Tuesday, September 6, 2011

శ్రద్ధాంజలి

కొద్దికాలంగా అస్వస్థులుగా ఉండి, శుక్రవారం రాత్రి కన్నుమూసిన నండూరి రామమోహనరావు తెలుగు పాత్రికేయ, సాహిత్య, బౌద్ధిక రంగాలలో తనదైన గాఢముద్ర వేసిన బహుముఖప్రజ్ఞాశాలి. మృదుస్వభావిగా, ఆలోచనాపరుడిగా, సరళశైలిలో ఉన్నతమైన రచనలు చేసిన రచయితగా ఆయనను తెలుగుసమాజం చిరకాలం గుర్తుంచుకుంటుంది. ఆంధ్రజ్యోతి దినపత్రికకు సుమారు రెండు దశాబ్దాల పాటు సంపాదకుడిగా పనిచేసిన నండూరి, పత్రికకు సాహిత్య పరిమళాన్ని అద్దడమే కాకుండా, తన ప్రతిష్ఠతో వ్యక్తిత్వంతో గౌరవాన్ని సమకూర్చిపెట్టినవారు.

కొడవటిగంటి కుటుంబరావు సహాయకుడిగా ఆంధ్రపత్రిక వారపత్రికలో పనిచేయడం నండూరిలోని రచయితను మెరుగుపెట్టగా, నార్లవెంకటేశ్వరరావు సారథ్యంలో ఆంధ్రజ్యోతిలో ప్రారంభం నుంచి పనిచేయడం ఆయనలోని ఉత్తమ పాత్రికేయుడిని, సంపాదకుడిని తీర్చిదిద్దింది. చెన్నైలో ఆంధ్రపత్రికలో పనిచేస్తున్నప్పుడు ముళ్లపూడి వెంకటరమణ ఆయన సహోద్యోగి. మద్రాసులోని తెలుగు సాహితీదిగ్గజాలు శ్రీశ్రీ, ఆరుద్రలతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. మార్క్‌ట్వేన్ రచనలు రాజుపేద (ప్రిన్స్ అండ్ పాపర్), టామ్‌సాయర్ (టామ్‌సాయర్), టామ్‌సాయర్ ప్రపంచయాత్ర (టామ్‌సాయర్ అబ్రాడ్), హకల్‌బెరీ ఫిన్ (అడ్వెంచర్స్ ఆఫ్ హకల్ బెరీఫిన్), విచిత్రవ్యక్తి (మిష్టీరియస్ స్ట్రేంజర్) ఆ కాలంలోనే ఆయన తెలుగుచేసి ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. మార్క్‌ట్వేన్ రచనలే కాక, రాబర్ట్ లూయీ స్టీవెన్‌సన్ సుప్రసిద్ధ రచన 'ట్రెజర్ ఐలాండ్'ను 'కాంచన ద్వీపం'గా, ఏసోప్స్ ఫేబుల్స్‌ని 'కథాగేయ సుధానిధి' గా అనువదించారు. తెలుగు బాలసాహిత్యానికి నండూరి అందించిన అపురూపమైన
సేవ ఈ అనువాదాలు. సరళంగా, సున్నితంగా రాయగలగడం వల్లనే ఆ రచనలను పిల్లలకోసం చేయగలిగారా, లేదా వాటిని తెలుగు చేస్తున్న క్రమంలోనే ఆయనకు ఆ అద్భుతమైన శైలి అలవడిందా అని సందేహం కలుగుతుంది. బాపు రమణల స్నేహం కూడా ఆయనలోని తెలుగుని వెలిగించి ఉండాలి.

నండూరి రామమోహనరావు ఆధునికుడు. ఆలోచనల్లోను అభిరుచుల్లోనూ కూడా ఆయన పాతను తలకెత్తుకునే మనిషికాదు. శాస్త్రవిజ్ఞానం చేసిన ఆవిష్కరణలు ఒకవైపు, ప్రాచ్య పాశ్చాత్య తాత్వికత ఒకవైపు, 20 వ శతాబ్దపు నూతన సాహిత్య కళాసిద్ధాంతాలు మరోవైపు ఆయనను ప్రభావితం చేశాయి. సంప్రదాయాన్ని అధ్యయనం చేసిన వ్యుత్పత్తి, ఆధునిక సృజనాత్మకత ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. సామ్యవాద ఆదర్శాలు ఆయన ఒంటబట్టించుకున్నప్పటికీ, తక్కిన ఆలోచనల విషయంలో సహనం అలవరచుకున్నారు. ఉదారవాదం, మితభాషిత్వం ఆయన స్వభావాలు. కమ్యూనిస్టుదేశాల్లో రచయితలపై, అభిప్రాయస్వేచ్ఛపై నిర్బంధాలు అసంతృప్తికి గురిచేశాయి.

