Wednesday, August 31, 2011

ప్రభుత్వాలకు ప్రతీకారాలు ఉండవచ్చునా?

ఆ ముగ్గురిని ఉరితీస్తే తమిళనాడు దేశం నుంచి విడిపోతుందని ఎండీఎంకె నేత 'వైగో' గోపాలస్వామి అల్టిమేటమ్ జారీచేశారు. దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్‌ను ఉరితీసి, పంజాబ్ పాత గాయాలను రేపవద్దని అకాలీదళ్ ప్రకాశ్‌సింగ్ బాదల్ దగ్గరనుంచి కాంగ్రెస్ అమరీందర్‌సింగ్ దాకా కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. అఫ్జల్ గురును ఉరితీస్తే కాశ్మీర్ మళ్లీ అగ్నిగుండమవుతుందని పాక్ అనుకూల గిలానీ దగ్గరనుం చి మితవాది ఉమర్ ఫరూఖ్ దాకా హెచ్చరిస్తున్నారు. జార్ఖండ్ సాంస్క­ృతిక కార్యకర్త జితేన్ మరండీ, మరో ముగ్గురికి విధించిన మరణశిక్షకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం రూపుదిద్దుకుంటోంది. రాజీవ్ హత్యకేసులో మరణశిక్ష విధించిన ముగ్గురి క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి నిరాకరించారు, వారి ఉరి అమలు తేదీ కూడా ఖరారు అయింది. భుల్లార్ దయాభిక్ష పిటిషన్‌ను గత మేలోనే రాష్ట్రపతి తిరస్కరించారు. ఇంకా శిక్షతేదీ ఖాయం కాలేదు. అఫ్జల్‌గురును పిటిషన్‌ను తిరస్కరించాలని కేంద్రహోంశాఖ రాష్ట్రపతికి సిఫారసు చేసింది కానీ, రాష్ట్రపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జార్ఖండ్ శిక్షలు కిందికోర్టులో విధించినవి. వారికి సంబంధించిన న్యాయప్రక్రియ ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతుంది.

పైన పేర్కొన్న కేసులన్నీ రాజకీయాలతో ముడిపడి ఉన్నవేనని గుర్తించడానికి పెద్ద శ్రమ అవసరం లేదు. ఇంకా ఉనికిలో ఉన్నవో, అణగారిపోయినవో అయిన సాయుధ సంస్థలకు చెందిన నిందితులే ఇప్పుడు ఉరికంబం ముందు నిలుచున్న వారు. ఒక హత్యకేసులో నిందితుడిగా ఉండి, బెయిల్‌మీద బయటకు వెళ్లిన సమయంలో మరో హత్య చేసిన అస్సాం కు చెందిన ఎమ్.ఎన్.దాస్ అనే నిందితుడు ఒక్కడు మాత్రమే క్షమాభిక్ష దక్కక, శిక్షకు సమీపంగా ఉన్న సామాన్య నేరస్థుడు. తక్కిన వారంతా తీవ్రవాదులో, ఉగ్రవాదులో అని పేర్కొనేవారే. 'ఉగ్రవాదులకు ఉరి, తక్కినవారికి క్షమ' అన్నది కేంద్ర హోంమంత్రి చిదంబరం ఫార్ములా అని, దాని ప్రకారమే క్షమాభిక్ష సిఫార్సులపై రాష్ట్రపతికి సిఫార్సులు వెడుతున్నాయని పత్రికలు రాస్తున్నాయి. చిదంబరం హోంమంత్రి అయినప్పుడు మరణశిక్షలు ఖరారు అయిన వారు 53 మంది ఉండగా, అందులో 27 మందిపై అంతిమ నిర్ణయాలు
జరిగిపోయాయి. ఈ 27 మందిలో 22 మందికి మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు. ఆ ఇరవైరెండు మందీ సాధారణ పౌరులుగా వివిధ నేరాలకు పాల్పడ్డవారే. వారంతా కలసి 50 హత్యలకు పాల్పడ్డారు. హతులలో 15 మంది పిల్లలు.

