Wednesday, December 14, 2011

కీర్తి వారసత్వం: కిస్సా కుర్సీ కా

కడుపున పుడితేనే వారసులవుతారని మన ధర్మశాస్త్రాలు కూడా చెప్పలేదు. మానసపుత్రులూ దత్తపుత్రులూ అంటూ రకరకాల వారసులుంటారని అవి చెప్పాయి. ఆస్తులూ భూములూ ఒక్కోసారి రాజ్యాలూ తండ్రులనుంచి కొడుకులకు, చాలా అరుదుగా కూతుళ్లకు సంక్రమించడం ఆనవాయితీయే. పెద్దకొడుకు అంత ప్రయోజకుడు కాకపోతే, వారసత్వం కోసం కొడుకుల మధ్య పోరాటం జరిగితే, అందులో సమర్థుడైనవాడినే ప్రజలు సమర్థించడం అరుదేమీ కాదు. కానీ, ప్రజాస్వామ్యయుగంలో నేతల ప్రతిష్ఠ, జనాకర్షణల వారసత్వం కోసం జరిగే పోరాటం అంత సూటిగా కత్తియుద్ధాలతో సాగదు. పార్టీలు, సంస్థలు చీలిపోయినప్పుడు కూడా ఉమ్మడివారసత్వంలో ఎవరి వాటా ఎంత అన్న వివాదంలో, ఆఫీసు భవనాల కోసం ఎన్నికల గుర్తుల కోసం జెండాల కోసం కోర్టుల్లో వ్యాజ్యాలు నడిచినప్పటికీ, నిర్ధారణ మాత్రం ప్రజాక్షేత్రంలో జరిగిపోతుంది. పెద్దల నీడలో పెరిగి, వారి మార్గాన్నే కొనసాగించేవారికి వారసత్వంలో సమస్యలేమీ రాకపోవచ్చును కానీ, తిరుగుబాటు చేసి వారసత్వాన్ని గ్రహించాలనుకునేవారు మాత్రం సమాజం ఆమోదం కోసం చాలా ప్రయాస పడవలసి వస్తుంది. ఎన్ని యుద్ధాలు చేసి గద్దెనెక్కినవారు సైతం ఏదో ఒక పరంపరతో తమను తామే అనుసంధానించుకోకుండా పరిపాలనాహక్కును పొందడం కష్టం.

స్టాలిన్ అనంతరం సోషలిస్టు రష్యాలో అధికారాన్ని చేపట్టిన నికితా కృశ్చెవ్, తనకు ప్రజామోదం కోసం తెలివైన మార్గం అనుసరించాడు. స్టాలిన్‌ను దోషిగా, సొంత ప్రజల మీదనే అణచివేతను, నిర్బంధాన్ని సాగించిన నియంతగా నిలబెట్టదలచుకున్న కృశ్చెవ్, లెనిన్‌ను మాత్రం ప్రశంసలతో ముంచెత్తాడు. లెనిన్‌ను కీర్తించి,
పార్టీ పరమాధికారాన్ని అంగీకరించి, కృశ్చెవ్ తనను తాను నిలబెట్టుకున్నాడు. విప్లవమార్గాన్ని పరివర్తనామార్గంగా మార్చి కూడా నిలబడగలిగాడు. అయితే, సోవియట్ సమాజం మితిమీరిన స్టాలిన్‌విమర్శను సహించలేకపోయింది. కృశ్చెవ్ అనంతరం వచ్చిన వారసులు లెనిన్ భజనను కొనసాగిస్తూ, స్టాలిన్‌పై మాత్రం మౌనాన్ని పాటించారు. చైనాలో పరిస్థితి వేరు. మావో మరణానంతరం కొద్దిసంవత్సరాలకే అధికారంలోకి వచ్చిన డెంగ్ సియావో పెంగ్- మావోను విమర్శించినప్పటికీ, పూర్తిగా ఆయనను విసర్జించగలిగే పరిస్థితి లేదు. రష్యాకు లెనిన్ ఎంతో, చైనాకు మావో కూడా అంతే. కాకపోతే, కృశ్చెవ్‌కు స్టాలిన్ విలన్ అయినట్టు, డెంగ్‌కు మావో అనుయాయులైన 'గ్యాంగ్ ఆఫ్ ఫోర్' విలన్లు. సమస్త అవాంఛనీయ సంఘటనలకూ ఆ నలుగురినీ పాపాల భైరవులను చేసి, మావో వ్యక్తిపూజను మాత్రం కొనసాగించాడు.

