Monday, October 24, 2011

పొరుగింటికి పాకిన అనకొండ

అలీనోద్యమ దేశంగా ఒక వెలుగు వెలుగుతున్నప్పుడు, భారతదేశం అనేక అంతర్జాతీయ అంశాలపై తనదంటూ ఒక వైఖరిని స్పష్టంగానే చెబుతూ ఉండేది. ఒకే ఒక పక్షంతో లీనమవడం తప్ప అలీనతకు ఆస్కారం లేని రోజులు వచ్చాక, మౌనంగా ఉండడాన్ని, డొంకతిరుగుడుగా వ్యక్తీకరించడాన్ని ఒక తప్పనిసరిగా అభ్యసించవలసి వచ్చింది. ప్రచ్ఛన్నయుద్ధకాలపు అవశేషం ఏదన్నా భారత విదేశాంగ విధానంలో మిగిలిఉన్నదా అంటే అది పాలస్తీనాకు గుర్తింపును కొనసాగించడంలోను, ఆ దేశానికి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వాన్ని కోరడంలోనూ మిగిలిఉన్నదని చెప్పవచ్చు.

అమెరికాపై టెర్రరిస్టు దాడి తరువాత, ఆప్ఘనిస్థాన్‌పై అమెరికా ఆక్రమణయుద్ధం ప్రారంభించినప్పుడు, ఇరాక్‌పై దండెత్తినప్పుడు, ఇరాన్‌పై ఆంక్షల కోసం ప్రయత్నించినప్పుడు, తాజాగా గడాఫీని హతమార్చినప్పుడు - భారత్ అధికారిక ప్రతిస్పందనలు ఒకే రకంగా ఉన్నాయి. గడాఫీ హత్యను కానీ, ఆయన హయాంలో భారత్‌తో ఉన్న సంబంధాల గురించి కానీ ప్రస్తావన ఏమీ లేకుండా- లిబియా పునర్నిర్మాణానికి అవసరమైన సహాయం చేస్తామని మాత్రం ఇండియా ప్రకటన చేసింది. గడాఫీ అధికార భ్రష్ఠుడైన వెంటనే భారత్, జాతీయ పరివర్తనా మండలి (టిఎన్‌సి)తోనే దేశరాజకీయ, ఆర్థిక పునర్నిర్మాణానికి సహాయపడతామని హామీ ఇచ్చింది. చమురు, గ్యాస్ ఉత్పత్తులు కాకుండా, లిబియాకూ భారత్‌కూ సాలీనా వంద కోట్ల డాలర్ల మేరకు వాణిజ్యం సాగుతోంది. అక్కడ అంతర్యుద్ధం ప్రారంభం కాకముందు సుమారు 20 వేల మంది భారతీయులు నివాసం ఉండేవారు. వారందరినీ మార్చినెలలోనే స్వదేశానికిి సురక్షితంగా తరలించారు. రెండుదేశాల మధ్య ప్రగాఢమైన స్నేహం ఉన్నదని చెప్పలేము కానీ, ఒక సదవగాహన ఉండేది. 1984లో ఇందిరాగాంధీ లిబియాను సందర్శించడమే ఆ దేశానికి మన నేతల ఆఖరి పర్యటన. ప్రచ్ఛన్నయుద్ధకాలంలో పశ్చిమాసియా విషయంలోను, వివిధ జాతీయ విముక్తి ఉద్యమాల విషయంలోను భారత్ వైఖరితో ఏకీభావం ఉన్నందున లిబియాతో నాడు స్నేహానికి ఆస్కారం ఉండింది. భారత్ ఇంధన అవసరాల రీత్యా ఉభయదేశాల మధ్య వాణిజ్యసంబంధం పటిష్టమయింది. అయితే, ఇటీవలి కాలంలో గడాఫీ, భారత్‌ను ఇబ్బందిపెట్టే వైఖరులు కొన్ని తీసుకున్నారు. కాశ్మీర్ స్వతంత్రదేశం అయితే బాగుంటుందని ఐక్యరాజ్యసమితిలో వాదించారు. ఈ ఏడాది తనపై తిరుగుబాటు చేసిన ప్రజలపై అణచివేత
చర్యలను సమర్థించుకోవడానికి కాశ్మీర్ ప్రస్తావన మరోసారి తెచ్చారు. భారత్ కాశ్మీర్ విషయంలో ఏమి చేస్తోందో తానూ అదే చేస్తున్నానని వాదించారు. గడాఫీ తాజా వైఖరులు ఏమైనప్పటికీ, ఇద్దరిమధ్యా గొప్పస్నేహం లేనప్పటికీ- అతని మరణంపైనా, అక్కడి పరిణామాలపైనా భారత్ తన వైఖరిని స్పష్టంగా చెప్పి ఉండవలసింది. లిబియాలో జరిగింది సమర్థనీయం కాదని భారత్ నేతలకు అంతరాంతరాల్లో తెలియదని కాదు. కానీ, మౌనమే దౌత్యనీతి అయిన సందర్భం ఇది. అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించలేము, అలాగని, వెనుకటి వైఖరులనుంచి పూర్తిగా జారిపోనూలేము.

