Monday, October 3, 2011

పంపకాల అంకంలోకి ప్రవేశిస్తున్నామా?

ఉన్నదున్నట్టు ఉండడం సాధ్యంకాదు, ఏదో ఒకటి చేయవలసిందే. శ్రీకృష్ణకమిటీ నివేదిక సిఫార్సుల మతలబు ఎట్లా ఉన్నా, దానిలోని సారాంశం మాత్రం అదే. కాకపోతే, ఆ చేయదగిన వాటిలో మొట్టమొదటిదిగా సమైక్యరాష్ట్రంలో ప్రాంతీయ కమిటీ ఏర్పాటును సూచించింది. ఇప్పుడున్న రాష్ట్రాన్ని ఏ చికిత్సలూ లేకుండా కొనసాగించడం సాధ్యంకాదన్నదే ఆ కమిటీ నిర్ధారణ. ఇప్పుడు ఆజాద్ కూడా అదే మాట చెబుతున్నట్టున్నారు. ఎంతో రహస్యంగా రూపొందించి, రహస్యంగా చర్చిస్తున్న నివేదిక 'లోగుట్టు' ఏమిటో తెలియదు కానీ, రాష్ట్రంలోని రెండు ప్రాంతాలూ కలసి ఉండడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని బలంగా చెప్పినట్టు తెలుస్తోంది.

విభజన ఖాయమే అనిపిస్తోంది. కాకపోతే, అటువంటి సూచన ఏదో అధికార స్వరాలలో పలకకపోతే, రాష్ట్రంలో ఇప్పుడు సాగుతున్న సకలజనుల సమ్మె ఉపశమించేటట్టు లేదు. సమస్యను సాగదీసినవారే ఈ పరిస్థితిని చక్కదిద్దాలి కానీ, ఇప్పటికీ అలక్ష్యం ధ్వనించే వాయిదా మాటలే మాట్లాడుతున్న ఢిల్లీ పెద్దలకు ఆ విజ్ఞత కలుగుతుందో లేదో తెలియదు. దసరా తరువాత ఆశకు ఆస్కారం కలిగే ఏదో ఒక మాట వినిపిస్తే, సమ్మె ముగుస్తుంది కానీ, సమస్య అక్కడితో ముగిసిపోదు. ఎందుకంటే, విభజన తప్పదన్న తెలివిడికి ఎంత ప్రయాస అవసరమయిందో, విభజన ప్రాతిపదికలపై అంగీకారానికి రావడానికి అంతటి యాతనా తప్పదు. మొదట బయటపడేది కాంగ్రెస్ అభిమతం, ఆ తరువాత తక్కిన పక్షాలలో కసరత్తు, అందరిమధ్యా సంప్రదింపులు, చర్చలు, వాదోపవాదాలు, అంగీకారం లేని అంశాలపై
ఆందోళనలు- తప్పనిసరి ప్రక్రియ ఇది. రాష్ట్రం కలసి ఉండడం కానీ, రెండుగా విడిపోవడం కానీ కేవలం భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు కావు. విభజనతో కానీ, సమైక్యంతో కానీ ముడిపడిన అనేక సామాజికార్థిక రాజకీయ ప్రయోజనాలు సెంటిమెంటులో అంతర్లీనంగా ధ్వనిస్తున్నాయి. కలసి ఉండడంలో ప్రయోజనాలున్నవారు సమైక్యాన్ని కోరితే, విడిపోవడంలో ప్రయోజనాలు చూస్తున్నవారు విభజన కోరుతున్నారు. సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రాబల్యవర్గాల, రాజకీయవాదుల ప్రయోజనాలు ఎటూ సమైక్యంలో ఉన్నాయి. వారితో నిమిత్తం లేకుండా కూడా సామాన్య, మధ్యతరగతి ప్రయోజనాలూ కొన్ని సమైక్యంతో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రాబల్యవర్గాల, రాజకీయుల ప్రయోజనాలు విభజనలో ఉన్నాయి. విశాల ప్రజానీకం కూడా తమ సొంత ప్రయోజనాలను, ఆకాంక్షలను ప్రత్యేక రాష్ట్రంలో చూస్తున్నారు. రెండు ప్రాంతాలలో రెండు రకాల వర్గాల ప్రయోజనాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయని కాదు. కానీ, ఇందులో సామాన్యుల ప్రయోజనాలూ ఉన్నాయన్నదే గమనించవలసిన అంశం. రాష్ట్రవిభజన నిర్ణయం తీసుకునేముందు, లేదా విభజన ప్రాతిపదికలను నిర్ణయించేముందు సాధారణ ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవలసిందే.