సాంస్కృతిక విప్లవ కాలంలో మావో వ్యక్తిపూజ విపరీత స్థాయిలో జరిగిందంటారు కానీ, అందులో వ్యక్తి ఆరాధనతో పాటు, సిద్ధాంత జపం కూడా ఉండేది. మావో సిద్ధాంతాలకూ, ఆయన వ్యక్తిత్వానికీ అభేదం పాటిస్తూ ఆకాశానికెత్తేవారు. డెంగ్ మావో సిద్ధాంతాలను పక్కనబెట్టి, ఆయన విగ్రహాలకు మాత్రం పూజలు కొనసాగించారు. నిజమైన అర్థంలో మావో వ్యక్తిపూజకు పాల్పడింది డెంగే. మావో జీవితకాలంలో ఆయనతో పోరాడిన వ్యక్తే అయినప్పటికీ, డెంగ్‌కు ఆమోదం లభించడానికి మావోను కీర్తిస్తూ ఉండడమే. డెంగ్ కంటె నాలుగాకులు ఎక్కువ చదివిన ప్రస్తుత చైనా నాయకత్వం కూడా మావో గొడుగు కిందనే తమ ఉనికిని నిలబెట్టుకుంటున్నది.

రాజీవ్‌గాంధీ చనిపోయిన తరువాత మన దేశంలో కూడా అటువంటిదే ఒక సందర్భం వచ్చింది. సాధారణ ఎన్నికల రెండు దశల మధ్య రాజీవ్ హత్య జరిగింది. ఫలితంగా, పూర్తిగా ఓడిపోవలసిన కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రధానపార్టీగా అవతరించింది. సోనియాగాంధీ వారసత్వానికి వెంటనే ఆమోదం సిద్ధించే పరిస్థితి లేదు. ప్రధాన పదవిని ఆశించగలిగిన పెద్దమనుషులు కాంగ్రెస్‌లో చాలా మందే ఉన్నారు. అందరి పోటీ మధ్య తటస్థవ్యక్తిగా పి.వి.నరసింహారావు ప్రధాని అయ్యారు. ఆయన మనసులో ఏముందో కానీ, నెహ్రూకుటుంబ పాలనకు కళ్లెం వేద్దామనుకున్నారు. ఇందిరను, రాజీవ్‌ను కీర్తిస్తూనే, సోనియాగాంధీని పక్కనబెట్టారు. అవిశ్వాసాలనుంచి గట్టెక్కడానికి చిన్న పార్టీల నుంచి మద్దతు కూడగట్టుకున్నారు. అడపాదడపా సోనియాను కలుస్తూనే, ప్రభుత్వ వ్యవహారాలనుంచి ఆమెను ఎడంగా ఉంచారు. ఐదు సంవత్సరాల పాటు ఆయన ఆ కసరత్తు కొనసాగించారు. మైనారిటీ ప్రభుత్వం, రాజీఅభ్యర్థిగా ఎంపికైన ప్రధాని, ఆర్థికసంస్కరణల ప్రారంభం- ఇవన్నీ కలసి- పీవీ ప్రభుత్వానికి నిజమైన ప్రజామోదం ఉన్నదా లేదా అన్న సందేహానికి తావులేకుండా చేశాయి. నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ నేత అయి ఉండడం, రాజీవ్ హయాందాకా మంత్రివర్గంలో ఉండడం- ఆయనను ప్రధాని పీఠంపై చూడడానికి అభ్యంతరం లేకుండా చేసి ఉండవచ్చు.

1995లో ఎన్టీయార్‌ను దింపేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు- మరో రకమైన పరిస్థితి. పరిపాలనలో, పార్టీ వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి జోక్యం రీత్యా పార్టీలో సొంత బలం కూడగట్టుకున్నప్పటికీ, తిరుగుబాటుకు అనుకూలమైన భావ వాతావరణాన్ని కూడా సృష్టించుకున్నప్పటికీ, ఎన్టీయార్‌ను తప్పించి అధికారంలోకి రావడం ఒకరకంగా సాహసమే. ఎన్టీయార్ మరణించిన తరువాత వారసత్వం కోసం తగువులాడుకోవడం వంటిది కాదిది. ఆయనను పదవీభ్రష్ఠుడిని చేసి గద్దెనెక్కడం. అప్పటివరకైతే, శాసనసభ్యుల బలంతో కొనసాగవచ్చు, కానీ, ప్రజల ముందుకు వెళ్లినప్పుడు ఎన్టీయార్ జనాకర్షణను ఎదుర్కొనడం సాధ్యమా? - ఈ ప్రశ్న 1995లో చంద్రబాబుకు వచ్చే ఉండాలి.

