Tuesday, November 22, 2011

ఉద్యమం వైకుంఠపాళిలో మళ్లీ మొదటి గడికి!

సమైక్యవాదాన్ని తెలంగాణలో వినిపించే హక్కు లేదా - అని ప్రశ్నిస్తున్నారు పరకాల ప్రభాకర్. ఉభయప్రాంతాల్లోనూ సమైక్యవాదులు, విభజన వాదులు ఉన్నారని, ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చెప్పుకోగలిగిన స్వేచ్ఛ ఉండాలని ఆయన అంటున్నారు. సూత్రరీత్యా ఆయన వాదనను కాదనడానికి ఏముంది? కానీ, విభజనవాదులు ప్రభాకర్ సభలను అడ్డుకుంటున్నారు. వారు సరే, పోలీసులు కూడా హైదరాబాద్ సహా తెలంగాణలో ఎక్కడా సమైక్యవాద సభలు జరగడాన్ని ఇష్టపడడం లేదు. తెలంగాణ వాదులు సీమాంధ్ర ప్రాంతంలోకి వెళ్లి ఏవైనా నిరసనలు చేపట్టడాన్ని కూడా పోలీసులు అనుమతించకుండా- ఇంకా ఏర్పడని సరిహద్దులకు ముందే పహారా కాస్తున్నారు. సీమాంధ్రలో విభజనకు అనుకూలంగా ఉన్నవారికి సమైక్యవాదులు అవరోధాలు కల్పిస్తూనే ఉన్నారు. ఉద్వేగాలు ఉధృతంగా ఉన్నప్పుడు- హక్కులలోని న్యాయాన్యాయాలను గుర్తించే సహనం ఎవరికీ ఉండదు.

ఇంతకాలం మౌనంగా ఉండి తను ఎందుకు ఈ చివరిఘట్టంలో రంగప్రవేశం చేశారో, దీర్ఘకాలంగా సాగుతున్న ఉద్యమం చేసిన వాదనల రామాయణం విని కూడా రాముడికి సీత ఏమవుతుందని కొత్తగా ఎందుకు ప్రశ్నిస్తున్నారో పరకాల ప్రభాకర్ వివరణ ఇవ్వాలని తెలంగాణవాదులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయన నుంచి సంతృప్తికరమైన వివరణ వచ్చినప్పటికీ, ఆయన విశాలాంధ్రవాద ప్రచారాన్ని అనుమతిస్తారని ఏమీ లేదు. ప్రభాకర్ ఉద్దేశ్యాలేమైనప్పటికీ, ఆయన వంటి వారిని అడ్డుకోవడం ఆహ్వానించదగినదేమీ కాదు. అసలు, ఫలానా అభిప్రాయం ఉన్నవారు తమ ప్రాంతంలో తిరగకూడదని నిషేధాజ్ఞలు విధించడం ప్రజాస్వామికమేమీ కాదు. కానీ, ఉద్యమాలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని ఆశించే పరిస్థితి కూడా లేదు. ప్రజాప్రతినిధులుగా ప్రజలలో మెలగేవారిని, తమ తమ డిమాండ్లపై నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుంది. చెప్పినమాట నిలబెట్టుకోలేని నేతలను ప్రజలు తరచు ప్రశ్నించడం చురుకైన ప్రజాస్వామ్యమే. ప్రజలను ఎదుర్కొనడానికి భయపడి నేతలు మొహం చాటేయాలి తప్ప, కాలు బయటపెట్టకుండా నిషేధించడం మంచి సంప్రదాయమేమీ కాదు.

