Thursday, November 3, 2011

బ్రహ్మరథమా, సవారీయా?

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి మొదట నిప్పు రాజేసిన యోధులు పాపం అంతకు ముందు దశాబ్దం కాలం నుంచి దేశంలోని రాజ్యాలకీ, సంస్థానాలకీ కాలికి బలపం కట్టుకుని తిరిగారు, కలసి రమ్మని అడిగారు. నాయకత్వం వహించమనీ కొందరిని కోరారు. కొందరు విని ఊరుకున్నారు, కొందరు సహకరిస్తామన్నారు, కొందరు ఆ ప్రయత్నాల గురించి బ్రిటిష్‌వారి చెవిన వేశారు. ఆ ప్రయత్నాలు నిరర్థకమయ్యాయని చెప్పలేము. పోరాటం ఉత్తర, మధ్య భారతాల్లో ఉవ్వెత్తున ఎగియడానికి ఆ సన్నాహక చర్యలు చాలా ఉపకరించాయి. అయితే, చాలా కాలం దాకా దేశవ్యాప్త ఆమోదం కలిగిన ఒక నాయకుడంటూ దొరకలేదు. చివరకు ఏనభైఏండ్లు దాటిన వృద్ధుడిని, ఎర్రకోటకే పరిమితమైపోయిన చివరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్‌ని స్వతంత్ర భారత పోరాట సర్వసైన్యాధ్యక్షుడిగా, తిరుగుబాటు నాయకునిగా ఎన్నుకున్నారు. ఆయన గొప్ప నాయకత్వం అందించిందీ లేదు, చివరి నిమిషంలో కరవాలం ఝళిపించిందీ లేదు కానీ, విప్లవ సేనానిగా శిక్ష మాత్రం అనుభవించాడు. పరిపాలన ఏమి చేశాడో, ప్రజల గురించి ఏమి చేశాడో తెలియదు కానీ, చరమాంకంలో ఆయన జననేతగా మిగిలాడు.

నాయకత్వానికి ఉన్న మహత్యం అదే. నాయకుడో నాయకురాలో ముందుండి అనుచరులను సేనలను ముందుకు నడిపిస్తారని సాధారణంగా అనుకుంటాం, చాలా సందర్భాలలో జనమూ సేనలూ వెనకుండి నేతలను ముందుకు తోస్తూ కూడా ఉంటారు. ముక్కలు ముక్కలుగా, సంబంధం లేకుండా జరిగే కార్యాచరణకు నాయకత్వం ఒక కేంద్రాన్ని ఇస్తుంది. అనేకత్వంలో విజృంభిస్తున్న పోరాటాలు, తమకు తామే ఒక చిహ్నాన్నో
ప్రతీకనో నెత్తిన పెట్టుకుని ఏకోన్ముఖతను ప్రకటిస్తాయి. సిపాయిల తిరుగుబాటులో అనేకానేక మంది వీరులు సాహసులు త్యాగధనులు పోరును నడిపించినప్పటికీ, జాతీయస్థాయిలో తిరుగుబాటు జెండాను మోయడానికి ఒక పెద్ద నేత అవసరమైనప్పుడు ఉత్సవ విగ్రహమే కావచ్చు ఒక బొమ్మను ప్రతిష్ఠించుకున్నారు.

స్థాయిలోను, విస్త­ృతిలోను ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంతో పోల్చడం సరికాదు కానీ, తెలంగాణ ఉద్యమంలో కూడా ఇటువంటి నాయకత్వ అన్వేషణ నాలుగు దశాబ్దాలకు పైగా సాగుతూనే ఉన్నదనిపిస్తుంది. జనం తమంతట తామే తమ అసంతృప్తిని రాజకీయశక్తిగా మలచి, ఒక నాయకుడి చేతికి అప్పగించడం, అతను దాన్ని అమ్ముకోవడమో, జారవిడవడమో చేయడం 1969లోనే మొదలయింది. జనంలో అంతటి తపనా, సంసిద్ధతా ఉన్నప్పుడు నాయకుడనే ప్రతిమ ఎందుకు అన్న ప్రశ్న సబబే కానీ, ఉద్యమంలోని వివిధత్వాన్ని ఏకసూత్రతతో అనుసంధానించే వ్యక్తి, ఉద్యమగమనానికి, సాఫల్యానికి ఆవశ్యకం. ఉద్యమాలు కీలకస్థాయికి చేరుకుని, అవతలి పక్షంతో సంభాషించే ప్రక్రియను ప్రారంభించవలసి వచ్చినప్పుడు, ఉద్వేగాలను ఆవేశాలను ఆకాంక్షలను రాజకీయంగా అనువదించే పని నాయకత్వానిదే. ఉద్యమంలోని వివిధ పాయలు, బృందాలు, ఛాయలు ఎంతో కొంత ఆమోదించగలిగే వ్యక్తీ, ప్రాధాన్యాల వారీగా ఉద్యమలక్ష్యాలను క్రోడీకరించగలిగి దౌత్యం నెరిపే వ్యక్తీ నాయకుడిగా ముందుకు వస్తాడు. ఈ ప్రక్రియను సవ్యంగా అర్థం చేసుకోగలిగే శక్తి లేనివారు- నాయకులే ఉద్యమాలను సృష్టిస్తారని, ప్రజలను రెచ్చగొట్టి పోరాటాలు చేయిస్తారని తలకిందులుగా వ్యాఖ్యానిస్తారు.

