Tuesday, August 23, 2011

అవినీతి సారాంశం అర్థమయిందా అన్నా !

రామ్‌లీలా మైదానంలోని గద్దెపై పలచటి పరుపు మీద తెల్లటి వస్త్రాలు, టోపీ ధరించి బాలీసులను ఆనుకుని బాసింపట్టు వేసి కూర్చున్న అన్నా హజారే ఒక వర్తమాన వాస్తవంగా మాత్రమే కాదు, చారిత్రక స్మ­ృతిగా కూడా కనిపిస్తున్నారు. ఆయనకు సమీపంలో కూర్చుని భజనలు చేస్తున్నట్టు నినాదాలు చేస్తున్నవారు, పాటలు పాడుతున్నవారు, మైదానం అంతా నిండి కోలాహలంగా కదలాడుతున్న వారు- ఏం జరుగుతున్నదక్కడ? మల్టీకలర్ హైడెఫినిషన్ డిజిటల్ యుగంలో, తెగిపోయిన, గీతలు పడి మాసిపోయిన బ్లాక్అండ్ వైట్ ఫిల్మ్ లాగా ఏమిటా దృశ్యం? ఇదంతా మన జ్ఞాపకంలో ఉన్నదే, ఎప్పుడో మనం వదిలివేసినదే, మనకు తెలియకుండానే మనం బెంగపడుతున్నదే, కాలనాళికలో కుంగిపోయి బలహీనంగా లీలగా వినిపించే సంగీతమే.

అన్నా చేస్తున్న ఉద్యమం ఎందుకు జరుగుతున్నదన్నది పక్కనబెడితే, అది సృష్టిస్తున్న చిహ్నాలు ఆసక్తికరమైనవి. సంపద వృద్ధినీ, నిట్టనిలువు అభివృద్ధినీ, నలువరసల మహారహదారులనీ, సర్వవ్యాప్తమై పోయిన శ్వేతవస్తు సంచయాన్ని ఆరాధిస్తూ వస్తున్న సమాజానికి, స్ఫురద్రూపి కాని డాంబికాలు లేని, బక్కపలచని, వయసు మళ్లిన వ్యక్తి ఏ జ్ఞాపకాలను రగిలించి నేత కాగలుగుతున్నాడు? సకల రాజకీయ వేదికలపై సమస్త విలువలూ లుప్తమైపోయి, ఆధారపడడానికి ఏ ఆశా లేక ఆరాధించడానికి ఏ వ్యక్తీ దొరక్క నిరాశలో ఉన్న వారికి బహుశా అతను ఆలంబనగా కనిపించి ఉంటారు.

పుస్తకాలలో చదువుకుని, పెద్దల జ్ఞాపకాలలో తడుముకుని, సినిమాలలో ఉద్వేగపూరితంగా పునఃసృష్టించుకుని పులకించిపోయిన జాతీయోద్యమ దృశ్యాలను అక్కడ గుమిగూడినవారు అభినయిస్తున్నారా? లేక, అరబ్,
ఆఫ్రికన్ దేశాలలో వెల్లువెత్తిన మల్లెల విప్లవాలకు ఇక్కడ అంటుగడుతున్నామనుకుంటున్నారా? పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. అలాగని, కనిపిస్తున్నదాన్ని మాత్రమే నమ్మడం కష్టం. అన్నాహజారే ఉద్యమం ద్వారా జనం తమ జీవితాల్లోకి ఆదర్శవాదాన్ని తిరిగి తెచ్చుకుంటున్నారని యోగేంద్ర యాదవ్ అనే రాజకీయ విశ్లేషకుడు అన్నాడు. ఆ వ్యాఖ్యలో కొంత వాస్తవమూ ఉన్నది,  కొంత అతిశయోక్తీ ఉన్నది. సమాజంలో ఆదర్శాలు, విలువలు క్షీణించిపోయి ఉండవచ్చును కానీ, ఎక్కడా ఏ చిన్న బృందంలోనూ ఏ సమూహంలోనూ సంస్థలోనూ లేకుండా పోయాయనడం సరికాదు. ప్రధాన స్రవంతి రాజకీయాల గురించి, సామాజిక జీవనం గురించి మాట్లాడితే స్థూలంగా యోగేంద్ర వ్యాఖ్య నిజమే కావచ్చు. కానీ, ఆయన చెప్పిన జనం ఎవరు? సామాన్యజనం నిజంగా అన్నా హజారే ఆదర్శాన్ని, పోరాటాన్ని పట్టించుకుంటున్నారా, అసలు వారికి లోక్‌పాల్ వ్యవస్థ గురించి, అవినీతి నిరోధక యంత్రాంగం ఆవశ్యకత గురించి అవగాహన ఉన్నదా?

