Tuesday, November 8, 2011

తొంభై ఏడేళ్ల నవయువకుడు

పెద్ద పెద్ద ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లల్ని అడగండి, అన్నా హజారే ఒక స్వాతంత్య్ర సమరయోధుడు అని చెబుతారు. గాంధీగారు గాంధీగారు అని వినడమూ చదవడమూ తప్పితే, అటువంటి వాళ్లను ప్రత్యక్షంగా చూసింది లేదు, అదృష్టవశాత్తూ ఇప్పుడు హజారేను చూడగలుగుతున్నాం- అని మురిసిపోతారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి హజారేకు పట్టుమని పదేళ్లే అని చెబితే ఆశ్చర్యపోతారు.

హజారేను భావిభారత పౌరులు అట్లా చూడగలగడం సంతోషం కలిగించేదే. ఆయనను బాగా గౌరవించేదే. తాము గౌరవించదగ్గ, ఆరాధించదగ్గ, నిస్వార్థమని చెప్పదగ్గ ఒక ప్రతీకా, ఒక్క మనిషీ కనపడని ఎడారికాలమిది అని బాధపడిపోయే కొన్ని శ్రేణుల ప్రజల ఊహాచిత్రమే హజారే. వారందరి ఆదర్శాలకూ ఆలంబనగా దొరికిన నాయకుడాయన. ఆ ఊహాచిత్రపు రచన చేసింది మాత్రం ఉద్యమాలో, విశాల ప్రజానీకమో కాదు.

ఆంగ్లవిద్యలో ఆరితేరిన సంస్కారవంతుల జాతీయ శిష్టవర్గమూ వారి గుండెచప్పుడును అందంగా ఆర్తితో ప్రతిధ్వనించే ప్రచారశిబిరమూ కలసి చిత్రించిన బొమ్మ అది. హజారే వ్యక్తిగత స్థాయిని అంచనా వేయడం కాదిది. ప్రజాజీవితంలో ఆయనది ఒక విశిష్ట మార్గం. ఆ మార్గాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన సంకల్పమూ కార్యనిష్ఠా నిస్వార్థ తత్పరతా వేలెత్తి చూపలేనివి. అయినప్పటికీ, ఆయన మార్గంపై ఉండే సందేహాలు, ఆయన అనుయాయివర్గంపై ఉండే అనుమానాలు తోసిపారేయదగ్గవి కావు. ఎన్ని అదనపు మార్కులు వేసినా, ఒక స్వాతంత్య్ర సమరయోధుడి స్థాయిని హజారేకు ఇవ్వలేము.

ప్రభుత్వాన్ని తన దగ్గరకు రప్పించుకున్న తన ఆమరణ దీక్షకు, తాజాగా మౌనదీక్షకు వేదికగా ఎంచుకున్న దేశరాజధాని నగరంలోనే ఒక స్వాతంత్య్రసమరయోధుడు, నిండునూరేళ్లు జీవించబోతున్న పండుముదుసలి కొండా లక్ష్మణ్ బాపూజీ సత్యాగ్రహం చేస్తున్నారు. ఆయన పక్కనే మరో వృద్ధయోధుడు బోయినపల్లి వెంకటరామారావు, మరికొందరు స్వాతంత్య్ర సమరయోధులు దీక్షలో ఉన్నారు. అన్నాహజారేకోసం ఉప్పొంగినట్టుగా ఢిల్లీ గుండెలు, జాతీయ మీడియా కెమెరాలు వారి కోసం ఉప్పొంగడం లేదు. అశేష జనసందోహం జాతీయ జెండాలు పట్టుకుని, ఒంటిమీదా బట్టల మీదా నినాదాలు రాసుకుని ఆ శిబిరం చుట్టూ గుమిగూడడం లేదు. అవినీతిపై యుద్ధమంటే అందరూ ఒప్పుకునే పోరాటంకాబట్టి అన్నా హజారేకు అందరూ బ్రహ్మరథం పట్టారు, ప్రత్యేక తెలంగాణ కోసం సత్యాగ్రహం చేస్తున్న బాపూజీకి అందరూ మద్దతు ఎట్లా ఇస్తారు?- అన్న ప్రశ్న సహేతుకమయినదే. తెలంగాణా డిమాండ్ గురించి సంబంధిత ప్రాంతాల ప్రజలలో, నాయకులలో భిన్నాభిప్రాయాలున్నాయి, కాంగ్రెస్ అధినాయకత్వం అయోమయంలో ఉన్నది-ఇవన్నీ వాస్తవాలే. అన్నా హజారే ఉపవాసదీక్ష చేశారు- బాపూజీ కేవలం సత్యాగ్రహం మాత్రమే చేస్తున్నారు, ఇదీ వాస్తవమే.

