Monday, August 1, 2011

గాలి ధనం ముందు సాగిలపడుతున్న రాజకీయం!


యడ్యూరప్పను చూస్తే ముచ్చటేస్తుంది. సౌమ్యుడిగా కనిపించే ఆయనకు ముడిఇనుము బాగా వంటబట్టినట్టుంది, కొత్త తరం కొత్త రకం ఉక్కుమనిషిగా తయారయ్యారు. లోకాయుక్త నివేదిక తరువాత, వాల్‌స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ దగ్గరనుంచి ప్రపంచంలోని పెద్ద పెద్ద పత్రికలన్నీ అవినీతి చక్రవర్తిగా ఆయన పేరును మారుమోగిస్తున్నాయి. ఇక దేశంలో అయితే చెప్పనక్కరలేదు, గాలి బ్రదర్స్ వ్యాపారాలకు ఆయన చేసిన సేవను చూసి జనం గుండెలు బాదుకుంటున్నారు. అయినా సరే, యడ్యూరప్ప ముఖం కించిత్తు కూడా చిన్నపోలేదు. సిగ్గుశరము మానం అభిమానం వంటి పదాలేవీ ఆయన నిఘంటువులో ఉన్నట్టు లేవు.

కిందపడ్డా పై చేయిగా ఉండాలని, ఎంత అప్రదిష్ట అయినా రూపాయి ముందు దిగదుడుపేనని ఆయనకు అధికారపీఠం పాఠం చెప్పినట్టుంది. దిగిపోను, పొమ్ముని బిజెపి పెద్దలను మొదట గద్దించారు, తరువాత దిగుతాను కానీ నా మనిషినే కూర్చోబెట్టాలి అని మారాము మొదలుపెట్టారు. ఎవరెవరిని ముఖ్యమంత్రులు చేయొచ్చో, ఎవరిని ఉపముఖ్యమంత్రి చేయాలో, మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం ఇవ్వాలో గడ్కారీకి డిక్టేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. శనివారం రాత్రి పొద్దుపోయింది, అయినా ఆయన అలకపాన్పు దిగలేదు. త ప్పు చేసింది ఎవరో, ఎవరు ఎవరిని శాసిస్తున్నారో పార్టీ పెద్దలకు అంతుచిక్కడం లేదు.

భారతీయ జనతాపార్టీ మీద జాలి కలుగుతోంది కానీ, ఆ పార్టీ చెప్పే పెద్ద పెద్ద మాటలు గుర్తుచేసుకుంటే నిజానికి కోపమే రావాలి. నైతిక విలువలు, వ్యక్తిత్వ నిర్మాణం, క్రమశిక్షణ వంటి సూక్తులు చాలా చెప్పే అలవాటున్న ఆ పార్టీ పెద్దలు ఇప్పుడు యడ్యూరప్ప ముందు, గాలి జనార్దనరెడ్డి గ్రూపు ముందు ఎందుకు సాగిలపడుతున్నది? ప్లీజ్, మా పరువు కాపాడండి, పదవినుంచి తప్పుకోండి అని ఎందుకు ప్రాధేయపడుతున్నది? ఒక్క కలం
పోటుతో యడ్యూరప్పను, గాలిముఠాను పార్టీ నుంచి ఎందుకు తొలగించలేకపోతున్నది? ఆ ధైర్యమే ఉంటే ఆ పార్టీకి ఎంతటి ప్రతిష్ఠ సమకూరేది? ఢిల్లీలో లోక్‌పాల్ ఉద్యమానికి ఇచ్చే మద్దతుకు ఎంతటి నైతికబలం లభించేది? మూడేళ్లలో వచ్చే సాధారణ ఎన్నికలకు ఒక స్ఫూర్తిదాయకమైన సన్నాహం ప్రారంభమయ్యేది? కానీ, ఆ పార్టీని ఎందుకో నీరసం ఆవహించి కాళ్లు బారజాపుకున్నది. బళ్లారి గనుల నుంచి, యడ్యూరప్ప సంపాదన నుంచి ఎంతో కొంత పార్టీ ఖర్చులకు ప్రవహించి ఉండకపోతే, ఈ మొహమాటం ఎందుకు?

