Tuesday, October 11, 2011

నేరం చరిత్రదే కాదు, కాంగ్రెస్‌దీ!

ప్రణబ్ ముఖర్జీ గారికి కోపం వచ్చింది. తాను అనని మాటలను అన్నట్టు మీడియా రాస్తోందని ఆయన మొహం మాడ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వస్తాయని ఆయన అన్నట్టుగా పత్రికల్లో టీవీల్లో వచ్చింది. పాపం నిజంగానే ఆయన అట్లా అనలేదు. ఆయన మాటల్ని దారితప్పించింది తెలుగు మీడియా కాదు, ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్న ఎన్డీటీవీయే అట్లా వార్తలు విడుదల చేసింది. ఇంతకూ ప్రణబ్ ఏమన్నారు? 'విస్త­ృత దృష్టితో చూస్తే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి, ఎందుకంటే భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటులో ఒక పద్ధతిని అనుసరించలేదు.

గత నాలుగైదువందల ఏళ్ల చరిత్రలోనూ వర్తమానంలోనూ కూడా ఒక పద్ధతంటూ లేదు..' ఇట్లా చెప్పుకుపోయారు. ఈ మాటలకు ముందు తెలంగాణ సమస్య పూర్వాపరాలను ఆయన పేర్కొన్నారు. అందువల్ల, ఆ సమస్యలేవో తెలంగాణ వల్ల వస్తాయన్నట్టుగా అర్థమయ్యి ఉండవచ్చు. కానీ, ప్రణబ్ ఆ ఇంటర్వ్యూలో ఏవో విధాన నిర్ణయాలు వె ల్లడించే ధోరణిలోనో, అలవోక వ్యాఖ్యలు చేసే ధోరణిలోనో మాట్లాడలేదు. ఒక చర్చా ధోరణిలో, సైద్ధాంతిక దృష్టితో, బెంగాలీ బాబు లాగా మాట్లాడారు. సంచలనాత్మకతలో కొట్టుకుపోయి ఉండకపోతే, ఆ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన చర్చనీయమైన అంశాలు మీడియాకు కనిపించి ఉండేవి.

తెలంగాణ సమస్యకు చరిత్రలోను, సమీపగతంలోను, వర్తమానంలోను మూలాలు ఉన్నాయని ప్రణబ్ ఆ ఇంటర్వ్యూలో సూచించారు. అసలు భారతదేశంలో అంతర్గత పరిపాలనా యూనిట్లు ఏర్పడిన క్రమమే క్రమపద్ధతిలో లేదని ఆయన చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, సమైక్యంగా కొనసాగడం- అనే రెండు మార్గాల మధ్య పోరుగా పరిణమించిన ప్రస్తుతసమస్య ఉధృతిలో మూలకారణాల పరామర్శ, చర్చ ఈ మధ్య అణగారిపోయాయి. తెలంగాణ ఉద్యమమంటే, స్వార్థపర రాజకీయశక్తుల సృష్టి అని, దానికి భౌతిక పునాది ఏమీ లేదని, విద్వేషపూరితమైనదని వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. ప్రాంతీయ అసమానతలనేవే లేవని, అంతా సజావుగానే ఉన్నదని,
ప్రస్తుత పరిస్థితిని అణుమాత్రం కూడా మార్చనవసరం లేదని వాదిస్తుంటారు. పూర్వాపరాలు తెలియకుండా ఎవరైనా అటువంటి వాదనలు చేస్తే అర్థం చేసుకోవచ్చును కానీ, తెలిసి తెలిసి ఒక ఎత్తుగడగా అటువంటి వైఖరి అనుసరిస్తే అది సమస్యను మరింత క్లిష్టం చేస్తుంది తప్ప ప్రయోజనం ఉండదు. ప్రణబ్ తెలంగాణ సమస్యను దాని వర్తమాన ప్రభావానికి అతీతంగా వస్తుగతంగా, చారిత్రకంగా చూసే ప్రయత్నం చేశారు. మొదటి ఎస్సార్సీ కాలం నుంచి తెలంగాణ సమస్య ఉన్నదని ఉద్యమకారులు చెబుతున్నదాన్ని ప్రణబ్ నిర్ధారిస్తున్నారు. అయితే, రాష్ట్రాల ఏర్పాటు చరిత్రగతిలో అవకతవకగా జరిగిందని ఆయన చెప్పడం, అందుకు బాధ్యులెవరో గుర్తించడానికి ఉపకరించదు. 'విధి', 'కాలం' అనే అమూర్త శక్తులు కొన్ని అనుకోని మలుపులకు కారణమైతే అయి ఉండవచ్చును కానీ, తెలంగాణ సమస్యకు, స్వాతంత్య్రానంతరం అంతర్గత పాలనాయూనిట్లకు సంబంధించిన సమస్యలకు - ప్రధాన బాధ్యత కాంగ్రెస్‌పార్టీయే వహించవలసి ఉంటుంది.

