Sunday, July 3, 2011

మావో తప్పులు

ఆర్థిక విధానాల విషయంలో మావో జెడాంగ్ చేసినవన్నీ తప్పులేనని చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) తాజాగా నిర్ధారణకు వచ్చింది. మావో విధానాలలో 70 శాతం ఒప్పులని, 30 శాతం తప్పులని మూడు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్న సిపిసి ఇప్పుడు ఆర్థిక రంగంలో మాత్రం నూటికి నూరుశాతం తప్పులేనని లెక్క మార్చింది. శుక్రవారం నాటికి చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 90 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ తాజా అవగాహనను పార్టీ చరిత్ర విభాగం బాధ్యులొకరు వెల్లడించారు. డెంగ్ సియావో పెంగ్ సంస్కరణల వల్లనే చైనాలో నేటి ప్రగతి సాధ్యపడిందని ఆయన ప్రకటించారు.

సిపిసి 90వ వార్షికోత్సవాల సందర్భంగా చైనా అంతటా వెలసిన బ్యానర్లలో, పోస్టర్లలో ఎక్కడో కానీ మావో చిత్రం కనిపించదు. ఎర్రజెండా, సుత్తీకొడవలి ఉంటాయి కానీ, ఇంతకాలం చైనాకు సంకేతంగా ఉన్న తియనాన్మెన్ స్వ్కేర్ కానీ, మావో సమాధిమందిరం కానీ ఏ ప్రచారసామగ్రిలోనూ లేవు. ఆకాశాన్నంటే భవనాలు, ఒలెంపిక్స్ సందర్భంగా నిర్మించిన సముదాయాలు చైనా ప్రగతికి సంకేతాలుగా చూపిస్తున్నారు. గంటకు రెండువందల మైళ్ల వేగంతో బీజింగ్-షాంఘై నగరాల మధ్య నడిచే బులెట్ ట్రెయిన్ జూన్ 30 నాడు ప్రారంభమైంది. ఈ రైలు గురించి ప్రపంచ మీడియా అంతా ముచ్చటగా రిపోర్టు చేసింది. ఈ మధ్యే చైనా సముద్ర జలాల మధ్య ప్రపంచంలోనే అతి పొడవైన వంతెనను నిర్మించి అమెరికా రికార్డును తిరగరాసింది. త్రీగోర్జెస్ ఆనకట్ట కానీ, ఒలంపిక్స్ నిర్వహించిన తీరు కానీ చైనా బృహత్ నిర్మాణశక్తిని, నిర్వహణాశక్తిని ప్రపంచానికి చాటే చిహ్నాలే. మావోను నమ్ముకుని ఉంటే ఈ అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని చైనా ప్రస్తుత నాయకత్వం గట్టిగా నమ్ముతోంది.

మావో 'భూతాన్ని' వదిలించుకోగలిగితే డెంగ్ ఎప్పుడో వదలించుకునేవారు. మావో నామరూపాలు లేకుండా చేసేవారు. సాంస్క­ృతిక విప్లవం కాలంలో పెట్టుబడిదారీ మార్గీయుడిగా ఆరోపితుడై శ్రమశిబిరాలలో కాలం
గడపవలసి వచ్చిన డెంగ్, మావో చివరిరోజుల్లోనే తిరిగి పార్టీలో ప్రముఖస్థానంలోకి వచ్చారు. మావో చనిపోయిన వెంటనే కొంతకాలం మధ్యేమార్గీయులకు అధికారం దక్కింది. నాలుగైదేళ్లలోనే డెంగ్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టారు. సాంస్క­ృతిక విప్లవ రెడ్‌గార్డులు ఆయన మీద చేసిన ఆరోపణ కేవలం ఆరోపణ కాదని, వాస్తవమని డెంగే స్వయంగా నిరూపించారు.
పార్టీని గుప్పిట్లో పెట్టుకుని, క్రమంగా పరిపాలనలో, సామాజిక విలువల్లో కొత్త విలువలను ప్రవేశపెట్టారు. సోషలిజం జపాన్ని విడవకుండానే, మావో ప్రవేశపెట్టిన సాముదాయికత, సమష్టి తత్వం, సామాజికీకరణ విధానాలకు మంగళం పాడారు. పిల్లి తెల్లదైతేనేం, నల్లదైతేనేం, ఎలకలను పట్టడడమే ముఖ్యం- అన్నది డెంగ్ సుప్రసిద్ధ సూక్తి. గమ్యంగా సోషలిజాన్ని పేర్కొంటూనే, అందుకు పెట్టుబడిదారీ సాధనాలను వినియోగించడానికి ఆయన పూనుకున్నారు. అయితే, మావో మీద చైనా సమాజంలో ముఖ్యంగా గ్రామీణసమాజంలో ఉన్న ప్రేమాభిమానాలు అచంచలమైనవి కావడంతో, ఆయనను పూర్తిగా నిరాకరించే సాహసం డెంగ్ చేయలేకపోయారు.