నాయకత్వం వహించాలని ముందుకు వచ్చే వారందరినీ జనం ఆమోదిస్తారని లేదు. చెన్నారెడ్డి అనుభవం తరువాత- తెలంగాణ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేయడానికి ప్రయత్నాలు జరగలేదని కాదు. ఆశాభంగమూ నిస్ప­ృహా అలుముకున్న వాతావరణంలో మరొకరిని విశ్వసించే సాహసం ప్రజలు చేయలేదు. తిరిగి ప్రయత్నించాలనుకున్న సమయంలో సైతం ముందుకు వచ్చిన నేతలు విశ్వాసం కలిగించలేకపోయారు. ఇంద్రారెడ్డి ప్రయోగం కానీ, దేవేందర్‌గౌడ్ పార్టీ కానీ ఎందువల్ల సఫలం కాలేకపోయాయో విశ్లేషించుకోవాలి.   ప్రస్తుత సామాజిక నిర్మాణంలో నాయకత్వంలోకి ఎదిగేవారికి- సాంప్రదాయికమైన హోదాలు, కులం కానీ ధనం కానీ- తప్పనిసరిగా రెడీమేడ్ యోగ్యతలను అందిస్తాయి. అలాగని, కులమూధనమూ ఉన్నవారందరూ యోగ్యులవుతారని కాదు. ఒక అంశం మీద పట్టుదలా, నిరీక్షించగలిగే సహనమూ, ఉద్యమపర్యవసానాలను ఒడుపుగా నేర్పుగా నిర్వహించగలిగే సామర్థ్యమూ- ఒక వ్యక్తిలో కనిపించినప్పుడే జనం నాయకత్వాన్ని అప్పగిస్తారు. అది కూడా ఒక రోజులో ఒక నెలలో జరిగేది కాదు.

నాయకత్వం స్థిరపడడం ఒక సంఘటన కాదు, ఒక క్రమం. అది అన్ని సందర్భాలలోనూ పాజిటివ్ ఎంపిక కాకపోవచ్చు, తారతమ్యపరీక్షలో మెరుగైన వ్యక్తి ఎంపిక కావచ్చు. ఎన్ని అవలక్షణాలున్నప్పటికీ, ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ కె. చంద్రశేఖరరావు నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు నిరాకరించలేకపోవడానికి కారణాలు చారిత్రకమైనవి, రాజకీయమైనవి కూడా. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించేవారు కెసిఆర్‌ను లక్ష్యంగా పెట్టుకున్న కొద్దీ, ఆయన తెలంగాణకు గట్టి నాయకుడిగా రూపొందుతూ వస్తున్నారు.

