Thursday, January 5, 2012

కొంచెం తగ్గించుకుందామా?

'ప్రపంచమంతటినుంచీ బంగారపు నదులు అక్కడికే ప్రవహిస్తాయి. వాటితో పాటు చావు కూడా. ఆత్మలేని అటువంటి చోటును మనమెక్కడా చూడం. మూడు దాటి అంకెలు లెక్కపెట్టలేనివారు, ఆరుగురికి మించి గుమిగూడలేని గుంపులు అక్కడ నిలబడి సైన్స్ గురించి, ప్రస్తుత కాలం గురించి నిందాపూర్వకంగా ఉపన్యాసాలిస్తుంటారు. ఈ వాల్‌స్ట్రీట్ మూకలన్నీ ప్రపంచమంతా ఇట్లాగే ఎప్పటికీ ఉండిపోతుందని నమ్ముతుంటారు, ఈ మహాయంత్రం శాశ్వతంగా నడిచేట్లు చేయడం తమ బాధ్యత అనుకుంటుంటారు' ఈ మాటలన్నది స్పానిష్ కవి, రచయిత లోర్కా. అతన్ని 1934లోనే స్పానిష్ మృత్యుదళాలు చంపేశాయి. సుమారు ఎనిమిది దశాబ్దాల కిందనే లోర్కా వాల్‌స్ట్రీట్ గుట్టును విప్పిచెప్పాడు. అప్పటికి ప్రచ్ఛన్నయుద్ధం కాదు కదా, రెండో ప్రపంచయుద్ధం కూడా మొదలుకానేలేదు. ప్రపంచీకరణ పేరుతో లోకం ఒంటిధ్రువంమీద నిలబడి గిరగిరా పశ్చిమాభిముఖంగా పరిభ్రమించడానికి ఇంకా ఆరుదశాబ్దాలు గడవాల్సి ఉంది.

వాల్‌స్ట్రీట్ ఒక ప్రతీక. పర్యాయపదం. ధనస్వామ్య కేంద్రాలన్నీ వాల్‌స్ట్రీట్‌లే. ఆత్మలేని నిర్జీవస్థలాలే. వీటికి దయాదాక్షిణ్యం కరుణాప్రేమా వంటి సాత్విక ఉద్వేగాలేమీ ఉండవు కానీ, నరకలోకపు ద్వారాలని గీతాకారుడు చెప్పిన కామక్రోధలోభాలు పుష్కలంగా ఉంటాయి. మనిషి అంతిమంగా ఎదుర్కొనవలసిన శత్రువు మానవప్రలోభమేనని యుగయుగాలుగా ప్రవక్తలు, దైవదూతలు, సంస్కర్తలు చెబుతూనే ఉన్నారు. మనుగడ అవసరాలకు మించి కూడగట్టుకోవద్దని, జీవితంతో ప్రలోభం లేని అనుబంధం సాధించమని గౌతమ బుద్ధుడు చెప్పాడు. ధనకాంక్షే అన్ని అనర్థాలకు మూలమని జీసస్ భావించాడు. సంపాదనని పెంచుకున్నవాడి కంటె పంచుకున్నవాడే
ఉత్తముడని మహ్మద్ ప్రవక్త ప్రకటించాడు. మనిషి అవసరాలకు తగ్గంత మాత్రమే ప్రకృతి ఇవ్వగలదు తప్ప, మనిషి దురాశకు తగ్గంత కాదని మహాత్ముడు చెప్పాడు. 'అతి సంచయేచ్ఛ తగదు' అని వేల యేండ్లనాడే పంచతంత్రకారుడు హెచ్చరించాడు. కానీ, ఆధునిక ధనస్వామ్య ప్రవక్తలు మాత్రం ప్రలోభమే, స్వార్థమే, అత్యాశే అభివృద్ధి నడిపించే చోదకవిలువలని, స్టాక్‌మార్కెట్‌ను మించిన దేవాలయం లేదని ప్రవచిస్తుంటారు.

నూతన ఆర్థిక విధానాలు ప్రపంచాన్ని కమ్ముకుంటున్న రోజుల్లోనే, రానున్న రోజుల వైభవాన్ని గురించి మధ్యతరగతి జీవులు కలలు కంటున్న కాలంలోనే, సమాజంలో అంతరాలు, అంతస్థుల అగాధాలు పెరిగిపోతాయని హెచ్చరికలు రాకపోలేదు. పునాదులు గట్టిగా లేకుండానే కట్టే భవనాలు కుంగిపోక తప్పదని, స్టెరాయిడ్స్‌దట్టించిన స్టాక్‌సూచికలు ఎప్పుడో పుట్టిముంచుతాయని హితోక్తులు వినపడకపోలేదు.