హిందూమహాసముద్రాన్ని అణ్వస్త్ర రహిత మండలంగా ప్రకటించాలని భారతదేశం పదే పదే అంతర్జాతీయవేదికల మీద గగ్గోలుపెట్టిన కాలం ఇప్పటి తరానికి తెలియదు. హిందూమహాసముద్రాన్ని తానే కాపలా కాస్తానని, సోమాలియా పైరేట్లను పిట్టలను కాల్చినట్టు కాలుస్తానని ప్రగల్భాలు పలికే భారతదేశమే ఇప్పటివారికి తెలుసు. భారత్‌కు సుదూరంగా, హిందూమహాసముద్రంలో అక్కడెక్కడో ఒక దీవిలో అమెరికా స్థావరం ఏర్పరచుకుంటేనే దాన్నొక ఆత్మగౌరవసమస్యగా భావించిన కాలం పోయి, డబ్బిచ్చి ఎంపీలను కొని అయినా సరే, అణ్వస్త్ర ఒప్పందానికి అంగీకారం సాధించి అమెరికాను మెప్పించాలనుకునే కాలం వచ్చింది. ఇప్పుడు అగ్రరాజ్యాల విస్తరణవాదాన్ని ఖండించే ఉద్దేశ్యంకానీ, శక్తి కానీ భారత్‌కు లేవు. అలాగని, అంతర్జాతీయ సమాజంలో భారత్‌కు ప్రతిష్ఠ తెచ్చిన గతకాలపు వైఖరులను పూర్తిగా వదులుకునే ధైర్యమూ లేదు. అందుకే, లిబియాపై ఆంక్షల వరకు అంగీకరించింది కానీ, లిబియా గగనతలాన్ని 'నోఫ్లైజోన్' గా ప్రకటించడంతో సహా 'అవసరమైన అన్ని చర్యలనూ' తీసుకోవచ్చునని భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు భారత్ ఓటింగ్‌లో పాల్గొనలేదు.

లిబియా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై అభ్యంతరం ఉన్నప్పుడు, గడాఫీ మరణానంతరం ఆ విషయాన్ని సూత్రప్రాయంగానైనా భారత్ చెప్పి ఉండవలసింది. చెప్పలేదు. ఇరాక్‌కు, ఆఫ్ఘనిస్థాన్‌కు, లిబియాకు పట్టిన దుర్గతి భారత్‌కు ఎన్నడూ రాదు అన్న ధీమా కావచ్చు. తటస్థతే శ్రీరామరక్ష అన్న లౌక్యమూ కావచ్చు. లిబియాలో తడాఖా చూపించిన తరువాత, ఇక సిరియా, అల్జీరియా వంటి దేశాల్లో కార్యక్రమాలు మొదలుకావచ్చు. ఇరాక్‌లో పనిపూర్తయిందని, ఈ సంవత్సరాంతానికి ఉపసంహరించు కుంటున్నామని శుక్రవారం నాడు ఒబామా ప్రకటించారు కాబట్టి, అమెరికా మరో కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టవచ్చు. ఏమిటా ప్రాజెక్టు? పాకిస్థానా? హిల్లరీ క్లింటన్ ఇస్లామాబాద్‌లో హడావుడిగా అర్థరాత్రి జరిపిన పర్యటనలో చేసిన హెచ్చరికలను పాక్‌పాలకులు పట్టించుకుని దారికి వస్తే సరే, లేకపోతే, ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లోని వజీరిస్థాన్ ప్రాంతంపై బాంబుల వర్షం కురియవచ్చు. పదిహేను రోజులుగా అమెరికా-పాక్ దేశాల మధ్య మాటల యుద్ధం సాగుతూ ఉన్నది. తమపై దాడి జరుగుతుందన్న భయం పాక్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. బింకంతో మేకపోతు గాంభీర్యంతో పాకిస్థాన్ బక్కప్రగల్భాలు పలుకుతూనే ఉన్నది. తన దగ్గర అణ్వాయుధాలున్నాయన్న మాటను నేరుగా చెప్పకపోయినా, ఆ హెచ్చరికల్లో అంతర్లీనంగా వినిపిస్తూనే ఉన్నది. ఆప్ఘనిస్థాన్‌నుంచి కూడా ఉపసంహరించుకుని, ఆర్థిక వ్యవస్థను కాస్త మెరుగుపరుచుకుని వచ్చే ఎన్నికలమీద దృష్టిపెట్టాలని ఒబామా భావిస్తూ ఉండవచ్చు. ఆప్ఘన్‌ను పూర్తిగా విడిచిపెట్టాలంటే, తాలిబన్లను నిర్మూలించడమో, రాజీకి రప్పించడమో జరగాలి. తాలిబన్లకు, హక్కానీ నెట్‌వర్క్‌కూ బలమైన స్థావరంగా మారిన పాక్ వాయవ్యప్రాంతంపై విచక్షణారహితమైన దాడులు జరగకపోతే, ఆప్ఘన్‌లో అమెరికావ్యతిరేకులపై ఒత్తిడిపెరగదు. ఈ పరిస్థితి పాక్‌కు ప్రాణాంతకంగా మారింది. పాక్‌మీద అమెరికా దాడి చేస్తే భారత్ వైఖరి ఏమిటి?

