Monday, November 14, 2011

విస్తరిస్తున్నది డాలర్ మతమే!

గాంధీగారిని హింసలు పెడుతున్నదీ, ఇక్కడ పేదలకు సేవ చేస్తున్నదీ ఒకరేనా?- అని నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లిలోని మిషనరీ ఆస్పత్రిని ప్రస్తావిస్తూ, వట్టికోట ఆళ్వారుస్వామి నవల 'ప్రజల మనిషి'లోని ప్రధాన పాత్ర ఆశ్చర్యపడుతుంది. ఆ ఇద్దరూ ఒకరేనా, వేరువేరా అన్నది రాదగ్గ ప్రశ్నే. ఒకరే అని తెలిసిరావడం విస్మయపరిచే సమాధానమే. ఒకచేత్తో బైబిల్‌ను మరో చేత్తో తుపాకిని పట్టుకుని యూరోపియన్ సామ్రాజ్యవాదులు మనదేశంలోకి ప్రవేశించారని చరిత్రకారులు వ్యాఖ్యానిస్తుంటారు. కానీ, సామ్రాజ్యవిస్తరణ చేసిన వర్తకులూ, సైన్యాలూ, ఆ విస్తరణకు బాధితులయ్యే ప్రజల దగ్గరికే వెళ్లి మతబోధలు చేసిన ప్రచారకులూ వారి కర్తవ్యపరిధుల దృష్ట్యా వేరువేరుగానే ఉన్నారు. ఒక్కోసారి, ఇద్దరి ప్రయోజనాలు, పనిపద్ధతులు పరస్పరం విరుద్ధంగా ఉండడం వల్ల ఇబ్బందులూ ఏర్పడ్డాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలసలు ఏర్పరుచుకునే క్రమంలో- మత ప్రచారకుల ప్రజాసంబంధాలు, బోధనలూ- ఆక్రమణదారులకు ఆమోదాన్ని సాధించిపెట్టాయనుకోవడంలో అసత్యమేమీ లేదు. అయినంత మాత్రాన, ఆయా వలసల్లోని వివిధ ప్రజావర్గాలలో, సామాజిక పరిణామాల్లో వలసవాదుల పాలనాపరమైన చర్యలు కానీ, వలసమతప్రచారకుల సంస్కరణలు కానీ కలిగించిన సానుకూల ప్రభావాన్ని, ప్రగతిశీలమైన మార్పులను తోసిపారేయలేము.

బౌద్ధం కానీ, క్రైస్తవం కానీ, ఇస్లాం కానీ- అవి అవతరించినప్పుడు నిర్వహించిన చారిత్రకపాత్ర- అనంతర కాలంలో నిర్వహించగలిగాయని చెప్పలేము. బౌద్ధం భారతదేశ నిర్దిష్ట పరిస్థితులలో సంకల్పించిన మౌలిక మార్పులను సాధించకుండానే పరాజితమై, ఇతర దేశాలకు వలస వెళ్లి, అనేక మార్పులకు లోనయింది. తిరిగి భారతదేశంలోని దళితులు గుండెలకు హత్తుకునేదాకా, ఇతర దేశాల్లో అధికారిక మతంగా మాత్రమే, యథాతథస్థితిని సమర్థించే మతంగా మాత్రమే మిగిలింది.   నాటి మతపెద్దల దౌష్ట్యాన్ని, అమానవీయతను ధైర్యంగా ఎదిరించి, కొత్త నైతికతను, ప్రబోధాలను మానవాళికి అందించిన ప్రవక్త జీసస్. ఆయన బోధనల ప్రాతిపదికపై విస్తరించిన మతం- ఆ మతానుయాయులు విస్తరణవాదులుగా, వలసవాదులుగా, పెట్టుబడిదారులుగా పరిణమించిన తరువాత అదే తీరులో ఉండలేకపోయింది. క్రీస్తు మతానికి ప్రతినిధులుగా వెలిగిన పెద్దలు, రాజ్యాల అవసరాలతో రాజీపడ్డారు. అనేక అమానుష యుద్ధాలను సమర్థించారు. బానిస వర్తకాన్ని వ్యతిరేకించలేకపోయారు. మధ్య ఆసియాలో అనైక్యతతో పరస్పరం సంఘర్షిస్తూ ఉండిన వివిధ తెగలను, మితిమీరిన విగ్రహారాధనతో,
అనాచారాలతో, అరాచకాలతో దిగజారిపోతున్న ఆ తెగల సామాజిక జీవనాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రవక్త మహమ్మద్ నడుం కట్టారు. ఆయన ఉదాత్త ఆశయాలు, ప్రతిపాదించిన విలువలు రకరకాల వ్యాఖ్యానాలకు లోనయి ఆచరణలో భిన్నంగా మారిపోయాయి.   అయితే, ఈ మూడు మతాలను ఆలంబనగా చేసుకుని అనేక ప్రజావ్యతిరేక రాజ్యాలు వర్ధిల్లినట్టే, ఈ మతాల బోధనలను ఆసరా చేసుకుని ప్రజల పక్షాన జరుగుతున్న తీవ్రమైన పోరాటాలూ ఉన్నాయి. అనంతర కాలంలో పొడసూపిన అవలక్షణాలకు, క్షీణవిలువలకు ఆయా మతాలు కానీ, ఆ మతాల బోధకులు కానీ కారణం కాదని వేరే చెప్పనక్కరలేదు. ఆయా మతాల పేరుచెప్పుకుని, మౌలిక మానవీయ విలువలకు ఎవరైనా విఘాతం కల్పిస్తూ ఉంటే, అందుకు మతాలను నిందించడం పొరపాటు.