కానీ, గాంధీ మహాత్ముడు సైతం తన రాజకీయజీవితంలో అనేక వివాదాస్పదకారణాలకు సత్యాగ్రహాలు చేశారు, ఒక్కొక్కసారి ప్రజావ్యతిరేకమని భావించే అంశాలపై కూడా పట్టుదలగా ఆందోళనకు దిగారు. అయినా, ఆయన దీక్షలను ఆ అంశాల కారణంగా ఎవరూ తక్కువ చేసి చూడలేదు. అందుకే ఇప్పుడు,
తొంభై ఏడేళ్ల సీనియర్ రాజకీయవేత్త, జాతీయవాది కొంత మంది సహచరులతో దేశరాజధాని వీధుల్లో కూర్చుంటే దానికి స్పందన లభించకపోవడాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. నూటాపాతికేళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, తన ఘనవారసత్వానికి సజీవ ప్రతీకగా నిలిచిన మనిషితో సంభాషించలేకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

బాపూజీ జీవితం గొప్పది. ఒక ప్రాంతానికి పరిమితమైన అభివృద్ధి ఆకాంక్షల దగ్గర నుంచి, సమస్త మానవాళికీ సంబంధించిన విస్త­ృత ఆదర్శాల దాకా మోసుకుని తిరిగిన ప్రజాజీవితం ఆయనది. క్విట్ ఇండియాలో పాల్గొన్నారు, ఎమ్ఎన్‌రాయ్ ప్రభావంలో ఉన్నారు. సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతాలను అధ్యయనం చేశారు. పద్మశాలీల సమీకరణలో ముఖ్యపాత్ర వహించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాలుపంచుకున్నారు. తరువాతి కాలంలో ప్రధానస్రవంతి రాజకీయాల్లో ఉంటూనే, ఆ పరిమితుల మధ్యనే సామాజిక న్యాయ విలువలను కాపాడడానికి కృషిచేశారు ఆయన. దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కావడంలో బాపూజీ ప్రమేయమూ, చొరవా చాలా ఉన్నాయి. 1969 తెలంగాణ ఉద్యమం కాలంలో మంత్రిపదవికి బాపూజీ చేసిన రాజీనామా ఇప్పటి మంత్రులూ ప్రజాప్రతినిధులూ చేసినటువంటి రాజీనామాలు కావు.

తెలంగాణలో భూస్వామ్యదోపిడీని ఎదిరించిన చరిత్రా, ఒక ప్రాంతంగా తెలంగాణపై వివక్షను ప్రశ్నిస్తున్న వర్తమానమూ బాపూజీ వ్యక్తిత్వంలో కలగలసిపోయాయి. తెలంగాణకు ఎదురయిన రెండు రకాల సమస్యల గురించిన అవగాహన ఉన్నది కాబట్టే, ఆ రెంటినీ ఒకదానికి ఒకటి పోటీదారుగా, ప్రత్యర్థిగా నిలబెట్టే చాపల్యం ఆయనలో కనిపించదు. మలివిడత తెలంగాణ ఉద్యమం ప్రారంభమయిన నాటికి ఆయనకు ఎనభైఏళ్లు పైబడ్డాయి. ఇప్పుడే ఎంతో ఆరోగ్యంగా ఉన్న బాపూజీ అప్పుడు మరింత దృఢంగా ఉన్నారు. అయినా, ఉద్యమానికి తాను నేతృత్వం వహించాలని ఉబలాటపడలేదు. తన అనుభవాన్ని, అవగాహనను అందిస్తూ పెద్ద దిక్కుగా కొనసాగాలనే అనుకున్నారు. బలహీనవర్గాలకు చెందినవారిని అగ్రనాయకత్వానికి అంగీకరించడంలో సమాజానికి ఉన్న పరిమితులు ఆయనకు తెలియనివి కావు. కొత్త తరం వారు సాహసించినప్పుడు, వారికి వెన్నుదన్నుగా ఉండడానికి ప్రయత్నించారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజాపార్టీ పెట్టినప్పుడు, దాన్ని ఆశీర్వదించడమే కాదు, అందులో భాగమయ్యారు కూడా. ఆ ప్రయత్నం విఫలమయ్యాక కూడా ఆయన విశ్రమించలేదు. తన సలహాలు కోరినవారిని, తన సారథ్యాన్ని కోరినవారిని ఆదరిస్తూనే ఉన్నారు. ఆ అవిశ్రాంత ఆచరణలో భాగంగానే ఇప్పుడు సత్యాగ్రహంలో ఉన్నారు.

