Monday, September 12, 2011

ఆనాడు మూడు వేలు, ఆ తరువాత 20 లక్షలు!

జంట భవనాలు కూలిన మరుసటి రోజే సద్దామ్ హుస్సేన్ ఒక మాట అన్నాడు. "సెప్టెంబర్11, 2001 కంటె ముందు అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికా ఖండానికి ఆయుధాలతో వెళ్లినవారు పాశ్చాత్యులే. వాళ్లే అమెరికాను స్థాపించారు. ఆ తరువాత అమెరికాయే విధ్వంస ఆయుధాలను, మృత్యువును మోసుకుని అట్లాంటిక్‌ను దాటి ప్రపంచంపై దాడులు చేసింది''

జంటభవనాలు కూల్చిన ఏడాది తరువాత ఒసామా బిన్‌లాడెన్ అమెరికన్ ప్రజలకు రాసిన లేఖలో తాము దాడి ఎందుకు చేసిందీ సుదీర్ఘంగా వివరిస్తూ ఒక వ్యాఖ్య చేశాడు. 'మానవజాతి చరిత్రలోనే మీది అధ్వాన్నపు నాగరికత అని చెప్పడానికి చాలా విచారంగా ఉంది'. తాను చేస్తున్నది నాగరికతల యుద్ధమని లాడెన్‌కు తెలుసునా? అమెరికా ఆధ్వర్యంలో సాగుతున్న అభివృద్ధి, ప్రకృతివిధ్వంసాలను, ఆ దేశంలోని నైతికపతనాన్ని సామ్రాజ్యవాదమనే మాట కూడా వాడకుండా అతనెలా వర్ణించగలిగాడు?

సద్దామ్ హుస్సేన్ తన స్వగ్రామం తిక్రితిలో సమాధిలో శాశ్వత నిద్రలో ఉన్నాడు. ఒసామా బిన్‌లాడెన్ భౌతిక శరీరం అరేబియా సముద్రగర్భంలో గుర్తుతెలియని చోట జలసమాధి అయింది. మానవాళిపై జరిగిన అత్యంత ఘోరమైన అపచారంగా చెప్పుకుంటున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి జరిగి పదేళ్లు గడచిన నేటి రోజున
ఆ ఇద్దరు ప్రతినాయకులు ఈ లోకంలో లేరు. వారు లేని ప్రపంచం సురక్షితంగా ఉంటుందని చెప్పిన అమెరికా ఈ వార్షికోత్సవాన గడగడ వణుకుతూ తనను తాను దిగ్బంధించుకున్నది.

సెప్టెంబర్ 11కు జంటభవనాలనే ప్రతీకగా ఎంచుకుంటున్నాము కాని, ఆరోజు పెంటగాన్ మీద కూడా దాడి జరిగింది. అన్ని చోట్లా కలిపి మూడువేల మంది చనిపోయారు. ట్రేడ్ సెంటర్‌లో అయితే వివిధ దేశాలనుంచి ఉద్యోగవశాన వచ్చిన వారు, స్త్రీలు, పిల్లలు.. అందరూ అమాయకులే. అటువంటి మరణం విషాదకరం, ఆ దాడి దుర్మార్గం. వారందరి స్మ­ృతికీ ఏటేటా నివాళులర్పించవలసిందే. కానీ సద్దామ్ హుస్సేన్ అన్నాడు- అమెరికన్ ప్రజలారా, సెప్టెంబర్11 న ఏమి జరిగిందో దాన్ని మీ ప్రభుత్వమూ సైన్యాలూ ప్రపంచమంతా చేసినవాటితో ఒకసారి సరిపోల్చి చూడండి.

ఆ మాట చెప్పడానికి సద్దామ్ కావాలా, హృదయం సరిఅయిన చోట ఉన్నవారందరూ, కాసింత ఆలోచన మిగిలిన వారందరూ అదే మాట చెప్పారు, చెబుతున్నారు. వారిలో అసంఖ్యాకంగా అమెరికన్లూ ఉన్నారు. ఎవరి పాపసంచయం ఆ ఘాతుకానికి నేపథ్యం అయిందో, ఎవరి కార్యాలు ఆ నరమేధానికి కారణాలయ్యాయో చరిత్ర నిర్మొహమాటంగా చెబుతుంది. అయినా అబద్ధమే సగర్వంగా వర్తమానంపై రెపరెపలాడుతున్నది. కారణం లేని రణమట. అమెరికన్ స్వేచ్ఛను చూసి అసూయట, ప్రజాస్వామ్యంపై యుద్ధమట.