1966లో సాంస్క­ృతిక విప్లవ కాలం దాకా ఆయనను నూటికి నూరుపాళ్లు అంగీకరించవచ్చునని (1950ల చివరలో మావో అమలుజరిపిన పెద్ద ముందంజ కార్యక్రమంపై కూడా కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ) చెబుతూ, ఫ్యూడల్ వ్యవస్థ నుంచి, విదేశీ ఆక్రమణనుంచి విముక్తి చేసిన మహానుభావుడిగా మావోను పరిగణించాలని సిపిసి 1980ల ప్రారంభంలో ఒక అంచనా విడుదల చేసింది. వర్తమానం నుంచి మావోను విముక్తం చేసి ఒక చారిత్రక వ్యక్తిగా, నవచైనా జాతిపితగా గుర్తించే ధోరణి అప్పటినుంచి మొదలయింది.సాంస్క­ృతిక విప్లవ కాలంలో మావో వ్యక్తి ఆరాధన పెరిగిపోయిందని, ఆ విప్లవ విమర్శకులు చెబుతారు. అం దులో వాస్తవం లేకపోలేదు. మావో ఆలోచనలను అధ్యయనం చేయడంతో పాటు, ఆయనను వ్యక్తిగా పూజించడం, దోషరహితుడిగా భావించడం చేసేవారు. ఆ ధోరణిని విమర్శించిన డెం గ్, మావోను విగ్రహమాత్రుడిగా మార్చివేశారు. ఆయన ఆలోచనలతో నిమిత్తం లేకుండా, మావోను ప్రేమించే తరాలను తయారుచేశారు. కరెన్సీ నోట్లమీద, రోడ్ల పక్కన, కీచైన్లపై, సిగరెట్ లైటర్లపై- ఇందుగలడందులేడని సందేహం లేకుండా మావో బొమ్మలను దేశమంతా నింపివేశారు. దీని వల్ల రెండు ప్రయోజనాలున్నాయని డెంగ్‌కు, ఆయన వారసులకు తెలు సు.

ఒకటి మావో నుంచి ఆయన సిద్ధాంతాలను వేరుచేయవచ్చు. రెండు- ప్రపంచంలో ఒక ప్రాబల్య ఆర్థిక, రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్న చైనాకు ఒక జాతీయ చిహ్నం కావాలి, ఉత్తేజపరిచే ప్రతీక కావాలి. ఎంత కష్టపడినా డెంగ్‌కు ఆ స్థాయి రాదు. మావోయే గతి. మావో చనిపోయి, ఆయన విధానాలు పార్టీలో పరాజితం అయ్యాక- చైనాలో నిట్టనిలువు ప్రగతి చాలానే కనిపిస్తున్నది కానీ, అవలక్షణాలు అంతకు కొన్నిరెట్లు అధికంగా వ్యాపించా యి. పార్టీలో, ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిపోయింది. భిక్షాటన, జీవనం కోసం వ్యభిచా రం, దొంగతనాలు, హత్యలు- అన్నిటికి మించి ఆర్థిక అసమానతలు భయంకరంగా పెరిగిపోయాయి. కమ్యూనిస్టు ఆశయాలను దారితప్పించినప్పటికీ, డెంగ్ కమ్యూనిస్టు నియంతృత్వాన్ని మాత్రం వదులుకోలేదు. దేశ భవితవ్యాన్ని పూర్తిగా వ్యతిరేకదిశకు మరల్చడానికి అదే నియంతృత్వాన్ని, యంత్రాంగాన్ని వాడుకున్నారు. పాత వ్యవస్థ నుంచి పరిణామాన్ని నెమ్మదిగా, సజావుగా నిర్వహించడానికి అనువుగా- గ్రామీణ ప్రాంతాలలో పాత సోషలిస్టు అవశేషాలు ఇంకా కనిపిస్తాయి. అసంఖ్యాకంగా ఉన్న మానవ వనరులను ఉపయోగించుకుని ప్రపంచానికి చవుక శ్రామికులను అందిస్తూ, జాతీయాదాయాన్ని పెంచుకుంటున్నది నేటి చైనా. అగ్ర, సంపన్న రాజ్యాలకు ఆసక్తి లేని చిన్న చిన్న దేశాల మార్కెట్‌లో ప్రవేశించి లాభాలను గడిస్తున్నది. ప్రపంచీకరణ విధానాలను లాభసాటిగా మలచుకున్నది నేటి చైనా. అమెరికాకు కూడా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది ఈ చైనా. 'మంచైనా చెడైనా అది జనచైనా' అని శ్రీశ్రీ అన్నారు కానీ, ఇప్పటి చైనా జనచైనా కాదు. నిప్పులు కక్కుకుంటూ నింగికెగస్తున్న డ్రాగన్ చైనా.