బాపూజీ సత్యాగ్రహాన్ని సమర్థిస్తున్నవారూ, ఆయనకు జేజేలు పలుకుతున్నవారూ అందరూ ఆయనపై గౌరవంతోనే ఆ పనిచేస్తున్నారని చెప్పలేకపోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దానికి ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రతిపాదిస్తున్నవారున్నారు. అంతకుమించిన గౌరవానికి కూడా ఆయన అర్హుడే, కానీ, దాన్ని ఆయన ఆశిస్తున్నారని అనుకుంటే అపచారమే. టిఆర్ఎస్‌పైనా, చంద్రశేఖరరావు నాయకత్వం మీద రకరకాల అనంగీకారాలున్నవారు బాపూజీ వ్యక్తిత్వాన్ని ఆసరా చేసుకోవడానికి ప్రయత్నిస్తుండవచ్చు. రకరకాల వైరుధ్యాలున్న తెలంగా ణ ఉద్యమానికి బాపూజీ ఒక సమన్వయశక్తిగా పనిచేస్తారని, పోరాటానికి నైతిక స్థయిర్యం ఇస్తారని నిజంగా ఆశిస్తున్నవారూ ఉండవచ్చు. ఎవరేమనుకున్నా, అందరూ గౌరవించి తలకెత్తుకోదగ్గ వ్యక్తి బాపూజీ. టిఆర్ఎస్ కానీ, ఆ పార్టీ ప్రధానశక్తిగా సాగుతున్న ఉద్యమం కానీ చేసిన అతిపెద్ద పొరపాట్లలో - బాపూజీ సత్యాగ్రహానికి మద్దతు ఇవ్వకపోవడం, మౌనం వహించడం ముఖ్యమైనది.

కొండా లక్ష్మణ్ సత్యాగ్రహం వారం రోజులకే పరిమితమైనది. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న దీక్షతో కానీ, గతంలో చంద్రశేఖరరావు చేసిన దీక్షతో కాని దీనికి పోలిక లేదు. అప్పుడెప్పుడో ఢిల్లీలో కెసిఆర్ ఒక రోజు చేసిన దీక్షతో కూడా దీనికి పోలిక లేదు. దేశరాజధానిలో తెలంగాణ పరిష్కారావశ్యకతను నొక్కి చెప్పడానికి, జాతీయస్థాయిలో నలుగురి దృష్టికి సమస్యను తీసుకువెళ్లడానికి ఉద్దేశించిన సత్యాగ్రహం బాపూజీది.   అందులో ఆయన విజయం సాధించినట్టే చెప్పవచ్చు. తెలుగుదేశంపార్టీకి చెందిన తెలంగాణ ప్రతినిధులు, బాపూజీతో పాటు కలసినడుస్తున్న పోరాట సహచరులు మాత్రమే కాక, కాంగ్రెస్ ఎంపీలు కూడా బాపూజీకి మద్దతు చెప్పారు. గద్దర్ ప్రజాఫ్రంట్ కూడా ఆయనకు సంఘీభావం ప్రకటించింది. మాటవరసకైనా కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ వచ్చి పరామర్శించారు. అనేక ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలు వచ్చి కొండా లక్ష్మణ్‌కు సంఘీభావం చెప్పారు.

ఎంతో ఉధృత స్థాయికి వెళ్లి, మళ్లీ విరామానికి లోనయిన తెలంగాణ ఉద్యమంలో ఈ సత్యాగ్రహానికి ప్రాధాన్యం ఉన్నట్టు కనిపించకపోవచ్చు. తెలంగాణ ఉద్యమానికి కేంద్రం నుంచి ఎదురవుతున్న అలక్ష్యమూ స్పందనారాహిత్యమూ ఒక ప్రతికూలత అయితే, అనివార్య పరిస్థితులనుంచి ఉద్యమంలో ఏర్పడుతున్న ఏకనాయకత్వం మరో ప్రతికూలత. కొండా లక్ష్మణ్ సత్యాగ్రహం ఈ రెండు ప్రతికూలతలనూ స్పృశించడానికి ప్రయత్నించింది.

3 comments:

 1. కేసీయార్ నాయకత్వాన్న్ని మీరు ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదు ..మహా మహా విప్లవోద్యమాల్లో కుడా వున్నది ఏక వ్యక్తీ నాయకత్వాలే కదా ..ఉద్యమ నాయకులకు వుండే అవలక్షణాలను అతిగా అంచనా కట్టి ...ఉద్యమానికి అదే ప్రధాన లోటుగా చిత్రించడం అన్యాయం ..ఎవరికీ ఇష్టమున్నా లేకున్నా , తప్పులు ఎన్నివున్నా పోరాటం ఈ స్థాయికి రావటానికి ప్రధాన కారణం కేసీయార్ ..అయినా విప్లవ కారులు ,ప్రజస్వామికవాదులు ..ప్రజా మేధావులు పుష్కలంగా వుండికూడా ఒక నిజమైన ప్రత్యామ్నాయం తయారు చేయకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ..గద్దర్, బాపుజి లకు ఎందుకు తెలంగాణా విషయంలో విశ్వసనీయత రావట్లేదో ఒక్కసారి ఎనలైజ్ చేయండి ..టీడీపి నేతలని పక్కన పెట్టుకొని , కేసీయార్ ను బాపుజి విమర్శిస్తుంటే జనం నవ్వుతున్నారు ..రోజు కేసీయార్ ను తిడుతూ కూర్చుంటే ప్రత్యామ్నాయం రాదు ..ప్రజల్ని భారీగా కదిలించి సీమాంధ్ర లాబీని టార్గెట్ చేస్తూ..టియారేస్ కు ఎదురుగా కాకుంటా సమాంతరంగా నడిస్తే ఫలితం వుంటుంది ..ఆంధ్ర వర్గ కుల దోపిడి ముఠాకు ప్రతినిధి అయిన టీడిపీని దూరంగా వుంచితే ప్రయోజనం వుంటుంది ..

  ReplyDelete
 2. http://telangaanaa.blogspot.com/2011/11/blog-post_09.html

  ReplyDelete
 3. "రోజు కేసీయార్ ను తిడుతూ కూర్చుంటే ప్రత్యామ్నాయం రాదు ..ప్రజల్ని భారీగా కదిలించి సీమాంధ్ర లాబీని టార్గెట్ చేస్తూ..టియారేస్ కు ఎదురుగా కాకుంటా సమాంతరంగా నడిస్తే ఫలితం వుంటుంది "

  well said, KCR స్వార్థపరుడే కావచ్చు , కాని అతడి కి న్యాయకత్వ లక్షణాలున్నాయ్. సమకాలీనుల తొ పోలిస్తే ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరి లో ఎక్కువ గా ప్రజల్ని ఆకర్షించగలడు . కావలనె భాష ను అదుపు లో వుంచుకొడు కాని మంచి వక్త. దురదృష్ఠవశాత్తు అతడి సామర్త్యాన్ని సరైన రీతి లో వినియొగించడం లేదు .. ఏది ఏమైన మనలక్ష్యం నెరవేరే దాకా అన్నిటిని భరించాలిసిందె

  ReplyDelete