అయితే, ఈ ప్రయోజనాలు కేవలం హైదరాబాద్ నగరంతోనే ముడిపడి ఉన్నాయా? అదొక్కటే మొత్తం సమస్యకు కేంద్రమా? హైదరాబాద్‌లో సీమాంధ్రప్రజల ప్రయోజనాలు ఉన్నాయన్నది వాస్తవం. రాష్ట్రఅవతరణ జరిగినప్పటినుంచి ఉద్యోగులుగా వచ్చి ఇక్కడ స్థిరపడినవారు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉత్తరాంధ్రనుంచి, సీమాంధ్రలోని మెట్ట ప్రాంతాల నుంచి శ్రామికులుగా, వృత్తిపనివారిగా వచ్చి స్థిరపడినవారు పెద్ద సంఖ్యలోనే హైదరాబాద్‌లో ఉన్నారు. అలాగే, వ్యాపారులుగా, పారిశ్రామికులుగా స్థిరపడిన వారూ ఉన్నారు. హైదరాబాద్‌లో కేవలం ఆస్తులను మాత్రమే కూడగట్టుకున్నవారూ ఉన్నారు. వీరంతా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కావడం వల్ల మాత్రమే వచ్చారనుకోలేము. ప్రభుత్వోద్యోగులు, రాజకీయవాదుల కుటుంబాలు అందువల్లనే వచ్చారనడంలో సందేహంలేదు. తక్కినవారు, ఆర్థికాభివృద్ధికి, ఉపాధికి అపరిమిత అవకాశాలున్న మహానగరానికి వచ్చారనే భావించాలి. రాష్ట్రావతరణ జరిగి ఐదున్నర దశాబ్దాలు గడుస్తున్నా, శాస్త్రీయంగా పట్టణప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రయత్నించింది లేదు. ఒకటో రెండో మహానగరాల కంటె, వికేంద్రీకరించిన పట్టణీకరణ సమాజానికి అధికంగా దోహదం చేస్తుంది. అటు శ్రీకాకుళం నుంచి, ఇటు చిత్తూరు దాకా- వ్యవసాయసంక్షోభం వల్లనో, ఇతర కారణాల వల్లనో గ్రామాలు వదిలి వచ్చేవారిని స్వీకరించి ఆదరించగలిగే పట్టణాలులేవు. అందుకే, హైదరాబాద్‌లో పక్కనే ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందినవారూ, దూరాన ఉన్న ఉత్తరాంధ్రకు చెందినవారూ భవన నిర్మాణ కార్మికులుగా కనిపిస్తారు. వీరందరికీ రాజకీయప్రతిపత్తితో సంబంధం లేకుండా హైదరాబాద్ ఆశ్రయాన్నీ, ఉపాధినీ కల్పిస్తూ పోవలసి ఉంటుంది. హైదరాబాద్ నగరం విస్తరించడానికి, 'అభివృద్ధి' చెందడానికి ఉన్న కారణాలను శాస్త్రీయంగా, చారిత్రకంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. అసలు ఆ అభివృద్ధి ఎంత వరకు ప్రజానుకూలమైనది? కేవలం ఉన్నతాదాయవర్గాల వారికి అవసరమైన జీవనప్రమాణాలను సిద్ధం చేసుకోవడమే అభివృద్ధా? అన్నవి చర్చించవలసిన ప్రశ్నలు.