మధ్యయుగాలలో ప్రారంభమైన యూరోపియన్ వలసవాదం సహజంగానే క్రైస్తవ విస్తరణకు అవకాశాలను తెరచింది. వాస్కోడిగామా, కొలంబస్‌ల కంటె ముందు కాలంలో, క్రైస్తవ ప్రచారకుల పర్యటనలు జరగలేదని కాదు. చరిత్రలో అతి పెద్ద మిషనరీ మతాలు రెండే- బౌద్ధం, క్రైస్తవం. ఈ రెండు మతాల ప్రచారకులు అనూహ్యమైన రీతిలో ప్రపంచ సంచారం చేశారు. క్రీస్తుశకం ఆరంభ శతాబ్దాలలోనే కేరళ తీరానికి క్రైస్తవ బోధకులు వచ్చారు.  మొదటి క్రైస్తవ బోధకుడు వచ్చిన నాటికి భారతదేశం ఒకే ఒక మతంతో ప్రశాంతంగా ఉన్న దేశమేమీ కాదు. వైదికమతం, బౌద్ధం తీవ్రంగా ఘర్షణ పడుతున్న కాలం అది. కొన్ని ప్రాంతాలలో వైదిక, జైన మతాల మధ్య ఘర్షణ నడుస్తున్నది. ఇక దేశవ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉన్న మాత్రారాధనలు, స్థానిక ఆదివాసీ దేవతాసంప్రదాయాల సంగతి చెప్పనక్కరలేదు. తరువాతి కాలంలో వైష్ణవ, శైవ సంప్రదాయాల మధ్య హింసాత్మకమైన పోటీ ఏర్పడింది. ఆ రెండు కోవలలోను, వైదిక, అవైదిక ధోరణులతో మరిన్ని పాయలు ఏర్పడ్డాయి. శంకరాచార్యులు, రామానుజాచార్యులు అనేక పరమత ఆలయాలను తమ తమ మతాలలోకి మార్చారని చెబుతారు. బహుశా, ఆయా పరమతస్థుల మతమార్పిడికి సంకేతంగానే ఆలయాల మార్పుకూడా జరిగి ఉండవచ్చు. ఇక బౌద్ధపరిశోధకులను ప్రశ్నిస్తే, దేశంలో ప్రస్తుతం ఉన్న ఆలయాల్లో అనేకం బౌద్ధస్థలాలేనని చెబుతారు. భారతదేశంలో ఇస్లాం ప్రవేశం జరిగాక, అనేక మతమార్పిడులు జరిగాయి. అందులో కొన్ని కత్తి ఝళిపించి జరిపిన మార్పిడులు ఉన్నప్పటికీ, పరాజితమవుతున్న బౌద్ధం నుంచి, వైదికమతంలోని నిమ్నవర్గాల నుంచి స్వచ్ఛందంగా జరిగిన మార్పిడులు కూడా ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. తరువాత హిందూమతంగా ప్రసిద్ధమైన వైదిక మతంలో ఉన్న తీవ్రమైన అంతరాలు (కుల వ్యవస్థ ఆది వేద మతంలో లేదని, అనంతరకాలంలో చేరిన అవలక్షణమని ఆర్యసమాజీయులు అంటారు) నిమ్నవర్గాలు తరచు బయటి అవకాశాల కోసం ప్రయత్నించడానికి కారణమని గుర్తించకపోతే, ఈ ప్రక్రియ భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది.  భారతదేశం ఇతర దేశస్థుల దాడికి, వలసకు గురి కావడానికి జాతిలోని అనైక్యత కారణమని చెప్పేవారు కూడా, ఆ అనైక్యతను దేశీయపాలకుల మధ్య అనైక్యతగా చూస్తారు. కానీ, అది ఇక్కడి నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థ కల్పించిన అనైక్యత అని,అదే ఇతరులకు రాజకీయంగా కానీ, మతపరంగా కానీ చొరబాటు అవకాశాలు ఇచ్చిందని గుర్తించడం అవసరం.

