Sunday, July 3, 2011

పావలా మరణం

ద్రవ్యోల్బణాన్ని, నల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం వెయ్యిరూపాయల నోట్ల రద్దు వంటి దిగ్భ్రాంతికరమైన కఠినచర్య ఏదోతీసుకుంటుందన్న వదంతులను అమాయకులు నమ్ముతున్న సమయంలో, రిజర్వు బ్యాంకు మాత్రం ఒక 'చిల్లర' నిర్ణయం తీసుకున్నది. ఫలితంగా- పావలా అలియాస్ చారానా నాణెం మరణించింది. నిజానికి పావలా కాసు చాలాకాలంగా నల్లపూసైపోయింది. ఈ రోజు నుంచి అది అధికారికంగా కూడా చెల్లని కాసుగా మారిపోయింది. రూపాయి పావలా, రూపాయి ముప్పావలా అన్న లెక్కలు ఇక ఉండవు. రూపాయిన్నర, ఆ పైన రెండు రూపాయలు. లెక్కల్లో నామమాత్రంగా పైసలు ఇంకా ఉనికిలోనే ఉంటాయి కానీ, చిల్లర లావాదేవీల్లో మాత్రం దగ్గరి 'రౌండ్ ఫిగర్'లోకి సర్దుకుపోతాయి. పైస, రెండు పైసలు, మూడు పైసలు, ఐదుపైసలు, పదిపైసలు, ఇరవైపైసలు, పావలా - ఇప్పటిదాకా ఈ ఆధునిక భారతీయ నాణేలు కాలగర్భంలో కలసిపోయాయి. ఇక అర్థరూపాయిది తరువాతి వంతు. రూపాయి అస్తమయం కూడా ఎంతో దూరంలో లేకపోవచ్చు.

పెన్నీలు, సెంట్లు ఇంకా సంపన్నదేశాల్లో గలగలలాడుతుండగా, మన పైసలు ఎందుకింత నీరసించిపోయాయో తెలుసుకోవడానికి ఆర్థికశాస్త్ర పరిచయమేమీ అక్కరలేదు. నోటు స్థాయి నుంచి చిల్లరనాణేల స్థాయికి రూపాయి, రెండు రూపాయలు, ఐదురూపాయలు పడిపోయి చాలా కాలమైంది. ఒక దేశపు ధనం దిగజారనిదేమరో దేశపు ధనం ధగధగలాడదు. డాలర్ స్థిరకక్ష్యలో వెలిగిపోతుంటే, రూపాయి ఆరిపోయిన నక్షత్రంలాగా తరిగిపోతూ వస్తున్నది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ దగ్గర నుంచి మన దేశీయ మార్కెట్ దాకా జరిగిన అనేక మార్పుల వల్ల డబ్బుకు చాలా జబ్బు చేసింది.   ఆర్థిక అంతరాలు పెరిగిపోయి, వినిమయ సంస్క­ృతి విజృంభించి, దరిద్రరేఖకు దిగువన సైతం సంక్షేమ కవచాలు తొలగిపోయి, కనీసావసరాలు సైతం గుత్తవ్యాపారాల చేతికి పోయిన తరువాత
మన రూపాయి ఉట్టి కాగితపు ముక్కగా కనిపించసాగింది. ముమ్మరం పెరిగిపోయి, సంచీ కూరగాయల కోసం సొమ్ముల మూటలు పట్టుకు వెళ్లవలసి వస్తున్న కాలం వచ్చేసింది. రాష్ట్ర బడ్జెట్లు లక్ష కోట్లు దాటుతున్న కాలంలో, అవినీతిపరుల సంపాదనలే వేల కోట్లకు చేరిన తరుణంలో పాపం పావలా ఎట్లా బతుకుతుంది?

పదహారణాల, అరవైనాలుగు కానీలరూపాయి, నూరుపైసల రూపాయిగా మారింది 1950 దశాబ్దంలో. 1955లో ఇండియన్ కాయినేజ్ చట్టాన్ని సవరించి, నాణేలలో మెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టారు. సవరణ అమలులోకి వచ్చింది 1957లో. కొలమానాలన్నిటిలో దశాంశ పద్ధతి వ్యాపిస్తున్నప్పుడు, ద్రవ్యం కూడా డెసిమల్ పద్ధతిలో ఉండాలని భావించిన భారత ప్రభుత్వం మొదట ఐదు రకాల కొత్త నాణేలు ప్రవేశపెట్టింది. అవి, గుండ్రటి రాగిపైస, ఎనిమిది మూలల రెండుపైసలు, నలుచదరపు ఐదుపైసలు, ఎనిమిది మూలల పదిపైసలు, గుండ్రటి పావలా. ఆ ఏడాది నుంచే పైసలను నయాపైసలని వ్యవహరించడం మొదలయింది. 1964నుంచి నాణేలపై నయాపైసలని రాయడం ఆపేశారు. ఈ నాణేలన్నిటిపైనా ఒకవైపు ఎన్నిపైసలో తెలిపే అంకె, రెండోవైపు మూడుసింహాల అశోకచక్రం గుర్తులుండేవి. గుండ్రటి అర్థరూపాయి మాత్రం 1960లో మొదటి సారి విడుదలయింది. ఈ నాణేలు విడుదలయిన తరువాత చాలా కాలం వరకు పాత అణాల లెక్కకు, కొత్త దశాంశపద్ధతికీ గందరగోళం ఉండేది. పావలా అంటే నాలుగణాలు (చవ్వానా, చారానా). అణా ఆరుపైసలే కాబట్టి, లెక్క ప్రకారం ఇరవై నాలుగుపైసలే. ఆ ఒక్కపైసా సర్దుబాటులో కరిగిపోయింది.