నేరం అని రాజ్యం నిర్వచించిన చర్యలకు పాల్పడినవారిని అనాదిగా పాలకులు శిక్షిస్తూనే వచ్చారు. నేరాలన్నిటిలోకీ రాజద్రోహం, రాజ్యధిక్కారం క్షమార్హం కాని నేరాలుగా ప్రభుత్వాలు పరిగణిస్తూ వచ్చాయి. వ్యవస్థకు పునాదిగా ఉండే ధర్మాన్నో, నీతినో కాదన్న వారికీ తీవ్రశిక్షలే ఉండేవి. సంక్షేమం కంటె శిక్షే అధికారానికి గుర్తుగా చెలామణి అయ్యేది. కోటగుమ్మాలకు తలలు వేలాడదీయడాలు, కత్తివేటుతో శిరచ్ఛేదాలు, చర్మం వలిచి, శరీరాన్ని ఖండఖండాలు చేయడాలు, ఫిర ంగి గొట్టానికి కట్టి పేల్చివేయడాలు- నేరం తీవ్రతను కాక, పాలకుల క్రూరత్వాన్ని చూపేవి ఆనాటి మరణశిక్షలు. కానీ, కాలం మారింది.   ప్రజాస్వామ్యం ప్రపంచంలో పాదుకుంటున్న కొద్దీ, న్యాయాన్ని ఒక తటస్థవిలువగా తీర్చిదిద్దే ప్రయత్నాలూ సాగుతూ వచ్చాయి. విచారణ, ప్రామాణికమైన తీర్పులు, క్రౌర్యం పాలు తగ్గిన శిక్షలు ప్రవేశించాయి. న్యాయాన్ని ఒక మానవీయమైన ప్రక్రియగా భావించేట్టు సాగిన సంస్కరణలను ప్రభుత్వాలు అన్ని సందర్భాలలోనూ పాటించాయని కాదు.

నేరస్థుడిని కాదు, నేరాన్ని శిక్షించాలని, నేరాల మూలకారణాలు సమాజంలో లేకుండా చేయాలని చెప్పే ఉదారవాదం కూడా సమాజంలో క్రమంగా బలపడింది. వ్యక్తులకు పగ లు, ప్రతీకారాలు ఉండవచ్చును కానీ, ప్రభుత్వాలు రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలని, శిక్షలు విధిస్తే అవి సమాజం బాగు కోసం కావాలి తప్ప మరే కారణం కోసమూ కాగూడదని చె ప్పగలిగేవారూ పెరిగారు. నేరాలు అనివార్యమయ్యే పరిస్థితులు కల్పించిన పాలకులకు, ఎవరినైనా శిక్షించే అధికారమెక్కడిదన్న ప్రశ్నా తలెత్తింది. నేరం నిర్ధారణ అయ్యేవరకు నిందితుడికి సర్వహక్కులూ ఉండాలని, నేరాన్ని నిరూపించే బాధ్యత అభియోగం మోపినవారిమీదనే ఉంటుందని ఆధునిక న్యాయశాస్త్రం స్పష్టం చేసింది. అణచివేత లేకుండా అధికారాని కి హంగు సమకూరదని భావించే ఏలికలు, ఆ విలువలకు తూట్లు పొడిచారు, నల్లచట్టాలు తయారు చేశారు. సభ్యప్రపంచానికి భయపడి దొంగచాటు చట్టవ్యతిరేక శిక్షాస్మృతులను అమలుచేయసాగారు.