మధ్యతరగతి, విద్యాధిక వర్గాలు అధికంగా మమేకం అవుతున్న ఉద్యమం చాలా కాలం తరువాత వచ్చిందనవచ్చు. స్వాతంత్య్రోద్యమం అని మనం చెప్పుకుంటున్నదాంట్లో కూడా విశాల ప్రజానీకం పాలుపంచుకున్నదెంతో, మధ్యతరగతి ప్రజలు, వివిధ సంఘటిత శ్రేణులు పాల్గొన్నదెంతో సమీక్షించుకోవలసిందే. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన సంపూర్ణ విప్లవ ఉద్యమంలో రకరకాల సామాజిక శక్తులు వారి విడి విడి ఆకాంక్షలతో సహా పాలుపంచుకున్నందువల్ల ప్రజల పాత్ర విస్త­ృతంగా కనిపిస్తుంది తప్ప, నాటి ఆందోళనకు ప్రధాన చోదకశక్తులు మధ్యతరగతి విద్యాధిక వర్గమే. సంపూర్ణ విప్లవం, అత్యవసర పరిస్థితి తరువాత దేశంలోని మధ్యతరగతి విరాజకీయీకరణ పెరిగిపోయింది.

నూతన ఆర్థిక విధానాల తరువాత ఈ తరగతి ఆర్థికంగా పైపైకి ఎగబాకే తాపత్రయంలో పడిపోయింది. నైతికంగా దిగజారిపోయింది. వ్యవస్థాత్మకమైన అవినీతితో ఆ శ్రేణుల అనుబంధం గాఢమై పోయింది. ప్రయోజనాలను వదులుకోకుండానే, తమ అస్తిత్వాన్ని, నైతికతను నిలబెట్టగలిగిన ఆధారాల కోసం వారి అన్వేషణ మాత్రం మిగిలింది. డొల్ల దేశభక్తి, పదునులేని నిరసనరూపాలు, అమూర్తమైన అవినీతిమీద అసంబద్ధమైన వ్యతిరేకత- వారికి సరికొత్త నైతికతను సమకూర్చి పెట్టిన వైఖరులు. అన్నా హజారేకు జై కొడుతున్న కార్పొరేట్, సాఫ్ట్‌వేర్, ఫేస్‌బుక్ తరం కూడా ఈ అనివార్యత నుంచే ప్రవర్తిస్తోందా?

