Monday, August 15, 2011

వలపోతలు కాదు, తెలుగు తలపోతలు కావాలి

ఈ మధ్యే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా పదవీవిరమణ చేసిన అరవిందరావులో పెద్దగా ప్రచారం కాని కోణం సంస్కృతాభిమానం. ఈ మధ్యే ఆయన సంస్కృతంలో పీహెచ్‌డీ తీసుకున్నారు కూడా. కొద్దిరోజుల కిందట ఒక చిన్న సమావే శంలో మాట్లాడుతూ ఆయన, మన రాష్ట్రంలో వేదపండితులు చాలా మంది ఉన్నారని అనుకుంటాము కానీ, వేదానికి అర్థం చెప్పగలిగినవారు కానీ, వ్యాఖ్యానించగలిగిన వారు కానీ వేళ్లమీద లెక్కించేంత మందే ఉన్నారని, కొన్ని రోజుల్లో వారు కూడా లేకుండా పోతారని బాధపడ్డారు. ఆ పరిస్థితిని నివారించడానికి ఆయన, మరికొందరు కలసి ఏవో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, ఫలితం పెద్దగా ఆశావహంగా ఉన్నట్టు కనిపించడం లేదు.

సంస్కృతం సరే, మన రాష్ట్రంలో కాకపోతే, మరో రాష్ట్రంలో, మరో దేశంలో దాన్ని నిశితంగా అధ్యయనం చేసినవారు, చేస్తున్నవారు ఉన్నారు. వైదిక వాఙ్మయానికి ధార్మికమైన పార్శ్వం ఉన్నందున, దాని పరిరక్షణకు నడుం కట్టగలిగినవారు తగినంతమంది ఉంటారు. కానీ, తెలుగు భాషాసాహిత్యాల సంగతి ఏమిటి? దాని భవిష్యత్తు ఏమిటి? కావ్యాలను ప్రబంధాలను ప్రతిపదార్థం తెలిసి బోధించగలిగినవారు, వ్యాఖ్యానించగలిగినవారు విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా లేనట్టేనని విశ్రాంతదశలో ఉండి తెలుగు సాహిత్యబోధన గురించి పట్టింపు ఉన్న పెద్దలు ఆందోళన చెందుతున్నారు. అందుబాటులో ఉన్న తెలుగు పౌరాణిక, కావ్య, ప్రబంధ వాఙ్మయానికి సజీవులుగా ఉన్న పండితుల ద్వారా సాధికారమైన వ్యాఖ్యలు, ప్రతిపదార్థాలు రాయించకపోతే, భవిష్యత్తు తరాలు నష్టపోతాయని వారు హెచ్చరిస్తున్నారు.

బోధించే గురువులు లేకపోవడమే కాదు, నేర్చుకునే శిష్యులు కూడా కరవవుతున్నారు. భాషాస్వరూపాన్ని నిర్ధారించుకోవడానికి పరామర్శ పండితులే కాదు, పరామర్శ గ్రంథాలు కూడా అందుబాటులో లేవు. ప్రామాణికమైన ఒక్క మహానిఘంటువు తెలుగుకు లేదు. తెలుగు మాధ్యమమే పాఠశాలలనుంచి నిష్క్రమిస్తున్న వేళ, అనేక శాస్త్ర సాంకేతిక అంశాలపై పదజాలం, పరిభాష తెలుగులో కొత్తగా రూపొందడమే ఆగిపోయింది. గతంలో రూపొందిన పరిభాష కూడా చెలామణీలో లేకుండా పోయింది. పౌరవ్యవహారాలకు సంబంధించి కూడా తెలుగును
ప్రామాణికంగా వాడడం గురించిన శిక్షణ ఏ స్థాయిలోనూ విద్యార్థులకు లభించడం లేదు. ఇక అధికార భాషగా తెలుగు వినియోగానికి పునాదులు ఎట్లా పడతాయి? పరభాషలనుంచి ఆదానమైన పదజాలాన్ని ఎంతమేరకు రచనల్లో వినియోగించవచ్చునో, సభ్యతకు సంబంధించిన సరిహద్దులేవో నిర్ణయించే వ్యవస్థలేవీ లేవు. తెలుగు భాషాసాహిత్యాలలో గట్టి పునాదులు వేసే ప్రాచ్య విద్యాసంస్థలన్నిటినీ ఒకదాని తరువాత ఒకటి మూసివేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు నాసిరకంగా ఉంటున్నాయి. చెప్పుకోదగ్గ పరిశోధనావ్యాసాలు ఈ మధ్యకాలంలో వచ్చినట్టు తెలియదు.

పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్నారని, తెలుగు పత్రికలు చదవడం కూడా రావడం లేదని, పరదేశాలకు వెళ్లినవాళ్లయితే, అక్కడే స్థిరపడిపోయి మాతృదేశాన్ని భాషను మరచిపోతున్నారని బాధపడేవారికి కొదవలేదు. తెలుగుభాషను రక్షించుకోవాలని అనుకోని వారెవరూ కనిపించరు. కానీ, అది జరిగేదెట్లా? పత్రికల్లో శీర్షికల్లో ఇంగ్లీషు వాడకం తగ్గిస్తే, టీవీ యాంకర్లు యాసను సవరించుకుంటే, వత్తులు పలికితే, బోర్డుల్లో తెలుగు తప్పుల్లేకుండా రాస్తే- తెలుగు ఉద్ధరణ జరిగిపోతుందా? ప్రస్తుతం వ్యాజ్యంలో పడిపోయింది కానీ, తెలుగును ప్రాచీనభాష చేస్తే మాత్రం, ఆ హోదాను సమర్థంగా వినియోగించుకోగల సంకల్పం, శక్తీ తెలుగువారికి ఉన్నాయా? అసలు తెలుగు ఆధునిక భాష కావాలా, విశిష్ట భాష కావాలా?- వేర్వేరు స్థాయిల్లో రెండూ కావాలా? ఎంతమందికి స్పష్టత ఉన్నది?

పదే పదే చెప్పుకున్న విషయమే కానీ, తమిళులకున్న భాషాభిమానంతో మనం పోలిక, పోటీ పెట్టుకోగూడదు. వారి భాషాజాతీయవాదం బలమైన పునాదులపై నిర్మితమైనది. అక్కడి హేతువాద ఉద్యమం, బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమం, ద్రావిడ ఉద్యమం-వేరువేరు కాదు. ఆర్యత్వాన్ని, వైదికాన్ని వ్యతిరేకించినవారు, ప్రాచీన తమిళ సంస్క­ృతిని సాహిత్యాన్ని మాత్రం అభిమానించారు. తమిళాన్ని ప్రేమించడం అంటే, తమిళులు తమను తాము ప్రేమించుకోవడం, తమ సమాజాన్ని ముందుకు నడిపించడానికి చేసే ప్రయత్నం. భాష అంటే కొన్ని అక్షరాలు, వాటితో నిర్మించే పదాలూ వాక్యాలూ కాదు. భాష అంటే దాన్ని మాట్లాడే ప్రజలు, దాన్ని మాట్లాడిన ప్రజల చరిత్ర, సంస్క­ృతి. రాజకీయమైన ఏకతకు భాష అవసరమైనప్పుడు, భాషావాదం కూడా రాజకీయ ఉద్యమమే అయింది.

తెలుగులో విద్యావకాశాల కోసం నిజాం ప్రభుత్వంతో పోరాడిన తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా తెలుగును వదిలి క్రమంగా ఆంగ్లమాధ్యమాన్ని స్వీకరిస్తున్నారు. నాడు, తెలుగు విద్య కోసం చేసిన పోరాటం, నిజాం పాలనపై తెలంగాణ ప్రజల రాజకీయ నిరసన. రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాలలో కూడా ప్రజలను ఎవరూ తెలుగు మాధ్యమాన్ని వదలమని నిర్బంధించలేదు. మన చేతిలో లేని అనేక పరిణామాలు ముంచుకువచ్చి, ప్రజలు తమ ప్రాధాన్యాలను మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మూలకారణాలను స్ప­ృశించకుండా, ఇప్పుడు చరిత్రను ఎట్లా తారుమారు చేయగలం?