ఇంతటి మానవీయ ప్రస్థానం తరువాత కూడా ప్రపంచంలో చాలా దేశాలు మరణశిక్షను అనివార్యమైనదిగానే పరిగణిస్తున్నా యి. చాలా కొద్దిదేశాలు మాత్రం మరణశిక్షను తాము అమలుచేయకపోవడమే కాక, ఇతరులు అమలుచేయడానికి సహకా రం కూడా ఇవ్వడం లేదు. మరణశిక్షను చట్టంలో రాసుకున్న దేశాలన్నీ కూడా దాన్ని ఉత్సాహంగా, ఉధృతంగా అమలుచేయడం లేదు. అమెరికా, చైనా వంటి దేశాలు మరణశిక్షలను నిరంతరాయంగా కొనసాగిస్తూ ఉండగా, భారతదేశం అరుదుగా మాత్రమే అమలుచేస్తుంది. అయినంత మాత్రాన, భారత్‌లో అనధికార మరణశిక్షలు అమలుకావ డం లేదని అర్థం చేసుకోగూడదు. 2004 ఆగస్టు 14 వ తేదీన ధనుంజయ చటర్జీ అనే నిం దితుడిని కోల్‌కతాలో ఉరితీశారు. ఆ తరువాత ఈ ఏడు సంవత్సరాలకాలంలో మరో మరణశిక్ష ఏదీ అమలు కాలేదు. సెప్టెంబర్9 వతేదీన రాజీవ్ హత్యకేసులో నిందితులు ముగ్గురిని ఉరితీస్తే, అది తమిళనాడులో పదహారేళ్ల తరువాత అమలు జరిగిన శిక్ష అవుతుంది.

ఎంత అరుదుగా అమలుచేస్తున్నదయినా, ఎంతటి ఘోరనేరాలలో అయినా మరణశిక్షల విషయంలో ఇటీవలి దాకా మన సమాజం కారుణ్యదృష్టినే ఎక్కువ ప్రదర్శించింది. మరణశిక్ష అంటే ముందే బంధించి ఉంచిన ఖైదీని ఒక నిర్ణీత తేదీన ప్రభుత్వ యంత్రాంగం ద్వారా హతమార్చడం. అటువంటి ప్రక్రియ సామాన్యప్రజానీకంలో సైతం సంపూర్ణసమ్మతిని పొందలేదు. ఇక ఉదార ప్రజాస్వామిక సంస్థలు, హక్కుల ఉద్యమాలు మరణశిక్షను ఒక సూత్రబద్ధవైఖరితో వ్యతిరేకిస్తాయి. మరణశిక్షను వ్యతిరేకించడమంటే, ఎటువంటి నేరాలు చేసిన వ్యక్తి విషయంలో అయినా మరణశిక్షను వ్యతిరేకించడమే. నేరాలను బట్టి వైఖరుల్లో మార్పు ఉండదు. అలాగే, మరణశిక్షను వ్యతిరేకించడమంటే, అందుకు కారణమయిన నేరాన్ని సమర్థించడం కానీ, అందులో భాగస్వామి కావడం కానీ కాదు. నేరమూలాలను, వాటి నిరోధానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఆలోచనలు కలిగి ఉండడం.