ప్రపంచానికే ప్రమాదమట. కానీ రాబర్ట్ ఫిస్క్ ఒప్పుకోడు. మధ్య ఆసియాలో అనేక యుద్ధాలను చూసిన జర్నలిస్టు అతను. చిన్న నేరం జరిగితే కారణమేమిటని అడుగుతారే, సెప్టెంబర్11కు కారణమేంటి అని అమెరికా ఎందుకు ప్రశ్నించుకోదు? అని ఆయన అమాయకంగా అడుగుతారు. కానీ, ప్రశ్న అమాయకమైనది కాదు. సెప్టెంబర్11కు మూలం పాలస్తీనాలో ఉన్నదన్న అప్రియమైన సమాధానాన్ని అమెరికా దాటవేస్తున్నదని అంటారు. సెప్టెంబర్11 నాటి అఘాయిత్యానికి ఆత్మాహుతిదళంగా పనిచేసిన పందొమ్మదిమందినీ ఏకం చేసినది పాలస్తీనాపై అమెరికా వైఖరే. పదేళ్ల తరువాత కూడా ఆ కారణాన్ని చూడడానికి ఇష్టపడని అమెరికా- తాజాగా పాలస్తీనాకు ఐక్యరాజ్యసమితి సభ్యత్వ ప్రతిపాదనను వీటో చేయాలని నిర్ణయించుకున్నది. అమెరికన్లను ప్రమాదంలో పడవేస్తున్నది ఎవరు?

ఒక్క మానవప్రాణానికే విలువ కట్టలేమంటే, మరి మూడువేల ప్రాణాలు? విలువైనవే. మూడువేలప్రాణాలంత విలువైనవి. కానీ, చరిత్ర సెప్టెంబర్11తో ఆగలేదు. ఈ దశాబ్దంలో అది రెండు మహాదురాక్రమణ యుద్ధాలను చూసింది. యుద్ధాన్ని సరిహద్దులకు అతీతంగా విస్తరించడం చూసింది. సామరస్యమే తెలిసిన దేశాలలో సైతం మానవబాంబులు, వరుసబాంబులు పేలడం చూసింది. టెర్రరిజంపై పోరాటం ప్రపంచ ప్రజలందరి సమస్యగా మారిపోయి, అమెరికాతో సహా దేశదేశాలలో ప్రజల హక్కులను హరించింది, చట్టవ్యతిరేక హత్యలను చేయించింది, వేలాది మందిని జైలుపాలు చేసింది. హిట్లర్‌కూడా సిగ్గుపడే రీతిలో ఒక గ్వాంటినామో బేను సృష్టించింది. మూడువేల మందికోసం వెలుగుతున్న కొవ్వొత్తుల కాంతులను అబద్ధాల చీకటిపై ప్రసరింపజేస్తే, గత దశాబ్దంలో జరిగిన ఇరవైలక్షల హత్యలు కనిపిస్తాయి.

జంటభవనాలు కూలిన నెలరోజులకు, లాడెన్‌ను ముల్లా ఉమర్‌ను అప్పగించడానికి నిరాకరించిన ఆప్ఘనిస్థాన్‌పై అమెరికా యుద్ధం ప్రకటించింది. పదేళ్లు గడిచాయి, లాడెన్ నిష్క్రమించాడు. అయినా యుద్ధం ముగియలేదు. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. టెర్రరిజంతో సంబంధముందని మొదట అభాండం మోపి, ఆ తరువాత జనహనన ఆయుధాలున్నాయని ఆరోపణ చేసి- ఇరాక్‌పై యుద్ధం ప్రకటించారు. బాంబుల వర్షం కురిసింది. అజ్ఞాతంలో ఉండి చిక్కిన సద్దామ్‌ను ఏదో విచారణ జరిపి ఉరితీశారు. కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పరచారు. ఆ దేశం చమురును ప్రపంచ మార్కెట్ సరుకు చేశారు. ఇంకా అక్కడ 'శాంతి' లేదు. వెనుదిరగాలంటే అమెరికాకు ఇంకా భయమే. పదిలక్షల కోట్ల డాలర్లు ఈ పదేళ్ల కాలంలో యుద్ధం కోసం ఖర్చుచేసిన అమెరికా తాను దివాలా తీసి ప్రపంచాన్నీ దివాలా తీయించింది. అమెరికాలోని మాంద్యానికి, ఇటీవలి చెల్లింపుల సంక్షోభానికీ, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతనం కావడానికీ ఈ యుద్ధాలే కారణం. బుష్ రెండు దఫాల పాలన పోయి, మార్పుజపంతో వచ్చిన బరాక్ ఒబామా పాలనలో కూడా మార్పు లేదు. పైగా, శత్రువధను వినోదకార్యక్రమంగా చూసే అలవాటు బుష్‌కు ఎన్నడూ లేదు.

ఏక ధ్రువ ప్రపంచమూ మార్కెట్ల గ్లోబలైజేషన్ ఒకేసారి అవతరించిన తరువాత, నూతన ప్రపంచ వ్యవస్థను నిర్మించడానికి అమెరికాకు ఒక శత్రువు కావలసి వచ్చింది. అందరూ శత్రువుగా భావించే శత్రువు కావలసివచ్చింది. ఆ శత్రువు భయంతో అందరూ తన పంచన చేరే వ్యూహం రూపొందించింది. ఆ వ్యూహానికి తెలిసో తెలియకో సహకరించే ఉగ్రవాదులున్నారో థర్డ్‌రీచ్ దహనం తరహాలో తానే ప్రత్యేక పరిస్థితిని సృష్టించుకున్నదో కానీ, అమెరికా టెర్రరిజంపై యుద్ధం ఒక సరికొత్త వలసవాద వాతావరణాన్ని సృష్టించింది. డాలర్‌కు సరిహద్దుల గొడవ మునుపే లేదు. ఇప్పుడు అమెరికన్ విమానాలకీ, ఎఫ్‌బిఐకీ దేశాల సార్వభౌమాధికారంతో పనిలేదు. ఏ దేశపు దోషినైనా బంధించగలరు. ఏదేశంలో అయినా అర్థరాత్రి వాలగలడు. ఎవరికైనా ఉగ్రవాద లింకులు అంటగట్టగలరు. ఒకే భయాన్ని అందరికీ పంచి, ఒకే అభయాన్ని అందరికీ అందించి లోకాన్ని పాలిస్తున్నది అగ్రరాజ్యం.