నాగరికతల ఆదిమదశలో నదీతీరాల వెంట మానవుల సాంఘిక జీవనానికి బీజాలు పడ్డాయి. సమగ్రమైన సహజవనరుల వ్యవస్థలు ఉన్న చోట స్థిరనివాసాలు ఏర్పడ్డాయి. వనరుల ఆధిపత్యం కోసం జరిగే పోరు, మానవ ఉత్పాదకతల్లో వచ్చిన మార్పులు రాజ్యాలను ఏర్పరచాయి. పరస్పర యుద్ధాల్లో, బలవంతుడిదే పైచేయి అయిన క్రమం రాజ్యాల రూపురేఖలను సరిహద్దులను నిర్ణయించాయి. అంగవంగ కళింగ ఛప్పన్నారు దేశాల భరతఖండంలో మహాసామ్రాజ్యాలూ వర్ధిల్లాయి, చిన్న చిన్న రాజ్యాలూ మనుగడసాగించాయి. యూరోపియన్లు మన దేశంలో ప్రవేశించిన తరవాత, భారతీయ రాజ్యాల అంతఃకలహాలు, బలాలు, బలహీనతలు అంతర్గత పటాలను మార్చివేశాయి. 1857 మొదటి స్వాతంత్య్రపోరాటం తరువాత బ్రిటిష్ వలసవాదులు కొత్త ఆక్రమణలను విరమించుకున్న తరువాత, ఒక స్ధిర రాజకీయపటం ఏర్పడింది. స్వాతంత్య్రంతో పాటు, ఐదువందల చిన్నా చితకా సంస్థానాలు విలీనమూ జరిగింది. ఆంగ్లేయ వలసవాద అభివృద్ధి జరిగిన ప్రాంతాలూ, సంస్థానాధీశుల పాలనలో అణగారిపోయిన రాజ్యాలూ కలగలసి రాష్ట్రాల అవతరణ జరిగింది. చెప్పినంత సులువుగా జరిగింది కాదీ ప్రక్రియ. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగువారు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్షను 1913 నుంచి వ్యక్తం చేస్తూ వచ్చారు. అట్లాగే, అనేక ఇతర ప్రొవిన్సుల్లోనూ భాషావర్గాలు సంఘటితం కావడం మొదలయింది. వలసపాలన చివరి దశాబ్దాల్లో బ్రిటిష్‌పాలిత ప్రాంతాల్లో ప్రజాస్వామ్యీకరణ, విద్యావ్యాప్తి, స్వాతంత్య్రానంతర స్థితిగతులపై ముందుచూపు మొదలయ్యాయి. 1928లోనే కాంగ్రెస్ పార్టీ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీ వేసి, భాషాప్రయుక్త రాష్ట్రాలకు అనుకూలంగా తీర్మానించింది.