మంచో చెడో - గత రెండేళ్ల కాలంలో ఉభయప్రాంతాల మధ్య ఉద్యమసరిహద్దు రేఖ ఒకటి వెలసింది. ఇతర అభిప్రాయాన్ని సహించే తత్వం ఉభయప్రాంతాల్లోనూ కొరవడింది. సామాజికాంధ్ర ఉద్యమం
వారే కాదు, చేగొండి హరిరామ జోగయ్య, వసంత నాగేశ్వరరావు వంటి జై ఆంధ్ర నేతలు కూడా గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇక తెలంగాణలో అయితే, ఇతర ప్రాంతాల మంత్రులు, సమైక్యవాద నేతలు తిరుగాడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఏర్పడిన విభజనవాతావరణాన్ని సూచించడానికి, సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఈ పరిస్థితి పనికివచ్చింది కానీ, ఉభయప్రాంతాల ప్రజలకు ఒకరి వాదాన్ని మరొకరు తెలుసుకునే అవకాశం లేకుండా చేసింది. ఇది అవాంఛనీయ పరిస్థితే అయినప్పటికీ, ఇటువంటి స్థితి ఒకసారి స్థిరపడింది కాబట్టి, అందులో సడలింపు జరిగితే- ఉద్యమంలో వచ్చిన పరివర్తన కారణంగా, పరిష్కారానికి దోహదం చేసే ప్రక్రియలో భాగంగా జరగాలి. ఉద్యమాలు బలహీనపడినందువల్ల జరిగితే, అది సామరస్య వాతావరణానికి దోహదం చేయడం కాకుండా, సమస్యను దాటవేయడానికి మాత్రమే ఉపకరిస్తుంది.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణలో రైతు సమస్యలపై యాత్ర నిర్వహిస్తున్నారు. నిజానికి ఆయన తెలంగాణలో సంచరించడానికి ఎటువంటి నిరోధాలూ ఉండకూడదు. కానీ, ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఆయన అనుసరించవలసి వచ్చిన వైఖరి కారణంగా- ఆయనకు రాజకీయమైన ఇబ్బంది ఉండింది. తెలంగాణవాదులు కూడా ఆయన సంచారాన్ని సహించే పరిస్థితి ఉండేది కాదు. గతంలో ఒకటి రెండు మార్లు తెలంగాణలో పర్యటించడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు గట్టి ప్రతిఘటనే ఎదురయింది. కానీ, ఇప్పుడు ఆయన యాత్రకు తెలంగాణవాదుల నుంచి నామమాత్రపు నిరసన కూడా వ్యక్తం కావడం లేదు. అది మంచి పరిణామమే కావచ్చును కానీ, దాన్నిసాధ్యం చేసిన పరిస్థితులు మాత్రం సంతోషించదగినవేమీ కావు. ఆయన పర్యటనను అడ్డుకోవద్దని టిఆర్ఎస్‌కానీ, రాజకీయ జెఎసి కానీ ఎందుకు నిర్ణయించిందో ప్రజలకు తెలియదు. గతంలో ఉండిన కారణాలు ఇప్పుడు ఎందుకు మాయమయ్యాయో కూడా తెలియదు. ఉద్యమనాయకత్వం విధానాన్ని మార్చుకోవడం ఒక అంశం అయితే, ఎవరి పిలుపూ లేకుండానే ఏవో నిరసనలకుదిగే సాధారణ తెలంగాణవాదులు కూడా నిర్లిప్తంగా ఉండడం గమనించదగ్గ మరొక అంశం. తెలంగాణ ఉద్యమంలో ఆకస్మాత్తుగా ఏర్పడిన విరామం ఫలితమా ఇది, లేక, తెలంగాణవాదులలో ఒక విరక్తిభావన నెలకొన్నదా?- అన్న సందేహం కలుగుతుంది.

సకలజనుల సమ్మె క్రమక్రమంగా సడలిపోవడంతో పాటు తెలంగాణవాదుల ఆశలు కూడా బలహీనపడుతూ వచ్చాయి. ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు సమస్యలను పరిష్కరించలేమని, శాంతి నెలకొంటేనే పరిష్కారం సాధ్యమని చెప్పే కాంగ్రెస్ కేంద్రపెద్దలు, ఒకసారి సాపేక్ష శాంతి నెలకొన్న తరువాత ఇక ఆ ఊసే తీయరు. బక్రీద్ తరువాత నిర్ణయం అని చెప్పిన పెద్దమనుషులు ఇప్పుడు తలా ఒక మాట మాట్లాడుతున్నారు. పదకొండు పన్నెండు తేదీల్లో నిర్ణయం వస్తుందని ఎదురుచూసిన ఆశావాదులను, మాల్దీవుల తిరుగుప్రయాణంలో ప్రధానమంత్రి విలేఖరులతో అన్న మాటలు తీవ్రంగా కుంగదీశాయి. ఇప్పట్లో తెలంగాణ ఇవ్వము- అన్న ధోరణిలో స్పష్టంగా మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్రమైన ప్రతిస్పందనలకు దారితీస్తాయని అనుకుంటే, విచిత్రంగా ఒక జడాత్మక వాతావరణం ఏర్పడింది. ఇటువంటి పోలికలు తేవడం అమానుషమైనప్పటికీ, ఒకస్థితిని వర్ణించడానికి అవసరం కాబట్టి చెప్పుకోవాలి- మన్మోహన్ వ్యాఖ్యల కారణంగా ఒక్క ఆత్మహత్య కూడా రిపోర్టు కాలేదు. ( ఏ కారణం వాళ్ళ అయినా సరే, ఆత్మహత్యలు జరగకపోవడమే ఆనందదాయకం)  అంతకంటె చిన్ననేతల మాటలకు, చిన్న చిన్న సందర్భాలలో నిస్ప­ృహ తీవ్రస్థితికి వెళ్లిన ఉదంతాలున్నాయి. నిస్ప­ృహ కూడా తెలియనంత షాక్‌లో, నిర్లిప్తతలోకి తెలంగాణ సమాజం వెళ్లిందా అన్న అనుమానం వస్తున్నది. ఈ వాతావరణంలోనే చంద్రబాబు తెలంగాణ పర్యటన సాగుతున్నది.