మావోయే కాదు, ఏ నాయకుడైనా ప్రజారంగంలో ఉన్నప్పుడు తప్పులు చేయకుండా ఎట్లా ఉంటాడు? ఇంటా బయటా మావో చాలా తప్పటడుగులే వేశాడు. టిబెటన్ల స్వయం నిర్ణయాధికార హక్కును తిరస్కరించాడు. సాధారణ దేశాధినేత వలె సరిహద్దు గొడవపై భారత్‌తో యుద్ధానికి దిగాడు. చేగువేరా ప్రేరణతో జరిగిన జనతావిముక్తి పెరుమన ఉద్యమాన్ని అణచివేయడానికి శ్రీలంక ప్రభుత్వానికి ఆయుధాలిచ్చాడు. అంతర్గతంగా కూడా ఆయన అంచనాలు అనేక సందర్భాలలో తప్పయ్యాయి. ప్రజాతంత్ర విప్లవం విజయవంతమైన వెంటనే సమయం ఇవ్వకుండా సోషలిజానికి పరుగులు పెట్టాలని ఆయన తొందరపడ్డారు. లీషావ్‌చీ, డెంగ్ వంటి వారి శక్తిని తక్కువ అంచనా వేశారు. అనేక సైద్ధాంతిక విషయా ల్లో, వ్యక్తిగత నడవడిక అంశాల్లో అతి గొప్ప సంస్కారాన్ని ప్రకటించిన మావో తనకు తెలియకుండానే వ్యక్తిపూజలోకి జారిపోయారు. తానూ కమ్యూనిజమూ పర్యాయపదాలని తానే స్వయంగా నమ్మడం మొదలుపెట్టారు. అయినప్పటికీ, మావో ప్రపంచ విప్లవనేతగా, గొప్ప ఆలోచనాపరుడిగా కొనసాగుతున్నారు.

ప్రపంచంలో అనేక దేశాల్లో మావోయిస్టులు ప్రజాజీవితాల్లో విప్లవాత్మకమైన మార్పుకోసం పోరాటాలు చేస్తున్నారు. పాశ్చాత్య ప్రపంచం చేసే దుష్ప్రచారం ఏమైనప్పటికీ, మావో రచనలను, ఆలోచనలను ప్రపంచమంతా విద్యార్థులు, ఉద్యమకారులు అధ్యయనం చేస్తున్నారు. చనిపోయి ముప్పై అయిదు సంవత్సరాలైనప్పటికీ, ఇప్పటికీ ఆయన ఆలోచనలు నిప్పును రాజేస్తూనే ఉన్నాయి. భారత్ కాదనుకున్నా గౌతమబుద్ధుడు తక్కిన ప్రపంచంలో వెలిగినట్టే, చైనా కాదనుకున్నా మావో మిగులుతాడేమో?1 comment:

  1. శ్రీనివాస్ గారూ,
    మావో తప్పులు శీర్షికతో మీరు రాసిన సంపాదకీయం జన చైనా నుంచి అభివృద్ధి చైనా గా మారిన ఒక దేశపు తాజా రాజకీయ ఆర్ధిక పరిణామాలని సరళంగా అర్ధం చేయించింది. అభినందనలు.

    ReplyDelete