Monday, July 25, 2011

ఇంకిన క్రొన్నెత్తురు.. తెగిపోయిన విపంచికలు..

అనగనగా ఒక రాజ్యంలో వరుస కరువులు వచ్చాయట. గ్రీష్మం తప్ప మరో రుతువు లేకుండా పోయిందట. బీటలు పడ్డ నేలలు, మోడులయిన చెట్లు, ఎండిపోయిన చెలిమలు - జీవితం దుర్భరంగా మారిపోయిందట.

అప్పుడొక సాధువు వచ్చి రాజుగారికి చెప్పాడట, 'మీ రాజ్యంలోనే ఉన్న వరుణ పర్వతంపై కొండకొమ్ము మీద ఒక వర్షదేవత ప్రతిమ ఉన్నది. ఆ దేవతకు పూజలు చేస్తే కరువులు పోతాయి. కాకపోతే, ఆ కొండ చాలా పెద్దది, వేలకొద్దీ మెట్లు ఎక్కి పోవాలి. కాళ్లూచేతులూ బాగున్నవాళ్లంతా వచ్చే పున్నమి రోజున వెళ్లి పూజలు చేయండి, ఫలితం ఉంటుంది' అని.

రాజుగారు చాటింపు వేశారు. ఆ పర్వతం చుట్టుపక్కల ఊళ్లవాళ్లంతా ఉత్సాహపడిపోయారు. పున్నమి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. తీరా ఆ రోజు రాగానే, వేల కొద్దీ జనం బారులుతీరి కొండదిశగా నడవసాగారు. అందరిలోనూ పట్టుదల కనిపిస్తోంది, నిష్ఠ కనిపిస్తోంది. వడివడిగా నడుస్తున్నారు.

ఆ జనంలో కలవకుండా, ఒక పిల్లవాడు మాత్రం విడిగా పరుగుతీస్తున్నాడు. అతని చేతిలో ఒక గొడుగున్నది.

ఒక పెద్దాయన అడిగాడూ - ఓరి పిల్లవాడా, ఎండ దంచికొడుతున్నది కదా, పైన చూస్తే ఒక మబ్బుతునకే లేదు కదా, చినుకుచుక్క రాలి ఏళ్లు గడిచాయి కదా, గొడుగెందుకురా తీసుకువస్తున్నావు? ఎవరిచేతిలోనన్నా చూశావా గొడుగుండడం?

అప్పుడు పిల్లవాడన్నాడూ - పెద్దాయనా, మనం ఇప్పుడు ఎందుకు వెడుతున్నాము? వర్షదేవతకు పూజచేస్తాము కదా, కన్నీటితో ఆ దేవతకు అభిషేకం చేస్తాము కదా, ఇంతమంది ప్రార్థనలను ఆమె ఆలకిస్తుంది కదా, మరి కొండ దిగేటప్పుడు వాన రాదా, అప్పుడు నేను తడిసిపోనా? అందుకే తెచ్చాను గొడుగు.

ఆ పెద్దాయన నవ్వాడు. వెంటనే ఆలోచనలో పడ్డాడు. పనిచేయడానికి పట్టుదలా నిష్ఠా
మాత్రమేకాదు కదా, నెరవేరుతుందన్న విశ్వాసం ఉండాలి కదా, గొడుగు తెచ్చిన పిల్లవాడికి తప్ప ఇంతమందిలో ఏ ఒక్కరికీ విశ్వాసం లేదే? - అనుకున్నాడు.

