Wednesday, October 19, 2011

'సకలం' సశేషం, పాఠాలు అనేకం

సకల జనుల సమ్మె చరమాంకానికి వచ్చింది. విరమణ కాదు వాయిదా అని సమ్మెసంఘాలు చెబుతున్నాయి కానీ, అవి ఆత్మసంతృప్తికి చెపుకుంటున్న మాటలే. నెలరోజులకు పైగా సాగిన ఒక చరిత్రాత్మక ఘట్టం ముగింపునకు వచ్చిందన్నదే వాస్తవం. సమ్మెలు సడలుతున్న సమయంలో కూడా ఒక రోజు తెలంగాణ బంద్‌ను విజయవంతంగా నిర్వహించడం, విరమణ వల్ల కలుగుతున్న ఆశాభంగాన్ని సమర్థంగా తెలంగాణ ప్రాంత మంత్రుల మీదకు మళ్లించడం- ఉద్యమస్ఫూర్తికి నష్టం కలగకుండా నాయకత్వం అనుసరించిన ఎత్తుగడలే.

అయితే, ఈ సకలజనుల సమ్మె పోరాటంలో గెలిచిందెవరు? ఓడిందెవరు? - ఈ ప్రశ్నలు తప్పనిసరిగా ముందుకు వస్తాయి, వస్తున్నాయి. ఒక సుదీర్ఘ ఉద్యమంలో ఒక ఘట్టం ఫలితాన్ని బట్టి, ఓటమిగెలుపులను నిర్ణయించవచ్చునా? అన్నది మరో ముఖ్యమైన ప్రశ్న. అంతిమదశలో మాత్రమే చేపట్టవలసిన బ్రహ్మాండమైన ఉద్యమరూపాన్ని సమయం కాని సమయంలో రాజకీయ జెఎసి ప్రయోగించడం సరిఅయినదేనా? ఈ దశలో ఈ ఉద్యమరూపం ఫలితం ఇట్లాగే ఉండబోతుందని నాయకత్వానికి తెలియదా? విశాల ప్రజానీకం స్వచ్ఛందంగా పాలుపంచుకుంటున్న ఉద్యమం విషయంలో రాష్ట్ర పాలనాయంత్రాంగం, అధికార పక్షం వ్యవహరించిన తీరు సరిఅయినదేనా? సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం, పాలకపెద్దలు అనుసరించిన సందేహాస్పదమైన ఎత్తుగడలు, భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలపై ఎటువంటి ప్రభావం వేయనున్నాయి?

ప్రశ్నలూ సందేహాలూ ఎలాగూ వస్తాయి కానీ, ఒక ఉద్యమం నుంచి మొత్తం సమాజం నేర్చుకోదగినవి ఎన్నో ఉంటాయని కూడా గుర్తించాలి. ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు తమ ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి ఏఏ పద్ధతులను అనుసరించారు, ఆ వ్యక్తీకరణను భగ్నం చేయడానికో, బలహీనపరచడానికో ప్రభుత్వాలు, వ్యతిరేకులు ఏ వ్యూహాలను పాటించారు- అన్న అంశాలు- భవిష్యత్తులో జరిగే (తెలంగాణకు అనుకూల నిర్ణయం వస్తే, సీమాంధ్ర ప్రాంత ప్రజలు చేయాలనుకుంటున్న ఉద్యమాలతో సహా) అన్ని ఉద్యమాలకూ
పాఠాలుగానే పనికివస్తాయి. సమ్మెల వల్ల సమాజానికి కలిగే ఇబ్బందులను సామాజిక న్యాయదృష్టితో చూడడం ఈ సమ్మెతోనే మొదలయింది. భవిష్యత్తులో అన్ని ప్రజా ఉద్యమాలకూ ఈ దృష్టిని అన్వయిస్తే, పోరాటాల తీరే మారవలసి వస్తుంది. సకలజనుల సమ్మె సందర్భంగా చర్చకు వచ్చిన ఇటువంటి అనేక అంశాలు, మొత్తం సమాజం అనుభవసంపుటిలో భాగం అవుతాయి, కొత్త విలువల అవతరణకు దోహదం చేస్తాయి.