రాష్ట్రవిభజన కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఇతర ప్రాంతీయులలో అభద్రత ఏర్పడే అవకాశం ఉండవచ్చు, దాన్ని అర్థం చేసుకోగలము. విభజన ప్రాతిపదికలలో అవసరమైన రక్షణలు కల్పించడమే ఆ సమస్యకు పరిష్కారం. సామాన్యులే కాక, సంపన్నులు, వ్యాపారులు కూడా ఆకస్మిక పరిణామం కారణంగా, రాజకీయ నాయకత్వం మార్పిడి కారణం దెబ్బతినకుండా, వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉన్నది. తాత్కాలికంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమా, మరో పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకోవడమా- ఏ పరిష్కారం సమ్మతమో దానికి మార్గం సుగమం కావాలి. అయితే, సమస్య హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులది మాత్రమేనా? ఆదిలాబాద్‌లో, నిజామాబాద్‌లో, వరంగల్, ఖ మ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో స్థిరపడిన సీమాంధ్రుల ప్రయోజనాల సంగతేమిటి? వారు తెలంగాణ రాష్ట్రంలో ధీమాగా ఉండగలుగుతారా? వారు ఉండగలిగితే హైదరాబాద్ వాసులు ఎందుకు ఉండలేరు? - ఇవీ ప్రశ్నలే. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల భద్రత, భవితవ్యం మాత్రమే చర్చనీయాంశా లా? సీమాంధ్ర ప్రాంతాలలోని ప్రజలకు విభజనతో సమస్యలేమీ లేవా?

సీమాంధ్రలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ హైదరాబాద్ ఒక తప్పనిసరి గమ్యం. ఉద్యోగాలు అక్కడే దొరుకుతాయి మరి. కొత్త రాజధాని ఏర్పాటైనా అది ఆ అవసరాన్ని తీరుస్తుందని చెప్పలేము. ఎందుకంటే, ఏదైనా ఒక పట్టణం రాజధాని కావడం వల్ల కాక, దానికున్న మౌలికసదుపాయాల వ్యవస్థ, భూముల అందుబాటు, నైసర్గిక అనుకూలతల కారణంగా విస్తరిస్తుంది.   సీమాంధ్రలో ఏర్పడే కొత్త ప్రభుత్వం దూరదృష్టితో, వివేకంతో వ్యవహరించి ఉపాధిఅవకాశాల విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటుందనుకుందాం, అయితే దానికి సమయం పడుతుంది. అప్పటిదాకా హైదరాబాద్ వారికి అందుబాటులో ఉండాలి. మరి ఇన్ని అవకాశాలను కల్పిస్తూ పోతే, తెలంగాణ యువకుల సంగతేమిటి? అన్న ప్రశ్న అనివార్యంగా వస్తుంది. చిన్నవో చితకవో సీమాంధ్ర లో అనేక పట్టణాలున్నాయి. తెలంగాణ పరిస్థితి అది కాదు. వారికి హైదరాబాద్ లేకపోతే, ఉపాధి అవకాశాలు మృగ్యం. అంటే, హైదరాబాద్ ఆదాయాన్ని పంచుకున్నట్టే, ఇతర అవకాశాలను కూడా కొంతకాలం పాటు ఉభయులూ ఏదో ఒక నిష్పత్తిలో పంచుకోవాలి.