భారత్‌లో ఉగ్రవాద చర్యలకు కారణం కాబట్టి, పొరుగుదేశం బలహీనపడడం మంచిదే కాబట్టి, పాక్‌పై దాడిని భారత్ సమర్థించాలా? అంత దగ్గరగా వచ్చినవాడు రేపు ఢిల్లీ మీద పడబోడని నమ్మకం ఏమిటని వ్యతిరేకించాలా? ప్రాదేశిక రాజకీయాల్లో ఒకరికొకరు శత్రువులైపోతే, అగ్రరాజ్యాలకు ఎంతటి అనువైన వాతావరణం ఏర్పడుతుందో ప్రస్తుత భారత ఉపఖండాన్ని చూస్తే అర్థం అవుతుంది. 'పెరట్లో పాములను పెంచుకుంటూ, అవి పొరుగువారిని మాత్రమే కాటేస్తాయని అనుకోగూడదు' అని హిల్లరీ పాక్ విదేశాంగ మంత్రిని హెచ్చరించారు. హక్కానీ నెట్‌వర్క్ మొదట సిఐఎ సృష్టించిన సంస్థేనని ఆమె మరచిపోయి ఉండవచ్చు. ఆమె చెప్పదలచుకున్నది ఒకటే- ఎవరింట్లో పాములనయినా తాము వచ్చి పట్టి చంపేస్తాము. ఏవి వానపాములో, ఏవి నాగుబాములో నిర్ణయించేది మాత్రం తామే. ఇవాళ, అమెరికా దృష్టిలో పాములు వజీరిస్థాన్‌లో ఉన్నాయి. రేపు ఉత్తరప్రదేశ్‌లోనో, ఛత్తీస్‌గఢ్‌లోనో కూడా ఉండవచ్చు.

భారత్‌కు కూడా అటువంటి పరిస్థితి ఎదురయితే ఎట్లా అనే ప్రశ్న మన పాలకులకు ఎందుకు రాదంటే, వారు దేశాన్ని బడుగుదేశంగా, బక్కదేశంగా భావించడం మానేశారు. వేటకుక్కలతో పాటు పరిగెడుతూ, తామే వేటాడుతున్నామని భ్రమపడుతున్నారు. ఇరాక్‌లో, ఆప్ఘనిస్థాన్‌లో అమెరికా చేసిన విధ్వంసం నుంచి జరుగుతున్న పునర్నిర్మాణంలో మనకూ ఒక చిన్న కాంట్రాక్టు దొరుకుతుందని ఆశించినట్టే, రేపు లిబియా విధ్వంసంలోనూ నాలుగు డాలర్లు వెదుక్కునే ప్రయత్నం చేస్తారు. పాకిస్థాన్‌ను సర్వనాశనం చేస్తే, ఉపఖండంలో మనదే రాజ్యం అని కలలు కంటున్నారు. డీగోగార్షియాలో కాదు, వాడు రేపు మన పొరుగునే తిష్ఠ వేయబోతున్నాడని, అర్థం చేసుకోలేకపోతున్నారు. భౌగోళిక ప్రపంచ రాజకీయాలలో అత్యంత వ్యూహాత్మక స్థానంలో అమెరికాకు స్థావ రం దొరికితే, అది దశాబ్దాల పాటు స్థిరంగా నిలిచిపోతుందని గుర్తించలేకపోతున్నారు. నిశ్శబ్దంగా బలం కూడగట్టుకుంటున్న చైనాకు చెక్ పెట్టడానికి భారత్‌ను పావుగా వాడుకునే ప్రయత్నమూ జరుగుతోందని తెలిసినా తెలియనట్టు ఉంటున్నారు. పొరుగింట్లో పాములుంటేనే కాదు, అగ్గి రగిలితే కూడా ఇరుగింటికి ప్రమాదమే!

2 comments:

  1. Our first enemy is Pakistan and second enemy is china..we need not worry about USA..but very wonderful article.

    ReplyDelete