సకలసమ్మెలో ముఖ్యమైన విశేషం- ఒక రాజకీయమైన ఆకాంక్షకు మద్దతుగా ఉద్యోగవర్గాలు ఆందోళనకు దిగడం. వేతనాల గురించి, పని పరిస్థితుల మెరుగుదల గురించి ఉద్యోగ సంఘాలు దీర్ఘకాలం సమ్మెకుదిగడం మనకు అనుభవమే కానీ, రాష్ట్రవిభజన వంటి రాజకీయ నిర్ణయాన్ని కోరుతూ వివిధ శ్రేణుల ఉద్యోగులు, కార్మికులు, సంస్థలు సమష్టిగా ఉద్యమించడం అరుదైనది. అనేక అంచెల సామాజిక వ్యవస్థ, అంతరాల ఆర్థిక వ్యవస్థ కలిగిన ఒక ప్రాంతంలో, భిన్న వర్గాల మధ్య ఇంతటి ఉద్యమ ఐక్యత కూడా మునుపెన్నడూ కనిపించలేదు. ఉద్యమనాయకత్వం మీద అనేక ఫిర్యాదులు, అసంతృప్తులు ఉన్నప్పటికీ, వివిధ సమాంతర ఉద్యమసంస్థలు, బృందాలు ఉమ్మడి లక్ష్యం మీద ఏకాగ్రతతో వ్యవహరించిన సందర్భాలు కూడా అరుదు.

సకలజనుల సమ్మె- నిష్ఫలంగా ముగిసినప్పటికీ, ఉద్యమంలో మాత్రం నిస్ప­ృహ కనిపించడం లేదు. ప్రతిరోజూ ఇద్దరోముగ్గురో యువకులు ఆత్మహత్యలు చేసుకునే విషాదం కొనసాగుతూనే ఉంది కానీ, సకలసమ్మెను సుదీర్ఘకాలం కొనసాగించగలుగుతున్న సంతృప్తి అధికసంఖ్యాకులను ఉత్తేజపరుస్తూ వచ్చింది. మరింత కాలం నిరీక్షణకు, మరింత విస్త­ృతమైన ఉద్యమనిర్మాణానికి సంసిద్ధత, సంకల్పం గట్టిపడుతూ వచ్చాయి. సమ్మె సగానికి వచ్చేటప్పటికే, కేంద్రప్రభుత్వం నుంచి కీలకమైన స్పందన ఏదీ త్వరలో రాబోవడం లేదన్నది ఉద్యమశ్రేణులకు అర్థమైపోయింది. విఫలమవుతున్న పోరాటరూపాన్ని పట్టుకువేలాడడం కంటె, మరోదారిలోకి మళ్లడం మంచిదని, అయితే, అది గౌరవప్రదమైన పద్ధతిలో ఉండాలని ప్రతిపాదనలు మొదలయ్యాయి. ఢిల్లీలో ఏమి ఉపదేశాలు లభించాయో తెలియదు కానీ, గత దసరాపండగ నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో చాణక్యం మొదలయింది. ఆర్టీసీలో చేసిన తొలిప్రయత్నం విఫలమయింది కానీ, మలివిడత రైల్‌రోకోను భగ్నం చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఇంతలో దీర్ఘకాలం బడులు మూసివేయడం గురించి రకరకాల శిబిరాల నుంచి ఉద్యమం మీద విమర్శ మొదలయింది. ఇరవయ్యోతారీకు దాకా సమ్మె సాగితే తెలంగాణలో ఉద్యమకారుల మీద ప్రజలే తిరగబడతారు అని కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, అటువంటి అంతర్గత విభజనను తీసుకువచ్చే ప్రయత్నమేదో గట్టిగానే సాగిందని అర్థమవుతుంది. వీటన్నిటిని సకలజనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ వర్గాల వారు అర్థం చేసుకుని, దృఢంగా నిలబడడం ఆశ్చర్యమే. అందువల్లనే వారి శక్తి సన్నగిల్లిన తరువాత, సమ్మె విరమణ కోసం మార్గాలను వెదుక్కోవడాన్ని ఎవరూ తప్పుపట్టలేకపోయారు. నిజానికి వారు రాజీనామా చేసిన సకల రాజకీయపార్టీల ప్రజాప్రతినిధులకు మద్దతుగా సమ్మె ప్రారంభించారు. వారు మాత్రమే పోరులో దూకితే, రాజకీయులు ఒడ్డునే ఉండిపోయారు.

సమ్మె ఔచిత్యాన్ని ప్రశ్నించినవారే, తెలంగాణ గురించి ఏ హామీ లేకుండా ఎందుకు విరమించినట్టు అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయదృష్టితో చూసినప్పుడు అటువంటి ప్రశ్నలు తలెత్తడం సహజమే. సమ్మె ఉపసంహరణ లేదా వాయిదా- అన్నది ఉద్యమలక్ష్యానికి తగిలిన దెబ్బగా అభివర్ణించేవారు కొందరుంటే, నాయకత్వ వైఫల్యంగా చెప్పేవారు కొందరుంటారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు అయితే, పంతం పట్టినట్టుగానే కనిపించింది. ఏదో ఒక లక్ష్యం కోసం ఉద్యమం బాటలో ఉన్న ప్రజలతో ప్రభుత్వయంత్రాంగం పోటీపడడం మంచిది కాదు. ప్రభుత్వం తరఫున తన వంతు బాధ్యత నిర్వహించినప్పటికీ, ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రమే, సమ్మె విరమణ వల్ల ఉద్యమ ఆకాంక్ష వీగినట్టు కాదు అన్న వ్యాఖ్య చేసి, ఉద్యోగవర్గాలను కూడా గౌరవించారు. మెట్టరైతులకు విద్యుత్‌కొరతను కల్పించి, అందుకు సమ్మెదే బాధ్యత అన్నట్టు వ్యవహరించడం దగ్గరనుంచి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు పోటీ పెట్టడం దాకా- ప్రభుత్వ వ్యవహారం ఎత్తుకు పైఎత్తు పద్ధతిలోనే సాగింది తప్ప, సామరస్య పూర్వకంగా లేదు.