ఉద్యోగాలు, చదువులూ పక్కనపెడితే, సాగునీటి సమస్య చాలా కీలకమయినది, సంక్లిష్టమయినది. కృష్ణాగోదావరినదులు సుదీర్ఘంగా ప్రవహిస్తూ ఉన్నా తెలంగాణ నేలకు సాగునీటి లభ్యత లేదన్నది తెలంగాణ ఉద్యమం పుట్టడానికి ఒక ముఖ్యమైన కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, సాగునీటి కోసం జరిగే కొత్త ప్రయత్నాలు కానీ, తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్ల కానీ- దిగువ ప్రాంతమైన కోస్తాంధ్రకు నీరు అందదేమోనన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల మీద ఉభయప్రాంతాల ప్రయోజనాలు, వైఖరులు భిన్నంగా ఉన్నాయి. నీటిపంపకం పెద్ద సమస్యే కానున్నది. నిజానికి హైదరాబాద్ కంటె అదే పెద్ద సమస్య. మహానగరంలో అమిత ప్రయోజనాలున్నవారు ఆ ఒక్కదానికే ప్రాధాన్యం ఇస్తూ, తక్కినవాటిమీద దృష్టి సారించకుండా జాగ్రత్త పడ్డారు. విభజన అసాధ్యమనే అభిప్రాయాన్ని పదే పదే కల్పించడం ద్వారా, సీమాంధ్ర ప్రాంత రైతాంగంలో తమ ప్రయోజనాల సాధన కోసం ముందే మేల్కొనే అవకాశం లేకుండా చేశారు. అంటే సీమాంధ్ర రైతాంగం తెలంగాణతో ఘర్షణ వైఖరి ద్వారా రక్షణలు పొందాలని, పొందగలరని కాదు. సాగునీటికి అధిక లబ్ధిదారులు గా కనిపిస్తున్న సీమాంధ్ర ఆయకట్టురైతాంగం, తమ ప్రస్తుత స్థితిని కాపాడుకోవడం అవసరం. అందుకు, ఉభయప్రాంతాల మధ్య సంప్రదింపులు, సదవగాహన అవసరం. వాస్తవికత, సమాన న్యాయం ప్రాతిపదికలుగా కృష్ణా జలాల పునఃపంపిణీ అవసరం. ఆ పంపిణీలో రాయలసీమకు కూడా న్యాయం చేయవలసి ఉంటుంది. హైదరాబాద్‌తో ఉన్న ప్ర యోజనాల కంటె, అధికంగా కృష్ణాజలాలే రాయలసీమ రైతాంగానికి, అక్కడి రాజకీయ నాయకత్వానికి కూడా ముఖ్యం. పరీవాహకప్రాంత హక్కులు లేని రాయలసీమకు తుంగభద్ర, పెన్న తప్ప పెద్దనదులు లేవు. తెలుగుగంగ పుణ్యమా అని కొన్ని నీళ్లు, రాజశేఖరరెడ్డి హయాం కారణంగా పోతిరెడ్డిపాడు నుంచి కొన్ని వివాదాస్పద జలాలు మాత్రమే సీమకు లభిస్తున్నాయి. ఎంతో కొంత జలవాగ్దానం జరగకపోతే, విభజన వల్ల రాయలసీమ అధికంగా నష్టపోతుంది. జీవనదులు ప్రవహిస్తున్నా సాగునీటికి గతిలేకుండా ఉన్న తెలంగాణ, రేపు కోస్తాకు, సీమకు నీటిని వాగ్దానం చేయవలసి రావడమే విచిత్రం.

ఇందరికి ఇన్ని సర్దుబాట్లు చేసిన తరువాత తెలంగాణకు ఏమి మిగులుతుంది? దాన్ని అభివృద్ధిబాటలో పాలకులు ఎట్లా నడిపిస్తారు?- అన్నవి ఆందోళనకరమైన ప్రశ్నలే. కానీ, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదకవలసిన సమయం వచ్చింది. విభజన ఖాయం అని తెలిసిన తరువాత, పంపకాల మీదనే చర్చ ప్రారంభం కావలసి ఉన్నది. వివక్ష వల్ల బాధితులైనవారు, ఇతరుల విషయంలో ఆ వివక్ష చూపించరు, ఉదారంగా కూడా ఉంటారు. ఉండాలి. కానీ, విభజన ప్రాతిపదికలను నిర్ణయించేటప్పుడు, విభజన ఉద్యమం ఎందుకు జరిగిందో, ఆ విలువలను ఆకాంక్షలను విస్మరించకుండా ఉండాలి. భౌతిక ప్రయోజనాలు శూన్యమై కేవలం భావోద్వేగాలు సంతృప్తి చెందితే కూడా ఉపయోగం లేదు

3 comments:

 1. జీవనదులు ప్రవహిస్తున్నా సాగునీటికి గతిలేకుండా ఉన్న తెలంగాణ, రేపు కోస్తాకు, సీమకు నీటిని వాగ్దానం చేయవలసి రావడమే విచిత్రం.

  True, and that explains everything else.

  ReplyDelete
 2. చాలా బాగా వ్రాశారు శ్రీనివాస్ గారు...

  విభజన ని ప్రతి ఒక్కరూ ఆమొదించాల్సిన సమయం...( అగత్యం) వచ్చింది..) ....

  ఎన్నికలే పరమావధి గా.... చివరి నిముషము వరకు కాలయాపన చేసి ...విభజన జరిపేటప్పుడు ..తూ తూ మంత్రం గా ఒప్పందాలని కుదిర్చి...మరో చారిత్రక తప్పిదం దిశ గా ప్రభుత్వాలు నడుస్తున్నాయి...!!

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete