Thursday, July 14, 2011

అడుగే పడలేదు, అప్పుడే అధికార వాగ్దానాలు!!

సాధారణంగా జరిగే సంగతి చూద్దాము. కొత్త రాజకీయపార్టీ అవసరమున్నదని, ఆ అవసరాన్ని తాము తీర్చగలుగుతామని భావించిన కొందరు వ్యక్తులో, కొన్ని బృం దాలో కలసి పార్టీ అవతరణకు కావలసిన సన్నాహాలను ప్రారంభిస్తారు. రాజకీయ రంగంలో అప్పటికే ఉన్నవారిలోను, కొత్తగా రాజకీయాల్లోకి రాదలచుకున్న రాగలిగిన వారిలోను తమ సన్నాహాల గురించి, ఆశయాల గురించి ప్రచారం చేస్తూ బలాన్ని కూడగట్టుకుంటారు. పార్టీ స్థాయిని, పరిధిని బట్టి, తగిన సంఖ్య వచ్చిన తరువాత అందరూ కలసి ఒక విధానచట్రాన్ని రూపొందించుకుంటారు. ఒక అవతరణసభనో, మహాసభనో, ప్లీనరీయో పెట్టుకుని ఆ పార్టీ రూపురేఖలను, విధివిధానాలను, వైఖరులను ఆవిష్కరిస్తారు. వాటి ఆధారంగా రాజకీయపార్టీ వివిధ సందర్భాలలో తన స్పందనలను ప్రకటిస్తుంది. ఎన్నికలు సమీపించినప్పుడు, ఆ విధివిధానాల ఆధారంగా రూపొందించుకునే లక్ష్యాలను, చేసే వాగ్దానాలను, ఇచ్చే హామీలను ఓటర్ల ముందుకు తీసుకువెడతారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం చూస్తే, ఎన్నికలు రేపో ఎల్లుండో వస్తున్నాయేమోనని భ్రమపడే అవకాశం ఉన్నది. పార్టీ విధానాలు ఏమిటో చెబుతారని ఆసక్తిగా చూసినవారికి ఆయన ఎన్నికల మేనిఫెస్టోను అందించారు. తెలంగాణ గురించి తన పార్టీ వైఖరిని స్పష్టతతో చెప్పలేకపోయారు కానీ, తను అధికారంలోకి వస్తే ఎన్ని కిలోల సబ్సిడీ బియ్యం ఇస్తారో, 108, 104లకు తోడు కొత్తగా ప్రారంభించే సంచార సేవావాహనాల నెంబర్లేమిటో, వృద్ధాప్యపింఛన్లు ఎంత పెంచుతారో,
కనీసం 35 మంది ఎంపీలతో పార్లమెంటుకు వెడితే కేంద్రంలో ఏ మంత్రిత్వశాఖను కోరబోయేదీ - అన్నీ వివరాలతో సహా చెప్పగలిగారు.
పార్టీ ప్లీనరీలో ఏమి చేయాలో, ఏఏ అంశాలపై విధానాలను ప్రకటించాలో జగన్‌కే కాదు, ఆయన సలహాదారులకు, అనుయాయులకు కూడా తెలిసినట్టు లేదు. మతతత్వశక్తులకు దూరంగా ఉంటామని తప్ప స్థూలమైన సైద్ధాంతిక వైఖరి ఏ ఒక్క విషయంలోనూ జగన్ ప్రకటించలేకపోయారు.

ఎందువల్లనంటే, జగన్ పార్టీ అనేక ఇతర పార్టీల వలె ఏర్పడినది కాదు. వైఎస్ఆర్ ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ దూరమైనందువల్ల తాము కొత్త పార్టీగా అవతరిస్తున్నామని జగన్‌వర్గం చెబుతున్నప్పటికీ, సుమారు రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనించినవారికి ఆ కారణం అర్ధసత్యమని అర్థమవుతూనే ఉన్నది. రాజశేఖరరెడ్డి హఠాన్మరణం తరువాత, రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠానికి తానే సహజమైన వారసుడినని భావించిన జగన్, అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైన తరువాత వేరుకుంపటి ప్రారంభించారు.
ఆయన చుట్టూ సమీకృతులైనవారి వెనుక ఒక ప్రత్యేకమైన సైద్ధాంతిక ధోరణి ఏదీ లేదు. వైఎస్ తమను రాజకీయంగా ఆదరించారు కాబట్టి, ఆయన మీద విధేయతరీత్యా, వైఎస్ కుటుంబంతో ముడిపడిన వారి ప్రయోజనాల రీత్యా జగన్ వెంట నడుస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తరతరాలుగా ప్రాంతీయ నాయకత్వం విషయంలో అనుసరిస్తున్న వైఖరిని ధిక్కరిస్తూ స్వతంత్రమార్గాన్ని ఎంచుకుంటున్నాడనే ఆరాధనాభావం కూడా కొందరు జగన్ అనుయాయులలో ఉండవచ్చు. కానీ, కాంగ్రెస్ కంటె ఏ రకంగా జగన్‌పార్టీ భిన్నమైనది అన్నప్రశ్నకు, విధానపరమైన సమాధానమేదీ లభించదు.