రాజకీయనాయకుల అవినీతి సరే. బ్లాక్‌మార్కెటీర్లను వెనుకేసుకురావడం దగ్గరనుంచి స్మగ్లర్లను పోషించడందాకా తొలితరాల రాజకీయనేతలు చేసి ఉండవచ్చు. ఇప్పటి నేతలువేరు. ఇప్పటి పరిస్థితులువేరు. ఇప్పటి అవకాశాలు వేరు. సమాజానికి, ప్రభుత్వానికి చెందిన వనరులను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు కట్టబెట్టగలిగే వెసులుబాటు ఇప్పటి పాలకులకు వచ్చింది. ప్రభుత్వమే గతంలో నిర్వహిస్తూ ఉండిన అనేక బాధ్యతలను, అభివృద్ధి పనులను ఇతరులకు అప్పగించగలిగిన విధానచట్రం అమలులోకి వచ్చింది. మంచిచెడ్డలన్నిటినీ మార్కెట్‌శక్తులే చూసుకుంటాయని, ప్రభుత్వం ఒక వేదికగా మాత్రమే పనిచేయాలనే వాదన చెలామణీలోకి వచ్చింది. నిబంధనలూ నియమాలూ నిర్బంధానికి గుర్తులనీ, నిర్నిబంధమైన స్వేచ్ఛే అభివృద్ధికి శ్రీరామరక్ష అనే సూక్తికి పట్టం దొరికింది. ఈ సరళీకృత, ఉదారవాద ఆర్థికరాజ్యంలో- నేతలు, పారిశ్రామికవేత్తలు, బ్రోకర్లు- మధ్యతరగతిలోకి ఎగువశ్రేణుల వారు పట్టపగ్గాల్లేకుండా విహరించారు. ప్రభుత్వ కంపెనీలు కారుచవకగా చేతులు మారిపోయాయి. స్టాక్‌మార్కెట్‌లో రంకెలేసిన ఆంబోతులు దండుకున్నంత దండుకుని చతికిలపడ్డాయి. ప్రభుత్వం చేతుల్లో ఉన్న భూములకు రెక్కలొచ్చాయి. ఔట్‌సోర్సింగ్ మనుషుల ఎగుమతిని, డబ్బుల దిగుమతిని పెంచింది. సాఫ్ట్‌వేర్ బూమ్, దేశంలోనే వాలిన బహుళజాతి కాల్‌సెంటర్లు సరికొత్త ఉద్యోగతరగతిని సృష్టించాయి. నీతి అవినీతుల నిర్వచనాలే మారిపోయాయి. డబ్బుకు కొత్త మారకం విలువ ఏర్పడింది.

జన లోక్‌పాల్ బిల్లు వస్తే ఏం చేస్తావు చెప్పు అన్నా హజారే? తప్పుచేసినవాడిని ఏం చేయాలో చెప్పే బిల్లు అది. తప్పు జరగకుండా ఏమి చేస్తావు చెప్పు? తప్పు ఎట్లా జరుగుతోందో చెప్పు? రాత్రికిరాత్రి సంపన్నులైనవారి సక్సెస్ స్టోరీలను పారాయణం చేసే తరానికి ఎట్లా నీతిని రంగరించిపోస్తావో చెప్పు. చేతుల మీదుగా జన ఖజానాలను అన్యాక్రాంతం చేయగలిగే అధికారం ఉన్నవాడు నోరుకట్టుకుని ఎట్లా ఉంటాడో చెప్పు. లోక్‌పాల్ ఒక బూటకపు బిల్లు నిజమే. అధినాయకుడిని మినహాయించే అస్త్రం కోరలు పీకిన ఆయుధం. పార్లమెంటును, న్యాయవ్యవస్థనీ మించిన హోదా కావలనుకోవడం తప్ప, జనలోక్‌పాల్ మెరుగైన చట్టమే. ఏదీ లేని చోట ఏదో ఒక వ్యవస్థ ఉండాలి. రాజకీయపోరులో భాగంగా అవతలిపక్షం అవినీతిని ఎండగట్టడానికైనా ఒక సాధనం కావాలి. నీ దీక్ష ఫలించి, ఆ చట్టం రానీ. ధర్మం కుంటిగానైనా ఒంటికాలితో నడవనీ.