ఆ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించిన జవహర్‌లాల్‌నెహ్రూ, స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భాషాప్రయుక్తరాష్ట్రాల ప్రతిపాదనను అటకెక్కించే ప్రయత్నం చేశారు. భారతయూనియన్‌లో భాగస్వాములయ్యే వివిధ జాతులకు స్వయంప్రతిపత్తి ఇస్తామని, రాష్ట్రాలకు విస్త­ృతాధికారాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్, తరువాత పునరాలోచనలో పడింది. భాషాజాతీయత బలపడితే, భారతజాతీయత బలహీనపడుతుందని భావించింది. భాషాజాతీయ రాష్ట్రాల పాలనలో భాషామైనారిటీలకు రక్షణ ఉండదని వాదించింది. భాషారాష్ట్రాల ప్రతిపాదనకు ససేమిరా అన్న నెహ్రూ పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి తరువాత, ఆంధ్రరాష్ట్రాన్ని హడావుడిగా ప్రకటించారు, రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌నూ నియమించారు. ఆ కమిషన్ సిఫార్సులనయినా పూర్తిగా అమలు చేశారా? లేదు. తెలుగుప్రాంతాలతో హైదరాబాద్ రాష్ట్రాన్ని విడిగా కొనసాగించడమే మంచిదని ఫజల్ అలీ కమిషన్ చెప్పినా విశాలాంధ్రను ఏర్పరచారు. మహారాష్ట్రను, గుజరాత్‌ను వేరుచేయాలని చెప్పినా 1960 దాకా చేయలేదు. అందుకు మళ్లీ పెద్ద ఉద్యమం అవసరమైంది. పంజాబ్‌నుంచి హర్యానాను వేరుచేసే పనిమాత్రం డిమాండ్ బలపడకముందే కాంగ్రెస్ ఆగమేఘాల మీద జరిపించింది. అక్కడా చండీగఢ్ కొరివిని మాత్రం మిగిల్చి, పంజాబ్ ఉగ్రవాదానికి బీజం వేసింది. 1969లో తెలంగాణలో ఉద్యమం వచ్చినప్పుడో, 1973లో ఆంధ్రలో వచ్చినప్పుడో విభజన నిర్ణయం తీసుకోకుండా కఠినంగా అణచివేసింది. ఇక, 2004లో టిఆర్ఎస్‌తో పొత్తు ఏర్పరచుకుని మళ్లీ ఆశ కల్పించింది, 2009డిసెంబర్ 9న విభజన ప్రకటన చేసి ఆపైన వెనక్కి తగ్గింది.

ఇందులో చరిత్ర చేసిన అన్యాయమెంత, కాంగ్రెస్ పార్టీ వేసిన కుప్పిగంతులెన్ని? దూరదృష్టి, దేశభవిష్యత్తు గురించిన ఒక సమగ్రమైన ప్రణాళిక లేకుండా, కాంగ్రెస్ పార్టీ ఆపద్ధర్మనిర్ణయాలతో వ్యవహరిస్తూ వచ్చింది. ఒక్కోసారి సంకుచితమైన దృష్టినీ కనబరచింది. ఉమ్మడి మద్రాసురాష్ట్రం నుంచి కేరళను వేరుచేయడానికి నెహ్రూప్రభుత్వం చాలా తటపటాయించింది. తమిళులు మరోభాషాప్రాంతం తమ రాష్ట్రంలో ఉండకూడదని పట్టుబట్టినందున కేరళను ఏర్పరచవలసి వచ్చింది. మలయాళీలు ఒక రాష్ట్రంగా ఏర్పడితే కమ్యూనిస్టులు బలపడతారని కాంగ్రెస్ భయం.