వైఎస్ ఆశయాల సాధనే తమ పార్టీ లక్ష్యమని జగన్ చెబుతున్నారు. పేదరిక నిర్మూలన విషయంలో వైఎస్ మార్గమే తమకు శిరోధార్యమని ఆయన అంటున్నారు. ప్రతిఇంటిలోనూ పెద్ద చదువులు చదివినవారు ఒకరైనా ఉంటే అది ఆ కుటుంబానికి ఆర్థికసాధికారత ఇస్తుందని, ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం ఎకరం పొలం ఉంటే అది కనీస జీవన భద్రత కల్పిస్తుందని వైఎస్ నమ్మారని, అదే తమ పార్టీ అవగాహన అని జగన్ చెప్పారు. పేదరికం ఎందుకు ఇంత తీవ్రంగా ఉన్నది, ప్రభుత్వాలు ఇప్పుడు అనుసరిస్తున్న అభివృద్ధి విధానం ఏ మేరకు సమంజసమైనది, వ్యవసాయానికి ఆదరణ పెంచడానికి, పారిశ్రామికాభివృద్ధికి అనుసరించవలసిన వ్యూహమేమిటి, అవినీతిపై వైఖరి ఏమిటి, కొన్ని కనీస అంతర్జాతీయ వ్యవహారాలపై స్థూల దృక్పథమేమిటి - ఇటువంటి అంశాలను వివరించడానికి జగన్ ప్రయత్నమేదీ చేయలేదు.

జగన్‌కు సొంత సైద్ధాంతిక చట్రమేదీ లేకపోవడానికి కారణం - ఆయన తండ్రికి కూడా సొంత రాజకీయార్థిక విధానమేదీ లేకపోవడమే. కాంగ్రెస్ విధానాలు కాక, వైఎస్‌కు మరేవో విధానాలున్నాయని అనడానికి ఆధారమేదీ లేదు. తన సొంత నాయకత్వ లక్షణాల వల్ల కానీ, కలసివచ్చిన కాలం వల్ల కానీ వైఎస్ కొన్ని ప్రత్యేకతలను సాధించారు. 2004 ఎన్నికలకు ముందు కఠిన పరిశ్రమతో కూడిన రాజకీయ ప్రచార కార్యక్రమాలను వైఎస్ చేపట్టారు. అప్పటికి తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకాంశాలను ఆధారం చేసుకుని వైఎస్ రాజకీయవ్యూహం ఉండింది. కేంద్రంలో సైతం చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉండిన కాంగ్రెస్, తన బలహీనత వల్ల కానీ, ఎట్లాగైనా విజయం సాధించాలన్న తాపత్రయం వల్ల కానీ వైఎస్‌కు స్వతంత్రం ఇచ్చింది. ఫలితంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాటి ప్రతిపక్ష రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి మించి వైఎస్ ముద్రే గాఢంగా కనిపించింది. ఢిల్లీలో యుపిఎ అధికారం సాధించినప్పటికీ, అది సంకీర్ణ ప్రభుత్వమే కావడంతో, వైఎస్ బలం కొనసాగుతూ వచ్చింది. ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం - అన్న రెండు కార్యక్రమాలూ చంద్రబాబు పాలనపై ఉన్న వ్యతిరేకత నుంచి రూపొందినవే తప్ప ఏదో ఒక సిద్ధాంతం నుంచి పుట్టినవి కావు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీని, పార్టీపై ప్రభుత్వంపై తన సొంత పట్టును స్థిరపరచుకోవడానికి వైఎస్ విశ్వప్రయత్నం చేశారు. రెండో దఫా కూడా అధికారం సాధించాలన్న దూరదృష్టితో మొదటి హయాం మధ్యనుంచి సంక్షేమ పథకాలను, ఓటర్లకు లబ్ధిచేసే పథకాలను విరివిగా వైఎస్ ప్రారంభించారు. ఇవాళ జగన్ కొనసాగిస్తానని చెబుతున్న వైఎస్ పథకాలన్నీ 2009 ఎన్నికల కోసం రూపకల్పన చేసిన జనాకర్షక పథకాలే. నూతన ఆర్థిక విధానాల ఉధృతిలో, వాటిని పవిత్ర సిద్ధాంతాలుగా విశ్వసించి, ప్రజలకు అప్రియమైన మాటలు చెప్పడానికి, వారిపై కఠినంగా వ్యవహరించడానికి కూడా సంకోచించని తరహా నాయకత్వం చంద్రబాబునాయుడిది అయితే, చంద్రబాబు వంటి వారిపై వ్యక్తమయ్యే వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని కొత్త మార్గంలో సంస్కరణలు అమలుజరిపే కోవ వైఎస్‌ది. జనాకర్షణ, రైతు బాంధవుడన్న ముద్ర ఆసరా చేసుకుని వైఎస్ తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. అన్ని రకాల ప్రత్యర్థులను అణచివేశారు. ప్రజారంగంలో పనిచేసే సంస్థలను దిగ్బంధం చేశారు, లేదంటే తనవైపు తిప్పుకున్నారు. ఈ వ్యూహంలో సొంత రాజకీయ ప్రయోజనాలతో పాటు, వర్తమాన సంస్కరణ విధానాల పరిరక్షణ కూడా ఇమిడి ఉన్నది. వైఎస్ హయాంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల పందేరాలు భారీ ఎత్తున జరిగాయి. సామాన్య ప్రజల ప్రయోజనాలకు భిన్నమైన రీతిలో పారిశ్రామికులకు లబ్ధి జరిగింది. సంస్కరణ విధానాలను అనువుగా చేసుకుని వైఎస్ అస్మదీయులకు పెద్ద ఎత్తున లాభం కలిగేరీతిలో వ్యవహరించారని, వారిలో జగన్ అతిపెద్ద లబ్ధిదారుడని కాంగ్రెస్‌వారే విమర్శిస్తున్నారు.