ఇప్పుడు హజారే భూసేకరణ గురించి మాట్లాడబోతున్నారు. గ్రామసభ ఆమోదం లేకుండా అధికారిక భూకబ్జాలు సాగితే ఊరుకోమంటున్నారు. ఎన్నికల సంస్కరణల గురించీ మాట్లాడుతున్నారు. అమూర్తమైన అవినీతి నుంచి, మూలకారణాల వైపు చిన్నగానైనా అడుగులు వేస్తున్నారు. లంచాలు తిన్నా తినకపోయినా, ప్రతిఫలం అందుకున్నా అందుకోకపోయినా, కాకులను కొట్టి గద్దలకు పెట్టడం అవినీతే.   ఒక్కపైసా తినకపోయినా మన్‌మోహన్ అధిష్ఠించింది అవినీతి సింహాసనమే. కాసిని తిండిగింజలు, నెలకు కాస్త పింఛను ప్రజలకు విదిలించి, వ్యక్తిగతంగా లబ్ధి ఇచ్చే నాలుగు పథకాలు అందించి - జాతిసంపదను కొల్లగొట్టే రాజకీయ విధానమే పచ్చి అవినీతి. వాటి గురించి అన్నా మాట్లాడడం మొదలుపెడితే, కత్తులు ఝళిపించినంత ఉద్వేగంతో కొవ్వొత్తులు వెలిగించిన నడిమితరగతి ఆయన వెంట వస్తుందా?

అన్నాను స్వాతంత్య్ర సమరయోధుడని కూడా మీడియా అభివర్ణిస్తున్నది. పాపం 1947 నాటికి ఆయన పదిసంవత్సరాల బాలుడు. తాను గాంధేయవాదిని మాత్రమే అని ఆయన చెప్పినా సరే, ఆయనే గాంధీ అన్నట్టుగా అభిమానులు ఆకాశానికెత్తుతున్నారు. పోలిక ఎంత వరకు సమంజసమో పక్కన బెడదాం కానీ, ఇప్పుడు దేశరాజకీయ, సామాజిక పటం మీద ఒక గాంధీ అవసరం మాత్రం ఉన్నట్టుంది.  గాంధీ రాజకీయాల్లోకి నైతికతను ఒక అంశంగా తేవడమే కాదు, సమాజంలోని అన్ని రంగాలకూ ఏదో ఒక స్థాయి నైతికతను విధించారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే, రాజకీయనేతలను, ఉద్యోగవర్గాలను మాత్రమే కాక, అత్యాశాపరులైన కార్పొరేట్ ధనికస్వాములను కూడా అవినీతిపరులుగా పరిగణించేవారు. దేశాన్ని పరాధీనం చేస్తున్న విధానాలను కూడా దోషిగా నిలబెట్టేవారు.

 

3 comments:

 1. Good post.
  Some points are very thought provoking and well analysed.
  Specially the thoughts around middle class priorities in these days are so true.

  Thx
  Surabhi

  ReplyDelete
 2. ప్రైవేట్ వ్యక్తులు కూడా అవినీతి చెయ్యగలరు. మత సంస్థల అవినీతి గురించి కూడా అన్నా హజారే అజెండాలో లేదు. మా జిల్లాలో ఒక చర్చ్ పాస్టర్ మూడు వందల ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడు. భూములని ఆక్రమించుకోవడం రెవెన్యూ చట్టం ప్రకారం నేరం. భూములని ఆక్రమించుకోవడం జరిగితే ముందు రెవెన్యూ అధికారులకి కంప్లెయింట్ ఇవ్వాలి. రెవెన్యూ అధికారులు కేస్ నమోదు చెయ్యమంటే పోలీసులు కేస్ నమోదు చేస్తారు కానీ ఇందులో పోలీసులు డైరెక్ట్‌గా జోక్యం చేసుకోరు. ఆ చర్చ్ పాస్టర్ రెవెన్యూ అధికారులని మేపి భూములని అనుభవిస్తున్నాడు. ఇక సత్యసాయి ట్రస్ట్‌కైతే నిబంధనలకి విరుద్ధంగా ప్రభుత్వమే ఫ్రీగా భూమి దానం చేసింది. ప్రైవేట్ వ్యక్తులనీ, మత సంస్థలనీ లోక్‌పాల్ పరధిలోకి తేవాలి.

  ReplyDelete
 3. ఆలోచింపజేసే విషయం చెప్పారు. ధన్యవాదములు.

  ReplyDelete