కొడవటిగంటి కుటుంబరావుతో సాన్నిహిత్యం వల్లనే కాబోలు, నండూరిలో శాస్త్రవిజ్ఞానంపై ఆసక్తి, దాన్ని సులువుగా పాఠకులకు అందించాలన్న తపన ప్రారంభమయ్యాయి. మానవ పరిణామంపై రాసిన 'నరావతారం', విశ్వరహస్యాలను విప్పిచెప్పిన 'విశ్వరూపం', వివిధ భౌతికవాద, భావ వాద తాత్వికధోరణుల పరిచయం 'విశ్వదర్శనం'- తెలుగు పాఠకులకు గొప్ప కానుకలు. తత్వశాస్త్రంపై తానంటూ ఒక వైఖరి ప్రదర్శించకుండా, వివిధ ధోరణుల మధ్య ఉన్న స్పర్థను, వాదవివాదాలను పరిచయం చేస్తూ ఆయన 'విశ్వదర్శనం' రాశారు. ఆయన శాస్త్రవిజ్ఞాన గ్రంథాలు చదివిన వారిని సైన్స్ పై మరింత ఆసక్తి కలుగుతుంది. నిత్యజీవితాచరణలో ఎంతో కొంత శాస్త్రదృష్టి అలవడుతుంది.

దినపత్రికాసంపాదకుడిగా నండూరిది ప్రత్యేకమైన మార్గం. నార్ల వలె నిశితమైన విమర్శలు, పదునైన వ్యాఖ్యలు ఆయన సంపాదకీయాలలో కనిపించవు. అభిప్రాయభేదాన్ని కూడా ఎంతో మృదువుగా, చెప్పీ చెప్పనట్టు చెప్పడం ఆయన ప్రత్యేకత. అందువల్ల ఆయన రాజకీయ సంపాదకీయాల్లో ఒక పెద్దమనిషి కనిపించేవారు తప్ప, కొరడా పట్టుకున్న విమర్శకుడు కనిపించడు. సాహిత్యసంబంధమైన పరిణామాలు జరిగినప్పుడు మాత్రం ఆయన సంపాదకీయాలు కొత్త పోకడలు పోయేవి. వాటిలోనూ వివాదాల జోలికి వెళ్లడం ఆయన పద్ధతి కాదు కానీ, రచనలో ఆయన పాండిత్యమూ సాహిత్యాభినివేశమూ కొట్టొచ్చినట్టు కనిపించేవి. 'ఆంధ్రజ్యోతి' దినపత్రికకు సాహిత్యసుగంధాన్ని అలదిన ఘనత మాత్రం ఆయనదే. తెలుగునాట నాటి సుప్రసిద్ధరచయితలందరూ ఆంధ్రజ్యోతి దినపత్రికతో ఏదో రకంగా అనుబంధం కలిగి ఉండేట్టు చూసినవారు దినపత్రిక ఎడిటర్‌గా నండూరీ, వారపత్రిక ఎడిటర్‌గా పురాణం! కవిత్వాభిమాని, స్వయంగాకవి అయిన నండూరి (సవ్యసాచి పేరుతో ఆయన కవిత్వం రాసేవారు), ఇంద్రగంటి శ్రీకాంతశర్మతో కలసి 'మహాసంకల్పం' అనే గొప్ప ఆధునిక కవితాసంకలనానికి సంపాదకత్వం వహించారు. సాహిత్యంలో కనిపించే అన్ని ధోరణులను ఆసక్తిగా గమనించేవారు కానీ, తీవ్రవైఖరులకు అసమ్మతి తెలిపేవారు. అయినప్పటికీ, ఆయన కాలంలోని ఆంధ్రజ్యోతి సాహిత్యవేదిక- తెలుగు సాహిత్య పరిణామాలన్నిటికీ అద్దంపట్టేది.

నండూరి అస్తమయంతో ఒక తరం సంపాదకులు నిష్క్రమించినట్టే. స్వాతంత్య్రం సిద్ధించే సంధిసమయంలో పత్రికారచనలో ప్రవేశించి, అనంతరం వైభవ, క్షీణదశలను దగ్గరగా పరిశీలించి, వ్యాఖ్యానించిన కోవలోని వారు నండూరి. భాష విషయంలో కానీ, భావాల విషయంలో కానీ కొన్ని ప్రమాణాలకు బద్ధులై నడిచిన వారు ఆయన. సకలరంగాలలో క్షీణత ఆరంభమయ్యే కాలానికి ఆయన విశ్రాంత జీవితంలోకి ప్రవేశించారు. సంపాదక జీవితమంతా గడచిన విజయవాడను వదలలేక, అక్కడే శేషజీవితం గడిపారు. నాలుగు కాలాల పాటు నిలిచే ప్రయోజనాత్మక వాఙ్మయాన్ని అందించి, నిండుజీవితం గడపిన నండూరి నిష్క్రమణ పత్రికారంగానికి, అక్షరప్రపంచానికి తీరని నష్టం. ఆయన స్మ­ృతికి 'ఆంధ్రజ్యోతి' వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నది.

No comments:

Post a Comment