మనుషులు ఏ ప్రాతిపదికమీద కలిసి ఉండాలి, ఒక దేశంలో అంతర్గత పరిపాలనాయూనిట్లు ఎట్లా ఉండాలి? అన్న ప్రశ్నలకు- కేవలం భాషాపరమైన, ప్రాదేశికమైన పరిష్కారాలు మాత్రమే ఉండనక్కరలేదు. తాము, తమ సమూహమూ ప్రత్యేక ప్రతిపత్తితో విడిగా ఉండాలని ఒక సమూహం కోరుతున్నదంటే- అది స్వయంనిర్ణయాధికార కాంక్ష కిందికి వస్తుంది. బాబా సాహెబ్ అంబేద్కర్ కులప్రాతిపదికపై నియోజకవర్గాలు కోరారంటే, ప్రాదేశిక నియోజకవర్గాల కింద న్యాయం జరగని వర్గాల సాధికారత కోసం ఉద్దేశించిన డిమాండ్. భాష ఆధారంగా ఒక ప్రాంత జనం సంఘటితం కావడం, ఉమ్మడిగా వ్యక్తీకరించుకోవడం ప్రజాస్వామ్యానికి అనువైనదేనని అంబేద్కర్ గుర్తించారు. అయితే, భాషారాష్ట్రం కొత్త మైనారిటీలను సృష్టిస్తుందని ఆయన హెచ్చరించారు. భాషారాష్ట్రాలు పెద్దసైజులో ఉండకూడదని, జాతీయ ప్రభుత్వాలను అదుపుచేసే శక్తి వాటికి ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు తక్షణ ప్రమాదం ప్రాంతీయ ప్రాబల్యవర్గాల నుంచే ఉంటుందని, వారికి తిరుగులేని అధికారం సంక్రమించకుండా జాతీయప్రభుత్వం కాపుకాయాలని ఆయన ఉద్దేశ్యం. ఒకే భాషను వ్యవహరించేవారితో అనేక రాష్ట్రాలు ఏర్పడాలని ఆయన ఆశించారు.

రాష్ట్రాల పరిమాణం ఎంత చిన్నగా ఉంటే అట్టడుగువర్గాల వారికి అంతగా సాపేక్షరక్షణ ఉంటుందని ఆయన సిద్ధాంతం. కాబట్టి, రాష్ట్రాలను భాషాప్రాతిపదిక అన్నది తిరుగులేనిదేమీ కానక్కరలేదు. భాషప్రాతిపదికగా ఏర్పడిన రాష్ట్రాల్లో ఇతర ప్రాతిపదికల మీద అసంతృప్తి కలగవచ్చు. ప్రాంతీయ అసమానతలు, సాంస్క­ృతిక విభిన్నత, భౌగోళికమైన సమగ్రత, స్వయంగా పాలించుకోగలిగిన శక్తి ఏర్పడినప్పుడు- భాషేతర ప్రాతిపదికలు కూడా ప్రత్యేక ఆకాంక్షలకు దారితీస్తాయి. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను ఉత్తర, దక్షిణ భాగాలుగా వేరుచేయాలని అంబేద్కర్ ఏనాడో చెప్పినది, 2000 సంవత్సరంలో వాస్తవరూపం ధరించింది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రెండూ భాషేతర ప్రాతిపదికమీద ఏర్పడిన రాష్ట్రాలే. అగ్రకులానికి చెందిన కొండజాతి ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి, తమకు ప్రత్యేక చట్టాలు అవసరమన్న డిమాండ్‌తో ఉత్తరాంచల్ ఏర్పడింది. సంక్లిష్టమైన చరిత్రనుంచి సంక్రమించిన అనేక సమస్యలు వర్తమానంలో కలవరపరుస్తుండగా, ఇంకా తెలియని మరెన్నో సమస్యలు నిద్రాణమై ఉన్నాయి. అవన్నీ మున్ముందు బయటపడతాయి. ప్రణబ్ చెప్పింది అదే. తెలంగాణ సమస్యలో కూడా అటువంటి చరిత్రాంశ ఉన్నది. స్వాతంత్య్రానంతరం ప్రణబ్ పార్టీ ఆడిన చెలగాటమూ ఉన్నది. తమను తాము సగౌరవమైన స్థితిలో నిలబెట్టుకోవడానికి, సమానన్యాయాన్ని ప్రాదేశికంగా సాధించుకోవడానికి తెలంగాణ చేస్తున్న పోరాటం, రేపు అనేక ప్రాంతాలు, అనేక సామాజికవర్గాలు కూడా చేస్తాయి.

No comments:

Post a Comment