తెలంగాణ ప్రజలకు ఈ సమ్మె కాలంలో కలిగిన రాజకీయజ్ఞానోదయం చిన్నది కాదు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలుకానీ, కేంద్రప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఒక ఉద్యమాన్ని ఎంతగా అలక్ష్యం చేయగలవో ఈ సమ్మె నిరూపించింది. సమ్మె ప్రభావాన్ని నిరాకరించడం దగ్గర నుంచి మొదలుపెట్టి, హడావుడి సంప్రదింపుల ప్రదర్శనదాకా కాంగ్రెస్ పెద్దలు చూపిన దారుణమైన వైఖరి సులువుగానే అర్థమయింది. ఎంపీలు కొద్దిమెరుగే కానీ, రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యులు, మంత్రులు ప్రజల దృష్టిలో బాగా పలచన అయ్యారు. నాలుగుగోడల మధ్య సమావేశాల్లో తప్ప మరెందుకూ పనికిరాని పదవులను వారు ఎందుకు పట్టుకువేలాడుతున్నారో అర్థం కాదు. లాబీయింగ్‌ద్వారానే తెలంగాణ సాధ్యం అన్న వైఖరి నుంచి, ప్రజా ఉద్యమాలను అప్పుడప్పుడు తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి వినియోగించుకునే దాకా మారుతూ వచ్చిన తెలంగాణ రాష్ట్రసమితికి ఇంకా పోరాటం మీద పూర్తి విశ్వాసం కలిగినట్టు కనిపించదు. 'అన్నీ ఆయనకు తెలుసును' అని ప్రధానమంత్రి తెలంగాణ ప్రతినిధివర్గంతో పదే పదే అన్న మాటలు కెసిఆర్ వైఖరిపై అనేక సందేహాలను కలిగించాయి. ఎన్నికలు వచ్చి, పదేపదే గెలవడం ద్వారానే ప్రాబల్యాన్ని విస్తరించుకోవాలని, 2014 దాకా అదే పద్ధతిలో కొనసాగితేనే ఫలితం ఉంటుందని టిఆర్ఎస్ నమ్ముతోందని అనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎస్ ఒకానొక భాగస్వామి మాత్రమేనని, పరిణామాలను శాసించగలిగిన ఇతర రాజకీయ, రాజకీయేతర శక్తులు అనేకం ఉన్నాయని సకలజనుల సమ్మె నిరూపించింది. అన్ని శక్తులను కలుపుకుని మరింత బలమైన సంఘటనగా ఏర్పడడానికి రాజకీయ జెఎసి ప్రయత్నించవలసి ఉన్నది. కోదండరామ్‌ను ఉద్యమశ్రేణులు తగినంతగా గౌరవిస్తున్నప్పటికీ, ఆయన నుంచి మరింత స్వతంత్రమైన, అందరినీ కలుపుకుని పోయే వైఖరిని కూడా వారు ఆశిస్తున్నారు

2 comments:

  1. Liked this article very much!!

    ReplyDelete
  2. శ్రీనివాస్ గారు,
    పాలకులు భరించలేని యాతనలు పెడుతుంటే, ప్రజలు (ఉద్యోగుల తో సహా) ఎంతకాలమైనా ఎదురుతిరుగుతారు. నిజాం కి వ్యతిరేకం గా ఆయుధాలు పట్టిన తెలంగాన ప్రజలే ఇందుకు సాక్ష్యం.
    పాలకులు పెట్టని యాతనలను కూడా వారికి ఆపాదించి, కృత్రిమం గా ఆవేశాలు రెచ్చగొట్టబడినపుడు, అప్పటిదాకా సాధారణం గా ఉన్న పరిస్థితి నుంచీ, అసౌకర్యమైన పరిస్థితి లోకి నెట్టబడినపుడు, అలాంటి సమ్మెలు ఎంత కాలం కొనసాగుతాయి. "సమ్మె ఆపితే ఘోరమైన కష్టాలు పెట్టే పరిపాలన లోకి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది రా బాబూ", అనుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఉద్యోగులు సమ్మె ఆపే వారే కాదు.

    ReplyDelete