తెలంగాణ ప్రాంతానికి ఒక దృఢమైన నాయకత్వం సమకూరడం వాంఛనీయమే అయినా, అనివార్యత నుంచి ప్రత్యర్థుల స్పందనలనుంచి అది స్థిరపడడం ప్రమాదకరం. ఒక తిరుగులేని శక్తిగా కెసిఆర్ రూపొందడంలోని ప్రమాదాన్ని గుర్తించినందువల్లనే (ఇతర కారణాలు లేవని కాదు) సామాజిక న్యాయశక్తులలో రోజురోజుకు అసహనం పెరుగుతున్నదనిపిస్తుంది. ఆ అసహనం ఒక్కోసారి తెలంగాణ ఉద్యమాన్నే ప్రశ్నించే స్థాయికి పోతున్నది. అందరికీ అన్ని విమర్శలూ ఉండి కూడా, బడుగు సామాజిక వర్గాలు ఎందుకు ప్రస్తుత నాయకత్వం వెనుకే సమీకృతమవుతున్నాయో విశ్లేషించకోకుండా, కేవలం కుట్ర సిద్ధాంతాలు వల్లె వేసినందువల్ల పెద్ద ఉపయోగం లేదు. ఉద్యమ మహాప్రవాహంలో ఏదో ఒక స్థాయిలో అంతర్భాగమై ముందుకు నడిచేవారే తమ ప్రాతినిధ్యాన్ని సాధించుకోగలరు, భవిష్యత్ ప్రమాదాలను నివారించగలరు.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్న శ్రేణులు కెసిఆర్ ప్రతిమను తమ భుజాల మీద 'స్వచ్ఛందంగానే' మోస్తున్నారు. దీన్ని కెసిఆర్ సవారీగా కూడా వ్యాఖ్యానించవచ్చును కానీ, ఉద్యమకారులు దాన్ని అంగీకరించరు. ఉద్యమ మనుగడకు అవసరం కాబట్టే, ఆ నాయకత్వాన్ని భరిస్తున్నామని, స్వీకరిస్తున్నామని అంటారు. ఉద్యమం ఏ ఒక్కరిచేతిలోనూ లేని మాట నిజమే. నిర్మాణపరంగా, కెసిఆర్‌కు కానీ, ఆయన పార్టీకి కానీ ఉద్యమంపై నిజమైన పట్టు ఉన్నదని చెప్పలేము. అందుకే ఉద్యమేతర మార్గాలలో లక్ష్యాన్ని సాధించి రాజకీయ లబ్ధి పొందాలని నాయకత్వం భావిస్తున్నదేమోనన్న అనుమానం కలుగుతుంది. అయినా, ప్రజలు మాత్రం ఉద్యమం వేడి ద్వారానే రాజకీయవాదులను నడిపిస్తున్నారు, తమకంటె వారికే ఎక్కువ లబ్ధి లభించే అవకాశమున్నప్పటికీ.

దేశంలోని అనేక వర్గాల్లో, బృందాల్లో వర్తమాన పరిస్థితులపై తీవ్రమైన అసంతృప్తి ఉన్నప్పటికీ, విశ్వసనీయమైన నాయకత్వ లోపం కారణంగా అది సంఘటితం కాలేకపోతున్నది. విశ్వసనీయత నేడు జాతి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ప్రజామోదాన్ని పైనుంచి సృష్టించి దిగువకు తీసుకువెళ్లాలనుకునే దృక్పథలోపం మరో సమస్య. ఒకనాడు నెహ్రూ కుటుంబ వారసత్వం ఉండడమే పెద్ద అర్హతగా ఉండిన దేశంలో ఇప్పుడు ఆమోదనీయత కోసం రాహుల్‌గాంధీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒకనాడు ప్రతిపక్షనేతలంటే, ప్రత్యామ్నాయ నాయకత్వం అన్న దృష్టి ఉండేది. ఇప్పుడు వారూ ఆశ కలిగించడం లేదు. విద్యాధికులై, మధ్యతరగతిలోని ఎగువశ్రేణుల్లో ఉన్నవారిలో ఉన్న ఆకాంక్షలు సైతం ఒక ఆలంబన కోసం వెదుక్కుంటున్నాయి. ఒకనాడు చంద్రబాబునాయుడు వారికి ఆశగా కనిపించారు. తరువాత మరికొందరికి లోక్‌సత్తా జయప్రకాశ్‌నారాయణ్ కనిపిస్తున్నారు. జాతీయస్థాయిలో ఇప్పుడు అన్నా హజారే బృందం కనిపిస్తోంది. కానీ, అల్పపీడనం స్థాయిలోనే అసంతృప్తి మిగిలిపోతోంది తప్ప, తుఫానుగా పరిణమించడంలేదు. నాయకులను ముందుకు తోయగలిగే శక్తి ఆ వర్గాలకు లేదు, ఆ వర్గాలను ముందుకు నడిపించగలిగిన చొరవ ఆ నాయకత్వానికీ లేదు. అందుకే అట్టడుగు వర్గాల వారు ఉదాత్తంగా కనిపించే, విలువల జపం చేసే నాయకుల కోసం కాక, ఆచరణాత్మకంగా వ్యవహరించే సాదాసీదా నేతలనే ఇష్టపడతారు.

వారిలో ఎన్ని లోపాలు ఉండనీ గాక, ఎంత అవినీతి ఉండనీ గాక. విజయం సాధించగలిగే శక్తి ఉన్నదా లేదా, ప్రయాణాన్ని ఒక మజిలీకి చేర్చగలిగే సత్తా ఉన్నదా లేదా అని మాత్రమే చూస్తారు. తమ ఆకాంక్షల ఉధృతికి, నైతిక శక్తికి సమ ఉజ్జీ అయిన మనిషి నేతగా లభించకపోతే, తామే ఒక కనీసస్థాయి మనిషిని ఎంచుకుని, అతనికే నాయకత్వపు అలంకారాలు చేస్తారు.

No comments:

Post a Comment