గాలిబ్రదర్స్ బళ్లారిని ఒక సొంత సామ్రాజ్యం లాగా తయారుచేసుకున్నారని క ర్ణాటక లోకాయుక్త సంతోష్ హెగ్డే తన నివేదికలో వ్యాఖ్యానించారు. ఈ సామ్రాజ్యానికి బీజం ఎక్కడ పడింది? 1999లో బళ్లారి పార్లమెంటు స్థానానికి సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్ పోటీపడినప్పుడు పడింది. ఎన్నికల్లో సుష్మ ఓడిపోయినప్పటికీ, గాలి జనార్దనరెడ్డి కార్యకర్తృత్వం, సమర్థత ఆమెపై ప్రభావం వేసినట్టున్నాయి. అప్పటికింకా జనార్దనరెడ్డి గనిపనితనం మొదలు కాలేదు.
బిజెపి అగ్రనాయకత్వంతో అప్పుడు మొదలైన పరిచయం, కాలక్రమంలో ఆయనకు అండదండలుగా మారాయి. గనుల లీజులు లభించడం, ఆ సమయంలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి ఇనుముకు గిరాకీ బాగా పెరగడం, వనరుల పందేరానికి సంబంధించి దేశవ్యాప్తంగా విధానాలు సరళం కావడం జనార్దనరెడ్డికి బాగా కలసివచ్చాయి. ఆయనకు కలసిరావడమే, బిజెపికి కూడా మేలు చేసింది. దక్షిణభారతంలో మొదటి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి గాలిజనార్దనరెడ్డి అర్థబలం సహకారం సామాన్యమైనదేమీ కాదు. ఆ కృతజ్ఞత బిజెపి నాయకత్వం ముందరి కాళ్లకు బంధం వేస్తున్నట్టున్నది.

సంతోష్ హెగ్డే సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి. కర్ణాటక లోకాయుక్తగా ఎంత స్వతంత్రంగా, ఎంత ఖచ్చితంగా పనిచేయవచ్చునో చేసి చూపిస్తున్నవాడు. అవినీతి నిర్మూలనపై వ్యక్తిగతంగా కూడా పట్టింపు ఉన్నవాడు. జనలోక్‌పాల్ భావనకు అక్షరరూపం ఇచ్చినది కూడా ఆయనే. మూడున్నర దశాబ్దాల కిందట జనతా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన లోక్‌పాల్ ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణ రూపం తీసుకోలేదు కానీ, అప్పటి ప్రయత్నాలలో భాగంగా లోకాయుక్తలు మాత్రం ఏర్పాటయ్యాయి. అయితే, అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్తలు సమానాధికారాలతో లేవు. కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మాదిరి నామమాత్రపు ఉనికితో నెట్టుకొస్తుండగా, కర్ణాటక లోకాయుక్త పీఠం చొరవతో పనిచేస్తున్నది. అక్కడి లోకాయుక్తకు అధికారాలు, పరిధి కూడా ఎక్కువే. దేశంలో పౌరసమాజం డిమాండ్ చేస్తున్న లోక్‌పాల్ వ్యవస్థ ఉనికిలోకి వస్తే ఎంత సమర్థంగా పనిచేయవచ్చునో కర్ణాటక లోకాయుక్త తన కార్యాచరణ ద్వారా నిరూపిస్తున్నారు. అంటే, కర్ణాటక పరిణామాలు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితమైనవి కావనీ, వాటికి జాతీయస్థాయిలో కూడా ప్రాసంగికత ఉన్నదని అర్థం చేసుకోవాలి. అటువంటి లోకాయుక్తను ఉద్దేశించి గాలి జనార్దనరెడ్డి ఏమన్నారు? ఇరవైనాలుగు గంటల్లో సంతోష్ హెగ్డే గురించిన మసాలా సమాచారం ఏదో బయటి ప్రపంచానికి చెబుతానన్నారు. శుక్రవారం చేసిన ఆ ప్రతిజ్ఞను శనివారం నెరవేర్చుకోలేదు కానీ, స్వతంత్ర అవినీతి నిరోధక వ్యవస్థతో ధనరాజకీయవాదులు ఎట్లా వ్యవహరించబోతారో 'గాలి' సవాల్ సూచిస్తున్నది. ఒక పక్కన దేశమంతా అవినీతి రహిత రాజకీయ, పాలనా వ్యవస్థ కోసం ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అవినీతి కారణంగా కుప్పకూలిపోతున్న తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి నిస్సిగ్గుతనానికి నేతలు దిగజారుతారో కర్ణాటక చెబుతున్నది. కేవలం ప్రకటనలకే పరిమితమై అవినీతిపై పోరాటం చేసే పార్టీలు ఆచరణలోకి దిగవలసి వచ్చేసరికి ఎంతగా రాజీపడతారో కూడా బిజెపిని చూస్తే తెలుస్తుంది.