పెరారివలన్, శంతన్, మురుగన్ - ఈ ముగ్గురికీ రాజీవ్‌గాంధీపై వ్యక్తిగతమైన వైరం ఏమీ లేదు. వారు ఆ నేరంలో నిజంగా భాగస్వాములయి ఉంటే, అందుకు కారణం వారు భాగస్థులైన ఎల్‌టీటీఈ ఉద్యమం. ఇప్పుడు ఆ ఉద్యమం లేదు, ఆ సంస్థ లేదు. రాజీవ్ హత్యకేసులో మొదటగా పేర్కొనగలిగిన ముద్దాయిలందరూ హతులయ్యారు. టైగర్ల ఉద్యమాన్ని శ్రీలంక ప్రభుత్వం తుడిచిపెట్టిన తీరుపై, అందుకు భారత్ సహకరించిన విధానం పై ఇప్పటికే తమిళులలో ఎంతో వేదన ఉన్నది. ఈ దశలో ఆ ముగ్గురిని ఉరితీయడం అవసరమా? నేరనిరోధానికి అది పనికివస్తుందా? సాంకేతిక ప్రతీకారం తప్ప మరో లక్ష్యమేమన్నా నెరవేరుతుందా? నేరమూలాన్నే పట్టించుకుంటే, టైగర్లను ప్రోత్సహించడం, వారిని అదుపుచేయాలనుకోవడం, శ్రీలంకపై దాడికి వెళ్లడం- వంటి అనాలోచిత చర్యలకు పాల్పడిన భారతప్రభుత్వాన్ని, దాని సారథులను రాజీవ్‌హత్యానేరం నుంచి మినహాయించగలమా? భుల్లార్ టెర్రరిస్టు చర్యలకు పాల్పడ్డమాట నిజమే. కానీ, పంజాబ్ టెర్రరిజం ఇప్పుడు సమసిపోయింది. పంజాబ్‌లో రక్తపాతానికి నాటి కేంద్రప్రభుత్వం అనుసరించిన సంకుచిత రాజకీయవ్యూహం కారణం కాదా? ఖలిస్థాన్ వాదాన్ని తుడిచిపెట్టడానికి అనుసరించిన అణచివేత పద్ధతుల సంగతేమిటి? ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పునే దృష్టిలో పెట్టుకుంటే కెపిఎస్ గిల్ మాత్రం బోనులో నిలబడనక్కరలేదా? ఢిల్లీ హింసాకాండకు సంబంధించి ఒక ఉరిశిక్షా ఎందుకు లేదు? ఇక అఫ్జల్‌గురు ఉదంతమయితే, ఒక ఉద్వేగపూరితమైన అంశంగా మారిపోయింది. ఒక మరణశిక్షను అమలుచేయమని రాజకీయపార్టీలు, సమాజంలో కొన్ని శ్రేణులు డిమాండ్ చేయడం అఫ్జల్‌గురు కేసుతోనే మొదలయింది. పార్లమెంటుపై దాడిలో నిజంగా అతని పాత్ర ఉన్నదా, ఉన్నా అంతగా ఉన్నదా?- అన్న ప్రశ్నలను పక్కనబెడదాం. శిక్ష న్యాయమైనదే అనుకుందాం. కాశ్మీర్‌తో ముడిపడిన ఆ శిక్షను అమలుచేయడానికి ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం వ్యవహరించడానికి ఎందుకు అనుమతించకూడదు? రవీంద్ర మహత్రే అనే దౌత్య ఉద్యోగిని జెకెఎల్ఎఫ్ తీవ్రవాదులు లండన్‌లో హతమార్చిన వెంటనే ప్రతీకార దృష్టితో మగ్బూల్ భట్ అనే ఆ సంస్థ నేతను ఉరితీయడమే కదా, కాశ్మీర్‌లో మరోసారి అగ్ని రాజేసింది? చర్చల ప్రక్రియో, శాంతి ప్రక్రియో ఎంతో కొంత సాగుతున్న తరుణంలో- అఫ్జల్ గురు విషయంలో కావలసింది విశాలమైన దృష్టీ, దీర్ఘకాలికమైన దృక్పథమూ కాదా?

కానీ, మరణశిక్షను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ఇప్పుడు కష్టతరమైపోయింది. ఎవరికి కావలసిన వారి గురించి వారే మాట్లాడుకోవాలి తప్ప, సాధారణమైన మానవీయ దృష్టి లోపిస్తున్నది. ఆ ముగ్గురి గురించి తమిళులు మాట్లాడతారు, అఫ్జల్ గురించి కాశ్మీరీలు, భుల్లార్ గురించి పంజాబీలు మాట్లాడతారు. ఒక విలువగా మరణశిక్షను వ్యతిరేకిస్తూ మాట్లాడే పరిస్థితులు మాత్రం లేవు. దొరికిన బందీలను తక్షణం హతమార్చాలని, విచారణ తతంగం లేకుండా ఉరితీయాలని కోరుకునే తత్వం ప్రజల్లో పెరిగింది. నాగరికతా ప్రయాణంలో, ప్రజాస్వామ్యప్రస్థానంలో సమకూర్చుకున్న న్యాయవిలువలనే కాదనుకునేధోరణి ఇది. అన్నిటికంటె ప్రమాదకరమైన పరిమాణం ఇది.