***

దేన్నైనా సాధించడానికి ప్రయత్నం జరిగినప్పుడు, లక్ష్యశుద్ధి చిత్తశుద్ధి ఉండి, గమ్యాన్ని చేరుకోగలమనే విశ్వాసం ఉన్నవారు తక్కువ మందే కనిపిస్తారు, పైన కథలో పిల్లవాని వలె. అధికులు ఏదో ఒక గొర్రెదాటు తత్వంతోనో, అర్థమనస్కంగానో, నామమాత్రంగానో ఆ ప్రయత్నంలో పాలుపంచుకుంటారు. ఎవరిలోనైనా అసాధారణ స్థాయిలో నమ్మకం కనిపించినప్పుడు సాటివారి నుంచి హేళన కూడా ఎదురవుతుంది. తెలంగాణ ఉద్యమం విషయంలో పరిస్థితి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అతి కొద్దిమంది, అదీ నాయకత్వ స్థానాలలో ఉన్నవారు అతిప్రయత్నం మీద సమష్టి ఆచరణలో పాలుగొంటున్నట్టు కనిపిస్తారు. విజయం అందుతుందా లేదా అన్న దాని విషయంలో వారి మాటలు ఎట్లాగున్నప్పటికీ, మనసు మాత్రం డోలాయమానంగా ఉంటుంది, అపనమ్మకంతో కునారిల్లుతుంటుంది. వచ్చినా రాకపోయినా సరే, ప్రయాణం సాగితే చాలు అన్న నిర్లిప్తత కనిపిస్తుంది, అంతిమ లక్ష్యం వచ్చేలోపు అందుకోవలసిన తాత్కాలిక ఫలితాల వైపు వారి అంతరంగం ప్రలోభపడుతూ ఉంటుంది. వీరి గొంతు పెద్దది కావచ్చు కానీ, సంఖ్య మాత్రం అతి తక్కువ. సాధించి తీరాలని, సాధించి తీరతామని మేరమీరిన నమ్మకంతో వెలిగిపోయే వాళ్లు, పై కథలో పిల్లవాని వంటి వారు, మాత్రం పెద్దసంఖ్యలో ఉంటారు. వీరికి గొంతు చిన్నది కానీ, సంఖ్య పెద్దది. వారికి వ్యూహాలు తెలియవు, ఎత్తుగడలు తెలియవు. ఆశయాన్ని గుండెలకు బలంగా దట్టించుకోవడం ఒక్కటే తెలుసు. చిన్న విజయం దొరికినా సంబరపడడం, వైఫల్యం ఎదురయితే గుండె పగలడం, ప్రయత్నలోపం లేకుండా కష్టపడడం - ఇవే వారికి తెలుసును. కుట్రలు ఎదురయినా, అప్రియమైన మాట వినిపించినా, తామనుకున్న న్యాయం నెగ్గదని అనిపించినా వారిని నిస్ప­ృహ కమ్మివేస్తుంది. వారికి ధైర్యం ఇవ్వదగ్గ నైతికబలం వారి నేతలకే ఉండదు.

ఆశను ఇవ్వగలిగిన శక్తి ఏ ఓదార్పుకూ ఉండదు. ఉద్యమ ఉద్విగ్నత నే స్వభావంగా మలచుకున్న వారు, ఒక ఆశాభంగానికి అల్లలాడిపోతారు. కోట్లమంది నడిచే ఉద్యమ పథంలో అనాథగా ఒంటరిగా కుమిలిపోతారు. దహించివేస్తున్న నైరాశ్యంలో కాలిబూడిదవుతారు, ఉరిపోసుకుంటారు, కడివెడు దుఃఖాన్ని మిగులుస్తారు. శ్రీకాంతాచారి, యాదయ్య, వేణుగోపాలరెడ్డి.. ఇదే ఆ కోవ. వందలాదిమందితో కిక్కిరిసిపోయిన ఆ తోవలో ఇప్పుడు యాదిరెడ్డి. ఏ పేరేతైనేం, అది ఒక సర్వనామం మాత్రమే.

అతను ఢిల్లీకి పోయి ఎల్లిపాయ తెచ్చే బాపతు మనిషి కాదు. ఢిల్లీసుల్తాన్ పట్టుకుపోతాన్ - అనే యుగంధరుడి బాపతు. మంచి కబురు తెస్తానని గొడుగు పట్టుకుని దేశ రాజధానికి వెళ్లినవాడు. అతని ఉత్తరం పూర్తిగా చదవండి. అది మరణవాంగ్మూలం కాదు. తన ఆశయానికి రాసుకున్న ప్రేమలేఖ. విషాదాంత మహాకావ్యం. వర్తమాన రాజకీయాలకు నెత్తుటి వ్యాఖ్యానం. అతనే కోరుకున్నట్టు మరెవరూ ఆ బాటలో నడవకూడదు. మరెవరూ అంతటి ఆశాభంగంలో మరణించకూడదు. తెలుగు సమాజం, తెలంగాణ ఉద్యమం ఇకపై మరో యువదీపాన్ని పరాజితభావనలో ఆరిపోనివ్వకూడదు.