తెలుగువారిలో అనైక్యతఉన్నదని, ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకోలేని అసూయాకార్పణ్యాలు ఉన్నాయని చెప్పుకోవడం మనకు అలవా టు. లోతుగా ఆలోచించి చేసే వ్యాఖ్య కాదు అది. కాకపోతే, తమిళులతో పోలిస్తే తెలుగుసమాజంలో కొన్ని ప్రతికూల పరిస్థితులున్నాయి. ప్రాంతాల వారీగా, కులా ల వారీగా అనేక మాండలికాలు తెలుగులో ఉన్నాయి. వాటి మధ్య స్నేహపూర్వకమైన సమన్వయం జరగలేదు. ప్రమాణభాషలో వివిధ ప్రాంతాల, వర్గాల ప్రత్యేక వాడుకలను చేర్చుకోలేదు. భాషాసాహిత్యాలను కొన్ని ఉన్నత సామాజిక వర్గాల ప్రత్యేక రంగాలుగా భావించి, ఇతరులు అందులోకి రాకుండా చేశారు.  ఇప్పుడు ఆ వర్గాల వారే అవకాశాలు రాగానే, సాహిత్యాన్నీ భాషనీ ఎడమకాలితో తన్ని డాలర్లను లెక్కబెట్టుకుంటున్నారు. ఇవాళ భాషను రక్షించవలసింది, వెనుకబడిన ప్రాం తాల వారూ కులాలవారూ మాత్రమే. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగుమాధ్యమంలో చదువుకుంటున్నది వాళ్లే, తొలిసారి అక్షరాలను ఆలింగనం చేసుకుని, తమ గుండెగోడుకు సాహిత్యవ్యక్తీకరణలు ఇస్తున్నది వాళ్లే. భవిష్యత్ రచయితల్లో అత్యధికులు వాళ్లే. కానీ, వాళ్లకు సంప్రదాయ తెలుగు సాహిత్యం పునాది తగినంత లభించడం లేదు. ఇంతకాలం అంచులకే ఉండిపోయిన సమాంతర సంప్రదాయసాహిత్యాన్ని వెలికి తీయడానికి కావలసిన ప్రేరణ, ప్రోత్సాహం కూడా వారికి దొరకడం లేదు.

తెలుగు సమాజం- తాము వ్యవహరించే భాషను ప్రజాస్వామ్యీకరించుకోవడం మొదటి కర్తవ్యం. ఆ తరువాత ఆధునిక అవసరాల రీత్యా, భాషను ఆధునీకరించుకోవడానికి, ప్రమాణీకరించుకోవడానికి ప్రయత్నాలు జరగాలి. తెలుగులోని అన్ని రకాల వ్యవహారాలనూ క్రోడీకరించి భాషస్వరూపాన్ని ఆవిష్కరించగలిగే మహానిఘంటువు నిర్మాణం పై ప్రయత్నాలకు ఆవశ్యకమైన ప్రాతిపదిక. నిఘంటు నిర్మాణం ఒకసారి, ఒకేసారి జరిగిపోయేది కాదు. అందుకు శాశ్వత పీఠం ఏర్పాటు కావాలి.   తెలుగులో శాస్త్ర వైజ్ఞానిక రంగాలకు చెందిన మౌలిక ఆలోచనలను వ్యక్తం చేయడానికి కావలసిన పరిభాషా నిర్మాణం జరగాలి. ఈ నిర్మాణంలో కేవలం పండితులను మాత్రమేకాక, వివిధ సామాజిక వర్గాలను భాగస్వాములను చేయాలి. తెలుగుకోసం ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయడమో, ప్రత్యేక నిధుల కేటాయింపులో - జరగవలసిందే. కానీ, దాని కంటె ముందు- తెలుగుకు వచ్చిన కష్టమేమిటో, దానికి నివారణ ఏమిటో శాస్త్రీయమైన మదింపు అవసరం. లేకపోతే, తెలుగుభాష తలపోతలు- సెలవులు వచ్చినప్పుడు జరుపుకునే సాంస్క­ృతిక కార్యక్రమాల్లాగా, అప్పుడప్పుడు కూర్చుని గుండెలు బాదుకునే తంతు లాగా మారిపోయే ప్రమాదం ఉన్నది.

No comments:

Post a Comment