1 comment:

  1. "దొరికిన బందీలను తక్షణం హతమార్చాలని, విచారణ తతంగం లేకుండా ఉరితీయాలని కోరుకునే తత్వం ప్రజల్లో పెరిగింది."

    దీన్ని ఖండించవలసిందే అయినప్పటికీ. క్షమించేహక్కు బాధితులకే వుంటుంది. రాజీవ్‌గాంధీ హత్య విషయాన్నే పరిగణలోకితీసుకున్నట్లయితే చనిపోయింది రాజీవ్‌గాంధీ ఒక్కరేకాదు. ఆయన కొన్ని తెలివితక్కువ నిర్ణయాలు తీసుకున్నారనుకున్నా కేవలం ఆ ప్రాంతంలో వున్నందుకే అంతమంది చనిపోవడాన్ని ఎలా అర్ధంచేసుకోగలం? వాళ్ళు చనిపోవడం వల్ల నష్టపడిన కుంటుంబాల సంగతేమిటి? "విడిపోతాం" అని డిమాండుచేసినవాళ్ళు ఈ ముగ్గురు నేరస్తులకోసం మొత్తం తమిళులనే కష్టాల కుంపటిలోకి (What else can we think about Indian military??)) నెట్టడానికి తలపడుతున్నారంటే వాళ్ళెంత పరిణతి మనం అర్ధం కావటంలేదా? అసలు వాళ్ళు రాజద్రోహ నేరానికి అర్హులుకారా?

    ఈ ధనుంజయ చటర్జీ అనే మహానుభావుడు ఒక చిన్నపిలను(పన్నెండో పదమూడో ఏళ్ళపిల్ల) మానభంగంచేసి చంపేసినట్లుగా ఋజువయిందనుకుంటాను. ఇలాంటి అమానుషాన్ని క్షమించి వదిలేసుండవలసిందని ఎలా అనగలం? శాంతి చర్చలే ఒక పనికిమాలినపని అనుకుంటే ఇక అవి అవవుతున్నాయికాబట్టి అఫ్జల్ గురుని క్షమించాలా? ఆ క్షమాభిక్ష పిటీషనుకూడా ఆయనపెట్టుకున్నది కాదనీ, అఫ్జల్ గురు "తుచ్చమైన భారత ప్రభుత్వాన్ని" క్షమించమని అడగడానికి నిరాకరించాడనీ విన్నాను. శిక్షగా కాకపోయినా ఆయనంతటి అంతటి ధీరోదాత్తమైన నిర్ణయాన్ని తీసుకున్నాక మనం చెయ్యాలనుకున్నదో చేసి ఆయన లక్ష్య సాధనలో ఆమాత్రం సహాయపడకపోతే ఏంబాగుంటుంది చెప్పండి? :)

    ఈ సంఘటనలన్నింటిలోనూ మనం చూడగల "మానవీయ కోణము" ఎట్టిది? పోనీ క్షమించేద్దాం. ఇలాంటి నేరాలు పునరావృతంకావని ప్రభుత్వం హామీ ఇచ్చి నిలుపుకోగలదా? ప్రభుత్వాల ప్రాధమిక విధి శాంతిభద్రతల పరిరక్షణా లేక క్షమించడమా? ఒకవేళ క్షమించాలనుకున్నా ఇల్లాంటి డిమాండ్లకు తలొగ్గి క్షమించినట్లయితే అది ఏసంకేతాలు పంపించగలదు?

    ReplyDelete