స్వేచ్ఛావాణిజ్యం సంరంభంలో ఉవ్వెత్తున ఎగిసి వెలిగే నవసంపన్నతలను, ఆవురావురుమంటూ ఆదిమమైన ఆకలితో ఎగబడుతున్న ఔత్సాహిక పారిశ్రామికతను చూసి వైభవోజ్జ్వల మహాయుగం వచ్చేసిందన్న భ్రమలో పడి భవిష్యత్ చిత్రపటానికి కళ్లుమూసుకున్నాము. వల్లకాటి అధ్వాన్నయుగం సమీపించినప్పుడు కానీ, వాస్తవం ఏమిటో అవగతం కాలేదు. పట్టిందల్లా బంగారం అవుతుందని అనుకున్నామే కానీ, అన్నం కూడా స్వర్ణమై పోయి గ్రీక్ చక్రవర్తి మిడాస్ వలె ఆకలితో అలమటిస్తామని గుర్తించలేదు. 2011 సంవత్సరానికి ఏ విశేషం ఉండినా లేకున్నా, ఒక విషయంలో మాత్రం విశిష్టత సంపాదించుకుంది. ఆబగా, ఆత్రంగా, నిర్విచక్షణగా, అవినీతిగా సమకూర్చుకునే లోభమే ఈ నాటి అసలు విలన్ అని ప్రపంచం స్పష్టంగా గుర్తించిన సంవత్సరం 2011. మల్లెల విప్లవాలు, ఫేస్‌బుక్ రివల్యూషన్స్, చివరగా ఆక్యుపై వాల్‌స్ట్రీట్ ఉద్యమం కార్పొరేట్ స్వార్థానికి, లోభానికి గురిపెట్టిన ఉద్యమాలు. అవినీతితో బలిసిన పాలకులను దించేదాకా నడిరోడ్డుమీద బైఠాయించిన ఈజిప్షియన్లు ప్రపంచానికి కొత్త కార్చిచ్చును బహూకరించారు. 'మేమే ఉన్నాం 99 శాతం' 'ఈ వీధులు మావి, మేం ఆక్రమిస్తాం', 'ప్రజలంటే కార్పొరేట్లు కాదు', 'మా ఉనికిని గుర్తించండి లేదా మా ప్రతిఘటనను రుచిచూడండి'- నినాదాలు ధనస్వామ్య కుంభస్థలాలపై పతాకాలుగా రెపరెపలాడాయి.

అయితే, ఉద్యమాలందున ప్రజా ఉద్యమాలు వేరయా అని గుర్తించాలి. ఈజిప్ట్ ఎమెన్ లాంటి దేశాల్లో వ్యక్తమైన ప్రజాగ్రహం న్యాయమైనది, సహజమైనది. లిబియా, సిరియా వంటి చోట్ల జరిగిన, జరుగుతున్న ఉద్యమాలకు ప్రాతిపదిక అసలే లేదనలేము కానీ, అక్కడ ఎగదోసిందీ, ఎగదోస్తున్నదీ ప్రపంచ ప్రభువులు. అక్కడి జనాగ్రహానికి ఆజ్యం పోసింది సంపన్నదేశాల చమురు దాహం. సైన్యాన్ని పంపకుండానే ప్రజల సాయంతో అనుకూల ప్రభుత్వాలను స్థాపించవచ్చునని ప్రాయోజిత ఉద్యమాలు నిరూపించాయి. ఆర్థికదాహం సరిహద్దులను దాటి సైనికభాషలో మాట్లాడినప్పుడు అవి యుద్ధంగా పరిణమిస్తాయి. అయితే, ఎంతగా బాహ్యప్రేరణలున్నప్పటికీ, జనం పెద్దసంఖ్యలో పాల్గొన్న పోరాటాలలో ఏదో ఒక సానుకూల అంశ ఉండితీరుతుంది. ఆప్ఘనిస్థాన్‌లో అది అమెరికాకు ఇప్పుడు అనుభవం అవుతూనే ఉన్నది. రేపు ఇరాక్‌లో, లిబియాలో కూడా అనుభవానికి వస్తుంది.

భారతదేశంలో కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు కూడా కటకటాల పాలు కావడం దేశరాజకీయాలను వచ్చేఎన్నికల దాకా ఏ అంశం ప్రధానంగా ప్రభావితం చేయనున్నదో సూచించింది. అదే అవినీతి. అవినీతి అనగానే అదేదో నైతిక ప్రవర్తనకు సంబంధించిన అంశంగా ధ్వనిస్తుంది కానీ, అందులో ప్రజాధనం, ప్రజల సమష్టి ప్రయోజనాలు, వ్యవస్థ విశ్వసనీయత ముడిపడి ఉన్నాయి. సామూహికమైన వనరులను ప్రైవేటు కార్పొరేట్లకు అతి చవకగా కట్టబెట్టి, అందుకు ప్రతిఫలంగా ధనరూపంలోనో, మరే ఇతర మార్గంలోనో ప్రయోజనం పొందడం నూతన ఆర్థిక వ్యవస్థలన్నిటిలో పెద్ద జాడ్యంగా తయారయింది. పాత సోషలిస్టు దేశాల నుంచి 'నవ ప్రజాస్వామిక దేశాలు'గా పరివర్తన చెందుతున్న సమాజాల్లో, ప్రైవేటీకరణ బాటలో వేగంగా పరుగులు తీస్తున్న చైనా వంటి దేశాల్లో కూడా ఇదే వ్యాధి ప్రబలిపోయింది. ప్రజల కనీసావసరాలకు, పాలకుల పారిశ్రామికుల ప్రలోభావసరాలకు మధ్య జరుగుతున్న పోరాటాలే నేడు ప్రపంచమంతా.