మతానికీ, సామ్రాజ్యాలకూ అవినాభావ సంబంధం ఉన్న రోజుల్లో సరే కానీ, ఆధునిక సెక్యులర్ ప్రజాస్వామిక యుగంలో మునుపటి తరహా మతవిస్తరణలు అవసరం లేదు. రాజ్యాల భౌతిక విస్తరణే నిలిచిపోయిన కాలం ఇది. ఎవరి జనసంఖ్యను వారు స్థిరీకరించుకుని, వారి వారి మతవర్గాల మధ్య పనిచేస్తే సరిపోతుంది. వ్యక్తులు స్వచ్ఛందంగా మతవిశ్వాసాలను మార్చుకోవడం స్వేచ్ఛలో భాగం. లేదా సమూహాలు మూకుమ్మడిగా తమ ఆత్మగౌరవప్రకటన కోసం ( అంబేద్కర్ బౌద్ధంలోకి మారినట్టు) మతాన్ని మార్చుకోవడం సామాజికమైన కార్యాచరణ.
కానీ, మనుషులను గెలుచుకునే పద్ధతిలో ఎవరూ ఎవరినీ మార్చడం, చేర్చుకోవడం వాంఛనీయం కాదు. ఏ దేశంలో కానీ, ప్రాంతంలో కానీ జనాభా సామాజిక స్వభావాన్ని పెద్ద ఎత్తున కృత్రిమంగా మార్చే ప్రయత్నమేదైనా అభిలషణీయం కాదు. అయితే, అక్కడక్కడా చెదురుమదురుగా జరిగే సంఘటనలకు అతిగా స్పందించవలసిన అవసరమూ లేదు. ఏడువందల సంవత్సరాలు ముస్లిమ్ రాజులు పాలించిన తరువాత కూడా దేశంలో నేడు ముస్లిముల జనాభా 13.5 శాతానికి మించి లేదు. రెండువందలేండ్లు తెల్లవారు పాలించినప్పటికీ, క్రైస్తవుల జనాభా 2.5 శాతానికి మించలేదు.  ఈ దేశ జనసంఖ్య స్వభావాన్ని తలకిందులు చేయగలిగే మతమార్పిడులు జరగడం అంత సులభం కాదని చరిత్ర చెబుతున్నది. ఆ మాత్రం మైనారిటీ మతానుయాయులు, ఇస్లాం, క్రైస్తవాలు రాక మునుపు కూడా దేశంలో ఉన్నారు. మతమార్పిడులు అనైతిక పద్ధతుల్లో జరుగుతున్నాయని అనుకుంటే కనుక, దాన్ని నిరోధించే అవకాశమూ శక్తీ మెజారిటీ మత పెద్దల చేతిలోనే ఉన్నది.

అట్టడుగుకులాలకు సమానమైన ప్రతిపత్తీ, గౌరవమూ ఉన్న సమాజాన్ని, సాంస్క­ృతిక వైవిధ్యాన్ని అనుమతించే ప్రజాస్వామిక స్వభావాన్ని నిర్మించుకోవడమొక్కటే, పరమతాల విస్తరణను నిరోధించగలదు. ఏ వర్గాలైతే తమ సామాజిక న్యాయసాధన లో, ఆత్మగౌరవపరిరక్షణలో మతమార్పిడిని ఒక సాధనంగా ఎంచుకుంటున్నాయో, ఆ వర్గాలను తక్కిన సమాజం అభివృద్ధికీ, సమానత్వానికి ఎడంగా ఉంచుతున్నంత కాలం మతమార్పిడులను వ్యతిరేకించగలిగే నైతికత కూడా మెజారిటీ మతవాదులకు ఉండదు.

తమ ఆధిపత్యాన్ని స్థిరపరచడానికి, మార్కెట్లను విస్తరించడానికి ప్రపంచాన్ని చుట్టచుడుతున్న అగ్రరాజ్యాల మతం ఏదైనా కావచ్చును కానీ, వారి నవీనవలసవాదానికి మతం ప్రధానమైన వాహిక ఏమీ కాదు. మతంతో నిమిత్తం లేని సంస్క­ృతి, విలువల సంపుటి ఇప్పుడు ప్రపంచదేశాల ఆలోచనాపరుల, శిష్టవర్గాల హృదయాన్ని, బుద్ధిని ఆక్రమించుకుని ఉన్నాయి. దేశాల తలుపులు బార్లా తెరిచి, మెగ్డొనాల్డ్ దగ్గరనుంచి ఫార్ములా వన్ దాకా జాతి గుండెల మీద నెలకొల్పిన గ్లోబల్‌మతం - ఏ అడ్డూ ఆపూ లేకుండా విస్తరిస్తున్నది. ప్రపంచమంతా ఒకే భాష, ఒకే చదువు, ఒకే సినిమా, ఒకే కంపెనీ, ఒకే క్రీడ స్థిరపడిన తరువాత, ఖర్చుపెట్టే ప్రతి రూపాయీ డాలర్‌కు కప్పం గడుతున్నప్పుడు, స్వార్థమొక్కటే అధికార విలువ అయినతరువాత, ఇళ్లల్లో గుళ్లలో చేసుకునే పూజలేమైతేనేమి?

1 comment:

  1. "...స్వార్థమొక్కటే అధికార విలువ అయినతరువాత, ఇళ్లల్లో గుళ్లలో చేసుకునే పూజలేమైతేనేమి? "
    నా మనసులోని మాటను చాలా బలం గా చెప్పారు. ధన్యవాదాలు!

    ReplyDelete