1957లో ముద్రించిన మొదటి పావలా నాణెం పూర్తిగా నికెల్‌తో చేశారు. 19 మిల్లీమీటర్ల వ్యాసంతో, రెండున్నర గ్రాముల బరువుండిన ఆ నాణెంపై రూపాయిలో నాలుగోభాగం అని కూడా రాసి ఉండేది. 1971లో ముద్రించిన పావలా నాణెం రాగి-నికెల్ మిశ్రమంతో చేశారు. ఆ సంవత్సరపు పావలా నాణేనికి ఇప్పటి సేకర్తల మార్కెట్‌లో వేలాది రూపాయల రేటు పలుకుతుంది. మొన్నమొన్నటి దాకా చెలామణీలో ఉన్న చిక్కిపోయిన పావలా 2.83 గ్రాముల బరువైన స్టెయిన్‌స్టీల్ నాణెం. పావలా విలువను నాణెం తయారీ ఖర్చు మించిపోయినందున మార్కెట్‌నుంచి ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. నాణెం లోహవిలువ కంటె, చెలామణీ విలువ అధికంగా ఉండడమే చారిత్రకంగా జరుగుతూ వస్తోంది. నాణేలను కరిగించకుండా ఉండడానికి అది ఒక రక్షణ కూడా. పావలా విలువను లోహవిలువే అధిగమించడం కూడా ద్రవ్యోల్బణపు సంకేతమే అయినప్పటికీ, పావలా అంతర్ధానానికి కేవలం నాణెపు లోహం రేట్ల పెరుగుదల మాత్రమే కారణం కాదు. మొత్తంగా పెరుగుతూ ఉన్న ద్రవ్యోల్బణమే చిన్న నాణేల నిష్క్రమణకు మూలకారణం. మనదేశం గత అరవైఏళ్లలో సాధించిన అభివృద్ధి ఏ స్థాయిదైనా కావచ్చు, కానీ నాడు ప్రవేశపెట్టిన అయిదు నాణేలూ ఇప్పుడు చెల్లకుండా పోవడం మాత్రం నాణేనికి మరోవైపు ఉన్న వాస్తవికతను సూచిస్తుంది. రేటింగ్ ఏజెన్సీ 'క్రిసిల్' తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో ద్రవ్యోల్బణం మన ఆర్థిక వ్యవస్థకు చేసిన చేటును అంచనా వేసే ప్రయత్నం జరిగింది. గత మూడు సంవత్సరాల కాలంలో సరుకుల, సేవల కొనుగోళ్లు కుటుంబాలపై వేసిన అదనపు భారం 5లక్షల 80 వేల కోట్ల మేరకు ఉంటుందని క్రిసిల్ చెబుతోంది. ఇందులో సింహభాగం ఆహారకొనుగోళ్లపైనే కుటుంబాలు ఖర్చు చేయవలసి వచ్చిందట. ప్రజల కొనుగోలు శక్తిపై, కరెన్సీ విలువపై ద్రవ్యోల్బణం వేస్తున్న ప్రభావమేమిటో ఆ అధ్యయనం సూచిస్తున్నది.

పొదుపు అన్న భావనకు ఇప్పుడు విలువే లేకుండా పోయింది. ఖర్చు పెరిగితే, సర్దుకోవాలని కాక, అప్పు చేయాలని, అధికంగా సంపాదించాలని చూస్తున్నారు. వేతనాలు పెరుగుతున్నాయి నిజమే కానీ, అంతకు కొన్ని రెట్ల వేగంతో ధరలూ పెరుగుతున్నాయి. ముప్పయ్యేళ్ల కిందట హైదరాబాద్‌లో పావలాకు దొరికిన టీ, ఇప్పుడు ఆరురూపాయలు. ధర ఇరవైనాలుగు రెట్లు పెరిగినా, ఆదాయాలు మూడునాలుగు రెట్లకు మించి పెరగలేదు. చిల్లర శ్రీమహాలక్ష్మి అనుకునే కాలం పోయింది. ఇప్పుడన్నీ నోట్లు, ప్లాస్టిక్ మనీ. పావలా పోతే, విలపించేవారెవరూ లేరు, ఉంటే గింటే పేదల కుటుంబాలలోని పిల్లలు. పావలాకు ఒకటి, రూపాయికి నాలుగు వచ్చే తినుబండారాలేవో ఇంకా దొరుకుతూనే ఉన్నాయి. ఇక వాటిరేట్లు రెట్టింపవుతాయి. పావలా వడ్డీ రుణాల్లో పావలా అట్లాగే ఉంటుందా, రూపాయి అవుతుందా?

గణేశ్ పాత్రోకు పేరు తెచ్చిన నాటకం 'పావలా'. ఆ నాటకంలో నటించి ఒక నటి పావలా శ్యామల అయింది. రేపటి తరం వీక్షకులు పావలా అంటే ఏమిటని నిఘంటువులు వెదుకుతారు. పావలా కాసంత బొట్టు పెట్టుకున్నదని వర్ణించిన కథానాయికను ఊహించుకోలేక పాఠకులు తబ్బిబ్బు పడతారు. గతం లాగానే పావలా కూడా తియ్యదనం ఉన్న తియ్యటి ధనం.

No comments:

Post a Comment