ఒక్క తెలంగాణ అనేమిటి, దేశమంతా క్రొన్నెత్తురు నిండిన ఆశాదూతలు అల్పాయుష్షులై పోతున్న మృత్యురుతువు ఏనాటినుంచో విస్తరించి ఉన్నది. స్వప్నించగల, సాధించగల, నిర్మించగల, నిర్వహించగల యువశక్తిని వ్యవస్థ చిదిమివేస్తూ వస్తున్నది. ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన రుజాగ్రస్తులను పాలకులుగా, విధాన నిర్ణేతలుగా, సారధులుగా ప్రతిష్ఠిస్తూ వస్తున్నది. కడవళ్ల కెత్తినా, గంగాళాలకెత్తినా సరిపోనంతటి నెత్తురు పారిపోయింది. కొందరు సాయుధులై మరణించారు. కొందరు నిరాయుధులై నిర్మూలనకు బలయ్యారు. ఇంకొందరు వ్యవస్థ పరుగుపందెంలో నెగ్గలేక జీవితం చాలించారు. అసంఖ్యాకులు, ఆత్మబలినే ఆయుధంగా చేసుకుని శేషప్రశ్నలు వదిలి వెళ్లారు. తెలంగాణలో అయితే అరవయ్యేళ్లనుంచి ఒకటే చావుల పంట. తెలంగాణ సాయుధపోరాటం, ఆ తరువాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ఆపైన నక్సలైట్ పోరాటం, తిరిగి తెలంగాణ పోరాటం, మధ్యలో వ్యవసాయ సంక్షోభం..

యాదిరెడ్డి వంటి యువకులకు ఉన్నంతగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం నాయకులకు ఉన్నట్టు కనిపించదు. ప్రజాప్రతినిధులను తమకు బాధ్యత వహించేటట్టు చేయడానికి యువకులు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. వైఖరులను చెప్పమని నిలదీస్తున్నారు. తమకు ప్రాతినిధ్యం వహించే నేతల నడవడిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకనాడు సకల సమస్యలకు వ్యవస్థను కూలదోయడమే పరిష్కారమనుకున్న నేలలో, ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్లమెంటు భవనం సమీపంలో ఉరివేసుకున్న యాదిరెడ్డి, ప్రజాస్వామ్య మహాసౌధంపైనే ప్రశ్న సంధించాడు. తెలంగాణ రానీ, రాకపోనీ కానీ - ఇక్కడి ప్రజల్లో పురివిప్పిన ప్రజాస్వామిక స్ఫూర్తి కొత్త రాజకీయ సన్నివేశాలను రచించి తీరుతుంది. బాహ్య ప్రత్యర్థుల సవాళ్లను, అంతర్గత వైరుధ్యాలను అర్థం చేసుకోవడం, అందుబాటులో ఉన్న అవకాశాలలో ప్రాధాన్యాలను గుర్తించడం, ఆవేశాన్ని సంయమనాన్ని మేళవించడం - ఇప్పటి ఉద్యమయువతలో కనిపిస్తున్న సుగుణాలు. ప్రజాఉద్యమాలు సమాజాన్ని ఎంతగా ఉన్నతీకరిస్తాయో నిరూపణ అవుతున్న సందర్భం ఇది. తమ శక్తి మీద, బాహ్య పరిస్థితుల మీద అవాస్తవికమైన అతి విశ్వాసాన్ని పెంచుకుని, ఆశాభంగాన్ని భరించలేని సున్నితస్థితిలో ఉండడమొక్కటే ఈ యువతరంలోని బలహీనత ఏమో?

నాయకులారా, దయచేసి, మీ వెంట నడుస్తున్న యువకులకు చెప్పండి. ముఖ్యంగా గొడుగులు పట్టుకుని వస్తున్న పిల్లవాండ్లకు, ఆశయాలను సీరియస్‌గా తీసుకుని అడుగులు వేస్తున్న సాధకులకు చెప్పండి, గమ్యం ఎంత దూరమో చెప్పండి. దూరమైతే, ఎట్లా సహనం చూపాలో, పట్టుదలను నమ్మకాన్ని ఎట్లా నిలుపుకోవాలో చెప్పండి. పోరాటం ఎందుకో ఎక్కడిదాకానో చెప్పండి. రాజీలు అవసరమైతే ఎందుకు అవసరమో నచ్చచెప్పండి. అంతే తప్ప, ఇదిగో విజయం అదిగో రాష్ట్రం అని ఆశలు పెట్టకండి.

మీ వ్యూహాలూ ద్రోహాలూ కాసేపు పక్కన పెట్టండి. శ్మశానంలో ఓట్ల వేటను ఆపండి. సకల సమస్యలకూ ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారం అన్న భ్రమలు పోషించకండి, అంతిమ విజయంలోగా సాధించవలసిన వాటిని సాధించనివ్వండి. ఉద్యమాన్ని మీరు తేలిక చేసుకోకండి, ఇతరులను తేలిక చేయనివ్వకండి. ఉత్తరకుమారుల వలె ప్రగల్భాలు పలకకండి. పోరాటకారులమని నమ్మించడానికి కృత్రిమ ఆవేశాలను నటించకండి.

2 comments:

  1. శ్రీనివాస్,

    కఠిన వాస్తవాలను ఎంతో సంయమనం తో కళ్ళు తెరిపించేలా రాశారు.

    ReplyDelete
  2. chaala analytical'gaa undi..

    ReplyDelete