1996 లోక్‌సభ ఎన్నికల నాటికి ఎన్టీయార్ అస్తమించడంతో, ఆయన వారసురాలిగా లక్ష్మీపార్వతిని ప్రజలు గుర్తిస్తారన్న భయం కూడా ఆయనకు కలిగే ఉండాలి. అయితే, వారసత్వ స్థాయికి తగినదానినని నిరూపించుకోలేక లక్ష్మీపార్వతి ప్రజల చేతిలో భంగపడడం చంద్రబాబు దారిని సుగమం చేసింది. అయినా, ఆయన తన అధికారానికి మూలం ఎన్టీయార్ పరంపరలోనే ఉన్నదని చెప్పుకోక తప్పలేదు. చివరి సంవత్సరాలలోని సంఘటనలను పక్కనబెట్టి, ఎన్టీయార్ ప్రతిష్ఠకు తానే వారసుడినని స్థిరపరచుకోగలిగారు. అయితే, ఇప్పటికీ, 1995 నాటి సంఘటనలు చంద్రబాబును అప్పుడప్పుడు చిరాకుపెడుతూనే ఉంటాయి. ఎన్టీయార్ మరణానంతరం ఆయనను విమర్శించడం కాంగ్రెస్ విరమించుకున్నది. ఎన్టీయార్ ప్రతిష్ఠకు రాజకీయ రంగంలో ఇంకా ఎంతో విలువ మిగిలే ఉన్నది. ఎన్టీయార్ ఒక కుమార్తె కాంగ్రెస్‌లో చేరి కేంద్రమంత్రి కూడా అయ్యారు, అల్లుడు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఎన్టీయార్ ఆశయాలకు వారసుడు వైఎస్సార్ మాత్రమేనన్న వాదనలూ మొదలయ్యాయి. అవసరమైనప్పుడు ఎన్టీయార్ కుమారుడినో, మనవడినో ప్రచారంలోకి దింపే పని తెలుగుదేశం చేస్తూనే ఉన్నది.

రాజశేఖరరెడ్డి విషయంలో కాంగ్రెస్ పడుతున్న అవస్థ వర్ణనాతీతం. రెండోసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజయవంతంగా ప్రతిష్ఠించిన రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన తరువాత, 'వారసత్వ హక్కు' కోసం ఆయన కుమారుడు జగన్మోహనరెడ్డి ప్రయత్నించినప్పుడు- ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు సంకటం ఎదురయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయాలకు కారణం సోనియా ప్రతిష్ఠనా, వైఎస్సార్ జనాకర్షణా అన్న చర్చా జరిగింది. అధిష్ఠానం ఇచ్చిన స్వేచ్ఛతో సొంత బలగాన్ని అసెంబ్లీలో, బయటా పెంచుకున్న రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా తయారయ్యారు. వైఎస్సార్ విధేయత జగన్ బలం రూపంలో పరివర్తన చెందుతున్నప్పుడు- రాజశేఖరరెడ్డి ప్రతిష్ఠను సొంతం చేసుకుంటూనే జగన్‌ను అడ్డుతొలగించుకోవడమెట్లానో అధిష్ఠానం ఆలోచించడం మొదలుపెట్టింది. జగన్ అకృత్యాలు ఒకటొక్కటి బయటపడడం మొదలుపెట్టాక, వాటిలో వైఎస్సార్ ప్రమేయం స్పష్టంగా కనిపించసాగాక- ఒకరిని కాదని మరొకరిని ఎట్లా సొంతం చేసుకోవాలో తెలియలేదు. వైఎస్సార్‌ను కూడా నిరాకరించే ధైర్యం లేదు. 2009లో రాజశేఖరరెడ్డి గెలిపించిన ప్రభుత్వమే ఇప్పుడూ అధికారంలో ఉన్నది. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణలో వైఎస్ పాత్ర కూడా బయటపడితే, దాన్ని స్వీకరించగలిగే శక్తి కాంగ్రెస్ కు ఉన్నదా అన్నది ప్రశ్న.

2004లో రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనానికి కారణం సోనియానా, వైఎస్సా అన్న అనుమానం అధిష్ఠానానికే ఉన్నట్టున్నది. లేకపోతే, వైఎస్ వారసత్వం అన్యాక్రాంతమైపోతే కాంగ్రెస్‌ను గెలిపించుకోగలమా అన్న అనుమానం వారికి రానక్కరలేదు. 2014 ఎన్నికల నాటికి రాష్ట్రకాంగ్రెస్‌లో జనవిశ్వాసం పొందగలిగిన సమర్థుడైన ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోతే, అది ప్రతిపక్షాలకే ఉపయోగపడుతుంది. ఈ రెండున్నరేళ్లలో కిరణ్‌కుమార్ అటువంటి పేరుతెచ్చుకోగలరా? వైఎస్ ప్రతిష్ఠ వారసత్వానికి ఏ విలువా లేకుండా చేయగలరా? అన్నవి ప్రశ్నలు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో వైఎస్ చుట్టూ జరిగిన దాగుడుమూతలు చూస్తే, రాష్ట్ర కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సదసత్సంశయం ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది.

No comments:

Post a Comment