గనుల కుంభకోణానికి, 2జి స్కామ్‌కు పెద్ద తేడా ఏమీ లేదు. ఇనుపఖనిజంలాగానే, స్పెక్ట్రమ్ కూడా ఒక సహజవనరే. కాకపోతే, తవ్వినకొద్దీ గని తరిగిపోతుంది, నిర్ణీత కాలవ్యవధిలో ఎన్నిసార్లు వేలం వేసినా స్పెక్ట్రమ్ తరిగిపోదు. 2జి స్కామ్‌లో సైతం పాత, చవక రేట్లకు ఆపరేటర్లకు స్పెక్ట్రమ్ కట్టబెట్టారు. గనులూ అంతే, నామమాత్రపు ధరలకు లీజుకు ఇచ్చారు. ఒకటి ఢిల్లీ స్థాయిలో, మరొకటి బెంగళూరు స్థాయిలో జరిగినంత మాత్రాన ఒకటి పెద్దదీ ఒకటి చిన్నదీ కాదు.
2జి స్కామ్ గురించి గొంతు చించుకున్న బిజెపి, కర్ణాటక అవినీతిని తివాచీ కింద దాచిపెట్టలేదు. గాలిజనార్దనరెడ్డి ఘనత ఎక్కడున్నదంటే, చవకగా లభించిన ఇనుమును తవ్వుకోవడమే కాకుండా, లీజుకు ఇవ్వని నేలలను కూడా తవ్వడం, పక్కగనులకు కూడాకన్నం వేయడం, రకరకాల కంపెనీలు పెట్టి ఎగుమతిదారుడూ దిగుమతిదారుడూ తానే అయి పన్నులు ఎగ్గొట్టడం- ఒక్క నైపుణ్యంకాదు, రాష్ట్రంలో జగన్ కంపెనీల వ్యవహారం ఎట్లా ఉన్నదో గాలి కంపెనీల తీరూ అట్లాగే ఉంటుంది. ఆ రెండూ ఒకే తానులోని ముక్కలు కావడ మే ఇక్కడ చమత్కారం.

గాలి జనార్దనరెడ్డీ, వైఎస్ జగన్మోహనరెడ్డీ వేరువేరు రాజకీయమూలాల నుంచి వచ్చినప్పటికీ, వారి ఆర్థిక రాజకీయ విజృంభణలకు ఆస్కారం ఇచ్చినవి ఒకే వాతావరణం, ఒకే విధాన చట్రం. ఆ ఇద్దరి రాజకీయపార్టీలు కూడా, కనీసం అవినీతి విషయంలో, ఒకే చెట్టు కొమ్మలని అనిపించేది అందుకే. ఆలస్యం చేసినా కాంగ్రెస్ చివరకు జగన్‌ను వదిలించుకోగలిగింది. బిజెపి ఇంకా 'గాలి' ని వదలలేకపోతున్నది. ఆ ఇద్దరూ తమ వ్యక్తిగత ఆర్థిక బలాన్ని విపరీతంగా పెంచుకోగలగడానికీ, రాజకీయంగా జాతీయపార్టీలను కూడా ముప్పుతిప్పలు పెట్టగలగడానికీ- కాంగ్రెస్-బిజెపి జమిలిగా ఈ దేశంలో అమలుచేస్తూ వస్తున్న ఆర్థిక విధానాలే కారణం. కార్పొరేట్ ప్రపంచం తిమ్మిని బమ్మిని చేసి వ్యవస్థల కన్ను గప్పి 'అభివృద్ధి'ని సాధించడానికి కావలసిన సానుకూల వాతావరణం ఈ దేశంలో ఏర్పడి ఉన్నది. ఆ వాతావరణాన్ని అట్లాగే ఉంచి, వ్యక్తులను, కొన్ని సంస్థలను మాత్రమే నిరోధించడం సాధ్యమయ్యే పని కాదు. అపరిమిత లాభార్జనను ప్రోత్సహించే వ్యవస్థే అవినీతికి ప్రధాన ఇంధనం. ప్రజల సంపద అయిన సహజవనరులను కారుచవకకు కంపెనీలకు అప్పగిస్తే, ఆ బాధ్యతారాహిత్యం నుంచి పుట్టిన రాజకీయ, ఆర్థిక శక్తులు భస్మాసరులై మూలాలనే దహించివేస్తాయి.

అవినీతిపరులైనప్పటికీ, ఆర్థికంగా ఆవశ్యకమైన వ్యక్తుల విషయంలో రాజకీయపార్టీలు రాజీపడితే, ఇక అవినీతి నిర్మూలనకు ఆస్కారమెక్కడిది? లోక్‌పాల్ వ్యవస్థ అన్ని హంగులతో ఏర్పడితే మాత్రం, ఈ రాజకీయపార్టీల ద్వారా నియమితులయ్యే లోక్‌పాల్‌లు నిష్పక్షపాతంగా, నిర్భయంగా వ్యవహరించగలిగే వీలెక్కడిది? తీహార్ జైలులో మగ్గుతున్న రాజా, కనిమొళి- ఒక దృశ్యం. మరో దీక్షకు సన్నద్ధమవుతున్న అన్నాహజారే- మరో దృశ్యం. గాలి కూటమితో కలసి అధినాయకత్వాన్ని ఆటాడిస్తున్న యడ్యూరప్ప- ఇంకో దృశ్యం. మన దేశ వాస్తవికతను ఈ మూడు సన్నివేశాలూ ప్రతిఫలిస్తున్నాయి!

No comments:

Post a Comment