అమెరికాలో కూర్చుని కంప్యూటర్ మీట నొక్కితే, మానవరహిత విమానం గురిచూసి అవాంఛనీయవ్యక్తిని హతమార్చగలదు. ఆకాశం మీద పహారా కాసిన అమెరికన్ ఉపగ్రహాలు నడిరోడ్డున జనసమ్మర్దం మధ్య ఉన్న మనిషి బొమ్మను కూడా ప్రసారం చేయగలవు. చిటికె వేస్తే ఏ దేశంలో అయినా ఉన్నట్టుండి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలు పుట్టగలవు. తలచుకుంటే, ఏ నగరం నడిబొడ్డున అయినా ఒక బాంబు విస్ఫోటం చెందగలదు. ఏవి ఉగ్రవాదులు పేల్చినవో, ఏవి వ్యూహాత్మకంగా పేలినవో, ఏవి కట్టుదిట్టాల కోసం పథకం ప్రకారం అమర్చినవో చెప్పడం సాధ్యమే కాదు. ఎన్ని హాలివుడ్ సినిమాలు రాలేదు, మధ్య ఆసియాలో టెర్రిస్టులను తామే సృష్టించి తామే తెరవెనుక ఉండి ఆడించిన కథనాలు?

పదేళ్ల ప్రస్థానం తరువాత ఓడింది ఎవరు? గెలిచింది ఎవరు? ఎప్పుడంటే అప్పుడు ఏదో ఒక ఉద్యమానికి ఊతం ఇచ్చి, ఎప్పుడంటే అప్పుడు ఆ ఉద్యమాన్ని ఆర్పేయడం సాధ్యమా? సాధ్యం కాదని చెప్పడానికి భారతదేశంలోనే అనేక అనుభవాలున్నాయి. మనదేశం అనుభవం అట్లా ఉన్నప్పుడు అమెరికాకు మాత్రం భిన్నమైన అనుభవం ఎట్లా లభిస్తుంది? రష్యామీద కోపంతో తాలిబన్లను సాయుధం చేసిన అమెరికా, ఇప్పుడు చరిత్రను వెనక్కు తిప్పలేదు.
సాయం అందించడానికి నీకు ఏదో వ్యూహం ఉన్నట్టే, తీసుకున్నవారికీ ఏదో ఉంటుంది. మధ్య ఆసియాలో ఆర్థిక ప్రయోజనాలను, వనరులపై పెత్తనాన్ని, ప్రపంచవ్యాప్తంగా సమీకరించదలచుకున్న విధేయతను దృష్టిలో పెట్టుకుని టెర్రరిజం పోరాటాన్ని తీర్చిదిద్దిన అమెరికా, తన ఉచ్చులో తానే బిగుసుకున్నది. ఇంకా అగ్రరాజ్యమే కావచ్చు. కానీ, అప్పుల రాజ్యమే. ఇంకా మహారాక్షసే, కానీ కాళ్లు మట్టివే. యుద్ధం ఎడతెగదు. శవపేటికలు తిరిగి వస్తూనే ఉంటాయి. అతనెవరో అప్పుడెప్పుడో హెచ్చరించినట్టు "నువు తెరచిన తలుపు ఇది, ఇక ఎన్నిటికీ మూసుకోదు.''

2 comments:

  1. Sir, All perhaps true, but IMO, an inappropriate choice of timing to publish this piece.

    ReplyDelete
  2. @kotta Paali....sir.. I strongly feel that this is appropriate time...పుండు సలుపుతూ ఉన్నప్పుడే, అది 'పుండుగా సలిపేంత వరకూ దారి తీసిన పరిస్థితులని' గురించి ఆలోచిస్తాము...భూమ్మీద ఇన్ని విషాదాలు, ఇన్నేళ్ళుగా జరుగుతూ వున్నా [అందు లోనూ చాలా వాటికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా నే కారనమవుతూ వున్నా], ఒక్క అమెరికా 09 /11 విషాదమే 'విశ్వ విషాదం' ఎందుకు కావాలి?... నాకు ఆశ్చర్యం ఏమంటే, మన అవగాహన కాస్తో, కూస్తో పెరుగుతోందని భావిస్తోన్న 'సందర్భం' లో కూడా ఇది మీకు అసందర్భంగా అనిపించడం .....

    ReplyDelete