ఎక్కడైనా నిరసన వ్యక్తమైన చోట తెలుగుదేశం కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. తెలంగాణ గురించి సంజాయిషీ ఇచ్చుకోవలసిన సందర్భాలు కూడా చంద్రబాబుకు ఎదురుకావడం లేదు. ఇందుకు కారణం- అన్ని అభిప్రాయాల వారినీ యథేచ్ఛగా సంచరించనివ్వాలన్న ప్రజాస్వామికస్ఫూర్తి కాకుండా, ఉద్యమ గమనం లో ఎదురయిన నిర్వేదం, జడత్వం కారణం కావడం విచారకరం.

మన్మోహన్ వ్యాఖ్యలకు కెసిఆర్, కోదండరామ్ దగ్గర నుంచి వచ్చిన స్పందన కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామనే శపథాలు మాత్రమే. వాటి అర్థం ప్రజా ఉద్యమం నుంచి రాజకీయవ్యూహం దిశగా తెలంగాణ మార్గాన్ని మళ్లించడమే. తెలంగాణప్రజలు, ఉద్యమశ్రేణులు కోరుకుంటున్నది బహుశా అది కాదు. రాజీనామాలు అన్నీ అటకెక్కాయి. పార్లమెంటులో తెలంగాణ గళాన్ని వినిపిస్తామని ఎంపీలు, అసెంబ్లీని స్తంభింపజేస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు. సకలజనుల సమ్మె వంటి అత్యున్నత ఆందోళన రూపం అనంతరం తిరిగి- పాదయాత్రల ఉద్యమం ప్రారంభమైంది. ప్రభుత్వం వైపు నుంచి నిర్బంధచర్యలు పెరుగుతుంటే కనీసవిమర్శ కూడా వినిపించడం లేదు. తమ పోలిట్‌బ్యూరో సభ్యుడిని నాసా కింద అరెస్టు చేసి నిరవధిక నిర్బంధంలో ఉంచితే, పార్టీ అధినాయకత్వం నుంచి గట్టి నిరసనే లేదు. తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం పార్లమెంటు సమావేశాలకంటె ముందు వస్తుందన్న నమ్మకం లేదు. యుపి విభజన గురించి మాయావతి ప్రకటన తరువాత రకరకాల పునరాలోచనలు. కేంద్రంలో ఎస్సార్సీ మాట వినిపిస్తే, బిజెపిలో వెనుకంజ కనిపిస్తున్నది. వె రసిజరిగిందేమిటి? మళ్లీ మొదటికి!

అదృష్టవశాత్తూ, ఉద్యమంలో ఇంకా అనేక పాయలున్నాయి కాబట్టి, ఏదో ఒక కార్యక్రమం జరుగుతూవస్తోంది. జెఎసి, టిఆర్ఎస్ ధోరణి నచ్చనివారు సొంతదారిలో నడవాలని అనుకుంటున్నారు. వారితో మొదటినుంచి లేనివారు సొంతకార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఢిల్లీ దీక్షలతో అనేకుల మద్దతు పొందిన సీనియర్‌నేత కొండా లక్ష్మణ్ బాపూజీ సద్భావనా ప్రయత్నాలు చేస్తున్నారు. లగడపాటి వంటి తీవ్ర సమైక్యవాదితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. సద్భావనాయాత్రలను తలపెట్టారు. రెండు ప్రాంతాలవారి మధ్య సంప్రదింపులు అవసరం. ప్రజల మధ్య సంభాషణ అవసరం. ఎవరెటువంటివారైనా ఉభయప్రాంతాల నేతల మధ్య ఒక చర్చ అవసరం. ప్రయత్నాన్ని, ఫలితాన్నీ ఎన్నికల లెక్కలకు వదిలివస్తే సమస్య పరిష్కారం దొరకదు. విస్త­ృతాభిప్రాయం సమీకరణకు సమాజం నుంచి చొరవ అవసరం. ఏమీ లేకుండా, అంతా సద్దుమణిగింది అని ఎవరనుకున్నా ప్రమాదమే, ఎప్పుడంటే అప్పుడు ఉద్యమాన్ని తిరిగి ఉధృతం చేయవచ్చుననుకుంటే అది భ్రమగా మిగలవచ్చు.

1 comment:

  1. "యుపి విభజన గురించి మాయావతి ప్రకటన తరువాత రకరకాల పునరాలోచనలు. కేంద్రంలో ఎస్సార్సీ మాట వినిపిస్తే, బిజెపిలో వెనుకంజ కనిపిస్తున్నది."

    పోన్లెండి ఇప్పటికైనా జనం కళ్ళు తెరుస్తారు.

    ReplyDelete