాస్వామిక అనుబంధం ఉన్నది. జయశంకర్ భౌతికకాయంపై టిఆర్ఎస్ జెండాను కాకుండా, తెల్లటి తెలంగాణ జండాను కప్పారు. పార్టీలకు కాకుండా, ఉద్యమానికి ఆయన చూపిన నిబద్ధతకు అది నివాళి.

ప్రస్తుత తెలంగాణ ఉద్యమానికి పాదులు తీయడంలో విద్యావంతుల వర్గంపై జయశంకర్ ఎక్కువగా ఆధారపడ్డారు. తొలినాటి సంఘాలు,సంస్థలు అన్నీ మేధోపరమైన కృషినే అధికంగా నిర్వహించాయి. తెలంగాణ ఉద్యమంలో విద్యావంతులు ఒక బలమైన రాజకీయ శ్రేణిగా రూపొందడం వెనుక ఆ పునాది ఉన్నది. జయశంకర్ వారసత్వాన్ని కొనసాగించే బాధ్యత కూడా విద్యావంతుల మీదనే ఉన్నది. రాజకీయపార్టీల వ్యూహప్రతివ్యూహాలకు అతీతంగా, సమాంతరంగా ఒక ప్రతిష్ఠాత్మకమైన నేతృత్వాన్ని ఉద్యమానికి అందించగల శక్తి మేధావి వర్గానికి ఉన్నది. కోదండరామ్, మల్లేపల్లి లక్ష్మయ్య వంటివారికి ప్రజాహితరంగంలో సుదీర్ఘ అనుభవమూ, సునిశిత మేధావులుగా గుర్తింపూ ఉన్నాయి. ఉద్యమ బాధ్యతానిర్వహణలో వారి తటస్థత గురించి అనేక ఆరోపణలు, సందేహాలు వినిపిస్తున్నాయి. రాజకీయశక్తులతో వ్యవహరించేటప్పుడు ఏర్పడే ఒత్తిళ్లు, సమన్వయసాధనలో కలిగే ఇబ్బందులు సహజమే అయినప్పటికీ, వాటికి అతీతంగా ఉద్యమశ్రేయస్సును వస్తుగతంగా చూడగలిగే శక్తిని జయశంకర్ స్ఫూర్తితో అలవరచుకోవాలి. అపోహలకు ఆస్కారం ఇవ్వకుండా, జయశంకర్ దార్శనికత, స్థితప్రజ్ఞత అలవరచుకుంటే, ఆయన లేని లోటు పూడ్చడం ప్రస్తుత మేధావివర్గానికి అసాధ్యమేమీ కాదు.

No comments:

Post a Comment