ఆశ్రిత పెట్టుబడిదారీ విధానమని చెబుతున్న పద్ధతిలో ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుని, దాని సహాయంతో రాజకీయాధికారం కోసం తీవ్రయత్నం చేస్తున్న జగన్ వంటి ఉదాహరణ గతంలో మరొకటి లేదు. అటువంటి మూలాలు కలిగిన పార్టీ తమ ఉనికికి మూలకారణమైన విధానాలను విమర్శించగలుగుతుందా? పేదలను మరింత పేదలుగా, నిర్వాసితులుగా చేసే విధానాలను అమలుచేస్తూ, సాంప్రదాయికంగా ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రజాసేవలను ప్రైవేటుపరం చేస్తూ, కంటితుడుపుగా వ్యక్తిగత లబ్ధి కలిగించే సంక్షేమ పథకాలను అనుసరించే విధానమే జగన్‌ది. వైఎస్ నాడు ప్రారంభించిన అనేక పథకాలు అమలు చేయలేక రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యామ్నాయాలను, సవరణలను ఆశ్రయిస్తోంది. ఇప్పుడు జగన్ ప్రకటించిన పథకాలు ఆచరణసాధ్యం కాకపోగా, దీర్ఘకాలికంగా ప్రజలకు మేలుచేయగలిగేవి కూడా కాదు.

ప్రపంచవ్యాప్తంగా ప్రపంచబ్యాంకు రుద్దుతున్న నగదు బదిలీ పథకాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పోటీలుపడి పార్టీలు ప్రకటించిన వరాలు - వీటికీ జగన్ చెప్పినవాటికీ తేడాఏమీలేదు. పేదరికం పోవాలంటే ప్రభుత్వాల విధానాలు ఆ దిశగా ఉండాలి. ప్రజల వాస్తవ ఆదాయాలు పెరగాలి, వనరులపై ప్రజలకు యాజమాన్యం ఉండాలి, సమాజ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉత్పత్తులు, మార్కెటింగ్‌లు జరగాలి, విద్య ఆరోగ్య రంగాలను సామాజిక పెట్టుబడులుగా భావించి ఉచితంగా అందించాలి. సామాజికంగా బాధితులుగా ఉన్న వర్గాలకు ప్రాధాన్యవివక్ష ద్వారా అదనపు సహాయాన్ని, ప్రోత్సాహాలను అందించాలి- అప్పుడు మాత్రమే ప్రజలు ఎవరి భిక్షమీదా ఆధారపడకుండా ముందడుగు వేయగలుగుతారు.

వైఎస్ కార్యక్రమాల్లోని ఒక పార్శ్వాన్ని మాత్రమే ప్రస్తావించి, వాటిని అనుసరిస్తామని జగన్ చెప్పారు. రెండో పార్శ్వం సంగతి ఆయన చెప్పనేలేదు. తాను నడచివచ్చిన మార్గాన్ని మరింత అభివృద్ధిపరచడానికే ఆయన ప్రయత్నమంతా.

2 comments:

  1. దేశాన్ని ఎలా దోచుకుందామా అని ఆలోచించే పార్టిలు యొక్క విధివిధానాలు ఇలాగే ఉంటాయి.
    అంతకంటే ఎక్కువ ఆశించడం అత్యాశ అవుతుందెమో......

    ReplyDelete
  2. ఆర్థిక వనరులు వృద్ధి చెయ్యకుండా ఎన్ని వాగ్దానాలు చేసినా పనులు జరగవని తండ్రి పేరు చెప్పుకుని అధికారంలోకొచ్చిన ఆ యువ నాయకునికి తెలియదు. అన్నీ ఫ్రీగా ఇవ్వాలంటే జగన్ దొంగ నోట్లు ప్రింట్ చేస్తాడా?

    ReplyDelete