ఇక, నైతికతకు, ప్రజాప్రయోజనాలకు పెద్ద విలువ ఇవ్వని భారత రాజకీయనాయకులకు అయితే, సంస్కరణలు సొంత లాభం చూసుకోవడానికి వనరులుగా మారిపోయాయి. పరిశ్రమలకు ప్రోత్సాహం పేరిట, అభివృద్ధి కార్యక్రమాల పేరిట- వనరుల పందేరానికి ప్రభుత్వనేతలకు ఉండే అధికారాలు - ఎంతటి అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టిస్తుందో, అది పాలకపార్టీలకే ఎంతటి తలనెప్పిగా మారుతుందో ఆంధ్రప్రదేశ్‌లోని వ్యవహారాలు నిరూపిస్తున్నాయి. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అవినీతి పైనే గత ఏడాదిగా రాష్ట్రంలో రాజకీయచర్చలు, ప్రభుత్వ చర్యలు కేంద్రీకృతమై ఉన్నాయి.

2011 సంవత్సరమంతా జన లోక్‌పాల్ ఉద్యమం ప్రాధాన్యం పొందడానికి 2జి స్కామ్ ఒక్కటే కాక, మొత్తంగా దేశమంతటా అవినీతి అన్నదే ప్రధాన సమస్యగా సంఘటిత అభిప్రాయ వర్గాల్లో స్థిరపడిపోవడం కూడా కారణం. సరే, అన్నా హజారే ఆ ఉద్యమాన్ని నిర్వహించిన తీరు, అతని వ్యవహారసరళిలోని అవాస్తవిక ధోరణులు పక్కన బెడితే, రాజకీయపక్షాలు ప్రదర్శించిన అవకాశవాదం, ప్రభుత్వం నుంచి కనిపించిన దాటవేత వైఖరి- అవినీతి నుంచి వైదొలగడానికి వ్యవస్థలో వ్యక్తమవుతున్న అనాసక్తిని సూచిస్తున్నాయి. దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరుగుతున్నా, అదుపులేని ధరలు సామాన్యుల జీవితాన్ని దుర్భరం చేస్తున్నా, మిరుమిట్లు గొలిపే శీఘ్రఅభివృద్ధికి వేదికలుగా ఉన్న కొన్ని ప్రత్యేక రంగాల్లో మాంద్యం తిష్ఠవేసి కూర్చున్నా- ఆర్థికవేత్తే నేతగా ఉన్న ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలిపోవడానికి కారణం- ఇంకా దోచుకోవలసినది మిగిలిఉన్నందున మార్పునకు సిద్ధపడని ప్రాబల్య ఆర్థిక, రాజకీయ వర్గాలే.

2012లో మార్పు వస్తుందా? అంగుళం మేర అయినా వస్తుందనడానికి ఆస్కారమూ లేదు, ఆశా లేదు. కానీ, జనంలో అయినా మార్పు వస్తుందా? పరుగు ఆపాలని, నడక మొదలుపెట్టాలని అర్థమవుతుందా? జూదాన్ని పక్కన బెట్టి, వ్యాపారం చేయాలని, బంగారు బాతును చంపుకుని ఈ రోజే తినకూడదని తెలిసివస్తుందా? మదుపు ఒక్కటే కాదు, పొదుపు కూడా అవసరమని, అవసరాలకు మించి కొంటూ ఉంటే మనల్ని మనం అమ్ముకోవలసివస్తుందని ఎరుక కలుగుతుందా? నేతలను, దేశాధినేతలను, ప్రపంచ ప్రభువులను వాళ్ల ఖర్మానికి వదిలేద్దాం.

మనం కొంచెం కోర్కెలకు కత్తెర వేద్దామా? కడుపు నిండాక కూడా తింటూ ఉండడం మానేద్దామా, ఫోన్లు స్విచాఫ్ చేసి మనుషులతో మాట్లాడదామా, ఔటర్ రింగ్‌రోడ్డు మీద స్పీడ్ లిమిట్ పాటిద్దామా? యావ తగ్గించుకుని, దురాశను కట్టిపెట్టి, కేలరీలు కరిగించి, షాపింగులను విరమించి- ఈ ఏడు కాస్త మితంగా, సంతోషంగా, తృప్తిగా ఉందామా?

1 comment:

  1. చక్కగా వ్రాశారండి.

    ReplyDelete